”సీకటి సుక్కలు జాబిలి మొక్కలు నాటాలె”- వి. ప్రతిమ

కులం పునాదులమీద దేన్నీ నిర్మించలేం… ఒక నీతిని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం… కులం పునాదిమీద దేన్నయినా నిర్మించడానికి ప్రయత్నించినా అది పగిలి ముక్కలుకాక తప్పదు. అట్టిదేదీ సంపూర్ణ నిర్మాణంగా మనజాలదు… కులాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగిస్తేనే తప్ప ఏవిధంగానూ ప్రగతిని సాధించడం సాధ్యపడదు.” అంటాడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌.

పెళ్ళగించే కొద్దీ వేళ్ళను మరింత విస్తరించుకు పోతోన్న కులరక్కసి ఉక్కుపాదాల కింద మది నలిగిపోతోన్న, అణగారిపోతోన్న సమూహాలని గురించి, ముఖ్యంగా ఆ సమూహాల్లోని మహిళల హీన, దీన పరిస్థితుల గురించీ కవిత్వంగా, కథలుగా మలిచి తెలుగు సాహిత్యంలో ఉదృతంగా నమోదు చేస్తూ వస్తోన్న జూపాక సుభద్ర గురించి పాఠకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమేమీ లేదు…. ఎన్నో ఏళ్ళుగా భూమికకి క్రమం తప్పని కాలమిస్ట్‌ ఆమె.

కాలమిస్ట్‌గా, కవిగా, కథారచయితగా, పరిశోధకురాలిగా, అనువాదకురాలిగా, ఎన్నో పోరాట సంస్థలకు నాయకురాలిగా, ఎప్పుడూ జనాల్లో వుందే ప్రజాసేవకురాలిగా తెలుగుసాహితీ జగమెరిగిన సుభద్ర తన కథలన్నింటినీ గుదిగుచ్చి ‘రాయక్కమాన్యమ్‌’ అన్న కథాసంపుటిగా ప్రచురించి జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న అజమ్మచేత ఆవిష్కరింపచేయడం ముదావహం…

ముస్లిం రచయితలు ‘వతన్‌’ ప్రచురించినపుడు, షాజహానా తన మొదటి కవిత్వ సంపుటి వెలుగులోకి తెచ్చినపుడు మతదౌష్ట్యం కింద పడి, మెజారిటీ మనుషుల మత దురహంకారానికి గురయి నలిగి, ముడుచుకు పోతోన్న మైనారిటీ మనుషుల గురించీ, యింకా ఆ కుటుంబాలలో పరదాల వెనక, వూపిరాడని చీకట్లలో మగ్గిపోతోన్న స్త్రీల గురించీ మనకు తెలీని మహారణ్యపు చిక్కుదారులనెన్నో మన కళ్ళముందు ఆవిష్కరింపబడినట్లుగా ఈ ‘రాయక్క మాన్యమ్‌’ లోని కథలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని అణగారి పోయిన వర్ణాల వెతల్ని, కథల్ని, గాథల్ని మన కళ్ళముందు ఆవిష్కరింప చేస్తాయి. మరింత దుర్మార్గంగా దోపిడీకి, పీడనకు గురవుతోన్న దళిత మహిళల జీవన పరిస్థితుల్ని వివిధరకాలుగా మనకి పరిచయం చేసి మనల్ని కదిలిస్తాయి. పలు పలు విధాలుగా బలయిపోతోన్న అంటబడని కులాల ఆడవాళ్ళ చరిత్రలివి….

దళితకులాల్లో, దళిత ఉపకులాల్లో నిక్షిప్తం చేయబడినటువంటి సంస్క ృతీ భాంఢాగారాలు చెప్పుకోదగినవి… మిగిలిన అన్ని విధాలుగా దళితులెట్లా దోపిడీ, పీడనకు గురయ్యారో అదే విధంగా వారి ఆట, పాటలు కూడ దోపిడీకి గురయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

తెలంగాణా ప్రాంతంలో ఎన్నెలపాటలు, బతకమ్మ పాటలు, కాముని పాటలు, ఎల్లమ్మ కతలు, బీరన్న కతలు, మల్లన్న కతలు, జాంబ పురాణాలు యిలా ఎన్నో, ఎన్నెన్నో వారి సంస్క ృతీ మంజూషలో నిక్షిప్తమై వున్నాయి…

బతకమ్మ తెలంగాణా ప్రాంతంలో ఒక విశిష్టమైన పండగ. అది ఆధిపత్య కులాల స్త్రీలకు మాత్రమే స్వంతం…. దళిత స్త్రీలు బతకమ్మ పండగ చేసుకునే పద్ధతి లేదంటూ ఆంక్షలు విధించడమే కాకుండా దళిత స్త్రీలు బతకమ్మలాడరాదంటూ కాపోల్లు లొల్లి పెడ్తరు… దళిత స్త్రీలను బతకమ్మలాడొద్దనడం వారికి చాల కష్టమన్పిస్తుంది…

”మాతోని పనులు చేయించుకునే కాడ కులం లేదు గానీ, మేం ఏర్కచ్చి యిచ్చిన బత్కమ్మ పూలకాడ కులం లేదుగానీ, మేము బతకమ్మలను ఆడుకునే కాడ కులం తక్కువయింది” అనుకుంటూ పట్టుబట్టి శానా పూలు దెప్పిస్తుంది ఆ వూరి సర్పంచ్‌ దేవమ్మ అంతేగాకుండా వేర్వేరు వాడల్లో వున్నటువంటి దళిత స్త్రీలందరినీ కూడేసి బత్కమ్మలు పట్టించి చెరువుకిందకి పైనం చేయిస్తుంది.

నిజానికి ‘ఎప్పుడో ఎన్కటినాటి ఈ బత్కమ్మలు మొగుదాల ఆడింది మన మాదిగోడోల్లేనంట.’ అంటూ అసలు విషయం చెప్తుంది దేవమ్మ అత్త దేవమ్మ కూతురు స్వాతికి…” వూరోళ్ళు దగ్గర్రానియ్యరి, సిగలబెట్టుకోని, దండ గుచ్చనీకి కూడ దూరముంచిన జిల్లేడు, గునుగు, కల్లు పూలసంటి పూలను కూడా సిబ్బిల పేర్చి, బత్కిచ్చి ఆడిపాడి బత్కమ్మను చేసింది మాదిగొడోల్లేనంటూ ‘గద్దెత్కపోయిన బత్కమ్మ’ కథ చెప్తుంది నాయినమ్మ స్వాతికి.

కడంపుగ్గ బట్టుకుని యింటోన్న స్వాతితో పాటు పాఠకుడికి కూడ అర్థమయిపోతుంది అసలు బతక్కమ్మలు ఎక్కడ ఎట్లా మొదలయ్యాయో.

”ముసలవ్వాఁ యిక గాల్లెవ్వరడ్డమొచ్చినా, వద్దన్నా మేమయితే గీ బత్కమ్మ ఆడ్తనే వుంటం సూడు” అంటూ స్వాతి ఖాయంగా చెప్పడంతో కథ ముగుస్తుంది.

దళిత స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేయడం, రాజకీయాలల్లోకి రావడం కూడ కన్నెర్రే… ఆఫీసులల్ల యితర కులాల ఉద్యోగస్థులు వీరిని తమతో కలగలుపుకోరు… భోజనాలు చేసేదగ్గర కూడ వేరబందరంగా చూస్తారు. వీరి భాష దగ్గర్నుండి ఆహార్యంవరకూ అన్నీ ఎగతాళికి గురవుతాయి… వేరే వూళ్ళకి బదిలీ అయి వెళ్ళినట్టయితే అక్కడ వీరికి యిళ్ళు దొరకవు… తెలీక ఎవరయినా యిల్లిచ్చినా తెలిసిన వెంటనే ఖాళీ చేయించి యిల్లంతా మూడు బావుల నీళ్ళు పోసి శుద్ధి చేస్తరు… ఇటువంటి పరిస్థితి యింకా ఈ సమాజంలో వుందనుకుంటే సిగ్గుతో తలొంచుకోవాలన్పిస్తుంది. నిజానికి శుద్ధి చేయాల్సింది ఇళ్ళను, వస్తువులనూ కాదు మన మనస్సుల్ని అన్న విషయం అర్థం చేయిస్తుందీ కథ ”శుద్ధిచెయ్యా లె”…. అంతేకాకుండా మాట్లాడే భాష కూడ ఒక్కొక్కసారి ఎంతెంత అవమానాలకు గురిచేస్తుందో ముఖ్యంగా ఆఫీసుల్లో క్లాస్‌ 4 ఉద్యోగులు వాళ్ళు స్త్రీలయినా సరే పురుషులయినా సరే ఎన్నెన్ని యిబ్బందులు పడతారో కూడ ఆ కథలు మనకి చెప్తాయి….

రిజర్వేషన్ల మూలంగా ప్రాంతీయ సంస్థల్లో దళితస్త్రీలకు రాజ్యాధికారం దక్కినప్పటికీ కూడ వాళ్ళకి ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా, మెరుగైన జీవితం లేకుండా ఎన్ని రకాల పెత్తనాలు వాళ్ళమీద పనిచేస్తుంటాయో తెలుపుతూ గతంలో ‘సర్పంచ్‌’ అన్న కథ రాసిన సుభద్ర యిందులో కాటారం మండల ఎం.పి.టి.సి. గా గెలిచి ఎం.పి.పి. గా చేయబడ్డ సామ లక్ష్మిని మనకి పరిచయం చేస్తారు. ఛార్జి తీసుకోవడం కోసం మండలాఫీసుకి పోవడానికి తన ఆహార్యం ఎలా వుండాలో, ఎలా వుండొచ్చోనన్న సందిగ్ధం, సంఘర్షణ… ఒక ఆయివన్న చీర, పెయిమీద సొమ్ములు లేనందుకు దిగులు పడినా ”రాబోయే కాలం మనదే యికనుండీ సింగులీరబోసి నుచీరె కట్టి సదూకున్నామె లెక్క మండలాఫీసుకు బోవాలె. పెసిడెంటా? మజాకా?” అన్న భర్త ఓదార్పు మాటలతో ‘షా- నిలబడాలన్న సాంబలక్ష్మి ధీమాగా మన కళ్ళముందు నిలబడుతుంది.

అట్లానే దేవమ్మ… బత్కమ్మ లాడరాదని కాపోల్లు లొల్లి పెట్టినప్పటికీ ధైర్యంగా నిలబడి అన్ని వాడల్లోని దళిత మహిళల్ని కూడేసి బత్కమ్మలు పట్టిచ్చి సెరువు వైపుకు నడిపిస్తుంది ధైర్యంగా సర్పంచ్‌ దేవమ్మ. అంతే కాకుండా వూరికెన్నో పనుల్జేస్తుంది… వృద్ధుల పెన్షన్లు యిప్పించడమే కాకుండా తెల్లరేషను కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులిప్పిస్తుంది. వాళ్ళంతా దేవమ్మకు సేతులెత్తి మొక్కుతుంటుంది….

సంక్షేమ హాస్టళ్ళలోని ఆడపిల్లల మీద లైంగిక దాడుల సంగతొక పక్కనైతే, చీమ చిటుక్కుమన్నా సరే వాళ్ళని అనుమానించడం, బాత్‌రూముల్లో ఏదయినా రక్తపు మరకలు కన్పిస్తే ఆడపిల్లలందర్నీ కట్టగట్టుకుని డాక్టరు వద్దకి తీసికెళ్ళి నిర్ధారణకు నిలబెట్టడం, కాదన్న వాళ్ళమీద కక్ష సాధింపులు… యిటువంటి జుగుప్సాకరమైన పరిస్థితి ‘షెవ్వా నెత్తురు’ లో కన్పిస్తుంది… వూరావలి ఆడపిల్లలకు వెసులు బాటులన్నీ యినుపగోడలై అంతా చీకటీ, వెలుతురు రాని, వెన్నెల రేఖలు చేరని గబ్బిలాలే అంటుంది సుభద్ర… ‘ఆ సీకటి సుక్కలు జాబిలి మొక్కలు నాటాలె’ అంటుంది.

దళిత స్త్రీలు చాల నిబ్బరం గలిగినవారు. మానసికంగా, శారీరకంగా కూడ వాళ్ళు బలమైనవాళ్ళు… శ్రమ సౌందర్యాన్ని కలిగి, నలుగురినీ నడపగల నాయికను, బహురూపి అయిన స్త్రీని మనం మాదిగ కులంలోనే చూడగలం అంటారు మధుజ్యోతి ఒకచోట.

రాయక్కను చూస్తుంటే ఈ మాటలు పదే పదే గుర్తొస్తాయి. ధృఢంగా, ఎత్తుగా, ధైర్యంగా, సాధికారంగా వుండే రాయక్క మాదిగ ఉపకులమైన డక్కలి స్త్రీ ‘డక్కలి పనంత చేస్తది, కుల పంచాదులు తెంపుతది… ఎత్తుగ, దళంగ, సెయ్యెత్తే అందకుండ పెద్ద మొగోడున్నట్టుంటది’ అంటూ సుభద్ర రాయక్కని మన కళ్ళముందు నిలబెడుతుంది.

రాయక్క పటమేసి జాంబ పురాణం చెప్తుంది. కులపద్ధతిలో వైద్యం చేస్తుంది. తాయెత్తులు కడుతుంది… పంటలొచ్చినప్పుడొచ్చి యింటికో వరికట్ట, కుంచెడు వడ్లు మాదిగిళ్ళల్ల వసూలు చేసుకుంటుంది. డక్కలి, చిందు మాదిగ ఆశ్రిత కులాలు. రాయక్క పోరాట పటిమ, తనకి రావల్సిన మాన్యాన్ని నిలబెట్టి వసూలు చేయడం, పంచాదులు తెంపడం రాయక్క ఒక పాత్ర అనుకుంటే ఎంతకీ నమ్మబుద్ధి కాదు.

ఇట్లా ఎందరో రక్తమాంసాలున్న మనుషులు ముఖ్యంగా దళిత మహిళలు మనకీ కథల్లో పరిచయమై దగ్గరవుతారు. పుస్తకం పూర్తయ్యేటప్పటికి రకరకాలుగా వారి దేవిపోతలు మనల్ని కుదురుగా వుండనియ్యవు… ఒకసారి చదివి పక్కన పెట్టలేం… మళ్ళీ మళ్ళీ చదవమని వేధిస్తాయీ జీవితాలు… తెలంగాణా పలుకుబడులు, నానుడులు, జాతీయాలు కలగలిసిన కమ్మని మట్టిపొరల తరాల భాష మనని కట్టి పడేస్తుంది.

కాలం పొరలకింద పడి నలిగిపోయిన, మరుగున పడిన ఎన్నెన్నో ఒప్పందాలను వెలికి తీయాల్సిన అవసరముందని హెచ్చరిస్తాయి ఈ కథలు.

అందుకే ఈ కథలు చాలా ఘాటుగా వుంటాయి.

ఆదుర్ధరమైన అణిచివేతల్లోనుండి ఈ కథల్ని నిదానంగా, ఎటువంటి ఆగ్రహావేశాలు లేకుండా ప్రశాంతంగా చెప్పడం సాధ్యంకాని విషయం… అధికారంలో మనకి ప్రశ్నలు కన్పిస్తాయి

జీవితం కన్పిస్తుంది

పోరాటం కన్పిస్తుంది.

తన వాళ్ళని ఉద్యమరూపాల్లోకి నడిపించడం కన్పిస్తుంది

మెరుగైన జీవితం కోసం ఆరాటం కన్పిస్తుంది,

వాటిని చూడ్డానికి మనకి మనసుండే కళ్ళుండాలి. అంతే.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో