నిజాయితీ మొలకలు –

 డా|| శిలాలోలిత

చిన్నప్పటినుంచీ కొత్త ప్రదేశాలు చూడాలంటే చాలా ఉత్సాహంగా ఉండేది. ముఖ్యంగా మనసు కలిసిన స్నేహితుల్తో ప్రయాణాలంటే మరీ ఇష్టం. సత్యతో స్నేహం మొదలయ్యాక, ఇలాంటి సంతోషభరిత యాత్రలూ, వాస్తవాల చిత్రపటాలు, మనం మరిచిన నగ్నసత్యాలు, మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు, బడుగు జీవుల కన్నీటి వ్యథలు, ఇంకా ఆకలితోనే పోరాడుతున్న గోండు జీవుల హృదయావిష్కరణలు, వాళ్ళ గుడిసెల్లోకి గాలి సైతం పోలీసు వాళ్ళలా వేగంగా వెళ్ళగలిగే ఖాళీలు, అతి తక్కువ సామాను, దైన్యం తాండవిస్తున్న ముఖాలు, రేపటి రోజన్నా ఆశల చిగురు వేయదా అనే ఎదురు చూపులు, బక్క చిక్కిన శరీరాలు, కణకణ మండుతున్న కంటిజ్వాలలు, మేమంతా వచ్చామని స్వాగతిస్తూ నృత్యాలు చేస్తుంటే, నా తల భూమిలోకి ఒంగి పోయింది. నాకూ దోపిడీదారుడికీ తేడా ఏమిటనిపించిందో క్షణం. వాళ్ళను కళ్ళారా చూడడం, మనసారా వినడం తప్ప నేనేం చెయ్యగలను అని గుండె కలుక్కుమంది. బారులు తీరి అందరూ నిల్చున్న తీరు, మమ్మల్ని పరిశీలిస్తున్న నిజాయితీ కళ్ళు అన్నీ, పిల్లలు, పసిపిల్లలు, వృద్ధులు, వయసువాళ్ళు అందరి చర్మమూ ఒకేలావుంది.

దట్టమైన ఆదిలాబాద్‌ అడవుల్ని చీల్చుకుంటూ వాగుల్ని దాటుకుంటూ, రెండు ట్రాక్టర్లలో వెళ్ళాం వాళ్ళ ఊరికి. ఆ వెళ్తున్న దార్లో నానుంచి ఉబికిన కొన్ని కవితాక్షరాలు.

ఆకాశం

పొగమంచు ముఖాన్ని తొడుక్కుని

గబుక్కున భూమి ఒడిలోకి దూకినట్లుంది.

అంతా తెలుపే

అది ఆకాశమో, నేలో, మంచో, నీరో

ఏదీ మనసుకు అందడం లేదు

అడవంతా చిత్రంగా అలుముకు పోయింది

రెండు కళ్ళకూ

కోట్ల చూపుల్ని అతికించుకున్నా

దృశ్యాలు తెరలు తెరలుగా మిగిలిపోతూనే ఉన్నాయి.

ఆకాశంతో

కరచాలనం చేస్తూ, గుట్టల, కొండలపై

కాపలా కాస్తున్న సరిహద్దు వీరుల్లా

బారులు తీరిన చెట్ల సమూహాలు-

నవ్వుతున్న పత్ర హరితాలు

అరణ్యమంతా

గొడ్డలి దెబ్బలు తిన్నాక

చుట్టుకున్న అడవి కుబుసాన్ని

నిట్టనిలువుగా చీలుస్తూ తార్రోడ్డులు

తోడేళ్ళు, నక్కలు, ముఖాలు మార్చుకున్న వైనాలు

నెమళ్ళు పురివిప్పకుండానే పారిపోతుంటే

మబ్బుచాటు కుట్రలు తెలిసి నృత్యాలాపేస్తే

మిగిలిన, భరించలేని స్థితిలో చెట్ల తల్లులన్నీ

ఆలోచనలు ఆకులు రాలిపోయి ఎండి పోగా

తలలు లేని మొండాలుగా

నెర్రెలు విచ్చిన శరీరాలతో

నరాలు తేలినట్లున్నాయి.

ఇప్పపూల పరిమళాలన్నీ

భయం గుప్పిట్లో బంధీలైనాయి

సమూహాలన్నీ ఒంటరి ద్వీపాలౌతున్నాయి-

మా అడుగులకు చిరునామాలు వెతుకుతున్నారు

వాగువంకల్లో ఘనీభవించిన నిశ్శబ్ద చిత్రాలు

రాయిరప్పల్లో దేవుళ్ళయిన నిజాయితీ మొలలు

కొమరం భీం నెత్తుటిలో ఉబికిన జాతి రత్నాలు

ఎండిన ఆకుల సవ్వడులలో ఎగిసిపడ్తున్న

ప్రాణవాయువుల ధ్వని కేతనాలు

పంట నరికేసినా

నోటి ముద్ద లాగేసినా

విత్తనాన్ని అరిచేతుల్లో పూయించే

ఆత్మవిశ్వాసపు పోడుభూమి కొండ చరియలు వాళ్ళు

ఇంకొక ఊర్లోకి అడుగుపెట్టగానే మేళతాళాలతో స్వాగతాలు, వాళ్ళ దగ్గరున్న కారపు బంతి పూలతో దండలల్లి, చిక్కుడు గింజల్ని కూడా కలిపి, బొట్టు పెట్టి, ఆలింగనం చేసుకుంటూ దండలేసారు ఆడవాళ్ళందరూ. ఊరు ఊరంతా ఒక్కచోటే గుమిగూడారు. ఇత్తడితో రకరకాల వస్తువుల్ని అద్భుతమైన కళతో తయారు చేస్తున్నారు. వాళ్ళ శ్రమకు తగిన ఫలితం లేదక్కడ. త్వరలో నాగోబా జాతర జరుగుతుంది. అప్పుడు మాత్రం ఎక్కువగా నాగోబా మూర్తులు అమ్ముడవుతాయి. జనం బాగా వస్తారన్నారు. మొన్నీమధ్యనే ఆ జాతర జరిగినట్లుగా పేపర్లో చూసాను. వాళ్ళవి కొన్నన్నా గిట్టుబాటు అయ్యుంటాయి అనుకున్నాను. సత్య అందరికీ తలా ఒక గిఫ్ట్‌ జ్ఞాపకమై నిలుస్తుందని, వాళ్ళకు చేయూత అవుతుందని కొన్నది.

ఇది అడవిని దాటి ఊరైన క్రమం కదా! వాళ్ళ మీద కొంత మేలు. కొద్దిగా ఇళ్ళు, చిర్నవ్వు మొఖాలు ఉన్నాయి అక్కడక్కడా! వాళ్ళు మాకు పెట్టిన భోజనం ముందు ఏ ఫైవ్‌ స్టార్‌ భోజనమూ పనికిరాదు. ఎంత ఆత్మీయంగా వాళ్ళకున్నది పెట్టారో, అంతే ప్రేమతో తిన్నామందరం. ప్రాంతం, భాష, జాతి, కులం, మతం వేరు వేరు కావచ్చు కానీ మానవత్వం, ప్రేమతత్వం, ఆత్మీయతలకు ఏ రంగూ ఉండదనిపించింది.

ప్రశాంతి వాళ్ళందరితో కలగలిసి పనిచేసిన క్రమంలో అక్కా అంటూ వాళ్ళు పొదువుకున్న తీరు, కలిసి నృత్యాలు చేయడం కలిసి కన్నీళ్ళు పంచుకోవడం ఎంతో ఉద్విగ్నతకు గురిచేసింది.

‘గీత’ నిజంగా సమర్థవంతమైన ప్రణాళికతో తీసుకెళ్ళే పరిపాలనాదక్షురాలు, అర్థరాత్రి అపరాత్రి అని లేదు అందరితో కలిసిపోయి, తన నవ్వుల నదిలో అందర్నీ ముంచేసి, విషాదాల భగ్నహృదయాలపై నవనీతలేపనం పూసేస్తుంది.

చివరి మలుపులో ‘వర్ని’ లోని సమతానిలయానికి అర్థరాత్రికి జేరుకున్నాం. అప్పటి వరకూ ఆ చిన్నారులందరూ మాకై ఎదురుచూస్తూనే వున్నారు. మా పాతికమంది కోసం గ్రీటింగ్స్‌ తయారుచేసి అందరికీ పంచారు. అప్పటివరకూ ఆపుకొంటూ వస్తున్న దుఃఖపు వరద ఆ అనాథల్ని చూశాక గట్లు తెచ్చుకుంది. వాళ్ళు మా కోసం కల్చరల్‌ ప్రోగ్రామ్‌ కూడా తయారు చేసుకున్నారు. ఉండండి అని బతిమాలుతున్న అందర్నీ ఒదిలి, ఎవరి ప్రపంచంలోకి, ఎవరి కుటిలోకి, చీకటిలోకి, వెలుగులోకి, వెన్నెలలోకి, జనప్రవాహం లోకి ఉద్యోగపు ఇరుకుల్లోకి వచ్చేసాం.

ఇప్పటివరకూ చెప్పుకున్నది ఒక పార్శ్వం. మరో పార్శ్వంలో అమృతలత గారి ఆధ్వర్యంలో ఆమె అందర్నీ సంతోష పరిచారు. ఆమె ఒక ప్రేమ పిపాసి. అమృత హృదయిని. స్నేహలత, కడుపునిండానే కాదు మనసు నిండా ఆత్మీయతను కురిపించగలరు. ఆమెకు ‘నారాయణభట్టు’ లాంటి కుడిభుజం వుంది. ఆమే నెల్లుట్ల రమాదేవి. బస్సులో ఐతే ఆమె హాస్యచాతుర్యంతో అందరి దిగులు మేఘాల్ని చెదరగొట్టేసింది. అనేక ఆట పాటలు, క్విజ్‌లు, వీధినాటకాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఈ పర్యటనలో. ఒక విధంగా చెప్పాలంటే సుఖదుఃఖాల సమ్మిశ్రణమే జీవితం కాబట్టి. అన్నింటినీ అందరమూ అనుభవించి, ‘రీచార్జ్‌’ అయ్యి మళ్ళీ బతికేందుకు ఉత్సాహాన్ని, పట్టుదలని, ఆత్మవిశ్వాసాన్ని కార్యక్రమ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని వచ్చామనే చెప్పొచ్చు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.