తొలితరం ఉపాధ్యాయిని సావిత్రీబాయి —

డా. బి. విజయభారతి

పూనే నగర శివారు ప్రాంతం. పదిహేడేళ్ళ అమ్మాయి వడివడిగా అడుగులు వేస్తూ వెళుతున్నది. వీధిలో ఇళ్ళు దూర దూరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఆమె మీద పేడనీళ్ళు పడ్డాయి. వాటిని విదిలించుకుంటూ రెండడుగులు వేసేసరికి ఎవరో విసిరిన రాళ్ళు తగిలాయి. అటు చూడకుండానే ఆమె నడక సాగించింది.వీధి చివరి వరకు వెళ్ళేలోపల ఎక్కడినుంచో చెత్తాచెదారమూ మీద పడ్డాయి. వాటిని దులుపుకుంటూనే ఆమె చిరునవ్వుతో బుధ్‌వార్‌ పేట భిడేసాహెబ్‌ చావడివైపు సాగిపోయింది. అక్కడ నలుగురైదుగురు అతిశూద్ర కులాల ఆడపిల్లలు ఆమెకోసం ఎదురుచూస్తున్నారు. ఆమెను చూడగానే వారి ముఖాలు వికసించాయి. ఒక్కొక్కరూ తలాకొంత ఇసుక తెచ్చుకుని అక్కడ అరుగుమీద పరిచి అక్షరాలు దిద్దటం మొదలుపెట్టారు. మహారాష్ట్రలో మహర్‌ మాంగ్‌ కులాలు నిమ్నజాతి కులాలు జోతిరావ్‌ పూలే (1827-1890) వారిని అతిశూద్ర కులాలుగా వ్యవహారంలోకి తెచ్చాడు. అతిశూద్రుల ఆడపిల్లలకు చదువు నేర్పటానికి వచ్చిన ఆ అమ్మాయి సావిత్రీబాయి – జోతిరావ్‌ భార్య. అది క్రీ.శ. 1848 ప్రాంతం.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం హిందూ సమాజంలోని శూద్ర, అతిశూద్ర వర్ణాల వారికి చదువు నిషిద్ధం. స్త్రీలకూ నిషిద్ధమే. అందరూ చదువుకుంటున్న వర్తమాన సమాజానికి అప్పటి పరిస్థితులు నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. ఆ చరిత్రనూ వివరాలనూ తెలుసుకోవటం అవసరమే. శూద్ర అతిశూద్ర కులాల వారు భారతదేశంలో విద్యాసాంస్కృతిక రంగాలలో శతాబ్దాలుగా అణచివేతకు గురయ్యారు. అణచివేతనుండీ శాస్త్రాల సంకెళ్ళనుండీ వారికి విముక్తి కలిగించిన తొలి సంస్కర్తలలో పూలే దంపతులు ముఖ్యులు. ‘వేదోఖిలో ధర్మమూలం’ అని ప్రతీతి. సమస్త ధర్మాలకూ జ్ఞానానికీ నెలవు అయిన వేదాలు శూద్రులు వినకూడదనే ఆంక్ష ఉండేది. పొరబాటున అలాంటిదేమైనా జరిగితే ఆ శూద్రుని చెవుల్లో సీసం కరిగించి పోయాలన్నారు. అలాంటి సమాజంలో బ్రిటిష్‌ పాలన ఫలితంగానూ మిషనరీల ప్రచార ప్రయత్నాలవల్లనూ శూద్రుల వరకు విద్యావకాశాలు వచ్చాయి.

జోతిరావ్‌ పూలే, సావిత్రీబాయి దంపతులు శూద్రవర్ణానికి చెందినవారు. తమవరకూ వచ్చిన విద్యావకాశాలను అతిశూద్ర కులాల బాలికలకు విస్తరించటానికి సావిత్రీబాయి పూనుకున్నది. అందుకే ఆమెమీద చెత్తాచెదారాలు పడుతున్నాయి. అయినా ఆమె దృఢ సంకల్పంతో మహర్‌ మాంగ్‌ కులాల ఆడపిల్లలను తనకు తోచినరీతిలో విద్యావంతులను చేసింది. ఆ కులాలలో తొలితరం అక్షరాస్యులు సావిత్రీబాయి శిష్యురాళ్ళే.

సావిత్రీబాయికి చిన్ననాటినుంచీ చదువుమీద ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే ఆమె వివాహం 1840లో విద్యాభిలాషి అయిన జోతిరావు పూలేతో జరిగింది. జోతిరావ్‌ చదువుకోవటానికి సమాజం ఎన్నో అడ్డంకులు కల్పించింది. కులవివక్ష వికృత స్వరూపాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్ళి ఊరేగింపులో కులంపేరిట జరిగిన అవమానం ఆయనకు నిద్రాహారాలు లేకుండా చేసింది. కుల కట్టుబాట్ల గురించి తండ్రి గోవిందు ఎంత వివరించినా ఆయన సరిపెట్టుకోలేక పోయాడు. బ్రాహ్మణులు నడిచేవీధిలో శూద్రులు (వారితో బాటు) నడిస్తే ఒకప్పుడు చంపేసేవారట. పీష్వాల కాలంలో అయితే ఏనుగులచేత తొక్కించే వారట. ”ఈ రోజుల్లో ఇంకా నయం” అని గోవిందు ఎంత సర్దిచెప్పినా జోతిరావ్‌ సర్దుకోలేక పోయాడు. కులవివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. అందుకు ‘విద్య’ను సాధనంగా ఎంచుకున్నాడు. భార్య సావిత్రీబాయి కూడా అందుకు సిద్ధపడింది భర్తకు అనుగుణంగా ప్రవర్తించాలనే సతీధర్మాలకంటె బలమైన విద్యాకాంక్ష, మానవతా భావం, కరుణ ఆమెను భర్తతోపాటు లక్ష్యంవైపు నడిపించాయి.

సావిత్రీబాయి 3-1-1831న సతారా జిల్లా ఖండాలా తాలూకాలోని నయీగాంలో జన్మించింది. చిన్నప్పటి నుంచీ చదువుమీద – పుస్తకాలమీద ఇష్టంతో పెరిగింది. పెళ్ళి అయిన తర్వాత జోతిరావ్‌కు చెల్లెలు వరుస అయిన సుగుణాబాయితో కలిసి చదువుకుంది. జోతిరావ్‌ ఈ యిద్దరికీ తమపొలంలోని మామిడిచెట్టుకింద చదువు చెప్పేవాడు. సమీపంలోనే ఉన్న మిషనరీల పాఠశాల టీచరు ”మిసెస్‌ మిషేల్‌” ఈ యిద్దరి చేతా పరీక్ష రాయించి మూడో తరగతిలో చేర్చుకున్నది. 1846-47 ప్రాంతాలకు వారు నాలుగో తరగతి పూర్తి చేశారు.

సమాజంలో మార్పు రావాలంటే కిందిస్థాయినుంచీ ప్రయత్నాలు జరగాలనే పట్టుదలతో పూలే దంపతులు జనవరి 1, 1848న బుధ్‌వార్‌ పేటలో అతిశూద్ర కులాల బాలికలకు బడి తెరిచారు. అప్పటికి ప్రభుత్వం వారి పాఠశాలలూ తక్కువే. అతిశూద్రకులాల వారి చదువు గురించిన ఆలోచనేలేని రోజుల్లో ”అందరికీ విద్య” అనే భావనతో చదువును మహర్‌ వాడలకు, వారి ఇళ్ళ దగ్గరకే తీసుకెళ్ళారు, పూలే దంపతులు. వారి పాఠశాలలు మహర్‌ వాడలలోనే నడిచాయి. 165 సంవత్సరాలు గడచినా ఇప్పటికీ మహర్‌ వాడలలో పాఠశాలలు పెట్టలేక పోతున్నది ప్రభుత్వం.

బాలికలకు పాఠాలు మగవాళ్ళు చెప్పటం అనేది అప్పటికి సంప్రదాయ విరుద్ధం; కాబట్టి, సావిత్రీబాయి మహర్‌ బాలికలకు టీచరుగా పాఠాలు చెప్పేది. మహర్ల పిల్లలకు బట్టలూ తిండీ కూడా సరిగా ఉండవు గనక వారికి అవన్నీ సరఫరా చేయవలసి ఉండేది. పిల్లలకూ వారి పెద్దవాళ్ళకూ కూడా డబ్బులు ఇచ్చి స్కూళ్ళకు పిల్లలను తీసుకు వచ్చేవారు. మొదట్లో ఆ పిల్లలకు మరాటీ, అక్షరాలూ, చిన్న చిన్న లెక్కలూ నేర్పేవారు. భిడేగారి వసారాలో నేర్పేవారు. భిడేగారి వసారాలో ఆరంభించిన పాఠశాల భారతదేశంలో అతిశూద్ర బాలికలకు ఆరంభమైన మొదటి పాఠశాల. అతిశూద్రుల పిల్లలకు ఒక శూద్ర వనిత పాఠాలు చెప్పటం చదువునేర్పటం శాస్త్ర విరుద్ధం- పాపం- అంటూ పూనే నగరం గగ్గోలు పడింది. సావిత్రీబాయిని నిందించింది- ఆమె వెళ్ళేదారిలో రోజూ ఆమెపైన మురికినీళ్ళు పడుతుండేవి – పాఠశాల నడపరాదని ఆ కుటుంబంపై ఒత్తిడి వచ్చింది. గోవిందు కుటుంబాన్ని వెలివేస్తామని కులపెద్దలు బెదిరించడంతో జోతిరావ్‌ దంపతులు ఆ యింటినుండి బయటికి వచ్చేశారు. బ్రతుకు తెరువు వెదుక్కునే క్రమంలో బడి మూతపడింది. కొన్నాళ్ళ తర్వాత కాయకష్టం చేసి నిలదొక్కుకుని వారు మళ్ళీ బడి ప్రారంభించారు. 1848 లోనే మే నెలలో ఒకటీ, డిసెంబరులో మరొకటీ పాఠశాలలు తెరిచారు. ఈ లోపులో కేశవ సీతారాం భావాల్కర్‌ అనే ఉపాధ్యాయుని దగ్గర (నవంబరు 1848) సావిత్రీబాయి ఉపాధ్యాయవృత్తి శిక్షణ పొందింది.

ఆమె పాఠశాలలకు వెళ్ళేటప్పుడు ఒక చీర సంచిలో పెట్టుకుని వెళ్ళేది. మురికి నీళ్ళుపడ్డ బట్టలు మార్చుకుని పిల్లలకు పాఠాలు చెప్పేది. తర్వాత రోజుల్లో కర్రలు పట్టుకుని ఎవరో ఒకరు ఆమెకు తోడుగా వెంట వెళ్ళేవారు.

దారి పొడుగునా సంప్రదాయవాదులు ఆమెను అడ్డగిస్తూనే ఉండేవారు. నిందించేవారు- అసభ్యంగా ప్రవర్తించేవారు. సావిత్రీబాయి అన్నింటినీ మౌనంగా సహించేది. ఒకసారి ఎవరో అతిగా ప్రవర్తించినప్పుడు కోపంతో చెంపదెబ్బవేసిందట. అప్పటినుంచీ వారి వేధింపులు, ఆగడాలు తగ్గాయట. ఆ విధంగా ఆత్మరక్షణ పద్ధతులూ ఆమె నేర్చుకున్నది. నేర్పించింది.

3-7-1851లో తెరిచిన పాఠశాలలో అన్ని కులాలకు చెందిన బాలబాలికలూ ఉండేవారు. ఆ తర్వాత 1852లోనూ మరొక పాఠశాల తెరిచారు. బ్రాహ్మణ బాలికలు, మరాటా కులాలవారూ అతిశూద్ర కులాల బాలికలూ ఈ పాఠశాలల్లో చదువుకున్నారట. సుగుణాబాయి, ఫాతిమా షేక్‌ అనే ఉపాధ్యాయునులు మరికొందరూ ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయునులుగా పనిచేశారట. సావిత్రీబాయి ప్రధానోపాధ్యాయిని. వీరు నడిపిన పాఠశాలలు సుమారు 18 వరకు ఉన్నాయట. వాటికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. అప్పుడప్పుడూ స్కూళ్ళు తనిఖీ జరిగేది. పరదా పద్ధతి పాటించేవారు. మొదట్లో స్కూళ్ళ ఇన్‌స్పెక్టరు గది బయట నిలుచొని అడగటమూ విద్యార్థినులూ, ఉపాధ్యాయినులూ గదిలోపల నుండి సమాధానాలు/సమాచారమూ ఇవ్వటమూ జరిగేవారట. వారికి వార్షిక పరీక్షలు నిర్వహించటమూ ఒక వేడుకగానే ప్రజలు చెప్పుకొనేవారట. 1852లో పాఠశాలల్లోని మౌఖిక పరీక్షలు అందరూ చూసే రీతిలోనే జరిగాయట.

జోతిరావ్‌ దంపతులు విద్యారంగంలో చేసిన కృషిని బ్రిటిష్‌ ప్రభుత్వ విద్యాశాఖ గుర్తించింది. 16.11.1852 న జోతిరావ్‌కు శాలువా కప్పి సన్మానించారు. ఆ సభలో చేసిన ప్రసంగాలలో సావిత్రీబాయి పేరు చాలాసార్లు వినబడింది, కాని ఆమెను వేదిక మీదికి పిలవటం జరగలేదు. పూనే నగరంలో ఒక శూద్రుడిని ఏండిర శాలువాతో సన్మానించటం అదే మొదటిసారి. ఆ సంఘటననే పూనే పండితులు జీర్ణించుకోలేకపోయారట.

స్త్రీల సేవలు గుర్తింపుకు నోచుకోని పురుషాధిక్య సమాజంలో ఆమె పేరు వినబడటమే గొప్ప గుర్తింపు. సావిత్రిబాయి తన వ్యక్తిత్వంతో సమాకాలిక సమాజాన్ని ప్రభావితం చేసింది. 1852లో మహిళామండలి ఒకటి స్థాపించింది. పూనా నగర కలెక్టరు భార్య మిసెస్‌ జోన్స్‌ ఈ మండలి కార్యక్రమాలకు సహకరించేదట. 1852 జనవరి 13న మండలి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి అచ్చువేసిన ఆహ్వానపత్రిక సారాంశం ఇలా ఉంది – ”13.1.1852 న పూనా కలెక్టరు గారి పత్ని మిసెస్‌ జోన్స్‌ అధ్యక్షతన ”సార్వజనిక తీలౌగుడ” ఉత్సవం ఏర్పాటు చేయబడింది. స్త్రీలంతా వేకీ సునా తీసుకొని రావలసింది. కుల మత భేదం పాటించకుండా అందరినీ ఒకే వరసలో సమావేశ పరుస్తాము. అందరికీ ఒకేరీతిలో పసుపు కుంకుమలు పూసి తీల్‌ గుడ (నువ్వులు-బెల్లం) పంచటం జరుగుతుంది.-” ఇట్లు సౌ. సావిత్రీబాయి జ్యోతిరావు పూలే. సెక్రటరీ మహిళా సేవామండలి.”

సంక్రాంతి పండుగకు నువ్వులు – బెల్లం పంచుకోవటం – సంప్రదాయ సిద్ధంగా ఆరోగ్యపరంగా జరుపుకునే వేడుక. ఇలాంటి వేడుకలను సావిత్రీబాయి ప్రోత్సహించింది. మూఢాచారాలను నిరసించింది. సంప్రదాయపరమైన పండుగలను ఆచరిస్తూనే ప్రజలలో – ముఖ్యంగా స్త్రీలలో, కులమత సామరస్యాన్ని పెంపొందిం చటానికి చేసిన కృషి ఆ ఆహ్వాన పత్రికలో ప్రస్ఫుటమవుతున్నది.

సావిత్రీబాయి ఆలోచనలు నవనవోన్మేషంగా ఉండేవి. భర్త నడిపే సామాజిక సంస్కరణ కార్యకలాపాలన్నింటిలోనూ ఆమె పాల్గొనేది. అనాథ శిశువులను అక్కున చేర్చుకునేది. 28.1.1853 న ఈ దంపతులు శిశు సంరక్షణాలయం ఒకటి తెరిచి కొన్నాళ్ళు నడిపారు. కిందివర్గాల వారి సమస్యల గురించేకాక అగ్రవర్ణాలలోని స్త్రీల సమస్యల గురించీ పూలే దంపతులు పోరాడారు.

వితంతువులు, ముఖ్యంగా బ్రాహ్మణ వితంతువులు మోసాలకు గురై గర్భవతులయినప్పుడు వారికి ఆత్మహత్యలే శరణ్యంగా ఉండేవి. అలాంటి వారికి ఆశ్రయం ఇవ్వటానికి పూలే దంపతులు ఒక శరణాలయం తెరిచారు (1863). ఆ శరణాలయం గురించిన ప్రకటనలు పూనే నగర వీధుల్లో గోడలమీద కనబడటం చూసి పూనే సనాతన వాదులు ఆగ్రహోదగ్రులయ్యారట. ఆ శరణాలయంలోని ”కాశీబాయి” అనే బ్రాహ్మణ వితంతువు కొడుకును సావిత్రీబాయి పెంచింది. జోతిబా దంపతులకు పిల్లలు లేరు. ఆ కుర్రవాడినే (యశ్వంత్‌) వీరు తమ వారసునిగా ప్రకటించారు.

జోతిరావ్‌ స్థాపించిన ‘సత్యశోధక సమాజం’ అనే సంస్థ నిర్వహణలో సావిత్రీబాయి కీలకమైన పాత్ర పోషించింది. సమాజంలోని మూఢాచారాల గురించి సామాన్య ప్రజానీకానికి విడమరచి చెప్పేది. రాత్రి పాఠశాలలు నిర్వహించి వయోజనులలో విద్యావ్యాప్తికి కృషిచేసింది. ప్రచారంకోసం స్వయంగా కొన్ని అఖండాలు, కవితలు రాసింది. ఆమె కవితా సంకలనాలు ”కార్యపులే”, ”భావన్‌కషి” అనేవి అనంతరకాలంలో అచ్చుపడినట్టు తెలుస్తున్నది.

భర్త మరణానంతరం సావిత్రీభాయి మరింత బాధ్యతగా పనిచేసింది. 1897లో పూనే నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో బాధితులకు సేవలు అందిస్తూ ఆమె కూడా ఆ వ్యాధి బారిన పడింది (10.3.1897).

ఆత్మస్థైర్యంతో పూర్వాచారాలను మూఢ సంప్రదాయాలను థిక్కరించి సమాజ సంక్షేమానికి అంకితమైన ఆ మహనీయమూర్తి గౌరవార్థం భారత ప్రభుత్వం 10.3.1998 న పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసి ఆమెకు నివాళులర్పించింది.

రాజకీయరంగంలో, సమాజసేవలో, సంస్కరణ రంగంలో, భర్తలను అనుసరించి కార్యక్రమాలు చేపట్టిన స్త్రీలు చరిత్రలో ఉన్నారు. సావిత్రీబాయి వ్యక్తిత్వాన్నిబట్టి చూస్తే ఆమె అన్నిటా స్వతంత్రమైన భావాలు కలిగిన సమున్నత వ్యక్తిగా స్పష్టపడుతుంది. పూలే అనుచరులు ఆమెను గురుస్థానంలోనే దర్శించారు. సతీధర్మంగా కాక మనోవాక్కాయ కర్మలతో తనకు నచ్చినందువల్లనే ఆమె భర్త కార్యరంగంలో పాలుపంచుకున్నదని చెప్పవచ్చు. ఇలాంటి వారిని గుర్తుచేసుకోవటం నవతరానికి స్ఫూర్తిదాయకం కాగలదు.

 

తొలితరం ఉపాధ్యాయిని సావిత్రీబాయి

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.