మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు

(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) – పి.వి. లక్ష్మణరావు

”పితారక్షతి కౌమార్తే భర్తా రక్షతి యౌవనే, సుతా రక్షతి వార్ధక్యే నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని వ్యాసుడు జయసంహితలో చెప్పాడు. స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు ఆలంబనగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు” అని తాత్పర్యం. అయితే ఇది వ్యాసుడి కాలం నాటి మాట. ఇక్కడ ఆలంబన పొందడం, ప్రకృతి పరమైన అవసరమే గాని అసమర్థత కాదని నేటి సమాజం గుర్తించాలి. చాలా విషయాల్లో స్త్రీ విశేషమైన శక్తి గలది. ఆమెకు గల సౌకుమార్యం, సేవాదృక్పథం, త్యాగబుద్ధి, సంయమనం పురుషునికి ఉండనే ఉండవు. సంతతికి జన్మనివ్వడంలో, పెంచడంలో, శిక్షణ ఇవ్వడంలో స్త్రీదైవాంశ సంభూత అందుకే ఆమెకు ‘మాతృదేవోభవ’ అని ఆరాధనలో ప్రథమస్థానం ఇచ్చారు.

ప్రకృతికి పర్యాయపదంగా… ఆకాశంలో సగంగా… అభివర్ణించబడే స్త్రీ వేదకాలం నుంచి పురుషాధిక్య ప్రపంచంలో అణచివేతకు గురవుతూనే ఉంది. తల్లిగా తన స్తన్యంతో శక్తిని నింపి… గోరుముద్దలు తినిపించి నడక, నడత నేర్పించి… ఆలిగా.. జీవిత భాగస్వామిగా కష్టసుఖాల్లో సహధర్మచారిణిగా సాగే స్త్రీకి సమాజంలో అందుతున్న గౌరవం అంతంత మాత్రమే. స్త్రీ పురుష సమానత్వం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఏ కాలంలోనూ, ఏ దేశంలోనూ, ఏ సమాజంలోనూ లేనే లేదు. ఇది చరిత్ర చెప్పిన నిజం. మన దేశంలోని జనాభాలో సగం మంది స్త్రీలే. వీరు అన్నీ రంగాల అభివృద్ధిలో పురుషులతో పోలిస్తే వెనుకబడి ఉన్నారు. కారణం స్త్రీలు సామాజిక కట్టుబాట్లు, కులగౌరవం, క్రమశిక్షణ పేరుతో బయట ప్రపంచంతో సంబంధాలు లేక గృహానికి పరిమితం కావడమేనని చెప్పవచ్చు.

ఇలాంటి బంధనాల నుండి స్త్రీలు బయటపడిన రోజే స్త్రీజాతి విముక్తిని సాధిస్తుంది. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిననాడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది లేకపోతే ఆ దేశం వెనుకబడిపోతుంది. ఎందుకంటే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ ఎలాగో, ‘దేశానికి వెలుగు స్త్రీజాతి’ అని గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది. ”స్త్రీయశ్చా-పురుషామార్గం సర్వాలంకార భూషితాః నిర్భయా ప్రతిపద్యంతే యదా రక్షతి భూమిపాః” (సంస్కృత భారతం, 12-68-32). ‘ఏ దేశంలో స్త్రీలు సర్వాలంకారాలతో పురుషుల తోడు లేకుండా రహదారుల్లో, వీధుల్లో నిర్భయంగా తిరుగగలరో అక్కడే సుపరిపాలన ఉందని చెప్పొచ్చు’ అని దీని అర్థం. ఇలాంటి మాటలు వినడానికి ఇంపుగానే ఉంటాయి గాని నాటికీ నేటికీ విద్య, ఉద్యోగాలలో ఏదో కొద్దిపాటి మార్పు తప్పించి నైతిక విలువల దృష్ట్యా స్త్రీస్థానంలో పెద్ద మార్పేమీ లేదేమోననిపిస్తుంది.

ఒక వంక కన్యాశుల్కం, మరో వంక బాల్యవివాహాలు, వేరొక వంక బహు భార్యత్వం, నిర్భంధ వైధవ్యం, సతీ సహగమనం, వేశ్యాలోలత్వం లాంటి సంకెళ్లలో స్త్రీలు బందీలుగా ఉన్న రోజుల్లోనే ఆశాజీవి అయిన గురజాడ ”ఎప్పటికైనా ఆమె విముక్తి పొందుతుందని, నవీన యుగపు స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది” అని వంద సంవత్సరాల క్రితమే ఉద్బోధ చేశారు. ఆనాటి సమస్యలు, అవగాహనలు, ఆదర్శాలు, అనుభవాలు వేరు. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో పయనిస్తున్నాం. శాస్త్రీయ దృక్పథం పెరిగింది. నాగరికత పెరిగి చంద్రుడి మీదకు అడుగుపెట్టాం. ఎన్నో అసాధ్యాలనుకున్నవి సుసాధ్యాలయ్యాయి. కానీ ఏం లాభం? స్త్రీల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉన్నది. నేటికీ స్త్రీ ఇంకా ఒక అగ్నిగోళంలోనే తన జీవనాన్ని కొనసాగిస్తున్నది.

నేటి సమాచార సాంకేతిక యుగంలో కూడా అనేకానేక ఒత్తిడుల మధ్య జీవిస్తున్నది. ఆర్థిక పరాధీనత, బ్రతుకు బానిసత్వం ఆమెను లొంగదీసేలా చేస్తున్నాయి. దానికి తోడు మారుతున్న సమాజవిలువల దృష్ట్యా సాంఘిక దురాచారాలు, వరకట్నం, మద్యపాన వ్యసనాలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, స్త్రీ గౌరవ ప్రతిపత్తులకు గొడ్డలివేటుగా తయారయ్యాయి. వరకట్న మరణమో, మానభంగమో, అత్యాచారమో ఆమెను కబళిస్తూనే ఉన్నాయి.

ఏది ఏమైనా మను ధర్మశాస్త్రం మొదలు నేటి వరకు వెంటాడుతున్న ఆంక్షల అడ్డుగోడలను బద్దలు కొడుతూ అస్తిత్వం కోసం స్త్రీ చేస్తున్న పోరాటం గొప్పది.పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ విజయాల్ని దక్కించుకుంటూ ఆధునిక కాలంలో ఆడది ‘అబల’ కాదు ‘సబల’ అని నిరూపించు కుంటున్నది. పురుషులతో సమాన స్థాయికి చేరుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు అటు గృహనిర్వహణలోను, ఇటు ఉద్యోగం, విధి నిర్వహణలోనూ నలిగిపోతున్నారు. ఉదయం లేచింది మొదలు అత్తమామలను, భర్తని సవరించడంలోనూ బిడ్డలను సాకడంతోనూ సతమతమౌతూ సకాలంలో విధులకు హాజరుకాలేకపోతున్నారు. కనీస వసతులు లేని కార్యాలయాలలో తమ ఇబ్బందులను చెప్పుకొనలేక కంటతడి పెడుతున్నారు. అధికారుల వేధింపులను, సహోద్యోగుల ఎత్తిపొడుపు మాటలను సహిస్తూ విసిగి వేసారి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా, కనీసం కుటుంబ సభ్యుల సానుభూతి గాని, సహకారాన్ని గాని పొందలేకపోతున్నారు.

పరిస్థితులెలా ఉన్నా జీవన పోరాటంలో పురోగమనం సాధిస్తూ, అమ్మదనం నుంచి అంతరిక్షం దాకా ఎదిగి అంతర్జాతీయంగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటుప్పటికీ పితృస్వామ్య వ్యవస్థ లక్ష్యాలు, ఆదర్శాలు ఆమెపట్ల ఘోరమైన వికటాట్టహాసం సలుపుతున్నాయి. స్త్రీకి స్వేచ్ఛా సమానత్వం ఇంకా నూరామడల దూరంలోనే ఉందనేది తప్పక ఒప్పుకోవ లసిన నగ్నసత్యం. ఆడశిశువుల అమ్మకాలు, బ్రూణహత్యలు, వరకట్న వేధింపులు, గృహహింస, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక దాడుల్లాంటి అనేకమైన సాంఘిక దురాచారాలు స్త్రీలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అందుకే మహిళల జీవితాలకు భద్రత లేని దేశాలలో భారతదేశానిది నాలుగవ స్థానానికి చేరింది. మొదటిస్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌, రెండవ స్థానంలో కాంగో, మూడవ స్థానంలో పాకిస్తాన్‌ ఉన్నాయి.

దేశంలో రోజురోజుకు పెరుగు తున్న నేరాలలో అత్యధికం మహిళలపై జరుగుతున్న నేరాలే ఉండటం గర్హనీయం. ఆడవారిలో దాడులు ఒక్కోదశలో ఒక్కొక్క విధంగా ఉండటంలో మహిళల ఉనికే ప్రశ్నార్థకం కానుందా అన్న అనుమానం కలుగుతుంది. కడుపులోని బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యచేయడం గానీ లేకపోతే ఆడపిల్ల పుట్టగానే గాయపరచడం లేదా హత్యచేయడం, కన్నుతెరవని పసికందులను అమ్మేయడం, బాల్యవివా హాలు, లైంగిక వేధింపులు, వ్యభిచారకూపం లోకి నెట్టివేయడం, యవ్వనదశలో ఈవ్‌ టీజింగ్‌, కిడ్నాపింగ్‌, అత్యాచారం లేదా మానభంగం, వరకట్నచావులు, గృహహింస, లైంగికవేధింపులు, భౌతిక దాడులు, మానసిక వేధింపులు, బలవంతపు గర్భస్రావాలు, పెద్దవారిలో లైంగిక వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు, ముసలివయస్సులో పిల్లల నుంచి నిరాదరణ, అనారోగ్య సమస్యలు ఇలా ప్రతిస్థాయిలో మహిళ ఎదుర్కొంటున్న సమస్యలు అనంతం.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిసంవత్స రం ఎనిమిది లక్షలమంది మహిళలను, బాలికలను వ్యభిచారంలోకి నెడుతున్నారు. మన దేశంలో ప్రతి ఏటా 30 వేల మంది అక్రమరవాణా ఊబిలో చిక్కుతున్నారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, హత్యలతో మహిళల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నా యి. కాబట్టి మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులకి కారణాలను అన్వేషిస్తూ వీలైనన్ని పరిష్కార మార్గాలను సూచించడమే ప్రస్తుత వ్యాసోద్దేశం.

ఇకపోతే పురుషుడు స్త్రీని లైంగికంగా వేధించే లేదా బాధించే ప్రక్రియకి మరోపేరే అత్యాచారం లేదా లైంగిక దాడి. ఈ మధ్య కాలంలో నమోదైన మొత్తం మహిళా కేసులలో సగానికి పైగా లైంగిక వేధింపులకి సంబంధించినవే. చాలా మంది ఉద్యమకారులు మహిళలమీదే పెరుగుతున్న లైంగిక వేధింపులకి కారణాలను అన్వేషిస్తున్నారు.

మహిళలపై లైంగిక దాడులకి కారణాలు :

ప్రపంచీకరణ పేరుతో దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రభావితం కానివారు లేరంటే అతిశయోక్తి కాదు. సరళీకరణ విధానాలు ప్రారంభమై నప్పటి నుంచి నేటి వరకూ 823 శాతం నేరాలు పెరిగాయని జాతీయ నేర పరిశోధనా సంస్థ అంచనాల్లో తెలిపింది. నేటికీ ఆడపిల్ల పెంపకంలో వివక్ష కొనసాగుతూనే ఉంది, పెళ్లికి వరకట్న సమస్యను ఎదుర్కొవాల్సి వస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినా, పురుషులతో సమానంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నా కుటుంబాల్లో పేరుకుపోయిన ఛాందస భావజాలం కారణంగా ఇదంతా జరుగుతున్నది. దీని వల్ల సమాజంలో మహిళల శాతం తగ్గిపోతున్నది.

సరళీకరణ, ప్రైవేటీకరణలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపో యింది. మీడియా స్వరూపమే మారిపోయి ంది. దేశవిదేశాల ఛానళ్లు గ్రామగ్రామాన దర్శనమిస్తున్నాయి. స్త్రీలను కించపరిచే కార్యక్రమాలు, అశ్లీలతతో కూడిన అంశాలు సమాజంపై సూటిగా ప్రభావం చూపుతున్నాయి. స్త్రీలను విలన్లుగా, మోసం, విద్వేషం, కుట్రలు, కుతంత్రాలు చేయడమే సహజలక్షణంగా కలిగినవారిగా చూపుతు న్నారు. ఇలా మహిళల పట్ల చూపించే పెడధోరణి వల్ల సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు, చులకన భావం పెరిగింది. అంతేకాదు అలాంటి కార్యక్రమాలు చూడడం నేటి మహిళా లోకానికి ఒక వ్యసనంగా మారిందంటే వాటి శక్తిని అర్థం చేసుకోవచ్చు. సినిమాల విషయానికొస్తే కొత్తదనం కోసం ప్రేమను తిరస్కరిస్తే ఆడవాళ్లను చంపడాలు, యాసిడ్‌ పోయడాలు, గొంతు కోయడాలు వంటి భయంకర కథాంశాలతో బెంబేలెత్తిస్తున్నాయి. వాటికి తోడు నేడు విస్తరిస్తున్న విదేశీ సంస్కృతిని నరనరాన జీర్ణింప చేసుకుని పెడదారి పట్టిన యువకుల ఆకృత్యాలు, ఉన్మాదహత్యలు, ప్రేమహింసల కారణంగా చివరికి బలవుతున్నది మహిళలే.

మహిళలు మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని మరికొందరు పెద్దలు చెబుతున్నారు. కానీ అది ఏమాత్రం సరైన వాదన కాదు. కాబట్టి ఇలాంటి భావజాలాన్ని రూపుమాపాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది. డ్రెస్‌కోడ్‌ను బట్టి ఈ సంఘటనలు జరగడం లేదని కొందరి బుద్ధి ప్రకోపించడం ద్వారానే ఈ సంఘటన లు చోటు చేసుకుంటున్నాయని గుర్తించాలి. ఐదేళ్ల పసి పిల్లల మొదలు, 50 ఏళ్ల ముసలివారి పైనా ఇలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకోవడం చాలా దారుణమైన విషయం. ఈవిధంగా ఇంటా బయట ఎదురవుతున్న వేధింపులను ప్రతి స్త్రీ ధైర్యంగా ప్రతిఘటించాలి.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేసిన చట్టాల అమలులో లోపాల కారణంగా, మహిళలపై దాడులు చేసిన వారిని కఠినంగ శిక్షించని కారణంగా కూడా నానాటికీ మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారహత్య కేసులలో సైతం హంతకులను గుర్తించక పోవడం, ఉన్మాదులుగా మారి అమ్మాయిల ప్రాణాలు తీసినవారికి కఠిన శిక్షలు పడకపోవడంతో ఆడపిల్లలు అర్థరాత్రే కాదు పట్టపగలు కూడా ధైర్యంగా నడవలేని దుస్థితి దాపురించింది. బడి, గుడి, ఇల్లు, ఆఫీస్‌, కాలేజీ, హాస్టల్‌… ఇలా అన్నీచోట్లా మహిళలకు రక్షణ కరువైంది. కాసుల వెంట తీసే పరుగులలో స్త్రీత్వం ఛిద్రమైంది. కంపెనీలలో లైంగిక వేధింపులు, శారీరక పురుషాధిపత్యాలు తగ్గకపోగా ఉద్యోగినులకు వీకెండ్‌ పార్టీలు, పబ్‌ కల్చర్‌, డ్రింక్‌ కల్చర్‌ల వంటి మల్టీనేషనల్‌ సంస్కృతుల అలవాటవుతున్నాయి. దాంతో భోగలాలస త్వం పెరిగింది. తల్లిదనం, అమ్మదనం, స్త్రీత్వం వంటి పదాలను స్త్రీలకు ఆపాదించి పురుషవర్గం స్త్రీలను కుటుంబబానిసను చేసింది.

తల్లిగా, గృహిణిగా.. గురుతరమైన బాధ్యత వహిస్తున్నటువంటి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక స్థైర్యాన్ని, మారుతున్న సమాజానికి అనుగుణంగా పరిస్థితులను చక్కదిద్దుకోదగిన సామర్థ్యాన్ని కేవలం విద్య మాత్రమే అందిస్తుంది. కానీ గ్రామీణప్రాంతాలలో అయితే మహిళల అక్షరాస్యత నేటికీ చాలా తక్కువగా ఉంది. అందుకే గ్రామీణ స్త్రీలు కూలి పనే జీవనాధారంగా, స్వంతభూమిలేక, ఒకవేళ ఉన్నప్పటికీ భర్తల పురుషపెత్తనం వల్ల, స్వంతభూమిలోనే కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. నిరక్షరాస్యత, బాలికా అవిద్య, వెనకబాటుతనం, కులవివక్ష, బాల్య వివాహాలు, అధిక సంతానం వంటి సమస్యలతో జీవన పోరాటం చేయవలసి వస్తున్నది. పెత్తందారుల నుంచి లైంగిక దాడుల్ని కూడా ఎదుర్కోవలసి వస్తున్నది.

పైకి కనబడటానికి అన్నిరంగాల లోను మునుపటి కన్నా నేడు స్త్రీలు హక్కుల సాధనలో ఎదుగుదల సాధించినప్పటికీ, సాపేక్షంగా చూస్తే స్త్రీలు పక్కకు నెట్టివేయబడుతున్నారు. స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు పెరగటం, స్త్రీల పట్ల వివక్ష, అసమానత, చులకన భావం వంటి వాటి వల్ల దోపిడీ రూపాల తీవ్రత పెరిగి అరాచకాలు, శారీరక, మానసిక హింసలు పెచ్చుమీరుతున్నాయి. స్త్రీలపై హింస, నేరాలు, నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. స్త్రీల వేధింపు, బాధలకు వేదనలకు గురవుతూనే ఉన్నారు. బలవంతపు వ్యభిచారం, లైంగిక వేధింపులు, కుటుంబంలో హింస, వరకట్నపు చావులు, హత్యలు, అపహరణలు, బాల్యవివాహాలు, భ్రూణహత్యలు, మానభంగాలు, వెట్టిచాకిరి, లింగవివక్ష, స్త్రీలకు పురుషులతో సమానవేతనం లభించకపోవడం, ఈవ్‌టీ జింగ్‌, క్రూరత్వం, కస్టోడియల్‌ హింస, బాలకార్మిక వ్యవస్థలు, సతీసహగమనం మొదలైనవి మహిళల మానవ హక్కుల ఉల్లంఘనలకు మచ్చుతునకలు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందించాయి. మహిళా సంక్షేమం కోసం అరకొరగానైనా కొన్ని పథకాలు రూపొందించాయి. అయితే వాటిపై సరైన అవగాహన, తగిన విషయ పరిజ్ఞానం లేనందువల్ల, వాటిని వినియోగించుకో లేకపోవటమేగాక అనేక రకాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారు. ఆయా చట్టాల అమలు విషయంలో జరుగుతున్న అశ్రద్ధ కారణంగా మహిళల స్థితి గతులలో ఆశించిన మార్పులు రావడం లేదు.

లైంగిక వేధింపుల గణాంకాలు :

ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, శారీరక హింస అనేవి నేటి అమానవీయ పరిస్థితులకు పరాకాష్టగా భావించవచ్చు. దేశరాజధానిలోనే పరిస్థితి ఘోరంగా ఉంటే, ఇక గ్రామీణ ప్రాంతాల్లో సంగతి చెప్పనవసరం లేదేమో? వాస్తవానికి అత్యాచారాలు, లైంగిక వేధింపులపై అనేక సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. కుటుంబ పరువు, సామాజిక పరిస్థితులు, కులపెద్దల ఒత్తిడులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి.

ఎప్పుడైతే ఢిల్లీ నగరంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం సంఘటన వెలుగు చూసిందో అప్పటినుండి మనదేశంలో ఆడపిల్లకు భద్రత కరవైందన్న ఆందోళన సెగలు ఆసేతు హిమాచలం రగులుకు న్నాయి. కేవలం ఢిల్లీ మహానగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా మైనర్‌ బాలికలపై అత్యాచారా లు నిత్యకృత్యంగా మారాయని గణాంకాలు ఘోషిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశం మొత్తం మీద చిన్నారులపై అత్యాచారాలు 336 శాతం మేరకు పెరిగినట్లు ‘జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ’ (ఎన్‌.సి. ఆర్‌.బి.) విడుదల చేసిన నివేదిక ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. 2001 నుంచి 2011 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మైనర్‌ బాలికలపై అత్యాచారాలకు సంబంధించి 48,338 కేసులు నమోదయ్యాయి.

ఇకపోతే, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు కాని కేసుల సంఖ్య వేలల్లో ఉంటుందని ‘ఆసియా ప్రాంత మానవ హక్కుల సంస్థ’ (ఎ.సి.హెచ్‌.ఆర్‌) మరో నివేదికను విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం బాలికలపై అత్యాచారా లకు సంబంధించి మధ్యప్రదేశ్‌ 9,465 కేసులతో ముందు వరసలో నిలిచింది. గత పదేళ్ల కాలంలో మహారాష్ట్రలో 6,868 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 3,977 కేసులు, ఢిల్లీలో 2,909 కేసులు నమోదయ్యాయి. ఇక, అనాథ బాలల శరణాలయాల్లో 38 అత్యాచారాలు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం. ప్రభుత్వం నడుపుతున్న అనాధాశ్రమాల్లో 11 మంది బాలికలు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న శరణాలయాల్లో 27 మంది బాలికలు అకృత్యాలకు గురయ్యారు. బాలల సంక్షేమానికి ఏర్పాటైన శరణాలయాల్లో కూడా అత్యాచారాలు, లైంగిక వేధింపులు, శారీరక హింస కొనసాగడం చాలా దారుణం.

మూడు నెలల్లో 393 కేసులు..!

‘అత్యాచారాల రాజధాని’గా అపఖ్యాతి మూటగట్టుకున్న ఢిల్లీ నగరంలో నేరాల పర్వం నిరాటంకంగా కొనసాగుతోంది. పోలీసు అధికారుల గణాంకాల ప్రకారం ఢిల్లీ నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకూ 393 అత్యాచార కేసులు నమోదయ్యాయి. రాజధానిలో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట మైనర్‌ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 393 అత్యాచారాల కేసులు నమోదు కావడం ఆందోళనకర పరిణామమేనని ఢిల్లీ పోలీసు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 15 వరకూ ఢిల్లీలో 661 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది పరిస్థితి మరింతగా విషమించడం పట్ల ఢిల్లీవాసులు, ఉద్యమకారులు పోలీసుశాఖపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

అత్యాచారం కేసుల్లో నేర పరిశోధన, శిక్షలు తీరుతెన్నులు :

మహిళలపై అత్యాచారం కేసుల్లో నేర పరిశోధన, శిక్షల తీరుతెన్నులు ఆశాజ నకంగా లేవని అధికారిక గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా విస్తరిస్తున్నా నేర పరిశోద న లోపభూయిష్టంగానే జరుగుతోంది. ఫలితంగా అత్యాచారం కేసుల్లో బాధితులకు న్యాయం ఎండమావిగానే మారుతోంది. మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ఏటేటా దేశంలో ఈ తరహా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో శిక్షల శాతం క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగించే పరిణామం. 1973 నుంచి 2010 వరకూ గణాంకాలకు పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది.

1973లో శిక్షపడిన కేసులు 44.20 శాతం కాగా, 1983లో 36.83 శాతం, 1993లో 30.30 శాతం, 2003లో 26.12 శాతం, 2010లో 26.50 శాతంగా నమోదు కావడం గమనార్హం. 1973లో నమోదైన అత్యాచారం కేసుల్లో చాలావరకూ నిందితులకు (44.28 శాతం) శిక్షలు పడ్డాయి. అత్యాచారాల సంఘటనలపై దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాలు, సామాజిక వేత్తల నిరసనలు, సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పుల నేపథ్యంలో ఈ కేసుల్లో పురోగతి సాధించాల్సి ఉండగా ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ శ్షిలు పడుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఓ విపరిణామం. 2010లో మహారాష్ట్రలో అత్యాచారాలకు సంబంధించి 13.9 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో 13.7 శాతం, కర్నాటకలో 15.4 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 2.6 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి.

మహిళలపై అత్యాచారాలు, కట్నం వేధింపులు, కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 2008లో 1,95,856 కేసులు నమోద య్యాయి. 2009లో ఈ సంఖ్య 2,03,804 కు పెరిగింది. 2005లో 1,55,553 కేసులు, 2006లో 1,64,765 కేసులు, 2007లో 1,85,312 కేసులు నమోదయ్యా యి. ఇందులో అత్యాచారం కేసుల విచారణ తీరుతెన్నులు, శిక్షలు పడుతున్న వైనం ఆందోళనకరంగా ఉందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. నేర పరిశోధనలో లోపాల కారణంగా ప్రతి పది కేసుల్లో తొమ్మిది కేసుల్లో నిందితులకు ఎలాంటి శిక్షలు పడడం లేదని మహిళా సమస్యలపై పోరాడుతున్న ప్రఖ్యాత న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిందితులకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించడంలో నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే అత్యాచారం కేసుల్లో శిక్షలు పడడం గగనంగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫలితం ఇవ్వని ‘సేఫ్‌’..

అత్యాచారం కేసుల్లో అన్ని ఆధారాలను సేకరించేందుకు ఢిల్లీ రాష్ట్రంలో తొలిసారిగా ‘సేఫ్‌’ (సెక్సువల్‌ అసాల్ట్‌ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌) విధానాన్ని ప్రారంభించి, ఆసుపత్రులకు తగిన సామాగ్రిని అందజేశారు. నేరస్థలంలో ఆధారాలను సేకరించేందుకు ఇది శాస్త్రీయ విధానమని భావించి, ప్రధాన ఆసుపత్రుల్లో ఇందుకు సంబంధించి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆధారాల సేకరణ తీరు మెరుగుపడిన దాఖలాలు తక్కువే. కచ్చితమైన సాక్ష్యాధారాలను సేకరించేందుకు, నేర పరిశోధన సజావుగా సాగేందుకు ‘సేఫ్‌’ ఎంతగానో దోహదపడుతుందని వైద్యులు సైతం ప్రకటించారు. అయితే, శిక్షలు పడుతున్న కేసుల సంఖ్యలో పెద్ద మార్పులేమీ చోటుచేసుకోవడం లేదన్నది నిజం. నేరం జరిగాక దుస్తులు, ఇతర సాక్ష్యాలను భద్రపరచడంలో బాధితులకు తగిన అవగాహన లేకపోవడంతో శిక్షలు పడే అవకాశాలు తగ్గుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.

అమలుకు నోచుకోని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు :

అత్యాచారం కేసుల విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. అత్యాచారాలకు గురైన బాధితుల నుంచి వివరాలు సేకరించేందుకు మహిళా పోలీసులను నియమించడం వంటి సూచనలు అమలు కావడం లేదు. నేర పరిశోధన, కేసుల విచారణ తదితర విషయాల్లో విధిగా కొన్ని ప్రమాణాలు పాటించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో సూచనలు చేసింది. ఆ ప్రమాణాలను, సూచనలను నేర పరిశోధనలో పాటిస్తున్న దాఖలాలు చాలా తక్కువ. ఈ పరిస్థితులు తమకు అనుకూలంగా మారడంతో నిందితులు శిక్షల నుంచి తప్పించుకుం టున్నారు.

అసమగ్ర నేర విచారణ :

అత్యాచారాల విషయమై పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల సంఖ్య ఏటేటా అధికమవుతున్నట్లు ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో’ అంగీకరిస్తోంది. కాకపోతే వీటిలో శిక్షలు పడుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం గమనార్హం. నేరపరిశోధన సక్రమంగా జరగకపోవడం, సమాజపరంగా మార్పులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. హత్యలు, దోపిడీల వంటి నేరాల్లో సాక్షులు ముందుకు వస్తున్నా, అత్యాచారం కేసుల్లో నోరు విప్పేందుకువారు సాహసించడం లేదు. ఇతర నేరాల్లో ఒక సాక్ష్యం ఉన్నా సరిపోతుందని, అదే అత్యాచారం కేసుల్లో కేవలం ఒక సాక్ష్యం వల్లే న్యాయం జరగదని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. సాక్షులు సహకరించని కారణంగానే అత్యాచారం కేసుల్లో శిక్షలు పడుతున్న సంఘటనలు స్వల్పంగా ఉంటున్నాయి. మరోవైపు పోలీసు శాఖలో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల వారు సాక్ష్యాధారాల సేకరణలో సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు తక్కువవుతున్నాయి.

కాబట్టి పోలీస్‌ సిబ్బంది సంఖ్యను పెంచడం, కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు చేయడం వంటివి జరిగితే అత్యాచారం కేసులు క్రమంగా కొలిక్కివచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మహిళల పరిస్థితులు మారితే తప్ప అత్యాచారం కేసుల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు తక్కువే. మహిళల్లో అక్షరాస్యత, లింగ వివక్ష నివారణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు న్నందున అక్కడ అత్యాచారం కేసుల్లో బాగా శిక్షలు పడుతున్నాయి. నాగాలాండ్‌లో 73.7 శాతం, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింల్లో 66.7 శాతం చొప్పున, మేఘాలయలో 44.4, మిజోరంలో 96.6 శాతం అత్యాచారాల కేసుల్లో నిందితులకు శిక్షలపడ్డాయి. సామాజికపరమైన ఒత్తిళ్లు లేనపుడు బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఈశాన్య రాష్ట్రాల్లోని పరిస్థితులు నిరూపిస్తున్నాయి.

ఈ విషయంలోనే మరోకోణమే మంటే దేశంలో అధిక జనాభా కారణంగా నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోందని, అత్యాచారం కేసుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని కొందరు నిపుణులు భావిస్తు న్నారు. సామాజిక పరిస్థితుల కారణంగా చాలామంది బాధితులు పోరాడేశక్తి లేక కొంతమంది మౌనంగా ఉండిపోతున్నారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లోనూ అత్యాచారం కేసుల తీరు ఇదేవిధంగా ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐర్లండ్‌, బ్రిటన్‌, స్వీడన్‌, జర్మనీ వంటి దేశాల్లో అత్యాచారాల సంఘటనలపై విస్తృత సర్వే జరిపగా, ఆ దేశాల్లోనూ ఈ లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరుగుతున్నట్లు తేలింది. భారత్‌లోనూ ఆడపిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరినట్లు సర్వేలు చెబుతున్నాయి.

మౌనం వీడి వెలుగులోకి రావాలి :

తమపై అత్యాచారాలు జరిగినా, చాలా సందర్భాల్లో బాధిత మహిళలు మౌనంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..? నిందితులు తమకు పరిచయస్థులు లేదా సమీప బంధువులు కావడం వల్ల నోరు విప్పేందుకు మహిళలు భయపడుతున్నారు. మరోవైపు తమ గురించి మీడియాలో విస్తృత ప్రచారం చేయడాన్ని కూడా బాధితులు తట్టుకోలేక పోతున్నారు. ప్రతి పది అత్యాచారం కేసుల్లో 9 కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారేనని ఒక సర్వేలో తేలింది. కోర్టు విచారణలో విపరీతమైన జాప్యం కారణంగా బాధితులు కేసులను ఉపసంహరించుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేసులు వాయిదా పడుతున్నకొద్దీ తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితుల్లో సడులుతోంది.

పరిష్కార మార్గాలు :

తరతరాల నుంచి విద్య, ఉద్యో గాలలో ఏదో కొద్దిపాటి మార్పు తప్పించి నైతిక విలువల దృష్ట్యా స్త్రీస్థానంలో పెద్దగా మార్పేమీ లేదనిపిస్తుంది. భారత స్త్రీ ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అనేకానేక ఒత్తిడుల మధ్యనే తన జీవనాన్ని సాగిస్తున్నది. నేటి విపత్కర పరిస్థితుల నుండి స్త్రీని రక్షించడానికి కొన్ని పరిష్కారమార్గాల్ని అన్వేషించాల్సిన అవసరం నేడెంతైనా ఉన్నది.

చట్టాలు స్త్రీలకు రక్షణ కవచాలు :

స్త్రీలు వారి హక్కుల సాధనకు రక్షణ కవచాలుగా భావించదగిన చట్టాలను అవగాహన చేసుకొనే దిశగా చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. తరతరాల దాస్య శృంఖలాల నుండి విముక్తి కోసం ఉద్యమిం చాలి. కానీ నేడు చట్టాల గురించి స్త్రీలకున్న అవగాహనా లేమి, చట్టాల అమలులో లోపాలు వంటి కారణాలు స్త్రీ చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వారి స్వేచ్ఛా స్వాతం త్య్రాలకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఎన్ని సెక్షన్లున్నా… సరైన అవగాహన లేని కారణంగా మహిళలు బాధలను భరిస్తూ, నిట్టూర్పులతో జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. వేలకొద్ది కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల కోర్టుల చుట్టూ తిరగడం కన్నా నాలుగు గోడల మధ్య మౌనంగా ఉంటే కనీసం పరువైనా నిలబడుతుందని భావించే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇలా మహిళలకి చట్టపరిజ్ఞానం కొరవడితే అత్యాచారాల నియంత్రణ ఎప్పటికీ సాధ్యం కాదు. తద్వారా హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన చట్టాలు చట్టుబండలుగా మారతాయి.

అందుచేత మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు న్యాయవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయాలి. చట్టాలపై అవగాహన కలిగే విధంగా వివరించాలి. చట్టాలను ప్రచారం చేస్తే స్త్రీలకు వారి హక్కులు, ఎవరైనా వేధిస్తే ఏం చర్యలు తీసుకోవచ్చునన్న అంశాలు తెలుస్తాయి. ఫలితంగా మహిళల్లో మానసిక స్థైర్యాన్ని కల్గించవచ్చు. పైగా మహిళలను వేధించే వారికి భయం ఏర్పడి మహిళలను వేధించరు. కాబట్టి అన్ని విధాలుగా స్త్రీకి రక్షణగా నిలుస్తున్న చట్టాలను గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. వాటిని ప్రచారం చేయాలి. ఎందుకంటే నేడు సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరమైన అన్నీ రంగాలలో కూడా స్త్రీపట్ల ద్వంద్వనీతి విలయతాండవం చేస్తున్నది. ఇటీవల స్త్రీల పట్ల జరుగుతున్న అమానుషాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలకు అనేక విషయాలలో ఆత్మవంచన, హింస మొదలైనవి ఎదురవు తున్నాయి. మరి చట్టాల అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సర్కారు పదేపదే చెబుతున్నా ఇవేవి మృగాళ్ల ఆగడాలకు కళ్లెం వేయలేకపోతున్నాయి.

కఠినమైన చట్టాల వల్ల మేలు జరుగుతుందని కొందరు భావిస్తున్నా అది నూరుశాతం నిజం కాదనిపిస్తుంది. చట్టాలు, కోర్టులున్నా అత్యాచారం కేసుల్లో శిక్షలు పడుతున్న ఉదంతాలు తక్కువగా ఉంటున్నాయి. నేరపరిశోధన, సాక్ష్యాధారాలు వంటివి శిక్షలు పడడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసేందుకు మిగతా దేశాల్లో తగిన యంత్రాంగం, సంకల్పం వంటివి తోడవుతుండగా… భారత్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా కేవలం ‘చర్చలు’ మాత్రం జరుగుతుంటాయన్న వ్యాఖ్యానాలు లేకపోలేదు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మన రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ తరువాత రెండో స్థానంలో వుండగా శిక్షల విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. మొత్తం నేరాల్లో నాలుగు శాతం కేసుల్లో కూడా నిందితులకు శిక్షలు పడడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించకోవచ్చు.

సామాజిక చైతన్యంతోనే మహిళకు రక్షణ :

మహిళలపై దాడులు, అత్యాచా రాలు పెరిగిపోవడానికి సమాజంలోని అసమానతలే కారణం. కాబట్టి స్త్రీలు, పురుషులు ప్రకృతిలో ఒక భాగమని, మహిళలు లేకుంటే మానవజాతికి మనుగడ లేదని, అలాంటి మహిళల పట్ల సమాజం వివక్ష చూపటం సరికాదని నేటి సమాజం గుర్తించాలి. బాల్యం నుంచే మహిళల పట్ల చూపుతున్న వివక్షని తొలగించడమనేది, వారికి విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించటం ద్వారానే సాధ్యమవుతుంది. విద్యావంతురాలైన స్త్రీ బహుముఖ ప్రజ్ఞాశాలియై ప్రగతిపథంలో విజయం సాధించగలుగుతుంది, సామాజిక స్పృహ కలిగి వేయి సూర్యకాంతులతో విరాజి ల్లుతుంది.

సమాజంలో ఏ అన్యాయం జరిగి నా ఆ సమస్య నాకెందుకులే అని దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ స్పందించిన నాడే ఈరోజున జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల్ని అరికట్టడం సాధ్యమవు తుంది. తద్వారా లింగ, కుల, మత, సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమాజ నిర్మాణం జరుగుతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అఘాయిత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది కాబట్టి మన కళ్లముందే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదనే భావజాలం ప్రజల్లో హృదయాల్లో నాటుకుపోవాలి. ఏ స్త్రీకి అన్యాయం జరిగినా స్పందించాలి. అయితే అలాగని చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు.

మహిళలపై జరిగే దాడుల విషయంలో కోర్టులు సరైన శిక్షలు వేయడం లేదనే భావన కూడా చాలా వరకు ఉంది. మహిళల కేసుల్లో సత్వర న్యాయం జరగకపోవడానికి కారణం కేసులకు తగ్గట్టు కోర్టులు, న్యాయమూర్తులు లేకపోవడమేనని చెప్పవచ్చు. సాక్షులు నిర్భయంగా వచ్చి జరిగిన సంఘటన కోర్టులో చెప్పిననాడే శిక్షలు పడతాయి కాబట్టి మహిళలపై దాడులు జరగగానే రిపోర్టు చేయాలనే అవగాహన కూడా ప్రజల్లో కలగడానికి చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టు విచారణ అధికారి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలి. నేరం జరిగిన తరువాత తీసుకోవాల్సిన చర్యల కంటే అసలు నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉన్నది.

దాంతో పాటుగా స్త్రీ తనమీద తను విశ్వాసం పెంచుకోవాలి. తను అబల కాదు సబల అని గ్రహించాలి. తను తలుచుకుంటే దేన్నైనా సాధించగలదు” అని గ్రహించాలి. తాము పురుషుల కంటే తక్కువ అనే భావజాలాన్ని చిన్నప్పటి నుంచి సమాజం స్త్రీలకు అలవాటు చేస్తుంది. కానీ తరతరాల నుండి నూరిపోసిన స్త్రీ పురుష తారతమ్యం నుండి బయటపడి, పురుషుడితో పాటు సామాజిక కార్యక్రమాల్లో చైతన్యవంతంగా స్త్రీలు కృషి చేయటానికి ఎంతగానో శ్రమపడాలి. పాత భావజాలం నుంచి బయటపడడం అంత తేలికైన విషయమేమీ కాదు. కాబట్టి ఇలాంటి విషయాలను నిరక్షరాస్యులైన స్త్రీలకు కళారూపాల ద్వారా లేదా ఛార్టుల ద్వారా అందించవచ్చు. విద్యావంతులైన స్త్రీలకు పుస్తకరచన ద్వారా అందించవచ్చు. ఎందు కంటే అక్షరానికున్న శక్తి అనంతమైనది, అపారమైనది, విశ్వప్రగతికి అక్షరమే ఆధారం కాబట్టి పుస్తకాలలో స్త్రీపురుష సమానత్వాన్ని కథల రూపంలో, సంఘటనల రూపంలో, వ్యాసాల రూపంలో చిత్రించవచ్చు.

ఇంకా అక్షరాస్యత, ఆరోగ్యం, న్యాయ పరిరక్షణ అనే విషయాలపై స్త్రీలకు సరైన అవగాహన ఎంతో అవసరం. విద్యలేనివాడు వింత పశువు అనే నానుడి ఉండనే ఉంది. అందునా స్త్రీ అక్షరాస్యతను పుష్కలంగా సంపాదించుకుంటే వివేక, విజ్ఞానాలు కలుగుతాయి. స్త్రీ విద్యావంతు రాలైతే ఆ కుటుంబమంతా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అంతేకాక మానవ విలువలను గ్రహించగల మానసిక పరిణితి కలుగుతుంది. తన బిడ్డలను చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక సమస్యలను తనకు తానే పరిష్కరించుకోగల సమర్థురాలవుతుంది. ఒకనాటి కన్యాశుల్కం, బాల్యవివాహాలను, సతీసహగమనం, వితంతు వివాహాలను అరికట్టిన సంఘసంస్కర్తలు చూపిన బాటను నిర్భయంగా పయనించగలుగుతుంది. చరిత్ర పుటలు తిరగేసి ఎందరో ఆదర్శ స్త్రీల జీవిత చరిత్రలను తెలుసుకోగలుగుతుంది. ఇంకా ఆరోగ్య సూత్రాలను క్షుణ్ణంగా తెలుసుకొని తన చుట్టుపక్కల వారితో సహకరించి సామూహికంగా పాటుపడి దేశప్రజలను ఆరోగ్యవంతులుగా చేయగలుగుతారు.

మహిళల రక్షణకు మరికొన్ని మార్గాలు :

మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కొన్ని నూతన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మహిళలపై వేధింపులను తీవ్రమైన నేరంగా పరిగణించాలి. అత్యాచారాన్ని లైంగిక దాడిగా పరిగణించి అత్యాచారాలపై కేసు నమోదు చేయకపోవడాన్ని నేరంగా పరిగణించాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీ.ఆర్‌.పీ.సీ.) చట్టాలకు సవరణ తేవాలి. మహిళలపై నేరాల విచారణకు తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేసి త్వరితగతిన తీర్పువచ్చే వీలును కలిగించాలి. ఫోరెన్సిక్‌ లేబొరేటరీలను ఆధునీకరించాలి. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు సక్రమంగా అమలు జరగా లంటే పోలీసుశాఖ సహకారం అవసరం కాబట్టి పోలీసుశాఖలోని నేరపరిశోధన విభాగాన్ని సంస్కరించాలి.

కేసులపై త్వరితగతిన స్పందిం చేలా చర్యలు తీసుకోవాలి. సమస్య ఎదురై నప్పుడు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమకు జరిగిన అన్యాయం మహిళలు చెప్పేలా స్నేహపూరిత వాతావరణం ఉండాలి. అన్యాయం జరిగిన వెంటనే పోలీసుస్టేషన్‌కు వెళ్తే రక్షణ లభిస్తోంది అన్న నమ్మకం వారిలో కలిగించాలంటే పోలీసుశాఖ వారికి మహిళా చట్టాల విషయంలో సరైన అవగాహన కల్పించాలి. నేర పరిశోధనపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరగడానికి చర్యలు చేపట్టాలి, మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే రాజకీయ నేతలను బహిష్కరించాలి. పట్టణాలు, నగరాలలో మహిళల రక్షణపై స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలి. గ్రామాలలో సైతం మహిళలపై నేరాలను అరికట్టడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి. ప్రజలు రక్షణే లక్ష్యంగా పౌరసేవల రూపకల్పన చేయాలి, అంతర్జాతీయ ప్రమాణాలలో వీధులలో లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలి.

రాష్ట్రాలు పోలీసు వ్యవస్థను ఆధునీకరించి మహిళల రక్షణకు పెద్దపీట వేయాలి. పోలీసు ఉన్నతాధికారుల, పెట్రోలింగ్‌ వాహనాల నిఘా పెరగాలి. వీధులలో నేరాలు జరగకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేసి తదనుగుణంగా చర్యలు చేపట్టాలి. పెట్రోలింగ్‌ వాహనాలపై లైట్లు వెలిగేలా, అలారం మోగేలా చర్యలు చేపట్టాలి. బస్సులు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలో సీసీటీవీలు, హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వీధులలో మహిళలను ఏడిపించేవారిని వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలి. మహిళలపై నేరాలు అరికట్టడానికి దేశవ్యాప్తంగా చర్చాగోష్టులు జరగాలి.

మహిళల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసింది. ప్రతి మహిళ వీటిపై అవగాహన పెంచుకోవాలి. తమ బతుకులు ఇంతే అంటూ నిరాశలో కుమిలిపోకుండా, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తెలుసుకోవాలి. తమకు ఏ విధమైన అన్యాయం జరిగినా చట్టాలను ఉపయోగించి నేరస్తులను కఠినంగా శిక్షించేలా న్యాయస్థానాలను ఆశ్రయించాలి. నానాటికి పెరిగిపోతున్న హింసను ఎదిరించేలా మహిళల్లో చైతన్యం రావాలి. చట్టాలను ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి.

ఆడపిల్లల రక్షణను తమ బాధ్యతగా ఈ సమాజం భావించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. బాధిత మహిళలు కూడా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును అందుకోవాలి. మహిళ హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి. విద్యావంతులైన నేటి యువత చట్టాలపై అవగాహన పెంచుకుంటూ, నిరక్షరాస్యులకు ఆసరాగా ఉండాలి. నేరస్తుల కు కఠిన శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలావరకు తగ్గుతుంది. స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరిగితే చట్టాల్లో సవరణలు సాధ్యం అవుతాయి. విద్యావంతులైన మహిళలు రాజకీయాల్లోకి రావాలి.

చివరిగా చెప్పొచ్చేదేమంటే ఎవ్వరో వస్తారని…ఏదో చేస్తారని ఎదురుచూడకుండా సమిష్టిగా మహిళలు తమ సమస్యలపై స్పందించి ఉద్యమించినప్పుడే ఏమాత్రం దయలేని ఈ పురుషాధిక్య విషసంస్కృతి లో…నియంతృత్వ ధోరణిలో…మనుగడ సాధించగలుగుతారు. కాబట్టి మహిళలం దరూ మేలుకొని స్త్రీలకోసం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణలను గురించి వివాహ చట్టాలు, అత్యాచార నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం మొదలైన అంశాల పట్ల సామాజిక చైతన్యం కలిగినవారై వెలుగుల ప్రపంచంలోకి అడుగులు వేసి కీర్తిశిఖరాలను అధిరోహించాలి. ఎందుకంటే మహిళావి కాసం సాకారమైనప్పుడే సామాజిక ప్రగతి కూడా సాధ్యమవుతుంది.

”స్త్రీల పరిస్థితి మెరుగుపడనిదే ప్రపంచంలో సంక్షేమానికి తావులేదు. ఒక్కరెక్కతో ఏ పక్షీ ఎగరలేదు – వివేకానందుడు.”

ఉపయుక్త గ్రంథసూచి :

శ్రీ మన్మహాభారతం : వేదవ్యాసుడు, వావిళ్ల రామస్వామి శాస్త్రులు, సన్స్‌ (1929)

భారతీయ వ్యక్తిత్వ వికాసం : మురళీకృష్ణ, కస్తూరి. సాహితీ ప్రచురణలు, విజయవాడ, ఎమెస్కో బుక్క్‌.

వివిధ పత్రికలలో స్త్రీల గురించి వచ్చిన ప్రత్యేక కథనాలు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.