అభ్యుదయానికి అవతలి వైపు –

 పి. సత్యవతి

భౌతిక వనరులూ, కోరికలూ పరిమితంగా వున్న దశలో మనుషుల మధ్య వుండే సహాయ సహకారాలూ ప్రేమ వాత్సల్యాలూ మెరుగ్గా వుంటాయి. వనరులు పెరుగుతున్న కొద్దీ కోరికలూ పెరిగి, డబ్బు తెచ్చిన అహంకారంతో మానవతావిలువలు తగ్గడం చరిత్ర సత్యం. పరస్పర సహకారంతో శరీర కష్టంతో, ఆకస్మికంగా వచ్చిపడే ప్రకృతి వైపరీత్యాలను కూడా సమష్ఠిగా తట్టుకుంటూ బ్రతికిన ఒక సమాజానికి, కాలక్రమంలో వచ్చిన సంపద తెచ్చిన మానసిక వక్రతను కళ్ల ఎదుట నిలబెట్టే నవల ”ఒండ్రుమట్టి”. ఒక తీరగ్రామపు యాభై ఏళ్ళ చరిత్ర… ఇది కేవలం ఈ గ్రామపు చరిత్రే కాదు యావదాంధ్ర దేశపు యాభై ఏళ్ళ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక చరిత్ర… జొన్నలూ ధనియాలూ మాత్రమే పండించుకుంటూ అప్పుడప్పుడూ ప్రకృతి తెచ్చేపెట్టే వరదలకూ తుఫానులకూ పరాయి ప్రభుత్వపు పన్నుల విధానానికీ తట్టుకుంటూ కష్టపడి బ్రతుకు బండి లాగించే సన్నకారు రైతులు వ్యాపారపంటలతో వలసలతో నాలుగురాళ్ళు వెనకేసుకుని మోతుబరులైన తరువాత పెద్దలు సంపాదించి ఇచ్చిన ఆస్తి అంతస్తులు చూసుకుని విర్రవీగే తరంవరకూ ఈ నవల స్పృశించింది 1920ల నించీ 1985 వరకూ భారతదేశపు ఆర్థిక రాజకీయ పరిణామాలనూ, వెల్లువెత్తిన ఉద్యమాలనూ ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులనూ సునిశితంగానూ సున్నితంగానూ చిత్రించింది. ఆనకట్టల నిర్మాణం వలనా, వ్యాపారపంటల సాగు వలనా వచ్చిన మిగులును అనేక వ్యాపారాలమీద పెట్టుబడి పెట్టి సంపన్నులైన రైతులు వారి పిల్లలకు తెచ్చిపెట్టిన అంతస్తూ అహంకారము మానవతా విలువలను లుప్తం చేసిన వైనాన్ని విశ్లేషించింది.

బ్రిటిష్‌ ప్రభుత్వం క్రింద వున్న మద్రాసు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తీరప్రాంతంలోని క్రిష్ణాపురం ఒక జమీందారీ గ్రామం. అక్కడొక జమీందారూ, కొందరు మోతుబరి రైతులూ సన్న చిన్న కారు రైతులూ, సన్నకులాలవారూ వున్నారు. ఆ గ్రామంలో ఒక కుటుంబమూ ఆ గ్రామమూ ఆంధ్ర దేశమూ ఒక యాభై ఏళ్ళలో (1930-80) చెందిన పరిణామాన్ని అన్ని కోణాలనించీ లోతుగా పరిశీలించి, పరిశోధించి తగిన సమయం తీసుకుని విపులంగా నల్లూరి రుక్మిణి వ్రాసిన నవల ఇది.

రాయినీడి కోటయ్య సన్నకారు రైతు. కష్టజీవి. కరువు కాలంలో కూడా అప్పు చెయ్యకుండా అతనూ అతని కొడుకులూ కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పొలంకాక మరికాస్త కొనుక్కున్నారు. అతని భార్య గంగమ్మ కూడా అంత కష్టజీవి. తినే తిండి స్వయంగా పండించుకోడం లాగానే కట్టే బట్ట కూడా నూలు వడికి నేయించుకునే దశ అది. గ్రామంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ సమష్టిగా పనులు చేసుకునే దశ. ఒక ఇంట్లో ఆముదం కాచుకుంటే పదిళ్ళవాళ్ళూ చెయ్యి వెయ్యవలసిందే. ఎంత కష్టపడ్డా అక్కడిపొలంలో పండేది జొన్నలూ ధనియాలే అంతా మెట్టపొలం. దానికి తగ్గట్టు ప్రకృతి తెచ్చిపెట్టే తుఫానులు. రాయినీడు కోటయ్యకి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ వ్యవసాయంలోనూ గొడ్డూ గోడా చూసుకోడంలోనూ తల్లికీ తండ్రికీ ఎంతో సాయంగా వుంటారు. వ్యవసాయంలో ఏమీ అచ్చుబాటుగాక చేసిన అప్పులు తీర్చలేక ఉన్న వూళ్ళో కూలిపనికి పోలేక అవస్థ పడుతున్నారు చాలామంది సన్నకారు రైతులు. కోటయ్యది ఆ పరిస్థితి కాదు.

నిజామ్‌ రాజు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ మంజీరానది మీద మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు కాలువల క్రింద వ్యవసాయం చెయ్యడంలో అనుభవం వున్న మద్రాసు రాష్ట్రంలోని రైతులను ఆహ్వానించి వారికి రాయితీలు కల్పించాడు. అట్లా అక్కడికి ఆంధ్ర దేశంనుంచీ వలసలు పెరిగాయి.

ఈ మెట్టప్రాంతపు రైతులకు అప్పటికే నైజాం రాష్ట్రానికి వలస పోయిన బంధువుల మార్గం నచ్చింది. అక్కడ పొలాలు చవకగా కొని కాస్త కష్టపడి సాగులోకి తెచ్చుకోవచ్చని బయలుదేరిన బంధువుతోపాటు కోటయ్య కొడుకు పరమయ్య కూడా వెళ్ళాడు. నిజామాబాద్‌ జిల్లా రాకూరులో అడవిలాంటి చోట చవుకగా పొలంకొని చెట్టూ చేమా నరికి దాన్ని సాగులోకి తెచ్చాడు. రాయినీడు కోటయ్యకి తన ముగ్గురు కొడుకులు పంచుకోడానికి ఇంకా కొంచెం పొలం కొనాలని కోరిక. పరమయ్య మొదటి సారి అక్కడనుంచీ తెచ్చిన మిగులు డబ్బుతో ఇక్కడ కొంచెంపొలం కొన్నాడు కోటయ్య. కృష్ణాపురంలో పొగాకు వేసి కొందరు రైతులు కొంత లాభాలు గడించినప్పటికీ అప్పటి ఆర్థిక మాంద్యమూ ప్రపంచ యుద్ధమూ పన్నుల పెరుగుదలా రైతుల పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆ పరిస్థితిలో కోటయ్య పెద్ద కొడుకు తిరుపతయ్య కూడా రాకూరు వచ్చి మరికాస్త పొలం కొని అన్నదమ్ములిద్దరూ కష్టపడి వ్యవసాయం చేశారు. కుటుంబాలను కూడ తీసుకుపోయారు. క్రమక్రమంగా రాకూరొక చిన్న క్యాంపు నుంచీ ఒక వూరుగా పెరిగింది. చెరకు తోటలు వేసి బోధన్‌ చెరకు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేశారు. అక్కడి మిగులుతో కృష్ణాపురంలో మరింత పొలం కొన్నాడు కోటయ్య. మొదట్లో వ్యవసాయమే లక్ష్యంగా అక్కడకు వెళ్ళిన పరమయ్య క్రమంగా కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక పక్కన స్వాతంత్రోద్యమం మరొక పక్కన కమ్యూనిస్ట్‌ ఉద్యమం ఆంధ మహాసభ ఇట్లా ప్రజలలో ఒక నూతనోత్తేజాన్నీ వికాసాన్నీ నింపుతున్న కాలం అది. కృష్ణాపురంలో మళ్ళీ పొగాకు పంట వేసి రైతులు పుంజుకుంటున్నారు. పొగాకును చీరాలలోని ఐఎల్‌టీడి కంపెనీ కొనుక్కుంటున్నది. జమీందార్ల ప్రభావం పోయి వ్యాపారస్తుల, మోతుబరుల కాలం వచ్చింది. వ్యవసాయపు మిగులు పరిశ్రమల మీదా వ్యాపారాల మీదా పెట్టుబడిగా మారి నూతన సంపన్నుల తరం వచ్చింది. అయితే ఈ డబ్బు సంపాదన వెల్లువలో కొట్టుకుపోనివాడు పరమయ్య ఒక్కడే. సంపాదించిన చాలనుకున్న వాడు. తన యౌవన కాలాన్ని కుటుంబపు ఆస్తులు పెంచడానికి ధారపోసిన వాడు. అన్న తిరుపతయ్యకు ఇద్దరూ కూతుళ్ళే. పెద్ద కూతుర్నిచ్చిన శంకరం ఉత్సాహంగా కమ్యూనిస్టు సంఘాలలో పాల్గొన్న యువకుడు. రెండవ కూతుర్నిచ్చిన గౌరంగ బాబు విజయవాడలో ఆటో మోటివ్‌ రంగంలో బాగా ఆర్జిస్తున్నాడు. కోటయ్య తరం తరవాత ఆస్తులు పంచుకున్న తిరుపతయ్య ఉన్న ఊళ్ళోనే పెద్దకూతురి దగ్గర కుదురుకున్నాడు. పరమయ్య రాకూరులోనే స్థిరపడ్డాడు. మూడవకొడుకు వెంకయ్య పొగాకు పంటతో వ్యాపారంతో బాగా గడించి ఊళ్ళో ప్రముఖులలో ఒకడయ్యాడు అతని పెద్ద కొడుకు గంగాధరం లండన్‌లో చదువుకుని వచ్చి ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతుర్ని చేసుకున్నాడు. అది కూడ వెంకయ్య హోదాను పెంచింది. ఇంక అతని రెండవ కొడుకు భాస్కరం కూడా డబ్బూ పరపతీ వున్న వారి అల్లుడయ్యాడు. ఆస్తి, పలుకుబడి, కులం అతనికి అదనపు అర్హతలయ్యాయి కళ్ళు నెత్తికొచ్చాయి. అప్పటికీ కృష్ణాపురం రాయినీడి కోటయ్య జొన్నలు పండించిన నాటి కృష్ణాపురం కాదు ఒకటి, రెండు నిట్రాళ్ళ ఇళ్ళు కల ఊరు కాదు ఊరినిండా డాబాలు రెండస్తుల ఇళ్ళూ వెలిశాయి. పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ వెళ్ళే ఆడవాళ్ల వంటిమీద కాస్తో కూస్తో బంగారం వుంటోంది. చీరాలకు బస్సొచ్చింది. చీరాలలో పొగాకు కంపెనీకి కూలీకి వెళ్ళే వాళ్ళు సైకిళ్ళు కొనుక్కుంటున్నారు. పొలాలకు నీళ్ళు పెట్టడానికి ఆయిల్‌ ఇంజన్లొచ్చాయి. పొలందున్నడానికి ట్రాక్టర్లొచ్చాయి. పల్లెలో కొంతమంది మతం పుచ్చుకున్నారు. అయితే ఆస్తులూ అహంకారాలూ వున్న కొంతమంది యువకులు ఊరికి చీడలా తయారయ్యారు. ఒకప్పుడు ఏదైనా దురాగతాలు జరిగితే పంచాయితీలు పెట్టించి నిగ్గదీసిన పెద్దలు ఇప్పుడు వాటిని చూసీ చూడకుండా పోతున్నారు. ఒకప్పుడు ఉత్సాహంగా ఉధృతంగా సంఘాలలో పనిచేసిన యువకులు కూడా ఇప్పుడు వారి వారి వ్యాపకాలలో మునిగిపోయారు. సంఘంలో చురుకుగా పనిచేసిన శంకరం కూడా తన వ్యాపారమూ పిల్లల చదువులూ చూసుకుంటు న్నాడు. భాస్కరం చెలరేగిపోయాడు. అతన్ని నిలవరించేవాళ్ళే లేకపోతున్నారు. అతని అహంకారం మాల మాదిగ కులాలపైన ప్రసరిస్తోంది. వాళ్లని అణచిపెట్టడానికి కారణాలను అన్వేషిస్తోంది. వాళ్ళను రెచ్చగొట్టే పనులను ప్రోత్సహిస్తోంది. ఆ క్రమంలో అప్పుడా వూళ్ళో జరిగిన హత్యాకాండ చరిత్రలోనే ఒక నెత్తుటి మరక. కత్తులు బరిసెలతో అగ్రకులస్థలు మాదిగ పల్లె మీద పడ్డారు కనిపించిన వాళ్లనందర్నీ విచక్షణా రహితంగా కత్తులతో నరికారు బల్లాలతో పొడిచారు. ఇళ్లళ్లో దూరి వస్తువులు విరగ్గొట్టారు. ధాన్యం పారబోశారు. ఈ అనూహ్య అఘాయిత్యానికి నిర్ఘాంతపోయిన పల్లెప్రజలు పొలాల్లోకి పరిగెత్తారు అయినా అగ్రకల యువకులు వారిని వెంటాడి చంపారు. గాయపడిన వారి రోదనతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి గగ్గోలెత్తిపోయింది. అగ్రకుల అహంకారానికీ డబ్బు తెచ్చిన పొగరుకీ ఇది పరాకాష్ఠ. తెలుగు సమాజం అభివృద్ధి చెందిందనడం నిజమా? నిజమే అయితే ఆ అభివృద్ధి అందరిదీ కాదు, కొందరిదే. దాని నీడ లో కునారిల్లిపోతున్న వాళ్ల సంగతేమిటి? ఆలోచనల్లో ప్రవర్తనలో తాత్వికతలో రావాల్సిన అభివృద్ధి లుప్తం అయి కుల వివక్ష వర్గ వివక్ష అప్పటికన్న ఇప్పుడెక్కువయ్యా యనడానికి ఈ సంఘటనే ఋజువు. అప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన పరమయ్య ఇలా అనుకుంటాడు. తను కష్టపడి ఆస్తిని పెంచింది ఇందుకా అని. పరమయ్య కొడుకు చంద్రం రాడికల్‌ సంఘాలవైపు వున్నాడు.

”జనంలో తెలివిడి వచ్చిన్నాడు వీళ్ళూ వూరూ పేరూ లేకుండా కాలంలో కలిసిపోతారు. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. చరిత్రలో మార్పు అనివార్యం. భూమి ఎన్ని మార్పులకు లోను కాలేదూ? ప్రవాహ సదృశ్యమైన సమాజాన్నీ కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దాని క్రింద నలిగిపోవడమే. ఇప్పటికి వాడిది పై చెయ్యి కావచ్చు. భవిష్యత్తు ప్రజలదే” అనే ఆశావహ వ్యాఖ్యతో నవల ముగుస్తుంది.

ఇటు కృష్ణాపురం, అటు తెలంగాణాలో రాకూరు రెండు గ్రామాలలో ఈ పాతికముప్పై ఏళ్లలో వచ్చిన పరిణామాలను వివరిస్తూ, ఈ క్రమంలో సమాజంలోని అన్ని రంగాలలో వచ్చిన మార్పులను ఏమాత్రం ఓవర్‌ టోన్స్‌ లేకుండా సమతూకం కోల్పో కుండా కళాత్మకంగా వర్ణించింది రుక్మిణి. కోటయ్య కొడుకులకి పెళ్ళిళ్ళు కుదుర్చుకోడానికీ ఆ కొడుకుల కొడుకులకూ కూతుళ్లకూ సంబంధాలు కుదుర్చుకోడానికీ కల తేడా, పరమయ్యకూ భాస్కరానికీ కల తేడా కోటయ్య కొడుకుల మధ్య వుండే అనుబంధానికీ తరువాతి తరంలో వాళ్ల మధ్య అనుబంధాలలో వచ్చిన మార్పు ఇవ్వన్నీ స్పష్టంగా అర్థమైపోతాయి. అర్థ శతాబ్దపు సాంస్కృతిక చరిత్రకి అద్దం పట్టిన ఈ నవల కాలక్షేపానికి చదివేది కాదు. ఒక సమాజపు ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిణామాన్ని తెలుసుకోడానికి, ఆ ప్రాంతపు భాష, ఆచార వ్యవహారాలు వ్యవసాయ పద్ధతులు ఎరుక పర్చుకోడానికి తప్పక చదవాలి. ఒక మంచి నవలని మనకి అందించిన రుక్మిణికి అభినందనలు.

”ఒండ్రుమట్టి” నవల, రచన : నల్లూరి రుక్మిణి, విరసం ప్రచురణలు వెల : 170 రూపాయలు

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.