నిత్య చైతన్యశీలి మల్లాది సుబ్బమ్మ

నేను1975లో ఒక కుగ్రామం నుంచి బయలుదేరి మహానగరంలో అడుగు పెట్టిన తొలిరోజులు. మా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు కూడా దాటి ఎరగని నేను హైదరాబాదులో గుబులు గుబులుగా గడుపుతున్న కాలం. ఎమర్జన్సీ చీకటి కమ్ముకున్న రోజులు. అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రకటింపబడిన సంవత్సరంలోనే నేను నగరానికి వచ్చిపడ్డాను. పుస్తకాల పరిచయం తప్ప వ్యక్తులెవ్వరూ తెలియదు.1979లో పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగం రావడంతో నా ఇరుకుదారులు వెడల్పయ్యాయి. ఆఫీస్‌ అయిపోయాక సాహిత్య సమావేశాలకి వెళ్ళడం అలవాటయ్యింది. చదువుకున్నది సంస్కృతం, ఆంగ్లం, తెలుగు బాషలవ్వడంవల్ల సాహిత్యం మీద వల్లమాలిన ప్రేమ. పుస్తకాలంటే… అవే అప్పటి ఆత్మీయ నేస్తాలు. పుస్తకావిష్కరణ సభలకి, సమావేశాలకి వెళ్లడమే అప్పటి ఇష్టకార్యక్రమం. అలాంటి ఒకానొక మీటింగ్‌లో మల్లాది సుబ్బమ్మగారి అనర్ఘళ ప్రసంగం విన్నాను. నదురు బెదురు లేకుండా, కంచు కంఠంతో మాట్లాడుతున్న ఆవిడను నిర్ఘాంతపోయి చూసాను. అప్పటికి నాకు స్టేజంటే చచ్చే భయం. తొలి రోజుల్లో స్టేజిమీద కాళ్ళు గడగడ వొణికేవి. అప్పుడు ఆవిడ ప్రసంగించిన తీరు నా మీద గొప్ప ముద్రవేసింది. ఆవిడ వెలిబుచ్చిన భావాలు చాలా నచ్చాయి. నేను కూడా నా అస్తిత్వం కోసం వెతుక్కుంటున్న రోజులు. నా జీవితాన్ని ఏ మలుపులోకి తిప్పాలి…. నా జీవిత లక్ష్యం ఏమిటి అని అన్వేషించుకుంటున్న సందర్భం. కొత్త భావాల వెంట పరుగులు తీసే వయస్సు. అలా సుబ్బమ్మ గారి మహిళాభ్యుదయ సంస్థల్లోకి నా తొలి అడుగు పడింది. మలి అడు మాత్రం అన్వేషిలో పడి స్థిరపడింది.

మల్లాది సుబ్బమ్మ ఒక వ్యక్తి కాదు మహా సంస్థ. దాదాపు 80 పుస్తకాలపైనే రచించారు. మొదట్లో హేతువాది, సహచరుడు అయిన రామ్మూర్తి గారితో కలిసి, ‘వికాసం’ అనే పత్రికను తర్వాత స్త్రీల కోసం ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే పత్రికను నడిపారు. 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లెలో ఆవిడ జన్మించారు. బాపట్లకు చెందిన మల్లాది వెంకట రామ్మూర్తిని పెళ్ళి చేసుకున్నారు. పెళ్లినాటికి మెట్రిక్‌లేషన్‌ కూడా పూర్తి చెయ్యని సుబ్బమ్మ, తన చదువు కోసం అత్తమామలనెదిరించి డిగ్రీ వరకు చదువుకున్నారు. స్త్రీల కోసం అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే అనేక అంశాల మీద కథలు, నవలలు, వ్యాసాలు రాసారు. ”పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా” పేరుతో ఆత్మకథను రాసారు మల్లాది సుబ్బమ్మ.

సుబ్బమ్మగారి సాహిత్య జీవితం, స్త్రీల అభివృద్ధి కోసం చేసిన కృషి ఒక కోణమైతే, తెలుగునాట మహోగ్రంగా నడిచిన సారా వ్యతిరేక పోరాటంలో ఆవిడ పాత్ర మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. 1992లో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమానికి మల్లాది సుబ్బమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మి లాంటి వారు వెన్నుదన్నుగా నిలిచారు సుబ్బమ్మగారు. వివాహం-నేడు-రేపు, వ్యభిచారం ఎవరి నేరం, ఏది అశ్లీలం, బానిసకాదు దేవత కాదు, బంగారు సంకెళ్ళు, స్త్రీ విమోచన, స్త్రీ విముక్తి లాంటి అనేక పుస్తకాలు రాసారు. ఆ పుస్తకాలు అందరూ చదవాలనే ఉద్దేశ్యంతో ప్రతి మీటింగ్‌లోను వాటిని పంచేవారు సుబ్బమ్మగారు. ”ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమం – మహిళా సంఘాలు” అనే పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంధంగా గుర్తించి అవార్డు నిచ్చి సత్కరించింది. సుబ్బమ్మ తన నివాసంలోనే స్త్రీల కోసం ఎన్నో సంస్థల్ని నెలకొల్పి నడిపారు. స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, శ్రామిక మహిళా సేవ, వరకట్నం హింసల దర్యాప్తు సంఘం, మహిళాభ్యుదయ గ్రంధాలయం లాంటి సంస్థల్ని స్థాపించారు. అలాగే కుల, మత ప్రసక్తి లేని వివాహాలను ప్రోత్సహించడానికి 1981లో అభ్యుదయం వివాహ వేదికను స్థాపించారు.

సుబ్బమ్మగారిని వ్యక్తిగతంగా నేను తలచుకోవలసిన మరో సందర్భం ఈ అభ్యుదయ వివాహవేదిక. 1981లో నేను కుల ప్రసక్తి, మత ప్రసక్తి లేని నాస్తిక వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు సుబ్బమ్మగారు నాకు అండగా నిలిచారు. 1980లో నేను విజయవాడ నాస్తిక కేంద్రంలో నిప్పుల గుండంలో నడిచినప్పుడు (నిప్పుల గుండం ఎవరైనా తొక్కొచ్చు. దీనికి మాయలు, మంత్రాలు అవసరం లేదని నాస్తిక కేంద్రం వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. నేను పాల్గొని నిప్పుల్లో నడిచాను) నాకు పరిచయమైన వ్యక్తితో కులం, మతం, ప్రాంతం ప్రసక్తి లేకుండా సహజీవనం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అప్పుడు మల్లాది సుబ్బమ్మ దంపతులు, లవణం గారు మాకు అండగా నిలబడ్డారు. మా పెళ్ళిని రిజిస్టర్‌ చేసినపుడు మాతో ఉన్నారు. సుబ్బమ్మగారు స్థాపించిన అభ్యుదయ వివాహ వేదికలో నేను జాయింట్‌ సెక్రటరీగా వుండే దాన్ని. ఆ సంస్థ కింద జరిగిన తొలి కులాతీత, మతాతీత, నాస్తిక రీతి పెళ్ళి వేడుక మాదే అని సగర్వంగా చెప్పగలను. సుబ్బమ్మగారు, రామ్మూర్తి గారు, లవణంగారు మేమిచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. (ఖర్చు 29 రూపాయలు) మా పెళ్ళిని వ్యతిరేకించిన మా అత్తమామలకు ఎంతో నచ్చచెప్పి వారిని వొప్పించారు. (ఆ వ్యతిరేకత కూడా చాలా కొద్దిరోజులే. తర్వాత నేను వాళ్ళకి చాలా ఇష్టురాలిని అయ్యాను.)

మల్లాది సుబ్బమ్మ గారి మరణం నాలో ఇన్ని ఆలోచనలను రేపింది. ఆమెతో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసింది. ఆవిడ ఎంతో ముందు చూపుతో ”మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్‌”ని ఏర్పాటు చేసి తన యావదాస్తుల్ని తన సంతానానికి కాకుండా, సమాజాభ్యుదయం కోసం సమాజ సేవ కోసం శ్రమపడేవారికి చేరే విధంగా ఏర్పాటు చేసారు. జీవితాంతం హేతువాదిగా జీవించిన మల్లాది సుబ్బమ్మ తన మరణానంతరం కూడా ఎలాంటి క్రతువుల నీడ పడకుండా తన పార్ధివ శరీరాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేసారు.

తను నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి, తన సేవల ద్వారా చరిత్రలో నిలిచిపోయారు మల్లాది సుబ్బమ్మ గారు. ఆవిడ స్మృతికి భూమిక నివాళి ఇది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో