ఎ థౌజండ్‌ స్ల్పెండిడ్‌ సన్స్‌

డా|| జి. భారతి (గత సంచిక తరువాయి)

మధ్యకాలంలో తారిక్‌ తండ్రికి హార్టు ఎటాక్‌లు వచ్చి చాలా బలహీనపడిపోయాడు. మంచంలోంచి లేవలేని పరిస్థితి.

తారిక్‌ తల్లికి అకాల వృద్ధాప్యం వచ్చినట్లు అవుతుంది.తారిక్‌కూడా మారిపోయాడు.ఎప్పుడూ తనయీడు పిల్లల్తో అల్లరిచిల్లరిగా తిరుగుతూ,పడుచుపిల్లల్ని ఆటపట్టిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల భయం అతనికి లేదు. లైలాకీ పద్ధతి నచ్చదు.అతన్ని మందలిస్తుంది.అప్పటికి వేళాకోళంగా కట్టేసినా, సహజంగా మంచిమనసు కలవాడయినందువల్ల అతనిలో కొద్దికొద్ది మార్పు రావటం గమనిస్తుంది. సాహిత్యం చదవటం,విషయల్ని సీరియస్‌గా తీసుకోవటం కనిపిస్తుంది.ఇప్పుడు అతడు చిన్నపిల్లవాడు కాదు. బాగా పొడుగయ్యాడు.వెనకటి కొయ్యకాలిప్పుడు సరిపోవటం లేదు. ఏడాది ఎదురుచూశాక, రెడ్‌క్రాస్‌ వాళ్ళు అతనికి సరిపోయే క్రొత్త కొయ్యకాలు ఇచ్చారు.అతని చేతులు దృఢంగా కండలు తేరుకుంటాయి.లైలా తల్లి ”అతనిప్పుడు చిన్నపిల్లవాడు కాదు.అతనితో సన్నిహితంగా ఉండకు” అని మందలిస్తుంది.ఆ సంగతి లైలా గూడా ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది.కానీ తల్లికి తనను మందలించే హక్కు లేదనుకుంటుంది.
కాబూల్లో ఎక్కడ చూసినా తగువులూ, పోట్లాటలూ. ముజాహిదీన్‌ పక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవటం, అది పోట్లాటగా మారటం సర్వసామాన్యమై పోతుంది.గబగబా సంఘటనలు జరిగిపోయాయి.రబానీని అధ్యక్షుడుగా ఎన్నుకుంటారు నాయకవర్గం.హెక్మక్యార్‌కి యిది ససేమిరా నచ్చదు.అనేక జాతులతో నిండిన ఆఫ్ఘనిస్తాన్‌లో ఒకొక్క తండా ఒకొక్క రాజకీయ వర్గాన్ని సమర్ధించటం జరుగుతుంది.హజారాలు చాలా వెనుకబడి ఉన్న జాతివారు.వాళ్ళు హెక్మక్యార్‌ని సమర్ధిస్తారు.రజీన్‌లు సస్యశ్యామలమైన భూభాగంలో నివసించేవారు.వాళ్ళ జీవితాలు కొంత సుఖవంతమైనవి.ముజాహిదీన్లకు ఆయుధాల కొరత లేదు.ఇప్పుడు వారికి పోరాడేందుకు శత్రువు లేడు.అందుకని వాళ్ళే ఒకరితో ఒకరు పోట్లాటలు మొదలుపెట్టారు.ఉన్నట్లుండి కాబూల్‌ మీద గుళ్ళవర్షం బాంబులవానా కురుస్తూ ఉండేవి.జనాలు భయంతో ఇళ్ళలోనే ఉండేవారు.లైలా తల్లి సంతోషం కొన్నిరోజుల్లో ఇగిరిపోయింది. ఆమె మళ్ళీ జబ్బు మనిషిగా మారిపోయింది.ముందు సన్న ఈలలాగా మొదలై తరవాత పెద్దమెరుపులాంటి కాంతితో,తరువాత దద్దరిల్లే చప్పుడుతో ప్రేలే బాంబులు, రాకెట్లు వారికి దైనందిన వ్యవహారమైపోతాయి.కాబూలు చుట్టూ ఉన్న పర్వతశ్రేణులు ఈ వ్యవహారానికి మరింత సదుపాయంగా ఉండేవి. ఈ సంక్షోభంలో మనం యిక్కడ వుండొద్దు వేరే ఏ దేశానికైనా వెళ్ళిపోదాం అన్న హకీమ్‌ మాటలకు ఫరీబా ససేమిరా ఒప్పుకోదు.”శాంతి వస్తుంది త్వరలోనే.ఈ యుద్ధాలు సమసిపోతాయి ముజా మిదీన్‌లు ఏం చేయలో తెలుసు కుంటారు” అంటూ వుంటుంది.”వాళ్ళకి చేతయింది చంపటమే.శాంతి వాళ్ళకి తెలియదు.ఒక చేతిలో పాలసీసా,మరోచేతిలో తుపాకీ పెట్టుకు పెరిగారు వాళ్ళు” అంటాడు లైలా తండ్రి.ఇలా వాళ్ళ వాదనలు జరుగుతనే వుంటాయి.ఒకనాడు బాంబుపేలుడులో తన స్నేహితురాలి శరీరం తన వీథిలోనే ఛిన్నాభిన్నమైపోవటం లైలా చూస్తుంది.ఆమె తల్లి రోదిస్తూ కూతురి శరీరఖండాలను ప్రోగుచేసుకుంటూ వుండటం ఆమెను కలచివేస్తుంది.రెండురోజుల తరవాత ఆ చిన్న శరీరపు కాలు ఒక యింటి కప్పు మీద దొరుకుతుంది. ప్రాణం ఇంత విలువలేని వస్తువుగా మారిపోవటం ఆమెను పూర్తిగా కుదిపేస్తుంది. ఆ తరవాత ఒకరోజు బుల్లెట్‌ ఒకటి వీథి తలుపులోంచి దూసుకువస్తుంది. దానికి తల ఆనించి రోడ్డుమీద చప్పుళ్ళు వింటున్న లైలా చెవి చీలుస్తూ పోతుంది.అప్పటికి పదిహేను రోజుల క్రితమే తారిక్‌కుటుంబం పాకిస్థాన్‌ వెళ్ళిపోయారు.అప్పుడు వెళ్ళటానికి అంగీకరించని ఫరీబా యీ సంఘటనతో కళ్ళు తెరిచి దేశం వదిలిపోవటానికి అంగీకరిస్తుంది.
సామాన్లన్నీ అయినకాడికి అమ్మేసి అతిముఖ్యమైన వస్తువులు మాత్రం తీసుకువెళ్ళేందుకు నిర్ణయించుకుంటారు. ఆ విధంగా సిద్ధమవుతున్న సమయంలో లైలా తండ్రి తన ప్రాణసమానమైన పుస్తకాలు వదిలివెళ్ళటానికి కన్నీళ్ళు కారుస్తాడు.”మళ్ళీ కొత్తవి కొని చదువుదాం నాన్నా” అంటూ ఓదారుస్తుందామె. తల్లి పెళ్ళి డ్రెస్‌ తీసి ప్రక్కన బెట్టబోతుంటే,ఆమె దాన్నవతల పారేస్తుంది.ఒకప్పుడు ఆమె బొద్దుగా గుండ్రని ముఖంతో ఎప్పుడ నవ్వుతూ ఉండేదనీ,ఆ నవ్వే తన తండ్రిని ఆకర్షించిందనీ లైలాకు తెలుసు.ఇప్పుడీ జీవచ్ఛవాన్ని వదిలిపోలేక తండ్రి అలాగే ఆమెనూ ఆమె ప్రవర్తననూ భరిస్తూ ఉండటమేకాక, ఆమెను క్షేమంగా ఉండే చోటికి చేర్చాలని తాపత్రయ పడుతున్నాడు. ఈ పరిస్థితి అంతా ఏదో కలలోలాగా అవాస్తవంగా కనిపిస్తుంది లైలాకు.అయినా కారిక్‌ని చేరుకోవచ్చనే ఆశ ఆమెని కార్యోన్ముఖురాల్ని చేస్తుంది.ఇంతలో ధగద్ధగవమైన మెరుపుల, ఫెళఫెళా ర్భటులతో బాంబులవర్షం మొదలౌతుంది.కళ్ళు మిరుమిట్లుకొలిపే ఆ కాంతిలో తన శరీరాన్ని రాచుకుంటూ ఏదో వెళ్ళినట్లూ తాను ఆకాశంలోకి పైపైకి ఎగురుతున్నట్లు మాత్రమే ఆమెకు గుర్తుంది.కదలలేని తన తండ్రి శరీరం రక్తసిక్తమై ధడ్‌మని తనకి కొంచెం దూరంలో పడటం చూస్తుంది.ఆ తరవాత ఆమె కళ్ళు తెరిచేసరికి,ఒక స్త్రీ తనమీదకి వంగి తనముఖం చూస్తూ కనిపిస్తుంది.తరువాత ఒక పురుషుడు కనిపిస్తాడు. శరీరం చెప్పలేని బాధ అనుభవిస్తూ ఉంటుంది.ఆమె నోట్లో ఒక మాత్రవేసి నీళ్ళు పోస్తారు.మగతలోకి జారుకుంటుంది. ఇలా అనేకసార్లు ప్రతిసారీ మెలకువ వచ్చినప్పుడు ఆ పురుషుడు నోట్లో ఒక మాత్రవేసి నీళ్ళు పోస్తూ ఉంటాడు.
ఆ స్త్రీపురుషులు మరియమ్‌, రషీద్‌లు.ఆమెకు పూర్తి స్పృహ వచ్చాక, తానామెను ఎలా రక్షించిందీ రషీద్‌ చెప్తాడు. మరియమ్‌ ఏం మాట్లాడదు.ఏదైనా తినిపించే ప్రయత్నం చేస్తూ వుంటుంది.బలవంతం మీద ఏదైనా కొంచెం మింగినా ఆ తరువాత వమనం చేసుకుంటుంది.క్రమక్రమంగా తినటం మొదలెడుతుంది.తినటం, ఆ తరవాత గుండెలు పగిలేలాగా ఏడవటం.ఈ విధంగా కొన్నిరోజులు గడిచాయి.అంతపెద్ద ప్రేలుడులో చాలా చిన్న గాయల్తో మాత్రమే ఆమె బ్రతికి బయటపడటం ఆ పిల్ల అదృష్టమని అనుకుంటుంది మరియమ్‌.ఆమె ఈ పిల్ల గాయలకి మందుపూసి కట్లు కట్టటం మొదలైన సేవలన్నీ చేసి మళ్ళీ బ్రతికిస్తుంది.లైలా మామూలు మనుషుల్లో పడటానికి ముందు చాలా దుఃఖాన్నీ యతననీ అనుభవిస్తుంది.ఎప్పుడ ఏడుస్తూ,వెర్రిచపులు చస్తూ లేకపోతే నిశ్చలంగా గంటల తరబడి కూర్చుంటూ, ఇలా కాలం గడుస్తుంది.ఆమె ఎడమచెవిలో వినికిడిశక్తి పూర్తిగా పోయింది.
ఇక్కడినుంచి ఈ ఇద్దరు స్త్రీల కథ ప్రారంభం అవుతుంది. మరియమ్‌ ఈ ముద్దులు మూటగట్టే పిల్లను రోడ్డుమీద ఆడుకుంటుండగా చాలాసార్లు చూసింది.లైలా దుఃఖం ఆమెను భరించరానిదిగా ఉన్నా, ఊరడించే శక్తి ఆమెకు లేదు.ఆమె జీవితమే దుఃఖభరితమైంది కదా.ఓదార్పు మాటలు ఎలా చెప్పాలో ఆమెకర్ధంకాదు.
విస్ఫోటనం జరిగిన నెలరోజులకు, లైలా తల్లిదండ్రులిద్దరూ మరణించిన నెలరోజులకు మరియమ్‌ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు.అతని పేరు అబ్దుల్‌ షరీఫ్‌ అనీ, తాను కాబూల్‌ నివాసిననీ చిన్న వ్యాపారం చేసుకునేవాణ్ణనీ చెప్పుతాడు. ముజాహిదీల దురాగతాలు ఎక్కువ కాకముందే తన కూతుళ్ళని ముగ్గుర్నీ పెషావర్‌ పంపించేసి, షాపు అమ్మి, భార్యతో సహా వెళ్ళిపోవాలని అనుకున్నాడు.ఇంతల్లో కాబూల్లో జరిగిన విస్ఫోటనంలో తన భార్య మరణించిందనీ, తాను బాగా గాయపడితే, తనను హాస్పిటల్‌లో చేర్చారనీ చెప్తాడు.అక్కడ తారిక్‌కూడా విపరీతమైన దెబ్బలతో ప్రక్క బెడ్‌ మీదే వుంటాడు.ఆ విధంగా తారిక్‌తో పరిచయమైంది.తారిక్‌ ‌కుటుంబం ఒక లారీలో వెళ్తుంటే క్రిక్కిరిసి ఉన్న ఆ లారీ ప్రమాదంలో బోర్లాపడింది.అందరూ మరణించారు.తారిక్ ‌తల్లిదండ్రులు కూడా.బ్రతికి బైటపడ్డ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరాడపిల్లలు.వాళ్ళ గాయాలు త్వరగా మాని వెళ్ళిపోయారు.తారిక్‌ ‌ఒక్కడే మిగిలాడు.అతని మంచి కాలు కూడా యీ ప్రమాదంలో పోయింది.ఇప్పుడతను రెండుకాళ్ళూ లేనివాడయ్యడు. అతనికి మూడుసార్లు ఆపరేషన్లు జరిగినాయి.కానీ లోపలి అవయవాలు బాగా దెబ్బతింటం వల్ల అతడు మరణించాడు.ప్రక్క పేషంట్‌ అయిన అబ్దుల్‌ షరీఫ్‌కి లైలా గురించీ తమ అనుబంధం గురించీ ఆమెను తాను మరిచిపోలేననీ చెప్తాడు.అందుకని ఆ వ్యక్తి లైలాను వెతుక్కుంటూ వచ్చి ఈ దుర్వార్త ఆమె చెవిని వేస్తాడు. ఇప్పుడు లైలా వంటరిది – ఈ లోకంలో ఆమెకి ఎవరూ లేరు.
ఆ రోజు రషీద్‌ లైలా పట్ల చాలా సానుభతి చపిస్తాడు.”మీరిద్దరూ ఎప్పుడ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా పాపం” అంటూ.ఆ రోజుల్లో వీళ్ళని చూస్తే వెక్కిరింతగా ”ఎవరూ? లైలా మజ్నూలా?” అనేవాడు.మరియమ్‌ అతని వంక వింతగా చస్తూ ఉండేది.రషీద్‌ ఎప్పుడూ తలవంచుకొని కుడిచేత్తో అన్నం ముద్దలు చేసుకు తింటూ మూతికీ, ముఖానికీ అంటిన మెతుకుల్ని ఎడంచేత్తో తీసుకుంటూ తినేవాడు.మాట్లాడేవాడు కాదు.ఏదన్నా బాగా లేకపోతే మరియమ్‌ని తిట్టటానికే నోరు విప్పేవాడు.ఇప్పుడు ఫోర్కు, నాప్‌కిన్‌ ఉపయోగిస్తున్నాడు.మధ్యమధ్య లైలాతో కబుర్లు!
ఆ రోజు మరియమ్‌ని పిలిచి రషీద్‌ తన ఉద్దేశాన్ని చెప్తాడు.లైలా పెళ్ళికాని పిల్ల.ఇలా వాళ్ళ యింట్లో ఉంటే లోకులు నానామాటలు అంటారు.తాను పరువుగల వ్యక్తి కనుక ఆమెను పెళ్ళాడాలని అనుకుంటున్నానని చెప్తాడు.రషీద్‌కి యిప్పుడు అరవై సంవత్సరాలపైబడి ఉండొచ్చు.జుట్టు పూర్తిగా తెల్లబడి పోయింది. చర్మం ముడతలు పడింది. కళ్ళ క్రింద చర్మం వదులుగా సంచుల్లాగా వేళ్ళాడుతోంది. కానీ పెద్ద భుజాలు, పెద్ద పొట్టా, బలిష్టంగా కనిపించే చేతులూ ఏం మారలేదు. మరియమ్‌ ”నిండా పద్దెనిమి దేళ్ళయినా లేవు” అంటుంది లైలానుద్దేశించి.”నేనిప్పటివరకూ నిన్నేమీ అడగలేదు. ఇప్పుడడుగుతున్నాను” అంటుంది ప్రార్థనాపూర్వకంగా.ఆమెని యింట్లో ఊరికే ఉంచుకోటం కుదరని పననీ, తాను ఆమెను జీవితాంతం పోషించటానికి రెడ్‌క్రాస్‌ సంస్థను కాననీ, ఇంతకంటే మేలు యింకేమీ ఉండదనీ అంటాడు. ‘నీ పెళ్ళినాటికి నీకు పదిహేనేళ్ళే. పెళ్ళై ఉంటే ఈపాటికి పిల్లల తల్లయేది.మా అమ్మకి పదమూడేళ్ళకే పెళ్ళయింది’ అని సమర్ధించుకుంటాడు. ‘అంతా నీ యిష్టమేనా ఆ అమ్మాయి వప్పుకోవద్దా’ అని మరియమ్‌ ఆ సంభాషణ ఆపాలనుకుంటుంది. ‘మన యింటి గడప దాటితే ఆమె బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది.పక్కాయిల్లూ, కడుపునిండా తిండీ వీటికోసం డజనుమంది నిలబడతారు వరసగా నాకోసం.నేను ముసలివాణ్ణి కాదు’ అంటాడు.
మర్నాడు లైలాకీ విషయం చెవినవేస్తుంది మరియమ్‌.ఆశ్చర్యకరంగా ఆమె వప్పుకుంటుంది.దేశం అల్లకల్లోలంగా భయానకంగా ఉన్న ఆ రోజుల్లో లైలా తారిక్‌ల సాన్నిహిత్యం మరింత పెరుగు తుంది. వసంతకాలంలో చెట్లు చిగిర్చినంత సహజంగా వాళ్ళిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళ చుట్టూ ఉన్న, అనిశ్చిత పరిస్థితిలో జరిగే సంఘ టనల్లో వారికి అది తప్పుగా కనిపించదు. తారిక్‌ ‌తక్కువజాతి వాడవటం వల్ల లైలా తన తల్లి చేసే అల్లరిని తలుచుకు భయ పడుతుంది. తరవాత సంఘటనలు అన్నీ తరుముకుంటూ వచ్చాయి.ఆమె ఈ పరిస్థితికి సిద్ధంగా లేదు. ఇప్పుడే తన గర్భంలో మరో ప్రాణి ఉందని తెలుసు కుంటుంది.ఈ పరిస్థితిల్లో రషీద్‌ని పెళ్ళి చేసుకోటమే సరైంది అనుకుంటుంది.పైగా తారిక్‌ తిరిగి వచ్చే ఆశ గూడా పోయింది. వెంటనే పెళ్ళికొడుకవటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు రషీద్‌.అబ్దుల్‌ షరీఫ్‌ వచ్చి తారిక్‌ కబురు చెప్పేంతవరకూ, లైలా పాకిస్థాన్‌ వెళ్ళటం గురించే ఆలోచిస్తూ ఉండేది.విషయం తెలిశాక్కూడా వెళ్ళిపోయుంటేనే బాగుండేదనుకునేది – ఇక్కడికి దూరంగా వెళ్ళిపోవాలని!ఇప్పుడు ఆ విషయం వదిలేసింది.రోజూ వేవిళ్ళతో బాధలు మొదలయ్యయి.తానొక శరణార్థుల కాంపులో ఉన్నట్లు, తన బిడ్డ ఆకలితో ప్రాణం విడిచినట్లూ ఊహించుకుని విలవిల్లాడిపోతుంది.ఆ పసిశరీరాన్ని గోతిలో పాతిపెట్టినట్లు ఊహిస్తే హృదయం బ్రద్దలైంది. ఇప్పటికి తనలో ఆ ప్రాణి జీవం పోసుకుని ఆరు వారాలైంది.ఇంకా ఆలస్యం చేస్తే రషీద్‌కి అనుమానం వస్తుంది. ఈ పెళ్ళితంతు వీలైనంత తొందరగా ఐపోవాలనుకుంటుంది. పెళ్ళితంతు మరి యమ్‌ అనంగీకారంతో చాలా ఇబ్బందిగా ముగుస్తుంది.ఏదో తప్పు చేసినట్లు ఆమె కళ్ళలోకి చడలేకపోతుంది లైలా.
మరియమ్‌కిప్పుడు ముప్పై మూడేళ్ళు. అయినా ఆ ‘అక్రమ సంతానం’ అనే వట ఆమెని నిలువునా నీరు చేసేస్తుంది. ఈ సంగతి తెలిసిన రషీద్‌ తెలివిగా ఆ మాట ప్రయెగిస్తూ ఉంటాడు. ‘నువ్వు గొప్ప వంశం నుంచి వచ్చిన ముత్యానివి’ అంటూ పొగడ్తలతో లైలా మనసు గెల్చుకోవాలని చూస్తాడు.’మీ అవ్మనాన్న చనిపోయారు. వాళ్ళని నిందించటం నాకిష్టం లేదు. కానీ నిన్ను వాళ్ళు సరిగ్గా పెంచలేదు.అతిగారాబం చేశారు.నువ్వు మంచి ఆడపిల్లలాగా పెరగలేదు.’ తన తల్లిదండ్రుల గురించి ఈ నీచుడు అనే మాటలు లైలా కళ్ళలో నిప్పులు కురిపిస్తాయి. ఇది మరియమ్‌ గమనిస్తుంది కానీ రషీద్‌ చూడడు.ఏమాత్రం హృదయ సౌకువర్యం లేని జంతుసమానుడైన ఆ మనిషిని లైలా భర్తగా స్వీకరించవలసి వచ్చింది.
రోడ్లమీద ఆడవాళ్ళు నడిచే రోజులు కావవి.కాబూల్‌ నగరాన్ని ముజావహిదీల నాయకులు పంచుకున్నారు. ఒక నాయకుడి భాగంలో ఉన్నవాళ్ళు వేరొక భాగంలో అడుగుపెడ్తే వాళ్ళని నేరస్థుల్లాగా విచారించేవారు. ఆడవాళ్ళయితే ఇంకా ఎంత అవమానించాలో అంతా అవమానించేవారు.కాల్పులూ, మాన భంగాలూ దైనందిన వ్యవహారమై పోయింది. తారిక్‌ ఎప్పుడ ఆమె ప్రక్కనే ఉండి ఆమెను రక్షించటమే తన జీవిత పరమావధి అన్నట్లుండేవాడు. ఆ సంగతి లైలాకు గుర్తుకొస్తుంది. ”నీకేమయినా కావాలంటే మరియమ్‌ తెచ్చిపెడ్తుంది గానీ నువ్వు అడుగు బయటపెట్టకు”మని హెచ్చరించి వెళ్తాడు రషీద్‌. ”ఆమె నిన్నెప్పుడూ కనిపెట్టి ఉంటుందిలే” అంటాడు గఢార్ధంతో. కాబూల్‌ మీద బాంబుల వర్షం కురిసినట్లుగా రషీద్‌ హెచ్చరింపుల వర్షం పడుతూ ఉండేది. ఒకరోజు లైలా మరియమ్‌తో మాట్లాడాలని వస్తే, ఆమె తన కడుపులో మంటంతా కక్కుతుంది.లైలా తన అందచందాలు చూపించి తన భర్తను ఎగరేసుకుపోయిందనీ, ఇప్పుడు తనని యింట్లోంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తోందనీ నిందిస్తుంది.లైలా మహారాణిలాగా కూర్చుంటే తను పనిమనిషిలాగా అన్నీ చేసిపెట్టే దాన్ని కాదనీ, లైలా గూడా పని సమానంగ చెయ్యాలనీ కఠినంగా చెప్తుంది.మరియమ్‌ జీవితంలో మొదటిసారి ఇలా మరో వ్యక్తితో ఇంత కఠినంగా మాట్లాడటం జరిగింది. కానీ లైలా ముఖం చూస్తే తాను తప్పుచేశానని అనిపిస్తుంది. లైలా ”ఇలా జరగటం నాకు చాలా విచారంగా ఉంది. అంటే నిజంగా విచారపడాల్సిన సంగతే ముందుముందు నీకే తెలుస్తుందిగా” అంటుంది. ఆ మాటల అర్థం లైలాకేం తెలుసు?
లైలా తల్లి కాబోతున్నదన్న సంగతి రషీద్‌ని సంతోషంతో ముంచివేస్తుంది. లైలాను అపురూపంగా చూసుకోవాలని తనకు చేతయిన విధంగా చేస్తుంటాడు. లైలాకి చిన్నచిన్న నగలూ, డ్రస్‌లూ కొంటాడు. ఒకరోజు ఇద్దరూ కలిసి బైటకు వెళ్తారు. ఇది తరుచూ జరిగే సంగతే. కానీ మర్నాడు సాయంత్రం తిరిగి వస్తారు. ముందు రషీద్‌ యింట్లో అడుగుపెడ్తాడు, తరువాత లైలా. ఆమె చేతుల్లో బట్టల్లో చుట్టిన వస్తువు ఏదో వుంటుంది. రషీద్‌ చూపుల్లో కాఠిన్యం కనిపిస్తుంది. ఒకచేతిలో బట్టలమూటా, రెండోచేతిలో సంచీ పట్టుకుని తలుపు తీసుకురావటానికి లైలా అవస్థపడుతుంటే ఆమె వంక క్రూరంగా చూస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. లైలాకు ఆడపిల్ల పుట్టింది. దాంతో రషీద్‌ ఆమెను హీనంగా చూడటం మొదలుపెడ్తాడు. కొడుకే పుడ్తాడని నమ్మకంగా ఉన్న వాడికి, ఇలా ఆశాభంగం ఎదుర్కోటం, అందునా రషీద్‌ లాంటి వ్యక్తికి సాధ్యమయే విషయం కాదు. రోజూ ఆమెను తిడుతూ, సాధిస్తూ ఉంటాడు. ఆ పసిపిల్ల మీద అక్కసుతో ప్రవర్తిస్తుంటాడు. ”ఎప్పుడూ ఏడుస్తూ వుంటుంది. పాడుపిల్ల. నిద్రపోయి ఎన్నాళ్ళయిందో” అని విసుక్కుంట ఉంటాడు. లైలా తనతో కలిసి ఉండటం లేదని కూడా ఆగ్రహం వెళ్ళగ్రక్కుతుంటాడు.వీళ్ళ గదిలో రోజూ జరిగే యీ గోల మరియమ్‌ చెవిలో పడుతనే ఉంటుంది.ఆ పిల్లకి మగపిల్లల బట్టలే వేయల్సి వస్తుంది. ఎందుకంటే కొడుకు పుడతాడని ముందే కొన్న బట్టలు ఊరికే పోతాయి అంటాడు. లైలా మాత్రం తన పాపని చూసుకు మురిసిపోతూ ఉంటుంది.
ఒకనాడు తన ప్రక్కలోకి లైలా రాలేదనే కోపంతో మరియమ్‌ని నిందిస్తాడు. ”ఇదంతా నీ పనే. లైలా ఈ ప్రవర్తనకి వెనకాల నువ్వు ప్రేరేపణవని నాకు తెలిసిపోయింది” అంటూ బెల్టుతో ఆమెని కొట్టటానికి వస్తాడు. బెల్టు బడితే లూజుగా వుండేట్టు కన్నాలున్న కొసని చేత్తో పట్టుకుని ఉంటాడు. ఈ దెబ్బలు మరియమ్‌కి అలవాటే. కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడని లైలా అతని చెయ్యిపట్టుకుంటుంది ‘కొట్టొద్దామెని’ అంటూ.దాంతో అతను మరియమ్‌ని కొట్టలేకపోతాడు.అతను చెయ్యి ఎత్తితే గట్టిగా పట్టుకున్న లైలా గూడా ఆ చేత్తోపాట గాల్లోకి లేస్తుంది.అతడు కొట్టడని నిర్ధారణ అయినా వదలదు. బలవంతాన ఆమె చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోతాడు. మరియమ్‌ మనస్సు లైలా పట్ల మెత్తపడుతుంది. నన్ను రక్షించటానికి ఎవరూ ఇప్పటివరకూ ప్రయత్నించలేదు అంటుంది. ఆ రోజు అర్ధరాత్రి మంచినీళ్ళు త్రాగటానికి మెలకువ వచ్చిన మరియమ్‌ వంటింట్లోకి వెళ్తుంటే నేలమీదపడి నిద్రపోతున్న లైలా, ఆమె బిడ్డ కాళ్ళకి తగులుతారు. తన కాలికి తగిలిందేమిటో చూడాలని దీపం తెస్తుంది. లైలా పాప – ఆమెకి అజీజా అనే పేరు లైలాయే పెడ్తుంది – కళ్ళు విప్పార్చుకుని మరియమ్‌ వంక చూస్తుంది. ఆ పాప మెత్తని చేతులూ, పెద్దకళ్ళూ, ఎర్రని పెదాలూ, చక్కటి చర్మం, సొట్టలు పడుతున్న గుండ్రని చేతులూ మరియమ్‌ మనస్సును లాగేస్తాయి. పాప మరియమ్‌ చిటికెనవేలు గట్టిగా పట్టుకుని వదలదు. అలాగే పాప నిద్రపోయేంత వరకూ కాళ్ళు తిమ్మిర్లుపెడ్తున్నా, నడుం లాగేస్తున్నా అలాగే పాప ముఖం చూస్తూ కూర్చుంటుంది. వారిద్దరి మధ్యా త్రెంచలేని బంధమేదో ఏర్పడ్డట్లుగా భావిస్తుంది. మర్నాడు లైలా రాత్రి బాగా ప్రొద్దుపోయక లైలా క్రిందికి వంటింట్లోకి వస్తుంది. మనిద్దరం కలిసి టీ త్రాగుదాం రమ్మని మరియమ్‌ని పిలుస్తుంది. టీతోపాటు రెండ్రోజుల క్రింద చేసిన హల్వా గూడా ఉంది అని మరియమ్‌ అంటుంది. ఇద్దర పెరట్లో కప్పుల్తో టీ త్రాగుత కూర్చుంటారు. మరియమ్‌ జీవితంలో ఇదో నూతన అనుభవం. తన చిన్నతనం గురించీ, తల్లీదండ్రీగురించీ, తండ్రి యింటికి తను వెళ్ళటం, తల్లి ఆత్మహత్య చేసుకోవటం, ఆ తరవాత హడావుడిగా రషీద్‌తో పెళ్ళి, పిల్లవాడు పుట్టి పోవటం, తరవాత మళ్ళీమళ్ళీ గర్భస్రావాలూ, రషీద్‌ క్రూరత్వం అన్నీ చెప్పుకొస్తుంది – అప్పటి వరకూ ఎవరితోన ఏమీ చెప్పుకోని మరియమ్‌. లైలా గూడా తన రహస్యాన్ని ఆమెతో చెప్పుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ రోజూ రాత్రి టీ తాగుతూ గడపటం దిన చర్యగా మారుతుంది. రోజులో ఆ క్షణాల కోసం మరియమ్‌ ఎదురుచూచూ వుంటుంది. ఆజీజా గూడా తనలాంటి అక్రమసంతానమే అనే విషయం మరియమ్‌కు ఆ పిల్లపట్ల ఆదరణ పెరగటానికి మరో కారణం అవుతుంది.
ఇంట్లో ఇలావుంటే బయట ముజాహిదీన్‌ నాయకుల మధ్య యుద్ధాలు, రాకెట్‌ వర్షాలూ, బాంబుల వానలూ వాటి మానాన అవి జరుగుతూ వుంటాయి. పార్టీ ఫిరాయింపులు, కొత్త ప్రెసిడెంట్ల నియామకాలూ, మళ్ళీ చంపుకోటాలూ నిత్య వ్యవహారమై పోతుంది. రషీద్‌ షెడ్‌లో ఉన్నప్పుడో, నిద్రపోతున్నప్పుడో లైలా అప్పుడప్పుడూ అతని పర్సులోంచి కొద్దికొద్దిగా పైకం తీసి దాస్తూ వుంటుంది. రషీద్‌ ప్రవర్తన చూస్తుంటే తన రహస్యం తెలిసిపోయిందేమో, ఆ క్రూరుడు తననీ అజీజానీ ఏంచేస్తాడో, అనే భయం పెరుగుతూ వుంటుంది. మరియమ్‌తో కలసి పాకిస్థాన్‌ పారిపోవటానికి నిశ్చయించుకుంటుంది. తన దగ్గర పోగయిన డబ్బుతో వెళ్ళిపోవచ్చు ననుకుంటుంది.కానీ దానికి ఎన్ని ఇబ్బందులో!ఆడవాళ్ళు వంటరిగా మగతోడు లేకుండా వెళ్ళటానికి వీల్లేదు.అయినా ధైర్యం చేసి ఇద్దరూ కాలు బైటపెడ్తారు.పెషావర్‌ వెళ్ళే బస్సెక్కటానికి.అక్కడ ఒకతను భార్యకొడుకులతో వెళ్తూ వుంటాడు.అతని ముఖం సాత్వికంగా కనిపిస్తుంది.అతన్ని సహాయం కోరుతుంది లైలా. తామిద్దరూ తల్లీకూతుళ్ళమనీ, తన భర్త మరణించాడనీ, పెషావర్‌లో ఉన్న పినతండ్రి యింటికి వెళ్ళాలనీ చెప్తుంది.అతడు ఆమె పినతల్లి కొడుకులాగా ఉండటానికి వప్పుకొంటాడు.టిక్కెట్లకోసం తన దగ్గర ఉన్న డబ్బు అతని చేతిలో పెడ్తుంది – ముజాహిదీన్‌లు చాలా కట్టుదిట్టంగా కాపలా కాస్తుంటారు. బస్సెక్కే సమయం వస్తుంది.అతని భార్యా, కొడుకూ ముందెక్కుతారు.తరవాత అతను. ఎక్కుతూ అక్కడ సైనికుడితో ఏదో చెప్తాడు.అతను వీళ్ళిద్దర్నీ బస్సెక్కనీయడు. ఆ తరవాత విచారణ, ప్రశ్నల వర్షం. వీళ్ళిద్దరూ ఇంట్లోంచి పారిపోతున్న ఇద్దరు ఆడవాళ్ళు అని నిర్ధారించి, వాళ్ళని క్షేమంగా ఇంటికి చేరుస్తారు. అక్కడ రషీద్‌ వీళ్ళకోసం పులిలాగా ఎదురుచస్తుంటాడు. ఆ తరవాత అంతా మామూలే – తన్నులూ, తిట్లూ! రషీద్‌ క్రూరత్వం పరమావధి చేరుకుంది.
(మిగతాది వచ్చే సంచికలో)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.