పోలవరం నిర్మాణం – జీవన్మరణ సంక్షోభం – అనిశెట్టి రజిత

అస్తిత్వ పోరాటాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాటికి ముగింపు అంటూ లేదు అని చరిత్ర కాల పరిస్థితులు తెలియజేస్తున్నవి.
ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా అణగారిన ప్రజల గాథల బాధలన్నీ ఒక్కటే. వారు రెడ్‌ ఇండియన్లా.. నల్ల జాతీయులా లేక మన దేశంలోని గిరిజన ఆదివాసీలా? ఎవ్వరైనా వారి వెనుకబడిన తనం, పేదరికం, లోకజ్ఞానం లేనితనం, వెలివేతలు అన్నీ ఒక్కటే.. అంతటా ఒక్కటే..
వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని అరిచి గీపెట్టుతూ…. అభయారణ్యాలకు అభయమిస్తున్నారు… వాటి పరిరక్షణకు కొద్దో గొప్పో చర్యలు తీసుకుంటున్నారు. వాటి రక్షణకు పూనుకోవాలి కూడా… అయితే కొన్ని ప్రాణులను కాపాడుకోవడానికి మరికొన్ని ప్రాణులను బలిచేయడం అన్యాయమే కదా!

ఎంతటి సమస్యకైనా ప్రత్యామ్నాయ పరిష్కారం అంటూ ఒకటుంటుంది. దాని మీద దృష్టి పెట్టడమే కావాల్సింది. చట్టాలు చేసిన అధికారమే ఆ చట్టాల్ని ఉల్లంఘిస్తే అది ప్రభుత్వం అవుతుంది. ప్రజలు పనికిరాని, హాని చేస్తున్న చట్టాలను ఉల్లంఘిస్తే అది ప్రభుత్వ వ్యతిరేక నేరం అవుతుంది.

జల్‌ జంగిల్‌ జమీన్‌ల మీద వనవాసులు సహజమైన హక్కు కలిగి ఉంటారు. అది వారి జన్మతః సంక్రమించిన సంపద. దాన్ని కొల్లగొట్టి వాళ్ళని అక్కడి నుండి వెళ్ళగొట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రభుత్వం అభివృద్ధి పేర దౌర్జన్యం చేస్తే అది అన్ని నేరాలకన్నా పెద్ద నేరం. దశాబ్ద కాలంగా సుస్థిర అభివృద్ధి (ఐతిరీశిబిరిదీబిలీజిలి ఈలిఖీలిజిళిచీళీలిదీశి) గురించి చాలా మాట్లాడుతున్నారు. అదే కోవలో భద్రతతో కూడిన అభివృద్ధి (ఈలిఖీలిజిళిచీళీలిదీశి గీరిశినీ ఐలిబీతిజీరిశిగి) గురించి ఎందుకు ఆలోచన లేదు? ఎందుకు పట్టించుకోరు?

అడవి లేని బతుకు లేదు వాళ్ళకు. ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఏర్పర్చినా తల్లి వేరు నుండి తెంచబడిన వాళ్ళ అస్తిత్వం కుదురుకోదు. అడవికి బయట జీవితం అంటూ వాళ్ళ ఊహకుండదు. ఏ నాగరికతా, ఏ మైదాన ఔదార్యం, సంస్కృతీ వాళ్ళు ఇముడ్చుకోలేదు. వాళ్ళసలు ఇమిడే ప్రసక్తి లేదు. పునరావాసం అనేది అరణ్యవాసాన్ని మరిపించలేదు. దానికి సాటీ రాదు.

పాలకులు, రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వారి వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నదీజలాలను మళ్ళించుకునే ప్రయత్నాలు చేస్తుండటం వల్లే ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం – ముంపు – నిర్వాసితులు’ అనే జటిల సమస్యలు, సంక్షోభాలు తలెత్తుతుంటాయి.

ఇలాంటి ఘోర విధ్వంసాలకు బలయ్యేది అట్టడుగు ప్రజానీకం – కోయదొరలు, కొండరెడ్లు, గొత్తికోయలు మొదలగు ఎన్నో ఆదివాసీ తెగల ఉనికే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడనుంది.

హఠాత్తుగా మైదానాల్లోని ఇళ్ళ కాలనీల్లోకి వాళ్ళను మారిపొమ్మంటే… రోజూ దినచర్య, దినగ్రాసం ఏ విధంగా జరుగుతుంది? ఏం దొరుకుతుంది? ఆ రుతువుకారుతువు పండ్లు, ఫలాలూ, ఆకులూ, గడ్డలూ, పోడు వ్యవసాయాలతో నిశ్చింతగా కాలం వెళ్ళదీసే ప్రకృతి బిడ్డలను సిమెంటు కంకర గూళ్ళలో కమ్మేస్తామంటే అది ఏ రకం నాగరికత? వలస-ముంపు, పునరా వాసం – నష్టపరిహారం వీటిని ఏ తరాజుతోనూ సమంగా తూచలేరు.

మొత్తానికి సీమాంధ్ర లాబీయింగ్‌ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేట్టు చేసుకున్నది. జాతీయ లాభాలు, సాఫల్యాలు ఏమిటో ఎన్నో గానీ అపురూపమైన అటవీ జాతుల ప్రాణులు అంతరించిపోనున్నాయి.  ఈ జాతుల అస్తిత్వం కాపాడటం జాతీయ ధర్మం కాదా?

గిరిజనుల, ముంపు గ్రామాల వ్యవసాయ ఆధారిత పౌరుల జీవన విధానాన్ని సమూలంగా ధ్వంసం చేసే విపత్తు ఈ ప్రాజెక్టులో అంతర్భాగం కానుంది.

ఎన్ని విధాల ఆలోచించినా పోలవరం అనేది పెద్ద కుట్రలా అనిపిస్తుందే గానీ, అది లక్షల ఎకరాల పంటభూములకు నీరందించే వరంలాంటి ప్రాజెక్టు అనిపించదు.

రాష్ట్రంలో మొదట తెలంగాణలో ఉన్న ముంపు గ్రామాల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేంద్రం చేరిన బిల్లులో ముంపు గ్రామాల్ని (7 మండలాలు) ఆంధ్రాలో కలపడం ఒక క్రూరమైన పరిహాసం…

గత దశాబ్ద కాలంగా రగులుతున్న ఈ డ్యామ్‌ నిర్మాణం సమస్య ఇప్పుడు మెడమీద వేళ్ళాడుతున్న కత్తిలా రంగం మీదికొచ్చి నిప్పుల కొలిమిలా సెగపెడుతున్నది.

జీవించే హక్కు మైదాన ప్రాంత సోకాల్డ్‌ నాగరికులు, సభ్య సమాజికులకేనా ? ఆదివాసులకు… పల్లెవాసులకు జీవించే హక్కు లేదా? దాన్ని గౌరవించి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా?

ముంపు ప్రాంతాలు/గ్రామాలు

ఆంధ్రప్రదేశ్‌లో    275 గ్రామాలు

ఒడిశాలో        13 గ్రామాలు

ఎ.పి.లో ఖమ్మం జిల్లాలో    205 గ్రామాలు

నిర్వాసితులు అయ్యేది – 276 గ్రామాల్లోని 27000 కుటుంబాలు, 1 లక్షా 17 వేల మంది ప్రజలు నిర్వాసితులు అవుతారు. ఇప్పటి అంచనాల ప్రకారం ముంపు గ్రామాల సంఖ్య 300 కాగా, నిర్వాసితులు 2 లక్షల మందికి పెరిగే అవకాశం ఉన్నది. 150 అడుగుల నీటిమట్టం దగ్గర 299 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి.

ఒకవైపు పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు పోలవరం నిర్మాణం వల్ల కలగబోయే నష్టాలను, ప్రమాదాలను, వినాశనాలను వివరంగా చెప్పి చెప్పి విసిగిపోయారు. పాలకులకు వినబడనితనం అనేది ఒక వరం. పాలితులకు కనిపించేవి, వినిపించేవి దారుణమైన శాపాలు.

ఈరోజున పోలవరం ప్రాజెక్టును ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విచారణ ప్రభుత్వమే కదా చేయవలసింది!

‘జలయజ్ఞా’లనేవి ఏనాడైనా గానీ ప్రభుత్వాలకు చాలా ప్రతిష్టాత్మకమైనవే… భారీ నిర్మాణాలకు ప్రభుత్వమే పూనుకుంటుంది. కాబట్టి అందుకు వేరెవ్వరి అనుమతులూ అవసరం లేదు అంటుంది… నిజమే కదా! ప్రజలు స్వాములు కాదు, బానిసలు మరి… మానవహక్కుల ఉల్లంఘన గురించి ప్రాథమికంగా పరిశీలించిన తరవాతనే ఏ భారీ ప్రాజెక్టుకైనా అనుమతిని ఇవ్వాలి… చట్టం తేవాలి… ఆయా ప్రాజెక్టుల గురించి సమగ్ర నివేదికలు తెప్పించుకొని అధ్యయనం చేయాలి. బలవంతంగా నిర్వాసితులను చేస్తున్నవాళ్ళను ఆదుకుంటాం అంటుంది… వాళ్ళకే కష్టమూ రానివ్వం అంటుంది.

ఖమ్మం జిల్లా గోదావరి, శబరి, సీలేరు నదీలోయల ప్రాంతాలైన ఏడు మండలాలు ఏజెన్సీ ప్రాంతాలే… ఇక్కడ ఆదివాసీల స్థావరాలే (జనాభా) ఎక్కువ. కూనవరం, భద్రాచలం, బూర్గంపాడు, చింతూరు, కుకునూరు, వేలేరుపాడు, వి.రాచంద్రాపురం మండలాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలే. సగం జనాభా ఆదివాసులైన కోయ, కొండరెడ్ల తెగలవాళ్ళే.

పునరావాసంలో న్యాయం జరగదు. ఆదివాసుల, ఇతర నిర్వాసితుల జీవన ప్రమాణాలు దిగజారిపోతాయి. అడవి బదులుగా అడవి, సాగుభూమికి బదులుగా సాగుభూమిని పునరావాసంలో ఇవ్వడం జరగదు.

ఇప్పుడున్న అడవుల్ని అభయారణ్యాలుగా ప్రకటించి గిరిజనులకు పత్రాలు ఇవ్వడం నిలిపివేసారు. ఉండబోతే తమదైన అడవి లేకుండా, వెళ్ళబోతే ఎక్కడా బారెడు నేల లేకపోగా ఈ మడతపేచీల పునరావాసం ఏవిధంగా చేస్తారో అంతుబట్టదు.

పునరావాస కాలనీల్లో అటవీ ఉత్పత్తుల జాడ ఉండదు. కేవలం వాటి మీదనే ఆధారపడి జీవిస్తూ అస్తిత్వం కొనసాగుతున్న జాతులు, తెగలు ఏ వృత్తుల్లోకి వెళ్ళగలరు. వారికోసం వృత్తులూ, ఉపాధులూ ఏర్పర్చే భరోసా ఏమైనా ఉందా? అనగనగా ఒక పల్లెలో ఒక పేద కుటుంబం, దాని యజమాని రోజూ ఉదయం సమీపంలోని అడవిలోకి పోయి చీకట్లు ముసరకముందే కట్టెలు కొట్టుక తెచ్చి ఇరుగు పొరుగు ఊర్లలో, పట్నాలలో అమ్మి ఆ డబ్బుతో ఇల్లు నెట్టుకొస్తుంటాడు. ఒక పల్లెలో పేద కుటుంబంలోని స్త్రీ రోజూ సమీప అటవీ ప్రాంతానికి పోయి చీపురు పుల్లలు కోసుకొచ్చి చీపుర్లు కట్టి ఊర్లలో అమ్మి జీవనం సాగిస్తుంది… లాంటి లెక్కలేనన్ని పిట్ట కథలు అర్థం లేకుండా పోతాయి.

నోర్లు లేని ప్రజల నోర్లు కొట్టడం అనేది పాలకులకు కొట్టిన పిండితో సమానం.

గోదావరి నది ఒడ్డున ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతే… నీటి ఆధారిత వాళ్ళ బ్రతుకులు వేరే చోట ఇరుకు కాలనీల్లో ఎలా నిలదొక్కుకుంటాయి. అభివృద్ధి జరుగుతుంది. దాన్ని ఎంత శాతం అని మాత్రమే లెక్కగడ్తారు. అభివృద్ధి ఎవరికి ఎంత అనేది అసమతుల్యం అయితే దానిపట్ల వ్యతిరేకతా, నిరసనే పెల్లుబు కుతుంది. అభివృద్ధి సమతుల్యమైతే అందరి ఆదరణా, సహకారం ఉంటుంది. ప్రజల ప్రభుత్వం సమతుల్య అభివృద్ధి విధానాలే రూపొందిస్తుండాలి కదా…

పదివేల ఎకరాల అటవీ భూమిని ప్రాజెక్టు కింద ముంచిన తరవాత దానికి ప్రత్యామ్నాయ వనరులతో కూడిన భూమిని ఎక్కడ చూపించగలరు? ఎన్నో శాఖల, ఎన్నో సంఘాల అనుమతితో కావాల్సిన ఈ నిర్మాణం ఏ అనుమతీ లేకుండా ఏకపక్ష నిర్ణయ నియంతృత్వంతో ప్రభుత్వం చేయాలనుకుంటున్నది. సాంఘిక సంక్షేమ శాఖ అనేది ఒకటుంది. దాని అనుమతి ప్రజల శ్రేయస్సు దృష్ట్యానైనా తప్పక అవసరం అవుతుంది. దాన్నీ విస్మరించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేకుండానే వందలాది గ్రామ పంచాయితీలు మాకు ముంపు వద్దు, మమ్మల్ని ఆంధ్రలో కలపడమూ వద్దంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానాలను తుంగలో తొక్కి ఎందుకీ కసిమీరిన కౄర చర్యలు?

టెండర్లు పాడుకొని కోట్లు దండుకోవచ్చనే రాజకీయ రాబందుల కోసమేనా? ఆదివాసీల పట్ల విద్రోహ రచనలు చేయడం కూడా ఒక పాలనా అభివృద్ధి విధానమేనా? ఆదివాసుల స్వయం జీవన హక్కు, స్వయం పాలనా హక్కు మైదాన ప్రాంత పాలకుల బూట్లకింద రక్తసిక్తం కావాల్సిందేనా? 1/70 చట్టం అమలును కల్లగా చేసే కుతంత్రమేనా? స్వయం ప్రతిపత్తి, ఆదవాసీల స్వావలంబనకు నిలయమైన పోరాట ప్రాంతాన్ని మట్టుబెట్టే దుండగీతనమేనా?

గోదావరి, శబరి నదీ లోయ ప్రాంతాలన్నీ ఇక కుళ్ళిన శవాలతో మురుగునీళ్ళ కంపేనా?

భద్రాద్రి శ్రీరాముడు మావాడేనని వాదులాడుకున్నారు. మరి గోదావరీ, శబరీ నదులు ఎవరివని కుదించి మాయం చేయనున్నారు. ఏది ముంపుకు గురైనా నష్టపోయేది ఆదివాసులే. వారికి మనమీ ప్రాజెక్టు ద్వారా చేస్తున్న విద్రోహం – రాష్ట్రం ప్రత్యేకమైనది. ఆవిర్భావం జరిగి స్వపరిపాలనా అడుగులు వేస్తున్నది – సరిగ్గా అదే సందర్భంలో ఆదివాసులకు అడవి, నదులకు, గ్రామాల పట్ల విద్రోహం జరుగుతున్నది. విపరీతం జరుగుతున్నది. జలయజ్ఞాలంటే కన్నీటి యజ్ఞాలనే అర్థం చేసుకోవాల్సి వస్తున్నది.

ప్రజాకవి కాళోజీ ఆశించింది తెలంగాణ దేశాన్ని. దేశమంటే ఆంక్షలు, నిషేధాలు లేని సంపూర్ణ భౌగోళిక స్వతంత్ర ప్రాంతం – ఇచ్చినట్టే ఇచ్చి చిల్లుపడి నెత్తుర్లు కారేట్టు గిల్లడం మాత్రం తమ చేతుల్లో పెట్టుకున్నారు. ‘ఆదివాసుల భౌగోళిక పరిపాలనా హక్కుల’ గురించి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. దాని సంపూర్ణ ఉల్లంఘన వికృత రూపమే ఇప్పుడు మనం ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణంలో చూస్తున్నది.

అసలు మనం హక్కుల ఉల్లంఘనలు, దోపిడీ విధానాల్ని మన పాలక ప్రభుత్వాల నుండి పాఠాలుగా బహు చక్కగా ఎప్పటికప్పుడు నేర్చుకొని అనుసరించవచ్చు. మనమే డెమొక్రసీకి వాచ్‌డాగ్‌లం. మనమే డెమొక్రసీని రక్కి గాయపరిచే వేటకుక్కలం. బహుశా అదే చేస్తున్నామేమో కూడా! ప్రజాస్వామ్య స్వేచ్ఛా భారతదేశ ప్రజలం కదా! మనమే కదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదీ! మనమే కదా పాలనాధికారం చెలాయిస్తున్నదీ! రాజ్యాంగం సాక్షిగానే అన్నీ జరుగుతున్నాయని నిస్సిగ్గుగా నిస్సంకోచంగా విశ్వసించుకుందాం…

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.