వర్తమాన లేఖ – డా|| శిలాలోలిత

డియర్‌ గీతా !
ఎలా ఉన్నావ్‌? నిన్న నీ వుత్తరం చూసాక చాలా సంతోషంగా అన్పించింది. ఎంత బాగా రాసావో తెల్సా? నిన్ను చూడక చాలా రోజులైందన్న దిగులంతా పోయింది. నిజం ! అక్షరాలా నిన్ను చూసాను. నీ మాటల్లో ఆత్మీయతను చూశాను. నిజమైన స్నేహితులు మన పక్కనుంటే అంతకు మించిన సిరిసంపదలేముంటాయి చెప్పు. ‘జయకాంతన్‌’ నవల ‘ఒక మనిషి… ఒక ఇల్లు… ఒక ప్రపంచం’ నిన్న చదివాను. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తమిళ నవల అది. మనం కొన్నాళ్ల క్రితం కలిసి చదివాం గుర్తుందా నీకు. ‘కొన్ని సమయాలలో, కొందరు మనుషులు’- అని అది గుర్తొచ్చింది. జయకాంతన్‌ పాత్రలన్నీ నేలమీద కాలుపెట్టి నిలిచేవే ! సంఘటనలున్న స్పందనలు కూడా మనింట్లోనో, బంధువుల ఇంట్లోనో చూసినట్లే ఉంటాయి. ‘పల్లేరు బాలాజీ’ అనువాదం చేస్తే హెచ్‌.బి.టి. వాళ్ళు వేశారు. ‘హెన్రీ’ కల్పనాలంకారంలా కన్పిస్తున్నాడన్న విమర్శని కాదనలేం కానీ, ఐడియలిస్ట్‌గా ఉంటుంది. ఒక ఒంటరి మనిషి ఆశలూ, భయాలు, నమ్మకాలు ఈ నవల పుట్టడానికి కారణాలయ్యాయి. ‘హెన్రీ’ తల్లి క్రిస్టియన్‌, తండ్రి హిందూ- పెంపకంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మతాన్ని రుద్దలేదు. అనాథలైన హెన్రీని ఎంతో ఆత్మీయతతో పెంచుతారు. హెన్రీ స్నేహితుడు దేవరాజన్‌ అతడి సోదరి అక్కమ్మ, ఆమె భర్తలేని జీవితాన్ని అప్పటి సామాజిక కట్టుబాట్లనీ, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వాన్ని రచయిత చాలా బాగా చెప్పారు. హెన్రీ బాబాయ్‌ ‘దొరైకణ్ణు’- లారీడ్రైవర్‌, మొరటువాడిగా కన్పించినప్పటికీ అతడు అంతరంగంలో ఎంతటి సున్నిత మనస్కుడో కొన్ని ఘట్టాల్లో తెలుస్తుంది.

భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటే మానసికంగా వాళ్ళెంత దూరాలకెళ్ళిపోతారో దేవరాజన్‌ మాటల్లో తెలుస్తుంది. తల్లి లాంటి అక్కను అర్థం చేసుకోలేక ఆధిపత్యపోరులో దూరమైన విధానాన్ని చాలా సహజంగా చెప్తాడు. హెన్రీ తన సంభాషణ చాతుర్యంతో ఆ జంటను తిరిగి కలుపుతాడు. గీతా ! ఈ నవల చదువు అని చెబ్తామనుకున్నాను కానీ, పెన్ను నా మాట వినేట్లుగా లేదు. నాకు కలిగిన ఇంప్రెషన్స్‌ అన్నీ నీతో షేర్‌ చేసుకోవాల న్పిస్తోంది. హెన్రీ వాళ్ళ నాన్న చనిపోయాక, పూర్వం అతని మాటల్లో చిన్నప్పటినుంచీ విన్న ఊరు – జ్ఞాపకాలు, ముఖ్యంగా ఇల్లూ, దానితో ఉన్న అనుబంధంతో, హెన్రీ – భౌతికంగా తండ్రిని ఇక చూడలేడు కాబట్టి, తన తండ్రి పుట్టి జీవించి ఉన్న ఇంట్లో ఉంటే తన తండ్రితో ఉన్నట్లుంటుందని ‘కృష్ణరాజపురానికి అన్నీ వదిలేసి వచ్చేస్తాడు. ఇలా ఒక్కొక్క ఫీలింగ్‌తో పాఠకుల మనస్సుల్లోకి నడిచివెళ్ళిపోవడం జయకాంతన్‌ నైపుణ్యం. ఎవరికి వాళ్ళు గతంలోకో, జ్ఞాపకాల్లోకో వెళ్ళిపోయి, అనుభవాల చెలమనుంచి స్రవించడం చూస్తాం. నవల చదివినంత సేపూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆ అక్షరాల రైలుపట్టాల వెంటబడి పోతూనే ఉంటాం.

హెన్రీ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆస్తి పంపకాలు, హక్కు దారుల చర్చలు, పంచాయితీ స్వభావం, మనిషి సృష్టించిన డబ్బుపట్ల పట్టనితనాన్ని చూపడం, హెన్రీ కళ్ళతో ఆ ఊరినంతా జయకాంతన్‌ చూపిస్తాడు. మనందరికీ ‘కృష్ణరా జపురం’ తెలుసన్నట్లుగా చేస్తాడు. ఆయేరు ఊరు, పిట్టలు, బావిలో ఈత కొట్టడాలు, వెన్నెల రాత్రుళ్ళల్లో ప్రకృతితో మనిషిని మనిషి ప్రేమించే గుణాలు, వ్యంగ్యాలు, ఈర్ష్యలు, అనుమానాలు ఒకటేమిటి ప్రపంచమంతా అక్కడేవుంది.

మతిస్థిమితం లేని అమ్మాయి నగ్న శరీరంతో తిరుగుతూ ఉంటే, ఊరివాళ్ళంతా ఆమెపై చూపించిన కరుణ, హెన్రీ స్నేహం, రకరకాల వ్యక్తుల భావాలు సహజంగా ఉన్నాయి. ఆ పాత్ర ఒక మార్మికతను దృష్టిలో పెట్టుకొని రాసింది. ఈ శరీరం, ఈ జీవితం ఈ ప్రపంచం అంతా నామమాత్రమేనన్న నిజం వుంది. అన్ని ఉన్నాయనుకుంటే ఉన్నట్లే, లేవనుకుంటే లేవు. దుస్తులొక్కటే మనిషిని దాచేవి కావు. మనసు మలినం కానంతవరకూ మనిషి సహజమైన వాడే – మనిషిగా బతకడానికి ఈ పరదాలు అవసరం లేదని, ప్రకృతే మనిషి జీవితం అంటారు రచయిత. జయకాంతన్‌ శైలీ నైపుణ్యం అద్భుతం. సంభాషణలు పదే పదే తలుచుకునేట్లు ఉంటాయి. లోతైన జీవితావగాహన, వేదాంత ధోరణి, జీవన వాస్తవిక చిత్రణా, మానవత్వాన్ని, మనిషితత్వాన్ని కాచివడబోసినట్లుండే తీరు వర్ణనాతీతం అనుకో. నువ్వుకూడా తప్పకుండా చదువు. గీతా! వచ్చే వారమే నీ పుట్టినరోజు కదా! మా బంగారు తల్లి గీత పుట్టిన రోజు. నీకు నేను పంపే గిఫ్టేమిటో తెల్సా! ఈ పుస్తకమే. రేపు కొరియర్‌ చేస్తాను. నేనింకా చెప్పని అద్భుతమైన అనుభూతులెన్నో నువ్వు చదివాక కలుగుతాయి. ఇక్కడ వర్షాలు బాగా పడ్తున్నాయి. మేఘాలు కనపడగానే నువ్వు గుర్తొస్తావ్‌! ఆ మబ్బుల రథమెక్కి నీదాకా వచ్చేద్దామనిపిస్తుంది. వానంటే నీకిష్టం కదా! నాకూ చాలా ఇష్టం.

గీతా! నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటాను – నీ ప్రియసఖి

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో