స్త్రీ స్వాతంత్య్రం – అంబేద్కర్‌ దృక్పథం- బి. విజయ భారతి

దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు వచ్చిందా? భారతదేశ సంస్క ృతి ప్రకారం స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు – నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అన్నాయి శాస్త్రాలు – శతాబ్దాల పూర్వపు ఈ భావనలో ఇప్పటికి మార్పు ఏమైనా వచ్చిందా అనేది ప్రశ్నించుకోవాల్సిన అంశం.

ఆధునిక కుటుంబంలో బానిసత్వమూ దాసత్వమూ స్త్రీల పరంగా కొనసాగుతూనే ఉండటం కాదనలేనిది. చట్టాల పరంగా ఆధునిక సామాజిక వ్యవస్థలో స్త్రీ స్థానం ఎటువంటి మార్పులకు లోనయిందో తరచుగా విశ్లేషించుకుంటూనే ఉన్నాం. స్త్రీల సాధికారత గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సాధికారత అంటే ఎంపవర్‌మెంట్‌. స్త్రీలకు శక్తినివ్వటం – వారిని బలోపేతులను చేయటం – అని అర్థం చేసుకుంటే స్త్రీలను శక్తిమంతులుగా చేయటానికి పూర్వం జరిగిన ప్రయత్నాలేమిటి? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినాక జరిగిన ప్రయత్నాలేమిటి. అని ఆలోచిస్తే అంబేద్కర్‌ గారి హిందూకోడ్‌ బిల్లు గుర్తుకు వస్తుంది.

స్వతంత్ర భారతదేశంలో స్త్రీ ఆత్మగౌరవంతో పురుషునితో సమానమైన హోదాతో ఉండాలని డా. అంబేద్కర్‌ (14-4-1891 – 6-12-1956) ఆకాంక్షించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రత అనేవి ఆయన నినాదాలు.

”చట్టం ముందు అందరూ సమానులే” అని భారతీయు లను ఒప్పించిన అంబేద్కర్‌ స్త్రీలకు చట్టబద్ధంగానే హక్కులు సమకూర్చాలనుకున్నారు. భారత సమాజంలో స్త్రీలకు కుటుంబంలోనూ ఆర్థిక రాజకీయ రంగాలలోనూ సముచిత స్థానం లేదని గ్రహించి ఆ దిశగా ఆలోచించి నిర్మాణాత్మకంగా వారిని శక్తిమంతులను చేసిన ఆయన కృషిని గురించి ఎంత చెప్పినా తక్కువే.

పూర్వ సంస్కర్తలూ సమాజావసరాలకు అనుగుణంగా స్త్రీలపరంగా కొన్ని సంస్కరణలకు పూనుకున్నారు. అందుకు భిన్నంగా సమాజాన్ని సంస్కరించేలాగ అంబేద్కర్‌ స్త్రీలను శక్తిమంతం చేయాలనుకున్నారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు సామాజిక ఆర్థికపరమైన న్యాయమూ వాగ్దానం చేసింది. ”కులం, మతం, లింగం పుట్టిన ప్రాంతం వంటి ప్రాతిపదికల మీద ఏ వ్యక్తీ వివక్షకు గురి కాకూడదు” అని చెప్పింది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అంబేద్కర్‌ కృషి సాగింది.

అంబేద్కర్‌ తాను తలపెట్టిన అన్ని కార్యక్రమాలలోనూ మొదటి నుండే స్త్రీలకు భాగస్వామ్యం ఇచ్చారు. ఏ సమావేశాలు ఏర్పాటు చేసినా స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరచి వారి సమస్యలు చర్చించేవారు. వారికి ఉత్తేజం కలిగించేవారు. దళిత వర్గాల స్త్రీలకు వేషభాషలపరంగానూ సూచనలు ఇచ్చేవారు. గౌరవప్రదమైన జీవితం కోసం ప్రయత్నించాలని చెప్పేవారు. బాహ్యప్రేరణలకంటె అంతరంగ ప్రేరణ ముఖ్యమని ఆయన భావించారు.

కుటుంబంలోని పురుషులు చెడు అలవాట్లకు లోనవుతుంటే వారిని నయానా భయానా మంచి మార్గంలోకి తేవాలన్నారు. భర్త ఎలాంటి వాడయినా సహించి అతనికి విధేయంగా ఉండనక్కర్లేదన్నారు. దుర్మార్గులైన భర్తలను వదిలివేయవచ్చుననీ చెప్పారు. అలాంటి సూచన ఇచ్చిన వారు అంబేద్కర్‌ ఒక్కరే. భర్త ఎంతటి దుర్మార్గుడయినా అతనినే అనుసరించి ఉండాలని ప్రబోధిస్తున్న ధర్మశాస్త్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. భార్య భర్తకు బానిసగా కాకుండా మిత్రురాలిగా ఉండాలన్నారు. అంబేద్కర్‌ ఇది చాలా ఆధునికమైన భావన.

1941లో భారత ప్రభుత్వం హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి దానిని సమకాలీన సమాజావసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి బి.యన్‌. రావు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ దేశమంతా పర్యటించి అభిప్రాయ సేకరణ చేసి హిందూ కోడ్‌ బిల్లు తయారుచేసింది. అది 1946 నుండీ అలాగే ఉండిపోయింది. దానిని పరిశీలించి అసెంబ్లీలో పెట్టాలనుకున్నారు అంబేద్కర్‌. అంబేద్కర్‌ ఆ బిల్లును పరిశీలిస్తున్నారనగానే దేశంలోని సంప్రదాయవాదులు గగ్గోలు పడ్డారు. దానిని ప్రతిఘటించాల నుకున్నారు.

న్యాయశాఖా మంత్రిగా 1951 ఫిబ్రవరి 5న అంబేద్కర్‌ ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్లును పార్లమెంటు (అప్పటి లెజిస్లేటివ్‌ అసెంబ్లీ) ఆమోదించలేదు. ఆ బిల్లులోని ప్రతి అంశాన్నీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చారు. అంబేద్కర్‌ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రి. కాంగ్రెస్‌ వారికి సభలో మెజారిటీ ఉన్నది. అయినా ఆ బిల్లు ఆమోదం పొందలేదు. నిరాశతో నిస్పృహతో ఆక్రోశంతో, ఆవేదనతో ఆయన తన మంత్రి పదవికే రాజీనామా చేశారు (27.9.1951). స్త్రీల హక్కులకోసం పోరాడి మంత్రి పదవి వదులుకున్న మహనీయుడు చరిత్రలో డా. అంబేద్కర్‌ ఒక్కరే.

1951 ఫిబ్రవరి 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆ బిల్లులోని ముఖ్యాంశాలు ఇవి.

1. మగపిల్లలకు తండ్రి ఆస్తిలో ఎంత హక్కు ఉన్నదో ఆడపిల్లలకూ అంతే హక్కు ఉండటం-

2. పిల్లలను దత్తత చేసుకునే హక్కు, దత్తత ఇచ్చే హక్కు స్త్రీలకు కలిగించటం-

3. దత్తత విషయంలో దత్తత తీసుకోబడిన వారితోబాటు దత్తత తీసుకున్న తల్లికీ ఆస్తిలో భాగం ఉండటం-

4. కులాంతర/మతాంతర వివాహాలు అనుమతించటం.

5. బహుభార్యాత్వం రద్దు.

6. భార్యాభర్తలు తమ వివాహాన్ని విడాకుల ద్వారా రద్దు చేసుకోగలగటం-

7. వివాహం వలెనే దత్తు కూడా ఏ కులం నుంచి అయినా తీసుకోగలగటం-

8. ఒక కుటుంబంలోని భాగస్తులందరికీ ఆస్తిలో నిర్ణీత సమభాగాలు-

ఈ బిల్లు అన్ని వర్గాల స్త్రీలకూ ఊరటనిచ్చే బిల్లు, సాధారణంగా సమాజంలో అగ్ర/సంపన్నవర్గాలకే ఆస్తులూ, దత్తత వ్యవహారాలూ ఉంటాయి. శ్రామిక దళిత వర్గాల స్త్రీలకు – గిరిజన/ఆదివాసీ స్త్రీలకూ ఈ బిల్లుతో పనే లేదు. అగ్రవర్ణాలలో ఆస్తులున్న కుటుంబాలలో నిస్సహాయ స్త్రీలకు ఈ బిల్లు కొన్ని హక్కులు కల్పిస్తున్నది.

అయితే ఈ బిల్లు భారత సమాజానికి ఎంత మాత్రమూ నచ్చలేదు. స్త్రీ ధనం కోసమూ వితంతు బాలికల ధనం కోసమూ తాపత్రయపడే వర్ణసమాజం అక్క చెల్లెళ్ళతో ఆస్తి పంచుకోవటానికి ఇష్టపడలేదు. స్త్రీల హక్కుల పట్ల వారికి అంత వ్యతిరేకత ఉంది. ఈ భావజాలానికి కారణం సంప్రదాయమూ – మను ధర్మమూను. భారతదేశ సమాజాన్ని మను ధర్మశాస్త్రం సమాజాన్ని నియంత్రిస్తూ ఉన్నది. సంప్రదాయమూ మను ధర్మమూ పరస్పరాధారితాలు.

మనువు ప్రకారం స్త్రీలు వైదిక కర్మలకు అర్హులు కారు. వారికి జరిపే క్రతుకర్మలలో గాయత్రీ మంత్రం చదవకూడదు. శూద్రులకూ ఇవే నియమాలు వర్తించేవి (మనుస్మృతి 9-10). మనుస్మృతిలో స్త్రీ పురుష ధర్మాలు 336 శ్లోకాలలో చెప్పారు. ఇవి న్యాయ సూత్రాలు కావు గాని వాటిని అనుసరించకపోవటం చట్టరీత్యా శిక్షార్హమవుతుందన్నారు. స్త్రీలకు కామం ఎక్కువ. వారివన్నీ పాపపు ఆలోచనలు. వారు చపల స్వభావులు. రాత్రింబగళ్ళు వారిని కనిపెట్టి ఉండాలి. వారిపై నిఘా పెట్టాలి. వంశ ప్రతిష్ఠ స్త్రీల మీదనే ఆధారపడి ఉంది గనక పుట్టినింటికీ మెట్టిన యింటికీ కీర్తి తెచ్చేది వారే గనక వారిని కనిపెట్టి ఉండాలి. వారినెప్పుడూ ఖాళీగా వదలకూడదు. ఏదో పని చెబుతూనే ఉండాలి. (9 – 26) అంటూ స్త్రీని ఎలా అదుపులో పెట్టాలో మను ధర్మశాస్త్రం చాలా చాలా నిర్దేశించింది. అదే భావజాలం ఇప్పటికీ భారతదేశ సమాజాన్ని ఆవరించి ఉంది. ఇంటి పనుల నిర్వహణలో భారతదేశపు పురుషులు సగటున రోజుకు 19 నిమిషాలు మాత్రం కేటాయిస్తున్నారని ఇటీవలి సర్వేలు (2014) చెబుతున్నాయి. 27 శాతం స్త్రీలు భర్తలు కొట్టటాన్ని సహజంగానే భావిస్తారట.

పురుషస్వామ్యం స్త్రీల శ్రమనూ లైంగికతనూ ఉత్పత్తి శక్తులనూ నియంత్రిస్తున్నదని గమనించటం ఇటీవలి సామాజిక పరిణామం. అంతకు ముందు పితృస్వామిక కుటుంబ నిర్మాణంలో అణచివేతకు గురి అవుతున్నామన్న ఎరుక ఈ దేశపు స్త్రీలకు ఉండేది కాదు. తాము చేస్తున్న పనులు – తమపట్ల అమలవుతున్న ఆంక్షలు – అన్నీ చాలా సహజమైనవిగా నమ్మేవారు.

పూర్వయుగాలలో స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలుండే వంటారు. వారు రాజాస్థానాలలో శాస్త్ర చర్చలు కూడా చేసేవారం టారు. విదేహ రాజయిన జనకుడి సభలో గార్గి అనే విదుషి యాజ్ఞవల్క్యుడు అనే పండితునితో వాదించిందట. గార్గి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పటానికి ఇష్టపడక, ”గార్గీ నీవు అడగరాని ప్రశ్నలు అడుగుతున్నావు. చిరకాలం బతకాలనుకునేవాళ్ళం. ఇలాంటి ప్రశ్నలు అడుగకు” అన్నాడట. దానితో గార్గి ఏవో ఇతర విషయాల మీద ప్రశ్నలు వేసి అతని పాండిత్యాన్ని నిర్ధారించిందట. గార్గి అతనిని పండితునిగా ఒప్పుకుంటే సభ అంతా ఒప్పుకున్నట్టే అని భావించారట. అలాంటి ఉన్నత స్థితి నుండి స్త్రీల స్థానం కాలక్రమంలో దిగజారుతూ వచ్చింది. స్త్రీలను జ్ఞానార్జనకు దూరం పెట్టారు. స్త్రీలూ, శూద్రులూ విద్యలకు అనర్హులు అనే నియమం వచ్చింది. చదువులకూ ఆస్తి హక్కుకూ కూడా వారు దూరం అయ్యారు. సేవాధర్మంతోనే స్త్రీలూ శూద్రులూ బలోపేతులవుతారని శాస్త్రాలు చెప్పాయి. వారిని నమ్మించాయి. స్త్రీలను బలోపేతం చేసేది వారి పాతివ్రత్యమే అనే నమ్మకం బలంగా వ్యాపించింది.

