మహిళా ఉద్యమాలు – దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే

1980కి అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో సగభాగం గడిచిపోయింది. 1980 వేసవిలో ‘కోపెన్‌హాగ్‌’లో యునైటెడ్‌ నేషన్స్‌ అర్ధదశాబ్ది సమావేశం వివిధ దేశాల మహిళా అధ్యయన కేంద్రాల భాగస్వామ్యంతో నిర్వహించబడింది కూడా. 80వ దశకంలో మహిళా అధ్యయనాలు భారతదేశంలో గొప్ప ఊపందుకొన్నాయి. నిజానికి 1971లో భారత ప్రభుత్వం భారతదేశంలో స్త్రీల స్థితిగతుల అధ్యయనానికి ఒక కమిటీని వేసినప్పుడే మహిళా అధ్యయనానికి బీజాలు పడ్డాయి. ఆ కమిటీ సభ్యులుగా నియమించబడిన వీణామజుందార్‌ తదితరులు భారత సమాజాన్ని సంప్రదాయాలను, సంస్కృతిని, స్త్రీల స్థితిని అధ్యయనం చేసి 1974లో ”సమానత్వం దిశగా..” అనే నివేదికను సమర్పించారు. పొరలుపొరలుగా వున్న భారతీయ సామాజిక సంస్కృతిలో మనకు తెలిసింది పైకి కనిపించే ఒక పలచటి పొర మాత్రమేనని అంటుంది వీణామజుందార్‌. కులం, వర్గం తదితర అంశాలు జీవితంలో, స్త్రీలు మోసే పాత్రలను, బాధ్యతలను, బరువులను, విలువలను, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వేరువేరుగా నిర్దేశిస్తుంటాయని ఆమె అభిప్రాయపడింది. స్త్రీల సమస్యలు పురుషుల సమస్యలవలెనే పరిష్కారం కావటానికి సుదీర్ఘకాలమే పడుతుంది కానీ జ్ఞానమే శక్తిగా పరిగణింపబడే సమాజంలో ముందుగా స్త్రీ గురించిన సమాచార జ్ఞానం, విచారణ జ్ఞానం సమీకరించుకొనటం అవసరమని అందుకొరకే మహిళా అధ్యయనాలు అని పేర్కొన్నది. స్త్రీల గురించిన జ్ఞానాన్ని అణచివేసిన సమాజంలోనే వివక్ష, అసమానత పెరుగుతూ స్త్రీల బాధలకు కారణమవుతుంటాయని ఆమె అభిప్రాయపడింది. స్త్రీల కోణం నుండి సమాజాన్ని అధ్యయనం చేయటం ప్రారంభిస్తే జ్ఞానసమృద్ధి కలుగుతుందని ఆమె సూచించింది.

1981 వేసవిలో బొంబాయి ఎస్‌ ఎన్‌ డి టి మహిళా విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన మొదటి జాతీయ సదస్సు సమాజంలో స్త్రీల బహుముఖ పాత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయటమే మహిళా అధ్యయనమని, ఉన్నత విద్యలో అన్ని విద్యావిభాగాలలోనూ ఇది ముఖ్యభాగం కావాలని, అన్ని సామాజిక శాస్త్రాలలో దానికొక సముచిత స్థానం లభించాలని నొక్కి చెప్పింది. పాఠ్యాంశాలలో లేకుండాపోయిన స్త్రీని, స్త్రీల కోణాన్ని స్థాపించటం ద్వారా ఆయా అధ్యయన విభాగాలను సమగ్రం చేయాలని అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలోనే 1982లో వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు కొందరు కలిసి స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థను స్థాపించారు. ఉత్తర తెలంగాణ వ్యావసాయిక విప్లవోద్యమ ప్రభావంతో వర్గ చైతన్యాన్ని అధ్యయన అధ్యాపనలలో భాగం చేసుకొంటున్న వారికి జండర్‌ దృక్పథం నుండి సమాజాన్ని అర్థం చేసుకొనటం, వ్యాఖ్యానించటం ఆసక్తికర అంశం, తప్పని సరిగా పనిచేయవలసిన రంగం అయినాయి. విశ్వవిద్యాలయ పరిశోధనలకు సామాజిక కార్యాచరణకు అనుసంథానం లక్ష్యమైంది. ఈ సంస్థ ఏర్పడుతూనే భారతదేశంలో స్త్రీల హోదా, అభివృద్ధి అనే అంశంమీద జాతీయస్థాయి సదస్సును నిర్వహించింది.

స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ మనస్మృతి నుండి మేరీ వులస్టవ్‌ క్రాప్ట్‌ వ్రాసిన విండికేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ విమెన్‌ వరకు అనేక పుస్తకాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. మహిళల అణచివేతకు కారణమైన పితృస్వామిక సామాజిక సంస్కృతి స్వభావాన్ని గురించిన అవగాహన కలిగించింది. స్త్రీని శరీరం, హృదయం, మెదడు వున్న ఒక మానవ వ్యక్తిగానే గుర్తించని భూస్వామ్య పురుష దురహంకారానికి పరాకాష్ట రూపమైన సతీసంఘటనకు (రూపకన్వర్‌ 1987) స్త్రీ శరీరాన్ని వ్యాపార ప్రయోజనాలకు సాధనంగా మారుస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్వహించే అందాల పోటీలకు, బహుళజాతి సంస్థల పనితీరు మూడవ ప్రపంచదేశాల ప్రజలను, ప్రత్యేకించి మహిళలను ఎలా బలితీసుకొంటుందో చూపిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు వ్యతిరేకంగా తక్షణమే ప్రతిస్పందించి పోస్టర్లు, కరపత్రాలు ప్రచురించి ప్రచారంచేసి సదస్సులు నిర్వహించింది. కుటుంబహింస, వివాహవ్యవస్థ, ఆస్తి హక్కు మొదలైన అంశాలమీద చర్చావేదికలు నిర్వహించింది. సారా వ్యతిరేక ఉద్యమంలో వరంగల్‌ జిల్లాలో స్థానిక సంస్థలతో కలిసి విస్తృతంగా పనిచేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన సదస్సులలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సారా రాజకీయాలను విప్పిచెప్పటంలో గట్టి కృషి చేశారు.

గృహహింసకు, వరకట్నం వేధింపులకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పనిచేసింది స్త్రీ జనాభ్యుదయ అధ్యయనసంస్థ. నిజనిర్ధారణ కమిటీల ద్వారా అనేక ఘటనలకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసి ప్రచారం చేసింది. నివేదికలు తయారుచేసి సంబంధిత ప్రభుత్వాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకొని వెళ్ళి నేరస్థులను శిక్షించాలని బాధిత స్త్రీలకు న్యాయం చేయాలని ఒత్తిడి తెచ్చింది. బాధిత స్త్రీల కోరిక మేరకు కుటుంబంలో స్త్రీలపట్ల మారవలసిన దృక్పథం గురించి, చేసుకోవలసిన సర్దుబాట్ల గురించి ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లు అనేకం నిర్వహించింది.

స్త్రీల సమస్యలపైన, సాహిత్యంపైన, ఉద్యమాలపైన, స్త్రీల జీవితాన్ని ప్రభావితం చేసే చారిత్రక రాజకీయార్థిక విధానాలమీద ఎప్పటికప్పుడు అవగాహనా సదస్సులు నిర్వహించటమేకాక సంస్థ సభ్యులు వ్యక్తులుగానూ, సమూహంగానూ సామాజిక సాహిత్య రంగాలలో స్త్రీ సమస్యలపై పరిశోధనలు ప్రారంభించారు. 1984 నుండి స్త్రీ జనాభ్యుదయం అధ్యయన సంస్థ పుస్తక ప్రచురణ కూడా చేపట్టింది.

1980 ప్రారంభం నుండే మల్లాది సుబ్బమ్మ మహిళాభ్యు దయ సంస్థను ఏర్పరచి స్త్రీ సమస్యకు సంబంధించిన జ్ఞానచైతన్యాల అభివృద్ధికి సెమినార్ల ద్వారా, పుస్తక ప్రచురణల ద్వారా కృషి చేస్తుంది. వరకట్న నేరాల దర్యాప్తు సంఘాన్ని ఏర్పరచి పనిచేసింది. కుటుంబ సలహాకేంద్రాన్ని స్థాపించి కుటుంబ హింసకు గురయిన స్త్రీలకు నైతిక ధైర్యాన్నిచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి పనిచేసింది. 1989 నాటికి అశ్లీల ప్రతిఘటనా వేదిక ఏర్పడి పనిచేయసాగింది.

ఈ విధమైన సంస్థలు అనేకం ఆంధ్రదేశమంతా ఎక్కడికక్కడ ఏర్పడి స్త్రీల చైతన్యాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాయి. విశ్వవిద్యాలయ పరిశోధనలలోకి స్త్రీ సమస్య, స్త్రీ దృక్పథం ప్రవేశించిన కాలం ఇది. స్త్రీ సమస్యకు భిన్న పార్శ్వాలనుండి దేశీయ అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యం నుండి, కులమత సంస్కృతీ సంబంధాలనుండి చర్చించే వాతావరణం వల్ల జండర్‌ సమానత్వానికి సంబంధించిన కొత్త భావజాలం అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉద్యమం రాజకీయ పదునుకు ఇది ఎంతో దోహదం చేసింది.

1970వ దశకంలో ఆంధ్రదేశంలో వామపక్ష భావజాల చైతన్యనేపథ్యం మొలకెత్తి కొత్త స్త్రీవాద భావజాల ప్రభావిత మహిళా ఉద్యమం స్త్రీ సమస్యపట్ల వామపక్ష, విప్లవ రాజకీయ పార్టీల వైఖరిని విమర్శకు పెట్టటం గమనించదగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల, శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాల అనుభవాలను సమీక్షిస్తూ స్త్రీలు విప్లవోద్యమాలలోకి సమీకరించబడుతున్న ఉద్యమంలో వాళ్ళెంత క్రియాశీల పాత్ర వహిస్తున్నా పార్టీ వారిని శ్రామిక వర్గంగా, పోరాటాలకు సహకారకారులుగా చూచిందే తప్ప స్త్రీలుగా పీడితులలోకెల్ల పీడితులుగా పితృస్వామ్య అణచివేతకు గురయ్యే వారికి ప్రత్యేక సమస్యలుంటాయని వాటిని ప్రత్యేకంగా సంబోధించాలని గుర్తించలేకపోయిందన్న ఆరోపణ ఆ విమర్శలో వుంది. కుటుంబంలో, సమాజంలో, రాజకీయాలలో స్త్రీల స్థానం గురించి వివక్ష గురించి స్వతంత్ర ప్రతిపత్తి మహిళా ఉద్యమం సంధించిన ఈ కొత్త ప్రశ్నలు విప్లవ రాజకీయ సంస్థలకు మహిళా సమస్య గురించి పునరాలోచించేట్లు చేశాయి. కొత్త సామాజిక పరిస్థితులలో మహిళా సమస్యపట్ల తమ దృక్పథాన్ని తమ రాజకీయ విశ్వాసాల వెలుగులో అస్పష్టం చేయవలసి వచ్చింది. ఈ పరిస్థితులలో వామపక్ష రాజకీయ పార్టీలు అనుబంధ మహిళా సంఘాల పునరుద్ధరణకు పూనుకొన్నాయి. ఈ కొత్త మహిళా సంఘాలన్నీ 1930వ దశకం నాటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ మహిళా సంఘంలో తల్లి వేరు సంబంధాన్ని సంభావిస్తాయి.

1930ల నుండి తెలంగాణలో ఆంధ్రమహాసభకు అనుబం ధంగా మహిళాసభలు జరుగుతూ స్త్రీ సమస్యల గురించిన చర్చ పరిష్కారాల గురించిన ఆలోచన, అందుకోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి సాగుతుండగా కృష్ణా జిల్లా పామర్రులో 1937లో మహిళా సంఘం ఏర్పడి పనిచేయటం, క్రమంగా అది అనేక జిల్లాలకు విస్తరిం చటమూ జరిగింది. వామపక్షభావాలు కలిగిన మహిళలు దానిని రాష్ట్ర నిర్మాణంగా అభివృద్ధిచేయ తలపెట్టారు. తత్ఫలితంగానే 1947 ఫిబ్రవరి 15, 16 తేదీలలో గుంటూరు జిల్లా చిలువూరులో ప్రథమాం ధ్ర రాష్ట్ర మహాసభను జరిపి ఆంధ్రరాష్ట్ర మహిళా సంఘాన్ని స్వతంత్ర మహిళా వేదికగా స్థాపించారు. ఆనాటి మహిళా సంఘానికి అధ్యక్షురాలు డాక్టర్‌ కొమర్రాజు అచ్చమాంబ, కార్యదర్శి మానికొండ సూర్యావతి.

ఆ మూలసంస్థ సంబంధంలో అర్థశతాబ్దికి పైబడిన చరిత్ర కలిగిన సంస్థ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య. 70వ దశకం నుండి ఊపందుకున్న నూతన మహిళా ఉద్యమంలో చురుకైన భాగస్వామ్య పాత్ర వహిస్తున్న సంస్థ ఇది. జాతీయ రాష్ట్ర మహిళా కమీషన్ల ఏర్పాటు కుటుంబ మహిళా కోర్టులు, మహిళా పోలీసు స్టేషన్ల ఏర్పాటు, స్థానిక సంస్థలలో మహిళలకు ఉద్యోగకల్పన, బాలికల ఉన్నతవిద్య, గర్భస్థ ఆడశిశు హత్యలకు, గృహహింసకు వ్యతిరేక చట్టాలు మొదలైన వాటికోసం ఈ సంస్థ పనిచేసింది. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది. మహిళా పొదుపు సంఘాలను వారి సమస్యలపై సమీకరించి ఉద్యమం నడిపింది. మహిళల కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు ఒత్తిడి తేవటంలో ఈ సంస్థ కృషి వుంది. 2008 లో ఇది పదకొండవ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకొన్నది.

ఆ మూలంనుండే 1986 నాటికి ఉనికిలోకి వచ్చిన మరొక వామపక్ష మహిళాసంఘం – అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఆంధ్రప్రదేశ్‌) మల్లు స్వరాజ్యం మోటూరు ఉదయం నాయకత్వం. ప్రజాస్వామ్యం, సమానత్వం స్త్రీ విముక్తి లక్ష్యాలుగా మహిళలపై హింసకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని తీసుకొని పనిచేస్తున్న సంస్థ ఇది. వరకట్న నిషేధ చట్టంకోసం, ఆ చట్టం సక్రమంగా అమలుకావటం కోసం, సంపూర్ణ మధ్యనిషేధం అమలుకోసం, చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం నిరంతరం పనిచేస్తున్నది. భ్రూణహత్యలకు, దళిత గిరిజన బాలికలపైన మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలకు, డ్వాక్రా మహిళలపై సాగుతున్న ప్రైవేటు బ్యాంకుల రుణవేధింపులకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు సంఘటనలకు ప్రతిస్పందిస్తూ పనిచేస్తున్నది. 2002లో యస్‌. పుణ్యవతి సంపాదకత్వంలో చైతన్యమానవి అనే పత్రికను ప్రారంభించి నడుపుతున్నది.

1947 చిలువూరు రాష్ట్ర మహిళా సంఘం దారిలో 1974లో హైదరాబాదులో ఏర్పడిన ప్రగతిశీల మహిళా సంఘాన్ని పునరుద్ధరించాలన్న ఆకాంక్ష 1980 దశకం చివరకు బలపడింది. విమల, సంధ్య, అంబికల చొరవతో రాష్ట్రమహిళా ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పడింది. అప్పటివరకు స్థానికంగా ఆయా ప్రాంతాలలో పనిచేస్తున్న మహిళా సంఘాలను సమీకరిస్తూ ఆయా ప్రాంతాలలో స్త్రీలపై పీడనకు, హింసకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిస్తూ రాష్ట్ర స్థాయి నిర్మాణాన్ని విస్తరిస్తూ పోయింది. హైదరాబాదులో పెద్ద ఎత్తున మహిళా చైతన్య సదస్సును నిర్వహించింది. 1990 ప్రారంభానికి ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) పూర్తి రూపం తీసుకొంది. 1992 ఏప్రిల్‌ 10-12 తేదీలలో వరంగల్లులో తొలి రాష్ట్రసదస్సు నిర్వహించబడింది. భూస్వామ్య వ్యతిరేక మహిళా వ్యవసాయ కూలీ ఉద్యమాలను, జోగిని, బసివిని వంటి దురాచారాలకు వ్యతిరేక ఉద్యమాలను కుటుంబ హింస నుండి రాజ్యహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న జీవిత భీభత్సానికి వ్యతిరేకఉద్యమాలను ఈ సంఘం నిర్మించింది. నిర్వహించింది. సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకైన భాగస్వామ్యపాత్ర వహించింది. నగరాలలో పెట్టుబడిదారీ వ్యతిరేక బీడీ మహిళా కార్మిక ఉద్యమాన్ని నడపటంలో విశేషంగా పనిచేసింది. రాయలసీమలో భూస్వామ్య ముఠా రాజకీయాలకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర ఈ సంఘానిది. ‘స్త్రీ విముక్తి’ అనే పత్రికను నడిపింది.

ఈ సంస్థ నుండి విడివడిన ఒక బృందం 2004 నాటికి ‘స్త్రీ విముక్తి సంఘటన’ (ఆంధ్రప్రదేశ్‌) అనే పేరుతో కొత్త నిర్మాణరూపం తీసుకొన్నది. ఈ సంఘం తొలిరాష్ట్ర సదస్సు విశాఖ స్టీల్‌ సిటీలో మార్చి 1న జరిగింది. ప్రపంచీకరణ క్రమంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో తలెత్తుతున్న సంక్షోభం స్త్రీలమీద మోపుతున్న భారాన్ని, స్త్రీలు ఎదుర్కొంటున్న శ్రమ దోపిడిని, లైంగిక దోపిడిని సంబోధిస్తూ పనిచేస్తున్న ఈ సంస్థ పితృస్వామిక వ్యతిరేక చైతన్యంలో శ్రామిక మహిళా పోరాటాలకు నాయకత్వం వహిస్తూ కొనసాగుతున్నది. ‘స్త్రీ సంఘటన’ అనే త్రైమాసిక పత్రికను క్రమం తప్పకుండా తీసుకొని వస్తున్నది.

1974 నాటి పివోడబ్ల్యు ని మాతృసంస్థగా చెబుతూ 1990ల నుండి రాష్ట్ర సంఘంగా పనిచేస్తున్నది. ప్రగతిశీల మహిళాసంఘం (పివోడబ్ల్యు) దీని ప్రథమ మహాసభ రాజమండ్రిలో జరిగింది. అధిక ధరలకు అశ్లీలతకు, అందాల పోటీలకు, అత్యాచారాలకు వ్యతిరే కంగా స్త్రీలను కదిలించింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కొరకు నిరంతరం పనిచేస్తున్నది. సారా వ్యతిరేక పోరాటంలో భాగస్వామి అయింది. మాతృక అనే స్త్రీల పత్రికను ప్రచురిస్తున్నది. ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) ఇదీ కలిసిపోయి పీవోడబ్ల్యు గా పనిచేస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రైవేటీకరణల క్రమంలో స్థానిక జీవన వృత్తులను భగ్నంచేసి ప్రజల జీవితాన్ని చిధ్రం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు, వాటికి రహదారులు నిర్మిస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళల ప్రయోజనాలకై పోరాడుతున్నది ఈ సంస్థ. స్త్రీలను మార్కెట్‌ సరుకుగా చేస్తున్న సామ్రాజ్యవాద సంస్కృతిపై ఆగ్రహంతో స్త్రీలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది.

సరిగ్గా ఈ సమయంలోనే శ్రామిక మహిళా దృక్పథంలో స్త్రీ సమస్యపై పనిచేయటానికి విద్యావంతులైన యువత సంసిద్ధమైంది. 1989 నాటికి విశాఖపట్నంలో స్త్రీ శక్తి, ఒంగోలులో మహిళా స్రవంతి, గుంటూరులో ప్రగతి మహిళా నివేదిక, ఆదోనిలో మహిళా స్రవంతి, తిరుపతిలో మహిళాశక్తి, గూడూరులో మహిళా వేదిక, హైదరాబాదులో మహిళాచేతన, అనంతపురంలో అభ్యుదయ మహిళా సంఘం, మహబూబ్‌నగర్‌లో మహిళా చైతన్య సంఘం వంటివి ఏర్పడి మధ్యతరగతి, శ్రామికవర్గ మహిళలకు కూడగట్టి స్త్రీలపై అమలవుతున్న అధికార దౌర్జన్యాల గురించి, హింస గురించి, వాటి నుండి విముక్తికి చేపట్టవలసిన పోరాట మార్గాల గురించి అవగాహన పెంపొందించే పని ప్రారంభించాయి. వరకట్నం, కుటుంబ హింసలపై ప్రత్యక్ష పోరాటాలను నిర్దిష్ట సందర్భాలలో చేపట్టాయి. స్త్రీ పురుష అసమానతలను వర్గ వ్యత్యాసాల సంబంధంలో అర్థం చేసుకొని వర్గరహిత సమాజ స్థాపన లక్ష్యంగా స్త్రీ విముక్తి పోరాటం సాగాలన్న అవగాహనను అభివృద్ధి పరచటంలో శ్రద్ధ చూపాయి. సారా వ్యతిరేక మహిళా ఉద్యమంలో ఈ సంఘాలు ఆయా నగరాలలో చొరవతో పాల్గొన్నాయి. 1995లో ఈ సంఘాలన్నీ కలిసి చైతన్య మహిళా సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఇప్పుడది చైతన్య మహిళా సంఘంగా పనిచేస్తున్నది. ప్రారంభంనుండి దేశంలోని ఇతర ప్రాంతాలలోని శ్రామిక మహిళా సంఘాలతో సంబంధాలు నెరపటమే కాక దేశ విదేశ శ్రామిక మహిళా ఉద్యమాల గురించిన పుస్తకాలను ప్రచురించి దేశీయ మహిళా ఉద్యమాల మార్గాన్ని నిర్దిష్టంగా చూపింది. ‘మహిళా మార్గం’ అనే పత్రికను ఈ సంస్థ నడుపుతున్నది.

ఈ విధమైన ప్రధాన స్రవంతి మహిళా సంఘాలతోపాటు ఈ కాలంలో విప్లవోద్యమం విస్తరించిన దండకారణ్యంలో మహిళా సంఘ నిర్మాణం జరగటం విశేషం. 1980 నాటికి ఆదిలాబాద్‌ అడవుల్లో విప్లవరాజకీయాల ప్రచారం ప్రారంభమై 1981 ఇంద్రవల్లి ఘటన తరువాత దావానలమై వ్యాపించింది. విప్లవ రాజకీయాల ప్రచారంలో మహిళలు కూడా భాగస్వాములై, ఆదివాసీ మహిళల సమస్యలను గుర్తించి, వాళ్ళను చైతన్యపరచటంలో శ్రద్ధచూపారు. కుటుంబంలోనూ, పనిప్రాంతాలలోనూ వివక్షకు పీడనకు గురి అవుతున్న ఆదివాసీ మహిళలను సంఘటిత పరిచారు. తునికాకు, వెదురుకూప్ర కూలీరేటు పెంపుదలకు జరిగిన పోరాటాలలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భం నుండి పీడితవర్గంగా మాత్రమేకాక మహిళలుగా కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను సంబోధించటం విప్లవోద్యమ అవసరం అయింది. అలాగే స్త్రీలుగా ఎదుర్కొంటున్న స్వీయ సమస్యల పరిష్కారానికి విప్లవోద్యమం దారి చూపుతుందన్న ఆశ కూడా ఆదివాసీ స్త్రీలలో పొడచూపసాగింది. తత్ఫలితంగా 1984 నాటికి అక్కడక్కడా మహిళాసంఘాలు గ్రామస్థాయిలో ప్రారంభమయ్యాయి. క్రమంగా ఆదివాసీ మహిళా సంఘటన రూపుదిద్దుకొంది. 1991 నాటికి నిర్దిష్ట ప్రణాళికతో ఇది ‘క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్‌’ గా స్థిరపడింది.

ఆదివాసీ స్త్రీల ప్రత్యేక సమస్యలైన బలవంతపు పెళ్ళిళ్ళు, పెళ్ళయిన స్త్రీలు జాకెట్‌ ధరించకూడదన్న రీతిరివాజులు, గోటుల్‌ సంస్కృతి మొదలైన అంతర్గత ఆధిపత్యాలకు, లైంగిక వివక్షలకు వ్యతిరేకంగా ఆదివాసీ స్త్రీలను సమైక్యం చేసిందీ సంఘం. అలాగే గిరిజనేతర వ్యాపార వర్గాల దోపిడిని పురుష ప్రపంచపు లైంగిక దోపిడీకి, వివాహం చేసుకొంటామన్న ఆశ చూపి జరిపే అత్యాచారాలకు, అవాంఛిత గర్భాలకు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా హక్కులకోసం, న్యాయం కోసం పోరాడే బలాన్ని ఆదివాసీ మహిళలకు ఇచ్చిందీ సంఘం. సంఘం పెట్టటంవల్ల, సంఘటితమవటం వల్ల రాజ్యహింసకు కూడా గురికావలసి వస్తున్నది. సాల్వాజుడుం దాడులకు నిర్భంధాలకు, అత్యాచారాలకు, హత్యాకాండకు బలికావలసి వస్తున్నా, పారామిలిటరీ బలగాలవల్ల బాధలు పడుతున్న ఆదివాసీ మహిళా సంఘటన్‌ ముందుకు సాగుతూనే వుంది. తెలంగాణ అడవుల్లో ఉత్తర తెలంగాణ మహిళా విముక్తి సంఘం ఇది పనిచేస్తున్నది. ‘పోరుమహిళ’ అన్న పత్రికను ప్రచురిస్తున్నది. విప్లవోద్యమంలో మహిళల భాగస్వామ్యం, మహిళల కోసం విప్లవోద్యమం అన్న పద్ధతిలో ఏకకాలంలో రాజ్యాన్ని, పితృస్వామ్యాన్ని సంబోధిస్తూ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పోరాటాలను జమిలీగా నడుపుతున్న చరిత్ర ‘క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్‌’ది. పునరుత్పత్తి శక్తిగానేకాక ఉత్పత్తి శక్తిగా కూడా స్త్రీలు కోల్పోతున్న హక్కుల గురించిన చైతన్యం కలిగించటం, శ్రమదోపిడికి, వనరుల దోపిడికి వ్యతిరేకంగా సాగే ఉద్యమాలలో భాగస్వాములయ్యే సంసిద్ధతను స్త్రీలలో పెంచటం ఈ సంఘం చేస్తున్నపని.

రివిజనిజం నుండి తెగతెంపులు చేసుకోమన్నది నక్సల్‌బరీ, బ్రాహ్మణిజమ్‌తో తెగతెంపులు చేసుకోమన్నది కారంచేడు అని పిలుపునిచ్చి దీర్ఘకాలిక వర్గ కుల ప్రజాయుద్ధ పంథాను చేపట్టింది సిపియుఎస్‌ఐ. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి లక్ష్యంగా ఏర్పడితే (1998 డిసెంబరు 25) ఆ నేపథ్యంలో 2000 సంవత్సరంలో దళిత శ్రామిక మహిళా విముక్తి లక్ష్యంగా ఆడజన సమాఖ్య ఏర్పడింది. 2001 ఏప్రిల్‌లో వరంగల్లులో ప్రథమ మహాసభలను జరుపుకొంది.

ఏమైనా 80వ దశకం ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమ గతిక్రమాన్ని నిర్దేశించటంలో కీలకమైందని చెప్పకతప్పదు.

(ఇంకావుంది)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో