నేనూ – నా పడవ –

 వి. ప్రతిమ

ముందే చెప్పుకున్నట్లుగా ఎంతెంత పనుల ఒత్తిడిలో వున్నా తలుపులు మూసుకుపోయిన పంజరంలోనుండయినా సరే సత్యవతి పిలుపు కవ్విస్తే అది నాదస్వరమే… వెంటనే పడవని సిద్ధం చేసుకుని, వెలుగుపూలసంచిని భుజాన తగిలించుకుని… రాలే ముచ్చట్ల ముత్యాలని ఏరుకోవడానికి చైతన్యపు సిరా కలాన్ని హృదయంలో దాచుకుని నేను తయారు.  adi

జనవరి నెలలో పందొమ్మిది రోజులు గడిచాక చీకటి వెలుతురుతో ఘర్షణ పడుతోన్న సందిగ్ధ సంధ్యలో మినుకుమంటా పయనమయి తారీఖు మారిపోయి… వెలుతురు చీకటిని చిదుముతోన్న తొలిసంధ్యకి తీరం చేరిన నా పడవలోనుండి అపురూపంగా చేయందించి దింపుకుంది సత్యవతి…

విశాలమైన వనసీమల్లోకి, మైమరపించే జలపాతాల్లోకి, నీరవీ నిశీధుల్లోకి, శిధిలాలయిన వూళ్లలోకి, నిస్తేజమయిన గూళ్ళముందుకి, పోరాట పటిమతో ముందుకు సాగుతోన్న స్త్రీల గుంపుల్లోకి అలా వేలు పట్టుకుని నడిపించుకు వెళ్ళగలదామె…

ఆ సాయంత్రం నాలుగ్గంటలకి ‘భూమిక కార్యాలయంలో గుమికూడిన పాతికమంది స్త్రీలని తనరెక్కలలో పొదుపుకుని బయల్దేరింది బస్సు.

DSC01413

ఆకాశంలో పక్షుల్లా ఎగురుతూ, నీలికళ్ళతో ప్రకృతిని పీల్చుకుంటూ, ఒకరికొకరు కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటూ, పాతమిత్రులతో కరచాలనాలు చేస్తూ… మొత్తంగా వెచ్చటి స్నేహతరంగాలను మోసుకుంటూ… కురిసి రాలిన మెరుపు నవ్వుల తడి ఆరక ముందే క్రమంగా బస్సు గమ్యాన్ని చేరుకుంటోంది. ఈ ప్రయాణంలో వారణాసి నాగలక్ష్మి నాకందించిన స్నేహ స్పర్శ, ప్రేమ పూర్వక సంభాషణలు, లోతైన సాహితీ చర్చలూ మరువలేనవి…

ఆ మునిమాపువేళ పురా సంస్కృతీ వైభవంతో మిరుమిట్లు గొల్పుతోన్న నిజామాబాద్‌ నగరాన్ని అనిమిషులమై చూస్తుండగానే మరి కొద్ది సేపట్లో నిజామాబాద్‌ లోని ముబారక్‌ నగర్‌ అంచులకు చేరుకుంది మా బస్సు.

ఆర్మూరులో మాకోసం ఒక అద్భుతం దాగి వుందని ముందుగా నాకు తెలీదు…

ఆర్మూరంటే అమృతలత, అమృతలతంటే అలుపెరగని అల, అమృతలతంటే అపురూప అవార్డ్స్‌, అమృతలతంటే మనుషుల్ని (కెరీరిస్టుల్ని కాకుండా) తయారు చేసే విద్యాలయాల స్థాపకురాలు, అమృతలతంటే ఒక గొప్ప టీం వర్క్‌కు ఏకైక మెదడు, అమృతలతంటే స్నేహాన్ని పంచే మంజుల గానమని అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలీదు… ఇక ఆమె ఆతిధ్యం గురించి చెప్పాల్సొస్తే అమ్మ అన్న పదాన్ని పదితో గుణించుకోవలసిందే… ఆ రుచులను గురించి నల, భీములను అడిగి రావల్సిందే….

ఆర్మూర్‌ (ముబారక్‌ నగర్‌) లో విజయ్‌ హైస్కూలు ప్రాంగణంలో ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మా బస్సు వద్ద నిలబడి దిగుతున్న వాళ్ళందరినీ పేరు పేరునా పరిచయం చేసుకుంటూ ఆహ్వానం పలికారు. మరి కొద్ది దూరంలో అమృతలత గారి ఆహ్వానం అందుకుని అంతా ఒకింత సేద తీరి అమృతలత బృందంతో కలిసి ప్రయాణమయ్యాం.

మేము కొంత ఆలస్యంగా చేరుకోవడం మూలంగా విజయ్‌ విద్యాలయాలన్నింటినీ విహంగ వీక్షణంగా మాత్రమే చూడడం జరిగింది. అయితే పరమ నాస్తికురాలయిన ఒక వ్యక్తి కొన్ని ప్రకంపనల మూలంగా ఆస్తికంగా ఆవిష్కరించిన ఆ అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని చూడడం ఒక అనుభవం… చీకట్లో వెలుగులీనుతూ, అమిత శుభ్రంగా ఆ ప్రాంగణం ఏవో పురా రహస్యాలను మా చెవుల్లో గుసగుసగా విప్పుతున్నట్లుగా అన్పించింది.

అంతేనా? అమృతలత గారి అన్నయ్య రాజారెడ్డి గారు నడుపుతోన్న ‘లాలన’ అన్న వృద్ధాశ్రమం విశాలంగా… ఉత్సాహవంతంగా, ఆరోగ్యంగా వున్న వృద్ధులతో మాకు ఆశ్చర్యానందాలను కలిగించింది… ఇందుకోసం ఓవైపు వ్యవసాయం, మరో వంక గోశాల నడుపుతూ, అక్కడి వృద్ధుల నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా, ఉచితంగా కేవలం సేవే ప్రధానంగా ‘లాలన’ ని నడపడం విశేషం. ఆ తరువాత విజయా కిషన్‌రెడ్డి గారు కట్టించిన సాయిబాబా గుడిని చూసి, గెస్ట్‌హౌస్‌ను పలకరించి అమృతలత గారిల్లు చేరుకున్నాం… వర్ణణాతీతమైన ఆ అభిరుచిని ఆవిష్కరించడం అసాధ్యమే…

భోజనానంతరం వారు ఏర్పాటు చేసిన ఉత్సాహవంతమైన ఆటల పోటీలు మాకెంతో ఆనందాన్నిచ్చాయి. ఆ రాత్రి మేము పాతికమందిమీ ఆ యింట్లో విశ్రమించి తెల్లవారుఝామునే సిద్ధమయి బస్సెక్కాం… ఈసారి మాతోపాటు రమాదేవి గారు కలిశారు… ఆవిడ రచయిత్రి మాత్రమే కాదు కార్టూనిస్టు కూడ కదా… బస్సులో మాకేమాత్రం అలసట తెలీనీకుండా కడుపుబ్బ నవ్వించారు. అలా నవ్వుల పువ్వుల నేరుకుంటూనే మేం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆ చివరి నుండి ఈ చివరిదాకా నడిచాం….

అనంతరం బస్సెక్కి మరో ముప్పయి, నలబయి కిలోమీటర్ల దూరంలోవున్న ‘పొచ్చర్ల’ జలపాతం వైపుగా సాగిపోతున్నపుడు ప్రకృతి మాతో కబుర్లాడుతూ చివరిదాకా తోడొచ్చింది… దారిలో పత్తిపొలాలని చూస్తుంటే ఎవరో అజ్ఞాత రైతు ఆకాశంలోనుండి కొన్ని నక్షత్రాలను పోసుకొచ్చి ఈ పొలంలో చల్లిపోయాడా అన్న భావన కలిగింది… అయితే చాలాచోట్ల పత్తి పొలాల్లో ఎండకి పనిచేస్తోన్న రైతుల్ని (స్త్రీలు కూడ) చూస్తున్నపుడు తొంభయ్యోదశకం ప్రారంభంలో ఆత్మహత్యల పాలయిన అనేకమంది పత్తిరైతులు నా కళ్ళముందు నిలిచి కడుపులో తిప్పినట్టయింది… పత్తిపొలాల అందం, ఆత్మహత్యల రుతువు మార్చిమార్చి నా హృదయాన్ని…. ఆ వైరుధ్యం చాలాసేపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది…. అడవి లోపలినుండి పొలాల్లోకి వున్న గట్ల మీద వరుసలుగా నడుస్తోన్న శ్రామిక స్త్రీలలో ఆ ఎర్రపూల చీర కట్టుకుని, చిర్రు చిర్రుగా వున్న దువ్వని తలతో కళ్ళు వాల్చి వున్న ఆమె ‘వీర’ తల్లి చామంతి కాదు గదా అన్నించింది నాకు…. వీరనరసింహం నా అభిమాన కథానాయకుడు.

ఆలోచనలలో నుండి మేం పొచ్చర్ల చేరేప్పటికి అమృతలత గారు అద్భుతమైన బ్రేక్‌ ఫాస్ట్‌తో సిద్ధంగా వున్నారు. మా కాళ్ళు జలపాతం వైపు లాగుతూంటే అ.బృ. (అమృతలత బృందం) టిఫిన్‌ వైపు లాగారు… మక్కవడలు, ఉప్మా, ఇడ్లీ లాగించి పోలో మంటూ మేము జలపాతంలోకి దూరిపోయాం. భయపడి దూరంగా వుండిపోయిన వాళ్ళని కూడ చేయిపట్టి లాగి, పొదివి పట్టుకుని నిర్భయంగా నీళ్ళలోకి నడిపించారు రమాదేవి… జారిపడేవాళ్ళు పడుతున్నారు లేచేవాళ్ళు లేస్తున్నారు… ఫేస్‌బుక్‌లో పెట్టొద్దంటూ వేడికోలు… నిజంగా అదో మరపురాని అనుభూతి… ఎంతకీ అవధి లేదు దానికి….

ఎట్టకేలకు బయటపడి మేం దుస్తులు మార్చుకున్నాక అమృతలత గారు మాకో చిత్రమైన పోటీ పెట్టారు. ఒక అక్షరం యిస్తాను, ఆ అక్షరంతో మొదలయ్యే పేర్లు ఎన్ని వీలయితే అన్ని రాయండి… ఆడ, మగ ఏ పేర్లయినా రాయొచ్చు అన్నారు.. సరిగ్గా పది నిముషాలు సమయమిచ్చారు. యాభయ్యయిదు, అరవై పేర్లు రాసేటప్పటికి సమయం మించిపోయింది. డెబ్భయి పేర్లు రాసిన ప్రశాంతి మొదట స్థానంలోనూ, శ్రీపాద స్వాతి రెండో స్థానంలోనూ సుజాతా పట్వారీ మూడవస్థానంలోనూ నిలిచారు.

కొండలు ప్రతిధ్వనించే చప్పట్లతోనూ, కేరింతలతో జలపాతాన్నీ బండరాళ్ళనీ, చెట్ల నీడనీ వదల్లేక వదిలాం పొచ్చెర్లని… మళ్ళీ అనంతమైన ప్రయాణం మొదలయింది… అనేక కబుర్లూ, నవ్వులూ, కేకలూ అన్నీ మామూలే. ఆ మధ్యాహ్నం ఒంటిగంటకి మొండిగుట్ట చేరుకున్నాం… ఖానాపురం మండలంలోని గాయనిపల్లి అన్నచోట కల్పన, రామిరెడ్డి దంపతులిరువురూ నిర్మించుకున్న ఆ ఫామ్‌హౌస్‌ చూడడం మరో అనుభవం… కరుణ, కల్పన యిరువురూ అక్కచెల్లెళ్ళు + వారి శ్రీవార్లిరువురూ మాకు స్వాగతం పలికారు… అప్పటికే అక్కడికి చేరుకున్న ఆ బృందం మాకోసం ఒక మంచి జానపద నృత్యంతో వేచివున్నారని మాకు ముందుగా తెలీదు.

”చక్కదనం చాలు నాకు కట్నమొద్దని

కట్టినాడు తాళి ఆడు నా బిడ్డకీ” …. అన్న పాటకి తగిన విధంగా వారి వేషధారణ, అభినయం మమ్మల్నెంతగానో అలరించాయి… ఆ పాటని అమృతలత గారే రాశారనీ, ఆ నృత్యాన్ని కూడ ఆవిడే రూపొందించారనీ తెలిసి ముగ్ధులమయ్యాం… (విజయ్‌ హైస్కూల్లో పిల్లలు తరచుగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ వుంటారని వారు చెప్పారు)… ఇక్కడ ఆ నృత్యానికి హీరో హీరోయిన్లుగా వేసిన కవిత, వసంత యిరువురూ అక్కచెల్లెళ్ళు… కవితకి తల్లిగా నటించిన ప్రభావతి, తండ్రిగా నటించిన సునీత, యింకా లలిత అంతా కూడ వారి వారి పరిమితి మేరకు వారు అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ కూడా చూడముచ్చటగా వుండడం మరో విశేషం..

ముందు నృత్యభోజనం, ఆ తరువాత కరుణ, కల్పన దంపతులిరువురు అందించిన విందుభోజనం ఆరగించి ఆ ఫామ్‌హౌస్‌ పక్కనే ముచ్చటగా కట్టబడ్డమంచె, మరో పక్కన ప్రత్యేకంగా పెంచబడుతోన్న ఎలుగుబంట్లూ యివన్నీ కూడా మనసు కళ్ళతో చిత్రాలు గీసుకుంటూ అప్పటికే మా కోసం ఏర్పాటు చేయబడిన రెండు ట్రాక్టర్లలో అడవి లోపలికి బయల్దేరాం.

ఇరుకిరుకు, ఎగుడుదిగుడు దారుల్లో నీళ్ళులేని, కొన్ని నీళ్ళతో నిండిన కాలువలు దాటుకుంటూ, మా మీదుగా వంగి జాలువారి వున్న కొమ్మలనీ, ఆకులనీ, పూలనీ అందుకుంటూ, అలా కాలువ లోతు నుండి ట్రాక్టరు పైకి లేస్తున్నప్పుడు వెర్రి కేకలు వేస్తూ… ”ఈ అడివీనిదాగిపోనా” అంటూ కృష్ణశాస్త్రిని తలుచుకుంటూ, ఎక్కడయినా దారుల్లో రాజేశ్వరి గాని వుందా అని వెతుకుతూ ”బుర్కరేగడి” అనే గోండు పల్లెని చేరుకున్నాం… నిజానికి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఈ ఆదివాసీ జీవితాలను గురించి తెలుసుకోవాలన్నదే మా అసలు ఆలోచన.

జెండా పండగలాగా రంగు కాగితపు తోరణాలు కట్టి స్త్రీలు, పురుషులు, పిల్లలు మా ట్రాక్టర్ల చుట్టూ మూగి… దిగలేని వాళ్ళకోసం ముక్కాలి పీటలనమర్చి, ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని వారి పల్లెలోకి తీసికెళ్ళారు. బుక్కరేగడి పల్లెంతా కలిపి ఒకే ఒక్క పొడవాటి వీధి… దానికి అటు, ఇటుగా కొన్ని ఇళ్ళు… కొన్ని ఇళ్ళు నడుమ నుండి లోపలికి వెళితే మరి కొన్ని ఇళ్ళు… ప్రత్యేకమైన చీరకట్టుతో, కుడిపైటతో, ముక్కుకి, చెవులకి వున్న ఆభరణాలతో వున్న ఆ స్త్రీలు నన్ను పురా స్మృతుల్లోకి నెట్టారు.

నాకా ఇళ్ళు, ఇళ్ళ మధ్యన దారులూ, ఆ స్త్రీలూ, పిల్లలూ యిదంతా చూస్తోంటే చాలా రోజుల ముందు వాకపల్లి వెళ్ళిన సంఘటన గుర్తొచ్చింది. దుఃఖమోడుతున్న పదకొండు నెత్తుటి నెలవంకలు గుర్తొచ్చాయి. కూంబింగ్‌ పేరుతో ఎంతమంది ఆదివాసీ స్త్రీలు దాడులకు, ఎలా అత్యాచారాలకు గురయ్యారో జ్ఞప్తి కొచ్చి కడుపులోనుండి దిగులు రేగింది… తల్లిలాంటి అడవి నుండి, పుట్టి పెరిగిన వూరి నుండి ఆదివాసీలు వేరు చేసే ఒక దుర్మార్గపు ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిందనీ, దానికి కారణం మావోయిస్టుల్ని ఏరిపారేయడం కోసమేనని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి… అభివృద్ధి పేరుతో మూడో ప్రపంచ దేశాల్లో అనంతంగా జరిగిపోయిన విధ్వంసం కళ్ళముందు కదలాడుతూనే వుంది…

పిల్లల ఆటపాటలతో గబుక్కున ప్రస్తుతంలో కొచ్చిపడా న్నేను. పిల్లలంతా మా చుట్టూ చేరి కేరింతలు కొడుతూంటే మరికొందరు దూరంగా నిలబడి వింతగా మాకేసి చూస్తున్నారు.. పిల్లలందరికీ తెలుగు బాగా వచ్చు.. పెద్ద వాళ్ళు కొందరు తెలుగుతో పాటు వాళ్ళల్లో వాళ్ళు గోండు భాష మాట్లాడుకుంటున్నారు… మరీ పెద్దవాళ్ళకి తెలుగు అంతగా రావడం లేదు.

మధ్యాహ్నం గాయనిపల్లి ఫామ్‌హౌస్‌లో మాకు ఆతిథ్యమిచ్చిన రామిరెడ్డి గారోమాటన్నారు… ”ఒకప్పుడు గోండులకు వారి స్వంత రాజ్యముండేది. నిజానికి వీరు అగ్రవర్ణాల వారు… కానీ కాలక్రమంలో యిప్పుడిలా ట్రైబల్స్‌గా మారిపోయారు…” అని… ఆ రాజసం కొంతమంది పురుషుల్లోనూ, మరికొందరు స్త్రీలలోనూ మనక్కన్పిస్తుంది.

(”ఇటీవల ప్రొ. జయధీర తిరుమల రావు బృందం చేసిన (ప్రభుత్వం తరపున) పర్యవేక్షణలో గోండి లిపికి సంబంధించిన సమాచారం అందింది. ఈ బృందానికి ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నే మండలం లోని ‘గుంజాల’ గ్రామంలో గోండీ భాషలోని వ్రాతప్రతులు లభించాయి. వాటిని చదవగలిగిన వారు ఆ గ్రామంలో నలుగురే వున్నారు. అక్కడ లభ్యమైన వ్రాతప్రతులలో కేవలం అక్షరమాలే గాక వారి సాహిత్యం, వారి చరిత్ర కూడా లభ్యమైనాయి. గోండీ లిపి సమగ్రమై, నిర్దుష్టమై ఒక అభివృద్ధి చెందిన భాషకుండే లక్షణాలన్నీ కలిగి వుంది. ఇది భారతీయ భాషా ప్రపంచానికి తెలంగాణా ప్రాంతం యిచ్చిన బహుమతిగా పరిగణించవచ్చు. (ప్రజాసాహితి))

మా అందరి కోసం ఒక విశాలమైన ప్రదేశంలో వాళ్ళు చాపలు కుర్చీలు మంచాలు అమర్చిన తీరు సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. మేము వారి ఇళ్ళు, అవి కట్టిన తీరూ, వారి జీవన విధానం, ముఖ్యంగా కొన్ని తెలుగు పదాలకు గోండీ పదాలు అడిగి తెలుసుకుంటూ, మేమా పదాలను ఉచ్ఛరిస్తున్నప్పుడు వాళ్ళ నవ్వులూ, కేకలూ వాళ్ళనందరినీ పలకరిస్తూ, పరిశీలిస్తూ ఉత్సాహంగా వారు ఏర్పాటు చేసిన చోట ఆశీనులమయ్యాక…

ఎనిమిది మంది మగవాళ్ళు మొత్తంగా నెమలీకలతోనూ, కుందన్స్‌తోనూ తయారుచేసిన పెద్ద పెద్ద కిరీటాలను ధరించి రిధమిగ్గా అడుగులు వేస్తూ ‘గుత్తాది’ నృత్యాన్ని చేసి చూపించారు… పురుషులు నెమలీకల కిరీటాలు ధరించి చేసే ఈ నృత్యాన్ని గుత్తాది అనీ, స్త్రీలు వరుసగా ఒకరి నడుములొకరు పట్టుకుని ఐక్యంగా, ఏకంగా, లయబద్ధంగా అడుగులు వేస్తూ గోండీ పాటలు పాడుతూ చేసే నృత్యాన్ని ధింసా అంటారట.

చాలామందికి భూమి లేకపోయినప్పటికీ ప్రభుత్వాలు కల్పించే కనీస వసతులు వారి దరి చేరకపోయినప్పటికీ, రోజూ ఆహారం కోసం వెదుకులాట తప్పనిసరి అయినప్పటికీ వారిలోని ఆత్మవిశ్వాసం, అధీకృతలేనితనం, నిశ్చంతతో కూడిన స్వచ్ఛమైన నవ్వులూ, పలకరింపులూ, ఇరుకు లేని వాతావరణం, ఆ అడవి ఆకులూ, వారి ఆరోగ్యాలూ, మొత్తంగా వాళ్ళు, జీవించే పద్దతీ…. చెరగని ముద్రలుగా మూటలు కట్టకుని ఆ అందరికీ వీడ్కొలు తెలిపి మాకు తోచినదిచ్చి తిరిగి ట్రాక్టర్లెక్కాం….

గుండె పొరల్లో ఏవో రెండు నీటి చుక్కలు చేరి కదలాడుతున్నట్లుగా సలుపు…. అడవి అంటే కేవలం సుందర ప్రకృతి, పిల్లకాలువలు, జలపాతాలను అనుభూతించడం… పర్యాటక స్థలం మాత్రమేనా? అడవి అంటే యిప్పుడు అంతర్యుద్ధం, అడవి అంటే యిప్పుడు ఆకుపచ్చని వేట కదా అనుకుంటుంటే గుండె విరిగినట్టయింది… అయితే ట్రాక్టర్లో నడుస్తోన్న అంత్యాక్షరి గానం నన్నా దిగుల్లోనుండి అనివార్యంగా బయటకి లాగింది… మేము అడవిని, ఆదివాసులనీ కేవలం పైపైన మాత్రమే తడుముతున్నామన్న సంగతి నాకు బాగానే అర్థమవుతోంది.