స్త్రీలకు పాతివ్రత్యమూ (పతిసేవ), శూద్రులకు పై వర్గాలను సేవించటమూ కర్తవ్యాలుగా బోధిస్తూ ధర్మశాస్త్రాలు వెలువడ్డాయి. అందుకు ఉదాహరణలుగా బోలెడంత సాహిత్యమూ వచ్చింది. ఇతిహాసాలనిండా అవే కథలు – భారతంలో ధర్మవ్యాధుని కథ – శూద్ర కులాల వృత్తి ధర్మాన్ని బలపరుస్తున్నది. అదే కథలో పాతివ్రత్య మహిమ గురించీ ఉన్నది. ఒక బ్రాహ్మణ పత్ని పతిసేవాధర్మంతోనే ప్రభావ సంపన్నురాలయిందట. కౌశికుడనే బ్రాహ్మణుడు తనపై రెట్టవేసిన కొంగను కోపంతో చూస్తే అది మాడి మసి అయిపోయిందట. ఆ కౌశికుడు ఈ పతివ్రత ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. ఆమె అప్పుడే వచ్చిన భర్తకు భోజనం పెట్టి సపర్యలు చేసే ధ్యాసలో ఉండిపోయి ఈ భిక్షార్ధికి భిక్ష తేవటం ఆలస్యం చేసింది. కౌశికుడు ఆమెను కోపంగా చూశాడు. ”నేనేమీ కొంగను కాను – భస్మమై పోవటానికి” అని ఆమె అన్నది. అప్పుడే పతివ్రతా ధర్మలూ మహిమలూ చెప్పింది. స్త్రీకి బలం పాతివ్రత్యం, ఆమెకు దానితోనే దివ్యదృష్టి, అన్ని చదువులూ- శక్తులూ- వచ్చేస్తాయి- అని ఇక్కడ తాత్పర్యం. ఇలాంటి భ్రమలతో స్త్రీలు అణచివేతకు గురయ్యారు. ఇంకా గురి అవుతూ ఉన్నారు. మధ్య యుగాలలోనూ ఆధునిక యుగంలోనూ కూడా ఇలాంటి వారు కనిపిస్తారు. సూర్యుడిని ఉదయించకుండా శాసించిన పతివ్రత కథ కూడా ఒకటి ఉంది. ఈ కథ నిశితంగా పరిశీలిస్తే కనిపించే వాస్తవాలు విభ్రాంతి కలిగిస్తాయి. పరస్త్రీ సంగమం కోరిన భర్తను (అతడు వ్యాధిగ్రస్తుడు) గంపలో పెట్టుకుని అర్థరాత్రి తీసుకుని వెళ్తున్నది సుమతి. దారిలో వధ్యస్థానంలో కొరత వేయబడ్డ ఒక నేరగాడికి ఆ గంప తగిలింది. అతని గాయం రేగి, ” నా గాయాన్ని రేపిన వాడు తెల్లవారేసరికి చస్తాడు” అని అతడు శపించాడు. సుమతి పతివ్రత. తెల్లవారకుండా, అంటే మర్నాడు సూర్యుడు ఉదయించ కూడదని శాసించింది. అంతే. సూర్యుడు ఉదయించ లేదు. లోకాలన్నీ చీకటితో అల్లాడిపోయాయి. అప్పుడు దేవతలంతా సతీ అనసూయను ప్రార్థించి – ఆమెచేత సుమతికి చెప్పించి సమస్య పరిష్కరించారు. ఆ పరిష్కారం ప్రకారం సుమతి తనమాట వెనక్కి తీసుకుని సూర్యుడిని ఉదయించనిచ్చింది. నేరగాని శాపం ప్రకారం సుమతి భర్త (ఇతని పేరు కౌశికుడే) మరణించాడు. అతనిని అనసూయ తన పాతివ్రత్య మహిమతో బతికించింది. ఈ కథ మార్కండేయ పురాణంలో ఉంది. ఈ కథ ప్రకారం పతివ్రతలకు శాపానుగ్రహశక్తి ఉంది. సరే. అయితే నేరగాడైన పురుషునికీ శపించే శక్తి ఉన్నది. ఈ శక్తులను ఎలా అర్థం చేసుకోవాలి? అనసూయ వరకూ వెళ్ళకుండా సూర్యుడు ఉదయించగానే చనిపోయే భర్తను సుమతి తన మహిమతోనే బతికించుకుని ఉండవచ్చుకదా? లాంటి ప్రశ్నలకు ఇక్కడ చోటు లేదు. ప్రశ్నించకూడదు అంతే.

ఇలాంటి భావజాలంలో స్త్రీలున్నారు. స్వాతంత్య్రంలో సేవాధర్మమూ స్త్రీ శరీరమూ కూడా ప్రధానాంశాలే. ఒక్కొక్కసారి స్త్రీ శరీరమే ప్రధానమయింది. సంతానోత్పత్తి కోసమే వివాహం. ఆస్తికి వారసులను ఇచ్చేందుకే స్త్రీ అనే సంగతి స్పష్టంగానే శాస్త్రాలలో చెప్పారు. క్రతు కర్మకాండలలో పుత్ర కామేష్టి, అశ్వమేధం వంటి యజ్ఞాలలో స్త్రీలు అనుభవించిన లైంగిక హింస చెప్పరానిది. ఆ చరిత్ర అంబేద్కర్‌కు తెలుసు. ఆయన ప్రబోధాలు ఆలోచింప జేసేవిధంగా ఉండేవి.

”ఆధ్యాత్మిక చింతన మంచిదే గాని, దానికంటె ముందు భౌతిక అవసరాల గురించి ఆలోచించండి. అవి పొందటానికి ప్రయత్నించండి” అనేవారు అంబేద్కర్‌.

”దేవునిమీద మానవాతీత శక్తుల మీద ఆధారపడటంకంటె స్వశక్తిని నమ్ముకోండి” అని చెప్పేవారు.

అంబేద్కర్‌ కంటే ముందు స్త్రీల సమస్యల గురించి పోరాటం చేసిన వారూ, సంస్కరణలు తెచ్చిన వారూ చాలామంది ఉన్నారు. అయితే అవన్నీ మనుధర్మ శాస్త్ర పరిధిలోనే జరిగాయి. అవి సమాజావసరాలకు అనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దాయి తప్ప వారికి హక్కులు ఇవ్వలేదు. ఇవ్వాలనీ అనుకోలేదు. స్త్రీలు పురుషులతో సమంగా పురోగమించాలంటే వారికీ హక్కులుండాలని అంబేద్కర్‌ గుర్తించారు. ఆస్తితోనే పురుషుల పెత్తనానికి బలం వస్తున్నదనీ గ్రహించారు. కాబట్టే హిందూ కోడ్‌ బిల్లును సమగ్రం చేసి ప్రవేశపెట్టారు.

స్త్రీలు సామాజికంగా, రాజకీయాలపరంగా ముందుకు రావాలి. వారి తోడ్పాటుతోనే సమాజం పురోగతి సాధిస్తుంది. వారివల్లనే జరిగే పనులు చాలా ఉన్నాయి. అని అంబేద్కర్‌ చెబుతుండేవారు.

”స్వేచ్ఛ అనేది సంపదను అనుసరించి ఉంటుంది. స్త్రీ తన సంపదనూ హక్కులనూ రక్షించుకోగలిగినప్పుడే ఆమెకు విలువ, అప్పుడే ఆమె స్వేచ్ఛనూ గౌరవాన్నీ పొందగలుగుతుంది” అనేవారు అంబేద్కర్‌. ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్లు అప్పుడు పూర్తి ఆమోదం పొందకపోయినా అందులోని అంశాలన్నీ కాలక్రమంలో చట్టాలయ్యాయి. ఆ చట్టాలను ఆధునిక స్త్రీలు ఉపయోగించుకోవాలి. ఆ ఫలితాలను అందుకోవాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం స్వేచ్ఛ మహిళలకు లభిస్తాయి. స్త్రీలను బలోపేతం చేసేవి అవే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో