ఎ థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్

డా.జి భారతి
(గత సంచిక తరువాయి భాగం)

ఆ తరవాత కాబూల్లో అల్లకల్లోలం మరింత అవుతుంది. రషీద్‌ వారంపాటు షాపుకి కూడా వెళ్ళడు.

తుపాకి పట్టుకుని ఇంట్లో కూర్చుంటాడు. తనలాంటి ‘మగదిక్కు’ ఉండటం ఈ ఆడవాళ్ళిద్దరి అదృష్టం అంటాడు. ముజాహిదీన్‌లు మగపిల్లల్ని బలవంతంగా సైన్యంలో చేరుస్తున్నారనీ, మగపిల్లల్ని నపుంసకుల్ని చేసి, వృద్ధుల్ని చంపి ఆడవాళ్ళని మానభంగాలు చేస్తున్నారనీ వార్తలు చేరుతుంటాయి.

మరియమ్‌ తన టీచరైన ముల్లా ఫయజుల్లా గురించీ, తల్లీ తండ్రీ గురించీ తలుచుకుంటూ వుంటుంది. తన తండ్రి ముగ్గురు పెళ్ళాలతో ఎక్కడికైనా పారిపోయుంటాడా? అనుకుంటుంది. ఏమూలో అతనిమీద జాలి పడుతుంది. ఇన్నాళ్ళనుంచీ ఆలోచన లేకుండా భరిస్తూ వచ్చిన ఈ జీవితం, లైలా, అజీజాలు లేకుండా దుర్భరమని అనుకుంటుంది మరియమ్‌. జీవితంలో ప్రేమానురాగాలు ఎప్పుడూ చవిచూడని మరియమ్‌కు వీరు జీవితకేంద్రం అయిపోతారు. రషీద్‌ మాత్రం ఇప్పుడు ఇద్దర్నీ ఒకేవిధంగా నిరాదరంగా క్రూరంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడిద్దరి మధ్యా తేడాలేదు. 1996లో కాబూల్‌లో ఉన్నట్లుండి సంచలనం వస్తుంది. అందరూ సంతోషంగా పండుగ చేసుకుంటూ వుంటారు.

తాలిబన్లు వచ్చారనీ, ముజాహిదీన్లను మట్టుపెట్టి ఆఫ్ఘనిస్థాన్‌లో ముఖ్యపట్టణాల్ని వశం చేసుకున్నారనీ తెలుస్తుంది. ఈ తాలిబన్లెవరో మరియమ్‌కా తెలియదు. కానీ ఏదో జరగబోతోందనుకుంటుంది. ఈ దేశంనుంచి పారిపోయి పాకిస్థాన్‌లో పుట్టి పెరిగి ఆ మద్రసాల్లో పాఠాలు నేర్చుకున్న ఆఫ్ఘన్లు వారు. వారికి ఆయుధాలు ఇచ్చి పంపితే ఈ దేశం వచ్చి ముజాహిదీన్లను మట్టుబెట్టి అధికారం చేజిక్కిచ్చుకున్నారు. వారికి చదువుసంధ్యలు తక్కువ. కానీ ఇస్లాం మతం పట్ల అచంచల విశ్వాసం. కాబూల్లో వారికి వీరు ప్రాణదాతల్లాగా కనిపిస్తారు. వీరు నిజాయితీపరులు. లంచగొండుల అవకాశవాదుల కాదు – అని వీరిని సాదరంగా ఆహ్వానిస్తారు. ‘అల్లా హో అక్బర్‌’ నినాదాలు అంతటా చుట్టుముట్టాయి. ఒకప్పటి కమ్యూనిస్టు లీడర్‌ అయిన నజీబుల్లాను ఉరితీసి అతని శరీరాన్ని నగరవీధుల్లో ఈడుస్తూ తిప్పుతారు. నరహంతకుడు, నాస్తికుడు అయిన నజీబుల్లాకు పట్టిన గతి అందరు చూస్తారు. ఇకనుంచీ ఈ దేశాన్ని ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ ఆఘ్ఘనిస్థాన్‌ అనాలనీ, ఇస్లాం మతాన్ని అందరు తూచా తప్పకుండా అనుసరించాలనీ ప్రకటనలు వెలువడుతాయి. రోజూ క్రమం తప్పకుండా అయిదుసార్లు నమాజు చెయ్యటం, గడ్డం పెంచుకోవటం మొదలైనవి తప్పనిసరైపోతాయి. సంగీతమూ, నృత్యమూ నిషేధింపబడతాయి. పేకాట, జూదంతో పాటూ, పతంగులు ఎగురవేయటం గూడా నిషేధింపబడింది – అలాగే పుస్తకాలు చదవటం, వ్రాయటం, సినిమాల కూడా. ఈ నియమాలు పాటించని వారికి కఠినశిక్షలు తప్పవు.

ఇక ఆడవాళ్ళ విషయనికి వస్తే, వారు ఎట్టి పరిస్థితుల్లోన తమ ముఖం ఇతరులకు కనిపించనివ్వకూడదు. బయటకి వెళ్ళినప్పుడు ప్రక్కన ఒక పురుషుడు ఉండితీరాలి – భర్తో, కొడుకో, అన్నో, తండ్రో. అసలు ఇంట్లోంచి బయటికి రాకూడదు. వంటరిగా రోడ్డుమీదకి వచ్చిన ఆడదానికి దెబ్బల, శిక్షల తప్పవు. విలాసవస్తువుల, నగల, అలంకరణ సామగ్రీ నిషిద్ధం. అందమైన దుస్తులు ధరించకూడదు. పలకరిస్తే తప్పితే మాట్లాడకూడదు. మగవారి వంక చూడ కూడదు. అందరిముందూ నవ్వకూడదు. గోళ్ళకి రంగేసుకుంటే వేళ్ళే తీసేస్తారు. ఆడపిల్లలు బళ్ళల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళ బళ్ళు మూసేశారు. వారు ఎక్కడా ఉద్యోగంకానీ, ఏ పనీగానీ చెయ్యకూడదు. వ్యభిచారం చేసిన ఆడదాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి. ఇలా కనపడని ఇనపసంకెళ్ళు పడ్డాయి ఆడవారికి.

రేడియెలో ఈ ప్రచారం విన్న రషీద్‌ ఆనందానికి మేర లేదు. తన యింట్లో ఆడవాళ్ళని ఇదే విధంగా ఉంచుతున్నాడు కదా? లైలా మాత్రం తన తండ్రి ఇవన్నీ చూడటానికి ఇంకా బ్రతికిలేడని సంతోషిస్తుంది. రోజూ ఎవర్నో ఒకర్ని మతం పేరున శిక్షించటం జరుగుత ఉండేది. రోడ్డుమీద అమలు జరిగే ఈ శిక్షల్ని చూసి ఇంటికి వచ్చి పరమానందంగా వర్ణిస్తుంటాడు రషీద్‌.
ఇదిలా ఉండగా లైలా మళ్ళీ గర్భవతవుతుంది. పురుటినొప్పుల్తో హాస్పిటల్‌కి వెళ్తే ‘ఇక్కడ ఆడవాళ్ళని చూడం’ అని చెప్తారు కటువుగా. ఆడవాళ్ళ ఆస్పత్రికి వెళ్తుంది ఒకామె సలహాతో. అక్కడ జనం కిటకిటలాడుత ఉంటారు. ప్రతిచోట మురికి పేరుకుపోయి వుంటుంది. శుభ్రమైన నీళ్ళు ఉండవు. చాలా గంటలు వేచిన తరవాత లైలాను పిలుస్తారు. అక్కడ నర్సుల, డాక్టర్ల, అందర బుర్ఖాలు ధరించే వుంటారు. డాక్టరు ఈ పరిస్థితికి అలవాటు పడిపోయింది. ఇంతసేపు ఆలస్యం అవటం వల్ల బిడ్డ అడ్డం తిరిగిందనీ ఆపరేషన్‌ చెయ్యలనీ అంటుంది. కానీ వాళ్ళ దగ్గర మత్తుమందు లేదు. లైలాకు ఆ సంగతి మెల్లిగా చెప్తుంది. ”అక్కర్లేదు. నన్ను కోసి నాకు బిడ్డనివ్వండి” అంటుంది లైలా. అలాగే మత్తుమందు లేకుండా ఆపరేషన్‌ చేస్తుంది డాక్టర్‌. బుర్ఖాతో పనిచెయ్యటం కష్టమని అది తీసేస్తుంది. తలుపు దగ్గర ఒక నర్సు కాపలాగా ఉంటుంది. తాలిబన్లు వస్తున్నట్లు కనపడగానే బుర్ఖా ధరించమని డాక్టరుకు హెచ్చరిక చేసేందుకు. తాలిబన్లు ఎవరి దగ్గరా విరాళాలు తీసుకోరు. వాళ్ళ దగ్గర డబ్బులేదు. ఆస్పత్రికి కావలసిన కనీస సదుపాయలు కూడా ఇవ్వలేరు.

తనను పనిచెయ్యనియ్యటమే మహద్భాగ్యంగా తలుస్తుందా డాక్టరు. ఉన్న కాస్త డబ్బు మగవారి ఆస్పత్రులకి అందుతుంది. ఆడవాళ్ళకు విలువేముంది? వారి ప్రాణాలు అమూల్యమైన ధనం వెచ్చించి కాపాడ్డానికి! ఈ ఆస్పత్రి అనుభవం చదువుతంటే శరీరం గగుర్పొడుస్తుంది. ఆమెతోపాట వచ్చిన మరియమ్‌కి తల్లి కావటం ఎంత కష్టం, బాధతో కూడినదో తెలుస్తుంది. తన తల్లిని తానెంత నిర్లక్ష్యంగా చూసేదో గుర్తుకొచ్చి పశ్చాత్తాపపడుతుంది.
ఆ పిల్లవాడికి జల్మాయి అని పేరు పెడతాడు. రషీద్‌ వాణ్ణి చేసే గారాబం అంతా యింతా కాదు. తాలిబన్ల హయంలో ఇస్లాంకి ముందు ఉన్న సంస్కృతికి విలువలేదు. ఇస్లాంకు సంబంధించనిది ఏదీ మంచిదికాదు. ఎన్నో కళాత్మక వస్తువులనూ, కావ్యాలనూ నిర్దాక్షిణ్యంగా తగలపెట్టేస్తారు. బాలియన్‌లోని బుద్ధవిగ్రహాల్ని మందు గుండు సామగ్రితో పేల్చేస్తారు – ప్రపంచ మంతా దీన్ని గర్హిస్తుంది. తన చిన్ననాటి అపురపమైన అనుభవాన్ని గుర్తుకు చేసుకు దుఃఖిస్తుంది లైలా. టి.వి., సినిమాలు నిషిద్ధం అయినా బ్లాకులో కొడుక్కోసం టి.వి.ని కొని తీసుకొస్తాడు రషీద్‌. అజీజా దాన్ని ముట్టుకున్నా సహించడు. దానివల్ల ఏ ఆపద ముంచుకొస్తుందోనని మరియమ్‌, లైలా, పెరట్లో గోతిలో టి.వి.ని పాతిపెడతారు. రషీద్‌ దుకాణం కాలిపోతుంది అల్లర్లలో. అతనొక హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తుంటాడు. ఇంట్లో తిండి గడవటం కూడా కష్టంగా వుంటుంది. అయినా కొడుక్కి మాత్రం హోటల్నుంచి మంచిమంచి ఆహారపదార్థాలు తెచ్చి పెడ్తుంటాడు, చిన్నపిల్ల అజీజా పస్తులుంటున్నా సరే. రషీద్‌ మొరటు ప్రవర్తనవల్ల ఆ వుద్యోగం కూడా పోతుంది. ఎక్కడన్నా ఏదో ఒక కాయకష్టం చేసి ఆడపిల్ల అజీజాకి తిండి పెట్టాలంటే, ఆడవాళ్ళు ఇంటి బయట అడుగుపెట్టటానికీ, డబ్బు సంపాదించే పనులు చేయటానికీ వీలుండదు.

అలాంటి కరువు పరిస్థితుల్లో మరియమ్‌ ఒకసారి రషీద్‌ బలవంతంతో హెరాత్‌ పట్టణానికి ఫోనుచేసి, తండ్రి గురించి అడుగుతుంది. ఆయన 1987లో చనిపోయడనీ, ఆయన సినిమాహాలు తగలబెట్టేశారనీ తెలుసుకుంటుంది. అంటే అప్పటికే ఆయన అస్వస్థతగా ఉన్నాడన్న మాట. ఆఖరిసారిగా తనను చట్టానికి వస్తే ఆయనకు తలుపన్నా తెరవలేదు. చిక్కిపోయిన ఆయన శరీరం మీద ఆ సూటు వదులుగా వేళ్ళాడుతున్నట్లు ఉంది. చేతికఱ్ఱ మీద ఆనుకుని కారుబయట రోడ్డుమీద తనని చూట్టానికి రోజంతా ఎదురుచూస్తే, తన మనస్సు కరగలేదు. తలుపుక్రిందనుంచి ఒక సీలుచేసిన కవరు త్రోసి వెళ్ళిపోతే, దాన్ని తెరిచికూడా చూడకుండా చివరికి చింపి పారేసింది. తన మనస్సింత కఠినమై పోయిందెందుకు అని తండ్రి గురించి తలుచుకు దుఃఖిస్తుంది.
అయినా అప్పులు చేసి కొడుకుని మారాం చేస్తాడు రషీద్‌. కాబూల్‌ మారి ఎండిపోతుంది. తాగటానికి నీళ్ళు కూడా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో అజీజాని అనాథల గృహంలో చేర్పించమంటాడు రషీద్‌.ఆ పని ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కనీసం తిండయినా దొరుకుతుందనే ఆశతో ఆ పిల్లను అనాథ శరణాలయంలో చేరుస్తారు. తన భర్త చనిపోయినట్ల తనకే ఆధారమూ లేనట్లు చెప్పాల్సి వస్తుంది లైలా. ఆ పిల్లని వదలటం మరియమ్‌కు చాలా కష్టమయిపోతుంది. అజీజాక్కూడా మరియమ్‌ని వదిలిపెట్టటం కష్టంగా వుంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరేం చేయగలరు?

2000 సంవత్సరం వచ్చింది. వానలు లేవు. మూడేళ్ళ నుంచీ, నీటిచుక్క దొరకటం లేదు. ఇంటిగేటు దగ్గర ఎవరో నిలచి ఉండటం, బల్మాయి ”పోపో యిక్కణ్ణుంచి” అని అదిలించటం విని వచ్చి చూస్తుంది. ఆ వచ్చింది తారిక్‌. నమ్మలేక పోతుంది. అతన్ని లోపల కూర్చోబెట్టి తన పెళ్ళీ, పిల్లల, తారిక్‌చనిపోయడనే వార్తా అన్నీ చెప్తుంది. ఇప్పుడు తెలుసుకుంది తనను పెళ్ళాడాలనే ఉద్దేశంతోనే రషీద్‌ ఆ అబద్ధపునాటకం ఆడించాడని. తారిక్‌కూడా పాకిస్థాన్‌లో తన జీవితం గురించీ, తల్లిదండ్రుల మరణాన్ని గురించీ చెప్తాడు. అసలు ఆఫ్ఘనిస్థాన్‌ ఉన్నది పాకిస్థానీయుల, అరబ్బుల చేతిలో. కమ్యూనిష్టుల కాదు, అమెరికన్లు కాదు అని అంటాడు.
ఇలా ఒక క్రొత్త వ్యక్తి ఇంట్లోకి వచ్చి కూర్చుంటే తన తల్లి అతనితో గంటలకొద్దీ మాట్లాడిందని జల్మాయి తన తండ్రితో చెప్తాడు. ఇక రషీద్‌ సంగతి తెలియందే ముంది. బెల్టుతో గొడ్డుని బాదినట్లు లైలాను బాదుతాడు. అతన్ని తప్పించుకోటానికి ఇల్లంతా పరుగులు పెడ్తుంది. మధ్యలో ఒకసారి తట్టుకోలేక పిడికిలి బిగించి దవడ మీద ఒకటిస్తుంది. దాంతో పూర్తిగా పశువైపోయిన రషీద్‌ ఆమె మెడ గట్టిగా పిసకటం మొదలెడతాడు. మరియమ్‌ అతన్ని వేడుకుంట వుంటే అది ఏ మాత్రం పనిచేయదు. లైలా సుకుమార శరీరాన్ని ఇంత క్రూరంగా హింసించటం ఆమె సహించలేకపోతుంది. బయట షెడ్లో ఉన్న గడ్డపారతెచ్చి అతని తలమీద వెదుతుంది. అప్పుడు క్రిందపడిపోయిన రషీద్‌ కణతల్లో గడ్డపారని తన బలమంతా ప్రయెగించి గుచ్చుతుంది. దాంతో అతని ప్రాణాలు పోతాయి.

స్పృహ వచ్చాక ఒక శరీరం ఇన్ని బాధలు ఓర్చుకోగలుగుతుందా, ఇంత బాధపడీ యింకా జీవిస్తూ ఉండగలిగిందా అని లైలా ఆశ్చర్యపడుతుంది. ఇద్దరూ కలిసి రషీద్‌ శవాన్ని షెడ్డులోపెట్టి తలుపులు గట్టిగా బిగించి వస్తారు. లైలాని, తన పిల్లలతో పారిపొమ్మని, తాను ఇక్కడే వుండిపోవటం మంచిదనీ మరియమ్‌ వాళ్ళని పంపేస్తుంది. లైలా ఆమెను వదలలేక వదలలేక వెళ్తుంది.
మరియమ్‌ను ఆమె నేరానికి నరకం లాంటి జైల్లో పెడతారు. ఆ జైల్లో తిండిగూడా పెట్టరు. పాయిఖానాల దుర్గంధం, ఈగలు! ఈ మురికిలో ఎంతో మంది ఆడవాళ్ళు జైలు గదిలో కిక్కిరిసి ఉంటారు. వాళ్ళకి యింట్లోవాళ్ళు బియ్యం పంపిస్తే వండుకు తింటారు. మరియమ్‌కి పంపేవాళ్ళెవరు? ఆ ఆడవాళ్ళ నేరాలన్నీ చిన్నవి. రోడ్డుమీద వంటరిగా నడవటం, బుర్ఖా ముఖంపైకి తీసి బజార్లో వెళ్ళటం లాంటివి. వాళ్ళకి మరియమ్‌ నేరం ఆమె పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది. పోటీలు పడి ఆమెకి అన్నం పెడతారు. ఆ ఆడ వాళ్ళందరూ మగవాళ్ళ చేతిలో బాధలు పడ్డవారే. తన సంగతే తీసుకుంటే తాను రషీద్‌ కాక మరో మొగవాణ్ణెరుగదు. జీవితమంతా అతనికి వండిపెట్టటానికీ అతని ఇంటికీ, అతనికీ సేవచేయటానికే అంకితం చేసింది. అతని కిష్టంలేని పనులు చెయ్యలేదు. అతని పరువుతీసే పనులు అసలు తలచలేదు. అయినా అతడెందుకు అంత నిర్దాక్షిణ్యంగా ఆమెని హింసించే వాడు? ఇలా తలుచుకుని ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరి కథల ఇలాంటివే. ”దిక్సూచి ముళ్ళు ఒకవైపునే చూపించినట్లు మొగవాళ్ళ నిందారోపణ ఎప్పుడూ ఆడవాళ్ళ మీదే ఉంటుంది” అని వాళ్ళ అమ్మ అనే మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. మరియమ్‌కు విచారణ జరగదు. ఒక కోర్టు లేదు. ప్రజల ముందు విచారణ లేదు, సాక్ష్యాలు లేవు. అంతా 15 నిమిషాల్లో అయిపోతుంది. ”నీ తప్పు ఒప్పు కుంటావా?” ఒకటే ప్రశ్న. ‘ఔను’ అనే చిన్న సమాధానం” అన్నా. ”నేను అతన్ని చంపకపోతే అతడు నన్ను చంపేసేవాడు” అన్నా జవాబు తీర్పులో ఏమీ మార్పు తీసుకురాదు. మరియమ్‌కు మరణశిక్ష వేస్తారు. ఊరిమధ్య స్టేడియమ్‌లో వందల మంది చూస్తుండగా అమలు జరిగింది. ఆమె భయపడలేదు. దుఃఖించలేదు. చివరవరకూ నిబ్బరంగా వుంది. జల్మాయికి ప్రేమించే తండ్రి లేకుండా చేసినందుకు క్షమించమని అల్లాని ప్రార్థించింది. ఇదీ మరియమ్‌ కథ. జీవితం అంతా దుఃఖం, బాధ, అవవనాల అనుభవించినా తోటి మనిషిని ప్రేమించటం మానని మరియమ్‌ కథ.

ఇక లైలా, ఇంట్లోంచి వెళ్ళిపోయాక తారిక్‌తో పిల్లలిద్దరితో కలిసి క్షేమంగా పాకిస్థాన్‌ చేరుతుంది. అక్కడ హోటల్లో ఇద్దరూ పనిచేస్తుంటారు. గదులు, బాత్‌రంలు శుభ్రం చేయటం. శుభ్రంగా ఉంచటం వాళ్ళపని. వాళ్ళ యజమాని తారిక్‌ని చాలా అభిమానిస్తాడు. అతనికి చాలా సహాయం కూడా చేస్తాడు. రాగానే మొదటే లైలా, తారిక్‌ పెళ్ళి చేసుకుంటారు – లేకపోతే వచ్చే కష్టాలు వాళ్ళకి తెలుసుగా. ఒకప్పుడు తారిక్‌ని గూఢచారిగా అనుమానించి తాలిబన్‌లు జైల్లో పెట్టారు. అప్పటి విషయలు గుర్తుచేసుకు ఆఫ్ఘనిస్థాన్‌ గురించి బాధపడతాడు. ఇస్లాం తప్ప మరేదీ సహించని తాలిబన్లు ముఖ్యంగా కళాకారుల్ని, కవుల్నీ ఎంత బాధించారో గుర్తుచేసుకు వ్యంగ్యంగా నవ్వుకుంటాడు. అతని స్నేహితుడొకడు చిత్రకారుడు, అతనికి పక్షులంటే ఇష్టం. ఎప్పుడు ఫ్లెమింగో పక్షుల బొమ్మల్ని వేస్తాడు తన ప్రకృతి చిత్రాల్లో. ఆ ఫ్లెమింగోల కాళ్ళు నగ్నంగా ఉన్నందుకు అతన్ని జైల్లో పెట్టి కొడ్తారు. చివరికి ఆ మిత్రుడు ఆ పక్షులన్నిటికీ సల్వార్లు కాళ్ళకి ఆచ్ఛాదనంగా పెయింట్‌ చేస్తాడు. ఇది చెప్పి కొంత విరక్తిగా, కొంత బాధగా నవ్వుతాడు తారిక్‌. చివరికా మిత్రుడు ఆ సల్వార్‌లను వాటర్‌ కలర్సుతో పెయింట్‌ చేశాడనీ, మిగతా చిత్రమంతా ఆయిల్‌ కలర్సుతో ఉందనీ, తరవాత ఆ వాటర్‌ కలర్సు కడిగేశాడనీ, చెప్పి పకపకా నవ్వుతాడు. అతని మాటలు ప్రవర్తనా ఒకొక్కసారి లైలాకు అయెమయంగా అనిపిస్తాయి.
చిన్న శుభ్రమైన యిల్లు, చేయటానికి తగుమాత్రం పనీ, రాబడీ, పిల్లలు సంతోషంగా ఉండటం-ఇప్పుడు లైలా జీవితం ఏ చీకూచింతా లేకుండా గడుస్తోంది. కానీ ఆమెకి ఏదో ఆరాటం. మరియమ్‌ను ఎప్పటికీ మర్చిపోదు. ఆమె ఇంకా కలల్లో వస్తూనే ఉంటుంది. ఇంతలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ తగలబెట్టటం, ఒసావబిన్‌లాడెన్‌ టెర్రరిస్టుగా ప్రపంచంలో అందరికీ పరిచయమవటం జరుగుతుంది. తాలిబన్ల పరిస్థితి క్లిష్టమైంది. అమెరికన్‌ సైన్యాలు వారిని అన్ని ముఖ్యనగరాల్లోంచి దేశం చివరివరకూ అడవుల్లోకి తరిమికొట్టారు.

లైలా ఇక మనం కాబూల్‌ వెళ్ళిపోదామని మొదలుపెట్టింది. ‘తాలిబన్ల బాంబుల బదులు, అమెరికన్‌ బాంబులు పడతాయిప్పుడు’ అని తారిక్‌ నిరుత్సాహ పరుస్తాడు. తనదేశం తనని పిలుస్తోంది. తన తండ్రి తాను ఏదో చెయ్యలని ఆశించాడు. ఈ పరాయి దేశంలో ఏ ఉద్దేశమూ లేకుండా జీవించి చనిపోతే తన బ్రతుక్కి అర్థమేమిటి? ఇలాంటి ఆలోచనలు ఆమెను చుట్టుముట్టుతాయి. ”ఎప్పటికీ ఇలాగే ఉండదు. శాంతి వస్తుంది” అంటుంది చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో. తారిక్‌ కూడా ఆ మాటలకి మెత్తబడి వప్పుకుంటాడు. కాబూల్‌కి వెళ్ళే ముందర హెరత్‌పట్నానికి వెళ్ళాలని అంటుంది. మరియమ్‌తో ఆమెకు గల అనుబంధం అర్థం చేసుకున్న తారిక్‌ అందుకు అంగీకరిస్తాడు. హెరత్‌లో మరియమ్‌ తండ్రి కుటుంబాన్ని గురించి వాకబుచేస్తే, ఆయన ఆస్తులన్నీ పోయాయనీ, తరవాత ఆయనే గుండెజబ్బుతో పోయాడనీ తెలుస్తుంది. ఆయన కుటుంబంలో ఇద్దరు కొడుకులు, ఒక కూతురూ, భార్య తాలిబన్‌ కాల్పుల్లో, కమ్యూనిష్టుల యుద్ధాల్లో పోయరనీ తెలుస్తుంది. అతిప్రయత్నం మీద ముల్లా ఫయజుల్లా ఇల్లు తెలుసుకుని వెళ్తుంది. ఆయన చాలా వృద్ధుడు మరియమ్‌ పెళ్ళినాటికే. ఇప్పుడు లేడని తెలుసు కుంటుంది. కానీ ఆయన కొడుకు ఉంటాడు. అతను వీళ్ళ గురించి, మరి యమ్‌తో సంబంధం గురించీ తెలుసు కుంటాడు. ఒక్క విషయం వదలకుండా, తమ కథంతా ఆయనకి చెప్తుంది లైలా. మరియమ్‌ తండ్రి ఒక తాళం వేసిన పెట్టెని ముల్లా చేతికిచ్చి, ఎప్పటికైనా మనసు మార్చుకుని మరియమ్‌ వస్తే ఆమెకి ఇవ్వమని చెప్పాడని, ఆ పెట్టె తెచ్చి యిస్తాడు. ఇప్పుడు మరియమ్‌ ఈ లోకంలో లేదు గనక, లైలాకు ఇవ్వటమే సరైంది అంటాడు. అందులో ఒక ఉత్తరం ఉంటుంది. అది ఆయన మరియమ్‌కు వ్రాసిన లేఖ. అందులో తన బాధల్నీ పశ్చాత్తాపాన్ని వెళ్ళడిచేసి, తనకి మిగిలిఉన్న ఆస్థిలో న్యాయంగా మరియమ్‌కు రావలసిన భాగాన్ని యిస్తున్నానని కొన్ని డాలర్లు ఇస్తాడు. కాబూల్‌ ఆర్థికవ్యవస్థ అస్థిరంగా ఉన్నందువల్ల, కాబూల్‌ రపీకి విలువ ఉంటుందో ఉండదోనని ఆలోచించి, అన్నీ డాలర్లలో మార్చి ఆ పెట్టెలో ఉంచాడు. దుఃఖంతో బరువెక్కిన గుండెతో లైలా ఆ పెట్టెను తీసుకు కాబూల్‌ వస్తుంది. ఒకప్పుడు అజీజాను ఉంచిన ఆ శరణాలయనికి వెళ్తుంది. ఇప్పుడు కాబూల్‌లో ఎందరు అనాథపిల్లలో. ఈ డబ్బు వాళ్ళకి ఖర్చుచేయటం మరియమ్‌కి తప్పకుండా ఇష్టమవుతుందని ఆ డబ్బు అనాథ శరణాలయనికి ఇస్తుంది. తాను గూడా అక్కడ పిల్లలకి చదువూ ఆటపాటలు నేర్పుతూ సంతోషాన్ని తృప్తినీ పొందుతుంది. శాంతికోసమే తాను తన జీవితం గడపాలనుకుంటుంది. జల్మాయి ఇప్పుడు తారిక్‌ని తండ్రిగా చూస్తున్నాడు. అజీజా పట్ల ప్రేమగా ఉంటున్నాడు. తారిక్‌ ఆ పిల్లవాణ్ణి ప్రాణసమానంగా చూసుకుంటు న్నాడు. ఇక శాంతి రాక ఏమవుతుంది!
చివరగా ఈ నాలుగు వాక్యాలు రాయకుండా వదలటం తప్పనిపిస్తోంది. యు.యస్‌. స్వచ్ఛందసంస్థలు సేవా కార్యక్రమాల్తో వికలాంగులకూ, అనాథలకూ, పిల్లలకు ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అందిస్తున్నాయి. కాలిపోయిన బాంబుల, రాకెట్ల తొడుగులు కంచుతో చేయబడి మెరుస్తూ ఉంటాయి. వాటిని కాబూల్‌ గృహస్థులు కిటికీల్లో పెట్టి పూలమొక్కల్ని పెంచుతున్నారు. ఆ పూలని వాళ్ళు ‘రాకెట్‌ పూలు’ అంటారు.

ఈ నవలకి ‘ఎ థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్‌” అనే పేరు రచయిత పెట్టాడు. ఇది కాబూల్‌ని గురించి ఒక కవి రాసిన పద్యంలో పాదం ”వేయి దివ్య ప్రకాశంగల సూర్యుడు” అని ఆ మాట అర్ధం. లైలా హృదయంలో మెదిలే మరియమ్‌ ఆ అద్భుత దివ్య సూర్యుల్లో కనిపిస్తుంది లైలాకి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to ఎ థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్

  1. bhuvana says:

    బారతి గారికి,
    మీరు పుస్తక సమీక్ష చాలా చక్కగా రాసారు. ఇది చదివాక మా స్నేహితులు కూడా దీనిపై ఆసక్తి చూపి “థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్‌’’ నవలను కొని చదువుతున్నారు…మీరు ఆఫ్గన్ మహిళల దుస్తితిని విడమర్చి ఇందులో ప్రస్తావించడం వల్ల నవల తప్పక చదవాలనే ఆరాటం కలిగింది..అందుకు మీకు మా ధన్యవాదాలు… ఇంకా ఇటువంటి మంచి నవలలను మాకు పరిచయంచేస్తారని ఆశిస్తూ….
    భువన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో