మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

నూతన సహస్రాబ్ది మహిళా ఉద్యమం ప్రపంచీకరణ సందర్భం నుండి కొత్త సవాళ్ళకు జవాబుగా కొత్త స్వభావాన్ని సంతరించుకొంటూ కొత్త రూపాలతో విస్తరిస్తున్నది. యునైటెడ్‌ నేషన్స్‌ 2000 సెప్టెంబరు 6-8 తేదీలలో న్యూయార్క్‌ సిటీలో జరిపిన నూతన సహస్రాబ్ది సదస్సు (న్యూ మిలినియం సమ్మిట్‌) ఆధికారికంగా ప్రకటించిన అంతర్జాతీయ అభివృద్ధి సూత్రాలతో ఎనిమిదింటిలో ప్రత్యక్షంగా మహిళలకు సంబంధించినవి రెండు. ఒకటి జండర్‌ సమానతకు, మహిళా సాధికారతను సాధించటం కాగా మరొకటి ప్రసవ మరణాల రేటును తగ్గించటం. 2005 నాటికి చిట్టచివరికి 2015 నాటికి సమాజాన్ని మానవీయం చేయటానికి అన్ని దేశాలు ఈ లక్ష్యాలను సాధించాలని ఆ సభ సూచించింది. ఈ నేపథ్యంలోనే భారతప్రభుత్వం అత్యుత్సాహంగా 2001లో మహిళాసాధికారతా విధానాన్ని ప్రకటించటమే కాదు, ఆ సంవత్సరాన్ని సాధికారతా సంవత్సరంగా ప్రకటించింది. సాధికారతా సాధనకు దేశం నిర్దేశించుకొన్న గడువు 2010. అది తీరిపోయింది. ఇక యుఎన్‌వో నిర్దేశించిన గడువు 2015 దానికి రెండేళ్ళ దగ్గరకు వచ్చేశాం. సాధించిందేమిటి? మహిళలు ఏదో ఒక విషయం మీద ఎక్కడో ఒకచోట పోరాడకుండా రోజు గడవకపోవటం ఈ పన్నెండేళ్ళ అనుభవం. ఆ లక్ష్యానికి ఈ వాస్తవానికి వైరుధ్యం ఎక్కడుంది?

జండర్‌ సమానతను సాధి కారతను సాధించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయటానికి మానవహక్కులను, పౌర రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులను కాపాడటానికి హామీ పడాలని, ప్రజా స్వామ్య సూత్రాలను ఆచరణలోకి తీసుకురావటంలో భాగంగా మైనారిటీ హక్కులకు పూచీ పడాలని స్త్రీల మీద ప్రయోగింపబడుతున్న అన్ని రకాల హింసలను సమర్థవంతంగా ఎదుర్కొనాలని చెప్పిన యునైటెడ్‌ నేషన్స్‌ మిలినియం డిక్లరేషన్‌ (55/2, ఎ/ఆర్‌ఇఎస్‌/55/2, 18 సెప్టెంబర్‌ 2000) ప్రపంచ ప్రజలందరికీ అనుకూలమైన శక్తిగా ప్రపంచీకరణను గురించి హామీ ఇచ్చే బాధ్యతను కూడా చేపట్టింది. ఇప్పుడేవో కొన్ని అసమానతలు, అందరికి ప్రయోజనాలు అందులో కనబడకపోయినా అందరికీ గొప్ప అవకాశాలను అందుబాటులోకి తెచ్చేది అదేనని అందరినీ సంపూర్ణంగా కలుపుకొనే విధంగా, అందరికీ సమంగా ప్రయోజ నాలు అందే విధంగా ప్రపంచీకరణను రూపొందించుకోవటం ఇప్పుడు అందరి ముందున్న కీలకమైన సవాల్‌ అని పేర్కొన్నది. ప్రపంచీకరణను అనుకూల విధానాల రూపకల్పనలో ప్రపంచీకరణకు ఆమోదాన్ని కల్పించే పనిలో తలమునకలైన దేశీయ ప్రభుత్వానికి – జండర్‌ సమానత సాధికారత, స్త్రీలపై హింసలేని సమాజం, ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలు అప్ర ధాన అంశాలు కావటంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచీకరణను వేగవంతం చేయ టానికి తపించటం, సామాజిక న్యాయానికి సంబంధించిన మాటలను మంత్రాలుగా జపించటం ఈ రెండింటికీ మధ్యవున్న వైరుధ్యం నేపథ్యంలో ఈ దశకపు మహిళాఉద్యమ గమనాన్ని చూడాలి.

ఈ కాలంలో పదవ పంచవర్ష ప్రణాళిక 2002-2007) పదకొండవ పంచవర్ష ప్రణాళిక (2007-2012) అమలయ్యాయి. అక్షరాస్యతలో, వేతనా లలో లింగవివక్షను, వ్యత్యాసాన్ని తగ్గిం చటం, జనాభాలో స్త్రీపురుష నిష్పత్తిలోని తేడాను నియంత్రించటం, ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా స్త్రీలు 33 శాతం ఉండేట్లు జాగ్రత్తపడటం ఈ ప్రణాళికలలో స్త్రీలకు సంబంధించిన లక్ష్యాలు. మహిళా సాధికారతా విధాన ప్రకటన తరువాత కూడా ప్రణాళికా లక్ష్యాలు మహిళలకు సంబంధించిన ప్రాథమికాంశాలకు తప్ప సంబోధించలేని స్థితి వుందంటే ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకించక తప్పదు. పైగా పేదరిక నిర్మూల నకు, అభివృద్ధి సాధనకు మిలీనియం డిక్లరేషన్‌ నొక్కిచెప్పిన ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం పట్ల ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట వేయటంపట్ల ఎక్కువ శ్రద్ధ ఈ కాలంలో కనబడుతుంది.

నూతన సహస్రాబ్దిలో మొదటి పెద్ద మహిళా ఉద్యమం అంగన్‌వాడీ మహిళలది. ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌ మెంట్‌ సర్వీసు స్కీమ్‌ కింద బడివయసుకు రాని పేద బాలబాలికల సంరక్షణకోసం 1975లోనే ఏర్పరచబడిన కేంద్రాలు అంగన్‌వాడీలు. ఆరేళ్ళ వయసులోపల పిల్లలకు ఆహారం, ఆరోగ్యం, విద్య అందిం చే పనిచేయటానికి అక్కడ మహిళలే ఉద్యోగులుగా వుంటారు. ఒక కేంద్రానికి ఒక టీచరు, ఒక సహాయకురాలు తప్పనిసరి. గర్భిణీస్త్రీల ఆరోగ్యం, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం చూచుకోవలసింది వాళ్ళకు ఆహారం పంపిణీ చేయాల్సింది కూడా ఈ మహిళలే. అతితక్కువ వేతనాలు తదితర సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌ వాడీ మహిళలు రాష్ట్రం నలుమూలల నుండి వేలకొద్దీ తరలివచ్చి ర్యాలీ నిర్వహిం చారు. 2000 సంవత్సరం మార్చి 30న జరిగిన అంగన్‌వాడీ ఉద్యోగ మహిళలు జరిపిన ఈ ప్రదర్శనను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు గుర్రాలతో, నీళ్ళట్యాంకులతో దాడి జరిపారు. గుర్రాలతో వాళ్ళను డొక్కల్లో తన్నించి, కడుపు మీద తన్నించి, భాష్పవాయువు ప్రయోగించి, పైపులతో నీళ్ళు కొట్టి రోడ్డుమీద దొర్లించి కొట్టి ఇందిరాపార్క్‌ సందుగొందుల్లోకి తరిమితరిమికొట్టి అత్యంత భీభత్సాన్ని సృష్టించారు. జండర్‌ వివక్షను తగ్గించటం, స్త్రీలపై హింసను ప్రతిఘటించటం, సమాన అవకాశాలు కల్పించటం అన్నవాటిని సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వాలు స్త్రీల పిల్లల సంక్షేమం కోసం ఏర్పరచిన ఉద్యోగవ్యవస్థ లోని మహిళల కోరికలను వినటానికి, అవసరాలను పట్టించుకొనటానికే సిద్ధంగా లేవు అంటే ‘మహిళాసాధికారత’ దిశగా వాటి ప్రయాణం ఎలా వుంటుందో ఊహిం చుకోవచ్చు.

అదే సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్‌ చార్జీల పెంపుకు నిరసనగా హైదరాబాదులోని బషీర్‌బాగ్‌ వద్ద ప్రజాస్వామిక సంస్థలు అనేకం కలిసి వేలమంది ప్రజలతో ప్రదర్శన చేసినప్పుడు ఆ మొత్తం ప్రదర్శనపై జరిగిన పోలీసుదాడిలో స్త్రీలను గురిచూచి కొట్టటం కనబడుతుంది. ఉద్యమాలలో స్త్రీల భాగస్వామ్యాన్ని సహించలేని, భరించలేని ప్రభుత్వం సాధికారత సాధనకు చిత్తశుద్ధితో పనిచేయగలదా అన్న ప్రశ్న రాక మానదు.

2001ని మహిళాసాధికారతా సంవత్సరంగా ప్రకటించిన సందర్భంలో మహిళాసాధికారతకు సంబంధించిన జాతీ య విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనువర్తిం పచేస్తూ అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం ప్రజాభిప్రాయసేకరణకు స్త్రీల సాధికారతా వ్యూహపత్రాన్ని విడుదల చేసి చర్చకు పెట్టింది. లింగవివక్షను తొలగించటానికి నాలుగు లక్ష్యాలను ప్రకటించిందీ పత్రం. అవి : (1) లింగవివక్షకు వ్యతిరేకంగా నూతన చైతన్యాన్ని అభివృద్ధి పరచటం (2) ఆర్థిక స్వావలంబన కల్పించటం (3) స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి లింగ దృక్పథాన్ని అభివృద్ధిపరచటం (4) అత్యాచారాలను నిరోధించటం – అయితే వీటిని సాధించటా నికి కొత్తగా అభివృద్ధిపరచు కొనవలసిన దృక్పథం గురించి కానీ, కొత్తగా రూపొం దించుకొనవలసిన కార్యక్రమాల గురించి కానీ ఈ పత్రం ఏమీ ప్రస్తావించలేదు, ప్రతిపాదించలేదు. ఆర్థిక స్వావలంబన స్వయం సహాయక బృందాల ఏర్పాటు రూపాన్ని తీసుకొన్నది. 2011 నాటికి 1.10 కోట్ల మంది స్త్రీలు 9.75 లక్షల స్వయం సహాయక బృందాల క్రింద సమీకృ తం కావటం ఇది ఎంత వేగవంతంగా జరిగిందో సూచిస్తుంది. 2011 నాటికి 1.10 కోట్లమంది స్త్రీలు స్వయంసహాయక బృందాలలో వుంటే 2012కు అది 1.45 కోట్లకు చేరింది. ఉన్నతవిద్యతో కానీ, నైపుణ్యాలకు ప్రాధాన్యమున్న ఉద్యోగ వ్యవస్థలతో కానీ, సంబంధం లేకుండా స్త్రీలు స్వయం ఉపాధికి, పరిమితమై స్వల్ప ఆదాయాలతో సంతృప్తిపడి సర్దుకుపో యేందుకే ఇవి తోడ్పడ్డాయి. పైగా సులభ కారణాల పేరుతో ఇష్టం వచ్చినంత వడ్డీతో అప్పులిచ్చే మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు ప్రోత్సాహమిచ్చి పేద మహిళలను అప్పుల విషవలయం లోకి నెట్టి ఆత్మహత్యలవైపు నడపటం ఈ దశకపు విషాదం.

ఇక స్త్రీల ఆరోగ్యానికి సంబంధిం చిన చర్యలు మాతాశిశు మరణాలరేటును తగ్గించటాన్ని ఉద్దేశించినవి. ఇందుకోసం భారతప్రభుత్వం రూపొందించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యపథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2005 అక్టోబరు నుండి అమలు లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించే ‘జననీ సురక్ష యోజన’ పథకం వచ్చింది. ఈ పథకం కింద ఆసుపత్రి ప్రసవాలు ఎక్కువ గా ప్రైవేటు ఆసుపత్రులలోనే జరగటం వైద్యరంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ఎక్కువవుతుండటాన్నే సూచిస్తుంది. అలాగే ప్రసవ ఆరోగ్యంలో పురుష భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి పురుషులు ముందుకు వస్తే ప్రభుత్వం డబ్బురూపంలో ప్రోత్సాహ కాలు ప్రకటించినా స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవలసి రావటం లింగవివక్షకు వ్యతిరేకంగా నూతన చైతన్యాన్ని అభివృద్ధిపరచటంలోని వైఫల్యాన్నే సూచిస్తుంది. ఇక అత్యాచారాల నిరోధం సంగతి చూద్దామా అంటే స్త్రీల మీద అత్యాచారాలు ఈ దశకంలో మరింత ఆందోళనకరంగా పెరిగాయి. ఆ క్రమంలో ఆంధ్రదేశంలో మహిళా ఉద్యమమూ ఉధృతమైంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో