మోటూరి ఉదయం

1924 అక్టోబరు 13వ తేదీన పుట్టారు. శుక్రవారం సూర్యునితోపాటు పుట్టానని మా నాన్నగారు ఉదయలక్ష్మీ అని పేరు పెట్టారు. అసలు పుట్టుకతోనే ఒక ప్రత్యేకతతో పుట్టాను నేను. మా నాన్నగారు దేవుళ్ని, దయ్యాల్ని అవన్నీ నమ్మేవారు కాదు. ఇక్కడ రేపల్లె తాలూకాలో ఏటవతల తాటాకులపాలెం అనీ, కమ్మవారిపాలెం అనీ, అక్కడ దయ్యాలదొడ్డి అనీ, అక్కడ కాబోలు మా నాన్నగారి పొలం. దయ్యాలంటే అర్థరాత్రి లంబాడీ దయ్యాలు పరుగెత్తేవట. అక్కడ ఇక మనుషులు ఎవరూ బ్రతకరని చెబితే, ఎందుకు బ్రతకరో తెలుసుకోవాలని మానాన్న పట్టుదలగా అక్కడకు వెళ్ళారు. అప్పుడు మా అమ్మ గర్భిణీతో వుంటే ఊరంతా వచ్చి బ్రతిమాలారట. బంగారుమల్లే ఆమె బిడ్డను కనబోతుంటే ఆమెనెందుకట్లా చేస్తావు అని. కాదు ఇక్కడే తేలాలి సంగతి అన్నాడట. ఆ దయ్యాల దిబ్బమీద పుట్టానండీ నేను, అదీ అసలు కధ, పుట్టిన తర్వాత ఇక అక్కడ్నుంచి మా నాన్నగారు వాళ్ళు ఇక్కడకు రావటం చేయటం, మా నాన్నగారివైపు బంధువులంతా తరిమెళ్ళవైపు వున్నారు. ఎడ్యుకేషన్‌ అదీ అంటూ తరిమెళ్ళ వచ్చేశాం. మా అమ్మగారివైపు అంతా దుగ్గిరాల తెనాలి తాలూకా దాదాపు మధ్య తరగతి కుటుంబంలో వున్నటువంటివాళ్ళే అనుకోండి. తర్వాత మా అక్కగార్కి మా మేనమామనిచ్చి పెళ్ళి చేశారు. వాళ్ళకు పిల్లలు లేరు. అందుకని నన్ను పెంచుకు న్నారు. ఆయన చల్లపల్లిలో దివాన్‌గా పనిచేసేవారు. అందుకని చల్లపల్లిలో నేను స్కూలు వెళ్ళటం, బాగా కాంపిటేషన్‌గా చదవటం అప్పుడే, ప్రసాద్‌గారు వాళ్ళతో బాగా సంబంధా లుండేవి. ఫోర్త్‌ఫామ్‌ చదివేప్పుడు అసలు మాచ్‌ జరిగింది. అంటే మా మామయ్యగారు దివాన్‌ గనుక, హనుమంతరావు గారు ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పాస్‌ అయి వచ్చిన తర్వాత ఏదైనా సరే ఉద్యోగం చేయ్యాలని వచ్చారిక్కడికి. ఈ కుర్రాడు చాలా బావున్నాడు పాపం బాగా తెలివైనవాడనీ, ఉద్యోగం ఏంచేస్తారు, మా అమ్మాయికి ట్యూషన్‌ చెప్పండని అన్నారు. ట్యూషన్‌ మాష్టర్‌గా వచ్చారు. మా అన్నయ్య మేంఉన్నామని మా పినతల్లిగారి పిల్లలు వచ్చారు వస్తే మాకు ట్యూషన్‌ చెప్పటం, సాయంత్రం మమ్మల్ని షికారు తీసికెళ్ళటం ఇవన్నీ బాధ్యత. నాకు అప్పుడు పన్నెండు సంవత్సరాలు చాలా ఇన్నోసెంట్‌గా పెంచారు నన్ను. ప్రపంచం అంటే తెలియదు. స్త్రీలు ఇట్లా ఉండాలి. అని ఏమీ తెలియదు. నేను చదువుకునేటప్పుడు కూడా మాస్టారు ముందు చెపుతే నేను తర్వాత చెపుతా ననేదాన్ని. అంత పెంకిగా వుండేది, తెలిసేది కాదు. ప్రపంచ జ్ఞానం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికిచ్చినా కూడా సుఖపడదు. అందుకని ఆ విధంగా సుఖపడాలంటే ఆయనకే యిచ్చి చేయ్యాలని, మా అమ్మగారు చనిపోతూ చెప్పి చనిపోయింది. అందుకని మంచివాడని చెప్పి చేశారు. అయితే మా నాన్నగారికది ఇష్టంలేదు. డాక్టర్‌ చదివించాలి, నా బిడ్డకు పెళ్ళి చేయడానికి వీల్లేదని మా నాన్నగారు పర్వతనేని వెంకయ్యగారని 700 ఎకరాల పొలం – చాలా పెద్దగా బతికినటు వంటివాడు.

మొదట్నుంచీ మా నాన్న చాలా ప్రోగ్రెసివ్‌. తెలంగాణ పోరాటంలో అందర్నీ కాల్చిపారేసేదశ. హన్మంతరావు గారు అరెస్టు అయిన తర్వాత పదిరోజుల్లో మొదలుపెట్టారు కాలవడం. మా పెద్దమ్మాయి జబ్బుపడ్తే నూజివీడు దగ్గర అనంతసాగరమని వుండేది. అక్కడ వున్నప్పుడు హన్మంతరావు వచ్చారు. అప్పుడు భలేగమ్మత్తయినమాట, ఎందుకొచ్చిందో అయిడియా, ప్రతివాళ్ళం పందాలు వేసుకునే వాళ్ళంగా అప్పుడూ! మాకు పెసల బస్తా వచ్చిందన్నమాట. దీన్ని ఎవరు ఎగిరెయ్యాలని పందాలు, అంతేకాదు అప్పుడొక పేముబిత్తం వుండేది మా ఇంట్లో. కొడ్తే ఎవరికి కళ్ళనీళ్ళురావో వాళ్ళు అగ్ని పరీక్షలో వచ్చినట్టు అనుకున్నాం. కబుర్లు కాదు ఎవరు ముందు నిలబడ్తారో చెప్పండి అన్నారు హన్మంతరావు. ‘నేను నిలబడ్తాను కొట్టుకోండి’ అన్నా. సరే ఆయన కొడ్తే దెబ్బతగిలేట్టు కొట్టరు, నేనాయన్ను కొడ్తే దెబ్బతగిలేట్టు కొట్టను, అని మధ్యవర్తిని పెట్టాం. పెడితే ఆయన బలంగా పెట్టి కొట్టేసరికి కాలు వాచిపోయింది. అయినా కళ్ళనీళ్లు రాకూడదుగా! సరే ఈలోగా ఆయన్ని కొట్టబోయే సమయానికి పోలీసులొస్తున్నారని మా నాన్న కబురు చేశారు. హన్మంతరావుని ఎటన్నా పారిపొమ్మని అనేసరికి రానేవచ్చారు, చుట్టుముట్టారు. హన్మంతరావు బెజవాడ నుంచి సైకిల్‌మీద వచ్చారు. సైకిల్‌ బైట వుంది. మేము ఆలోచించకుండా సైకిల్‌ ఎవరిది అంటే నాది అన్న. ఈలోగా దాక్కుంటారేమోనని నా ఆశ. నీదెట్లా అవుతుందని చెప్పేసి, ఆడవాళ్ళు సైకిల్‌ తొక్కుతారేంటీ అన్నారు. ఎందుకు తొక్కనని సైకిలెక్కి నాలుగు రౌండ్లు కొట్టేసరికి, ఈ గొడవలో పైకెక్కి దాక్కుందామనే సరికి ఓ పోలీసు చూశాడు. అరెస్టు చేశాడు, మా నాన్నను కూడా అరెస్టు చేశారు. మోకాలిమీద విపరీతంగా కొట్టారు. ”లంజకొడుకుల్లారా నన్ను కొడతారా” అని పోట్లాడారు మా నాన్న. తర్వాత కడలూరు జైళ్ళో పెట్టారు. దాదాపు మూడువందల మంది అరెస్టు అయ్యారు. వీళ్ళందర్నీ ఏంచెయ్యాలని సమస్య వచ్చింది పిల్లలు, కుటుంబాల గురించి. పార్టీనుంచి డబ్బు తీసుకోకూడదు ఎట్లాగయినా కష్టపడి మనం పనిచేద్దాం అని ఉత్సాహపడ్డాం. ఏం చేద్దామంటే ఏ పనీ చేయడానికి తోచాలా. ఎవరు పెట్టుకుంటారు మనని-ఆడవాళ్ళని, ఒక చోటికెళితే డబ్బాలతికించే కంపెనీ ఒకటుంది, అక్కడ ికెళ్తే ఆ మనుషులు క్రూరంగా కనిపించారు. ఇంక లాభం లేదని చెప్పేసి వచ్చేశాం.

నిర్భంద పరిస్థితులవి. మిలటరీ కాంపులు పెట్టారు. ఎవరి చుట్టం వచ్చినా పోలీసు మనుసబు దగ్గరకెళ్ళి మాచుట్టాలొచ్చారు ఫలానా అని చెప్పటం, ఈ చుట్టాలు కూడ ఫలానా ఊరునుంచి వచ్చాము అని చెప్పాలి. లేకపోతే ఉండటానికి వీల్లేదు. కుటుంబాలను పరామర్శించడం. జైళ్ళో వెళ్ళి పరామర్శించే పరిస్థితులు లేవు. కొంతమందికి కమ్యూనిస్టులంటేనే కలరా, మశూచిలాగా చూచి భయపడిపోవడం అప్పుడే పార్టీలో కొన్ని ఘటనలు జరగడం కొంతమంది ఎగిరిపోడం జరిగినై. ఇక నేనేం ప్లాను వేశానంటే, ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒకాయన పెద్ద బట్టలషాపు పెట్టి నడవకపోతే ఎత్తేయాలని అనుకున్నాడు. మేం నలుగురైదుగురం కలసి, ”ఏమయ్య ఇది ఎత్తేయటం ఎందుకు? ఈ గుడ్డలన్నీ మాకు కొలిచియ్యి, మేం ఊళ్ళమీకెల్లి గుడ్డలమ్ము కొస్తాం.” అయితే ఒక కాంట్రాక్టు ఏంటంటే మీరిచ్చిన దానికి న్యాయంగా రేటు తీసుకో వాలి. మీకొచ్చిన నష్టం ఏదీ లేదుగా! అదిమాత్రం మాకు అట్టిపెట్టి మావాళ్ళు వచ్చినపుడు యివ్వు – పార్టీవాళ్ళు మా అవసరానికింతని వుంచుకొని మిగతది నీ దగ్గరే అట్టేపెడతాం అనిచెప్తే, మొత్తానికి ఆయన సరే అన్నాడు. ఈ బట్టలన్నీ తీసుకెళ్ళాం. కొత్తగా వచ్చిన పాప్లిన్‌ పాంటులు, షర్టులు, చీరలు అన్నీ తీసుకెళ్ళటం దీనికితోడు అప్పుడు కొత్తగా ప్లాస్టిక్‌ గ్లాస్‌లు వచ్చినై. అమ్మాలంటే ఓ ఇంటికి పోవటం, ఆ ఇంట్లో షాపుల్లాగా అందంగా పెట్టడం, అందర్ని రమ్మనడం, వచ్చినపుడు ఎవరో గుడ్డలమ్మడానికి వచ్చారని మునసబుగారికి చెప్పించేది. ఏమండీ మేమంతా ఆడవాళ్ళం, ఏదో నాల్గవక్లాసు వరకు చదివాం ఉద్యోగాలెవ రిస్తారు? మిగతా చోట్లంటే భయం అని చెప్పేది. ”మొగవాళ్ళేమయ్యారంటే” వాళ్ళంతా జబ్బుపడి పోయారండీ ‘ఈమెకు భర్తలేడు’. ఆమె భర్త తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్ళిచేసుకుంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారండీ. వెళ్ళగొడ్తే మిలిట్రీలో చేరాడండీ మావారు. అందుకే ఇట్లా చేస్తున్నామండీ’ అని చెబితే అందరూ నమ్మారు. మొట్టమొదట బాగుందని షర్టుక్లాత్‌ కొన్నారు. మాకు కొలవటం చాతకాలా! ఇట్లా అట్లా అని అయిదు గజాలు పోయింది, నష్టమొచ్చింది. ఇక ఎట్లా అంటే కొలవటం నేర్చుకోండమ్మా అన్నారు. రాత్రి తెల్లవార్లు కొలవటం నేర్చుకున్నాం. ఇంకొక ఇబ్బంది ఏమొచ్చిందంటే ఆడవాళ్ళు యిది బావుంది, అది బావుంది అని తీసుకుంటే, ఆమేం తీసుకుంది, ఈమేం తీసుకుందని చివరికి రెండు మూడు చీరలు మిస్సయ్యేవి. లెక్క సరిగ్గా తెలిసేది కాదు, కన్‌ఫ్యూజన్‌. కొత్తదాంట్లో ప్రవేశించటం కదా? మొత్తానికి ఏదో వంక పెట్టుకుని వెళ్ళడం తర్వాత ఫలానా వాళ్ళు ఎక్కడ వున్నారు, వాళ్ళేం చేస్తున్నారని అర్థరాత్రి మెల్లిగావెళ్ళి వాళ్ళు నిద్రపోయినపుడు అడగటం వాళ్ళకు చెప్పటం ఫరవాలేదు మనకు కూడా మంచిరోజులు వస్తాయి. జైల్‌నుంచి వుత్తరం వచ్చింది. మీరేం భయపడకండి, తెలంగాణా పోరాటమయిపోతే ఇక అప్పుడు మనదే రాజ్యం అని. మళ్ళీ ఏం తెలియనట్టు మూటకట్టుకుని వెళ్ళటం, ఇట్లా మా సేల్స్‌ పెరిగిపోయాయి. వెస్ట్‌ గోదావరి, ఏలూరు ఇవన్నీ వెళ్ళాం. ఇక ఇంతింత పెట్టెలు కట్టాం. బస్సుల్లో వెళ్ళేవాళ్ళం ఫలానా రోజు వస్తున్నామని కబురు పంపితే ఆ టైమ్‌కి వాళ్ళు పాలేర్లని పంపేవాళ్ళు. కావడేసుకొస్తే ఆ కావడిలో మోసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టేవాళ్ళం. నష్టమొస్తేనేం. ఒక విధంగా మనం గొప్పగానే చేస్తున్నాంగదా, అది మన వాళ్ళకి తెలియజెయ్యాలి, ఆంధ్రదేశమంతటా టూరుచెయ్యాలని నిశ్చయించుకున్నాం. రోజు డబ్బులొచ్చేవి అదొక ఆనందముండేది అసలు లెక్కకి అమ్మింది వచ్చిందా లేదా అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత లభోదిభోమని ఏడ్చేది. ఇవి అయిపోయిన తర్వాత రెండో ఊరెళ్ళేటప్పటికి మెళుకువలు తెల్సినై తర్వాత మంచి గుడ్డలు తీసికెళ్ళాం. అదే ఇంతవరకు కొండప్పగారు గజం గుడ్డ సిల్కు, పన్నెండు రూపాయలు అమ్మారు. మేమెళ్ళి ఆరు రూ||లకి అమ్మాం అమ్మేసరికి అట్లా అమ్ముడు పోయాయి. ముండాకొడుకుల్లారా మావాళ్ళొ చ్చారు ఆడవాళ్ళు, ఎంత బాగా అమ్మారు దుప్పట్లు చవకగా ఇచ్చేవారు. మేం వాళ్ళతో చెప్పేవాళ్ళం మెల్లిగా ఆ ఊరికి కబురు చేయండి. ఇట్లా మన గుడ్డల వాళ్ళు వస్తున్నారని, మన పార్టీ కుటుంబాలందరికీ గుడ్డల వాళ్ళు వస్తున్నారంటే మన వాళ్ళు వస్తున్నారని సంతోషం పండగ. మనమంతా వెళ్ళి కొనుక్కోవాలి అని ఆ రకంగా ఆ కుటుంబాలన్నీ ఉత్సాహంగా బైటికి రావడం జరిగేది.

ఒకసారి ఇలాగే ఊరు దిగేసరికి, కర్రలు అవన్నీ పట్టుకుని వున్నారండీ- ”లంజముండల్లారా, ఎవరు మీరు, మేమేదో కష్టపడి ఇన్ని సంవత్సరాల్నుండి కాంట్రాక్ట్‌ యిస్తే అదా మీరు చేసేది? మీరెవరూ, మీదేవూరసలు, మీ సంగతేమిటో అంతుతేలుస్తాం” అనేసరికి మేమొక వుపాయం చేశాం ఎవరో మనని తన్నటానికి వస్తున్నారని సి.ఐ.డి. వాళ్ళు ఎవరో వస్తున్నారని. మేం ఆరుగురం, పేర్లు గుర్తు రావడంలేదు. మాలో ఒకామెను దొడ్డికెళ్ళినట్లుగా కాలువదగ్గరకెళ్ళి అక్కడ్నుంచి పారిపోయి మనవాళ్ళని పాలేర్లని రమ్మని చెప్పి పంపించాం. ఈలోగా నేవెళ్ళి చెప్పాను. ”ఏందయ్యా ఆడవాళ్ళ మీదికొచ్చి గొడవ చేస్తున్నావు. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం మేమేం చేస్తాం! మామొగాళ్ళు సరిగా చూడక మేమే ఏడుస్తూ, పొట్టకోసం మేమేదో చేసుకుంటుంటే. మీరీవిధంగా అంటారేంటీ, ఏమిటీ అన్యాయం” అంటే వాళ్ళేమో మీరు మాకంటే తక్కువెందుకమ్మాలి మీరు మానోట్లో మన్ను పోసారు కదా. అని వాదన పెట్టుకునేసరికి మావాళ్ళు వచ్చారు. వాళ్ళొచ్చే సరికి వీళ్ళు జారుకున్నారు. ఇక ప్రమాదం తప్పించుకున్నాం. ఆవూళ్ళో అమ్మాం. తర్వాత సేల్స్‌ ఎక్కువై పోయినయండీ ఎనిమిది వేల దాకా అమ్మడం మొదలు పెట్టాం. అసలు మనసులో వాళ్ళు జైళ్ళో వున్నారని దిగులు. ఈ బాధలన్నీ ఎపుడు పోతాయని దిగులు అదే పరిస్థితుల్లో చండ్రరాజేశ్వరరావు భార్యనీ, వెల్లంకి అన్నపూర్ణమ్మగారినీ, హనుమాయమ్మ గారినీ, వీళ్ళందర్నీ కాంపులకి తీసుకెళ్ళి చింతబరిగెెల్తో కొడ్తున్నారని వార్తలొచ్చాయి. నాకు దిగులు పట్టుకుంది, ఇన్‌డైరెక్టుగా వుత్తరం రాశాం జైలుకి ఏమనంటే, ఇక్కడ ఎండలు బాగా తీవ్రంగా వున్నాయి భరించలేనంత. ప్రయాణాలు చేస్తుంటే చాలా అవాంతరాలెదురుకోవాల్సి వస్తుంది. అనేకచోట్ల స్పృహతప్పి పోయే పరిస్థితులు. అంటే ఇవన్నీ అర్థం చేసుకుంటారు కదా! ఊళ్ళో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. గుంపులు గుంపులుగా పక్షులు వచ్చి ఈ పంటలన్నీ తినిపోయి మహాకష్టాలొచ్చేసి వాళ్ళేడుస్తున్నారు. ఎక్కడ చూసినా సంతోషం లేదు. ఈ గుడ్డలమ్మాలంటే పట్టుకుని తంతారేమో, ఇప్పుడు ఏం చేయాలో మాకేం తోచటం లేదని రాశాం. రాస్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. మాకు రాశారు ‘మీరింత వరకు చేసిన పని చాలా సంతోషం. మీరిక గుడ్డలమ్మటం మానేయండి ఇంకొక విధంగా ఆలోచించండి’ అన్నారు.

ఏం చేయాలని ఆలోచించి ఆచివర గుంటూర్నుంచి వస్తుంటే అక్కడొక పెద్ద బొగ్గు ఫ్యాక్టరీ కట్టారు. అక్కడ రాక్షస బొగ్గు అంతా పౌడర్‌ చేసి పెడ్తారు అందులో చాలామంది ఆడవాళ్ళు పనిచేస్తారు. మావాళ్ళతో నేనన్నాను- ఇక్కడి ఆడవాళ్ళతో కల్సి పనిచేస్తే ఏదన్నా ఉపయోగముం టుందేమో! మరి వూర్కెనే వుంటే మనవెంబడే సి.ఐ.డి.లు, కాంగ్రెసు వాళ్ళు కూడా వుంటారు. ఆ వలయప్పన్‌ రిపోర్టులో కూడా ఇదే రాశారు. ”ఆమె ఎప్పుడూ కూడా రాజకీయాల్లో లేదు. ఏదో, అదీ ఇదీ జీవితం అనుకుంటూ తిరిగింది. దప్పితే ఫోర్‌ఫ్రంట్‌లో, రాజకీయ రంగంలో తిరిగింది.” అక్కడ చాలామంది పనిచేస్తారు. అక్కడికెళ్ళాం వెళ్తే అక్కడ ఒక ఆంగ్లో ఇండియన్‌ ఆఫీసర్‌ మేనేజరుగా వున్నాడు. మేం కూడా ఏంచేశామంటే, కొంచెం నేతచీరలు కట్టుకుని వెళ్ళాం. మమ్మల్ని చూసి వీళ్ళేదో నైసు వాళ్ళుంటారని, మాలో ఇంకో ముగ్గురు నల్లగా వుంటారు. అచ్చం కార్మికుల్లా వుంటారు. వాళ్ళని ముందు పెట్టి మేం వెనకాల వుంటే చేర్చుకున్నారు. అక్కడ మేస్త్రీని పట్టుకున్నాం. ”నీకు పుణ్యముం టుంది” అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ ఆ రాక్షసి బొగ్గు రెండు తట్టలు మోసేసరికి, తలనెప్పి, ఒళ్ళంతా మంటలు పెట్టడం ప్రారంభించింది ‘అక్కా నీకు దండం పెడ్తా’, నేనీ పనిచేయనమ్మా అంటే మాట్లాడకు. ఈ రెండు రోజులు చేయి అని నేను కాస్త హుషారు చేయడం, ఆడవాళ్ళందర్నీ కూర్చోబెట్టి మాట్లాడటం- వాళ్ళు మాకు అట్లా దగ్గరయ్యారు. ”అమ్మా మీరింత సుకుమారులుగా కనపడుతున్నారు. మీరేం చేస్తారు, ఆ ముండాకొడుకులు చూడు, దబాయించి సిగరెట్లు తాక్కుంటూ, బీడీలు తాక్కుంటూ కూర్చున్నారు. అన్యాయం చేస్తున్నారు” అనే వాళ్ళు. తర్వాత మేమేం చేశామంటే, అక్కడున్న మగవాళ్ళతో దెబ్బలాట పెట్టుకున్నాం, చెరి సమానంగా చేస్తేనే మేం చేస్తాం అని గొడవ పెట్టాం. అది మేనేజరు దాకా పోయింది. ఎవరో మరి కొత్త వాళ్ళుచేరి పనికి కుంపటి పెట్టారు. పనిచేయనంటున్నారండీ అనేసరికి మేనేజరు పిలిచారు. రోజుకి మగవాళ్ళకైతే ఎనిమిది రూపాయలు, ఆడవాళ్ళకి అయిదు రూపాయలు యిచ్చేవారు. సాయంత్రం దాకా మొయ్యాలి కదా. నాకైతే జుట్టంతా వూడిపోయింది. మేనేజరుకి తెలుగు సరిగ్గా రాదు. పిల్చి తర్వాత బూతులు తిడ్తున్నారు నేనూరుకోవాలి కదా. (గోచీ కట్టుకునే దాన్ని) ”ఇది చాలా పార్షియాలిటీగా వుంది, అన్‌జస్టిస్‌ అన్నా” కోపంగా, అప్పటిదాకా చూడనివాడు నన్ను చూశాడు. వెంటనే వెళ్ళిపొమ్మన్నాడు. నాకొక్కోసారి ఏడుపు వచ్చేది. పాతిక రూపాయలు జీతం తీసుకొచ్చి హాయిగా కడుపునిండా తిందామంటే… ఆరోజు పిల్లల మరీ ఏడ్చేసరికి, నాకూ ఏడుపొచ్చేది-సరే వీళ్ళు అడిగేసరికి ఎవరు నిజం చెప్తారో అని ఇక్కడ ఏం కథ చెప్పాలా అని కళ్ళంబటి నీళ్ళు వస్తే తుడుచుకున్నాను. ‘అమ్మా నిన్ను చూస్తుంటే నాకు మదర్‌ గుర్తొస్తుంది. నీవేం భయపడొద్దు. నా ఆక్చ్యువల్‌ పొజీషన్‌ చెప్పాలి నాకు. అయామ్‌ వెరీ యింట్రెస్టెడ్‌” అన్నాడు. దొరికిందేదో కాస్త ఆధారం అనుకున్న, తర్వాత నేనిదే కథ చెప్పా. ఏంలేదు నాకిష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నారు మావారు. అందుకని మిల్ట్రీలో వెళ్ళిపోయారు. ఎందుకనో ఏమో ఈ మధ్య రెండు, మూడు సంవత్సరాలు అయ్యింది, లెటర్స్‌ లేవు- ఇంకోకామెనేమో ”నా భర్త దీర్ఘరోగయి పోయాడు. సంపాదించే వాళ్ళులేరు” అని. సరే ఇవన్నీ చెప్పిన తర్వాత బైటకొచ్చారు, అనౌన్స్‌ చేశారు. ఈ నర్సమ్మ మేస్త్రీ మగవాళ్ళకీ, ఆడవాళ్ళకీ అని చెప్పేశాడు. రెండు నెలలు పనిచేశాం. ఎంత హాయిగా వుందో!

ఇక అందరూ కూడా ఇంటర్వూలకెళ్ళి మనవాళ్ళు ఉద్యోగాలు సంపాదించారండీ. మామూలుగానే సాఫీగానే వుంది. మంచిపేరు సంపాదించారు. మేస్త్రీలయ్యారు అని చెప్పారు. కాకాని వెంకటరత్నం గారు కాంగ్రెస్‌. ఆయనంటే సింహం అన్నమాట కృష్ణా జిల్లాలో మొత్తానికి. ఈమగ వాళ్ళందరికి, ”వీళ్ళెవరసలు నిన్నగాక మొన్నొచ్చి మన నెత్తికెక్కి ఇవ్వాళ మేస్త్రీలయ్యారు, వీళ్ళసంగతి తేల్చుకోవాలని” ఆచూకి తీశారు. అప్పుడు మ్యూనిస్టులమని బైటపడింది. మేమేదో ధీమాగా ఏడిపించబోయాంగానీ, మన వెంట వాళ్ళొస్తున్నారు. చూస్తున్నారు సి.ఐ.డి. ల్లాగా, మన బతుకు బైటపడ్తుందనే ఆలోచన మాకు రాలా. ఫలానా మోటూరు హన్మంతరావు భార్య అని వాళ్ళు వీళ్ళు కాంగ్రెసుకి రిపోర్టు చేశారు. పంపించారు. ”వాళ్ళంతా కమ్యూనిస్టులు. చాలా దుర్మార్గులు దేశానికి, ఫ్యాక్టరీ కూడా నాశనం అయిపోతుంది, వెంటనే వాళ్ళని ఊస్టింగ్‌ చేయాలి” అని వెంటనే పంపించేశారు. ఏడుస్తూ ఇంటికొచ్చామో లేదో, ఓ కుర్రాడు నా వెనకే వచ్చి ”అమ్మా నీవేపని చేయొద్దు, మీనల్గురికి జీతం నేనిస్తా ఐదువందల రూపాయలు” అని తీసుకొచ్చి యిచ్చాడు. ఇస్తే మాకు డబ్బు వద్దు ప్రజల్లో వెళ్తే నెత్తిన బెట్టుకుని పూజిస్తారయ్యా, మేం కష్టపడి పనిచెయ్యాలి. ప్రజలకు, ఏదో ఒకరకంగా వుపయోగ పడాలి డబ్బు అఖ్కర్లేదని ఇట్లా విసిరేస్తే రోడ్డు మీద పడ్తే పాపం ఏరుకుని వెళ్ళిపోయాడు. ఆ వుద్యోగం అట్లా పోయింది. ఇంకేం చేయాలని యిట్లానే నానా అవస్థలూ పడ్డాం. ఇంత వెల్‌నోన్‌ అయి, కమ్యూనిస్టులమని బైటపడిన తర్వాత యింక కుదరదు. ఏం చేద్దాం, అనుకుని అక్కడొక పళ్ళపొడి ఫ్యాక్టరీ వుంటే ప్యాకెట్లు చేయటానికి ఒప్పుకున్నాం. ఇక బైట చెయ్యడం కుదరదని, హాయిగా యింటి దగ్గర వీళ్ళు చేయడం, నేను సైకిలు మీద అయిదారు ట్రిప్పులు యివన్నీ మోసుకెళ్ళడం, వాడికివ్వటం మాకప్పుడు పేచీలు రాలేదు. గుడ్డలవాడికేం తెగులు పుడ్తుందో డబ్బు వాడి దగ్గరుంచుతే ఎక్కువ తక్కువ అని యిక గుడ్డల వాడి దగ్గరకెళ్ళి మాకు 10% యిస్తానన్నావు మా డబ్బులు మాకియ్యి, మేం మిగుల్చుకున్నాం కదా అంటే అసలేం మిగల్లేదు, అంతా మీరే ఖర్చు పెట్టుకున్నారు, మేం నష్టానికిచ్చాం అని చెప్పేసి మూడువేలేమో యిచ్చారు. మేం మూడువేలు తీసుకుని యింటికి వచ్చేసరికి మనవాళ్ళు రిలీజ్‌ అవుతున్నారండీ. ఆయన వచ్చారు, వస్తే అండర్‌ గ్రౌండ్‌లో వున్న నాయకుల్ని కల్సుకోవాలి అన్నారు. వాళ్ళ దగ్గర దమ్మిడీ లేదు. అప్పుడు మా డబ్బులే యిచ్చాం. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆ విధంగా చేశాం. అప్పుడు కడలూరు జైళ్ళో వున్నపుడు ఈ ఆంధ్రదేశాన్నుంచి అందర్నీ తీసికెళ్ళే బాధ్యత మాకే యిచ్చారు. యాభై మందిమి వెళ్ళాం. అక్కడ మనభాష కాదండీ, అరవం. అక్కడ ఒక సత్రం వుండేది. ఆ సత్రంలో వుండేవాళ్ళం. వాళ్ళని చూస్తే చాలా భయంకరంగా వుండేది. అసలు ఆంధ్రవాళ్ళు వస్తున్నారంటే అందర్నీ దోచుకునే వాళ్ళు… మావెంట వీళ్ళిద్దరూ చాలా చిన్నవయసు వాళ్ళు, దాదాపు పద్దెనిమిది, యిరవై ఏళ్ళు. పాపం చాలామంది కొత్తగా పెళ్ళయినవాళ్ళు. వీళ్ళను సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళాలంటే, ఇక వాళ్ళ వూహలు- ఈ చీర చూపించాలనో, ఈ నగలు చూపించా లనో, చాలా ఎఫెక్షన్‌తో, ఇహ వీళ్ళందర్నీ నేనొద్దంటే వినేవాళ్ళు కారు. ఈ నగలన్నీ పెట్టుకుని వచ్చేవాళ్ళు. డేంజరండీ అంటే వినేవాళ్ళు కారు. మా అమ్మాయి తాన్యా తొమ్మిదేళ్ళప్పుడు, తనకి అరవం వచ్చు. అమ్మా మన గురించే చెప్పుకుంటున్నారే అని చెప్పింది. మాకు అయిదురూములిచ్చారు. అందరికీ హడల్‌ పుట్టింది. ఈ నగలన్నీ తీసి నాకిచ్చి, అక్కా ఏమైనా కానీ అందరం ఈ గదిలోనే వుందాం అన్నారు. తలుపులు వేసుకుని పడుకున్నాం. ఆరుగంటలకి స్నానాలు చేసి గుర్రపుబండి ఎక్కి పోవాలి. నిజంగా ఈ విషయాలు సినిమాలు తీయొచ్చు.

ఆ పేర్లు లిస్ట్‌ అన్నీ హనుమంతరావు దగ్గరున్నాయి. నాకంత సరిగ్గా జ్ఞాపకంలేదు. తెల్లవార్లు నిద్రపట్టలా. వాళ్ళను చూస్తాం, చూస్తాం అని రెండోది బైట పరిస్థితులన్నీ వాళ్ళకందజేయటం వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళకందజేయటం, యిదీ మా బాధ్యత. పట్టుపడకుండా వాళ్ళకందజేయాలికదా! ఇక మనవాళ్ళని వాళ్ళ మేకప్పులు చూస్తే నాకు ఏడుపు ఆగేదికాదు. బిడ్డపుట్టాక తండ్రి చూళ్ళేదు, చూపించాలంటే బిడ్డను ముస్తాబు చేయటం, ఇంటర్వ్యూ యిచ్చే లోపల చెట్టుకింద దువ్వుకోవటం, నానా బాధ. నేనేది రాయాల్సివచ్చినా లెటర్‌గా రాసే దాన్ని కాదు. గేయంగా రాయటం యిష్టం. ఆ జైలరు వాడికి కొత్తగా పెళ్ళయ్యింది. ఆ భార్యాభర్తలు ఈ వుత్తరాలన్నీ చదివి, అనుభవించిన తర్వాత కానీ యిచ్చేవారు కాదు. అందరి వుత్తరాలు యిచ్చేవారు కానీ హనుమంతరావు వుత్తరాలు యిచ్చేవారు కాదు. ఆ పొలిటికల్‌ సిచ్యువేషన్‌లో ఒక వుత్సాహం వుండేది. హనుమంతరావుగారు శ్రీశ్రీ పుస్తకం ఒకటి వేశారు. కవిత్వాన్ని గురించి వ్యాసం బుక్‌ రూపంలో తీశారు చలసాని ప్రసాద్‌. ఆ బుక్‌ హనుమంతరావు గారికే అంకితం చేశారు. నేను రాసిన గేయాలు చాలా వున్నాయి. కడలూరు జైలు నివాసీ, ఉదయ హృదయ నివాసీ అని వుత్తరం రాశానన్నమాట. ఆ వుత్తరం మన నాయకులు చదివి, అసలు అందరూ వుత్సాహపడాలని మొత్తం జైలంతా చదివే వాళ్ళండీ నా వుత్తరాలు. అందుకని ఈ జైలరు ఉదయం అంటే ఎట్లా వుంటుందీ అని యింకో విధంగా వూహించుకున్నారు. ”అమ్మా నీ వుత్తరాలవల్ల మేం ఎంతో ఎఫెక్షన్‌తో దగ్గరయ్యాం. కాబట్టి నీవు మాయింటికన్నా రావాలి, లేకపోతే మీకు స్పెషల్‌ రూమ్‌ యిప్పిస్తా” అని ఎంతో యిదిగా అవకాశమిస్తానన్నాడు. ఓరీ లమ్డీకొడుకా! వాళ్ళిద్దర్నీ తీసుకొస్తే నాకొక్క దానికే ఇస్తానంటావేంటీ, అక్లర్లేదు అన్నాను. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్‌ అయినవాళ్ళు అప్‌సెట్‌ అయిపోయేవారు. మూడునెల్లో, ఆరునెల్లో నిద్రపోలేదట, జబ్బు కూడా వచ్చేది, ఇంక అందరూ ఒక హాల్‌లో ఇంటర్వ్యూ చేయాలి. మూలల కోసం దెబ్బలాట! ఎవరికి మూల దొరికుతే వాడిది అదృష్టం. ఏనాడు పూజలు చేసుకుంటే ఆ అమ్మాయికి ఆ మూల దొరకవచ్చు! నిజంగా ఎట్లా వుండేదో అప్పటి లైఫ్‌.

(మనకు తెలియని మన చరిత్ర నుండి)

ఇంకావుంది.

 

 

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో