ఒంటి నిట్టాడి గుడిసె

– స.వెం. రమేశ్‌

మీరు నమ్మండీ నమ్మకపోండీ నేను చెపతుండేది మటుకు పొల్లు కాదు. నా పాటికి నేను తలకాయ వంచుకొని దోవన్నే పోతుండినాను. నడిరెయ్యిలో ఒళ్లెరుగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, దబక్కన నా మీదకు దూకి, నన్ను ఎట్టా కదలనీకుండా నిలేసింది అది. నిలేసి నా మొకాన తుపుక్కు తుపుక్కుమని ఊసింది. తెరువులో తిరగతుండే నలుగురూ చూస్తుండగానే జరిగింది ఇది.

నా మీదకు కాలుదువ్వి సివంగిలాగా దూకడం, వెనక నుంచి వచ్చి వీపు మీద దబదబా బాదడం, ముదిగారంగా నా తలమీద తాళం వేయడం, నయగారంగా నా ఒళ్ళు నిమరడం, అలిగి నాళ్లకునాళ్లు నా కళ్ల పడకుండా పోవడం, మళ్లీ ఎప్పటికో చుక్క రాలినట్టు రావడం… ఇవన్నీ బాగా అలవాటే దానికి. వట్టి ఉడుకుబోతే కానీ కడుపులో కవుడు లేనిదది. దానికి కనలు రేగినా అనుగు పొంగినా తట్టుకోవడం పెద్ద ఇక్కట్టు. ఇప్పుడు కూడా సద్దిపొద్దులో ఇట్ట ఊడిపడింది. ఇట్ట నలగుర్లో నన్ను నగుబాట్లు పాలు చేసింది. అప్పుడయినా దానిపాటికది పోయిందా అంటే, లేదు. తిట్టిపోస్తా నా వెంట పడింది.

”నా బట్టా సోరణం (కిటికీ) పక్కన కూచోని పొద్దుకూ బూరగమాకుల్ని చూస్తుంటే చాలదురా. నీ ముండమొకాన ఎండకాయా, బూరగవ్వా బూరగవ్వా అంటా ఆ తల్లి ముడ్డెనకాల్నే తిరిగినావే! ఉడకేసిన తాటిచెక్క కావాలన్నా, కాల్చిన లేతగేగు కావాలన్నా బూరగవ్వ గురుతు కొచ్చేదే! ఇప్పుడెట్ట మరిచిపొయినావురా? నిన్ను ఏట్లో పెట్టా, నీ ఎళువెత్తా…”

ఆ తిట్లను వినలేక ఒక పరుగున పొయి, ఇంట్లోకి దూరి తలుపులు బిగించుకొన్నాను. బయట కాసేపు తలుపుమీద దబదబ దరువేసి ఇంక రెండు తిట్టేసి పొయిందది. ఉసూరుమంటా మంచంమీద కూలబడినాను. తెడ్డుతో సంగట్ని కెలికినట్టు తిట్లతో నా ఉల్లాన్ని అల్లాడించేసి పొయిందది. అప్పుడప్పుడూ అది తిట్టడమూ నేను పడడమూ పాత కతే. అయితే నడి తెరువులో నిలబెట్టి నలగరి ఎదురుగా కడిగిపోసింది మటుకు ఇప్పుడే. కొంచెం సేపటికి తెప్పరిల్లి లేచి నీళ్లు తాగి సోరణం పక్కనుండే బల్లమీద కూచున్నాను. సోరణంలోనుంచి చూస్తుంటే, రెండిళ్ళకు అవతల బయల్లో నిలువెత్తున నిలబడి ఉండాయి. ఆ కవ బూరగమాన్లు, నింగినంటుతున్న తలలతో, దిక్కులను చేచిక్కించుకోవాలన్నట్టు నాలుగు పక్కలకూ సాగిన కొమ్మలతో, పచ్చని పసరు పసను రెమ్మలతో, పొట్టలు పగిలి గణుపు గణుపుకూ వేలాడుతున్న తెల్లటి దూదికాయలతో…

అది తిట్టింది ఊరికే కాదు. అయినా నేనెట్ట మరిచిపొయినాను బూరగవ్వను? ఎందుకు మరిచిపొయినాను? అక్కడక్కడా చినుగులు పడి చీకిపొయిన చింతాకుపచ్చకోకను చుట్టుకొని, ముక్కును ఎర్రరాతి బేసరిని పెట్టుకొని, పగిలిన పత్తికాయిలాంటి తలను అణగదువ్వుకొని… అప్పుడే అలికి ఎర్రమన్ను ఓరు తీసిన నట్టింట్లో ముగ్గుబుట్ట ఒలికినట్టుగా ఉండేది బూరగవ్వ. ఒక్కతే, ఊరికి ఎడంగా ఏటికట్టకు ఆనుకొని తన మాదిరిగానే ఒంటరిగా ఉన్న ఒంటినిట్టాడి గుడిసెలో, ఆ గుడిసెకు తోడుకోసమే నిలిచిపోయి నట్టుగా ఉండేది బూరగవ్వ.

బూరగవ్వ గురించి నాకు తెలిసింది చానా తక్కువ. నేను బాగా చిన్నగా ఉండినప్పుడు, అంటే నాకు పదేళ్లకు మించని ఈడప్పుడు బూరగవ్వ కొమరంతోపులో ఉండేది. మా అమ్మమ్మకు చెల్లెలు అవుతాది బూరగవ్వ. అమ్మమ్మకు ఇంకొక చెల్లెలయిన అన్నవ్వ కూడా కొమరంతోపులోనే ఉండేది. అరుణేటి అంచున ఉండే అందాలపల్లె ఆ కొమరంతోపు. ఎంగుం తమిళ్‌, ఎదిలుం తమిళ్‌ (అంతా తమిళం, అన్నిటా తమిళం) అంటా ఇప్పుడు తమిళం చెలరేగిపోయింది. కానీ నా చిన్నప్పుడు ఆ అరుణేటి పల్లెలన్నీ తెలుగుతనంతో పొంగిపొర్లుతుండేవి.

కొమరంతోపుకు పోవడం ఒక ఎలమినాకు. పొన్నేరిలో పట్టేగి (రైలు) దిగి, పేరేగి (బస్‌) ని ఎక్కి, అరవాకకు ఇవతల వచ్చే పది తాటి చెట్ల కాడ దిగి, పడవ మీద అరుణమ్మను దాటి అద్దరికి చేరుకొని, అక్కడినుంచి గూటిబండ్లో ఎక్కి కొమరంతోపుకు చేరుకొనేసరికి, ఉచ్చిపొద్దు సంగటి ఉడుకడుగ్గా ఎదురుచూస్తా ఉండేది నా కోసం. పది మెంతి గింజలూ పుంజెడు మెత్తాళ్లూ తిరగబోసి, చింతపండు పులుసును చిక్కంగా పిసికి పోసి, అన్నవ్వ కాసే మెత్తాళ్ల పులుసులో అద్దుకొని మింగే సంగటి కడి చవిని ఇంకా మరిచిపోలేదు నా అంగిలి.

కొమరంతోపుకు నా పోక బూరగవ్వను చూడడానికి కాదు. నేను బూరగవ్వవాళ్ల ఇంటికి పోవడం మా అమ్మకూ అమ్మమ్మకూ ఒప్పుదల కాదు. అదే ఊర్లోని అన్నవ్వ కూడా బూరగవ్వ దగ్గరకు నన్ను ఎక్కువగా పోనిచ్చేది కాదు. బూరగవ్వా అన్నవ్వా సొంత అప్పచెల్లెళ్లే అయినా పెద్దగా మాటలు ఉండవు వాళ్లిద్దరి నడుమా. ఎప్పుడయినా ఏటికట్టమీది నేరేడుమాకుల కిందకో తాటి తోపుల్లోకో పొయినప్పుడు బూరగవ్వ నాకు తోడుగా వచ్చేది. కాసేపటికే అన్నవ్వ నన్ను వెతుక్కొంటా వచ్చి వెంటపెట్టుకొని పొయ్యేసేది.

”వెండి కంచంలో తెల్లావు చల్లతో బువ్వ తిందువు రా రా” అని నవ్వతా నన్ను పిలిచేది బూరగవ్వ. ఒక్కపూట కూడా పిడచడు కూడయినా ముట్టలేదు నేను బూరగవ్వ ఇంట్లో. నాకు తినాలనే అనిపించేది, అన్నవ్వ ఒప్పుకొనేది కాదు. కూటిపొద్దులో ఎప్పుడయినా అట్ట పోతే, సత్తు గిన్నెలో గంజినీళ్లు పోసుకొని, నాలుగు మెతుకుల్ని దేవుకొని తిని, గంజి తాగతా కనిపించేది. వెండి కంచమూ తెల్లావు చల్లా అంటే ఆనెక తెలిసింది నాకు, సత్తుగిన్నే గంజినీళ్లూ అని.

బూరగవ్వ గురించి నాకు తెలిసింది చానా చానా తక్కువ. బూరగవ్వ ఒంటరిగా ఊరికి ఎడంగా ఎందుకుండేదో తెలియదు. బూరగవ్వ అంటే అమ్మోళ్లకు అలక ఎందుకో తెలియదు. అన్నవ్వ కూడా సొంత అక్కతో అంటీముట్టనట్టుగా ఎందుకుండేదో తెలియదు. అప్పుడు అడిగి తెలుసుకోవాలని అనిపించలేదు నాకు. ఇప్పుడు అనిపించినా చెప్పేవాళ్లు ఎవరున్నారు?

”తెలుసుకోవాలని అనిపించాలే కానీ చెప్పేవాళ్లే లేరో” అనే వెక్కసపు మాటలు సోరణం బయట నుంచి వినిపిస్తే చివక్కన ఆ తట్టుకు చూసినాను. ఇందాక అన్ని కూతలు కూసేసి పొయి, ఇప్పుడు మళ్లా వచ్చి సోరణం బయట పలపలమంటా ఉంది. దీనితో పెద్ద చిక్కొచ్చి పడింది. సరే తిడితే తిట్టిందిలే, బూరగవ్వ కతను చెప్పేవాళ్లు ఉండరంటా ఉందే, అడిగి చూద్దాం అనుకొని ”బూరగవ్వ కతను తెలిసినోళ్లు ఎవరో నీకు తెలుసా?” నంగినంగిగానే అడిగినాను.

”ఆ నంగికూతలే వద్దనేది. ఏ మాటనయినా తెంపుగా మాట్లాడాల. ఏ పనినయినా తెంపుగా చెయ్యాల. పెద్ద ఎనపరి అని పేరు కదా నీకు, ఇదేనా నీ ఎసపు (ఉద్యమం)? మీ మగంగులు రవంత మెదిలితే చాలు అది ఎసపు అయిపోతాది. అడది బతుకంతా పోరాడినా దానికి ఇంతయినా గురితింపు ఉండదు. నాలుగూర్లలో నాలుగు తెలుగు రాతలు నేరిపించేసిన నీదేమో పెద్ద ఎసపు. పాతికేళ్ల ఈడులో మొగుడిని పోగొట్టుకొని, పాలివాళ్లు మెడపట్టి నెట్టేస్తే ఏడేళ్ల కొడుకును ఎంటపెట్టుకొని ఎరగని తావులకు పొయి, ఆకులు కుట్టీ బోకులు కడిగీ కొడుకును పెద్ద చదువులు చదివించిన ఆడదానిది ఎసపుకాదు. కడుపుల్లో గంపడు గంపడు కువ్వాళం పెట్టుకోనుండే ఎనము (జాతి) కదా మీ మగ ఎనము” సింగిలించుకొంటా అనింది.

”నీతో వేగలేను తల్లీ. నువ్వు చెపతుండేది మా నాయనమ్మ గురించి అని నాకు తెలుసు. నాది ఎసపే కాదని నేను ఒప్పుకొంటా ఉండాను. మా నాయనమ్మను పొగుడుకొంటే నాకు పొయ్యేదేమీ లేదు. బూరగవ్వ కత గురించి అడిగితే మా అవ్వ కతనెందుకు ఎత్తుకొంటుంటావు వే” విసివినాను.

”మీ అవ్వదయినా మా అవ్వదయినా బూరగవ్వదయినా ఆడబతుకే అట్టాంటిది. ఊరికే అన్నారా పెద్దోళ్లు, ఆడదయి పుట్టేదానికంటే అడివిలో మానయి పుట్టేది మేలని. సడేలే బూరగవ్వ బతుకును చెపతాను విను” అంటా కతను అందుకొనింది.

”కొమరంతోపు బూరగవ్వకి పుట్టినిల్లూ కాదు, మెట్టినిల్లూ కాదు. ఆ తల్లి పుట్టినూరు సూళూరుపేట దగ్గర, ప్రవాళం వాగును ఆనుకొని ఉండే కొన్నుంబట్టు. వాళ్ల పుట్టినిల్లు ఎట్టుండేదో తెలుసా? బూరగవ్వ అబ్బా, ఆ అబ్బకు ఇద్దరు పెళ్లాలూ, ఇద్దరికీ కలిసి ఇరు ఏడుల పద్నాలుగు మంది ఆడబిడ్డలు కలిసి ఉండే కాపురమది. గంపడు గుడ్లను పొదిగి పిగిలించిన పిల్లలకోడి మాదిరిగా ఉండేదా ఇల్లు. పద్నాలుగు మంది అప్పచెల్లెళ్లలో ఒకతె బూరగవ్వ”

”బూరగవ్వకు ఆ పేరు ఎట్టొచ్చింది, పుట్టు పేరు అదేనా లేకపోతే మారుపేరా?” కతకు నడుమన దూరతా అడిగినాను.

”బూరగవ్వకు వాళ్ల అమ్మోళ్లు పెట్టిన పేరు బాలామణి. బలే పట్టుదల కలిగిన బిడ్డ. కావాలనుకొనింది దొరకకపోతే ఓ అని ఏడుపు ఎత్తుకొనేది. ఆ బూరగను వినలేక అప్పటికప్పుడు ఆయమ్మి అడిగిన దానిని ఇచ్చేసేవాళ్లు. చీటికిమాటికి నాటికి నాలుగు తూర్లయినా ఏడుస్తుండేది చూసి ‘బూరగా బూరగా’ అని అడ్డపేరుతో పిలవడం మొదలు పెట్టేసినారు ఆ పేరే కడా వరకూ నిలిచిపోయింది. వాళ్లబ్బ అయిన చెంచురెడ్డి ఒక్కడే ఆయన చచ్చేవరకూ నోటి నిండుగా ‘బాలామణీ, ఓ బాలామణెమ్మా’ అని పిలుస్తుండేవాడు. అందరు అప్పచెల్లెళ్ల నడుమన ముదిగారంగా పెరిగిన బూరగకు, ఈడు మూడయిదులు నిండకు ముందే మనువయిపోయింది. వాకాడు కాడ మొగిలేటికి అందినంత దవ్వులోని కోడివాక అనే పల్లెలో మెట్టింది బూరగమ్మ.

దొడ్డెడు గొడ్లూ గూళ్లనిండా కోళ్లూ కడుపుకూటోళ్లూ సేద్దెకాపులూ వచ్చిపోయేవాళ్లూ విందరు (అతిథి)లూ, పదారు మూరల కోకను తుంటిదోపు కట్టుకొని ఇందరికీ వండివార్చి ఊడిగం చేస్తుండే సుబ్బమ్మా, పొలంలో పై పెత్తనాలు చేస్తా తిరగతుండే ఇల్లరి (సంసారి) బాలిరెడ్డీ… ఇదీ ఆ కాపురం. మొగుడయిన పిచ్చిరెడ్డి కన్నుమూసినాక కొడుకయిన బాలిరెడ్డిని కొంగున కట్టుకొని సాకింది తల్లయిన ఆ సుబ్బమ్మ. ఆ బాలిరెడ్డికీ ఆలిగా ఆ ఇంటమెట్టింది బూరగమ్మ. తన కొంగుకు కట్టుకొని సాకిన కొడుకుని కోడలి కొంగుకు కట్టేసి కన్నుమూసేసింది సుబ్బమ్మ. కట్టేసినాను అనుకొనింది కానీ అట్ట కట్టుబడేవాడు కాదు తన కొడుకు అని తెలియలేదు ఆ తల్లికి.

చెంపలమీదకు ఎక్కిన చేరడు చేరడు మీసాలతో, ఎర్రజీరలు నిండిన మిడిగుడ్లతో ఉండే మొగుడిని చూస్తే చాలు బూరగమ్మకు ఎముకలే అదిరేవి, ఇంక కొంగున కట్టుకోవడం జరిగే పనేనా! ఆయమ్మే మొగుడి చెప్పుకింద తేలయిపోయింది. పుట్టినింటి పెడసరం, పెంకితనం ఎట్టపొయినాయో ఉరువే లేకుండా పొయినాయి. తొలికోడి పాడే మేలుపొద్దులకు లేచి, ఈలకోడి (కీచురాయి) పాడే లాలిపాటకు కునికేదాకా పనీ పనీ ఒకటే పని, పనిలోనే మునిగిపోయేది బూరగమ్మ.

ఒరే, కత చెపతా చెపతా నడాన ఇట్ట కారుకూతలు కూస్తా ఉందేంది ఇది అనుకోబాక. ఏ పొద్దన్నా ఆడదాని పాటును మతించి, అది చేసే పనికి వెలకట్టి ఉందా రా మీ మగజాతి. పగలు పొద్దులస్తం ఒళ్లించుకొని పాటుపడినా తిట్లూ చీదరింపులే కదా మీ దగ్గరినుంచి మాకు దక్కేది. నీతీరీతీ లేని జాతిరా మీ మగజాతి. చ చ్చా నిన్ను చూస్తుంటేనే తగలకపోతుండాదిరా” అంటా చివక్కన పొయ్యేసింది.

”వట్టి గుబులుముండ. లేకపోతే చెపతా చెపతా నడాన టపక్కన నిలిపేసి పోతాదా! చెప్పేదేదో తీరుగా నాలుగు మాటలూ చెప్పి ముగించేసి పోవాల కానీ ఇదేందిది? అరకొరగా చెప్పి నిలిపేసిందే” అనుకొంటా నిట్టూరస్తా సోరణం పక్కనుంచి లేచినాను. ముక్కూమూతీ కడుక్కొని ఉడుపుల్ని తొడుక్కొని నా పనికి నేను పొయినాను.

నాలుగునాళ్లు గడిచినాయి. ఈ నాలుగునాళ్లూ అరకొరగా ఆగిపొయిన బూరగవ్వ కతే కదలతా ఉంది నా లోపల. పప్పును ఎణుపుకొనే రాళ్లసట్టి ఓడుపోతే కొత్తది తెచ్చుకొందామని సంత బయలుకు పొయినాను. కుండలూ సట్లూ పోగుపోసుకొని కూచోనుండాది ఒక పెద్దామె. రాళ్ల సట్టిని ఎత్తుకొని వేలుతో తట్టి మోగిస్తా ”బాగా కాలిందా పెదమ్మా” అని అడిగినాను. నా మాటతో ఆమెకు కాలినట్టు ఉంది.

”ఇద్దో దొరా, సట్టి బాగా కాలిందా అని అడిగితే మా కుమ్మరోళ్లకు ఒళ్లు మండతాది. సట్టిని కాల్చకుండానే, సారిమింద నుంచి దించింది దించినట్టే తెచ్చి, ఈడపెట్టి అమ్మతుండామా” అని గయ్యిమనింది నా మీద. నేను లేచిన పొద్దు మంచిది కాదు. లేకపోతే నేనేమడిగినానని ఈయమ్మ ఇట్ట నోరుచేసుకొంటా ఉంది అనుకొని నాకు నచ్చే సట్టికోసం తడుముతా ఉండాను. అంతలోకీ ఇంకొకామె వచ్చి, చిన్నపంటిని చేతిలోకి తీసుకొని తట్టి ”బాగా కాలిందా మా” అనింది. ‘చచ్చింది గొర్రె’ అనుకొన్నాను నేను. అనుకొన్నట్టే ఈమె మీద కూడా అదే మాదిరిగా నోరు చేసుకొనింది కుండలామె. అయితే నేను అనుకోనిది జరిగింది అప్పుడు.

”మోవ్‌ సాలుగానీ మూసుకోనుండు. కుండకాలిందా లేదా అని కుమ్మరోళ్లను అడక్క సాకలోళ్లను అడగతామా? ఏ ఊరి కుమ్మరీది నీది, నువ్వు కుమ్మరిదానివేనా? సారిమింద నుంచి దించిన ఒక్క కడవనయినా సలపతో తట్టి అడుగు మూసుండావా? నేను కుమ్మరిసానిని, నా దగ్గిర కతలు మాట్లాడబాక” అంటా కుండలామెను చెరిగి పారేసింది కొనడానికి వచ్చినామె.

‘సరయిన గుంపురా నాయనా ఈ ఆడగుంపు’ అనుకొంటా కొన్నసట్టిని సంకన పెట్టుకొని వెనక్కు తిరిగినాను. పునలవాన దంచికొట్టాల్సిన నెలలో ఎండ నిలిచి కాస్తుండాది. చెమటను తుడుచుకొంటా బూరగమానుల నీడ కింద, వాటి వేర్ల మీద సుంతసేపు కూలబడినాను. పెటపెట కాస్తుండిన ఎండకు నల్ల మెయిలు అడ్డమొచ్చి, చల్లగాలి పైనపడి చక్కలగిలి పెట్టింది. ఆ గిలిగింతను పులకరిస్తా మాను మొదలుకు ఆనుకొని జారిగిల పడినాను.

”ఏమిరోయ్‌, రాళ్లసట్టిని సంకన పెట్టుకొని కూచుని ఉండావేమిరా ఆడంగి నా బట్టా” అంటా దాని గొంతు వినపడింది పైనుంచి. ఆ మాటతో ఉచ్చెంటికనుపెరికినట్టు అనిపించి ఒళ్లు మండి పైకి చూసినాను. బూరగ కొమ్మల నడుమన నిలబడి ఉంది అది. బూరక్కాయల కోసం ఎక్కినట్టు ఉంది. నా కనలు అంతా నా కళ్లల్లోనే కనపడిందేమో పకపకమంటా ”ఆడంగోడా అన్నానని ఒళ్లు మండిందా, అయినా ఆడపుటక పుట్టాలంటే ఆరు కనుబడు (జన్మ) లు పున్నెం చేసుకోనుండాల. అది మీకు ఎరుకపడదులే. నీ కనలు తగ్గడానికి మొన్న నిలిపిన మీ బూరగవ్వ కతను చెపతాను విను” అంటా తొడకొనింది కతను. రెమ్మల ఆకుల నడుమనుంచి చిటపటమని రాలతుండాయి దాని మాటలు.

”ఒక తూరి ఎద్దల బేరానికని పడంటి పల్లెలకి యెలబారిపొయిన బాలిరెడ్డి, తిరిగి వస్తా చంద్రగిరి పక్కనుండే ఏదో పల్లె నుంచి ఒక కాడి కనమగిత్తల్ని పట్టుకొచ్చినాడు. గిత్తలతో పాటు మట్టసంగా సామ నలుపుతో ఉండే ఈడొచ్చిన ఒక ఏనాది పిల్లను కూడా వెంట పెట్టుకొని వచ్చినాడు. వచ్చిన ఆ ఏనాది పిల్ల పేరు జిలకర. ‘ఎవురూ లేని ఒంటి బతుకు బతకతుండానని ఏడుస్తుంటే, ఇంట్లో పనిపాటల్లో నీకు తోడుగా ఉంటాదని తొడకొని వచ్చినాను’ అన్నాడు జిలకరను చూపిస్తా బూరగమ్మతో బాలిరెడ్డి. ఇది జరిగినప్పుడు బూరగమ్మ ఏడు నెలల వేగటి. జిలకర వచ్చిన పదినాళ్లకు పురిటికని పుట్టినింటికి పొయింది బూరగమ్మ. ఆ ఇంటికి ఇల్లాలు లేని లోటును జిలకరమ్మే తీర్చింది.

పురుడు తీర్చుకొని అయిదు నెలల కొడుకును ఎత్తుకొని బూరగమ్మ తిరిగి వచ్చేసరికి జిలకరమ్మ నీళ్లాడి ఉండాది. ఆ మందల తెలిసిన బూరగమ్మకు కడుపులోనుంచి కనలు కనలుగా ఆవిర్లు లేచినాయి. లేస్తే మటుకు ఏంచెయ్యగలదు? మొగుడయిన వాడిని మందలించ గలదా? మందలించి మనగలదా? అందుకే మొగుడిమీద కడుపుమంటను జిలకరమీద చూపించింది.”

”అదేంది బాలిరెడ్డిని ఏమీ అడక్కుండా జిలకరమ్మను అడిగితే ఏం చెపతాది?” అడిగినాను.

”ఒరే తిక్కలోడా, ఇంతేనా తెలిసింది నీకు? నిన్నేదో చానా తెలివయినోడివని అంటుంటారే. ఇది కూడా ఎరగవో? ఒక ఆడది, అదీ ఇల్లాలయిన ఆడది, తన కనలును మగోడిమీద అదీ మొగుడిమీద చూపిస్తే ఈ మన్నూ మిన్నూ ఏమయిపోవాల? అట్టగాన జరిగితే ఈ కలిగ్గం ముగిసిపోదా! అందుకే ఏ ఆడదికూడా మగోడిని ఏమీ అనదు. బూరగమ్మలాంటి పెద్దకులపు ఆడోళ్ళకయితే వాళ్ల కడుపుమంటను తీర్చుకోవడానికి జిలకరమ్మ లాంటి చిన్న కులపోళ్లు ఉంటారు. చిన్నకులపు ఆడోళ్లకు ఆ తడువుకూడా లేదు. ఈ దేశంలో బూరగమ్మల కడగండ్ల కన్నా జిలకరమ్మల కల్లేట్లు పెద్దవి. అయినా నువ్వు అడిగింది మీ బూరగవ్వ కతను, జిలకరమ్మ కతను కాదు. జిలకరమ్మ జోలి నీకేల? సడేలే, ఎంతసేపు అట్ట మాను కుదుట్లోనే కూచుంటావు, లేచి ఇంటికి పో. నేను కూడా కొండమీదకు పొయి రావాల. పొద్దుపొయినాక ఇంటికాడికి వస్తానులే. అప్పుడు చెపతా కొరవ కతను” అంటా విరవిరగా కొండతట్టుకు కదిలిపొయింది.

పగలంతా ఆపనీ ఈపనీ ముగించుకొని, పొద్దు గూట్లో పడతానే ఉడుకుడుగ్గా అంత సంగటిని కెలుక్కొని, కొత్తసట్లో అంత గోగాకు పులగూరను ఎణుపుకొని నాలుగు కడులను మింగేసి, మంచంమీద ముసుగేసినాను. పగలంతా పనుల్లో తలమునకలయిన మేను రెయ్యి మత్తు తొంగులో మునిగిపోయింది. పొద్దెంత అయిందో తెలియదు, నడిరేయికి కొంచెం ముందు అయుండచ్చు. తలుపుమీద ఎరో దబదబ బాదుతుంటే మెలకువ వచ్చింది. బయట కంపచెట్లలోని ఈలకోళ్లు పల్లెపదాలను పాడతా ఉండాయి. నింగితల్లి చందమామకు పెట్టడానికి ఎత్తుకొన్న కాటుకగిన్నె మా ఇంటిమీదకు ఒలికినట్టు ఉంది. నా చుట్టూ చిత్తచీకటి. తడుముకొంటా పొయి తలుపును తెరిచినాను. ఎదురుగా చిలపలమంటా అది. నా కునుకు ఎగిరి పొయింది. కళ్లతోపాటు చెవులూ తెరుచుకొన్నాయి. నేను మంచంమీద ఒరిగినాను. అది కడపట్లో కూచుని పటుక్కు పటుక్కుమని వక్కను కొరకతా కతను మొదలు పెట్టింది. నాతోపాటు నన్ను అబ్బిళించుకొన్న చీకటి కూడా చెవులను విప్పింది బూరగవ్వ కతను వినడానికి.

”కడుపుమంటతో జిలకరమ్మని నాలుగుపెట్లు పెట్టింది. నలబయితూర్లు తిట్టింది. కానీ కడకు ఆయమ్మే జిలకరమ్మను కడుపులో పెట్టుకొనింది. ఎంతయినా ఆడపుటక కదా. ఒకరికొకరు తోడుమాడయి నిలిచినారు వాళ్ళిద్దరూ. బూరగమ్మకు బాలింత ఊడిగాన్ని జిలకరమ్మ చేస్తే, జిలకరమ్మ వేవింత సత్తేన్ని బూరగమ్మ తీర్చింది. కట్టుకొన్నదానికీ పెట్టుకొన్నదానికీ కడుపులు చేసిన ఆ మగరాయుడికి ఏం పట్టింది? తన ఊరి పెత్తనమేమో తనేమో అంతే. కాకపోతే పగలు కడుపాకలినీ రెయ్యి మేనాకలనీ తీర్చుకోవడానికి ఇంటికి వచ్చి పోతుంటాడు. తొమ్మిది నెలల బరువుని పదో నెలలో నేలకు దించి, తన దోవన తాను పొయ్యేసింది జిలకరమ్మ”

”అంటే ఎక్కడకు పొయింది వే” ఆత్రంగా అడిగినాను.

”ఏడకు పొయిందని అడగతుండావో, ఏడకు దా పొయిందని అడగతుండావో కసుమాళుడా. ఆడది ఏడకు పోతాదిరా బిడ్డను వదిలిపెట్టి! ఆపై వాడు వచ్చి ‘జిలకరా జిలకరా నా ఇంట్లో అంట్లు కడిగే మడిసి లేదు నువ్వు రా’ అని తొడకొని పొయ్యేసినాడు. ఏ మగోడి పక్కన పణుకోని ఏ తల్లి కన్నబిడ్డో, ఏ ఊర్లో పుట్టి పేగుతెంచుకొన్న బిడ్డో, ఏ ఇంట్లో ఎదిగి బట్టకట్టిన బిడ్డో, కడాన ఆ కోడివాకలో మన్నయింది. నేలప్పూ నీళ్లప్పూ అంటారే పెద్దోళ్లు, అయ్యి తీరే తావును వెతుక్కొంటా పోవాల్సిందే కదా ఎవరయినా!” అంటా చీది విదిలించింది. మంచంమీద ఒరిగుండే నాకళ్లమీద పడినాయి ఆ తుంపర్లు. నాకు కూడా లోపల కలత రేగి ఉలుకూపలుకూ లేకుండా ఉండిపొయినాను. అదే కొంచెం సేపటికి తేరుకొని తిరిగి సాగించింది.

”జిలకరమ్మ దించిపొయిన బరువుకు పద్నావతి అని పేరుపెట్టి, ఆ బిడ్డకు తన చన్ను కుడిపి బతికించింది బూరగమ్మ. అన్నెనక బూరగమ్మకు వరసగా ముగ్గురు బిడ్డలు పుట్టి పురిట్లోనే దాటుకొనేసినారు. బూరగమ్మ అయితే మాదవుడినీ పద్నునీ ఇద్దరినీ కన్నబిడ్డల మాదిరిగానే చూసుకొనేది. బాలిరెడ్డి చూపుల్లో మటుకు పద్న పనిపిల్లే. ఆయమ్మిని కన్నెత్తయినా చూడడు. పన్నెత్తయినా పలకరించడు. కూడూ గుడ్డా అన్నీ బూరగమ్మ చేతిమీదగానే జరిగిపొయ్యేవి ఆ బిడ్డకు.

ఏ బతుకు ఏవెతల పాలయినా తరి తిరుగుడు నిలిచిపోబోవునా, నాళ్లు వాటిపాటికి అయ్యి నడిచిపోతానే ఉంటయి కదా. నాళ్లు గడిచినాయి, ఏళ్లు గడిచినాయి, జిలకరమ్మ ఈ నేలను దాటి పదైదేళ్లు గడిచిపొయినాయి. ఈ పదైదేళ్లలో కోడివాక అనే పల్లెటూరు పెరిగి పేటగా మారిపోలేదు. ఆ మాటకొస్తే ఇంకా కుదించుకొని పొయింది. పదుల కాపురాలు బతకుబాటను వెతుక్కొంటా పేటబాటను పట్టినాయి. కోడివాకలోని చిన్నబడిలో అయిదు వరకూ చదివి చాలించింది పద్న.

బూరగమ్మ కన్నకొడుకయిన మాదవుడు మటుకు వాకాడులోని పెద్దబడికి పొయి పదివరకూ లాగినాడు. పది తప్పి, సతికింది సాల్లే అని చదువు ఇక్కొట్టును తప్పించుకొన్నాడు. మొదట్నించీ వాడికి చదువంటే పెద్ద తలనొప్పి. ఇప్పుడాపీడ వదిలినట్టయింది. అబ్బనడిగి డుగుడుగు బండిని ఒకదాన్ని కొనుక్కొన్నాడు. పొద్దన్నే దాన్నెక్కి వాకాడుకో కోటకో పోవడం, తన చెలిమిగాళ్లతో కలిసి చీట్లాడడం, పొగ తాగడం, తెరాటలు చూడడం, అమ్మాయిల వెనకపడి ఏడిపించడం, పొద్దు పొయినాక తాగడం, ఏ నడిపొద్దులోనో ఇంటికి చేరడం, ఇదే బతుయిపొయింది వాడికి. బూరగమ్మ నెత్తీ నోరూ మొత్తుకొని చెప్పినా వాడు మారలేదు. ఎట్ట మారతాడు. అంతా అబ్బ పోలిక కదా. అబ్బ నోట్లో నుంచి ఊడిపడినోడికి అబ్బ అలవాట్లు రాకుండా ఉంటాయా! మించిపోతుండాడని తెలిసి మొగుడితో చెప్పి చూసింది. ‘వాడు మగోడు. తిరక్కపోతేనే చెడిపోతాడు, తిరిగితే కాదు’ అని ఒక్కమాటతో కొట్టిపారేసినాడు ఆలి మాటలను బాలిరెడ్డి చేసుకొన్నోడికి చేసుకొన్నంత అనుకొని గమ్మునుండిపొయింది బూరగమ్మ.

పద్న ఎదిగింది. ఎదిగి పైటేసింది. దీగూటికి అబ్బుకొని ఉండే పొగవన్నె ఆ పిల్లది. పిలపిలమని గోల చేసే పులిచింతగువ్వల పసను ఆయమ్మిది. చింతనిప్పుల మీది నివురు నిరుపు (రంగు) ఆ బిడ్డది. బూరగమ్మకు చేదోడు వాదోడు ఆ పిల్లే, బతుకూబాళూ ఆ బిడ్డే. ‘అమ్మీ అమ్మీ’ అనే బూరగమ్మ పిలుపుకు ‘వస్తుండా పెదమ్మా’ అని మారు పలికేది పద్నగొంతు. ఏ పనిచెప్పినా వయినంగా చేసేది. వయినమంటే వయినం కాదు. నట్టిల్లును అలికిందంటే గచ్చు వేసినట్టు ఉండేది. తలాకిట కళ్లాపి చల్లి, ఎర్రమన్నుతో ఓరు తీసి, చుక్కల ముగ్గు వేసిందంటే, ఆ వన్నెల వరసను చూడడానికి వానవిల్లే దిగివచ్చేది.

తన పనిపాటలతో ఆ ఇంటికే వెలుగయిన ఆ పిల్ల బతుకుమీదకు ఆ ఇల్లే కారు చీకటయి కమ్ముకొనింది. కప్పకు తోకలుండవు, కాపోళ్లకు వరసలుండవు అనే పెద్దల మాట ఉంది కదా. బాలిరెడ్డి కన్ను పద్న మీద పడింది. ఒకనాటి రెయ్యి చీకట్లు చిక్కంగా కమ్ముకొన్నాక నడవలో పణుకోనుండే పద్న పైన పడినాడు. పచ్చని పైరు మీద దొంగ గొడ్డు పడినట్టు పడినాడు. బిత్తరపొయి మేలుకొన్న పద్నకు ఏం జరుగుతుండాదో తెలియలేదు. అరద్దామంటే నోటిని ఏదో బటువయిన చెయ్యి బిగువుగా మూసేసి ఉంది. పైన పడిన ఆ ఆకారం ఏదేదో చేస్తా ఉంది. ఎట్నో పట్టి బలవంతాన ఆ ఆకారాన్ని పక్కకునెట్టి ‘పెదమ్మా’ అని పెద్దంగా అరిచింది. ఆ అరుపును విని ఉలిక్కిపడి లేచి గబగబా నడవ దగ్గరకు వచ్చింది బూరగమ్మ. అప్పటికే తలాకిలి తలుపును తోసుకొని విరవిరగా బయటకు పోతుండాది ఒక మగనీడ. ఆ నీడ ఎవరిదో ఎరుకపడిన బూరగమ్మ వెప్పరపొయింది. పద్న బూరగమ్మను అబ్బిళించుకొని బావురుమనింది. ఆయమ్మికి వీపునిమిరి ఓదార్చి లోపలింట్లోకి తొడకొని పొయింది బూరగమ్మ.

మరునాడు మాపున బాలిరెడ్డి పెళ్లో నీళ్లు పోసుకొంటా ఉంటే వీపు రుద్దను పొయింది బూరగమ్మ. రుద్దతా, ‘వాయి వరసలు లేకుండా కన్నకూతురిమీదనే పడతావా’ అంటా నిలదీసి అడిగింది మొగుడిని. బూరగమ్మ మాటలు లెక్కేపెట్టలేదు బాలిరెడ్డి. ‘పోయే, ఈడకు రాకముందు ఎందరి పక్కన పణుకొనిందో, వచ్చినాక నాతోపాటు ఇంకెందరికి పక్కేసిందో, ఆ లంజకి పుట్టిన ఇది నాకు కూతురెట్ట అవతాది. నువ్వు మూసుకోని పడుండట్ట. అది కానే కావాల నాకు’ తెగ్గొట్టినట్టు అన్నాడు. ఎన్నడూ మొగుడి మాటకు ఎదురాడని బూరగమ్మ ఆపొద్దు రేగిపొయింది, ‘దాని జోలకి పో అనేక తెలస్తాది మందల. నీకు కూట్లో నంజుపెట్టి చంపకపోతే అప్పుడడుగు’ అని పిల్లలపంది మాదిరిగా ఎదురు తిరిగి అరిచింది. ఆ మాటకు జంకినట్టు ఉండాడు, అన్నెనక ఆయమ్మి తట్టుకు చూపును తిప్పలేదు బాలిరెడ్డి.

దెయ్యం వదిలింది అనుకొంటే బూతం తగులుకొనింది అంటారే అట్టయింది పద్న నిలవరం. ఆపొద్దు ఇరుల్నాడు (అమాస). ఊరికి కడాన ఉండే చెంగాళమ్మ మాను కాడికి పొయ్యి దండం పెట్టుకోని వస్తా ఉంది పద్న. పగటి పిట్టలు గూళ్లలో ముడుక్కొనేసినాయి. రేయి తురవలు రెక్కలకొట్టుకొంటా లేస్తుండాయి. తోలుగువ్వలు తలలమీద తారాడతా ఉండాయి.

‘పద్నా ఏడకు పొయ్యొస్తుండావు మే’ ఎదురొచ్చిన మాదవుడు అడిగినాడు.

‘చెంగాళమ్మ చెట్టు కాడకు పొయ్యొస్తుండాను నా’ మారుపలికింది అన్న అనుకొన్న మాదవుడితో చెల్లెలయిన పద్న.

‘మేయ్‌ చెంచురెడ్డోళ్ల కయ్యల్లో పార మరిచిపొయినాను. తోడుగా రామ్మే పొయి తెచ్చుకొందాము’ నంగినంగిగా పిలిచినాడు మాదవుడు. అన్న అనుకొన్న వాడి వెనకాల పోవడానికి ఏ చెల్లెలయినా ఎందుకు జంకతాది. ‘పదనా పొయి తెచ్చుకొందాము’ అంటా అన్న వెనకాలనే అడుగులు పెట్టింది. కళ్లకు పచ్చకొవ్వుపట్టిన ఆ నా కొడుక్కి వాయీ వరసా ఏముండాది. మంచులో తడిసిన సొరపూవు మాదిర ఉండే పద్న మీద కన్నేసినాడు ఆ పొరంబోకోడు”

”ఏందివే నువ్వు చెపతుండేది. వింటుంటేనే గుండెలు అవిసిపోతా ఉండాయే. లోకాన ఎక్కడన్నా ఇట్ట జరగతాదా?” బిత్తరపోతా కతకు అడ్డంపడి అడిగినాను నేను.

”తిక్కల నా బట్టా. ఉత్త వెర్రోడివిరా నువ్వు. ఏడన్నా జరగతాదా ఇట్ట అని అడగతుండావే జరగనిది ఏడ చెప్పు. ఆడదాని ఒళ్లంటే ఏమనుకోనుండావు. అది ఊరుమ్మడి పొలాన నాటిన పైరు. పైరు కోతకు వచ్చేదాకా దానిని దొంగగొడ్డయినా ముట్టచ్చు, దొరగొడ్డయినా మేయచ్చు. కోతకు వచ్చినాక దొంగయినా పెరుక్కోవచ్చు, దొరయినా కోసుకోవచ్చు. పైరు మీద ఆ పైరుకే ఏ ఒరిమా (హక్కూ) ఉండదు. అట్నే కదా ఆడది కూడా. ఆడ మేనుకు కూడా నొప్పీ నొగులూ ఉంటాయనీ, ఆడ ఉల్లానికీ ఇంపుతుంపులు కలగతాయనీ ఎరిగిన మగోళ్లు ఎందురుండారు అనుకొంటుండావు! కోటికొకడిని చూపించు చూద్దాం. సడేలే కతను విను.

చెంచురెడ్డోళ్ల కయ్యలకు పొయ్యే దోవలో పాతూరిమిట్ట అనే తావు ఉంటాది. పొద్దుపొయినాక ఊరి ఆడోళ్లు ఆ మిట్టమీదకే కడుపు బరువుని దించుకోవడానికి వస్తారు. అది తెలియదు మాదవుడికి. చిత్త చీకట్లో ఆ మిట్టల్లో ఎవరుంటారులే అనుకొని, ఆ తావుకు పోతానే ఆయమ్మిని కిందకు తోసి రంపు చేయడం మొదలు పెట్టినాడు. పద్న బిత్తరపొయింది, వెలవరపొయింది, అరవాలని కూడా తోచలేదు. కొంచెంసేపటికి తెప్పరిల్లి పెద్దంగా ఏడస్తా కేకలు పెట్టింది. అదే పొద్దుకు బూరగమ్మ మిట్టమీదకు వచ్చుండాది. పద్న కేకలు విని, ఆయమ్మికి ఏమయిందోనని ఆత్రపడతా చేతికి దొరికిన కర్రను ఎత్తుకొని ఆ తట్టకు పరుగు తీసింది. రంపు జరగతుండే తావుకు పొయి పైనుండే వాడిని కర్రతో బాది వదిలిపెట్టింది. ఆ దెబ్బలకు తాళలేక మాదవుడు లేచి పారిపొయినాడు. పద్న ఎక్కిళ్లు పెడతా చెప్పేదాకా వాడు మాదవుడే అని తెలియలేదు బూరగమ్మకు.

పదిమంది కట్టిన ఇంట్లో కూచోని చెపతా ఉండా, పచ్చంగా పసుపు పూసిన కడపమాను పక్కన కూచోని చెపతుండా, ఆ రెయ్యి ఆ కొంపలో ఏం జరిగిందో సత్తెంగా నాకు తెలియదు. రెండోనాడు తెల్లారేటప్పటికి మొగుడినీ కొడుకునీ చీ కొట్టి, కూతుర్ని తొడకొని కట్టుగుడ్డలతో కోడివాక గమిడిని దాటేసింది బూరగమ్మ. ‘తూ నా బొడ్డు’ అని ఇద్దరు మగోళ్లని ఎడం కాలితో నెట్టేసి బయటకు వచ్చేసింది బూరగమ్మ. బిడ్డతో పాటు పట్నానికి పొయ్యే పేరేగి (బస్‌) ని ఎక్కేసింది. మదరాసులోని పాత చాకలిపేటలో అంత అరను బాడుక్కి తీసుకొని, ఆ ఇంటా ఈ ఇంటా ఆ పనీ ఈ పనీ చేసుకొంటా రెండేళ్లు తనివిగా బతికినారు ఆ తల్లీ కూతుర్లు. అన్నెనక తనతోపాటు పని చేస్తుండే ఒక మాలోళ్ల పిలగాడిని మక్కువ పడింది పద్న. కూతురు మెచ్చినోడికి ఇచ్చి పొన్నెమ్మ గుడిలో ముడిపెట్టింది బూరగమ్మ. పద్నకు మొగుడుయిన ఆ మాలోళ్ల పిలగాడిది అరుణేటికి అందున ఉండే కొడూరు అనే ఊరు. ఏటికి ఒక దరిన కొడూరు అయితే ఇంకొక దరిన కొమరంతోపు.

పెళ్లి చేసినాక కూతురింటికి పొయి వాళ్లకు బరువు కాకూడదనుకొనిందేమో. చిన్నప్పుడు తాను ఎంతో మక్కువపడిన తన గారాల చెల్లెలయిన అన్నమ్మ ఉండే కొమరంతోపుకు చేరుకొని, ఊరి పెద్దల్ని ఒప్పించి, ఊరి పొరంబోకులో ఏటి అంచున ఒంటినిట్టాడి గుడిసెను వేసుకొని కుదురుకొనింది బూరగమ్మ. బతికినన్ని నాళ్లూ ఒకరికింత పెట్టిందే కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపలేదు ఆ తల్లి. కడకు కూతురి దగ్గర కూడా. ఆకులు కుట్టీ మేకలు మేపీ కోళ్లు సాకీ ఎట్నో ఒకట్ట రూకో అర్రూకో గడించి తానంత తిని. తన కూతురికి అంత పంపించేది.

ఒక ఏనాది పిల్ల కోసం మొగుడినీ కొడుకునీ కాలతన్నేసిందనీ, సాక్కొన్న ఆ ఏనాదిపిల్లను కూడా ఒక మాలోడికి ఇచ్చి చేసిందనీ, తిమురు పట్టిన ఆడదనీ… ఇంకా ఇట్టంతా ఏవేవో చెప్పి చుట్టపక్కాలు ఎవరూ బూరగమ్మ తట్టుకు తొంగికూడా చూడలేదు. తన మొగుడూ కొడుకులూ ఏమంటారో అనే దిగులుతో అన్నమ్మ కూడా అంటీముట్టనట్టుగానే ఉండేది, అక్కతో. బూరగమ్మ మటుకు ఎవర్నీ లెక్క చేయలేదు. పుట్టుకతో వచ్చిన ఎసలు (గుణం) ఆమెకది”

”బూరగవ్వ మొగుడూ కొడుకూ కూడా ఎప్పుడూ అవ్వ దగ్గరకు రానే లేదా?” అడిగినాను.

”బూరగవ్వ కొమరంతోపుకు చేరుకొన్నాక నాలుగేళ్లకు ‘కొడుకుకు పెళ్లి’ అని చెప్పడానికి బాలిరెడ్డి వచ్చినాడు. ‘నేను ముండమోసి ఆరేళ్లయింది’ అనేసింది బూరగమ్మ ఇంకొక పక్కకు తిరుక్కొని. మళ్లా ఏడాదికి ‘మనవడు ఇడిగో’ అంటా కొడుకు వచ్చినాడు వాడి పెళ్లాన్ని తీసుకొని. కేకరించి కుడితికుండ మీద ఊసి తలుపును మూసుకొనింది. పద్ననే తన కూతురు అనుకొనింది. పద్న పిలకాయలకే అవ్వయి ఆడించింది. ఏటికి అడ్డంపడి కొడూరికీ కొమరంతోపుకీ నడస్తా, ఆ అరుణమ్మతోనే తన ఇమ్మదుమ్ములన్నిటినీ పంచుకొనింది కానీ నరుల దగ్గర నోరు విప్పింది కాదు.

కొడూరినీ కొమరంతోపునీ కలపతా పారే అరుణమ్మే ఆయమ్మకు జతగత్తె అయింది. అరుణమ్మతో మాట్లాడతా, అరుణమ్మతో ఆట్లాడతా అరుణమ్మ అంచున్నే మన్నయిపొయింది మీ బూరగవ్వ. నేనొక తూరి ఆ దరికి పొయినప్పుడు ‘అమ్మీ అమ్మీ బూరగమ్మ కతను కడుపులో పెట్టుకొని ఎవరితో అయినా చెప్పమ్మీ’ అంటా నాతో చెప్పుకొచ్చింది అరుణమ్మ. ఎవరితో చెప్పాలా, వినేవాళ్లు ఎవరా అనుకొంటుంటే ఇన్నేళ్లకు నువ్వు దొరికినావు. ఇదే మీ బూరగవ్వ కత” అంటా నిలిపింది అది.

నేను తలుపులు మూసుకొన్నాక కూడా ఆ రెయ్యంతా బూరగవ్వనే తలుచుకొంటా బయట బోరుమని కురిసింది అది. కురిసి కురిసి మాలాడగుండం వాగయి పొంగిపొల్లింది. ఆ పొద్దు చూడడమే దానిని, నాలుగయిదు నెలలు అవతా ఉంది, కంటికి కనపళ్లేదు మళ్లా. ఏ దేశాన ఎవరికి ఏ అవ్వ కతను చెపతా ఉందో ఆ వాన పిల్ల.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో