చుక్క సావిత్రి – ఆచంట హైమవతి

”మీ దగ్గర ఇలాంటి కళాకృతులు మంచివి దొరుకుతాయని మా పేపర్లో వేస్తాం! అందువల్ల చాలామందికి తెలిసి కొనుక్కుంటారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినందుకు మా పత్రికకీ మీలాంటివారిని ప్రోత్సహిస్తున్న పేరు లభిస్తుంది. మీకు ఆర్థికంగానూ లాభిస్తుంది” అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ పత్రికా విలేకరి.
”చుక్కమ్మ” అని చెప్పి… నాలిక్కరు చుకుని ”కాదు…కాదు” అందామె ఖంగారుగా. విలేకరి ఆశ్చర్యంగా చూశాడు. నిజానికి కళాకృతుల ప్రచారంకోసం మాత్రమే కాదు అతను వచ్చినది. తక్కువ ఖర్చుతో ఇంత చక్కని కళాకృతులు తయారు చెయ్యాలనే ఆలోచన, దానిని ఇంత క్రియా శీలంగా తీర్చిదిద్దుతున్న ఆమె నేర్పరితనానికి తమ ”కళాసంఘం” వాళ్ళు ఆమెకు సన్మానం చేద్దామనుకుంటున్నారు. అందుకామె వివరాలు సేకరించటానికి వచ్చాడతను.

ఆమెను ఎరిగి ఉన్నవారు ”అలాంటి భేషజాలు గిట్టవామెకు. ఆమె చాలా నిరాడంబరంగా ఉంటుంది” అన్నారు. అందుకనే ఉపాయంగా ఆమె వివరాలు సేకరించటానికి ”…..” పేపరు సిబ్బందివైపు నుంచి వచ్చాడతను. కాని…? పేరు చెప్పటానికే ఆమె తడబడటం – పేరుచెప్పి… మళ్ళీ… కాదు… కాదు – అనటం అయోమయంగా అన్పించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయిందామె తలొంచుకుని.

”రెండు రోజుల్లో మళ్ళీ వస్తానని మీ అమ్మకి చెప్పమ్మా” అని గుమ్మం దగ్గర నుంచున్న పిల్లకి చెప్పి వెళ్ళిపోయాడతను. లోపలికి వెళ్ళిన ఆమెకు గతం అంతా ఒకసారి కళ్ళకు కట్టింది.

ఆమె అతిపేద ఇంటి ఆడపిల్ల. పేరు చుక్కమ్మ. చుక్కమ్మ పొందికగల చక్కని చుక్కే! తెలివిగల అమ్మాయి. చురుకైన బుద్ధి! ఎవర్నో గంతకుతగ్గ బొంతని తెచ్చి కడదామనుకుంటున్నారు తల్లిదండ్రులు. చుక్కమ్మ చాలా అభిమానవతి కూడా! ఆదర్శభావాలు గల పద్దెనిమిదేళ్ళ యువతి. పది తరగతులు గట్టెక్కటమే మహాకష్టమైంది ఆమెకా ఇంట్లో.

ఉద్యోగార్థం బయటకెళ్ళిన యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు భయపడి ఆమె తల్లి ఆమెను ఏనాడూ గడప దాటనిచ్చేది కాదు. తనతోకూడా కూలిపను లకు మాత్రం తీసుకెళ్ళేది. తల్లితో కూడా వెళ్ళిన పక్కింటి గౌరిని ఎవరో ఎత్తుకుపోయా రని తెలిసి… తను కాపుదలగా ఉన్నాను గదా? అనుకొనే ఆ తల్లి ధైర్యం సడలిపో యింది. అస్తమానం తలిదండ్రులు అనే దిగులు మాటలు చుక్కమ్మకి నిరుత్సా హాన్ని కలిగించేవి. కాని…! డిగ్రీ చదువుతూ మానేసి పని వెతుక్కుంటున్న ”సిద్దయ్య” ప్రేమలో పీకల్లోతుగా కూరుకుపోయింది.

”ఇద్దరం ఒకే కులస్తులం. కనుక నువ్వు నాతో లేచి వచ్చేయటం అంత చెడ్డపనేం కాదు. నువ్వు నాతో వచ్చేస్తే… మీ అయ్య చేతిలోని డబ్బు మీ చెల్లి పెళ్ళికుపయోగపడుద్ది!” సిద్దయ్య మాటలు చుక్కమ్మలో ఆలోచనలు రేపాయి. అతడి మాటలు సమంజసంగా కూడా అనిపించా యి. దాని ఫలితమే చుక్కమ్మ సిద్దయ్యతో లేచి వచ్చేయటం. రిజిష్టర్‌ పెళ్ళి కావటం, గుడిలో పసుపుకొమ్మే మాంగల్యంగా ముడిపడటం జరిగిపోయాయి. చుక్కమ్మ పేరు ఫ్యాషన్‌గా లేదని… తన భార్య ఆకాశంలో మెరిసిపోయే అందాల ‘తార’ అని మురిసిపోయిన సిద్దయ్య ”చుక్క”కి ‘తార’ అని కూడా అర్థం ఉందని పెళ్ళాన్ని ”తారా” అని పిలవటం మొదలెట్టాడు. గుర్తుతెచ్చుకుని ఆ పేరు చెప్పటం… పలకటం కష్టంగానే ఉండేది చుక్కమ్మకి. అసలుపేరు చెప్పేసి – దిద్దుకుంటూ ఉండేది.

కంపెనీలో మార్కెటింగ్‌ మానేజ ర్‌గా పని దొరికి – సంసారానికి సరిపడ సంపాదించుకుని వస్తుండటంతో ఐదు సంవ త్సరాలూ – ఐదు వారాల్లాగ రోజులు గడిచి పోయాయి. ఇద్దరు బిడ్డలకి తల్లిదండ్రుల యారు వాళ్ళు.  పెద్దది ఆడపిల్ల. దాన్ని బడిలో వేశారు. రోజులు గడుస్తు న్నాయి. సిద్దయ్యలో చిన్నగా ప్రవేశించిన అనారోగ్యం అలా… అలా పెరిగి రుగ్మతగా మారి మంచంలో పడుకోబెట్టింది.

సిద్దయ్యని అతని పరిచయస్తులు, మిత్రులు ”నవజోద్‌సింగ్‌ సిద్ధూ” అని పిలవటంతో తను అంతటివాడైపోయినంత సంబరపడేవాడు. సిద్దయ్యని ఆప్యాయతగా చూసే మితృడొకడు ”తార” పేరుని గురించి అభ్యంతరం తెలుపుతూ ”తారాచంద్రుల” కథ వివరించాడు. అది విని వెగటుగా పెట్టాడు ముఖం సిద్దయ్య.

చుక్కమ్మ పేరు మళ్ళీ సందిగ్ధంలో పడింది. కొన్ని పురాణగాథలు బోధించిన అతడే ”సావిత్రి” కథను కూడా ప్రవచిం చాడు. ఇంతలో సిద్దయ్యకి అనారోగ్యం సంభవించటంతో తనని బ్రతికించుకోగల తన భార్య నిజంగా ”సావిత్రే” అనుకుని అలా పిలవసాగాడు సిద్దయ్య. మళ్ళీ ఈ పేరు అలవాటు చేసుకునేసరికి మళ్ళీ రెండేళ్ళు గడిచిపో యింది ఆమె జీవితంలో. మొదట్లో పాచిపనులు, కూలిపనులు చేసి సంసారాన్ని పోషించసాగింది సావిత్రి. కాని దానితో అందరి పొట్టలు పూర్తిగా నిండని స్థితి కలగటంతో… ఒక యజమానురాలి సలహాతో కారపుపొడి, రసంపొడి, సాంబారు పొడి మొదలైనవి తయారుచేసి అమ్మసా గింది. మరికాస్త లాభాలు రాసాగాయి. ఎక్కే గుమ్మం… దిగే గుమ్మం అయినా సరుకు బాగా అమ్ముడుపోయేది. కాని… ఆ పద్ధతి ఎక్కువ రోజులు సాగలేదు. గొంతుమంట, విపరీతమైన దగ్గు, సాయంకాలానికి జ్వరం రావటం, ఉమ్మిలో రక్తం పడటం జరుగు తోంది. సావిత్రి దాన్ని లెక్కచెయ్యలేదు కాని… కూతురు-కొడుకు తల్లిని బలవంత పెట్టి డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళారు.

‘ఎక్స్‌రే’ తీయించి, ఉమ్మి పరీక్షకు పంపి, మరికొన్ని పరీక్షలు చేసి, వివరాలు కనుక్కున్నాడు డాక్టరు. ”కారం”తో చేసేపని కాక ఇంకో పని వెతుక్కోమన్నాడు డాక్టరు. ”అమ్మా! ఎందుకంత కష్టపడతావ్‌? మా స్నేహితురాలి తల్లి బట్టలు కుట్టి డబ్బు సంపాదిస్తోంది. నువ్వు కూడా అలా చెయ్య చ్చుగా! నేను కూడా కొంత సాయం చేస్తాను” ఇది కూతురి సలహా. ”మా మిత్రుడి అక్క ఎంబ్రాయిడరీ చేస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తోంది. నువ్వు కూడా అది నేర్చుకోవచ్చు గదమ్మా! ఈ కారం పని మానెయ్‌!” ఇది సావిత్రి వంశోద్ధారకుడి సలహా. అన్నీ వింటూ సిద్దయ్య ”నా ఆరోగ్యం బాగుంటే ఈ పరిస్థితే వచ్చేది కాదుగదా! పిల్లలది చదువుకునే వయసు. వాళ్ళని ఈ పనుల్లోకి దింపితే వాళ్ళ భవిష్యత్‌ పాడుచేసిన వాళ్ళం అవుతాం. నేనేం చెయ్యగలనో తెలియటం లేదు” ఖిన్నుడౌతూ అన్నాడు. ”నువ్వలా బాధపడొద్దు మామా! దేవుడేదో ఒక దారి చూపకపోడు” అంటూ ధైర్యం చెప్పింది సావిత్రి.

అలా సిద్దయ్యతో లేచిపోయిందని చుక్కమ్మ తల్లిదండ్రులకి చాలా కోపం వచ్చింది. తమ చేతకానితనాన్ని ఎత్తిచూపి… అతనితో లేచిపోయిందనీ… తన స్వార్థమే చూసుకుందనీ… తల్లిదండ్రులు, బంధువులు రకరకాలుగా దూషించారు. పుట్టింటికెళ్ళి తనవారిని చూసి రావటానికి కూడా ”తాము ఒప్పుకోము” అని ఆంక్ష విధించారామెకు. చుక్కమ్మకి పుట్టింటిమీద ఆశ, ఆప్యాయతలున్నా… వారు తనను ఆదరించరని తెలిశాక – తన కష్టసుఖాలను వారికి తెలియనివ్వకూడదని నిర్ణయించు కుంది. అలాగే వారిని ఆశ్రయించ కూడదనీ… తన రెక్కల కష్టమ్మీదే నమ్మకం పెంచుకుంది. మధ్యలో తారగా మారి… సావిత్రిగా స్థిరపడిన – చుక్కమ్మ.

భర్తకి ధైర్యం చెప్పిందేకాని… సావిత్రి మనస్సు పరిపరి విధాల పోయింది. అన్ని విషయాల్లోనూ తనకి సలహా చెప్పే సుభద్రమ్మనే ఆశ్రయించాలనుకుంది. తనెప్పుడూ వెళ్ళే ఇళ్ళకే పనులకి వెళ్ళొస్తూ రోజులు గడుపుతోంది సావిత్రి. సర్దుకునే మనస్తత్వం గల వాళ్ళవటంవలన సావిత్రికి కొంత పని తగ్గించారు. సావిత్రి మొహ మాటంగా మాట్లాడుతూంటే ”ఫరవాలేదు సావిత్రీ! మా ఇంట్లో పనెక్కువ చెయ్యాల్సొ చ్చినా నువ్వేనాడూ తిరస్కారంగా మాట్లాడ లేదు. విసుక్కోలేదు. పని ఎగ్గొట్టలేదు. నీ ఆరోగ్యం బాగైన తర్వాత మళ్ళీ మామూలుగా చేద్దువుగానిలే!” అని సావిత్రిని అనునయించారు. వారి మంచి మనస్తత్వం, వారి మాటలూ సావిత్రికి కళ్ళు చెమ్మగిల్లచేశాయి. ”నేను లేచిపోయి వచ్చేసిన తర్వాత నా కన్నవాళ్ళు కూడా ఇలా ఆప్యాయంగా ఆదరించలేదు. మీరే నా తల్లిదండ్రులు అమ్మగారూ! నావాళ్ళకి దూరమైనా మీలాంటి తల్లుల్ని చూపించాడు ఆ దేవుడు” కళ్ళొత్తుకుంటూ అంది సావిత్రి.

ఆవేళ సావిత్రి సుభద్రమ్మకి సహా యంగా వాళ్ళ బంధువులింటికి వెళ్ళింది. అక్కడ నిలువెత్తు వేంకటేశ్వరుని చిత్రం చూసి ముగ్ధురాలైపోయింది సావిత్రి. ఏదో ఎగ్జిబిషన్‌లో కొన్నారట. ద్వారబంధానికి వేసేటంత చిత్రం. కొనితెచ్చి, ఆ ఇంటాయన మళ్ళీ దానికి చక్కని ఫ్రేమ్‌ కట్టించాడట. ఆయన కళాప్రియుడట. వాళ్ళు బాగా స్థితిపరులు కావటంతో ఆయనకున్న కళాప్రియత్వం సఫలమైంది. చిన్ననాడు తను ఏవేవో బొమ్మలు గీసి, దానికి బయట ఏరుకొచ్చిన తళుకులు అంటించి అందరి చేత మెచ్చుకోబడిన రోజులు గుర్తొచ్చాయి సావిత్రికి.

తళుకులతో… కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న స్వామి చిత్రం ఆ రాత్రంతా సావిత్రి గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంది. ఏ పనిచేస్తున్నా మనసు మాత్రం ఏవేవో దైవ చిత్రాలు వేసి, వాటిని ఖరీదు ఎక్కువ కాని పద్ధతిలో ఆకర్షణీయంగా తయారుచేయ వచ్చుననే ఊహలు సావిత్రి హృదయాన్ని చుట్టుముడుతున్నాయి. ఆ ఆలోచనలతో సావిత్రి ముభావంగా తయారైంది. ఇంట్లో భర్త, పిల్లలు, బయటవాళ్ళు చాలాసార్లు అడిగి ఊరుకున్నారు. నాలుగురోజుల్లో సావిత్రి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. గుట్టుగా తన ఆలోచనలను, ఊహలను క్రియలో పెట్టటం మొదలెట్టింది.

గాజులకొట్టు దగ్గర చిట్లిన గాజుపెంకులు ఏరటం చూసి ఆ కొట్టావిడ ఆవేళ్టి బేరాల్లోని ఓటిగాజులు కూడా ఇచ్చింది. అలా తరుచు ఏరిన గాజులను చిత్రాల తయారీకి సిద్ధం చెయ్యసాగింది. ఇంటికి పెయింటింగ్‌ వేయిస్తూ పాతబడిన కేలండర్లు తీసి పారేస్తుంటే వాటిని జాగ్రత్తచేసి ఇంటికి తెచ్చుకుంది సావిత్రి. తనకున్న సమయంలోనే కొంత తను తయారు చేయబోతున్న ”చిత్రం” కోసం వినియోగిం చాలని నిర్ణయించుకుంది.

కళాదృష్టితో చాలా వివరంగా తను తెచ్చుకున్న కేలండరు బొమ్మల్ని గమనించి, తన అంతరంగంలో నిక్షిప్తం చేసుకుంది సావిత్రి. అన్నిటిలో ”సుబ్రహ్మణ్యేశ్వరుని” కేలండరు నచ్చింది.        తను సేకరించిన ఆకుపచ్చ బట్టమీద ఆ బొమ్మని గీయసా గింది. ఎవరికీ తెలియకుండా పనిచెయ్యాల్సి రావటం వలన ఏకాగ్రతకు భంగం కలుగు తున్నందువలన ఆ బొమ్మ గీయటానికే మూడువారాలు పట్టేసింది. తను తెచ్చిన గాజుముక్కల్ని నూరి మెత్తగానూ, సన్న రవ్వ, ముతక రవ్వ తరహాలలో తయారుచేసుకుంది. వేర్వేరు కాగితాలలో, వేర్వేరు రంగులు వివరంగా వ్రాసి పొట్లాలు కట్టుకుంది. ఒకోరోజు తక్కువగా, ఒకోరోజు ఎక్కువ గానూ పనిచేస్తూంది. ఆమె తపస్సు ఫలించి రెండడుగుల వెడల్పు, మూడడుగుల పొడవు గల ”సుబ్రహ్మణ్యేశ్వరు”ని చిత్రం పూర్తయే సరికి ఇంచుమించుగా నాలుగునెలలు పట్టింది.

చిత్రం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ చాలా హుందాగా తయారైంది. మధ్యమధ్య తీసి చూసుకుని మురిసిపోయి, కన్నులకు అద్దుకుని తిరిగి దాచేస్తోంది సావిత్రి ఆ చిత్రాన్ని, కుమారస్వామికి గురువైన విఘ్నేశ్వరుని చిత్రాలు కూడా రెండు తయారుచేసింది. పెద్ద బొమ్మంత కష్టపడకపోయినా ఈ బొమ్మల్ని కూడా చాలా శ్రద్ధగానే చేసింది సావిత్రి. ఆ మూడు బొమ్మల్ని చూడకుండా ఉండలేని స్థితికి వచ్చింది సావిత్రి. రోజుకి రెండుసార్లు చూచి దాస్తోంది. ఒకరోజు మనసుని గట్టి చేసుకుని బజారంతా తిరిగి ఫోటోలు అమ్మే కొట్లన్నీ తిరిగి వివరాలు తెలుసుకుంది. ఆశ్చర్యం కలిగిందామెకు. తను చిత్రాలను తీర్చిదిద్దటంలో చాలా కష్టపడుతున్నమాట నిజమే… కాని? ఆ చిత్రాలకు… అదే… అలాంటి చిత్రాలకు అంత ఖరీదు ‘పలకటం’ ఆశ్చర్యం కలిగించింది సావిత్రికి.

బజారంతా మళ్ళీ వెనక్కి… ముందుకి తిరిగి ఒక కొట్టువానికి తన దగ్గరున్న విఘ్నేశ్వరుని బొమ్మ చూపించింది సిగ్గుగా! తనకు తెలిసిన ఒక కళాకారిణి అమ్మిపెట్టమని తనకి ఇచ్చినట్లు చెప్పిందామె!  ”మూడు వందలకంటే ఒక్క పైస కూడా ఎక్కువ ఇవ్వను” ఖరాఖండీగా చెప్పాడు కొట్టతను. అక్కడ కనిపిస్తున్న బొమ్మల కంటే తను చేసిన చిత్రం మరికాస్త బాగున్నట్లనిపించటంతో… బాగా ధైర్యం తెచ్చుకుంది సావిత్రి. ఆ బేరం నచ్చనట్లు మొహంపెట్టి, ఆ కొట్టు మెట్లు దిగేసింది సావిత్రి. ”సరే! నాలుగొందలిస్తాను. ఇచ్చేసి పో!” అనటం వెనుకనుంచి వినిపించింది. సావిత్రి ఆగలేదు. నిదానంగా ముందుకి నడుస్తూనే ఉంది. ఆమె మేనమామ వ్యాపారస్తుడు. అతడు ”మనం కొనేటప్పుడు బేరాన్ని అయినంత దించాలి! మనం అమ్మేటప్పుడు అవకాశం ఉన్నంత పెంచుతుండాలి!” అని చెప్పటం గబుక్కున గుర్తొచ్చింది సావిత్రికి. ”సంగత్తేల్చకుండా అట్టా పోతావేంటి?” అంటూ గబగబ ముందుకొచ్చి సావిత్రిని నిలిపాడు కొట్టువాడు. ”అయిదొందలిస్తాను! ఇలాంటివే ఇంకా కొన్ని కావాలి మాకు. వాటికి ఇంకొంచెం ధర పెంచి ఇస్తానులే! ఇప్పటికి అయిదొందలు కంటే ఇవ్వలేను” అన్నాడు. అతడు దీనంగా అడుగుతున్నట్ల నిపించింది. పైగా ఇలాంటివే ఇంకా కొన్ని కావాలనటం… వాటికి ధర పెంచి ఇస్తాననటం సావిత్రికి ఆనందంగా అనిపించింది. అంత ఆనందంలో కూడా తను ముందర చెప్పిన సంగతి మర్చిపోలేదు. ”ఆయమ్మకి సాయం సేయాలని శానా తిరిగాను బజారంతా! నాకు బస్‌ చార్జీలిప్పించండి బాబూ చాలు!” అంది గడుసుగా. కొట్టు ఆసామి ”చిత్రం” ఖరీదుతోబాటు పదిరూపాయల నోటు అందించాడు. ”సంతోషమే గదా!” అన్నాడు చిరునవ్వుతో.

అసలు… ఆ బొమ్మని ఇంటినుంచి తెస్తూ – ఏభై రూపాయల కంటే తక్కువ చెప్పకూడదనీ, బేరం ఆడినా ఐదు రూపాయల కంటే తగ్గించకూడదనీ అనుకుంది. కాని… తను అత్యాశపడు తోందా? ఏమో… ఏభైరూపాయలు రావేమో!” అనుకుంది. తను అనుకున్నదానికీ… అక్కడ జరిగినదానికీ అసలు పోలికే లేదు. గాలిలో తేలిపోతు న్నట్లున్న మనస్సుతో ఇంటికి చేరింది సావిత్రి. ఇంటిలో తను దాచిన చిత్రంలో ‘గణపతి’ ఆకాశంలో మెరుపులా మనస్సులో మెదిలి దీవిస్తున్నట్లనుభూతి చెందింది. తను ఎంతో ఇష్టంగా సృష్టించిన ”సుబ్రహ్మణ్యే శ్వరుడు” అతని శూలంతో తన దారిద్య్రాన్ని చీల్చి చెండాడుతున్నట్లుగా భావన కలుగు తోంది సావిత్రికి.

”అడుగడుగునా తనని ఆదుకున్న వాళ్ళకి ముందు చూపటమా? ఓటిగాజుల్తో పాటు మంచి సలహాలిచ్చిన ఆమెకు ముందు చూపటమా?… భర్తా- పిల్లలకి ముందు చూపటమా…?” అలా… అలా… చాలా ఆలోచించింది సావిత్రి. ”అమ్మో! తన గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని ”టాంటాం” చేసేత్తారు ఒద్దొద్దు” అప్పుడే అంత ప్రచారానికి ఆమె అంతరంగం అంగీకరించటం లేదు. పిల్లలకి, భర్తకి మిఠాయిలు కొనుక్కెళ్ళింది సావిత్రి.

ఆ వేళ ”చిత్రం”లోని ‘సుబ్రహ్మ ణ్యేశ్వరుడి’తో కబుర్లు చెప్పి, దాచేస్తూంటే ”నన్నెన్నాళ్ళిలా లోపలే ఉంచుతావు?” అని అడిగినట్లనిపించింది. ఈ బంగారు తండ్రిని తయారుచెయ్యటానికి నేనెన్నిపాట్లు పడ్డాను. గాజుల పొడి అంటించటానికి చవకరకం జిగురు అంటించింది కాని… ఆ జిగురు మెరుపుల రంగుని తగ్గించేసి, నల్లబరిచాయి. ‘ఫెవీక్విక్‌’ కొనటం తప్పనిసరైంది. ఈ వివరాలన్నీ తెలుసుకొనే సరికి కొన్నిరోజులు పట్టేసింది. కొట్టుకి వెళ్ళి అడిగితే రకరకాల ప్రయోజనాలకోసం వాళ్ళు చూపించినవి చూసి”ఇన్ని రకాలా?” అని ఆశ్చర్యపోయింది సావిత్రి. చిన్న, చిన్న కుంచెలు అమర్చుకో టానికి కూడా మరికొన్నిరోజులు గడిచిపో యాయి. తాననుకున్నంత సులభంగా కాలేదు ఆ పనులన్నీ. ఆమె అంటించిన గాజు రజను చిన్న కాంతికి కూడా ”మిలమిల” మెరు స్తూంటే ఎనలేని తృప్తి కలిగింది సావిత్రికి.

శ్రేయోభిలాషుల గట్టి ప్రయత్నంతో ”సుబ్రహ్మణ్యేశ్వరు”ని చిత్రాన్ని ‘ఎగ్జిబిషన్‌’కి పంపారు. జాతీయస్థాయికి చెందిన ఆ పోటీలో రకరకాల చర్చల అనంతరం సావిత్రి తయారుచేసిన చిత్రానికి మూడవ బహుమ తిగా లక్ష రూపాయలు నిర్ణయించారు. ఆ తర్వాత సావిత్రి – లక్ష్మి, సరస్వతి, పరమేశ్వరి మొదలైన దైవ చిత్రాలతో బాటు నిరాడంబర చిత్రాలు కూడా నమూనాలను కొంత మార్చి గీసి… తీర్చి దిద్దింది. కాని… ఆడంబరంగా కనిపించే, కళ్ళు మిరుమిట్లు గొలిపి – మెరిసే చిత్రాలకు వచ్చినంత ప్రాచుర్యం రాలేదు.     కాని సావిత్రికి ప్రగతిని సాధించ గలననే ఆత్మవిశ్వాసం పెంపొం దింది. కాలం తెచ్చిన మార్పుల్లో పరిస్థితులు కూడా మారటం సామాన్యమే కదా! ఇప్పుడు సావిత్రి దగ్గర పని నేర్చుకునే వాళ్ళు కొందరు ఉంటున్నారు. ఒక నెల, రెండు నెలల కోర్సులకు క్లాసులు నడుపు తోంది సావిత్రి. దానికితోడు కాగితాలు రుబ్బి తయారుచేసే బొమ్మలు కూడా నేర్పుతోంది.

మంచి వైద్యం చేయించగలగటం వల్ల సిద్దయ్య కూడా బాగా కోలుకుని పనికి వెళ్ళి వస్తున్నాడు. పిల్లలు బాగా చదివి, వృద్ధిలోకి వస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఆనాడు తను దర్శించిన అపురూపమైన ”శ్రీవేంకటేశ్వరు”ని నిలువెత్తు చిత్రం! ఈనాటికీ సావిత్రి ”మనోఫలకం”పై పదిలంగా విరాజిల్లుతోంది. వందనాలందు కుంటోంది. చాలాసార్లు పత్రికావిలేకర్లు వస్తుండేవారు. వాళ్ళు ”మీ క్రియాశీలత గురించి మా పత్రికలో ప్రచురిస్తాం! అయితే దానికి కొంత డబ్బు కట్టాల్సుంటుంది” అన్నారు. ”ఇది చాలా చిన్న పని. దీనికంత ప్రచారం అనవసరం” అని సౌమ్యంగానే తిరస్కరించింది సావిత్రి. సావిత్రి చిత్రం ”బహుమతి” అందుకున్న విషయం తెలిసిన తర్వాత ”సన్మానం” చెయ్యాలనుకుని… విలేకరి స్థానంలో వచ్చినవాడు కార్యసాధకుడే కాకుండా నిస్వార్థపరుడు కూడా! మీ పరిచయంవల్ల మా పత్రికకి ప్రాచుర్యం… మావల్ల మీ చిత్రాలకు వ్యాపారానుకూలం! పరస్పర సహకారం! అంతే! అంటూ నచ్చచెప్పాడు. ”నీ పేరేమిటి?” అని ఎవరైనా అడిగేసరికి తడబడటం ఇప్పటికీ పోవటం లేదు. ఏమనుకున్నాడో ఆ కుఱ్ఱాడు? ఈసారి తడబడకుండా చెప్పాలి” అనుకుని…

”తన అసలు పేరు మారుస్తు న్నప్పుడే తను ఒప్పుకోకుండా ఉండాల్సింది. పెళ్ళైన కొత్తలో అదొక మోజు…! మొగుడు పొగిడితే చాలు… అదేదో… పె…ద్ద… అపురూపంగా అనిపించేసి – ఆనందపడి పోవటమే గాని – ఆ పేరు మార్పుల వల్ల మున్ముందు రాబోయే ఇబ్బందుల్ని తను తెల్సుకోలేకపోయింది. అయినా ”చుక్క”… ”చుక్కమ్మ” అనే పేరులో బాగోపోవటమే ముంది? అందంగా ఉన్నవాళ్ళని ”చక్కని చుక్క” అంటారు కూడా కదా?!” ఇలా చాలాసేపు తర్కించుకున్న తర్వాత తను తయారుచేసే ”కళాకృతి”లలో ఒక మూల ”చుక్క” అని వ్రాయటం మొదలెట్టాలని నిర్ణ యించుకుందామె. తనవద్దనున్న చిత్రాలన్నిం టికీ ఒకమూల చిత్రించింది కూడా.

ఆమెకు తెలియకుండానే ఆమె అంతరంగం విలేకరికోసం ఎదురుచూస్తోంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.