భూమిక వార్షిక పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ

 ఇదో రకం పోరాటం – ఈనాటి పోరాటం

DSC_0560

మెటర్నిటీ లీవ్‌ అయిపోయింది. ఆ రోజు డ్యూటీలో చేరాల్సిన రోజు శర్మిష్ఠకి చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత తన టేబుల్‌ దగ్గరికి వెళ్తోంది. పాత రోజులు మళ్లీ వస్తున్నాయన్న ఆనందం, తోటి ఉద్యోగులందర్నీ కలుసుకుంటానన్న ఉత్సాహంలో, బ్యాగ్‌ని పొద్దున్నే సర్దుకుంది. తొందరగా తయారయింది.

ఏడు నెలల బాబుని, తొట్టెలో పడుకున్న వాడిని చూసింది. లాఫింగ్‌ బుద్ధలా రెండు చేతులూ పైకి పెట్టుకుని, సన్నటి శబ్దంతో కూడిన శ్వాస తీస్తూ, గాఢ నిద్రలా ఉన్నాడు.

శర్మీష్ట వెనకాలే ఆమె తల్లి, అత్తగారు వచ్చి, బాబుని చూసారు. ”మేం, జాగ్రత్తగా చూస్తాం… నువ్వింక వెళ్ళు…” అన్నారు ఇద్దరూ ఇంచుమించు అదే అర్థంతో విడి విడిగా.

శర్మిష్ట పెళ్ళయిన తొమ్మిదేళ్ళకి పుట్టినవాడు ఆ చిన్నవాడు. అంతకు ముందు రెండు సార్లు అబార్షన్‌లు అయ్యాక నెల తప్పిన శర్మిష్టకి బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంట్లోంచే పనిచేసింది. ఆ తర్వాత రెండు నెలలకి జాయినయ్యింది. మళ్ళీ బ్లీడింగ్‌ అవడం వల్ల, ఆసుపత్రిలో ఉంది. మెడికల్‌ లీవ్‌ తీసుకోమంటే, అప్పట్నించీ సెలవు పెట్టేసింది. ప్రిమెచ్యూర్‌ బేబీ, సుమారు ఏడాది నుంచి ఎత్తైన కొండ ఎక్కడం లాగా ఉంది ఆమె స్థితి.

అన్ని ఇబ్బందులూ అయిపోయాయి. ఆఫీసుకి వెళ్ళే రోజు వచ్చేసింది.

రెండో అంతస్థులో ఉన్న ఆఫీసుకెళ్ళింది. స్వైప్‌ కార్డు పనిచేయలేదు. ఏమయి ఉంటుందని ఆలోచిస్తూ మరోసారి చేయబోయింది. సరిగ్గా అదే సమయానికి ఎవరో వచ్చి, స్వైప్‌ చేయడంతో తలుపు తెరుచుకుంది. శర్మిష్ట ఆమెతోపాటు లోపలికెళ్లింది.

మీనాక్షి గణేశ్‌ గదిలోకి వెళ్లింది. మీనాక్షి శర్మిష్ట బాస్‌.

”హే…. నేను వచ్చేసాను. ఇన్ని నెలల తర్వాత రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉన్నాను! లావయ్యాను కదా!….” అంటూ గబగబా మాట్లాడేసింది.

మీనాక్షి తలెత్తి పలకరింపుగా నవ్వింది.

”నువ్వు ఇవాళ వస్తున్నట్లు నాకు తెలీదు. ఇవాళ జాయినవుతావా!”

శర్మిష్ట తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంది.

”అలా ఎలా అనుకున్నారు! నేను డిసెంబరు పదిన జాయినవుతానని ఓ పదిసార్లయినా చెప్పి ఉంటాను. మరో పది సార్లు మీరు కూడా మెయిల్స్‌ ఇచ్చి ఉంటారు… ఇంట్లో ఉన్నా, నా మనసంతా ఇక్కడ, క్లయింట్ల మీదే ఉండేది….. ఎలా ఉంది ఆఫీసు….!” అంటూ విషయాన్ని మార్చింది.

”అంతా నార్మల్‌… తర్వాత కలుద్దాం…” వెళ్ళిపొమ్మన్నట్లుగానే అంది, కత్తిరించిన జుట్టుని ఎడమ చేత్తో సవరించుకుంటూ.

అది అర్థమయిన శర్మిష్ట, వెళ్ళబోయింది.

”శర్మిష్టా, మరో విషయం. నువ్వు ఏడాది తర్వాత వస్తున్నావు. చాలా మార్పులు జరుగుతాయి. నువ్వు వీటి గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు.”

ఆశ్చర్యంగా మీనాక్షిని చూసింది.

ఆ చూపుని మీనాక్షి అర్థం చేసుకుంది.

”మళ్ళీ నువ్వు వస్తావని అనుకోలేదు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నువ్వు, రమ్మని పిలిచే మా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటావని…” ఆపేసింది.

ఏమిటి ఆమె ఇలా మాట్లాడుతోంది! పదో తారీఖున జాయినవుతున్నానని అన్ని మెయిల్స్‌ యిచ్చింది కదా, చూసుకోలేదా! చూసుకుంది. కాబట్టి, మెసేజ్‌లు ఇచ్చింది. తను జవాబులు ఇచ్చింది. అవన్నీ తెలిసీ కూడా, వస్తానని అనుకోలేదా!

”ఓ.కే. ఇప్పుడు నా అవసరం అయినప్పుడు పిలుస్తారని అన్నందుకు కృతజ్ఞురాలిని. నేను నా డెస్క్‌ దగ్గరుంటాను. అవసరం అనుకుంటే పిలవవచ్చు….” అంటూ వెళ్ళబోయింది.

”శర్మిష్టా, మరో మాట. నీ జాబ్‌లో, నీ పాత్రలో మార్పులున్నాయి…”

”మార్పులా!…. జోక్‌ చేస్తున్నారా! మీరంటున్నదేవిటో నాకు తెలీడం లేదు…”

”అంటే ఓ సంవత్సరం తర్వాత….”

”సంవత్సరం ఎందుకయిందో మీకు తెలుసు. నా ఆరోగ్య పరిస్థితి మీకు చెప్పాను. పూర్తి విశ్రాంతి తీసుకోవాలంటే, యింట్లోంచి పనిచేసాను. అది నా కమిట్‌మెంటు. మరోసారి పరిస్థితి బాగాలేకపోతే, ఆ పని కూడా నన్ను చేయొద్దని మెడికల్‌ లీవ్‌ తీసుకోమన్నారు. బేబి ప్రీ మెచ్యూర్‌. నేను డెలివరి టేబుల్‌ మీద ఉన్నప్పుడు, ఎప్పుడొచ్చి జాయినవుతానని కనుక్కున్నారు. చెప్పాను. నార్మల్‌ డెలివరి కాదు. సి. సెక్షన్‌ అయ్యాక, కుట్లు అవీ మానకుండానే మళ్ళీ నా జాయినింగ్‌ గురించి అడిగారు. ఆ తర్వాత మెసేజ్‌లు, మెయిల్స్‌ ఎన్ని పంపారో మీకు తెలుసు. నాకు తెలుసు. ఇవన్నీ మీరు ఏదో ఫన్‌ కోసం కాదు కదా… ఇప్పుడు ఏడాదిలో మార్పులు జరిగాయి. నా జాబ్‌లో మార్పులా!… ఓ.కే….” అని విసురుగా బయటికొచ్చి, తన డెస్క్‌ దగ్గరకెళ్ళి పనిచూసుకోడానికి తయారయింది.

ఆశ్చర్యంగా, లాగిన్‌లన్నీ డిసేబుల్‌ అయిపోయి ఉన్నాయి. వెంటనే మీనాక్షి ఇంటర్‌కామ్‌లో చెప్పింది…

”అదా… నువ్విక్కడ లేవు కదా….”

శర్మిష్టకి నమ్మకం కలగలేదు.

మెటర్నిటీ లీవ్‌ మీద వెళ్ళిన ఉద్యోగినుల్లో తనేమీ మొదటిది కాదు. ఇంతకు ముందు ఎంతో మంది వెళ్ళారు. లాగిన్‌లన్నీ ఇలా అవడం జరిగినట్లు వినలేదు.

వెంటనే ఐ.టి. టీముని పిలిచి చెక్‌ చేయించింది. ఇది ఓ పదిరోజుల క్రితమే జరిగిందని తెలిసింది.

శర్మిష్ట వెంటనే హెచ్చార్‌కి వెళ్ళి అక్కడున్న సుమ జోషిని అడిగింది.

”అసలేం జరుగుతోంది! నాకు చాలా ఇబ్బందిగా, అయోమయంగా ఉంది.”

ఆమె ఓసారి శర్మిష్టని చూసి, మోగుతున్న సెల్‌ని తీసుకుంది.

”సారీ… ఒన్‌ మినిట్‌…” అంటూనే ఎవరితోనో మాట్లాడాక తిరిగింది.

”అలాగా… అయినా… ఇవాళ శుక్రవారం కదా… నాకు కుదరకపోవచ్చు. సోమవారం వరకు నాకు టైమిస్తే, ఏ విషయం చెప్తాను…”

ఎంత ఉత్సాహంగా ఆఫీసుకొచ్చిందో… అంత నీరసంగా, నిరుత్సాహంగా ఉంది.

ఎవరితోను మాట్లాడొద్దని మీనాక్షి అనడం కూడా విడ్డూరంగా అనిపిస్తోంది. ఏం జరిగింది! ఏం జరుగుతోంది! సోమవారం వరకూ ఆగాలి… ఈ లోపల ఈ అవమానం ఎదుర్కోవడం ఎలా! అన్యాయం జరిగిపోయిందని తెలుస్తోంది.

ఇంటికెళ్లినా, ఎవరితోనూ మాట్లాడలేకపోయింది. విషయం అందరికీ చెప్పింది. ”అన్నీ మంచికే జరుగుతాయి… పిల్లాడిని చూస్తూ అన్ని మర్చిపో.. ఆలోచిస్తూంటే… అలా… అలా… డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతావు… ఇన్ని రోజులు సెలవ మీదే ఉన్నావు, మరో రెండు రోజులు కూడా ఉన్నావని అనుకో….”

ఇంట్లో అందుకే పెద్దవాళ్ళుండాలి. కౌన్సిలింగ్‌ చేస్తారు. తాత్కాలికంగానైనా మనసు కుదుట పడింది శర్మిష్టకి.

సోమవారం వచ్చింది.

మీనాక్షి శర్మిష్టని పిలిచింది. అప్పటికే అక్కడున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. ఓ బోర్డు మీటింగ్‌లా ఉంది. ఇంత సీన్‌ ఉండాలా! అంత సీరియస్‌ విషయమా!

మర్యాదగా అందరికీ విష్‌ చేసింది.

”కొత్త పాలసీ ప్రకారం నీ రోల్‌ కంపెనీకి అవసరం లేదని నిర్ణయించటం జరిగింది…”

శుక్రవారం నాడు, శర్మిష్టకి చూచాయగానే అనిపించింది, ఇలాంటిది ఏదో జరుగుతుందని… ఊహ నిజమే అయింది. కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు.

”నా రోల్‌ అవసరం లేదా! నా అవసరం లేదా!”

మీనాక్షి పక్కనున్న శంతనూ రాయ్‌ని చూసింది.

”తొమ్మిదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అందరికన్నా సీనియర్‌ని.”

”సీనియర్‌, జూనియర్‌ అని కాదు. పాలిసి….”

”అంటే….” వెంటనే అడిగింది శర్మిష్ట.

”మీరు రెస్ట్‌ తీసుకున్నప్పుడు ఇంట్లోంచి పనిచేసారు. ఆ తర్వాత మెడికల్‌ లీవ్‌, పైగా, చాలాసార్లు అన్నారు. కూచోడం కష్టం. ప్రిమెచ్యూర్‌. ఎపిడ్యూరల్‌ మూలంగా వెన్నెముక గట్టిగా అయిపోయిందని కుర్చీలో కూచుని పనిచేసేవరకూ, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని. అన్నారా లేదా!

ఇందులో నేను కల్పించింది ఏం లేదు. నేను అబద్ధాలు చెప్తున్నానని మీరు అనుకోకూడదనే మీ ముందే వీళ్ళకి చెప్తున్నాను. మీ విషయమై నిర్ణయం తీసుకోడానికి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అమెరికా ఆర్థిక స్థితి యింకా పూర్తిగా మెరుగుపడలేదు. రిసిషన్‌ నుంచి కోలుకోలేదు…”

”దానికి, నా జాబ్‌కి సంబంధం ఏం ఉంది? మీరంటున్నది ఎవరి విషయంలో, మూడు నెలల క్రితం ఇద్దరు సీనియర్‌ మేనేజర్లని తీసుకున్నారన్న సంగతి అందరికీ తెలుసు. అది రహస్యం కాదు. వాళ్లు ఫ్రీగా పనిచేస్తున్నారని నేను అనుకోను….”

”మీరు మీ విషయం గురించే మాట్లాడాలి….”

అవమానం అనిపించింది నోట మాట రాలేదు.

”మేం లాయర్లని కనుక్కున్నాం….”

”మీరు… ఏం కనుక్కున్నారు?”

”లా ప్రకారం మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు తీసేయకూడదు. డ్యూటీలో చేరడానికి వచ్చినప్పుడు తీసేయచ్చుట…”

శర్మిష్టకి అంత ఓ కుట్రలా అనిపిస్తోంది. భయం, అయోమయం ఆమెని చుట్టేసాయి.

”కావాలంటే, మీరు ఓ లాయర్‌ని సంప్రదించుకోవచ్చు…”

ఈ కంపెనీలో తొమ్మిదేళ్ళు పనిచేసింది. రోజుకి ఎనిమిది గంటలు కాదు, పన్నెండు గంటలు, ఒక్కొక్కసారి పద్నాలుగు గంటలు. అప్పుడు చాలా ఎఫీషియెంట్‌ అని అన్నారు. ట్రాక్‌ బావుందన్నారు. క్రెడెన్షియల్స్‌ యింకా బావున్నాయని అన్నారు. ప్రతీ ఏడాది అప్‌రైజల్స్‌లో మంచి రిపోర్ట్స్‌ ఉండేవి. ఇంక్రిమెంటు బాగా ఉండేది. అలాంటిది ఈ రోజున తన సర్వీసెస్‌ అవసరం లేదని, తన రోల్‌ లేదంటారా! ఇంత అవమానకరంగా తీసేయదల్చుకున్నారా!

మీనాక్షి వాళ్ళు పెట్టిన మెసేజ్‌లు, మెయిల్స్‌ ఉన్నాయి వాటిని చూపించి, ఆ ఋజువులతో, తనని అన్యాయంగా తీసేసారని చెయిర్మెన్‌కి వాళ్ళకి చెప్పచ్చు.

ఆ తర్వాత చెక్‌ చేస్తే అవేవీ లేవు. అన్నీ తీసేసారు. పిచ్చి పట్టినట్లయింది ఆమెకు.

ఇలా ఋజువు లేకుండా చేసి, వీళ్ళంతా కలిసి, తనని ఓ మూలకి తోసేసి, మీద పడి, కింద పడేస్తారని అనుకోలేదు. అసలు ఆ ఆలోచన రానే లేదు. ఊహించను కూడా లేదు.

తర్వాత బోర్డులోని సీనియర్‌ డైరెక్టర్‌ మిసెస్‌ సింగ్‌కి, చెయిర్మెన్‌కి, హెచ్చార్‌ హెడ్‌కి, మరో ఇద్దరికీ, తనని వెళ్ళిపొమ్మన్న విధానం గురించి, మెయిల్స్‌ యిచ్చింది.

మిసెస్‌ సింగ్‌ జవాబివ్వలేదు. కానీ, శంతనూ రాయ్‌ వచ్చి, శర్మిష్టని కలిసారు.

”ఇప్పుడేం కావాలి?” అని అడిగాడు.

శర్మిష్ట తెల్లబోయింది.

”అదేం ప్రశ్న! ఏం కావాలి ఏవిటీ! నా జాబ్‌ కావాలి. న్యాయం జరగాలి. అన్యాయంగా తీసేసారు…”

”ఓ.కే. అన్ని వివరంగా కనుక్కుంటాను..”

న్యాయం జరగదని ఆమెకి అనిపిస్తోంది.

కొలీగ్స్‌ ఏం అనుకుంటున్నారో మధ్య మధ్య ఆమెకి తెలుస్తోంది.

”తొమ్మిదేళ్ళు వర్క్‌ హాలిక్‌లా పనిచేసింది. అంత సీనియర్‌ని ఉద్యోగం లోంచి తీసే విధానం ఇదా!”

”అసలు శర్మిష్ట మెడికల్‌ లీవ్‌ తీసుకోకుండా ఉండాల్సింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తాననాల్సింది. లీవ్‌ అంటే యాబ్సెంట్‌ కిందే లెక్క. ఇంట్లోంచి పని ఉంటే డ్యూటీలో ఉన్నట్లే….”

”అసలు వాళ్ళ మనసులో ఏవుందో శర్మిష్టని పిలిచి చెప్పాల్సింది. నీకు మెటర్నిటీ లీవు ఏడు నెలలే. కానీ, నువ్వు ఓ నాలుగు నెలలు ఎక్కువ తీసుకున్నావు, అని చెప్పి దానికేం చేయాలో చెప్తే బావుండేది. కానీ, నువ్వు చేస్తున్న జాబ్‌ అవసరం లేదని అనడం చాలా అవమానకరం….”

”విమెన్‌ మేనేజర్స్‌ పాలిసి ఉంది. నిజమే కానీ ఆ పాలిసిని అడ్డం పెట్టుకుని తీసేయడం ఏం బాగా లేదు. ఇదో డ్రామా… మానవత్వం ఉండాలి. ఆ కోణంలోంచి చూస్తే శర్మిష్ట ఉద్యోగం పోయేడిది కాదు….”

శర్మిష్ట తన గురించి అనుకుంటున్నవన్నీ విన్నాక, ఇంక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుందేమో ననిపించింది.

రెండు నెలలు గడిచిపోయాయి.

ఏదో పనిమీద శంతనూరాయ్‌ వచ్చాడు. అతన్ని కలుసుకుంది.

”ఈ రెండు నెలలు నువ్విచ్చిన మెయిల్స్‌, మెసేజ్‌లు అందరూ చూసారు. మాకు అర్థం అయింది ఒక్కటి. ప్రసవం అయ్యాక మీలో మానసికంగా చాలా మార్పులొచ్చాయి. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలీటం లేదు.”

శర్మిష్ట చలనం కోల్పోయింది. కళ్ళు అప్పగించి చూడడం తప్ప మరేం చేయలేక పోయింది.

ఏం మాట్లాడుతోందో తెలీదా! అంటే….

ఈ శంతనూ రాయ్‌ హార్వర్డ్‌లో చదివాడు. ఎంతోమంది ఉద్యోగినులను చూసినవాడు. ఎన్నో ఏళ్ల అనుభవం, ఎన్నో దేశాలు తిరగిన మనిషి ఇలా మాట్లాడగలడా!

ఈ కంపెనీలో అందరూ సమానం. లింగ వివక్షత లేదు. అని గొప్పలు చెప్పే కంపెనీలో ఇది ఏవిటో అర్థం కాలేదు.

ఇదివరకటి ఋజువులు ఉంచుకోలేక పోయింది. అసలు ఉంచుకోవాలని తోచలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలగనలేదు. ఆ తప్పు ఈసారి చేయదలుచుకోలేదు. అందుకే ముందు జాగ్రత్తగా స్మార్ట్‌ ఫోన్‌ పెట్టుకుంది.

అందులో శంతనూరాయ్‌ మాట్లాడిన వన్నీ ఉన్నాయి. ఆ రికార్డ్‌ అయిన మాటల్ని కొలీగ్స్‌కి వినిపించింది. వాళ్ళు చాలా ఆశ్చర్య పోయారు.

”ఇవాళ నీకయింది. రేపు మాలో ఎవరో ఒకరికి జరగచ్చు. మనం అంతా ఒకటవ్వాలి.

అయినా ఒకటర్థం కావడం లేదు. వీళ్ళు ఈ యుగంలోనే ఉన్నారా అని. ఇరవయ్కొకటో శతాబ్దంలో కూడా, ప్రెగ్నెన్సీ గురించి, ప్రీమెచ్యూర్‌, సి సెక్షన్‌ గురించి, దాని తర్వాత వచ్చే ఇబ్బందుల గురించి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారా!” అంది ఆశ్చర్యంగా జాన్వి.

”కేసు వేస్తే…”

”వెయ్యచ్చు. వాళ్ళు చేసింది పాలిసీల ప్రకారం. అంటే నువ్వు తొమ్మిదేళ్లు అరవ చాకిరి చేసినా, అర్థరాత్రి వరకూ ఉన్నావా అన్నది ఇమ్మెటీరియల్‌. అది వాళ్ళకక్కర్లేదు. అది చూసారంటే ఇమోషన్స్‌ వస్తాయి. బిజినెస్‌లో ఇమోషన్స్‌, ఫీలింగ్స్‌ ఉండవు. పనిచేసిన దానికి, అన్ని రకాల లాభాలు పొందింది కదా అని అంటారు…

ఒకటి మాత్రం నిజం. ఆడవాళ్ళని, ఎక్కడ అణిచేయాలో అక్కడే అణిచేస్తున్నారు. అందరూ సమానం అంటారు. కానీ కాదు. మన తోటి ఉద్యోగస్తులే ఈ ఆడవాళ్ళకి ఇన్ని నెలలు మెటర్నిటీ లీవ్‌ ఏవిటని ఉక్రోషం. ఆ అసూయని ఇది ఇలా వ్యక్తీకరిస్తున్నారు…

అందరి మాటలు వింటూంటే, శర్మిష్టకి పిచ్చిపట్టేట్లుగా ఉంది. ఇంట్లో వాళ్ళు శర్మిష్ట పక్కన నుంచున్నారు.

”ఇది కాకపోతే మరో ఉద్యోగం దొరుకుతుంది. కొన్ని రోజులు ఇంట్లో పిల్లాడితో హాయిగా గడుపు… ఈ అనుభవం ఓ పాఠం…” అని చెప్తున్నా మనసు కుదుట పడడం లేదు.

ఎవరికి మొహం చూపించాలన్నా తనే ఏదో పెద్ద తప్పు చేసిందని అనుకుంటున్నారేమోననిపిస్తోంది.

రాత్రి నిద్ర రావడం లేదు. ఒక్కొక్క బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకుంటే…! అన్న ఆలోచన కూడా మధ్య మధ్యలో వస్తోంది.

ఇంట్లో, అత్తగారు, అమ్మ, భర్త, చంటి పిల్లాడు కనపరుస్తున్న ప్రేమ. ఇస్తున్న మనో ధైర్యం. ”నీ యాటిట్యూడ్‌, దృష్టి అన్నీ మారాలి… నువ్వు ముందు ఎదగాలంటే, ఇలాంటి వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నవో చూపించగలగాలి.. అందరికీ” ఇంట్లో వాళ్ళ మాటలు తలని తాత్కాలికంగా నిటారుగా నిలబెడ్తున్నాయి. మళ్ళీ ఏదో మూలల్లోంచి తెలీని భయం పిరికితనం. తల వాలిపోతోంది.

నిజం ఈ ధైర్యాన్నిస్తున్న మాటలు నిజం. యాటిట్యూడ్‌ ఇక్కడ బలంగా ఉన్నది మీనాక్షి యాటిట్యూడ్‌. తోటి స్త్రీ. కానీ… బిజినెస్‌ మైండ్‌. ఆమె యాంబిషన్‌ ఆమెది. అవకాశాన్ని వదుల్కోదు. అది ఆమె చూపించుకుంది. దానికి తనకి కోపం రావాలా! రాకూడదు. కానీ, మోసం చేసింది దానికే పోరాడాలి. ఈ రోజు శర్మిష్ట. రేపు మరో ఉద్యోగిని. అంతే ఈ ఉద్యోగాల్లో భావోద్వేగాలకి చోటు లేదు. యాంత్రిక జీవితం. యంత్రాలు. అని అందరూ అనుకుంటూంటే నిశ్శబ్దంగా వినడం తప్ప మరేం చేయలేకపోయింది.

ఆ తర్వాత శర్మిష్ట అకౌంట్ల డేటా, మెయిల్స్‌ అన్నీ ఆపేసారు దానితో మరీ నిర్వీర్యురాలైనట్లుగా అనిపించింది.

ఓ రెండు నెలలు మానసికంగా యుద్ధం చేసిన శర్మిష్ట, ఇంట్లో కొడుకుని ఆడిస్తూ, టీవి చూస్తూ, పేపరు చూస్తూ కూచుంది.

ఒక్క క్షణం కూడా, తల్లి, అత్తగారు ఆమెని వదలడం లేదు. ”నీలోని పవర్‌ తీసేసాం అని మీనాక్షి వాళ్ళనుకుంటే, అది వాళ్ళ తప్పు, నువ్వేం పోగొట్టుకోలేదు. అన్నీ పోయాయని కూడా అనుకోకు.

నువ్వు ఇంత మంది ఆటగాళ్ళ, పారిశ్రామిక వేత్తల, సీ.ఈ.వో. ల ఆత్మకథలు చదివావు. మరి అందులోంచి ఏం నేర్చుకున్నావ్‌!

అసలు మన సమాజం ఎలా ఉంది! అవకాశం కోసం నక్కల్లా కాచుకుని, నిర్భయ, అభయ కేసుల్ని ఏమాత్రం భయం లేకుండా పెంచేస్తున్న ఉన్మాదులతో ఉంది.

ఆడపిల్ల పుట్టగానే చంపేస్తున్నారు. పుట్టకుండానే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుడ్తే రోడ్డు పక్కనుండే కుప్పల్లో పొదల్లో పడేస్తున్నారు. వాళ్ళు తినే ఆహారాల్లో పోషక విలువలుండవు. స్కూళ్లు మానిపించేయడం, పనిమనుషులుగా తయారు చేయడం, వ్యభిచార గృహాలకి అమ్మేయడం, ఇదీ మన సమాజం. అలాంటప్పుడు మీ కంపెనీ, దీనికి భిన్నంగా ఎలా ఉంటుంది! ఎక్కడ వివక్షత చూపించాలో అక్కడ ఏమాత్రం జాప్యం చేయకుండా చూపించేస్తున్నారు.

ఈ ఐ.టి. ఉద్యోగాలు ఇలాగే మానసిక ఒత్తిళ్లతో ఉంటాయి. ఛాలెంజ్‌లు ఎదురొస్తూంటాయి. ఈ యుద్ధాలు చేయాల్సిందే. ప్రతీ ఆర్గనైజేషన్‌ ఇంచు మించు ఒకలాగానే ఉంటాయి. రూల్స్‌ అవే, పాత్రలూ అవే. మీ చదువుకి, నీ అనుభవానికి తగ్గట్లుగా ఎదగాలంటే, పోరాటం తప్పదు… కూచుంటానంటే కుదరదు. లేచి, ఈ సూపర్‌ స్పీడ్‌లో వెళ్ళిపోతున్న ప్రపంచంతో, అంతే వేగంగా వెళ్ళాల్సిందే. మనసుని ఓ చిత్తు కాగితంలా చేసుకుని ఓ మూల పడేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే అది నీ మనసు నీ స్వంతం. స్వంత వస్తువుల్ని పాడు చేసుకోవాలని చిన్న పిల్లలు కూడా అనుకోరు….”

కౌన్సిలర్‌ దగ్గర కూచుని, అన్నీ విన్న శర్మిష్ట, మరో నాలుగు నెలలకి మానసికంగా మరో ఉద్యోగానికి తయారయింది. మరో పోరాటం ఎదురైతే ఈ మాటు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.