20, 21 ఏప్రిల్‌ ఒంగోలులో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రెండవ మహాసభ – నివేదిక

  మందరపు హైమవతి

‘మనలో మనం’ అని 2009లో ఒకే వేదిక మీదకు వచ్చిన రచయిత్రులు 2010లో ‘ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక’ అనే పేరుతో ఒక సంఘం నిర్మించుకొన్నారు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల రచయిత్రుల సదస్సులు పెట్టి 2010 నుండి వార్షిక సదస్సులు, రెండేళ్ళకోసారి మహాసభ నిర్వహిస్తూ స్త్రీల సాహిత్యంపైన, సమాజంలో రచయిత్రుల బాధ్యతపైన కృషి చేస్తూ వస్తున్న సంస్థ ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక 2012లో వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో మొదటి మహాసభను జరుపుకొన్న ప్రరవే 2014 ఏప్రిల్‌ 20, 21 తేదీల్లో ఒంగోల్లో రెండవ మహాసభను శ్రీ హర్షిణి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించింది.

ఈ సందర్భంలో తెలుగు సాహిత్యం- స్త్రీలపై హింస, ప్రజాస్వామిక ఉద్యమాలు – చట్టాలు అనే అంశంపై రెండు రోజులు సదస్సు నిర్వహించింది. స్త్రీలపై హింస భూస్వామ్య యుగాల నుంచి కొనసాగుతూనే వుంది. ఆధునికతను, అభివృద్ధిని సాధించామనుకొంటున్న వర్తమాన వ్యవస్థలో ఆ హింస మరింత వికృత రూపాన్ని దాల్చింది. ఇళ్ళు, గ్రామాలు, నగరాలు, బస్సులు, టాక్సీలు, వీధులు, బహిర్భూములు అన్నీ స్త్రీలపై హింసకు, లైంగిక అత్యాచారాలకు నిలయంగా మారిపోయాయి.

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఇటీవలే నిర్భయచట్టం చేసినా స్త్రీలపై హింస ఆగడం లేదు. స్త్రీల సాధికారత గురించి మాట్లాడే ప్రభుత్వాలు, పథకాలు రూపొందించే ప్రభుత్వాలు ఆచరణలో ఎందుకు విఫలమౌతున్నాయి? సామాజిక సమస్యలను, సంఘర్షణలను చిత్రించాల్సిన సాహిత్యం స్త్రీలపై హింసను ఏ విధంగా ప్రతిఫలిస్తున్నది? సాహిత్యం ద్వారా సామాజిక సంస్కృతిని ఉన్నతీకరించే బాధ్యతను రచయిత్రులు ఎలా స్వీకరించారు మొదలైన విషయాలపై చర్చిస్తూ ఒంగోలులో రెండు రోజుల సదస్సు జరిగింది.

20.4.14న మొదటి రోజు ప్రారంభ సమావేశానికి ప్రరవే కోశాధికారి పి. రాజ్యలక్ష్మి గారు సభకు స్వాగతం చెప్తూ ఎందరో రచయితలు జన్మించిన ఒంగోలులో ఈ సభ పెట్టుకోవడం గర్వకారణంగా వుందని అన్నారు.

ప్రరవే ప్రధాన కార్యదర్శి కాత్యాయనీ విద్మహే గారు అవగాహనా పత్రం సమర్పిస్తూ ప్రాంతాల వారీగా సభలు ఏర్పాటు చేసినపుడు ఆ ప్రాంతాల్లో కొత్త రచయిత్రులకు స్థానం కల్పించడం ప్రరవే ఉద్దేశమని, ప్రరవే ఏ దృక్పథంతో పనిచేస్తుంది? ఏ ప్రజాస్వామ్య విలువల్ని ఆచరిస్తుంది, ప్రచారం చేస్తుంది’ ఆకాశమే హద్దుగా ప్రపంచంలో ఎవరు ప్రజాస్వామిక విలువలకు పట్టం గడతారో వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం వుంటుంది” అని ప్రరవే ప్రధానోద్దేశాలను చెప్పారు.

సభకు అధ్యక్షత వహించిన అనిశెట్టి రజిత గారు ప్రస్తుత సంక్షోభ సమయంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగు సభలు విజయ వంతంగా నిర్వహించామని చెప్పారు.

తర్వాత ప్రకాశం జిల్లా గెజిటెడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.ఎ. బషీర్‌ ‘అగ్నిశిఖ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ‘మూగవాని చేత మాట్లాడించేదే సాహిత్యమని, ఈ వ్యవస్థను బతికించేదే సాహిత్యమని అన్నారు.

ఈ పుస్తకంలోని ప్రతి రచనను విపులంగా సమీక్షిస్తూ మంజుల గారు ఉద్వేగపూరిత ప్రసంగాన్ని చేసారు. ముజఫర్‌ నగర్‌ మారణకాండను జి.వి. కృష్ణయ్య గారు ఆవిష్కరిస్తూ సమాజాన్ని ప్రశ్నించే, ఆలోచింప చేయగలిగే సాహిత్యం వుండాలని, మహిళలు ఉద్యమశక్తిగా ముందుకు దూసుకు పోవాలని, ఉపరితలంలో మార్పు రావాలంటే మూలాలు మారాలని ఆకాంక్షించారు.

ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ బి. రమాసుందరి గారు ఈ పుస్తక రచనలో రచయిత్రుల నిజాయితీ కనిపిస్తుందని, రాజ్యహింసను కళ్ళకు కట్టేలా వర్ణించారని, కుహనా మేధావులకు చెంపపెట్టులా ఈ పుస్తకం వున్నదని వ్యాఖ్యానించారు.

ముఖ్య అతిథిగా వచ్చిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి. హనుమారెడ్డి గారు మాట్లాడుతూ సాహిత్యం సమాజాన్ని విడిచి జీవించదని, రచయిత్రులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసి రాయడం మంచి ఒరవడి అని భండారు విజయను, అనిశెట్టి రజితను అభినందించారు.

సభను నిర్వహించిన పి. రాజ్యలక్ష్మి గారు రచయితలు కనిపించని ఆయుధాలతో నిశ్శబ్ద పోరాటం చేసే యోధులని, ఎవరికైనా స్నేహితులకు బహుమతిగా ఇచ్చేటపుడు పుస్తకాలు ఇవ్వాలని అన్నారు.

ఆ తర్వాత జరిగిన మొదటి సెషన్‌ను కోటే విజయభానుగారు నిర్వహించారు. సభకు అధ్యక్షత వహిస్తూ కె. సుభాషిణి గారు స్త్రీలపై హింస ప్రాచీనకాలం నుంచే ప్రారంభమైందని, బండారు అచ్చమాంబ దగ్గర నుంచి ఈనాటి వరకు హింసా రూపాలు మారుతున్నాయని అంటూ చెరబండరాజు, హింసకు స్త్రీ పురుష భేదం లేదని అన్నారని చెప్పారు.

తెలుగు సాహిత్యంలో కుటుంబ హింస గురించి డా|| పుట్ల హేమలత గారు పత్రం సమర్పిస్తూ ఋగ్వేదంలో స్త్రీని అబలగా మొదట సంబోధించారని, మను ధర్మ శాస్త్రం ”నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అని స్త్రీని బానిసగా చేసిందని, స్త్రీ ఇప్పటికీ రెండవ తరగతి పౌరురాలేనని, వరకట్నం, పరదా వ్యవస్థ, మానసిక హింస, ఆకలి, నిరక్షరాస్యత స్త్రీలను అణచి వేస్తున్నాయని, స్త్రీల మీద హింస నెత్తుటి వరదలా ప్రవహిస్తుందని ఆవేదన వెల్లడించారు.

దళిత స్త్రీల సమస్యల గురించి గూడూరి సీతా మహాలక్ష్మి గారు ప్రస్తావిస్తూ చరిత్రలో ఎక్కడా పోరాటాన్ని నడిపిన స్త్రీల పేర్లు ప్రస్తావించలేదని దానికి సాక్షి తనేనని ఉద్దేశ పూరితంగా మాట్లాడుతూ కారంచేడులో 6 సంవత్సరాలపాటు దళిత ఉద్యమాన్ని ముందుకు నడిపినా, పురుషులు ఎవరూ తన పేరు ప్రస్తావించలేదని మన విజయాలను వాళ్ల విజయాలుగా పురుషులు చిత్రీకరిస్తున్నారని పురుషాధిపత్య ధోరణిని ఎండగడ్తూ, పుట్టుకే ప్రశ్నార్థకమైన వేళ మనం పోరాటం చేస్తే తప్ప సరియైన సమాజం ఏర్పడదని, ఆ దిశలో సాహిత్యం రావాలని అన్నారు.

కొలిపాక శోభారాణి గారు తెలుగు సాహిత్యంలో మత హింస గురించి ప్రస్తావిస్తూ అత్యాచారాలు బయట ప్రదేశాల కంటే కుటుంబంలోపలే ఎక్కువ జరుగుతున్నాయని, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువ హింసకు గురవుతున్నారని, ఈ హింసను గురించి షాజహానా నఖాబ్‌లో, పరదా, నిఖా కవితలలో ప్రస్తావించారని, గీతాంజలి ముస్లిం స్త్రీల దుఃఖాలను తన కథలో ప్రతిఫలించారని అన్నారు.

తెలుగు సాహిత్యంలో రాజ్యహింస గురించి శాంతి ప్రబోధ గారు ”అసలు రాజ్యహింస అంటే అర్థం చాలామందికి తెలియదని, ఈ రాజ్యహింస రామాయణ కాలం నుంచి మొదలైందని ఈనాటి ఆధునిక సమాజంలో విస్తరించిందని, అప్పుడు నిరాయుధురాలైన తాటకిని చంపారని, శూర్పణఖ ముక్కు చెవులు కోసారని, ఇప్పుడు మహిళల హక్కులను గురించి ప్రశ్నిస్తున్న మహిళల ఉద్యమాలను అణచి వేయడానికి స్త్రీలపై ప్రభుత్వం లైంగిక హింసకు పాల్పడుతుందని” అన్నారు.

తెలుగు సాహిత్యంలో కుటుంబ హింస స్వరూపాల గురించి బులుసు సరోజిని గారు మాట్లాడుతూ కుటుంబ హింసకు వ్యతిరేకంగా ఎన్నో కథలు, కవితలు వచ్చాయని, మల్లీశ్వరి గారి కథను ఉదహరించారు.

ఇక రెండవ రోజు ఏప్రిల్‌ 21వ తేదీ ఉదయం స్త్రీలపై హింసా వ్యతిరేక ఉద్యమాలు- తెలగు సాహిత్యం సదస్సు ప్రారంభమైంది. ఈ సభకు అధ్యక్షత వహిస్తూ డా|| టి. నళిని గారు స్త్రీల జీవితాలలో కనిపించని గాయాలు, మచ్చలు ఉన్నాయని అనాదిగా స్త్రీలపై హింస జరుగుతునే వున్నదని, ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఎన్నో ప్రజా ఉద్యమాలు జరిగాయని, అనేక కవితలు, కథలు వచ్చాయని అన్నారు.

కుటుంబ హింసకు వ్యతిరేక ప్రజా ఉద్యమాల గురించి సింహాద్రి జ్యోతిర్మయి గారు మాట్లాడుతూ ఉద్యమం అంటే సమాజ పరంగా రావలసింది కాదని, ఉద్యమం మహిళల మనసులో నుంచి రావాలని, ఈ హింసా ప్రతిఘటన ప్రతి ఇంట్లో నుంచి రావాలి అని అంటూ, పురాణ పాత్రల్లో శకుంతల, ద్రౌపది పరిస్థితులకు లొంగిపోకుండా ప్రశ్నించి ఎదురించారని, స్త్రీవాద కవిత్వంలో అనేక ధిక్కార స్వరాలున్నాయని అన్నారు.

సామాజిక హింస, ఉద్యమాల గురించి డా|| వి. నాగరాజ్య లక్ష్మి గారు మాట్లాడుతూ ”పురుషాధిక్య భావాల వల్లనే సమాజంలో స్త్రీలపై హింస జరుగుతుంది. కుటుంబ హింస నుంచే సామాజిక హింస మొదలవుతుంది. ఈ రెండు వేర్వేరు కాదు. దీని ఫలితంగా సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఈ హింసకు వ్యతిరేకంగా ఆధునిక సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు వచ్చాయి. సారాకు వ్యతిరేకంగా నెల్లూరులో దూబగుంటలో ఉద్యమం వచ్చిందని, దీనికి రోశమ్మ అనే మామూలు మహిళ నాయకత్వం వహించిందని చెప్తూ రచయిత్రులు ప్రస్తుతం ఈ సమస్యమీద ఎలా పోరాడాలో ఆలోచించాలి” అని అన్నారు.

సామాజిక హింస గురించి డా|| ఎ. సుజాత గారు మాట్లాడుతూ ”స్త్రీ పురుష వివక్ష పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. కుటుంబ హింస కనబడకుండా వుందని, ఆడపిల్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివిస్తారని, మగపిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించి చదివిస్తారని అన్నారు. సమాజంలో ఈ ఆలోచనా ధోరణి మారాలి అని అన్నారు. ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని ప్రతిఘటించాలని అన్నారు.

కులహింస వ్యతిరేక ఉద్యమాల గురించి వి. ప్రతిమ గారు మాట్లాడుతూ ”ఈ సమాజంలో కులం తన వేళ్ళతో నానాటికీ విస్తరించింది. చుండూరు, కారంచేడు, ఖైర్లాంజిలలో దారుణ హింస జరిగినపుడు మౌనంగా వుండక దళితులు ప్రతిఘటించారని, లక్షింపేటకు చెందిన ఆలీసమ్మ, గ్రేసమ్మ మొ|| మహిళలు కుల, లింగ, ప్రాంతీయ హింసకు వ్యతిరేకంగా ఉద్యమించారని అన్నారు. ఉద్యమాల్లో స్త్రీలను ఉపయోగించుకొని వదిలివేస్తున్నారని గోగు శ్యామల అన్నారని, దళితులపై అణచివేతను, వారిపై హింసను నల్లపొద్దు సంకలనం బాగా ప్రతిబింబించిందని అన్నారు. ఆది ఆంధ్ర ఉద్యమం నుంచి దళిత స్త్రీ వాదం వరకు ఈ సంకలనంలో చర్చకు వచ్చాయని దళిత, క్రైస్తవ, ముస్లిం జీవితాలలో అణచివేతను ప్రశ్నిస్తూ ఎన్నో కవితలు, కథలు వచ్చాయని, వినోదిని ఈ సమస్యపై మంచి కథలు రాసిందని, ఈ సమాజం అణగారిన కులాలపై చేసిన హింసను కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తూ కులాన్ని నిర్మూలిస్తే తప్ప ఈ సమస్యను పరిష్కరించలేమన్నారు.

మత హింస వ్యతిరేక ఉద్యమాల గురించి షహనాజ్‌ బేగం గారు మాట్లాడుతూ ఈ దేశంలో బాబ్రీ మసీదు సంఘటన జరిగాక ఈ భారతదేశంలో మా మైనారిటీలు జీవించగలమా? అని ముస్లింలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

స్త్రీలపై కుల హింస ప్రభావాలు – కవితా రూపాలపై డా|| బండారి సుజాత గారు మాట్లాడుతూ ఇందిరాగాంధీని ఒక సిక్కు వ్యక్తి హత్య చేసినప్పుడు సిక్కు స్త్రీలపై అత్యాచారాలు జరిగాయని అత్యాచారాలపై రాసిన విమల కవితను ఉదహరించారు. ఏ కులమైనా ఏ మతమైనా దాడులు జరిగేది స్త్రీలపైనేనని గుజరాత్‌ లోని గోద్రా సంఘటనను తేదీలతో సహా ఉదహరించారు. షాజహానా, బండారు విజయ, రజిత మొ|| కవయిత్రులు హింసకు వ్యతిరేకంగా రాసిన కవితలను ఉదహరించారు. నాకు కులం వద్దు మతం వద్దు, సమాజం ఇటువంటి మతహింసకు పాల్పడేవారికి కౌన్సిలింగ్‌ నిర్వహించాలని అన్నారు.

ఈ ప్రారంభ సదస్సును డా|| కందాళ శోభారాణి గారు నిర్వహించారు. ఆ తర్వాత స్త్రీలపై హింసకు వ్యతిరేక ఒప్పందాలు ప్రభుత్వ విధానాలపై సదస్సును నీలాదేవి గారు నిర్వహించగా డా|| డి.యల్‌. సుహాసిని గారు అధ్యక్షత వహించారు. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఒప్పందాలు – ప్రభుత్వ విధానాల గురించి భండారు విజయ గారు మాట్లాడుతూ ప్రభుత్వం హిందూ దత్తత, వరకట్నం, హిందూ వివాహ చట్టం చేసింది కానీ రాజకీయాల్లో స్త్రీలకు 33% ఇంతవరకు రాలేదని, దానికి పురుషులు అడ్డుపడుతున్నారని చెప్పారు. భారతదేశం స్త్రీల పట్ల అత్యంత ప్రమాదకర దేశంగా గుర్తింపబడిందని తన ఆవేదన వెలిబుచ్చారు.

సామాజిక హింస – చట్టాల గురించి కె. సావిత్రిదేవి గారు మాట్లాడుతూ మాతృస్వామ్యం అంతరించి పితృస్వామ్యం వచ్చాక మహిళల పట్ల హింస ఎక్కువైందని అంటూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ చట్టాలన్నీ బ్రిటిష్‌ రాజ్యాంగం నుంచే వచ్చాయని ఆర్టికల్‌ 14 మహిళలకు, పురుషులకు తేడా లేదని చెప్పిందని, ఆర్టికల్‌ 15 లో లింగభేదం కారణంగా మహిళలను తక్కువగా చూడవద్దని వుందని, భ్రూణహత్యలు, బహు భార్యాత్వం, సతి, బాల్య వివాహాలను నిషేధిస్తూ చట్టాలు చేసిందని, కానీ చట్టాలకు వ్యతిరేకంగా ఆనాడు ఎన్నో బాల్యవివాహాలు జరిగాయని అన్నారు.

చట్టాలెన్ని చేసినా ఏమీ లాభం లేదని, ప్రజల ఆలోచనా విధానం మారాలని, సమాజంలో రావలసిన మార్పు గురించి రచయితలు తమ రచనలో చెప్పాలని, సమాజాల్ని చైతన్యవంతం చేయాలని అన్నారు.

ముగింపు సమావేశంలో పుట్ల హేమలత, అనిశెట్టి రజిత, కాత్యాయనీ విద్మహే పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా నిడవర్తి స్వరూపరాణి సభలో పాల్గొని సందేశం అందించారు. కవితలు చదివారు. ఎమ్‌. రత్మమాల ప్రరవే కార్యక్రమాల గురించి ఉద్దేశాల గురించి మాట్లాడారు. కాత్యాయనీ విద్మహే నూతన కార్యవర్గం సభ్యుల పేర్లు ప్రకటించారు. సదస్సు నివేదికను మందరపు హైమావతి సమర్పించగా, డా|| కె. రామలక్ష్మి సభను నిర్వహించారు.

ఈ రెండు రోజులు స్థానిక రచయితలు, రచయిత్రులు, కవులు, కవయిత్రులు, విమర్శకులు, సాహితీవేత్తలు వచ్చి ఉత్సాహంగా పాల్గొని సభను విజయవంతం చేసారు.

ఈ రెండు రోజులు తమ కాలేజీలో సభ నడుపుకోవడానికి శ్రీ హర్షిణి విద్యాసంస్థల అధినేత జి. రవికుమార్‌ గారు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారు.

 

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.