మేడారం జాతర

– హిమజ

అడివి తల్లీబిడ్డల పండుగకు

గిరిపుత్రులే పెద్దలు

కొండా కోనలే విడిది నెలవులు

వేద మంత్రోచ్ఛారణలు యజ్ఞయాగాదులు

మత గ్రంథ ప్రబోధాలు

ఇసుమంతైనా లేని

అచ్చమైన అడివి బిడ్డల పండుగ

రాచరికపు అరాచకం పైన

అన్యాయపు పెత్తనం పైన

కత్తి దూసి కదంతొక్కి

జాతికోసం నెత్తురోడిన ధీరవనితలు

సమ్మక్క సారలమ్మలకు

అడివి బిడ్డలు చేసే అమర వందనం

కోయ వనితలు కొండ దేవతలైన

ఏడు …. ఏడు శతాద్దాల వీరగాధా వారథి

మేడారం జాతర

గోండులు కోయలు లంబాడాలు

భిల్లులు సవరలు బంజారాలు

దండకారణ్యమంతా దండోరాయై

జనపద ఘట్టనల్లో మారుమోగే

గిరిజనోత్సవం

మాషు శుద్ధ పౌర్ణమి వెన్నెల్లో

నాగరికతకు సుదూరంగా

అనాది అడివి ఒడిలో వినిపించే

ఆదివాసీ జీవన సంగీతం

గోండు బిడ్డల వురాసంస్కృతీ

సంప్రదాయాల కొండమల్లె సౌరభం

మేడారం జాతర

ఇక్కడ కోడి పుంజులు కొబ్బరి కాయలే ముడుపులు

బెల్లమే నిలువెత్తు బంగారం

పూజలు ఎదుర్కోళ్ళు / కంక బియ్యం సమర్పణం

శివసత్తుల పూనకాలు / వన మూలికల వగరు వాసనలు

ఇప్పసారా పరిమళాలు / పుట్టతేనే తీపిదనాలు

తల నీలాలిచ్చి జంపన్న వాగులో

జన సముద్రం చేసే జలకాలు ఒకెత్తయితే

దిక్కులు పిక్కటిల్లే జననినాదాల నడుమ

తల్లీబిడ్డలను గద్దెల దరికి తీసుకొచ్చే దృశ్యం

హృదయోద్విగ్నం – మహదానందం

రెండేండ్లకోసారి తల్లులిద్దర్ని తలచుకొని

ఇంటికి పిలుచుకొని

అడివి అడివంతా పులకించిపోయే స్మృతి పండుగ

మేడారం జాతర!

 

పరాయీకరణ – సుభాషిణి. యన్‌

నిజంగా నేను నేను కాదు

ఈ జీవితం నాది కాదు

నేననుకున్నది నిజం కాదు

నాదన్నది లేనే లేదు

బరువు సంద్రం ఈదుతున్నా

ఆత్మీయ తీరం కానరాదు

బాధ్యతలను విడిచే పిరికితనం లేదు

బంధాలను నమ్మే ధైర్యం లేదు

ఓడిపోతానేమోనన్న భయం లేదు

గెలిచి తీరుతానన్న ధీమా లేదు

వర్తమానంలో ఏ అండా లేదు

భవిష్యత్తును గురించి బెంగా లేదు

‘లేదు’ లోని శూన్యం వెక్కిరిస్తుంటే

కడుపులో విషమై మెలిదిరుగుతుంటే

నడుస్తున్న శవంలా

భారంగా నిర్వేదంగా నిస్తేజంగా

పట్నం చెట్టు మీది వలస చిలుక

‘కావు’ ‘కావు’ మనే పరాయీకరణలో

నేను నిజంగా నేను కాదు

ఈ జీవితం నాది కాదు

నేననుకున్నది నిజం కాదు

నాదన్నది సాధించుకోవాలనే

ఈ పోరాటమంతా……

 

తోకలున్న మనుషులు..

– అనిశెట్టి రజిత

ఎంత ధీమగా నడుస్తున్నాడు

వాడి తోక వాడికి కనిపించడం లేదు కదా

ఆ తోక పేరు ‘మనువ’ని వాడికి తెలుసా?

ఎంత వికృతంగా నవ్వుతున్నాడు

వికారంగా వెగటు పుట్టిస్తున్నాడు

ఆ నవ్వు ‘స్మృతు’ల నాటిదని వాడికి తెలుసా?

ఎంతగా దురహంకరిస్తున్నాడు

కుల-వర్గ వర్ణ ధర్మాన్ని జీర్ణించుకున్న

ఆధునిక కుటిలశాస్త్రం వానిదని తెలుసా?

ఎంత నిర్భయంగా గర్వంగా

సంచరిస్తున్నాడు వాడు

విచ్చలవిడిగా విడుదులు విందులు

నియతిని చంపేసిన చిందులు

అక్రమార్గాల అహేతుకం

నైతికతలు కత్తికోతకు హతం..

గురివింద గింజను పోలిక చేసుకొని

గూండా సంస్కృతిని నిండా తొడుక్కొని

క్రూరమృగంలా కలియతిరుగుతూ

వెనుకటి తోకలున్న నరవానరజాతిని

గుర్తుకుతెస్తూ నిత్యం విధ్వంసాన్ని

క్రీడానందం పొందుతూ

బహుశా అంతకన్నా నీచంగా

అంతకన్నా పశుప్రాయంగా

అంతకన్నా దిగజారిన విషప్పురుగులా..

నాగరికుడనిపించుకుంటున్న

తోకల మానవుడు

ప్రపంచాన్ని శాసిస్తున్న

సాంకేతికల పాలకుడు

మతిస్థిమితం కోల్పోయిన

మహా ఉన్మత్తుడు

మానుషత్వాన్ని భక్షించే

మదోన్మత్త శాడిస్టోడు..

తోకలూపుకుంటూ ఊపుకుంటూ

వింత జంతువులా మారినవాడు

హవ్వ మనిషా వాడు?

తోకలుంటే అంతే మరి!

తోకలు కత్తిరించుకుంటేనే మనిషి సరి!

 

సీత

– హిందీ మూలం : కవితా గుప్తా

అనువాదం : డా. వెన్నా వల్లభరావు

సీతా!

నీపై కవిత రాయమంటున్నారు

ఏదో ఒక కవిత

కానీ ఏం రాయను?

భూమి సుతవని

రాముని పత్నివని

వనవాసం చేశావని

పాతివ్రత్య నిరూపణకు

అగ్నిలో దూకావని రాయనా?

అయినా రాముని ద్వారానే

మోసంతో అడవికి పంపివెయ్యబడ్డావని-

అందునా

నిండు గర్భవతిగా ఉన్న నువ్వు!

సీతా!

నీపై ఏమని రాయను కవిత?

పాతివ్రత్య ధర్మాన్ని పాటించావని

అయినా

ఒకానొక రోజున నువ్వు కూడా

మరల భూమాత ఒడినే చేరావని రాయనా?

సీతా!

ఇదంతా కవితవుతుందా…?

సీతా!

నువ్వు కూడా పిండంగా రూపుదాల్చి జన్మించి ఉంటే

అల్ట్రా సౌండ్‌ నుండి తప్పించుకుని

అమ్మా నాన్నల తృణీకారపు పెంపకంలో

బిక్కుబిక్కుమంటూ పెరిగి ఉంటే

మిసిమి వయసులోనే

ఎవరో షేక్‌కు అమ్మివేయబడి ఉంటేనో

లేక

వరకట్నపు వద్యశిలపై నీ శిరస్సు ఉంచబడి ఉంటేనో

నీపై కవిత రాయగలిగి ఉండేదాన్ని.

సీతా!

నీపై ఎలా రాయను కవిత?

ఏమని రాయమంటావో నువ్వే చెప్పు!

ఉద్యోగం చేస్తూ

కుటుంబాన్ని పోషించే సంఘర్షణ

నువ్వు అనుభవించలేదే!

అయినవాళ్ళ ద్వారానే

తిరగలి రాళ్ళమధ్యకి నువ్వు నెట్టివెయ్యబడలేదే!

వాస్తవం ఏమిటంటే

‘భూమిలోపల’ నీకు

ఆత్మాభిమానపు పోరు సల్పాల్సిరాలేదు!

 

నువ్వు పక్షిగా మారి

ఆకాశంలోకి ఎగిరిపోయుంటే ఎంతబాగుండేది!

సీతా!

అప్పుడు నేను

నీపై కవిత తప్పకుండా రాసుండేదాన్ని

నువ్వు నేటి యుగంలో పుట్టిఉంటే

తప్పకుండా రాసుండేదాన్ని నీపై కవిత!

 

మేధాలేఖిని

– డా|| సి. నారాయణరెడ్డిి

కళ్లు మూసుకు పోతుంటే

రాసే చేయి నడక సాగలేదు.

గత్యంతరం లేదా అనుకుంటే

ఇదుగో నేనున్నానంటూ

మేధాలేఖిని ముందుకు దూకింది.

అప్పటికప్పుడే తనకు స్ఫురించినవి

తన ఆలోచనలను వరించినవి

అది స్మృతుల పుటల్లో నింపుకుంది.

ఆలోచనలను నిలుపుకోవడానికి

స్మృతుల నిడివి సరిపోవడం లేదు

కళ్లు తమంతతామే విచ్చుకున్నాయి.

చేతిలో నుంచి

అక్షరాలు జలజలా రాలిపడుతున్నాయి.

హస్తలేఖినికి

మేధా సహకారం సంపూర్ణంగా లభించింది.

రాసే చేయి

పుటలను సృష్టిస్తూ పోయింది.

చివరి పుటను చేరుకునే సరికి

‘సమాప్తం’ అనే అక్షరాలు

కళ్ల యెదుట నిలుచున్నాయి.

అలా ఇలా అనుకుంటూ ఉండగానే

ఒక కృతి రూపొందినందుకు

నా సృజనశక్తి

తనలో తాను ఉప్పొంగిపోయింది.

 

ఆడపిల్ల వర్సెస్‌ చిన్ని ఆశ….!

– నిర్మలా రాణి తోట

ఆరేళ్ళ వయసులో

అల్లరిచేసాను…

డాబాపై

చుక్కలు లెక్కెడుతూ

పడుకుంటానని…

చిన్న పిల్లవి..

చీకట్లో జడుసుకుంటావు అన్నారు…!

పదహారు ప్రాయాన

మళ్ళీ అడిగా..

పందిరి నీడలో

పడుకుంటానని…

ఈడొచ్చిన పిల్లవి

ఇరుగు పొరుగు చూస్తారన్నారు…!

పెళ్ళయ్యాక

గోముగా అడిగా

వెన్నెల్లో

పక్కేసుకుందామని….!

ఇల్లాలివయ్యావు

ఇంగితం లేకుండా ఇదేం కోరికన్నారు…!

అరవైలో

ఆశగా అడిగా…

బాబూ… ఆరుబయట

పడుకుంటానురా అని..

ముసల్దానివి

ఆనక ఆయాసపడితే ఆసుపత్రులు తిరగాలన్నారు…!

అవసాన దశలో

అరుగుపై వేసారు..

చుక్కలలాగే ఉన్నాయి

చూడ్డానికి నాకు కళ్ళు లేవు…!

ఆకాశమూ అలాగే ఉంది…

ఆస్వాదించడానికి నాలో శ్వాస లేదు…!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.