అందమైన ఆదిలాబాదు అడవుల్లోకి….

-తుర్లపాటి లక్ష్మి

‘లక్ష్మీ! రెడీగా వుండు… ఇరవై, ఇరవై ఒకటో తారీఖు… ఆ రెండు రోజులూ ఎక్కడికీ పోగ్రాం పెట్టుకోకు! హైద్రాబాదు నుండి భూమిక సత్యవతిగారు, ఆమె ఫ్రెండ్స్‌, రచయిత్రులు వస్తున్నారు! మనందరం అదిలాబాద్‌ అడవుల్లోకి వెళుతున్నాం’ ఫోన్‌లో అమృత మాటలు విని ఎగిరిగంతేశాను.

ఇరవై సాయంత్రం నా బ్యాగు సర్దుకుని నిజామాబాద్‌ విజయ్‌ హైస్కూలుకి వెళ్ళిపోయాను. అప్పటికే అక్కడ అమృత, ప్రభ, వసంత, కవిత, రమ, ఇందిర, విజయ, శాంతిప్రబోధ వున్నారు.

అక్కడికి వెళ్ళీ వెళ్ళగానే – ‘చలో! అందరూ డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయాలి! ఒక్కొక్కరూ ఒక్కో రోల్‌ తీసుకోండి! ఇప్పుడు ఇక్కడికీ కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళను అబ్జర్వ్‌ చేస్తూ, వాళ్ళు చెప్పినట్లు చేయండి!’ అంటూ అమృత తను రాసిన ‘బంద్‌’ నృత్యరూపకాన్ని మాతో ప్రాక్టీస్‌ చేయించారు.

‘బంద్‌’లో నాది డ్రైవర్‌ పాత్ర. అందులో భాగంగా… రౌడీలు… డ్రైవర్‌ని సతాయిస్తూ… అతడ్ని పిడి గుద్దులు గుద్దుతూ బస్సు నడపనీయకుండా చేస్తారు.

రౌడీలుగా ప్రభ, వసంత, కవిత, రమలు. ఇక ప్రభ సంగతి సరేసరి. నేనెటు వెళ్తున్నా… చివరకి పారిపోతున్నా… పట్టి పట్టి గుంజుతూ… రిహర్సల్స్‌లో సైతం… తన పాత్రలో లీనమై నన్ను నిజంగానే కొట్టడం! అబ్బో! నా వల్లకాలేదు.

‘బాబోయ్‌! నేను డ్రైవర్‌ పాత్ర వేయను. ప్రభామేడం నిజంగానే నన్ను కొడతారు’ అని మొత్తుకున్నాను.

‘ఏయ్‌! లక్ష్మీ! కొట్టను, కొట్టను, నువ్వేమీ భయపడకు’ అని ప్రభ నచ్చజెప్పారు.

‘మీరట్లానే అంటారు. కానీ స్టేజీమీద అన్నీ మరిచిపోయి కొడతారు’ అని భయపడుతూంటే –

‘నిజం! కొట్టను!’ అని హామీ ఇచ్చారు. అయినా నాకు ఒక పక్క భయమే!

హైదరాబాద్‌ బృందం ఇంకా రాలేదు. వాళ్ళకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడిదాకా వచ్చారో ఫోన్లద్వారా తెలుసుకుంటూనే వున్నాం. వాళ్ళురాగానే, అందరం కలిసి ఆర్మూర్‌ వెళ్ళాలి.

ఇంతలో హైదరాబాద్‌ ట్రూప్‌ బిల బిలమంటూ బస్సులో నుండి దిగారు. అందరం వారిని సంతోషంగా ఆహ్వానించాం.

వాళ్ళముఖాల్లో… ప్రయాణంలో అలసట కంటే – మమ్మల్ని కలిసిన ఆనందం ఎక్కువ కనిపించింది!

మాకూ అంతే!

ఆఫీసులో అందరూ కూర్చోని టీ, బిస్కట్స్‌ తీసుకుంటూంటే, వాళ్ళకి మమ్మల్నీ, మాకు వాళ్ళనీ పేరు పేరునా సత్యవతీ, అమృతా పరిచయం చేశారు.

ఇక అందరం కార్లలో, బస్‌లో మామిడిపల్లి దగ్గర అమృతా వాళ్ళు అపురూపంగా కట్టించిన శ్రీ ‘అపురూప’ వేంకటేశ్వరుని ఆలయానికి వెళ్ళాం. ఆ అడవులూ, కొండల మధ్య విద్యుద్దీపాల కాంతులలో మెరుస్తోన్న ఆలయం మమ్మల్నందరినీ చేతులు సాచి ఆహ్వానించింది. దర్శనాలూ, హారతుల తర్వాత – గెస్ట్‌హౌస్‌ ‘స్వాంతన’కి వెళ్లాం.

అనంతరం అంకాపూర్‌ గ్రామ పరిసరాల్లో రాజారెడ్డిగారు కట్టించిన వృద్ధాశ్రమం ‘లాలన’కీ, అమృతా మేడం చెల్లెలు విజయ కట్టించిన ‘సాయికృష్ణ’మందిర్‌కీ వెళ్ళాం. అప్పటికే వృద్ధులు నిద్రపోయారు. మెలుకువగా వున్న వాళ్ళలో కొందరు మాతో మాట్లాడారు. సాయి దర్శనాన్ని చేసుకొని ఆర్మూర్‌కి పయనమయ్యాం.

‘రాత్రి పూటే ఈ వాతావరణం ఇంత బావుంది! పగలైతే ఇంకెంత బాగుండేదో’ అని ఒక్కక్షణం అనిపించినా – పోన్లే ఇవికూడా చూశామన్న సంతృప్తి దాన్ని డామినేెట్‌ చేసింది.

‘భలే బావుంది కదా! అక్క ఒక గుడి, చెల్లెలు ఒక గుడి పంచుకుని కట్టించినట్లుగా వుంది!’ అనిపించింది.

ఇక ఆర్మూర్‌కి వెళ్ళాం. భోజన సదుపాయాలు. వెజ్‌ వాళ్ళకి వెజ్‌, నాన్‌వెజ్‌ వాళ్ళకి నాన్‌వెజ్‌.

అతిథి మర్యాదల్లో తనకుతానే సాటి అమృత. అందరికీ కావలసినవి వడ్డిస్తూ, తెప్పిస్తూ వేడి వేడి భోజనం సర్వ్‌ చేశారు.

నెల్లుట్ల రమాదేవి ఆధ్వర్యంలో ఆటలు, కాగితాలూ, పెన్నులు, రాతలూ. గెలిచినవారికి బహుమతులు! బహుమతులు ఎంత ముద్దుగా ఉన్నాయంటే – ఓడినవారికి కూడా ‘ఇస్తే బాగుండు’ అనిపించేంత!

పాటలూ, మ్యూజిక్‌, అందరూ నవ్వుతూ తుళ్ళుతూ డాన్స్‌ చేశారు.

అప్పటికే అంతా అలిసిపోయి వున్నారు. అయినా పడుకుంటేనా?

తెల్లవారి ఆరింటికే శ్రీరాంసాగర్‌, పొచ్చెర, కుంటాలకి వెళ్ళిపోవాలి. అందుకే అందరం తొందరగా పడుకోవడానికి తయారయ్యాం. అమృత అందరికీ పడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. రూమ్‌లలో మంచాలమీద, మంచాల పక్కన, బయట సోఫాల్లో, అన్ని చోట్లా సర్దుకుని సర్దుకుని పడుకోవడం – ఎంతమంది పడుకున్నా ఇంకొకరికి చోటున్నట్టుగా – ఆ రోజు ఆమె ఇల్లు ఒక పుష్పక విమానం అయింది.

‘ఇక ముచ్చట్లు చాలు! తొందరగా లేవాలి’ అన్న హెచ్చరికలు!

తెల్లారిపోయింది. స్నానాలు, ఛాయ్‌, కాఫీలు. ఏడు గంటలకల్లా హైదరాబాద్‌ వాళ్ళందరూ బస్సెక్కి రెడీి టు గో!

నెల్లుట్ల రమకి… ఆర్మూర్‌ నుండి బస్సులో హైదరాబాదు వాళ్ళందరికీ శ్రీరాంసాగర్‌ చూపించి, వారిని పొచ్చెరకి తీసుకొని రమ్మని చెప్తూ… అమృత, సునీత, షహనాజ్‌, ప్రకాశ్‌రెడ్డి, నేనూ వారికోసం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకొని కార్లలో పొచ్చెరకి కాస్త ఆలస్యంగా బయలుదేరాం!

మేము అక్కడికి చేరిన కొద్దిసేపటికే – వాళ్ళంతా శ్రీరాంసాగర్‌ నుండి వచ్చారు. మొక్కజొన్న వడలు, పూరీ, ఆలూ, ఉప్మా – అలా ఎవరికి ఇష్టమైన టిఫిన్‌ వాళ్ళు చేస్తూ – అందరం ఆ బండరాళ్ళమీద కూర్చొని దూరాన్నుండి పొచ్చెర జలపాతాన్నీ, తెల్లటి నురగనీ, ఆ హోరు శబ్దాన్నీ వింటూ – ఎంచక్కా లాగించేశాం.

ఇంతలో చకచకమని ఒక్కొక్కరే వెళ్ళి జలపాతం కింది నుంచుని కేరింతలు కొట్టడం, ఒకరిమీద మరొకరు నీళ్ళు చల్లుకోవడం! ఓహ్‌, వాళ్ళని ఆపడం ఎవరి తరం కాలేదు. వాళ్ళు అలా ఎంతసేపు ఆడారో, ఎన్ని నవ్వులో, ఎన్నిపాటలో, అర్థగంట, గంట, ఇంకో గంట అయిపోయింది. ఇక తప్పదన్నట్టు మెల్లిగా జలపాతాన్ని వదలలేక వదలలేక వదిలి – మళ్ళీ ఆటల పోటీల్లో పాల్గొని, తిరిగి కుంటాలకి ప్రయాణం అయ్యాం.

కుంటాలకొచ్చేసరికి అందరం అలసిపోయి ఉన్నాం. సగం మెట్లు దిగి, దూరాన్నుండే జలపాతాన్నీ- విశాలమైన బండరాళ్ళనూ – దూరంగా కనిపిస్తోన్న కొండజాతి వాళ్ళనీ చూసి తృప్తిపడ్డాం. ఆ తర్వాత మరో అరగంటకి అడవి మధ్యలో ఏర్పాటు చేసిన ఓ ఫాంహౌజ్‌కి వెళ్ళాం. అప్పటికే వసంతా, ప్రభా, కవితలు వాళ్ళడ్యాన్స్‌లో భాగంగా ఎద్దుల బండెక్కి మా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళ డాన్స్‌చూసి అందరం చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాం.

‘ఈ అడవిలో…. మాకు ఎవరు భోజనం పెడతారబ్బా, పెట్టినా ఏదో ఒక కూర, మజ్జిగతో సరిపుచ్చుతారేమో!’ అనుకున్నాం! కానీ – తీరా చూస్తే అక్కడ – అమృతా మేడం ఫ్రెండ్స్‌ కరుణ, కల్పనలు తమ కుటుంబ సభ్యులతో మా కోసం ఎదురుచూస్తున్నారు. అంతటి నిర్మానుష్యమైన అడవిలో… అలాంటి ఇల్లు… అదీ ఆధునాతనమైన వసతి సౌకర్యాలను చూసి అందరం ఆశ్చర్యపోయాం.

ఆ తర్వాత భోజనాలు… మా ఊహకి అందని విధంగా… రకరకాల ఐటమ్స్‌తో వెజ్‌, నాన్‌వెజ్‌! అలసిపోయా మేమో ఇష్టంగా తిన్నాం. కల్పనావాళ్ళుకూడా కొసరికొసరి మరీ వడ్డించారు. ఇక ఆ తర్వాత ఆ ఫామ్‌ హౌజ్‌కి పది కిలోమీటర్ల దూరంలో…. చిట్టడవిలో వున్న బురక రేగడిపల్లికి వెళ్ళడానికి తయారయ్యాం. వెళ్ళేందుకు రెండు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు.

‘వాటిలోకి ఎలా ఎక్కుతాం, ఎలా కూర్చుంటాం ? ఇంతమందిమి ఆ రెండు ట్రాక్టర్లలో ఎలా అడ్జస్ట్‌ అవుతాం? ఈ రెండు ట్రాక్టర్లు మా అందరికీ సరిపోతాయా ?’ అందరిలో… డౌట్‌!

ట్రాక్టర్ల నిండా గడ్డి పర్చారు. కొత్తా పాతా అనుకోకుండా అందరం ఒకరిచేయి మరొకరం అంది పుచ్చు కుంటూ ట్రాక్టర్లో ఇరుక్కొని కూర్చున్నాం. ఒకరికాళ్ళు ఇంకొకరికాళ్ళపైనా… ‘కాళ్ళబతుకమ్మ’ చేసుకున్నాం. అమృత మా ట్రాక్టర్లోకి ఎక్కలేక ఎక్కింది. పైనుండి విపరీతమైన ఎండ. వసంత గ్రీన్‌ టోపీలనిస్తూ – అవి వాళ్ళ స్కూల్‌ పిల్లలవని మళ్ళీ జాగ్రత్తగా వాపస్‌ ఇవ్వాలంటూ కండిషన్‌పెట్టింది.

ఇక మా అందర్నీ నింపుకొని మమ్మల్ని జల్లెడ పడ్తున్నట్టుగా… ఊగుతూ… బయల్దేరాయి ట్రాక్టర్లు. కొన్నిసార్లయితే మా ట్రాక్టర్లు బోర్లాపడిపోతాయేమోనన్నంతగా కుదుపులు… ఆ కుదుపులకి ఒకరిమీద ఒకరు పడడాలూ –

‘బాబోయ్‌ నా కాళ్లూ… నా చేతులూ…’ అంటూ రోడ్డంతా అరవడాలూ, నవ్వులూ.

దారంతా ఎత్తుపల్లాలు… పైగా పెద్దపెద్ద రాళ్ళమీదుగా ప్రయాణం, రెండు వేపులా చెట్లూ, రకరకాల ఆకులు, అక్కడక్కడా మా నెత్తిమీద మొట్టికాయలేస్తున్నట్టుగా… ముళ్ల పొదలూ…

‘ఇటు చూడూ ఇటు చూడూ’ అంటూ ఒకరూ – ‘అటు చూడూ అటు చూడూ ‘ అంటూ మరొకరు… మధ్యలో ‘హాయ్‌’ అంటూ పలకరిస్తూ మూడు సెలయేళ్ళూ…

‘అయ్యో! వర్షాకాలం వస్తే ఇంకా బావుండేది కదా!’ అనిపించింది.

ఇక అంత్యాక్షరి… ఎడాపెడా పాటలు…

నా పక్కన హైదరాబాద్‌ నుండి వచ్చిన ఒక ఫ్రెండ్‌ కూర్చుంది.

‘మన ఈ రెండు గ్యాంగ్‌లు ట్రాక్టర్లలో అడవుల్లోకి బయల్దేరి ఏ గుప్తనిధులు తీసుకొస్తాయో చూడాలి.’ అన్నాను నేను.

‘మన ఇంట్లో వాళ్ళకి మనం ఇక ఎన్ని బంగారు బిస్కెట్లు తీసుకెళ్తామో మరి’! అంది తను.

‘మా ఇంట్లో ఈ మధ్య కాలంలో నేను సంతోషంగా ఉన్నదే లేదు! మా దొడ్డమ్మ, ఇంకా దగ్గరి బంధువులు చనిపోవడాలూ, వాళ్ళను పలకరించడాలూ – ఇన్ని రోజులూ ఒకటే ఏడ్పు, దుఃఖం! ఈ ట్రిప్‌కి వచ్చాకే ఇప్పుడింత హాయిగా నవ్వుతున్నాను’ అంది కొనసాగింపుగా తనే!

నిజమేకదా – ఆత్మీయుల కలయిక మన బాధల్ని మరిపిస్తాయి. కష్టాల్లో ఒకరికొకరం తోడున్నామన్న తృప్తి మనని మరింత ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది!

ఎలాగో… కిందామీదా పడి బుక్కరేగడిపల్లి చేరుకున్నాం. ఇక దిగేటప్పుడు చూడాలి మా అవస్థ! కాళ్ళు పట్టేసి – నించోవడమే కష్టంగా ఉంది. స్టూలు వేసి, చేయి పట్టుకుని ఒక్కొక్కర్నీ దించారు.

మా బాడీలో అన్ని పార్ట్స్‌ సరిగ్గా ఉన్నాయో లేదోనని చూసుకున్నాం!

ఆ తర్వాత… అక్కడికి… ఎద్దుల బండినీ, ట్రాక్టర్‌నీ మేమే నడిపిస్తున్నట్టుగా రకరకాల పోజులతో ఫోటోలు దిగాం. ఊరివాళ్ళు మమ్మల్ని ఎంతో ఊరేగింపుగా తీసుకెళ్ళారు. మంచాల మీద దుప్పట్లు పరిచి, కింద జంపఖానాలు వేసి మమ్మల్ని చాలా మర్యాదగా చూసుకున్నారు. వాళ్ళు తమ ఇళ్లన్నీ కేవలం కట్టెలతో కట్టుకోవడం మమ్మల్ని ఆకర్షించింది.

మగవాళ్ళు వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. మా కోతులు… ఎక్కడ ఆగుతాయి, వారితో పాటే ఎగరడం, దూకడం! ఆడవాళ్ళుకూడా వాళ్ళ నృత్యాన్ని ప్రదర్శిస్తూంటే… అందరం వెనక్కీ ముందుకీ లయబద్ధంగా వాళ్ళతో కాళ్ళు కదపటం.

ఆ అడవిలో… ఆ కుగ్రామంలో మాకు మాంచి టిఫిన్‌, గారెలు, మిర్చీలు కల్పన తయారుచేస్తూంటే మేము ఎంతో ఇష్టంగా ఆరగించాం!

అసలే చిక్కటి అడవి! ఎక్కడ చిరుత పులుల్లాంటివి ఎదురవుతాయోనన్న భయంతో…. పొద్దుగూకక ముందే వచ్చినదారి పట్టాం.

ఫామ్‌ హౌజ్‌ చేరిన తర్వాత… ‘బంద్‌’ నృత్యరూపకం ప్రదర్శన!

పాత్రధారులంతా మేకప్‌ చేసుకున్నారు. అందులో నాది డ్రైవర్‌ పాత్ర! అందులో – ప్రభ రౌడీ, తనతో నేను తన్నులు తినాలి. అసలే ప్రభకి వీరావేశం పాళ్ళు ఎక్కువ! ముందూ వెనుకా చూడదు. నిజంగానే కొడుతుందని చెప్పాను కదా! అందుకే ప్రభకి కనిపించకుండా చాటున నక్కి దాక్కున్నాను.

‘డ్రైవర్‌ ఏడీ? డ్రైవర్‌ ఏడీ?’ ప్రభ పిలుపులు.

‘నేనేం డ్రైవర్‌ కాస్ట్యూమ్స్‌ తెచ్చుకోలేదు’! అని తప్పించుకోజూశాను.

‘భయపడకు! నేనేం గట్టిగా కొట్టను ఇదిగో ఈ టీషర్ట్‌ వేసుకో, ఈ టోపీ పెట్టుకో!’ అంటూ తనే నా క్కావల్సిన బట్టలన్నీ ఇచ్చింది.

నాటిక ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది.

నాటికలో… ప్రభ చేతిలో నేను ‘కొద్దిగా’… ఇంకో అమ్మాయి… కాస్త ‘ఎక్కువగా’… దెబ్బలు తినడం కొసమెరుపు!

నవ్వులూ, పువ్వులూ, ముగింపు మాటలూ, భావాలు పంచుకోవడాలూ, స్నేహాలు పెంచుకోవడాలూ!

వెళ్ళే ముందు… చక్కని భోజనం మాకు లభించింది. తర్వాత హైదరాబాద్‌ వాళ్ళు… తమ బస్సులో ఉట్నూరుకీ, మేము… నిజామాబాదుకీ బయల్దేరాం.

అమృత ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి… మమ్మల్ని ఎప్పుడు ఇన్వైట్‌ చేసినా… ‘అబ్బ! ఇప్పుడు వెళ్ళాలా?’ అని విసుక్కోవడం మాకు అలవాటు!

కానీ వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది… వెళ్ళకుంటే… ఎంత సంతోషాన్ని మిస్సయ్యేవాళ్ళమో కదా అని!

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో