తెలుగు సినిమా స్వర్ణయుగంలో మెరిసిన సువర్ణ సుందరి – మహానటి అంజలీదేవి

– ఇంద్రగంటి జానకీబాల

నటనైనా, నాట్యమైనా, గానమైనా, కవిత్వమైనా, ఏ కళైనా, కళాకారుని (కళాకారిణి) స్వభావంలోంచి, పుట్టుకతో వచ్చిన వాసన వల్లే సమకూరుతుంది. అలా అబ్బిన కళకి కృషివల్ల మెరుగులు దిద్దుకుని మెలకువలు నేర్చుకుని కొందరు సాటిలేని మేటి కళాకారులుగా తమని తాము తీర్చిదిద్దుకుంటారు. కళారంగాన్ని వెలుగులతో నింపి ప్రేక్షకుల్ని, పాఠకుల్ని శ్రోతల్ని అభిమానులుగా పొందుతారు.

తెలుగు సినిమా తొలిదశలో వున్నప్పుడే సినిమా రంగప్రవేశం చేసి తన నటనతో, తన సంస్థ నిర్మించిన సినిమాలతో ఆంధ్రుల నుర్రూతలూగించిన మహానటి అంజలీదేవి.

పదేళ్ళవయసులోనే ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితా స్యుడు పాత్ర పోషించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసిన అంజనీ కుమారి 1927లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుట్టారు.

ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడి వేషం కట్టి తన నటజీవితాన్ని ప్రారంభించిన అంజనీ కుమారి సినీరంగ ప్రవేశం తరువాతనే అంజలీదేవిగా మారారు.

కాకినాడలో పి. ఆదినారాయణరావు ఆధ్వర్యంలో నడుస్తున్న యంగ్‌మెన్‌ హ్యాపీక్లబ్‌లో ఆమెని తల్లిదండ్రులు చేర్పించగా అక్కడ నటనా, నాట్యం నేర్చుకున్నారు. ఆదినారాయణరావు దర్శకత్వం వహించిన ఎన్నో నాటకాల్లో నటించి, నటనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. మళ్లీ పెద్దాపురం వచ్చేసి డా|| సన్యాసి రాజుగారు నిర్వహించే వాణీ నాట్యమండలిలో చేరి ఎన్నో నాటకాలు వేశారు. ఇది సామర్లకోటలో వుండేది. 1941లో మద్రాసులో జరిగిన ఆంధ్రనాటక కళాపరిషత్‌లో ‘ఆంధ్రశ్రీ’ నాటకంలో మాంచాల పాత్రకు ఉత్తమనటి బహుమతి అందుకున్నారు. అప్పటికామె వయసు పద్నాలుగేళ్ళు మాత్రమే. పిట్టకొంచెం కూత ఘనం అనే చందాన ఆమె నటనా చాతుర్యం ప్రదర్శించేవారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేమరాజు నాటకంలోనూ మంచిపేరు సంపాదించుకున్నారు అంజలీదేవి.

నెమ్మదిగా ఆమె స్వతంత్రంగా, విడిగా నాట్య ప్రదర్శన లివ్వడం మొదలు పెట్టారు.

విశాఖపట్నంలో 1943 డిశంబరులో ఆమె నాట్యప్రదర్శన చూసిన గవర్నర్‌ సర్‌ ఆర్థర్‌ హోప్‌ దంపతులు ఎంతగానో ప్రశంసించారు.

ఇంతలో ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో టి. సుబ్రహ్మణ్య శాస్త్రి ‘మేనకోడలు’ అనే చిత్రం నిర్మించే వుద్దేశంతో ఆమెను బొంబాయి పిలిపించుకున్నారు. ఆమె తండ్రిగారితో కలిసి వెళ్ళి అక్కడ రెండు నెలలు అవకాశం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేశారు. అయితే ఎంతకీ ఆ సినిమా నిర్మాణం గురించి తేలకపోవడం, వాళ్ళు వీళ్ళని పట్టించుకోకపోవడం, షూటింగ్‌లాంటిదేమీ మొదలు పెట్టకపోవటం వల్ల, విసుగుచెంది మళ్లీ స్వస్థలానికి వచ్చేశారు.

బొంబాయిలో అల్లర్లు చెలరేగడం, ప్రాణభయం పట్టుకోవడంతో రైలు చార్జీలకి డబ్బుల్లేకపోతే చేతిగాజులమ్మేసి వచ్చేశారు. ఆ సమయంలోనే ఆదినారాయణరావు గారు ఆమెను వెతుక్కుంటూ వచ్చి, కాకినాడలోని యంగ్‌మెన్‌ హ్యాపీక్లబ్‌లో నెలకి వంద రూపాయలు జీతంతో ఆమెను ఆర్టిస్టుగా నియమించారు.

అప్పట్నించి ఆదినారాయణరావు అంజలీదేవి కోసం ప్రత్యేకంగా డ్యాన్సులు తయారుచేసి ప్రదర్శనలిచ్చేవారు. పాటలతో వ్రాసిన ‘వీధి గాయకులు’ నాటకం బాగా రాణించి, గొప్ప పేరొచ్చింది. పాప్యులర్‌ అయింది.

ఆ సమయంలోనే అంజలీదేవి, ఆదినారాయణ రావూ, బాగా సన్నిహితులయ్యారు. అందరూ వారి గురించి కొంత మాట్లాడుకుంటున్న సమయంలోనే ఇద్దరూ ఒక నిర్ణయానికొచ్చి వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆదినారాయణరావుకి భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు.

‘వీధి గాయకులు’ నాటకంలో ఆమె నాట్యం చూసిన చిత్తజల్లు పుల్లయ్య తాను తీయబోయే ‘గొల్లభామ’ కోసం ఆమెను తీసుకున్నారు. అప్పట్లో నాటకాలలో నటించేవారైనా సినిమాల్లోకి రావడానికి ఆలోచించేవారు. ముఖ్యంగా వయసులో వున్న చిన్న పిల్లల్ని సినిమా పరిశ్రమలోనికి పంపడానికి తల్లిదండ్రులు భయపడేవారు. సినిమా గౌరవప్రదమైనది కాదని వారు విశ్వసించే వారు. అందువల్ల అంజలీదేవి తండ్రి కూడా ఎంతో ఆలోచించారు. చివరికి అంగీకరించారు.

గొల్లభామ (1947) చిత్రంలో అంజలీదేవి ఒక ప్రతినాయిక పాత్ర పోషించారు. అయితే మొదట్లో ఆమెని చూసి చాలా పొట్టిగా వుందని అందరూ చెవులు కొరుక్కున్నారు. కొందరైతే యాక్టివ్‌గా లేదు ఈ పిల్లేం నటిస్తుందీ అంటూ పెదవి విరిచారు. అయితే వాళ్లందరూ ఆమెని తెరమీద చూసి ముక్కున వేలేసుకున్నారు. అందులో మోహిని పాత్రను తిరుగులేని విధంగా చేశారు అంజలి.

అంజలీదేవి మొదట్నించీ తన అందంతో ఆకర్షించటం కాకుండా కేవలం నటనాచాతుర్యంతోనే అందర్నీ ముగ్దుల్ని చేసేవారు.

బాలరాజు (1948) లో ఆమె ఒక యక్షిణిగా భూలోకానికి వచ్చి, తన ప్రియునితో స్వేచ్ఛగా, విలాసంగా గడుపుతున్న సమయంలో, ఆమెకు ఇంద్రసభనుంచి పిలుపు వస్తుంది. ఎందుకూ అంటే ఆ సభలో ఆమె నాట్యం చేయవలసిందిగా ఇంద్రుని ఆజ్ఞ. ఆమె ఇంద్రుని ఆజ్ఞను తిరస్కరిస్తుంది. ఆత్మాభిమానంతో, పౌరుషంగా తూలనాడుతుంది. ఇంద్రుని కోపానికి, ఆగ్రహానికి గురై, శాపంతో భూమిమీద మానవ కాంతగా పుట్టి ప్రేమకోసం తపిస్తుంది-. అయితే ఇందులో యక్షిణిగా అంజలీదేవి నటిస్తారు. మరుజన్మలో మానవకాంతగా ఎస్‌. వరలక్ష్మి చేశారు-.

యక్షిణిగా నాట్యం చేస్తూ, పూలవనంలో తన ప్రియుని ప్రేమలో ఓలలాడుతూ ఆమె పాడుతూ నాట్యం చేసే పాట చాలా బాగుంటుంది.

ఈ తీయని వెన్నెల రేయి- ఎడబాయెని చిన్నెల హాయి

ఓ రస పాయీ –

కదలికే కడుహాయి – నటనమే బ్రతుకోయీ -.

ఈ పాట అప్పట్లో వర్ధమాన గాయని వక్కలంక సరళ పాడారు. అంజలీదేవి నాట్యం – సరళగారి గొంతులోని హొయలు సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన మాట నిజం.

ఈ సన్నివేశంలో అంజలీదేవి నటనకి మంచి గుర్తింపు వచ్చింది. మొదట్నించీ, భర్త ఆదినారాయణరావు సంగీత సారధ్యంలో నాట్యం చేయడానికి శిక్షణ పొందిన అంజలి, ఈ పాటకి ప్రాణం పోశారు. అంజలీదేవి గొప్ప మనసు గురించి ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి-.

ఆ సన్నివేశం అంతగా రాణించడానికి సరళ పాడిన పాట, అందులో ఆమె చూపించిన నైపుణ్యం గుర్తించి, ఆమెతో తన స్నేహాన్ని పురస్కరించుకుని ఒక వజ్రపుటుంగరం కొని సరళకి బహుకరించిన గొప్ప స్నేహశీలి అంజలీదేవి.

వాహినీ వారు ‘కీలు గుర్రం’ నిర్మించాలనుకున్నప్పుడు అంజలీదేవికి అందులో ‘వ్యాంప్‌’ పాత్రే వచ్చింది. ఆమె సందేహంలో పడ్డార్ట. సినిమా పరిశ్రమ విచిత్రంగా వుంటుంది. ఒకసారి వ్యాంప్‌ వేస్తే, ఇంక అదే ఆఫర్‌ చేస్తారు. హాస్యం చేస్తే, హాస్యానికే ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఏడుపు పాత్రవేస్తే- ఇంకెప్పుడూ ఏడుపే. ఇదే ఒక ముద్రవేయడం అని చెప్పుకోవచ్చు. ఇదే భయం అంజలీదేవికి కలిగి వుండవచ్చు. అందుకే ఆమె సంధిగ్దంలో పడ్డారు. అప్పుడామె తన మిత్రురాలైన సి. కృష్ణవేణి గార్ని సలహా అడిగార్ట.

”అక్కా! ఇంత దుష్టపాత్ర వేస్తే, నాకుండే ఇమేజ్‌ ఏంకావాలి” అని సందేహం వ్యక్తపరచార్ట. అప్పుడామె ”లేదమ్మా! అది నటనాశక్తిని నిరూపించుకునే పాత్ర. తప్పక చెయ్యి. ఏ పాత్ర వచ్చినా, దాని స్వభావం అర్థం చేసుకుని, అంకితభావంతో చెయ్యాలి. అప్పుడే నీకు గుర్తింపు వస్తుంది” అని సలహాయిచ్చి ప్రోత్సహించారు.

అంజలీదేవి అక్షరాలా అదే చేశారు. అంజలీదేవికి కీలుగుర్రం లో వచ్చిన పేరు అంతా ఇంతా అని చెప్పడానికి వీల్లేదు.

1950లో ఆమె ప్రతిభా వారి ‘స్వప్న సుందరి’ లో అందాలు చిందించే దేవకన్యలా అంధ్రుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ స్వప్నసుందరి గొప్ప సంగీతం గల సినిమా. దీనికి సంగీతం సి.ఆర్‌. సుబ్బరామన్‌ సమకూర్చగా, అత్యంత మధురంగా రావు బాలసరస్వతీదేవి అంజలికి ప్లేబ్యాక్‌ పాడారు.

ఇదొక జానపద కథ. దేవలోకం నుండి భూలోకానికి వచ్చి, ఇక్కడి రాజకుమారుడ్ని ప్రేమించిన ప్రేమికురాలి కథ. మాయలు, మంత్రాలు – మంచి తనాలు, శౌర్యాలు – యుద్ధాలు, ప్రేమగీతాలు – ప్రేక్షకుల్ని వేరే లోకాలకి తీసుకెళ్ళిన చిత్రమిది. ఇందులో నాయికగా అంజలీదేవి చక్కని నటన ప్రదర్శించారు. ఆమె సరసన అక్కినేని నాగేశ్వరరావు అందాల రాకుమారుడిగా ఆడవాళ్ళ హృదయాల్ని దోచుకున్నారు.

1950 లోనే చలాకీ పిల్లగా ‘పల్లెటూరి పిల్ల’ నటించీ, మహాసాధ్వి, అత్తగారి ఆరళ్ళని నోరెత్తకుండా భరించిన అమాయకురాలిగా, భర్త నిరాదరణకు గురైన దురదృష్టవంతురాలిగా ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ లో నటించారు. ఏ పాత్రకి ఆ పాత్రే ఆమెని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. ఆమె పాత్రని అర్థం చేసుకున్న తీరే చాలా అపురూప లక్షణం ఆమెలో, ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ సినిమా పెద్ద హిట్‌ కాకపోయినా అంజలీదేవికి మంచి పేరొచ్చింది. ఏ పాత్రైనా అంజలీదేవి చేసెయ్యగలరనీ, ఆమె నటించిన పాత్రను ఆంధ్రులు అభిమానించి ఆదరిస్తారని తేలిపోయింది.

1953లో ‘పక్కింటమ్మాయి’ చిత్రంలో ఆమె చలాకీతనంతో చలంతమాడేశారు. ఇది హీరో అంటూ లేకుండా హాస్యనటులైన రేలంగి వెంకట్రామయ్య హీరోగా చేసిన సినిమా- ఇందులో అంజలీదేవి చాలా చక్కగా చమత్కారంగా నటించారు.

ఆమె హీరోయిన్‌గా స్థిరపడుతూనే అంజలీ పిక్చర్స్‌ సంస్థని నెలకొల్పి, సినిమాలు సొంతంగా తీసే ప్రయత్నం మొదలు పెట్టారు. 1953లో తన సొంత బేనర్‌మీద, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో ‘పరదేశి’ సినిమా రూపొందించారు. అది కూడా తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ ఏకకాలంలో నిర్మించారు. అందులో తమిళ నటులు శివాజీ గణేశన్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు- అంతక్రితం అక్కినేని గోపాలరావు అనే మేకప్‌మ్యాన్‌తో కలిసి అశ్వినీ పిక్చర్స్‌ సంస్థ ద్వారా ‘మాయలమారి’ సినిమా నిర్మించినా, ఆ సంస్థ అంతటితో ఆగిపోయింది. అప్పుడు అంజలీదేవి తన సొంత పేరు మీద అంజలీ పిక్చర్స్‌ స్థాపించి, మొదటి సినిమా ‘పరదేశి’ తీశారు. అంజలీ పిక్చర్స్‌కి ఎప్పుడూ అక్కినేని నాగేశ్వరరావు గారే హీరో- అప్పట్లో అంజలీ, నాగేశ్వరరావు పెద్ద హిట్‌ జంట. ‘పరదేశి’ సినిమాకి ఎన్నో టెక్నికల్‌ హంగులు కూడా ఏర్పరచుకున్నారు. వి. శాంతారాం వద్ద వున్న ప్రత్యేక కెమెరా తెప్పించి స్లోమోషన్‌ ప్రయోగం చేశారు. చిత్రం హిట్‌ అయింది. ఏ.వి.యం. వారి ‘సంఘం’ సినిమాలో అంజలి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంజలీ పిక్చర్స్‌ రెండో చిత్రంగా (1955లో) ‘అనార్కలి’ ని తీశారు. దీనికి దర్శకత్వం వేదాంతం రాఘవయ్య వహించారు. అంజలీ పిక్చర్సుకి అంజలీదేవి హీరోయిన్‌- ఆదినారాయణరావు సంగీత దర్శకులు అనేది మళ్ళీ చెప్పుకోవాల్సిన పనిలేదు-.

ఈ ‘అనార్కలి’ చిత్ర విజయం అనూహ్యమైన రికార్డును సృష్టించింది. ఇందులో అంజలి నటనకు అందరూ ముగ్ధులయ్యారు-. అందులో ‘జీవితమే సఫలమూ’ రాజశేఖరా నీపై మోజుతీర లేదురా – రావోయి సఖా’ లాంటి పాటలు ఇంటింటా మారుమ్రోగిపోయాయి.

అదేకాలంలో విడుదలైన జయసింహ, అన్నదాత, చరణదాసి, ఇలవేల్పు- ఆమెలోని బహుముఖ నటనా ప్రతిభను చాటిచెప్పాయి.

చరణదాసి, ఇలవేల్పు సినిమాల్లోని సాత్వికత్వం- ‘జయసింహ’లో కథానాయకుడ్ని గుడ్డిగా ప్రేమించి అతడ్ని దక్కించుకోవాలని ప్లే చేసిన చిన్న స్వార్థం దానికి మూల్యంగా ఆమె ప్రాణాలు ఒడ్డి అతడ్ని కాపాడిన తీరు గొప్పగా రాణించాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ వహిదారెహమాన్‌ అయినా- ఇందులో ప్రధాన భూమిక అంజలీదేవిదే.

1957 తర్వాత ఆమె చేసిన సినిమాలు పాండురంగ మహత్యం, సతీ అనసూయ, చెంచులక్ష్మి ఆమెకెంతో పేరు తేవడమే కాదు ఆమెను ఒక్కొక్క మెట్టూ పైకి తీసుకెళ్ళాయి.

సతీ అనసూయలో ముగ్గురు దేవతల్నీ ఆమె పసిపాపల్ని చేసి ఉయ్యాలలో ఊపిన సన్నివేశం అందర్నీ ఎంతగానో అలరించింది.

చెంచులక్ష్మిలో చెంచిత చలాకీతనం – పక్కనే మహాలక్ష్మిగా దుఃఖపడటం గొప్పగా చేసి ఒప్పించారు అంజలి.

నీతి, నిజాయితీ, ఓర్పు, సహనం, ధర్మం, సేవాదానం, భక్తీ లాంటి భావాల్ని ప్రకటించాలంటే అది ఒక అంజలీదేవికే సాధ్యమవుతుందని అందరూ విశ్వసించారు.

అయితే 1957లో అంజలీ పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘సువర్ణసుందరి’ ఆమె లావణ్యానికి, నటనకి ఒక గీటురాయిగా మిగిలింది – ఆమె నటనతోబాటు ఆమె వాచకం కూడా బాగా స్పష్టంగా, సహజంగా వుండటం అందర్నీ ఆకర్షిస్తుంది. అది గ్రాంధికమైనా, వ్యవహారికమైనా, జానపదమైనా ఆమె డిక్షన్‌ అద్భుతంగా వుండి తీరవలసిందే-

సువర్ణసుందరి ఇంద్రుని సభలో నాట్యకత్తె. భూలోకంలోని రాజకుమారుడ్ని ప్రేమిస్తుంది. అతనికి ఒక వేణువు యిచ్చి, వేణువు వాయిస్తూ తనని పిలిచినప్పుడు వస్తానని వాగ్దానం చేసి వెళ్తుంది. ఆమె ఎడబాటు సహించలేని ప్రియుడు ఆమెను ఇంద్రసభలో నాట్యం చేసే సమయంలో వేణువూది పిలుస్తాడు. ఇదీ ఒక జానపద కథే-, కానీ అది సినిమాగా మలచిన తీరు, దానికి సమకూరిన సంగీతం నభూతో నభవిష్యతి అన్నట్లు కుదిరాయి. ఇందులో హీరో అక్కినేని నాగేశ్వర్రావు.

ఆమధ్య ఆయన మాట్లాడుతూ- ‘సువర్ణ సుందరి’ మళ్ళీ తీయాలనే ఊహల్ని తోసిపుచ్చుతూ-,

”ఏదైనా తీసుకురాగలరేమో గానీ, ఆనాటి ఆ సంగీతాన్ని మళ్ళీ తీసుకురావడం ఎవరి తరమూ కాదు” అన్నారు ఈ సినిమాకి సంగీతం కూర్చిన పి. ఆదినారాయణరావు (అంజలీదేవి భర్త) చిరస్మరణీయమైన కీర్తిని ఆర్జించి పెట్టుకున్నారు.

తెలుగు, తమిళం తరువాత హిందీలో అంతగా హిట్‌ అయిన ‘సువర్ణ సుందరి’ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయదగింది.

ఈ సువర్ణ సుందరి హిందీలో నేరుగా తీశారు. అందులో అంజలీదేవి – నాగేశ్వరరావు హీరోయిన్‌ – హీరో-, పాటలు మహ్మద్‌ రఫీ – లతా మంగేష్కర్‌ పాడారు. ‘హాయి హాయిగా ఆమని సాగే’ అనే యుగళ గీతాన్ని అంజలీదేవికి తెలుగులో జిక్కీ పాడారు. తమిళంలో పి. సుశీల పాడారు. హిందీలో లతామంగేష్కర్‌ పాడారు. మూడూ బ్రహ్మాండంగా హిట్‌ అయి, జనాల్ని ఉర్రూతలూగించాయి. లతామంగేష్కర్‌ ఆ సంగీతాన్ని ఎంతో మెచ్చుకుని, తను యిష్టంగా కోరుకుని, పారితోషికం విషయంలో పట్టింపు లేకుండా పాడారు.

రాజనందిని, శోభ పెళ్ళిసందడి, బాలనాగమ్మ, ఆడపెత్తనం, పరీక్ష చేశారు. అయితే 1959 లో ఆమె నటించిన ‘జయభేరి’ చిత్రం నిజంగా జయభేరి మ్రోగించింది. ఇదొక సంగీత ప్రధాన చిత్రంగా అందరి మన్ననలు పొందింది. దీనికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు. అక్కినేని వారు కథానాయకుడిగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.

‘యమునా తీరమునా – సంధ్యా సమయమునా’ అనే పాటలో అంజలీదేవి అభినయం గొప్పగా వుంటుంది – పాటకి అభినయించటంలో ఆమె తనే పాడినట్లు చేయగలరు. అది ఆమెకు మొదటి నుంచీ సంగీతంతో వున్న అనుబంధానికి నిదర్శనం.

1946లో సినీరంగ ప్రవేశం చేసిన అంజలీదేవి 1960ల వరకు హీరోయిన్‌గా తిరుగులేని కెరియర్‌ సాధించారు.

కులదైవం, రాణి రత్న ప్రభ, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, రుణానుబంధం, శాంత, సతీసులోచన, భక్త జయదేవ, పచ్చని సంసారం, భీష్మ, నాగదేవత లాంటి సినిమాలు అలవోకగా చేసి మెప్పించారు.

ఆ తర్వాత నుండీ అంజలీదేవి పంథాలో మార్పు వచ్చింది. ఆమె వయసు దృష్ట్యా, పాత్రలను ఎంపిక చేసుకోవడంలో మెలకువ ప్రదర్శించారు. దర్శకులు కూడా ఆమెలోని అద్భుత నటనను వెలికితెచ్చే గొప్ప పాత్రలకోసం ఆమెను సంప్రదించటం మొదలు పెట్టారు.

ఆ విధంగా ఆమెను వరించిన పాత్ర లవకుశలో సీత, ఉత్తర రామచరిత్ర కథ ఆధారంగా రూపొందించే లవకుశ చిత్రంలో అంజలి అద్భుతంగా సీతగా సరిపోయారు. శ్రీరాముడు అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాలు గడిపి రావణుని చంపి, సీతను చెరవిడిపించి, అయోధ్యా నగరానికొచ్చి, పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన ప్రారంభిస్తాడు.

అందువల్ల రాముడు, సీతా కూడా మరీ చిన్నవారు కాదు. ఆ విధంగా సీత పాత్రకోసమే అంజలి పుట్టినట్లు సరిపోయేరు. ఇంక నటనంటే చెప్పనవసరం లేదు. సౌమ్యత, సంస్కారం ఆమె ముఖ వర్చస్సులోనే వుంది. దానికి తోడు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ప్రకటించటంలో అంజలి సహజనటి-

రాముడు యాగం చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆమె కలతపడిన విధానం గొప్పగా వుంటుంది. ఎందుకంటే భార్య లేకుండా యాగం ఎలా సాధ్యం?-

కన్నపిల్లలిద్దరూ శ్రీరాముడ్ని చులకనగా తూలనాడి మాట్లాడుతుంటే ఏమీ చెప్పలేక సీతపడిన క్షోభ అంజలీ చాలా బాగా చేశారు.

ఆశ్రమంలో నిరాడంబరంగా, నార చీరలతో సంచరించే సీతకి సౌశీల్యమే ఆభరణం అనే స్ఫూర్తిని ఆమె నటనలో చూపించగలిగారు.

చిట్టచివరి ఘట్టంలో తల్లి తనను కొని పోతున్నప్పుడు సీత ముఖంలోని ప్రశాంతత, తన నిర్ణయంపట్ల అచంచల విశ్వాసం ఆమె చూపించారు.

లక్ష్మణుడు ఆమెను అరణ్యంలో వదిలి, అన్నగారి ఆజ్ఞను తెలిపినప్పుడు, ఆమె దుఃఖం అవమానం, ఆత్మాభిమానం దెబ్బతిన్న తీరు ఎంతో ఉదాత్తంగా చూపించారు. ”శ్రీరాముడు ఆజ్ఞగా నన్ను అడవికి వెళ్ళమని అంటే నేను అతని మాటను శిరసావహించనా” అని అభిమాన పడిన తీరు గొప్పగా వుంటుంది.

‘లవకుశ’ సినిమాలో ‘సీత’ గా నటించిన అంజలీదేవికి వచ్చిన కీర్తి గురించి చెప్పడం కష్టం. పల్లె పల్లెకీ, వాడవాడకీ ఆమె ‘సీత’ గా విస్తరించి పోయారు. ఆమెను చూసేందుకు బళ్ళుకట్టుకుని జనం తీర్థంలా వచ్చేవారంటే అబద్ధం కాదు. ఆమె కాళ్ళకి మొక్కి కొబ్బరికాయలు కొట్టి, పూలు సమర్పించి, సాక్షాత్తూ సీతాదేవిని చూసినంత ఆనందపడి, కన్నీరు కార్చిన కాంతలెంతమందో చెప్పలేం-.

‘ఎన్ని కష్టాలు పడ్డావే నా తల్లీ’ అంటూ ఆమెని జాలితో దర్శించినవారూ లేకపోలేదు.

దర్శకులు సి.పుల్లయ్య ఈ చిత్రంతో చిరస్మరణీయు లయ్యారు. ఏ పుల్లయ్యగారు అంజలీదేవిని సినిమా రంగానికి ‘గొల్లభామ’ ద్వారా పరిచయం చేశారు. ఆ పుల్లయ్య గారే అంజలీదేవిలో పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని వెలికితీసి, సీతగా మలచి, ఆంధ్రులకు ‘లవకుశ’లో అందించారు.

ఈ ‘లవకుశ’ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య రచనా, ఘంటసాల వెంకటేశ్వర్రావు సంగీతం, పి. సుశీల లీలల గళాల సంగీత ఝరుల విన్యాసాల విలాసం-, అంజలీదేవి-ఎన్‌టిఆర్‌ ల అభినయం- అన్నీ ఆభరణాలే.

ఈ ‘లవకుశ’ లో సీత పాత్ర పోషించటం ద్వారా అంజలీదేవి నటజీవితం సార్థకమైందని చెప్పవచ్చు. అంజలీదేవి తన పాత్రలను ఎంచుకునే క్రమంలో మార్పుని ఆహ్వానించారు.

అంజలీదేవి సొంత ప్రొడక్షన్‌లో తీసిన సినిమాలు ఫెయిల్‌ అవ్వడంవల్ల ఒక సమయంలో ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నారు. అశోక్‌ కుమార్‌, మనోజ్‌ కుమార్‌, వైజయంతి మాల వంటి పెద్ద నటీనటులతో 1964 లో తీసిన పూలోంకిసేజ్‌ (పూలశయ్య) తీసి బాగా దెబ్బతిన్నారు. కోలుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది.

అప్పుడామె తమిళ పరిశ్రమ నుండి గొప్ప ఆదరణ పొందారని చెప్తారు.

నెమ్మదిగా అంజలీదేవికి రెండో అధ్యాయం మొదలైందనిపిస్తుంది. నటన సాగిస్తూనే ఆమె చిన్ని బ్రదర్స్‌ సంస్థను స్థాపించి ‘కుంకుమ భరణి – సతీ సక్కుబాయి’ సతీ సుమతి తీసి నిలదొక్కుకున్నారు. 1966లో ఆమె రుక్మిణిగా చేసిన శ్రీకృష్ణ తులాభారం పెద్ద హిట్‌తో ఆమెకెంతో పేరొచ్చింది.

పోగొట్టుకున్న ఆస్తుల్ని మళ్ళీ సంపాదించుకోగలిగారు. తన సంస్థలకి పోయిన కీర్తిని కూడా మళ్ళీ పొందగలిగారు. ఆమె భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య వంటి ఇరవై చిత్రాలు నిర్మించారు.

ఎన్నో సినిమాలు చేసినా మరెన్నో సాధారణ పాత్రల్ని పోషించినా ఆమెకి కొన్ని సినిమాలు అంజలీదేవి బ్రాండ్‌గా నిలిచిపోయినవున్నాయి.

1962లో భీష్మ సినిమాలో ఆమె ‘అంబ’ గా- ఆ తర్వాత శిఖండిగా అపూర్వ నటనను ప్రదర్శించారు. 1966లో బి.ఎన్‌. రెడ్డిగారి ‘రంగుల రాట్నం’లో ఆత్మస్థైర్యంగల స్త్రీగా ఆమె గొప్పగా రాణించారు.

ఎన్‌.టి. రామారావు సరసన ముసలి దంపతుల్లో భార్యగా ఆమె బడిపంతులు సినిమాలో అత్యద్భుతంగా నటించారు. ముఖ్యంగా

‘నీ నగుమోము – నా నులారా

కడదాకా – కన నిండూ’ అనే పాటకి ఆమె భావ ప్రకటన గొప్పగా వుంటుంది.

తాతా మనవడి సినిమాలోనూ ఆమె చాలా విభిన్నమైన రీతిలో కనిపిస్తారు.

ఒడిదుడుకుల్ని తట్టుకుని ధైర్యంగా నిలబడే వ్యక్తిత్వం ఆమెకున్నాయి. పైకెదిగినప్పుడు పొంగి పోవడం- కిందికి జారినప్పుడు కృంగిపోవడం ఆమెకి నచ్చని విషయాలు. నిండుగా ప్రవహించే నదిలా ఆమె సుందరంగా, పవిత్రంగా వుండటం ఆమె వ్యక్తిత్వం-,

అయిదు దశాబ్దాల సుదీర్ఘ సినీ నటజీవితంలో ఆమె ఎన్నో సత్కారాలను పొందారు. పదవులు నిర్వహించారు – ఎన్నో అవార్డులు ఆమెని వరించి వచ్చాయి.

1951 లొ సౌత్‌ ఇండియన్‌ ఫిలింఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌కి వైస్‌ ప్రెసిడెంట్‌గా వున్నారు-

మోషన్‌ పిక్చర్స్‌ అకాడమీ వారు ఉత్తమనటి అవార్డిచ్చారు. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్టు అసోసియేషన్‌కి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. నటశిఖామణి, నడిగర్‌ చెల్వి బిరుదులను పొందారు. 1958లో వెంకటేశ్వర వర్సిటీ సెనేట్‌ మెంబరు అయ్యారు. 1964లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు . హిందీ ‘సువర్ణ సుందరి’ కి జాతీయ అవార్డునందుకున్నారు. 1994లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు నందుకున్నారు.

2002- తెలుగు ఆత్మగౌరవం పురస్కారం, ఆకృతి వారి హెచ్‌ఎమ్‌ రెడ్డి అవార్డు, ఆ తర్వాత అక్కినేని ఇంటర్‌ నేషనల్‌ అవార్డు ఆమె పొందారు. ఏఏ పురస్కారాలు వచ్చినా, ఆ పురస్కారానికే వన్నె పెరిగే రీతిలో అంజలీ దేవిని అందరూ భావించి, చూసేవారు.

1991లో ఆమె భర్త, ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఆదినారాయణరావు మరణించటంతో ఆమెలోని సగభాగం కోల్పోయినట్లు భావించుకున్నారామె. ఆమె పిల్లల్ని చూసుకుని ఊరట చెందారు. తన పిల్లలతో బాటుగా భర్త మొదటి సంతానాన్ని కూడా ఎంతో ప్రేమాభిమానాలతో చూసి, వారి చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ బాధ్యతగా స్వీకరించి చేశారు-

ఆ తర్వాత మొహమాటానికి కొన్ని సినిమాలు చేసినా వాటిలో ఆమె పూర్వపు ఉత్సాహం కనిపించలేదు. వయస్సుతోబాటు ఆమెలో భగవద్భక్తి పెరిగి సత్యసాయిబాబా భక్తురాలిగా జీవితం గడపసాగారు. పుట్టపర్తి సత్యసాయిబాబా జీవితం ఒక టెలివిజన్‌ సీరియల్‌గా రూపొందించారు.

ఆమె కుమారులిద్దరూ మంచి స్థితిలో అమెరికాలో స్థిరపడ్డారు. 13.1.2014న ఆమె మరణించారనే వార్త ఆమె అభిమానులకు (ముఖ్యంగా పాత సినిమా అభిమానులకు) ఎంతో దుఃఖాన్ని భరించలేని బాధని కలిగించింది- అయితే మనిషిగా పుట్టిన వారికి మరణం సహజంగా ప్రాప్తించక తప్పదని భావించటం మాత్రమే బాధకి ఊరట.

తెలుగు సినిమా చరిత్రలో అంజలీదేవి ఎప్పుడూ మెరిసే ధృవతార.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.