ఏడింటికి మేం గాయనపల్లి ఫామ్‌హౌస్‌కి చేరుకునేప్పటికి మళ్ళీ మాకోసం అమృతలత బృందం ఒక చిన్న వేడుకని ఏర్పాటు చేసింది ‘బంద్‌’ ఉద్యమాలు, అవగాహన లేని సమ్మెల మూలంగా జనజీవితాలకు అసౌకర్యాన్ని అంతరాయాన్నీ కలిగించే బంద్‌లు, సమ్మెలూ, ఆ సమయంలో కోతిమూకలు తాగి విజృంభించే విధానం తెలియజేస్తూ ఒక చిన్న రూపకం. దీన్ని కూడ అమృతలత స్వయంగా రూపొందించారట… ఈసారి నెల్లుట్ల రమాదేవి తాగుబోతు కుర్రాడి వేషంలో మా అందరి ప్రేమనూ కొట్టేసింది… ఆ తర్వాత అమృతలత ఒక చిన్న కుర్రాడితో మా పాతికమంది పేర్లూ రాసివున్న చీటీలను లక్కీడిప్‌లో తీయించారు. మొదటి బహుమతి శోభకీ, రెండో బహుమతి పంతం సుజాతకీ, మూడో బహుమతి గీతకీ వచ్చాయి… ఇందులోనూ, నిన్న జరిగిన పోటీల్లోనూ గెలుపొందిన వారందరికీ అమృతలత ప్రత్యేకమైన బహుమతులందచేశారు…

ఆ తరువాత వద్దు వద్దంటూనే ఆ రుచులకు డంగైపోయి రామిరెడ్డి దంపతులిచ్చిన విందుభోజన మారగించి అమృతలత బృందానికీ, కల్పన, కరుణ దంపతులకీ పేరు, పేరూనా వీడ్కోలు తెలుపుతూ, మేమెంతగానో నచ్చిన ఆ మంచెనీ, ఆ వాతావరణాన్నీ వీడలేక వీడుతూ ఉట్నూరుకి ప్రయాణమయ్యాం… బరువుగా…

అమృతలతగారికి ధన్యవాదాలు చెప్పడం చిన్నబుచ్చడమే…. అవుతుందేమో.

కొంతసేపటికి చాలా మౌనంగా బస్సు ప్రయాణిస్తున్నప్పుడు అడవి గాలుల గానం స్పష్టంగా విన్పిస్తోంది…

”కొందరు మనుషులు మనుషులు కాదు

పచ్చని చెట్లూ, ప్రవహించే నదులూ….

వాళ్ళు మాట్లాడుతున్నపుడు

మనం చల్లని నీడలో కూర్చున్నట్టు

స్వచ్ఛమైన నీటిని తాగుతున్నట్లు వుంటుంది.

కోపంలో కూడ… చాలా సౌందర్యవంతులై వుంటారు.

అందరూ మనుషులే…

కొందరు మాత్రమే అరుణోదయాలు…”

ఎక్కడో చదివిన కవి వాక్యాలు పదే పదే మనసులో కదలబారాయి.

బస్సు చాలాసేపటినుంచీ మౌనంగానే ప్రయాణిస్తోంది… అడవి చెట్ల పురాగానం మరింత స్పష్టంగా విన్పించసాగింది నాకు.

కొండలు అలానే వుంటాయి… అడవులూ అలానే వుంటాయి… పాటలు పాడుతూ… నదులు ఏమాత్రం శబ్దం లేకుండానూ, సముద్రాలు ఘోష పెడుతూనూ అవి ప్రవహిస్తూనే వుంటాయి… కొన్నిసార్లు భావావేశంతో ఆకాశానికెగుస్తూ, మరికొన్ని సార్లు అధఃపాతాళానికి తొక్కబడుతూ మనిషి మాత్రమే యిలా…

అడవి పాట మరింత ఉధృతంగా నా హృదయాన్ని మీతుంతుండగా… అప్పటిదాకా బస్సంతా రివ్వున తిరుగుతుండిన నిద్ర తూనీగ నాకంటి మీద వాలింది… ఉట్నూరు చేరేసరికి రాత్రి 10.30 అయింది…

ఇప్పుడు గీత డిప్యూటీ కలెక్టరమ్మ కదా…. తన ఫోన్‌ కాల్‌తో ఉట్నూరులో ఆర్‌డీవో గారు మాకోసం మంచి ప్రభుత్వ అతిథిగృహాన్ని ఏర్పాటు చేసి వుంచారు… ఈసారి నేను, శిలాలోలిత, పసుపులేటి గీత ఒకే గదిలో… మధ్య మధ్యలో సుమతి వచ్చి పలకరించిపోతూ…. ఒళ్ళునొప్పులని కవిత్వ పాదాలతో మదిస్తూ నిద్రతో కలిసిన జాగరణనీ, మెలకువతో కలిపిన నిద్రనీ కబుర్లతో కలగలిపి ఆ రాత్రిని తెల్లారించాము.

తెల్లారకముందే తయారయి బస్సెక్కి ఆర్‌.డి.వో గారింటికి వెళ్ళాం. అక్కడ వారి కుటుంబం లేదు… పంతం సుజాత మరికొందరూ ఆయన అనుమతితో వంటగదిలోకి దూరి మా అందరికీ టీ చేసి పెట్టారు. వేడి వేడి టీలో వెచ్చదనాన్ని నింపుకుని బస్సెక్కిన తర్వాత సూర్యుడితో పాటు యిప్పుడు మనం ఎక్కడికెళ్తున్నామన్న ఆలోచన (ప్రశ్న) అందరి మనసుల్లోనూ ఉదయించింది.

ఆ ప్రశ్నలని గుర్తించినట్లుగా ప్రశాంతి లేచినిలబడి పెదవి విప్పింది.

తాను మహిళా సమతలో పని చేస్తున్నట్లు మరోసారి పరిచయం చేసుకుంది…..

మహిళా సమత 1986లో ప్రారంభించబడింది… భారత ప్రభుత్వ పథకమే.. అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో స్త్రీలను చైతన్య పరుస్తూ వారితో కలసి పనిచేస్తున్న తీరు… ఆ క్రమంలో తాను కలసిన అనేకమంది మహిళలూ వారి నుంచి నేర్చుకున్న పాఠాలూ యివన్నీ కూడా సవివరంగా, సవినయంగా మనవి చేసుకుంటూ… స్త్రీల జీవితాలకి నిజమైన విముక్తి కలగాలంటే పురుషుడి ఆలోచనలలో సమూలమైన మార్పులు రావాలన్న విషయాన్ని గుర్తెరిగి యిప్పుడు బాలసంఘాలు ఏర్పాటు చేశారనీ, బాల సంఘాలు అన్ని విషయాల్లోనూ చురుగ్గా పనిచేస్తున్నాయి…. బాల్యం నుండే అన్ని అంశాలలోనూ వివక్షలేని ఒక పొత్తు ప్రపంచాన్ని మెరుగైన ఒక కొత్త సమాజాన్ని వాళ్ళు నిర్మించుకుంటూ వస్తున్నారనీ ప్రశాంతి చెప్తుండగానే ‘మోడి’ అన్న గ్రామం వచ్చింది…

అక్కడ సరిత, సాక్రూబాయి అన్న యిరువురు మహిళలు (మహిళా సమతతో కలిసి పనిచేస్తున్నవాళ్ళు) మా బస్సులోకి ఎక్కారు. వాళ్ళని ప్రశాంతి మా అందరికీ పరిచయం చేశాక, అసలు విషయం చెప్పింది.

”మనమిప్పుడు కెరమెరి మండలం లోని జోడెఘాట్‌ అన్న అదివాసీ ప్రాంతానికి వెళ్తున్నాం… అక్కడ గోండురత్న, అమరవీరుడు ‘కొమరం భీం’ సమాధి వుంది… అది చూశాక మళ్ళీ మనం మోడి వైపు వస్తాం” అంటూ…

అంతా చిరుకేకలతో ఒక ఉద్వేగాతిశయాన్ని వెలిబుచ్చారు. జోడేఘాట్‌ గ్రామం చేరేలోపుగా సరిత, సాక్రూబాయి మాకు మరింత పరిచయమయ్యారు… సాక్రు అంటే గోండీ భాషలో చక్కెర అని అర్థమట… సాక్రుబాయి గోండీ భాష మాట్లాడినంత అనర్ఘళంగా తెలుగు కూడా మాట్లాడుతోంది… తెలుగు భాషతో ఆమెకున్న పరిచయం, అనుబంధం చూసి ముచ్చటేసింది మా అందరికీ….

జోడేఘాట్‌లో కొమరంభీం సమాధి చూడ్డం ఒక ఉద్వేగ పూరితమైన అనుభవం. ఆదివాసీల హక్కుల కొరకు… జల్‌, జమీన్‌, జంగిల్‌ కొరకు, స్వయం పరిపాలన అధికారం కొరకు నైజాం సైన్యంతో వీరోచితంగా పోరాడి పందొమ్మిది వందల నలభైయ్యో సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమినాడు అమరుడయ్యాడు భీం. (1-9-1940) అతడితో పాటు గోండుల హక్కుల కొరకు పోరాడి అమరులయిన అనేకమంది యితర వీరుల పేర్లు కూడా ఆ శిలాఫలకం మీద చెక్కబడి వుండడం విశేషం.

ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమినాడు ఈ ప్రాంతంలో ఒక దర్బార్‌ జరుగుతుంది… అధికారులంతా కొలువుతీరి ఆదివాసీ సమస్యల గురించి, వారి హక్కుల గురించీ, వారికివ్వాల్సిన సౌకర్యాల గురించీ లోతుగా చర్చిస్తారు… ప్రతీ వ్యక్తికీ కూడ ఆ దర్బారులో మాట్లాడే అవకాశముంటుంది… అప్పుడప్పుడూ మావోయిస్టులు కూడా వస్తుంటారు. చాలా చాలా భద్రత వుంటుంది… అంటూ చెప్పుకొచ్చారు సాక్రూబాయి.

కొమరం భీం విగ్రహాన్ని చూడడం, ఆ నేల మీద అడుగు పెట్టడం మళ్ళీ నన్ను లోపలి ప్రపంచంలోకి నెట్టాయి…

చాపకింద నీళ్ళలా… తమమీద అమలవుతోన్న నిర్భంధాన్ని ప్రతిఘటించడం కోసం సమీకృతమవుతోన్న ఆదివాసీల చైతన్యాన్ని నేను విన్నంతవరకూ, చదివినంతవరకూ గుర్తు తెచ్చుకుంటూంటే ఒక వూరట.

‘మా నేల మాది, ఈ నీళ్ళు మావి, ఈ అడవి మాది’

మా రాజ్యం మాకే, మావూళ్ళో మా ప్రభుత్వమే’ అన్న దండకారణ్య నినాదం చెవుల్లో మారుమ్రోగసాగింది.

సాక్రూబాయి యింకా చాలా విశేషాలు చెప్పింది…. గోండులలోని అనేక తెగల గురించీ, వారి ఆహార పానీయాల గురించీ, జీవన విధానాల గురించీ చెప్పుకొచ్చింది…

వారి ప్రధాన జీవనం వ్యవసాయం… అడవుల్లో, కొండల్లో, గుహల్లో వుండి వ్యవసాయం చేస్తారు… అయితే వెదురుతోనూ, కొబ్బరి నారతోనూ అనేక రకాల వస్తువులు తయారు చేసి అమ్మడం కూడా వారి జీవన కళ… పంట చేతికి వచ్చినపుడు దానికో పెద్ద పండగ చేసికొని తినడం అలవాటు లేదు. ఆసుపత్రులను, డాక్టర్లను నమ్మరు… అనారోగ్యమయితే దేవుళ్ళకు మొక్కుకుంటారు. అయితే చాలా పరిశుభ్రంగా వుంటారు. స్త్రీలు నెలనెలా ముట్టయినప్పుడు వూరికి ఒక కిలోమీటరు దూరంలో వున్న ఒక యింట్లోవుంచి అయిదో రోజు స్నానం చేసి యింటికి వచ్చేప్పుడు దారంతా కళ్ళాపు (సానుపు) జల్లుతూ తీసుకుని వస్తారట… కానుపు వంటి సమయాల్లో కూడా శుభ్రమైన జాగ్రత్తలు పాటిస్తారట…

ఒకప్పుడు ఉయ్యాలలోనే పెళ్ళిళ్ళు జరిపించేవారు. ఆ తర్వాత బాల్యా వివాహాలు జరిగేవి… ఇప్పుడు మహిళా సమతతో కలిసి పని చేయడం మొదలు పెట్టాక ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్ళు వచ్చాక కానీ వివాహాలు చేయడం లేదు… ఇప్పుడు కట్నాలు కూడా మొదలయ్యాయి. అమ్మాయి యింట్లోనే పెళ్ళి జరిపించే ఆచారం…. గోత్రాలు మాత్రం తప్పక పాటిస్తారు…. రెండవ పెళ్ళి తప్పు కాదు గానీ మొదటి భార్య అనుమతి లేనిదే సాధ్యం కాదు. విడాకుల విషయంలో కూడా స్త్రీల అభిప్రాయానికి విలువనిచ్చి… భార్యకు యిష్టం లేనప్పుడు కొంత సమయాన్నిచ్చి విడాకులు ఏర్పాటు చేస్తారు… స్త్రీలకు కూడా రెండో పెళ్ళి చేసుకునే అవకాశముంటుంది.

పదిహేను నుండి ఇరవై గ్రామాలకు కలిపి ఒక రాయ్‌ సెంటర్‌ వుంటుంది… ఎక్కడేచిన్న సమస్య వచ్చినా రాయ్‌సెంటర్‌ పంచాయితీలో తీర్పులు చెప్పబడతాయి… భార్యాభర్తల తగువులే కాకుండా అనేక యితర సమస్యలు కూడా ఈ రాయ్‌సెంటర్‌ పంచాయితీల్లో పరిష్కరించబడతాయి.

సాక్రూ ఈ అన్ని విషయాలూ చెప్పేలోపుగానే సైదాపురం మండలంలోని ఝరి అన్న గ్రామానికి చేరుకున్నాం మేము. అప్పటిదాకా మేము ఫాస్ట్‌ బ్రేక్‌ చేయలేదన్న సంగతే మాకెవ్వరికీ గుర్తు లేదు. అక్కడ మాకోసం ఒక కొత్తరకం ఉప్మా, పచ్చిపులుసు, ఉడకబెట్టిన స్వచ్ఛమైన చిక్కుడు గింజలు, పండ్లముక్కలు ఎదురు చూస్తున్నాయి… ప్రేమగా మాకు బొట్టు పెట్టి ఆహ్వానించి కొసరి, కొసరి వడ్డించిన తీరు చెప్పనలవి కానిది. అన్నీ కూడ జీవవైవిధ్యంతో కూడిన పదార్థాలు…

ఆ తర్వాత మేము దగ్గరలో వున్న విత్తనాల షాపుకి నడుచుకుంటూ వెళ్ళాం… ఆ విత్తనాలని గురించీ, బయోడైవర్శిటీని గురించీ కొన్ని విశేషాలు తెలుపుతూ అక్కడి వారు మా సమావేశ స్థలానికి దారి చూపించారు…

ఆదిలాబాద్‌ జిల్లా అంతా కూడ నీటికొరత చాలా ఎక్కువగా వుంది… భూగర్భజలాలు అడుగంటి, బావులు ఎండిపోయి తాగునీటి కోసం స్త్రీలు మైళ్ళతరబడి నడవాల్సిన పరిస్థితి వుంది… ఇది రాస్తున్న సమయానికి ఉట్నూరు మండలం ఈసారి అనే గ్రామంలో కొన్ని పదుల మంది స్త్రీలు తల మీద రెండేసి బిందెలుంచుకుని రెండు, మూడు కిలోమీటర్లు నడిచి, కొన్నిచోట్ల గుట్టలెక్కి తాగునీటిని మోసుకు పోతుండడం న్యూస్‌ బిట్‌ చూసి కడుపులో దేవినట్టయింది. కెరెమెర వద్ద ‘అడ’ ప్రాజెక్టు ఏర్పాటు చేసి మూడు మండలాలకు నీళ్ళు పంపిస్తున్నారు. ఆ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలు మాయమయి పోయాయి. రీప్లేస్‌మెంట్‌ చేశారు కానీ సరయిన సౌకర్యాలు లేవు.

ఝరిలో బయోడైవర్శిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ వుంది. ఇది పంచాయితీలతో కలిసి పనిచేస్తుంది… వాళ్ళ ప్రాంతంలో ఏది అమ్మాలన్నా కూడా ఈ బి.యం.సి. రేటు ఖరారు చేస్తుంది… బి.యం.సి గా దానికి ప్రాచుర్యం వచ్చింది. బి.యం.సి. ముఖ్యోద్దేశం ప్రకృతిని కాపాడుకోవడం… ప్రాణులు, చెట్లూ అట్లా గ్రామ పరిధిలోని అన్ని రకాల వనరులనూ కాపాడుకునే బాధ్యత బి.యం.సి. దే… ఇది వరల్డ్‌ బ్యాంక్‌ ప్రాజెక్టు. హిమాచల ప్రదేశ్‌, హర్యానాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్‌లో మాత్రమే యిది వుంది…

మనందరికీ తెలుసు. చాలాకాలంగా రైతులు రసాయనిక ఎరువులను వాడి-వాటికే అలవాటు పడి యిటు భూమి సారాన్ని కోల్పోవడమే కాక అటు పంటల్ని నాశనం చేసుకుంటున్న పరిస్థితి… సేంద్రీయ ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు, ఆరోగ్యాలనూ కూడా పొందవచ్చునని అక్కడ బియంసిలో పనిచేస్తోన్న వారు మాకు తెలియచెప్పారు. సేంద్రీయ ఎరువులు భూమిలోపలి నుండి బ్యాక్టీరియాలను వృద్ధి చేయడంతోపాటు రసాయనాలను చంపివేయడానికి దోహదపడతాయనీ, మొక్కవేర్లను పటిష్టం చేసి, సూక్ష్మపోషకాలు నీటి ఎద్దడిని తీసుకునే వెసులుబాటు కలిగిస్తాయనీ, అలాగే భూమిని పూర్తిస్థాయిలో మిశ్రమం చేయడం వల్ల తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుందనీ రైతులు సేంద్రీయ ఎరువుల మీద ఆసక్తి పెంచుకుని అధిక దిగుబడులు సాధించేలా మేము వెళ్ళి వాళ్ళని చైతన్య పరుస్తూ వుంటామనీ, యింకా అనేక విషయాలను వాళ్ళు మాతో పంచుకున్నారు… జీవవైవిధ్యం మీద మంచి అవగాహన కలిగేలా మాట్లాడారు… అక్కడ వాళ్ళతో వీడ్కోలు తీసుకుని బైనూర్‌ మండలం వైపుగా సాగిపోయాం మేము.

ఆదిలాబాదు జిల్లా ఘాట్‌రోడ్డులో ఒకప్పుడు నెమళ్ళు చాలా ఎక్కువగా వుండేవట… పోడు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం యివ్వడం ద్వారా చాలా అడవిని కొట్టేయడంతో నెమళ్ళు, కుందేళ్ళ కుటుంబాలు ఎన్నో కనపడకుండా పోయాయని సాక్రూబాయి చెప్పింది… మేము జైనూర్‌ మండలం వెళ్ళేదాకా ఈసారి సాక్రు పాటలు, సరిత డ్యాన్సులతో బస్సంతా హోరెత్తి పోయింది… సరితతో పాటుగా రేణుకా అయోల డ్యాన్సు చేయడం యింకా యితరులంతా పాటలు పాడడం… అందరూ కలగలుపుగా మాట్లాడుకోవడం, ప్రశాంతి మహిళా సమత తరపున వేసిన పాటల పుస్తకాలు చూపించడం, వాటిలోని పాటలు అంతా కలిసి పాడుకోవడం అదో తీయని అనుభూతి….

సాక్రుబాయిని చూస్తుంటే లేని వుత్సాహమేదో మా అందరినీ ఆవరించినట్టుగా వుంది… చైతన్యవంతమైన ప్రజా సమూహాలు కొన్ని, అటువైపు నుండి మావోయిస్టులు ఆదివాసీలతో మమేకమై వారిని చైతన్య పరుస్తుండడం, ఫలితంగా వారిలో మెరుగు పడుతోన్న వివేకం, ఒక ధిక్కారస్వరం కలగలిపి ప్రతిఘటించే శక్తిని పోగు చేసుకోగలగడం, వారికి వ్యవస్థలో మరెక్కడా చోటు లేకపోవడం మూలంగా అనివార్యంగా పోరాటంలోకి దిగే ఆలోచనని సంతరించుకోగలగడం వీటన్నిటికీ ఒక ప్రతీకలా వున్న సాక్రూ ఆదివాసీల రేపటికలేమొ అన్పిస్తోంది…

మూడు గంటల ప్రాంతంలో జైనూర్‌ మండలంలోని ఉషెగావ్‌ అన్న గ్రామం చేరుకున్నాము… ఇవన్నీ కూడ మహిళా సమత పనిచేస్తోన్న ప్రాంతాలు. మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది స్త్రీలు ఒక్కొక్కరి చేతిలో ఒక బంతిపూల మాల (వారు స్వయంగా గుచ్చినది) పట్టుకుని వరమాలతో నిల్చున్న పెళ్ళి కూతుళ్ళలా ఎదురు చూస్తున్నారు.. మేము దిగగానే ముందు ప్రశాంతికి, సత్యవతికీ ఆ తరువాత మా అందరికీ బొట్లుపెట్టి మాలలు వేసి కేరింతలతో, కోలాహలంగా వూరిలోపలికి తీసికెళ్ళారు.

ముందుగా మేము అక్కడ ఇత్తడితో కళాకృతులు తయారుచేసే ఒక చిన్న స్థలానికి వెళ్ళాము… మూసపోసి తయారు చేసిన రకరకాల కళాకృతులు మమ్మల్నెంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కళని ఓజా అని అంటారు. ఓజా అనేది గోండులలోని ఒక తెగ… వాళ్ళు మాత్రమే ఈ కళాకృతులు చేస్తారు కాబట్టి దాని ఓజా పని అంటారట… వీటిని నాగోబా జాతరలో అమ్మకానికి పెడతారు… నాగోబా వారి ప్రధాన దేవుడు… నాగోబాకి జాతరలు చేస్తారు… మహారాష్ట్ర నుండి కూడా చాలామంది ఈ జాతరలకు వస్తుంటారని వారు చెప్పారు… ఓజా పని చేసే వడలి భగవంతంని మహారాష్ట్ర విశ్వవిద్యాలయం వారు పిలిచి ఈ కళని తమ విద్యార్ధులకు నేర్పింపచేశారని ఆ పేపర్‌ కటింగ్స్‌ ఫోటోలు మాకు చూపించడానికి ఉత్సాహ పడ్డాడు భగవంతం… భగవంతం వద్ద మేమందరమూ ఎవరికి నచ్చిన కళాకృతులు వారు కొనుక్కున్నాం. సత్యవతి మా అందరికోసం ఈ ప్రయాణపు గుర్తుగా పాతిక అందమైన ‘పోల’ లు ఆర్డరిచ్చింది… ఎట్టకేలకు అక్కడి నుండి బయటపడ్డాం.

అక్కడికి దగ్గరలో మాకు భోజనాల ఏర్పాటు జరిగింది. జొన్న గట్క, చిక్కుడుకాయల కూర, పాయసం వంటిది, పచ్చడి… వాళ్ళ అభిమానం, ప్రేమ అన్నీ కలగలిపి పొట్ట పట్టనంతగా పెట్టారు. ఊళ్ళోని పెద్దా, చిన్నా స్త్రీలు, పురుషులూ అంతా అక్కడికి చేరుకున్నారు… అంతా కలిసి ధింసా నాట్యం చేశారు. ఆ నాట్యంలో మేమూ పాలు పంచుకున్నాం. ఎంతయినా చివరికి మేము అక్కడి నుండి వీడ్కోలు తీసుకోక తప్పలేదు.

ఈ వీడ్కోలు నిజంగా చెప్పుకోతగింది.

ఒక విత్తనం నేలమీద పడితే మొలకెత్తినట్లు, ఒక అక్షరం సారవంతమైన హృదయంలో పడి రచనగా రూపొందినట్లు మొలకెత్తడంలోని జీవరహస్యమేదో తెలుసుకున్న దానిలా అప్పటిదాకా సంచరించిన సాక్రూబాయి హఠాత్తుగా కరిగి వర్షించడం… వేల సంవత్సరాలు నిండిన మాతృమూర్తిలా ప్రశాంతి ఆమెని చేరదీసి అక్కున చేర్చుకుని ఓదార్చడం, భూమిక సరిత, లక్ష్మి, సత్యవతి అంతా వారి చుట్టూ చేరి కదిలిపోవడం మొత్తంగా బస్సునంతా కుదిపేసింది… ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ అంతా ఫ్లాటయి పోయారు… చాలా సేపటి దాకా అట్లా ఏడుస్తూనే వుండిపోయింది సాక్రూబాయి. కన్నీటితో తడిసి మెరుస్తోన్న ఆమె ముఖాన్ని చూస్తూ దగ్గరగా వెళ్ళి ఏదైనా ఓదార్పు మాటలు చెప్పాలన్న ఆలోచనని బలవంతంగా ఆపుకున్నాను- నాకు తెలుసు అలా చేయడం చాలా కృతకంగా వుంటుందని. వాడ వాడంతా సాక్రూబాయి వెనక నిల్చుని మాకు వీడ్కోలు పలికిన తీరు వర్ణనాతీతం… బరువెక్కిన తడి మూటల్లాంటి గుండెల్ని మోసుకుంటూ మళ్ళీ బస్సెక్కాం మేము.

ఒకవైపు విధ్వంసకర అభివృద్ధిని సమర్థిస్తూ మరోవంక జీవవైవిధ్య సదస్సును ఆర్భాటంగా నిర్వహించే ప్రభుత్వాలు వృక్ష, జంతు సంపద మాటెలా వున్నా… జాతులను కాపాడుకునే చిత్తశుద్ధిని కలిగి వుండాలి కదా అన్పిస్తుంది… ఒరిస్సాలో వేదాంత కంపెనీ చేపట్టిన మైనింగ్‌ మూలంగా డోంగ్రియా, కుటియా గోండుల అస్థిత్వానికి ముప్పు వాటిల్లిందనీ, ఇప్పుడు ఆకుపచ్చ వేట మూలంగా బస్తర్‌ లోని అబూమాడ్‌ గుట్టలపై నివసిస్తోన్న ప్రపంచంలోనే అతి పురాతనమైన తెగల్లో ఒకటైన అబూజ్‌ మాడియాణలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఎక్కడో చదివిన వాక్యాలు వెంటాడసాగాయి. ఇంకెన్నెన్ని చోట్ల ఎంతెంత మందో కదా… ప్చ్‌

చాలాసేపట్నుంచీ మౌనంగా ప్రయాణిస్తోన్న బస్సులో చిన్న కదలికలు వూపిరులూద సాగాయి…. ‘ఉషెగావ్‌’ నుండి నిజామాబాద్‌ మీదుగా వర్ని ప్రయాణం బహుదూరం కావడంతో ఆ బరువును తేలిక చేయడం కోసం ముందుగా తేరుకున్న గీత మా అందరికీ ఒక పజిల్‌ యిచ్చింది…’ మనమంతా మూడు రోజులుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం… ఇంతా చేసి పాతికమందిమి మాత్రమే… మనం ఎంతవరకూ ఒకరినొకరం తెలుసుకున్నాం? యిప్పుడు మీ అందరికీ పేపర్లివ్వబడతాయి. ఈ పాతికమంది పేర్లు రాసి చూపించాలి అన్నది…

నేను నా ప్రక్కన కూర్చున్న తన వంక చూశాను… గీత వాళ్ళ చిన్నక్క విజిత… గీత చెల్లి మున్నీని మూడు రోజులుగా అంతా మున్నీ అని పిలవడం వింటూనే వున్నాను… మరి గీత పెద్దక్క పేరేంటి?… ఇదెంత పనిలే అనుకున్నా గానీ ఎవ్వరూ అందరి పేర్లూ రాయలేక పోయారు. బుజ్జి (నాగమణి) ఒక్క బుజ్జి మాత్రమే (సత్యవతి తమ్ముడి భార్య) డ్రైవరుతో సహా అందరి పేర్లూ రాసి చూపించగలిగింది… తనని ‘పాషా’ చప్పట్లతో అందరం అభినందించాం. గీత స్నేహితురాలు ఇందిర, ఇందిర ఫ్రెండ్‌ ఉష వీళ్ళందరి పేర్లూ బుజ్జి (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌) గుర్తుంచుకుని రాయడం విశేషం… మిగిలిన వాళ్ళు మూడు రోజులుగా కలిసి వుంటూ ఒకరికొకరం అపరిచయంగానే వున్నామా అన్పించింది…

అప్పుడు సత్యవతి ‘యిక తప్పదు’ అంతా ఒకర్నొకరు వచ్చి పరిచయం చేసుకోవాలి… మనం అపరిచితంగా వుండి పోకూడదు’ అంది. ఇక అప్పుడు మొదలయింది స్వీయ పరిచయం పరాకాష్ట…. పాతిక మంది పరిచయాలూ, జ్ఞాపకాలూ సరదా సరదాగా రెండు గంటల కాలం గడచి పోయింది. ఈ మొత్తం ప్రయాణంలో కల్పన, లక్ష్మి, సరిత ముగ్గురూ కూడ మాటి మాటికీ స్నాక్స్‌ అందిస్తూ మా అందరి సౌకర్యాలనూ గమనిస్తూ ప్రేమగా చూసుకోవడం మరిచిపోలేనిది నిజంగా. చాలా చాలా సుదీర్ఘ ప్రయాణం తరవాత రాత్రి పది గంటల వేళ సమతా నిలయం చేరుకొన్నాం… ఇది నేను ఎంతోకాలంగా చూడాలని ఉవ్విళ్ళూరుతున్న స్థలం.

