బ్రిజ్‌రాణి(హైదరాబాద్‌)

చాల వెనకబడ్డ కుటుంబం మాది. నాకు మాత్రం ఏదైన సోషల్‌ ఆర్గనైజేషన్‌లో పాల్గొనాలని వుండేది. మాది హైదరాబాదే. సరోజనీనాయుడు ప్రభావం నామీద వుండేది. పేపర్లో ఆమె చేసే పనుల గురించి చదివితే ఆమెలాగే మనం కూడా ఏమైన చేస్తే బాగుంటుందనిపించేది. కాని నేను పెరిగిన వాతావరణం ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటిది. అరుణా ఆసఫ్‌అలీ మీటింగ్‌ రెండు మూడుసార్లు విన్నాను. తర్వాత ఆర్యసమాజ్‌ లాంటి వాటిల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆర్యసమాజ్‌ మందిర్‌ మీటింగుల్లో పాల్గొన్నాను. కానీ కంటిన్యుయస్‌ వర్క్‌ లేకపోవడంవల్ల నాకు తృప్తి లేకుండేది. దాంతో ఎక్కడేం జరిగితే అక్కడికి పరిగెత్తేది. అటువంటి సమయంలో నామీద చాలా వొత్తిడి వచ్చింది.

నా పెళ్ళి చిన్నతనాన్నే అయింది. నాకు జ్ఞాపకం లేదు. కాని నాకు కొంత వాతావరణంలో మార్పు రావడం మూలాన వాళ్ళు నన్ను చాలా బాధించడం, కొట్టడం, తిట్టడం మొదలు పెట్టిన్రు. అత్తగారూ, భర్త కూడా నన్ను చాలా హింసించారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక యింట్లోంచి వెళ్లిపోయాను. వెళ్లిన తర్వాత ఎటుపోవాలో ఏమో నాకు తెలియలేదు. నాకు రుక్మిణి అని ఒక స్నేహితురాలుండేది. వాళ్ళమ్మ మహిళామండలిలో చీపురు పనిచేసేది. ఆమె ద్వారా మహిళా మండలిలో వాళ్ళు నాకు చాలా సహాయం చేసిన్రు. నేను క్రమంగా ఒక సోషల్‌ వర్కర్‌గా తయారయిన, దాంతర్వాత కొంత చదువులో కూడా ముందుకొచ్చిన, దాంతర్వాత నిదానంగా నాకప్పుడు కమ్యూనిస్టు పార్టీతో సంబంధమేర్పడింది. – అయితే డైరెక్టుగా కాదు. మండలిలో ప్రమీలాబెన్‌, యశోదాబెన్‌ పనిచేస్తుండే వాళ్లు. వాళ్ళు నాకు చాలా హెల్ప్‌ చేసిన్రు. వీళ్ళు నాకు గ్రామాల్లో, మిగతా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చిన్రు. వీళ్ళందరికీ మొదటినుంచి కమ్యూనిస్టుపార్టీతో సంబంధం. నాకు కూడా నిదానంగా కమ్యూనిస్టు పార్టీ మీటింగులో పాల్గొనే అవకాశం యిచ్చిన్రు. కమ్యూనిస్టు పార్టీ మహిళా యూనిట్‌లో మహిళా నవజీవన మండలి, ఆంధ్ర యువతీ మండలి అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు. నిమ్మగడ్డ సత్యవతి, ఆరుట్ల కమలాదేవితో చేసేవాళ్ళం. తర్వాత తెలంగాణా జాగీర్దారీ వ్యతిరేక పోరాటంలో చాలా ముఖ్యమైన పాత్ర కమ్యూనిస్టు పార్టీది. ఆ సమయంలో నేను స్కూల్లో హిందీ టీచరు వుద్యోగం చేస్తూ పార్టీలో పనిచేస్తుంటి. దేశ్‌ముఖ్‌ దొరలతో మా కామ్రేడ్‌లు దెబ్బలుతిని వస్తుంటే బాగా వాళ్ళకు స్నానం చేపించడం, సేవచేయడం మొదలుపెట్టాను. పుల్లారెడ్డి గారు, స్వరాజ్యం వాళ్ళ అన్న మురళీధర్‌ ఏదో ప్రెస్‌ డైరెక్టర్‌, మన నర్సింగ్‌ వీళ్ళందరు కూడా బాగా దెబ్బలు తిన్నరు. వాళ్ళకు సేవ చేస్తూంటే, ప్రాక్టికల్‌గా ఈ నా రాజకీయ జీవితంలో కూడా మార్పు రావడం అయింది. పి.సి.జోషి ఢిల్లీ నుండి పేపరు వేస్తుంటే పేపరు అమ్మడానికి ఇంటింటికి తిరిగేదాన్ని. ముస్లిం ఖైదీలు, షబానా తండ్రి – ఖైదీఅజ్మీ, జాఫ్రి వీళ్ళందరూ వచ్చేది. వాళ్ళకు కావలసినటువంటివి ఇవ్వడం, మొత్తానికి ఇటువంటి యాక్టివిటీస్‌లో ఎక్కువ పాల్గొని, అన్ని ప్రభావాల ద్వారా నేను రాజకీయ జీవితంలో ఇముడ్చుకొని ఇందులోనే పనిచేయాలని ఆశపడిన. ఇంతలో ఇక్కడ మొదటిసారి పెద్ద కాంగ్రెసు మహాసభ జరిగింది. అందులో పాల్గొన్న తర్వాత రజాకార్‌ వ్యతిరేక పోరాటంలో పోయిన. 1946లో ఇండియన్‌ యూనియన్‌ సమస్య – హైదరాబాదు ఇండియన్‌ యూనియన్‌లో చేరాలా వద్దా అని వచ్చింది. కామ్రేడ్సు చాలామంది అరెస్టయిన తర్వాత నాకు కూడా పాల్గొనాలనిపించింది. అయితే చాలామంది మా కుటుంబం వాళ్ళు – ”మహిళలెవ్వరు లేరు నువ్వొక్కదానివి పాల్గొనడం ఎట్లా” అని అన్నరు. మా తల్లిగారు వాళ్ళు ధూల్‌పేట్‌లో వుండేవారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయిన. అక్కడ స్కూల్లో వుండే యువతీ యువకులను రజాకార్లకు వ్యతిరేకంగా పోగుచేసిన. పెద్ద పెద్ద దళాలుగా తయారు చేసి వాళ్ళను కాపలా కాయించడం, మా వసతికి రానీయ కుండా చేసి మహిళా దళాలు కూడా రాత్రింబవళ్ళు బాచ్‌లుగా చేసుకొని కాపలాకాసే వాళ్ళం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పంద్రహ్‌ ఆగస్టున (ఆగస్టు పదిహేను) జెండా ఎగిరేసి ఎట్లాగయినా అరెస్టు కావాలని అనుకున్నం. ఘోషాపేట హైస్కూల్లో జెండావందనం చేయాలని నిర్ణయం తీసుకున్నం. అప్పుడు రజాకార్‌ మూవ్‌మెంట్‌ చాల జోరుగవుండె. ఎక్కడివాళ్ళక్కడ జెండా ఎగరేయాలని పార్టీ నిర్ణయం వుండె. ఘోషాపేట్‌లో నేను చేసిన. అక్కడ పెద్ద ఎత్తున గడబిడ జరిగింది. ధూల్‌పేట్‌ భయంకరంగ వుండె. మహిళలు బస్తిబస్తికి వెళ్ళి ముగ్గులు వేయటం, భారతదేశం అన్న నినాదంతో పూలు చల్లడం పండుగ మాదిరి చేసినం. యువకులందరూ కూడ వచ్చి జైజై అంటుంటే పోలీసు వచ్చి ఘోరావ్‌ చేసిన్రు. ఆ ఘోరావ్‌లకెల్లి తప్పించుకొన్నం- నేను, శంకర్‌ అనే అతను. ఏం చేయాలో తోచలేదు. చంపేస్తే ఫరవాలేదు కాని, ఈ రజాకార్ల చేతిలో దొరికిన తర్వాత ఏంచేస్తరో ఏమో యింక మేం ఇట్లా వుండటం మంచిదికాదని, మళ్ళీ బయటకెళ్ళి అరెస్టయితే మంచిదని, మూడు రోజుల తర్వాత యిక్కడ స్వామి రామానంద్‌తీర్థ, మేల్కొటె, యశోదా బెన్‌, నేను యిక్కడ సుల్తాన్‌బజార్‌లో జెండా ఎగిరేసినం. స్వామీజీ వాళ్ళు అరెస్టయిన్రు. నేను వెళ్ళిపోయిన. బన్సీలాల్‌ స్కూల్‌లో ఒక సోషలిస్టు పార్టీ గ్రూప్‌ వుండె. వాళ్ళు మమ్మల్ని రక్షించి ఆశ్రయమిచ్చి, భోజనంపెట్టి, తెల్లారికాంగనే అక్కడ్నుంచి పంపించేసిన్రు. తర్వాత బేగంబజారులో – నాకు పేర్లు సరిగా యాదిలేవు – మేము అరెస్టయినం. ఆరుమాసాలు జైల్లో వున్న. విడుదలయిన తర్వాత మళ్లీ అరెస్టు చేస్తరని రహస్యంగ వెళ్ళిపోయిన అండర్‌ గ్రౌండులోకి. అప్పుడు పార్టీలో పనివుండె.

నన్ను అరెస్టు చేసినపుడు మాత్రం చాలా బాధపడ్డాను. అక్కడ బాగా లాఠీఛార్జీ అయిందన్నమాట. అప్పుడు మాత్రం నేను తట్టుకోలేక పోయిన. నిజంగా అప్పుడు నన్ను చూస్తే మాత్రం ఎవరూ నేను ఆపని చేసినట్లు అనుకోరు. ఎందుకంటే ఓపిక లేనటువంటి మనిషిని. ఏం బలం లేనటువంటి మనిషిని. కోపమొచ్చి, జనాన్ని పోలీసులు కొడుతుంటే నేను కూడా పోలీసును కొట్టిన్నన్నమాట. అంటే కర్రలేం లేకుండా చేతులతోనే కొట్టిన్నన్నమాట. అది పేపర్లో కూడా వచ్చింది. తర్వాత నాకేం తెలియలేదు. తెలివితప్పి పోయానేమో నేను. పోలీసు స్టేషనుకు పోయింతర్వాత కూడా నన్ను చాలా కొట్టిన్రు. ”నువ్వెటువంటి మనిషివి? నీకెంతమంది మొగుళ్ళున్నరు” అని… నాకపుడు మాత్రం ఎవరితోటి ఏం సంబంధం లేదండీ. నేను బిల్‌కుల్‌ కరెక్టు. గౌడ్‌ గారితో పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయం లేకుండె. ఆ విధంగా నేనున్నాను. కానీ వాళ్ళు నన్ను చాలా హీనంగా చూసిన్రు.

కొట్టినా ఫరవాలేదు. కాని, మాటలు మాత్రం చాలా యిదిగా అన్నరు. నువ్వు రాజీనామా పెట్టు. నీకేదన్నా యిస్తం, నీకు చాల అవకాశం యిస్తం అని రెండు రోజులు కస్టడిలో వుంచిన్రు. శంకర్రావు కూడా నాతో అరెస్టయిండు. ఆయనను వేరే వుంచిన్రు. అప్పుడు మేల్కొటె గారు, స్వామీజీ కూడా కంట్రోల్‌ రూమ్‌లో వుండె. నేనొకటే మాటన్న. మీరెన్ని మాటలన్నా నాకవసరం లేదు. నేను ఒప్పుకోను. అనవసరంగా నన్ను బాధించకూడదు. నేను రాజీనామా ఇయ్యను. అప్పుడు నా శరీరంలో ప్రాణము న్నదా లేదా అనిపించింది. తర్వాత జైల్లో పెట్టింతర్వాత కూడా బెదిరించిన్రు. గాజులు తీసెయ్యాలి, బొట్టు తీసెయ్యాలి అని చాలా హింసలు పెట్టిన్రు మాటలతో. నిలబెట్టడం, కూర్చుండబెట్టడం, కూర్చోని వ్వకపోవడం, చీకట్లో తీసుకుపోయి జైల్లో వేసిన్రు. ఎవరూ లేరు, రాజకీయ ఖైదీలు ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే. ఒక రూమ్‌లో తాళం వేసిన్రు. బయటంతా ఖూనీ కేస్‌ ఆడ క్రిమినల్స్‌. లోపట్నించి దర్వాజ పెట్టుకొనున్న, అయిదారు రోజుల తర్వాత మేల్కొటె యశోదా వాళ్ళు వచ్చిన్రు. నాకు ధైర్యం వచ్చింది. వాళ్ళను ‘ఏ’ క్లాస్‌లో పెడ్తే నాకేమో ‘సి’ క్లాస్‌ క్రిమినల్స్‌తో పెట్టిన్రు. వాళ్ళతో అన్నం పెట్టినపుడు తినలేక బాధపడిన. నాకు ఇద్దరు పిల్లలు మొదట వుండిరి. వాళ్ళ బాధ చెప్పడం మరచి పోయిన. వాళ్ళు యాదొస్తుండిరి. వాళ్ళు మా చిన్నమ్మ కొడుకు శివప్రసాదు అని ఆయన దగ్గర వుండె. మా నాయన చనిపోతే మా చిన్నమ్మ వాళ్ళే పెంచిన్రు నన్ను. నా పిల్లలు చిన్నగుండిరి. నేను జైల్లో వున్నప్పుడు పెద్దాయనకు ఆరు సంవత్సరాలు, చిన్నాయనకు రెండు సంవత్సరాలు. మా పిల్లల్నేమీ బాధపెట్టలేదు, కాని మా చిన్నాన్నను మూడు రోజులు కష్టడిలో పెట్టిన్రు. వాళ్ళనేం బాధపెట్టిన్రో నాకు చెప్పలేదు. పిల్లలను చూడాలంటే చూడలేకపోతుంటి. తేవాలంటే వాళ్ళు కూడా తేకపోతుంటిరి. భయంకదా ఏంచేస్తారో అని!

నేనూ సీతాదేవి ఓపెన్‌గా వున్నప్పుడు సైకిల్‌ తొక్కడం, కర్రలు తిప్పడం నేర్చుకు న్నం. నేను ట్రెయినింగ్‌కు విజయవాడ పోలేదు. ఇక్కడే హిమాయత్‌ నగర్‌ లోనే. ఇది మా రాజ్యంగా వుండేది. ఈ ట్రెయినింగ్‌ రహస్య జీవితానికి ఉపయోగానికి వచ్చింది. మహిళలకు రక్షణ చేసుకోవాలని నాకు వచ్చినంతగా నేను నేర్పిన దళంలోవుండి కాపాడటం, మందులు అవి సప్లయి చేయడం రహస్యంగా చేసేవాళ్ళం. జైల్లో వున్నప్పుడు కూడా మేంచాలా అల్లరి చేస్తుంటిమి. అది వాళ్ళు బాగా కక్ష పెట్టుకుని నన్ను మళ్ళీపట్టాలె అని చూసిన్రు. ఒకసారి ఉస్మానియా దవాఖానకు కొంతమంది కామ్రేడ్స్‌కు దెబ్బలు తగిలిన వాళ్ళుంటే – చూడాలని పోయిన. రజాకార్లు వచ్చి ఘోరావ్‌ చేసిన్రు. అండ్లకెల్లి పారిపోయి వచ్చేసి బస్సులో కూర్చున్న బస్సు స్టార్టవుతుంటే, ఇంక మళ్ళీ దొరకలేదు. ఎలెక్షన్‌ అయ్యేవరకు అండర్‌ గ్రౌండ్‌లోనే వున్న. తర్వాత బయటకు వచ్చిన. గ్రామాల్లో రజాకార్లకు, దేశ్‌ముఖ్‌ దొరలు తోడ్పడుతుంది. రజాకార్లు స్త్రీలను మానభంగాలు చేయడం, ముక్కులు, రొమ్ములు కోసేయడం వింటుంటిమి. మనకు రక్షణలేదు, అందుకే అడవుల్లో వుండడం. మేము సూర్యాపేట చరిత్ర వింటూనే వుంటిమి. మాపని ఏమంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళను దాచిపెట్ట టమూ, వాళ్ళకు ట్రీట్‌మెంట్‌ చేయించి పంపడమూ…

రహస్య జీవితంలో ఏవిధంగా వున్నమంటే… చెప్పలేను ఆపరిస్థితి…. ఎక్కడపడితే అక్కడ, ఎవరుంటే అతడే మా భర్తని చెప్పుకుంటూ… దొరికితే తిండి, లేకుంటే పస్తు తెల్లారేదాకా కూర్చుం టుంటిమి. జర్ర సప్పుడయితే లేచి చూసేది. పొద్దునదాకా డ్రామా ఈయన నాభర్త. ఆయన నా మరిది అని. వున్నదేదో వండి పెట్టేది. మమ్మల్ని పెట్టేందుకు కొంచెం హుశారయిన గవర్నమెంటయితే నిజంగా సులభంగా పట్టుకోగలుగుతుండె. ఎందుకంటే మేం ఎక్కడపోతే అక్కడ ఒక కొత్తకుండ, కొత్త చీపురు. కొత్త చాప అవసరం పడుతుండె. ఎక్కడయినా మేము విడిచిపెట్టిపోతే వాటినక్కడే విడిచిపెట్టి పోతుంటిమి. కాని వుండగా ఎవరికి తెలియకుండ ఒక కుటుంబంగా వుంటిమి. మేం పోయినంక కమ్యూనిస్టులుండిరని తెలిసేది.

పార్టీలో చేరకముందు పూజలు, పునస్కా రాలు చేస్తూండేదాన్ని. నమ్మకాలుండేవి. ఇవి వదిలేయడానికి కారణం ఏమిటంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు. ఏ దేవుడికి మొక్కినా నా జీవితం బాగుపడేటట్టులేదు, స్వయంగా నా జీవితాన్ని బాగుచేసుకునేం దుకే నేనే కష్టపడాలి అనే వూహ వచ్చింది. అసలు ఆ పూర్వకాలం వాతావరణం నాకు నచ్చలేదు. కొట్టడం, తిట్టడం- చెడ్డ పనులు నాకు నచ్చలేదు. స్త్రీగా నేను పడిన బాధలు గ్రహించిన తర్వాత నేను సమాజంలో దిగిన తర్వాత వేరేవి గ్రహించిన. నేను ఆత్మహత్య చేసుకోను, బయటపడి ఏదైనా చేయాలి అని. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. నేనేమో అది చేసుకోదల్చుకోలేదు, ఈ దేశంలో జరిగేటటువంటి రాజకీయ పోరాటం, సరోజినీ నాయుడు పుస్తకాలలో అవీ చదవడంవలన ఆ భావాలు కలిగినవి, నేను ముందుకుపోయి ధైర్యంగా ఏదైనా చేయాలని.

నా రెండో వివాహం పార్టీలోనే 1947లో అయ్యింది. ప్రేమలతకూ, నాకు, మా చెల్లెలికి-అందరికీ వివాహం చేసింది పార్టీ. నా జీవితం గురించి పార్టీలో అంత తెలిసివుండేది. కొన్ని సంవత్సరాలు మా పార్టీలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదని వుండేది. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఏదో విధమైన మోహంలోపడిపోతం. రెండోదే మిటంటే మూవ్‌మెంట్‌లో ఏదైనా త్యాగం చేయాలన్నా చేయలేకపోతం. పిల్లలుపుట్టినా ఏంచేయలేం. అందుకని మాపార్టీ పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయిం చింది. అయితే చేసుకోవాలనుకున్న వాళ్ళను వద్దనలేదు. అయితే ఇది చాలా కఠినసమ యం. అందుకే చేసుకోవద్దని సర్క్యులర్‌ వుంటుండె దానిమీదనే ఆధారపడి క్రమశిక్షణ గా వుంటిమి. నేను ఆయనవల్ల పార్టీలో రాలేదు. పార్టీలో వచ్చినంక చాలారోజులకు ఆయన్ను కలుసుకున్నాను. నేను జైలునుంచి విడుదలై వచ్చినాక, కొన్నిరోజుల తర్వాత ఈ అండర్‌ గ్రౌండ్‌ జీవితంలో వుండటం కష్టమను కున్నాను. పార్టీలో ఒక్కదాన్ని వుండటం కష్టమనుకున్న నేను. అటువంటి సమయంలో నేను సిద్ధమయిన్నన్నమాట.

పెళ్ళి చేసుకున్న తర్వాత కూడ చాలాసార్లు విడిగా వుండాల్సి వచ్చింది. గౌడ్‌ గారిని నల్గొండ పంపించిన్రు. మా తమార (ఇప్పుడామె డాక్టరు) కడుపులో వుండె. ఆయన నల్గొండ పోయిన తర్వాత ఆమె పుట్టిందన్నమాట. ఎక్కడుండాలో ఏమీ తెలియలేదు. చాలా కష్టాలు. అప్పుడు మాత్రం ముస్లింలే నాకు చాలాసాయం చేసిన్రు. వాళ్ళే నన్నూ, నా చెల్లెల్నీ తీసుకుపోయి చూసిన్రు. ఆయన వచ్చేవరకు సంవత్సరం దాటిపోయింది తమారకు. ఎలక్షన్స్‌ అయింతర్వాత ఆయనను అరెస్టు చేసిన్రు. అప్పుడు పార్టీ కూడ ఎక్కడ లేకుండ పోయింది. అప్పుడు కొంత బాధపడ్డాను. ముస్లిం కామ్రేడ్లు, అమీనా ధగేవాళ్ళు చాలామంది సాయం చేసిన్రు. కొంతమంది పిల్లలు-యూత్‌ వుండిరి. ఈ నర్సింగ్‌లాంటి వాళ్ళు తిండితెచ్చిస్తుండిరి, ఎవరింట్లో వున్నవి వారు తెచ్చిస్తుండిరి.

నేను జైలునుంచి రిలీజు అయింతర్వాతనే మావాళ్ళను కలిసినను కద. అయితే తెలంగాణా మూవ్‌మెంట్‌ ప్రభావం ఎట్లుండిందంటే ఎవరయినా కానీ నన్ను రానీయలేదు. వాళ్ళు భయపడ్డారు. కాని వుద్యమంలో వాళ్ళమీద పార్టీ యొక్క ప్రభావం ఎట్లుండిందంటే ఎవరయినా, వీరు మంచిపనేచేసిన్రు అన్న అభిప్రాయం వాళ్ళ మనసులో వచ్చేసిందన్నమాట. పార్టీలో చేరకముందు మాత్రం నాకు కుటుంబంలో వాతావరణం నచ్చలేదు. అందుకే నేను వేరే వెళ్ళిపోయిన. అసలు మా కుటుంబంలో యింతవరకెవ్వరూ ఇట్లా పార్టీలోకి రాలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. నన్ను చాలా గౌరవిస్తరు వాళ్ళ సిద్ధాంతాలు నామీద రుద్దలేదు. నన్ను మాత్రం మార్చలేదు. నేనే నిలబడి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించిన. చేతనయిన సాయం చేస్త. మా అత్తగారు (ఆమె ఇప్పుడు చనిపోయింది), ఆడబిడ్డలు నాదేంతప్పు లేదన్నట్లుగానే చూసిన్రు. గౌడ్‌గారి తల్లిదండ్రులు నా సంగతి (అంటే ఇదివరకే పెళ్ళయినట్లు) తెలిసికూడా ఏమనలేదు. అయినా ఆ పరిస్థితి ఎట్లుండెనంటె పార్టీ తోటే పర్మిషన్‌ తీసుకొన్నగాని, ఇంకెవరితో పర్మిషన్‌ తీసుకునే అవకాశం ఎక్కడుంది? అయినా తర్వాత నన్ను మంచిగానే చూసుకున్నరు. నా మొదటి ఆడబిడ్డలు, ఈ ఆడబిడ్డలు (గౌడ్‌ గారి చెల్లెళ్ళు) అంత కలిసినట్లే వుంటారు.

పోరాటం ఆపెయ్యాలనుకున్నపుడు దానిగురించి చర్చ ప్రతిచోట జరిగింది ఈ పరిస్థితుల గురించి చాలా. మాతోటి పనిచేసినటువంటి యువకులు, జాగీర్‌దారీ కుటుంబం నుండి వచ్చి మాతో పనిచేసినటువంటి వాళ్ళు బిట్రేచేసి మమ్మల్ని పట్టించడం మొదలు పెట్టారు. ఉదాహరణకు నా దగ్గరున్నటువంటి కొరియర్లు మేం ఎక్కడెక్కడున్నం, ఏ గాంగ్‌లో వున్నం, ఎట్లాపోయినం అన్నీ అట్ల చెప్పడం వల్లనే మేం పట్టుబడ్డం గానీ లేకుంటే మేం పట్టుబడేదిలేదు. గౌడ్‌గారు గానీ, కృష్ణమూర్తి వారందరు కూడా రహస్యం చెప్తేనే పట్టుపడ్డరు. అంటే వాళ్ళను తీసుకెళ్ళి కొట్టిస్తుంటే ఆ విధంగా రహస్యాలు బయటపెట్టిన్రు. కొంతమంది ఈ దొరల పిల్లలేమోపోయి కాంగ్రెసులో చేరి మాకు వ్యతిరేకం అయిన్రు. అటువంటప్పుడు పార్టీని నిలబెట్టేందుకు ఏ విధమైన ఆధారం లేదు. ఎక్కడోళ్ళను అక్కడే చంపేస్తున్నరు. డెన్‌లో వున్నవాళ్ళను డెన్‌లోనే, అడవిలో వున్న వాళ్ళను అడవిలోనే. అటువంటి సమయంలో మేం వెనకకి జరిగితేనే బాగుంటుందనిపించింది నాక్కూడా. లెనిన్‌ పుస్తకంలో చదువుతుంటి ఒక్కడుగు ముందుకుపోతే అవసరం వున్నప్పుడు రెండడుగులు వెనక్కి కూడా జరగాల్సుంటు ందని. మూవ్‌మెంట్‌ తెలంగాణాలో కొన్ని జిల్లాల్లోనే వుండిపోయింది. ముఖ్యమైన కామ్రేడ్లందరూ చనిపోతున్నారు. అందుకే ఆపేస్తే మంచిదనుకున్నాం. కాని కొంతమంది వినలేదు. కాని చెయ్యనుకూడా ఏం చెయ్యలేదు. అనవసరంగా వాళ్ళు ఇటు కాకుండా అటుకాకుండా ఏ ఒక్కదానికి కూడా సిద్ధంగా లేరు. అంటే మూవ్‌మెంట్‌ను డెవలప్‌చేసే యేమాత్రం శక్తి కూడా వాళ్ళు సాధించలేదు. కేడరుకు మాకు ఏమి సంబంధం లేకుండ పోయింది. జనానికి, మాకు సంబంధం ఇచ్చేటోళ్ళు ఎవరూ లేకుండ పోయిన్రు.

సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత, ఓపెనర్‌గా వచ్చిన తర్వాత ఏంచేయాలో అది చేస్తూనేవున్నం కద? మహిళల గురించి మాత్రం మహిళా సంఘాలు ఏమీ లేకుండపోయినవి. కారణం ఏమిటంటే సాయుధ పోరాటంలో మేము వేరే సంఘాలు పెట్టుకోలేదు. ఒక మూవ్‌మెంట్‌ నడిపించినపుడు అందులో ఒకేయిది వుంటుంది. అప్పుడు వేరేవేరే సంఘాలు లేకుండ అన్నీ జాయినయి పోతవి. బయటకి వచ్చిన తర్వాత ఇప్పుడు సంఘాలు పెట్టుకొని పోరాడుతున్నం చేతనయినంతవరకు… కాని దాంట్లో మాత్రం మనం అనుకునేటువంటి వుద్దేశానికి చాలాదూరం. యివాళరేపు జనంలో కూడా చాలా ఆశలూ, అభిలాషలూ అవి పెరిగినయి కద మంచి జీవితం కావాలని? అప్పుడు మేం ఎక్కడన్నపోతే ఒకటే చీరకట్టుకొనిపోయి- చిరిగిపోయినా ఆఫీసర్లతో మాట్లాడివస్తుంటిమి. ఇప్పుడేదైన కొంచెం మాసిపోయిన చీరుంటె ఆఫీసరుతో మాట్లాడనైనా మాట్లాడరు. అటువంటవ సరాలు ఇప్పుడు మాక్కూడ ఏర్పడ్డయన్న మాట. పూర్తి వాతావరణమే మారిపోయింది. అప్పుడేం లేకున్న మాకొక ఆయుధమున్నది కదా అని మాకు ధైర్యముంటుండె. ఇప్పుడది లేదు. ఇంకేం చేస్తం. జనం ఒక్కమాటమీద నిలబడి అంతా కూడ ఒక సిద్ధాంతాన్ని ఒప్పుకొని గట్టిగా వస్తేనే మనం ఆ మూవ్‌మెంట్‌ మళ్ళీ చేయగలుగుతం. ఇపుడు మనం చూస్తూనేవున్నం కదా. ఎవరయినా ఒక మాటమీద వుంటున్నరా? ఎన్నో పార్టీలయినయి. మాపార్టీ, మార్కి ్సస్టు పార్టీ వేరైనయి. అండ్లకెళ్ళి నక్సలైట్లు బోయిరి. అండ్లగూడ గ్రూపులైనయి. మేం మేమే తన్నుకుంటున్నం. మాలో ఐక్యత లేకుండపోయింది. కొన్ని పొరపాట్లుంటె సరిదిద్దుకోవాలన్నట్లుగ కాదు. అసలు శత్రువులెవరో వాడ్ని చంపేబదులు మేమే తన్నుకుంటున్నం, మేమే చస్తున్నం.

మా కామ్రేడ్లను తలుచుకుంటే నాకెంతో బాధకలుగుతుంది. ప్రేమతో కౌగలించుకోవాలనీ, మునుపటి మాదిరిగ మళ్ళీ కలిసి పోరాటంలో వుండాలని. ఇప్పుడు స్వరాజ్యం, ఉదయం వుంది. వాళ్ళు ఇప్పుడు నన్ను కలిస్తే ఎంతో ప్రేమతోటి నన్ను చూస్తరు. నేను ఎంతో ప్రేమతోటి వాళ్ళను చూస్తను. మొదట్నుంచీ మేము కలిసిపనిచేసినం కదా. మరేం చేస్తం, మా నడుమ ఒకగోడ నిలబెట్టేసిన్రు. ఒక రాజకీయ గోడ. ఆ గోడవల్లనే మేము కలువలేకపోతున్నం. అయినా అప్పుడప్పుడు కలుస్తునేవుంటం. అందరం ఒక్కటై ఏదైనా చేస్తేనే చేయగలుగుతం. లేకుంటె మాత్రం యింక మామీద దాడులెక్కువై శత్రువుకి మనం ఇంకా అవకాశం ఇస్తం… ఒకరు ఇందిరాగాంధీని సపోర్టు చేస్తరు. ఒకరు చైనాను సపోర్టు చేస్తరు. నక్సలైట్లంటరు చంపుతరు. మార్కిస్టులంటరు చంపుతరు. చివరకు వీళ్ళు కమ్యూనిస్టులంటరు చంపుతరు.

సెంట్రల్‌ కమిటీలో నేను లేను కాని సిటి కమిటీలో వున్నాను. మిగతా మగవాళ్ళతో కూర్చుని చర్చించేది. విమర్శ, ఆత్మవిమర్శ రెండూ కూడా జరుపుతుంటిమి. ఇప్పటికీ జరగుతూనే వున్నయి. కాని అప్పుడు చర్చ జరిగితే గట్టి పట్టుదలగా జరిగేది రాజకీయంగా. కాని ఇప్పుడు కొంచెం సోషల్‌గా, అదీ యిదీ కలిపేసి… కాని మొదలు మేము అడవుల్లోంచి అక్కడనుంచి బయటకు రాగానే యిక్కడ అందరితో మాట్లాడి, మన తెలుగుదేశం రాజ్యలక్ష్మి వాళ్ళున్నరుకదా, వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదు అంతా వుడ్‌కాంప్స్‌ చేసినం. ఇప్పుడు లాభమేమయింది… ఏదో కుట్టుక్లాసులూ, సెంటర్లూ పెట్టుకుంటే దానివలన ఏం మార్పులు వస్తయి? అక్కడ ఆయుధాలు నడపడం ఏమిటి? అక్కడ్నించి ఇక్కడకు వచ్చి కుట్టుక్లాసులు నడపటం ఏమిటి? ఇప్పుడెంత అభాస! ఈ బస్తీ చూడండి, ఈ బస్తీలో అంతా గుడిసెలుండె. నేను కొట్లాడి, కొట్లాడి బస్తీ అంతా ఆక్రమించిన. ఇక్కడ వీళ్ళందరికీ ఇప్పిస్తే వీళ్ళందరు ఈమేం చేస్తది అంటరు. ఎవరికి వాళ్ళు నాయకులై పోయిన్రు. అప్పుడు పార్టీమాట కూడ వినలే. నీవు చేయలేవమ్మా ఒక్కదానివి అన్నరు. నేను వినకుండ చేసిన. స్వార్థం ఎక్కువైపోయింది, ప్రజలు కూడా ఎక్కడికక్కడ సుఖజీవితానికి, ఇవాళ ఈ పార్టీలో, రేపు ఆ పార్టీలో వుంటరు. ఎటు డబ్బుదొరికితే అటుపోతరు. అసలు పోరాటాలు పోయి ఇప్పుడు వేరే పోరాటాలు, పంజాబ్‌, అస్సాం, తెలంగాణా అని ప్రాంతీయత రెచ్చగొడ్తున్నారు నాయకులు. స్త్రీలకేమో అప్పటికంటె ఎక్కువ మానభంగాలు, ఆత్మహత్యలు ఎక్కువై పోతున్నవి. మహిళలక్కూడా నిరుద్యోగం, ఎడ్యుకేషన్‌ ఈ సమస్యలు వుండనేవున్నయి. రోజు రమ్మంటేరారు. ఒక ప్లాన్‌ ప్రకారంగా మొబిలైజ్‌ చేయాలి. అట్లాఅంటే ఒక పార్టీ అటు పిలుస్తుంది, ఒక పార్టీ ఇటు పిలుస్తుంది. కలిసిచేద్దామంటే రారు. ఎకనమిక్‌ ప్రోగ్రాం వీళ్ళకి సీరియస్‌ అయింది- తిండీ బట్టా, పిల్లలకు చదువు…

అయినా ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని రాజకీయధోరణులు లేకుండె. పోలీసాక్షన్‌ కాగానే ఈ ధోరణులు వచ్చేసినయి. భూస్వామ్యవర్గం నుంచి వచ్చిన వారంతా ఒకరు జనసంఘ్‌లోకి పోయిన్రు. వేరే వేరే పార్టీలొచ్చినయి. ఇక సామాన్య ప్రజలు వాళ్ళవేపు. ఎలక్షన్లో కూడ చూస్తలేమా? వెట్టిచాకిరీచేసి మేం చస్తున్నం, ఓట్లేమొ వాళ్ళకి. తెలుగుదేశం నిన్న మొన్న వచ్చి ధూం ధాం అంటే వాళ్ళవేపే యింకేంచేస్తం. జనంలో మాకేం దొరుకుద్దో అనే భావం. ఇప్పుడు ఇందిరాగాంధీ ట్వంటీ పాయింట్‌ ప్రోగ్రాం (ఇరవై సూత్రాల పథకం). కొంత అవకాశవాదులు ఉపయోగించుకున్నరు. కొన్నింటిని సపోర్టు చేసి మేం కూడ పోయినం అందులో. ఎకనమిక్‌ ప్రాబ్లం దూరం చేయాలని చేసినం. గోదాంలో కెల్లి ప్రజల పొట్టలకు రావాలన్నట్లుగా మేంచేస్తే, ఆ గోదామూ మనదే. ప్రజల పొట్టలూ మనవే అన్నట్లుచేసి మళ్ళా దోచుకునేట్లు చేస్తున్నది. ఆ విధంగా జరిగింది పొరపాటు గా. నేను చెప్తున్నాను ఓపెన్‌గా. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న. కొంతమందిమి కొట్లాడుతునేవున్నం. కాని మెజారిటీ తీర్పు ఒప్పుకుని సపోర్టు చేసిన.

పార్టీ అనుమతి లేందే మేం చేసేవాళ్ళం కాదు. ఆర్థిక సమస్యల గురించి చర్చించేవాళ్ళం. దాంతో ముడిపడివుండేది కదా మన జీవితసమస్య కూడా. పెళ్ళయిన వాళ్ళకి ఇతరులతో సంబందం వుండటం, పెళ్ళికాకముందే సంబంధాలు- అట్లా మాత్రం ఒప్పుకోకపోతుంటిరి. భార్య, భర్త పూర్తిగా విడిపోతేనే అట్లా అనుమతిస్తుంది కానీ, భార్య ఉన్న వాళ్ళకు అటువంటి అవకాశం లేదు. స్త్రీలకైతే భర్త వుండగా వదిలిపెట్టి మూవ్‌మెంట్‌లోకి పోవటం చాలా తక్కువ గద. వాళ్ళ సంబంధాలు తెగిపోతే చెప్పలేంగాని, మంచిగుంటె-మాత్రం ఏ భర్తకూడా భార్యను మూవ్‌మెంట్‌లోకి పోయేందుకు పర్మిషనివ్వడు.

పెళ్ళయిన వాళ్ళకి సంబంధాలుంటే అవిగూడా మొదటి భార్యతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న తర్వాతనే. అట్లా పరీక్ష చేసిన తర్వాతనే అవకాశం యిస్తుండె. కొంతమంది భార్యల్ని విడిచిపెట్టేసిన్రు, వెళ్ళిపోయిన్రు. అటువంటి భార్యలున్న కామ్రేడ్లు ఎక్కువమంది లేరు. ఉన్నవాళ్ళు కొంతమంది చనిపోయిన్రు. అటువంటి వాళ్ళ భార్యలకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసిన్రు. బలవంతం జరగలేదు.

మా గ్రూప్‌లో మాత్రం అట్లా ఎవరూ లేకుండిరి. అప్పుడు డెన్‌లలో వున్న వాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలతో బాగనేవున్నారు. అటువంటి భేదాభిప్రాయాలుంటే, రాజకీయంగా మనకు తోడులేనటువంటి వాళ్ళుంటే డెన్‌లలో వుంచేవారు కాదు. మొగోళ్ళయినా- ఆడవాళ్ళయినా అట్లాంటి జీవితం, రహస్య జీవితంలోనంటే, రాజకీయ చైతన్యం వున్నటు వంటివాళ్ళే వుండాలి. అందరు వుండగలు గుతారామరి? ఎటువంటి సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేం కదా?

స్త్రీల గురించి స్త్రీలే ఎప్పుడూ దిగజారుతా రని అంటారు కానీ మహిళా సంఘం అట్లా ఆలోచించదు. ఏమైనా సమస్యలుంటే ఆ స్త్రీని తీసుకువచ్చి కావలసినంత సాయం చేస్తుంది. చిక్కులువచ్చిన మళ్ళీ భార్యభర్తలు కలిసి వుండేటటువంటి అవకాశం కలుగజేస్తం. కాని చివరకి తను మాత్రం ఆమె చెడిపోయిందని తిరస్కరిస్తే వూరుకోం. ఈమె కూడ నేనతనితో సంసారం చేయను. అతను మంచివాడు కాదు అంటే, వాస్తవం తెలుసుకునేవరకు ఎంతైతే అంత చేస్తం కాని చివరకు మనం ఏంచేస్తం. ఆమె వదిలెయ్యదలుచుకుంటే వదిలెయ్యవచ్చు. దానికి మాత్రం అందరికి హక్కువున్నది కదా. కాని కొంచెం పొరపాటుపడితే మాత్రం స్త్రీ తన జాగ్రత్త దాటిపోతే, ఆమెకేదైనా రక్షణ లేకుండా చాలా కష్టం. ఆలోచించకుండా పనిచేస్తే చాలా తప్పన్నమాట.

మన మహిళాసంఘం…. రమీజాబీ వున్నది. ఆమెకెంతో సాయం చేసినం మేము. నేను స్వయంగా పోయి మహిళా సంఘం ద్వారా నీకు సాయం చేస్తం, నీకు రక్షణ కల్పిస్తం, ట్రైనింగిప్పిస్తం, డబ్బు కూడ ఇచ్చినం కానీ ఆమె రాదల్చుకోలేదు.

ఒక స్త్రీ ఆమె ధైర్యాన్నిబట్టి పెళ్ళి చేసుకోకుండా కూడా వుండవచ్చు. ఇప్పుడు అట్లా చాలామంది వున్నారు. మా ఆడబిడ్డ ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు. వేరే వాళ్ళందరూ చేసుకోమని బలవంతం చేయలేదు. వాళ్ళను ఎంతో మంచిగానే చూస్తరు. ఆమె కూడ అందరితో కలిసి మెలిసి వుంటుంది. పెళ్ళిమాత్రం చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది.

అప్పుడాడవాళ్ళకు ఆంధ్రమహా సభలో ఏంలేదు. నేనప్పుడప్పుడూ పోయే దాన్ని. హైదరాబాద్‌లో వున్నటువంటి సంఘంలో అందరూ మహారాణులే. వాళ్ళు మాత్రం మన పోరాటంలో కాని, మన కార్యక్రమంలో గాని పాల్గొనలేదు. ఆరుట్ల కమలాదేవి, నిమ్మగడ్డ సత్యవతి తప్ప ఎవరూ రాలేదు. నవజీవన్‌ మహిళామండలిలోంచి కూడా ఎవరూ రాలేదు-మేము ఇద్దరు ముగ్గురం ప్రమీలాతాయి, యశోదాబెన్‌….

ఊళ్ళకెళ్ళి పనిచేయాలనిపించింది కాని, పోరాటకాలంలో మాకిక్కడ కార్యక్రమం ఇచ్చిన్రు కదా? అందుకే వెళ్ళలేక పోయాం. కాని తర్వాత ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో అప్పుడప్పుడు పోయిచూసిన. అప్పుడిక్కడే డెన్‌లలో మాకు పన్లుండేవి. వీళ్ళకు వంటలు వండిపెట్టడమూ, మందులివ్వడమూ ఈ పనులే కాదు. జిల్లాల్లో దళనాయకులుం డేవారు. ఇక్కడ మాకు రజాకార్లతో ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలని ట్రైనింగిచ్చే వారు. ఆయుధాలిచ్చేవారు తర్వాతనే. అంతగావాడటం చూపించకపోయినా కొద్దిగా చూపిస్తుండిరన్నమాట.

స్త్రీలూ, పురుషులూ-అట్లాలేదు. పురుషులు కూడా వంటచేసేవారు. అంతా కలిసి చేస్తుంటిమి. కరపత్రాలు తీసేవాళ్ళం. స్టేట్‌లెవెల్లో నేను సర్క్యులర్‌-తీసేదాన్ని. పార్టీలో మాత్రం స్త్రీలను తక్కువగా చూసే భావం లేదు. మా కామ్రేడ్సు కెవరికి ఆభావంలేదు. బలవంతంగా ఏపని కూడా చేయమనరు.

ఏ వర్గమయినా, అసలు మన సమాజంలో మార్పేరాలేనపుడు, కొంత భాగంలో వస్తే మాత్రం స్త్రీలు నాయకత్వంలో ఎట్లావస్తారు? తెలంగాణాలో గూడా ఒక మూలకు అంతమందిలో ఎంతమంది నాయకులు వచ్చివుంటారు? వాళ్ళకు అవకాశాలు కలగాలి. రాజకీయాలి ముడ్చుకునే శక్తి కలగాలి. అంటే ఎడ్యుకేషన్‌ కూడా కావాలి. ప్రాక్టికల్‌గా అనుభవాలు కావాలి.

మా పిల్లల మీద ప్రభావం వుండింది. మా అమ్మాయి డాక్టరు. రాజకీయంగా చాలా యాక్టివ్‌గా వున్నది. కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత, ఆ అబ్బాయికి మా పార్టీయే కాక యే రాజకీయాలు లేవు. పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయి కొంచెం ఫ్రీగా పనిచేయలేకపోతున్నది. రాజకీయాలున్నటు వంటి అమ్మాయిలు రాజకీయాలు లేనటువంటి అబ్బాయిలను చేసుకుంటే చాలాకష్టం. అది ఒక్కొక్కరి స్వభావం- అదీ కాక ఆమె డాక్టరు చదివినాక ఈమెకు మధ్య తరగతి తత్వం, అంటే వేరే వాళ్ళలాగా వుండాలని-అబ్బాయిదే కాదు తప్పు. మనలో కూడ వుండాలె. మనమ్మాయిదే తప్పనుకుం టున్నా. కాస్తో కూస్తో చేయవచ్చు కదా, తన వుద్యోగం చేసుకుంటూ, పిల్లల్ని పోషించు కుంటూ…

గౌడ్‌ గారెప్పుడు ఈ పనిచేయలేద న్నట్లుగా అనరు. నా విషయంలో ఆయనేమి జోక్యం కలగచేసుకోరు. నేనేం కల్పించు కోను. యింట్లో పనికూడా నేను చేయలేకపోతే ఇద్దరం సమానంగా చేస్తాను. ఒకసారి నాకు పని యెక్కువయిందంటే, పోనీ హోటల్లో ఏదయినా కొనుక్కొని తిందాం, నీ పని నువ్వుచూసుకో అంటాడాయన. పిల్లలు కూడా. నేను లేకున్నా గాని డబల్‌రొట్టెకాని యేదన్నా తెచ్చి పెడ్తడు. ఏదయినా చిక్కులు వచ్చినయంటే అది రాజకీయాల్లోనే చర్చించుకుంటామన్నమాట.

మాకేం భేదాల్లేవు. కొన్ని విషయాలు చర్చించుకోవాల్సివస్తుంది కదా? నాకు నచ్చింది, ఆయనకు నచ్చంది-ఎగ్జాంపులంటే ఈ ట్వంటీపాయింట్‌ ప్రోగ్రాం అటువంటివి వస్తవి. కొన్ని ఇష్టంలేకున్న గాని చేసినవి చేసినప్పటికయినా గానీ అప్పుడప్పుడు మనకి కొంచెం పొరపాటనిపిస్తవి. వాదన పెట్టుకుంటామన్న మాట. అంటే ఏదైనా మాట్లాడినా గాని, ఒక సెంట్రల్‌ కమిటి నాయకునిగా ఆయననడుగుతాను. ఆయన కూడా అట్లాగే సమాధానం చెప్తాడు. కొన్ని తెలవనివి కూడా మేమడుగుతాము. భార్యగా నాకు చెప్పడు.

(మనకు తెలియని మన చరిత్ర పుస్తకం నుండి…)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో