పిల్లల భూమిక

సమతా నిలయం – వర్ని, పిల్లలు రాసిన కథలు, కవితలు

పాట

పల్లవి : వానమ్మ వానమ్మ నీవు ఎక్కడమ్మా

నీ జాడకోసం ఈ అడవిమ్మ కన్నీరు పట్టెనమ్మ ||వానమ్మ||

చరణం : మానవుడు స్వార్థంకోసం చెట్లను నరికెనమ్మ

ఈ భూతల్లి ఎడారిగా మారెనమ్మ

ఈ అడవిలో చెట్లు చిక్కపోయె నమ్మ

చెట్లు లేక మూగజీవులకు నివాసం కరువాయెనమ్మ ||వానమ్మ||

చరణం : వానమ్మ వానమ్మ ఆకాశం నుండి దిగిరావమ్మ

మా గోడుని విని మా కషిని పాపమ్మ

చెట్లు లేకపోతే మనకు ప్రాణవాయువు లేదమ్మ

చెట్లు లేకపోతే మనిషికి మనుగడే లేదమ్మ ||వానమ్మ||

– అల్లూరి సీతారామరాజు గ్రూప్‌ డి, అనిత, రాజు, నవీన్‌, సంగీత, సిహెచ్‌. వెంకట్‌, సాయిశ్రీ.

స్నేహితుల బంధం

– హెచ్‌. అశోక్‌, 8వ తరగతి

చింతలకుంట అనే వూరు. రామయ్య అతనికి ఒక కొడుకు. పేరు రాములు. హాస్టల్‌లో ఉండేవాడు. హాస్టల్‌కి సెలవలు వచ్చాయని ఇంటికి వెళ్ళాడు. అతని స్నేహితుని పేరు రాజు. రాములు ఇంటికి వచ్చాడని తెలిసి రాజు అతనిని కలవడానికి వచ్చాడు. ఓరే! మనము ఒక దగ్గరికి వెళదామని అనుకున్నాం కదా, గుర్తుందా అని అడిగాడు. ఏంటా…. ఆ…. ఓ గుర్తొచ్చింది. జూపార్కు…. అక్కడ సింహాలను చూడాలనుకున్నాం కదా… వెళ్దామా?… సరే నని ఇద్దరూ వెళ్ళారు. సింహాలు అడ్డంగా ఉన్న జాలీని తెంపేసుకొని బయటకి వచ్చాయి. అక్కడ చూస్తున్న ప్రజలమీద దాడి చేయడం మొదలుపెట్టాయి. అది రాజు చూశాడు. ప్రజలని పరిగెత్తండి, పరిగెత్తండి అని గట్టిగా అరిచాడు. వారు భయంతో పరుగులు పెట్టారు. కొద్ది దూరం పోయిన తర్వాత నా స్నేహితుడు ఏడి అని వెతుక్కున్నాను. చాలా సేపటికి తర్వాత ఒకరికొకరు కనిపించారు. సంతోషంతో ఇద్దరూ కావలించుకున్నారు. ఒక అతను మీ ఇద్దరినీ ఎవరూ విడదియ్యలేరు అని అన్నాడు… అప్పుడు రాజు వీడులేనిది నేను ఉండలేను. నేను లేనిది వాడు ఉండలేడు అన్నాడు అతను శభాష్‌ అన్నాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు.

తేడాలు ఎందుకు

– టి. భూమిక, 4వ తరగతి

ఒక ఊరులో అంజలి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు అమ్మ, అన్న ఉన్నారు. అంజలి వాళ్ళ అమ్మ బీడీల కార్ఖానాలో బీడీలు చేసేది. అంజలి వాళ్ళ అమ్మతోపాటు వెళ్ళేది. వాళ్ళ అమ్మ అంజలి కళ్ళు చూసి బీడీలు అయితాయా అని అంటే అంజలి అయితాయి అనేది. అప్పుడు అమ్మ చెల్లి కళ్ళు చూసి అడుగుతుంది. నన్నెందుకు అడగదు అనుకునే వాడు వాళ్ళన్న. అంజలి వెళ్ళి వాళ్ళ మిత్రులతో ఆడుకునేది. వాళ్ళ అమ్మ పిలిచి దారం కట్టడం, బీడీలు చేయడం నేర్పిస్తూ ఉండేది. అంజలి కొద్దిసేపు నేర్చుకొని తిరిగి వెళ్లి ఆడుకునేది. అంజలి వాళ్ళ అమ్మ కార్ఖానాలో ఉన్న మిగతా వాళ్ళు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ బీడీలు చేసేవారు. అంజలి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత బీడీలు చేయడం మొదలుపెట్టింది. అంజలి దారం కట్టిస్తూ ఉండేది. అంజలికి వాళ్ళ అమ్మ సెలవులు వచ్చినప్పుడు వాళ్ళమ్మ కార్ఖానాకి తీసుకువెళ్ళేది. బడి ఉన్న రోజు అంజలిని, వాళ్ళ అన్నను బడికి పంపించేది. అంజలి బడి అయిపోయాక ఇంటికి వచ్చి హోంవర్కు చేసుకొని కొద్దిసేపు ఆడుకొని వాళ్ళ అమ్మ బీడీలు చేస్తే దారం కట్టేది. ఇంటి పక్కకు ఉన్న వాళ్ళకు కూడా దారం కట్టేది. అలా పని నేర్చుకుంటూవెళ్లి కొన్ని రోజుల తర్వాత కాగితంతో బీడీలు చేసుకుంటూ దారం కట్టేది. దాని తర్వాత చదువుకొని పడుకునేది. పొద్దునలేచి స్నానం చేసి పాఠశాలకు రెడీ అయేది తర్వాత వాళ్ళ తోటకు వెళ్ళింది. వాళ్ళ తోటలో పువ్వుమీద సీతాకోకచిలుకలు వాలాయి. అంజలికి చాలా అందంగా అనిపించాయి. ఆ తోటలో ఒక పువ్వుకోసి తలలో పెట్టుకుంది. అంజలి తలమీద సీతాకోక చిలుకలు వాలాయి. తోటలో రకరకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. అంజలికి పట్టుకోవాలని అనిపించింది. అంతలోగా పాఠశాలకు టైము అయితుందని బడికి వెళ్ళారు. బడిలో ప్రేయర్‌ చేశారు. క్లాసులలో కూర్చున్నారు. మేడం వచ్చింది. బోర్డుమీద ప్రశ్న జవాబులు పెట్టించింది. తర్వాత భోజనం టైమయింది. అంజలి వాళ్ళ మిత్రులతో మాట్లాడుకుంటూ వెళ్ళుతుండగా ఒక అబ్బాయికి గాయం తగిలింది. అంజలి అది చూసి గాయపాకు కోసి నలిపి అబ్బాయికి గాయంపై మందు పెట్టింది. ఆ అబ్బాయిని టీచర్‌ దగ్గరకు తీసుకువెళ్ళారు. టీచర్‌ అంజలిని మెచ్చుకుంది. అంజలి భోజనం చేసి వాళ్ళ మిత్రులతో ఆడుకుంది. అంతలో గంట మోగింది. అందరూ క్లాసులోకి వెళ్ళారు. టీచరు వచ్చి హోంవర్కు పెట్టించింది. కాసేపటి తర్వాత ఇంటి బెల్లు అయింది. అంజలి వాళ్ళ అన్న ఇంటికి వచ్చారు. హోంవర్కు చేసుకొన్నారు. హోంవర్క్‌ అయిన తర్వాత అంజలి వాళ్ళ అన్నను అన్నా మనము మన తోటకు వెళదామా అని అడిగింది. వెళ్ళుదాం అన్నాడు. అంతలోగా వాళ్ళ అమ్మ పిలిచింది. ఎక్కడికి వెళుతున్నారు అంది. తోటకు వెళ్ళుతున్నాం అమ్మా. సరే వెళ్ళి తొందరగా రండి, దారం కట్టాలి అంది. సరేనమ్మా అని అంజలి వాళ్ళ అన్న కలిసి తోటకు వెళ్ళారు. అక్కడ మామిడి పండ్లు, జామకాయలు తిన్నారు. వచ్చాక అంజలి బీడీలకు దారం కడుతుంటే వాళ్ళన్న డక్కేరు గోటీలు ఆడుకుంటున్నారు. అమ్మా అన్న ఆడుకుంటున్నాడు. నేనూ ఆడుకోవద్దా.. కొంచెంసేపు చుట్టి ఆడుకొందులే. నేను ఎందుకు పనులు చేయాలి? అన్న పనులు చేయడు? నువ్వు ఆడపిల్లవు అందుకని పనులు నేర్చుకోవాలి అంది అమ్మ. మగపిల్లలు పనులు నేర్చుకోవద్దా… చేయొద్దా.. అని కసురుకుంటుంది. చేతిలో బీడీల చాట పక్కకు విసిరేసి.. అమ్మ పిలుస్తున్నా వినకుండా ఆడుకోడానికి పరుగెత్తింది అంజలి.

 

తప్పించుకోకు, తప్పును దిద్దుకో…

– ఎ. రవి, 9వ తరగతి

ఒక అందమైన ఊరు. కోడిపిల్లల అరుపులతో మేకపిల్లల గంతులతో పక్షుల కిచకిచలతో చిన్న పిల్లల అరుపులతో ఆ ఊరంతా అందంగా! ఆనందంగా ఉంది.

అదే ఊరిలో వీరయ్య ఇంట్లో కుమార్‌ ఉండేవాడు. పాపం కుమార్‌కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. కుమార్‌ వాళ్ళ నాన్నకు 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కోసం అని కుమార్‌ను చిన్నప్పుడే తీసుకువచ్చాడు వీరయ్య. కుమార్‌ ఆస్తిని వీరయ్య అనుభవిస్తూ నానాకష్టాలు పెడుతున్నాడు. పొద్దునే లేచి పశువుల పేడ తీయడం, వాటికి తాగడానికి నీరు పెట్టడం చేస్తాడు. పొలంలో ఏ పని ఉన్నా పనివాళ్ళతో పనికి పంపిస్తాడు. పాపం కుమార్‌కి అన్ని విధాలుగా కష్టాలు పెడుతున్నాడు.

వీరయ్య తన కొడుకును మాత్రం పట్టణంలో చదివిస్తున్నాడు. కుమార్‌ని మాత్రం ఊళ్ళో ఉన్న బడికి వారానికి 4 సార్లు పంపించేవాడు. ఆ ఊరి బడిపంతులు వచ్చి పిల్లవాన్ని ఇలా వారానికి 4 సార్లు బడికి పంపిస్తే ఎలా చదువుకుంటాడు అని అడిగితే ఇలా అడిగిన వారిని బెదిరించేవాడు. నాకు డబ్బులు ఉన్నాయి ఏమైనా చేస్తాను అని పొగరుగా జవాబిచ్చేవాడు.

ఒకరోజు పట్టణం నుంచి వీరయ్య కొడుకు వచ్చాడు. వీరయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. కొడుకు కోసం రకరకాల మాంసం కూరలు వండించాడు. నాల్గురోజులు ఉంచి పంపించాడు. అప్పుడు కుమార్‌కి మా అమ్మ, నాన్న ఉంటే నన్ను కూడా ఇలాగే చూసేవారేమో అని బాధపడ్డాడు. అప్పుడప్పుడు బడికి వెళ్ళుతున్నా కుమార్‌ అందరికంటే బాగా చదివేవాడు. ఆ రోజు బడినుండి ఇంటికి వచ్చాడు కుమార్‌. వీరయ్య అతనిని ఎలాగయినా ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టాలని.

ఒరే దరిద్రుడా నువ్వు నా ఇంట్లో ఉండటం వలన నాకు దరిద్రం పట్టుకుంది. నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపో. కుమార్‌ బట్టలన్ని బయటకు పడేసి, కుమార్‌ను బయటకు నెట్టేసాడు. కుమార్‌కి ఏంచేయాలో తెలియలేదు. బట్టలన్ని తీసుకోని వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్ళాడు. తిమ్మాపూర్‌ అనే గ్రామం చేరాడు. అక్కడ రమేష్‌ అనే పిల్లడు కనిపించాడు.

ఎవరు నువ్వు?

ఎవరు కావాలి అని అడిగాడు.

నా పేరు కుమార్‌ అని చెప్పి జరిగిందంతా చెప్పాడు. రమేష్‌కి జాలివేసింది. రమేష్‌కి కూడా ఎవరూ లేరని కుమార్‌తో చెప్పాడు. తాను మెకానిక్‌ పని నేర్చుకుంటున్నాను అని అన్నాడు.

నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావా? నిన్ను నా ఇంటికి తీసుకువెళుతా. నిన్ను నేను చదివిస్తాను.

నేను బాగా చదువుకుని కలెక్టర్‌ కావాలని మా అమ్మ, నాన్నల కోరిక. నేను తీర్చలేకపోయాను. అందుకని నిన్ను చదివిస్తాను. నిన్ను బయటికి గెంటేసిన నీ మామ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లు చేస్తాను. కుమార్‌ సరే అన్నాడు. కుమార్‌ని బడిలో చేర్పించాడు.

తాను రాత్రి పగలు కష్టపడి చదివాడు. కుమార్‌ ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. రమేష్‌ కూడా మంచి మెకానిక్‌గా పేరు పొందాడు. రమేష్‌ ఒక బైక్‌ని 10 నిమిషాల్లో విప్పి మళ్ళీ ఎక్కడవి అక్కడ పెట్టేస్తాడు. అతని పని తీరును చూసి ఒక పెద్ద కంపెనీలో అతనిని పనిలో చేర్పించుకున్నారు.

కుమార్‌ ఐ.ఎ.ఎస్‌ పరీక్షలు రాశాడు. మంచి మార్కులతో పాసయ్యాడు. కలెక్టర్‌ ఉద్యోగం వచ్చింది. ఇద్దరు గొప్ప స్థాయికి వచ్చారు. సంతోషంగా ఉన్నారు.

ఒకరోజు కుమార్‌ వాళ్ళ మామయ్య వచ్చాడు. బాబూ నా కొడుకు నన్ను బయటికి నెట్టేసాడు. ఆ రోజు నేను నిన్ను నెట్టేసినపుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు ఇప్పుడు అర్థమయింది. నన్ను క్షమించు. నీ ఆస్తిని అన్యాయంగా నాది చేసుకున్నాను. కొడుకు కోసం నీకు అన్యాయం చేశా! నా తప్పుకి తగిన శిక్షపడింది అన్నాడు. రమేష్‌ ఆయన తన తప్పును తెలుసుకున్నాడుగా! మనతోనే ఉండనిద్దాం అన్నాడు. సరే అని కుమార్‌ కూడా అన్నాడు. ఆ ముగ్గురూ సంతోషంగా ఉన్నారు.

నీతి : చూశారా మిత్రులారా, అందరు దుర్మార్గులుగానే ఉండరు. కొంత మనస్సు ఉన్న మనుషులు కూడా ఉంటారు.

ఒక పిల్లవాడు – ఒక తల్లి – ఒక తండ్రి

– మల్లికార్జున్‌, 8వ తరగతి

ఒక ఊరు ఆ ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు లచ్చయ్య, సత్తెమ్మ. వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు. అతను రోజూ చేనుకు వెళ్ళేవాడు. రోజూ వాళ్ళ నాన్న పనికి పంపించేవాడు. అందువల్ల అతను చదువుకోలేడు. పనికి వెళ్ళేవాడు. అతను రోజూ ఒక చెట్టుకింద కూర్చుని అన్నం తినేవాడు. ఆ చెట్టుమీద ఉన్న పక్షులను చూసి అవి స్వేచ్ఛగా ఉన్నాయి అవి చెట్టుమీద ఉంటాయి. మరి నేనెందుకు లేను? నేను బడికి పోవాలనుకుంటే ఎందుకు పోవడం లేదు అని ఆలోచించేవాడు బాధపడేవాడు. ఓ రోజు వాళ్ళ నాన్నను నాన్నా నేను బడికి వెళుతాను అన్నాడు. వాళ్ళ నాన్న చదువుకుంటే ఏంచేసేదుందిరా. పనిచేస్తే పూటనన్న గడుస్తుంది అని అన్నాడు. అతని ఫ్రెండ్స్‌ అందరూ వచ్చి వాళ్ళ నాన్నని ”అంకుల్‌ మీ కొడుకుని చదువుకోడానికి పంపించవచ్చు కదా” అని అడిగారు వాళ్ళ నాన్న అన్నాడు మేసే గాడిదని కూసే గాడిద వచ్చి చెడగొట్టినట్టు, మీరు ఏమిట్రా నా కొడుకుని చదువుకోవడానికి అని వెంటబడుతున్నారు. నేను నా కొడుకుని చదివించను. నా కొడుకు నా ఇష్టం…. మీరెవరు చెప్పటానికి అని కోపంగా అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ వెళ్ళిపోయారు. అతని కోసం వాళ్ళ ఫ్రెండ్స్‌ చాలా బాధ పడ్డారు. అయినా ఆ ఫ్రెండ్స్‌ తమ ప్రయత్నం ఆపలేదు. రోజూ బడికి వెళ్ళే సమయంలో వాళ్ళ నాన్నను వాళ్ళ ఫ్రెండ్స్‌ అందరూ కలసి హెడ్‌ మాస్టర్‌ దగ్గరికి తీసుకు వెళ్ళి ”సర్‌ ఈ అంకుల్‌ వాళ్ళ కొడుకుని చదివించడం లేదని” చెప్పారు. అప్పుడు వాళ్ళ ”సర్‌” ఏమైంది లచ్చయ్య నీకు చదువు ఉపయోగం తెలుసా అని గద్దించాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమో సారు మేము సదువుకోలేము…. మీలెక్క… అన్నాడు. రేపటినుండి నువ్వు నీ కొడుకుని బడికి పంపకపోతే రేషన్‌ బంద్‌ చేపిస్తా” అని బెదిరించాడు. ”అయ్యో” ”అట్లా అనకుసారూ” ఎట్లా బతుకుతం. రేపటికెల్లి పంపితం అన్నాడు…” రవి నువ్వు ఇప్పుడే మీ బడికి పోయి పెద్ద సారును కలువు. రేపటినుండి బడికి పోదువు అన్నాడు. రవి ఆశ్చర్యంతో నమ్మలేనట్టు వాళ్ళ నాన్నను చూశాడు. నిజంగానే చెప్తున్న పోయిరా… అన్న తండ్రి మాటతో బడికేసి అడుగులు వేశాడు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నట్టు ఊహించుకుంటూ… వెళ్తున్నాడు…

 

నాట్యమాడుతూ

– టి. భూమేష్‌, 9వ తరగతి

ఘల్లు ఘల్లు మని కాళ్ళ గజ్జెలు మోగుతుంటే

నా మనస్సులో మొగ్గ వికసించినట్లు

నా హృదయంలో పువ్వుల తోట ఉన్నట్లు

నా గుండెలో వెలుతురు వచ్చినట్లు

నేను శివుడిలా కాలికి గజ్జె కట్టినట్లు

నిర్భయ హంతకులపై నాట్యమాడినట్లు.

 

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.