మూడు రోజులుగా మాతోనే వున్న శాంతి ప్రబోధ ఉషెగావ్‌ నుండే ఫోను చేసి చెప్పింది మేమంతా వస్తున్నట్లు… శాంతి ప్రబోధ జోగిని నవల రాసిన శాంతి మనందరికీ తెలుసు కదా… తాను ఇరవైయేళ్ళుగా ‘సమతా నిలయం’ లో హేమలతా లవణం గారితో కలిసి పనిచేసేదట… ఇప్పుడు గత రెండేళ్ళుగా ‘మహిళా సమత’ సమతా నిలయాన్ని ఓన్‌ చేసుకుని నడిపిస్తున్న తర్వాత కూడా శాంతి అక్కడే వున్నారు… పిల్లలందరితోనూ ఆమెకి చాలా చేరిక… మేము వెళ్ళడం చాలా ఆలస్యం కావడంతో పిల్లలంతా వారి వారి ఇళ్ళలోకి వెళ్ళి ఒరుగుతున్నారు అప్పుడే.

ఇళ్ళలోకి అని ఎందుకంటున్నానంటే యిది ఒక హాస్టల్లా కాకుండా అయిదారుమంది పిల్లలూ వాళ్ళతో తల్లి తల్లిదండ్రులకి దూరంగా వున్నట్టు కాకుండా, లేదా తల్లిదండ్రులు లేరన్న ఫీలింగు లేకుండా ఇది యిల్లు అన్న భావన కలిగేలా వుంచారు… ఈ కాన్సెప్ట్‌ మా అందరికీ చాలా బాగా నచ్చింది. ఇలా ఇల్లు, తల్లిలా ఒక స్త్రీ ఈ మొత్తం ఆలోచన ప్రశాంతిది అని సత్యవతి చెప్తుంటే అందరం తనని అభినందించాం…

మా చప్పుడు విని ఒక్కొక్క యింటిలోనుండీ పిల్లలు మెలి మెల్లిగా బయటికి వచ్చారు… ప్రశాంతిని చూడగానే వాళ్ళంతా హర్షాతిరేకంతో ఎగిసిపడ్డారు… సత్యవతిని చూసి అమ్మమ్మా, అమ్మమ్మా అంటూ అల్లుకు పోయారు… మాలో ప్రతి ఒక్కరినీ యింతకు ముందే ఎరిగిన వాళ్ళలా అందరి వద్దకీ వచ్చి పలకరించారు. అంతే కాకుండా మేమంతా కూర్చున్న తరువాత మా పాతికమందికీ రెండు రోజుల్నుంచీ వాళ్ళు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్‌ కార్డులందచేసి గొప్ప అనుభూతి నిచ్చారు.

రవి స్పీచ్‌, తేజ, భూమిక, స్వప్న కవితలు, పాటలు, అల్లరి నవ్వులూ… మేమంతా తనివి తీరే దాకా వాళ్ళ మాటలు, కవితలు, పాటలు కధలు అన్నీ విన్నాం…

నాకెందుకో గానీ రవిని చూడగానే గతంలో తొలిసారి వర్ని వచ్చినపుడు సత్యవతితో అతను చెప్పిన తన విషాద జీవితం, ‘అసలా మాటకొస్తే యిక్కడి పిల్లలందరి జీవితాలూ విషాద కావ్యాలే. ఎన్నో దుఃఖ నదులని దాటుకుని వాళ్ళిక్కడికి వచ్చారు’ అన్న ప్రశాంతి మాటలూ మనసులో మెదిలి గొంతుకడ్డం పడ్డాయి… ఈ పిల్లలందరికీ ప్రశాంతి పట్ల వున్న ప్రేమ, ఇష్టం, గౌరవం చూస్తూంటే మా అందరికీ ప్రశాంతి ఏంటో పూర్తి అవగాహనకొచ్చింది. పదిహేను జిల్లాలలో ఉదృతంగా పనిచేస్తోన్న మహిళా సమత గురించి, రెండేళ్ళ ముందు స్వంతం చేసుకుని నడుపుతోన్న సమతా నిలయం గురించీ, దానితోనూ, పిల్లలతోనూ ప్రశాంతికున్న అనుభవాల గురించీ సాయంత్రం సౌమ్యంగా బస్సులో ప్రశాంతి చెప్పిన మాటలు యిప్పుడు ప్రశాంతిని పూర్తిగా పరిచయం చేశాయి… అందరికీ ప్రశాంతి పట్ల స్నేహం, ప్రేమ, అభిమానం, గౌరవం వెల్లువెత్తాయి… నిజంగానే కొందరు మనుషులు అరుణోదయాలు… అమృత హృదయాలు.

మేము పిల్లలకి సమయమివ్వలేదు గానీ లేదంటే నాటకాలు వేసి, నృత్యాలు చేసి, వాళ్ళ జీవితాలు మాకు విప్పి చెప్పి వుండేవారే. ఆలస్యంగా వెళ్ళి ఆ పిల్లలతో పూర్తిగా గడపలేక పోయామే అన్న అసంతృప్తి వుండనే వుంది…. రకరకాల చెట్లతోనూ, ఆ చెట్ల మీద వాలిన పిట్టలతోనూ అందమైన గుండ్రటి గుడిసె ఆకారంలో వున్న ఇళ్ళతోనూ, విశాలమైన ఆరు బయటలోనూ విషాద జీవిత కావ్యాలను భుజాన మోస్తూ చిరునవ్వులతో ముద్దుల మూటలు కడుతోన్న పిల్లలతో నిండి వున్న ఆ సమతా నిలయాన్ని పగలు చూడలేక పోయామే అన్నది రెండో కొరత… అన్నిటికంటే పెద్ద దిగులు ఆ పిల్లలూ, వారి భవిష్యత్తూ… వారు ఎంతో ఆప్యాయంగా వడ్డించిన భోజనం గొంతు కడ్డం పడి ఎంతకీ లోపలికెళ్ళదు… అలా అని బయటికీ రాదు… మరోసారి బరువెక్కిన గుండెల్ని మోసుకుంటూ ఆ అర్థరాత్రి మళ్ళీ మేము బస్సెక్కాం… కానీ ఆ రాత్రి ఎవరూ నిద్రపోయినట్లుగా లేదు… ఏదో పెద్ద అంతరాయం తగిలిన వాళ్ళలా కదులుతూనే వున్నారు… గిరిజనుల, వర్నీ పిల్లల ఛాయాచిత్రాల్ని పదే పదే మనోఫలకం మీద నిలుపుకుంటూ కదలబారుతూనే వున్నారు.

పాఠశాలల వంటి ఆ ఆదివాసీ పల్లెల్లో ఆత్మీయత, అనుబంధం, శ్రమజీవనం అన్న పాఠాలు నేర్చుకుని తిరిగి వచ్చాం. వెళ్ళేప్పుడు ఎంతో తేలిగ్గా హాయిగా ఎగురుతూ వెళ్ళిన నా పడవ మునక వేస్తుందేమో నన్నంత బరువెక్కి పోయింది నా తిరుగు ప్రయాణంలో.

(నా యింటిని తన భుజం మీదికి మార్చుకుని నన్నీ ట్రిప్‌కంపిన మా పిన్నమ్మ సక్కుబాయమ్మకి ప్రేమతో)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో