రాజ్యాంగ నైతికత – సొరాజ్జెం నవల – Volga

సామాన్యంగా రచయితలకు గ్రామీణ జీవితం మీద వల్లమాలిన వ్యామోహమూ మమకారమూ ఉంటుంది. కొడవటి గంటి కుటుంబరావు వంటి కొందరు రచయితలు తప్ప గ్రామీణ జీవితాన్ని చిన్నచూపు చూసిన, అందులో పురోగతి గానీ అభ్యుదయం గానీ లేదని చెప్పిన రచయితలు తక్కువ. సాహిత్యంలోనూ, మన సాంఘిక భావజాలంలోనూ బేషరతుగా గ్రామాలను గ్లోరిఫై చేసే ధోరణి మనకు జాతీయోద్యమ నేపధ్యం నుండి అందినట్లు కనిపిస్తుంది. గాంధీ గ్రామ జీవితాన్ని ఆదర్శీకరించి, అలాంటి గ్రామీణ రామరాజ్యం గురించి మాట్లాడాడు. గ్రామీణ జీవితంలో కరడుగట్టిన కుల వ్యవస్థ గురించి గాంధీ ప్రతిపాదించిన రామరాజ్యం ఏమీ మాట్లాడదు. గాంధీ ఆలోచనలకు భిన్నంగా అనేకమంది సంస్కర్తలు ఆ గ్రామీణ జీవితాన్ని తిరస్కరించారు. ”జ్యోతిబా పూలే నుంచి అమోతీదాస్‌ నుంచీ అంబేద్కర్‌ వరకూ గతంలో జరిగిన దోపిడి మూలాలను విశ్లేషించి దానిని అంతం చేయటానికి ఒక మార్గం వేయటం కోసం అన్వేషించారు. దీనికి వాళ్ళు ప్రేరణను ఉన్న వ్యవస్థను వ్యతిరేకించిన మత కాల్పనిక వాదుల నుండి పొందారు. ఒక కొత్త సమాజాన్ని ఊహించిన వీరు సంపదకు ముఖ్య ఆధారం సాంకేతిక ప్రగతి అని ఆమోదించారు. వారు నగరం కోసం గ్రామాన్ని తిరస్కరించారు. ఆధునిక యుగపు తొలి సంవత్సరాలలో రాడికల్‌ భావాలు చెప్పిన సాధువులు ప్రేమనిండిన నగరాన్ని, బాధలేని నగరాన్ని కలగన్నట్టే ఈ మేధావులూ ఊహించారు. ఆ సాధువులు వాడిన ఉపమానాలు, వారు లేవనెత్తిన సంప్రదాయాలు, గాంధీయిజంకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గాంధీయిజం భగవద్గీత మీద ఆధారపడింది. రామరాజ్యాన్ని, స్థిరమైన, సామరస్యమైన, ఆధిపత్యంతో కూడిన ఆదర్శవంతమైన గ్రామాన్ని దేశీయ చైతన్యం మీద చెక్కింది (గైల్‌ ఆమ్యెట్‌, సీకింగ్‌ బేగంపురా, 2008, నవయాన, పుట 19) ఆ రామరాజ్య భావనతో ఆదర్శీకరించిన గ్రామాలలో నిండిన క్రూరత్వాన్ని, కర్కశత్వాన్ని అర్ధం చేసుకుని దానిని నిర్మూలించాల్సిన అవసరాన్ని గుర్తించటమే రాజ్యాంగ నైతికత. ఆ రాజ్యాంగ నైతికతను మనం ఎన్నో విధాల అలవరుచుకోవచ్చు. వాటిలో సాహిత్యం కూడా ఒకటి. అక్కినేని కుటుంబరావు రాసిన ”సొరాజ్జెం” నవల గ్రామీణ కుల వ్యవస్థలోని రాక్షసత్వాన్ని విప్పిచెప్పి మనలో రాజ్యాంగ నైతికతను పెంపొందించగల నవల. ఆ నవలను రాజ్యాంగ నైతికతను ప్రాతిపదికగా తీసుకుని అంచనా వేయటమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం. ”భారతీయ గ్రామం రిపబ్లికన్‌ భావనకు పూర్తిగా విరుద్ధమైనది. ఒక వేళ భారతీయ గ్రామమే రిపబ్లిక్‌ అయితే ఆ రిపబ్లిక్‌ స్పృశ్యుల చేత స్పృశ్యుల యొక్క, స్పృశ్యుల కొరకు ఉన్న గ్రామం అవుతుంది. అందులో ప్రజాస్వామ్యానికి సోదరత్వానికి, సమానత్వానికీ, స్వేచ్ఛకూచోటు లేదు” (అంబేద్కర్‌ 2002, :330 కోటెడ్‌ కల్పన కన్నాబిరాన్‌, టూల్స్‌ఆఫ్‌ జస్టిస్‌, పుట 234) అన్న అంబేద్కర్‌ మాటలను ఒక గ్రామంలోని దళిత జీవిత వాస్తవ కథనంతో పోల్చి చూడటం కూడా ఈ వ్యాస రచన ఉద్దేశం.

”సొరాజ్జెం” నవల కృష్ణాజిల్లాలోని చౌటపల్లి గ్రామంలో జిరిగిన కథ. కథలో అన్ని సంఘటనలూ ఆ గ్రామంలో జరగలేదనీ, చుట్టు పక్కల గ్రామాలలో జరిగిన ఒకటి రెండు సంఘటనలను ఈ గ్రామంలో జరిగినట్లు రాశాననీ రచయిత చెప్పారు. చౌటపల్లిలో మాలపల్లిలోని ఎంకడి కుటుంబం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఎంకడు, భార్య పద్దాలు, కొడుకు తిరపతి, పద్దాలుకి ఎంకడికి స్వతంత్ర దినం రోజు పుట్టి, ఆ ఊరి కాంగ్రెస్‌ పెద్ద బ్రహ్మంగారి చేత స్వరాజ్యమని నామకరణం చేయించుకుని సొరాజ్జెంగా అందరిచేతా పిలవబడ్డ సొరాజ్జెం ఈ నవలకు నాయిక. సొరాజ్జెం 1947 ఆగస్టు 15 న పుట్టింది. 16 సంవత్సరాలు ఆ ఊళ్ళో పెరిగింది. ఆ పదహారు సంవత్సరాలలో – స్వతంత్ర దేశంలోని తొలి పదహారు సంవత్సరాలలో రాజ్యాంగం రాయబడిన మొదటి 13 సంవత్సరాలలో ఒక గ్రామంలోని మాలపల్లి ప్రజల జీవితం ఈ నవల కథా వస్తువు. అదేకాదు స్వతంత్రం వచ్చాక దానిని తాము బాగుపడటానికి తమ ఆధిపత్యాన్ని గ్రామాలలో స్థిరపరుచుకోటానికి, ఆ ఊరి అగ్రవర్ణ భూస్వాములు, రైతులు ఎట్లా ప్రయత్నించారన్నది కూడా ఈ నవలకు కథా వస్తువే. ఆధిపత్యమూ, అణచివేత, బానిసత్వము, పరాధీనత ఈ రెండు నవలలోని ప్రధాన ఇతి వృత్తాలు. రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలవి. ఆ సంబంధం ఒకప్పుడు కరడుగట్టిన సంబంధం. స్వతంత్రం, రాజ్యాంగం కలిసి ఆ సంబంధాన్ని కదిలించాయి. కుదిపాయి. ఆ కుదుపు ఆధిపత్యాన్ని భయపెట్టేంత పెద్దది కాదు. బానిసత్వాన్ని పోగొట్టేంత విప్లవాత్మక మైనదీ కాదు. స్వతంత్రం, రాజ్యాంగం తొలి సంవత్సరాలలో దళితులకు ఇవ్వవలసిన ఆత్మ గౌరవాన్ని, ప్రతిఘటనా స్వరాన్ని ఇవ్వలేకపోయామని, అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాలను మరింత స్థిరపరుచుకునేందుకు మార్గాలను వెతుకుతూ, సాధనాలను సమకూర్చుకునేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారనీ ”సొరాజ్జెం’ నవల చదివినపుడు మనకు అర్థమవుతుంది. కుటుంబరావు నవలా రచనలో సంప్రదాయ మార్గాన్ని వదిలివేశాడు. ఆయన నవలల్లో కథంటే జీవిత చిత్రణకు ప్రాధాన్యత ఉంటుంది. ప్లాట్‌ కూడా సంప్రదాయక పద్ధతుల్లో నడవదు. గ్రామంలోని అనేక జీవితాలు, గ్రామ నైసర్గికత నుంచి, మానవ సంబంధాల వరకూ ప్రతిదీ వివరంగా, సూక్ష్మంగా, క్లుప్తంగా పాఠకులకు పరిచయమవుతాయి.

”సొరాజ్జెం” నవల మన దేశ స్వాతంత్య్రం వచ్చిన రోజే మొదలవుతుంది. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. రచయిత స్వతంత్రం ఎలా ఉండబోతోందో ఎలా ఉంటుందని అప్పటి ప్రజలు ముఖ్యంగా మాలపల్లిలోని ప్రజలు అనుకున్నారో తరువాతి రోజుల్లో దేశంలో ఏ మార్పులు ఎవరి మేలు కోసం జరుగుతాయో సూచిస్తూ స్వతంత్రం వచ్చిన రోజున, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆగష్టు 14 సాయంత్రం – ఢిల్లీలో దేశీయ, సామ్రాజ్యవాద నాయకులందరూ భారతదేశ స్వతంత్రానికి సంకేతాలను, సారాంశాన్ని సమకూరుస్తున్న సమయంలో, హిందు ముస్లింల మధ్య ఘర్షణలలో రక్తం ప్రవహిస్తూన్న క్షణాలలో భయంకరమైన హింస దేశ ప్రజల మనసుల్లో మరి మర్చిపోలేకుండా ముద్రవేసుకుంటున్న సమయంలో, చీకట్లు ముసురుకుంటూ, మబ్బులు కమ్ముకుంటూ ఉన్న వాతావరణంలో నవల చాలా ఇంబాలిక్‌గా మొదలైంది. తల్లి పురుటి నొప్పులు పడి, సరైన వైద్య సౌకర్యారాలు కాదు గదా, కాస్త పరిశుభ్రమైన నేల కూడా లేని చోటున ”సొరాజ్జెం” పుట్టింది. పుట్టింది స్వరాజ్య మని తల్లిదండ్రులు గానీ, మాలపల్లిలోని ఏ ఒక్కరు గానీ అనుకోలేదు. ఆగష్టు 15 ఉదయాన్నే మాలపల్లి సందర్శించాల్సిన తన రాజకీయ అవసరాన్ని గుర్తించిన, ఆ ఊరి భూస్వామి, స్వతంత్ర భారత నిర్మాతగా ఎదగాలనే కాంక్ష ఉన్న బ్రహ్మంగారు ‘సొరాజ్జెం’ వచ్చిందని, ఎంకడి కూతురికి ఆ పేరు పెట్టాడు. ఎంకడికి కూతురికి పేరు పెట్టుకునే అధికారం కూడా లేకుండాపోయింది. తర్వాత బ్రహ్మంగారు స్వతంత్రదిన సందేశాన్ని మాలపల్లిలో వినిపించాడు. ”మనమంతా అన్నదముల్లా కలిసిమెలిసుండాలి. అన్నొక మాటన్నా ఒక దెబ్బేసినా తమ్ముడు ఎదురు తిరుగుతాడా? తిరగడు” అంటూ అసలు సారాంశాన్ని చాలా తేలిక మాటల్లో చెబుతాడు. కుటుంబ అధికార చట్రాన్ని అమలు చేయందే, స్వతంత్ర దేశంలో అసమానత్వాన్ని అణిచివేతని భరించలేని కులాల తిరుగుబాట్లని అణిచివేయటం కుదరదని బ్రహ్మం సూచిస్తున్నాడు. అన్నదమ్ముల్లా ప్రేమగా ఉండాలని కాదు ఆయన చెప్పేది. అన్నొక దెబ్బేసినా తిరగబడని తమ్ముడు కావాలి. ప్రశ్నించే వీలు లేకుండా వేల సంవత్సరాలుగా కుటుంబం కొనసాగిస్తున్న అధికార సంబంధాలను రాజ్యం బలపరుస్తుంది. ఆ విలువలను తన మనుగడకు వాడుకుంటుంది. స్వతంత్రం వచ్చిన తొలిరోజునే పిత్రుస్వామ్య కుటుంబానికి, రాజ్యానికి ఉన్న ముడిని భద్రపరిచే నీతివాక్యాలతో రాజ్యాంగ నీతులకు చోటు లేకుండా చేసే పాలకవర్గాన్ని పరిచయం చేశాడు రచయిత. నిజానికప్పుడు రాజ్యాంగం లేదు. రాబోయే రాజ్యాంగంలో కూడా వయసు కారణంగా చూపించే వివక్ష గురించిన ప్రస్తావన లేదు. తర్వాత బాలల హక్కులు వివరంగా రాసుకున్నారు. వృద్ధుల గురించి ఇప్పటికీ ఇదమిద్ధంగా ఒక హక్కుల పత్రం వంటిదేమీ ఉన్నట్టు లేదు.

బ్రహ్మంగారు స్వతంత్రం గురించి, అన్నదమ్ముల్లా ఉండాల్సిన అవసరం గురించి చెప్పిన మాటలు ఎంకడిలో మాలపల్లెలో చాలా ఆలోచనలే రేపాయి. వాళ్ళకు తెలిసిన స్వతంత్రోద్యమం మోటూరెళ్ళి రైలు పట్టాలు పీకటం, అంగలూరు వెళ్ళి గాంధి గారిని చూడటం. ఈ రెండిటితో తెల్లాళ్ళు వెళ్ళారంటే నమ్మలేకపోయాడు ఎంకడు. అన్నదమ్ముల్లా ఉండటమంటే అధికారం సంగతలా ఉంచి వివక్ష లేకుండా పోవటం, వనరుల్లో సమాన భాగస్వామ్యం. ఏమీ చదువుకోక పోయినా ఎంకడికి, అతని భార్య పద్దాలు కీ ఈ విషయం జీవితానుభవం ద్వారా తెలిసింది. పద్దాలు తమకు ”కూత్త మడిసెక్కేదన్నా దొరుకుతే” అని ఆ లోచించింది. ఎంకడికీ తనకు పరిచయమైన వివక్ష అంతా గుర్తొచ్చింది.

”వాకిట్లో మంచంమీద కూర్చున్న బెమ్మంగారు…. ఇద్దరు, ముగ్గురు మాలవాళ్ళు దూరంగా చేతులు కట్టుకుని నిలబడి ఉండటం…. వాళ్ళల్లో ఒకడికి దాహమైతే, దూరంగా ఉండమనే హెచ్చరికల్తో, దోసిల్లో ఎత్తుగా పెట్టిన చెంబుతో నీళ్ళు పొయ్యడం… యియ్యన్నీ పోతయ్యా, అంతా కలిసి మెలిసి ఉంటారా? పెళ్ళిళ్ళకీ, పండగలకి అందరి భోజనాలు అయ్యినాక ఆకరి బంతిలో కూచ్చోమనకుండా కలిసి మెలిసి తింటారా? మాలల్ని కమ్మ రాములోరి గుళ్ళోకి రానిత్తారా? కమ్మ దొరలు మాలపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారా? మాలాడికి కమ్మ దొరలు పిల్లల్నిత్తారా? ఇయ్యన్నీ జరిగేయేనా?”

వనరుల గురించి, వివక్ష గురించి రచయిత ఇన్ని మాటలు చెప్పాక కులం గురించి, కుల అణచివేత గురించి మనం ఆలోచిస్తాం. ఈ అణచివేత సంఘటనలు ‘సొరాజ్జెం’లో అనేకం కనిపిస్తాయి. మొత్తంమీద కులం అగ్రవర్ణాలలో ఆధిపత్య భావనను కలిగించి, వనరులను స్వంతం చేసుకోవటం, శ్రమను దోపిడీ చెయ్యటం, హింసా దౌర్జన్యాలతో దళితులను అణచటం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రతిక్షణం కించపరచి అవమానించటం ద్వారా వారిలో కూడా ఆత్మన్యూనతా భావం ఏర్పడి, తమంత తాముగా ఆధిపత్య భావనలను, కులాలను గౌరవించే స్థితిలోకి జారటం – వీటన్నిటికి కారణమవుతుంది. ఈ వివక్షలను, హింసలను కుల సమజాన్నీ కొనసాగించే విధం సాంఘిక నిర్మాణాలన్నిటిలోనూ అత్యంత ఆశ్చర్యకరమైనది. నీచమైనది.

వనరుల మీద ఆధిపత్యం లేకపోవటం అనే విషయం సొరాజ్జెంలో అనేకచోట్ల ప్రస్తావనకు వస్తుంది. సొరాజ్జెంని తీసుకు ఎంకడ మూల్లంక వెళ్ళి తాటికాయలు తెచ్చుకుంటాడు. మూల్లంక ఎవరి స్వంత ఆస్తీకాదు. అక్కడితాటిచెట్లలో గల దానిమ్మ చెట్టువి, పక్క ఊరివారీవి కోసుకుంటాడు తాటి చెట్టు ఎక్కగలిగిన వారెవరైనా కోసుకోవచ్చు. ఎంకడు అలాగే కోసి, తనూ, సొరాజ్జెం తిని, ఒకటి రెండు కాయలు ఇంటికి పట్టుకెళ్తుంటే దారిలో కనపడ్డ అమరయ్య తాటికాయల గురించి కోపంగా మాట్లాడతాడు. మీవి కాదని చెబితే. ”ఎవరియ్‌రా లంజాకొడకా. నాయైతే ఎముకల్లో సున్నం లేకుండా కుమ్మబొడవనూ” అంటాడు అమరయ్య. రెండు తాటికాయలకి ఎంకడు చెల్లించాల్సి వచ్చే మూల్యం అది. ఆ కాయలు అమరయ్య చెట్టువి అయితే ఎంకడికి ప్రాణాలు దక్కేవి కావు. రచయిత ఈ సహజ వనరుల విషయంలో మాలపల్లెలకు జరిగే అన్యాయాన్ని, అగ్రవర్ణాలు వాటిని దౌర్జన్యంగా స్వంతం చేసుకోవటం గురించే రెండు వాక్యాలలో అద్భుతంగా చెప్పాడు. ”తెల్లగా వెన్నెలొచ్చింది. మాలపల్లి క్కూడా, వెన్నెల ఆకాశం మీద నించొచ్చేది కాబట్టి గానీ లేకపోతే దొరలు మాలపల్లికి వెన్నెల్ని రానిచ్చేవారు కాదేమో”.

సందేహం లేదు. రానిచ్చేవారు కాదు.

బ్రాహ్మణకులాధిపత్యాన్ని మిగిలిన కులాల వాళ్ళందరూ ఒప్పుకునేలా చేయటంలో కులవ్యవస్థ ఎల్లకాలం నిలబడే శక్తిని సంపాదించుకుంది. ఎంకడికి – రోజూ అగ్రవర్ణాల చేత దూరంగా ఉండమనే ఎంకడికి బ్రాహ్మణుల గొప్ప గురించి సందేహాలు లేవు. సోమయ్య అనే బ్రాహ్మణుడు చచ్చి స్వర్గానికే పోతాడనీ, ఆయన చేయించిన పూజలు ఆయన్ని స్వర్గానికే తీసుకెళ్తాయనీ కచ్చితంగా నమ్మి పద్దాలుతో చెబుతాడు. సోమయ్య ముగ్గురు పెళ్ళాలను మందెట్టి చంపినా సరే బ్రాహ్మడిగా స్వర్గమే పొందుతాడంటాడు ఎందుకని భార్య అడిగితే.

”బేంబడి పుటక మరి”

”దేవుడి కందరూ సమానమేనంటగా”

”అందరూ సమానమేంటి; ఎంత సమానమైనా బేంబళ్ళ దారి ఏరు” అంటాడు. బ్రాహ్మణ జన్మలోని ప్రత్యేకత గురించీ, అందరూ సమానం కాదని వాళ్ళు చెప్పిన మాటల గురించి, ఒకవేళ తప్పీజారీ దేవుడి దృష్టిలో అందరూ సమానమైనా బ్రాహ్మల దారి వేరనే అపారమైన విశ్వాసం ఎంకడిది. అది ఒక్క ఎంకడి విశ్వాసమే కాదు. వందల సంవత్సరాల నుండీ బ్రాహ్మణులు తమ జన్మ గురించి, తమ ఎక్కువ సమానత్వం గురించీ మిగిలిన కులాలందరిలో స్థిరపరిచిన విశ్వాసం. అది ఇప్పటికీ అనేక ఆచారాలలో కనపడుతూనే ఉంటుంది.

ఈ నవలలో అస్పృశ్యత అగ్రవర్ణాల వారి అవసరాల మేరకు ఉంటుంది. వారికి అవసరమైనపుడు మాలవాళ్ళను కొంతవరకూ దగ్గరకు రానిస్తారు. పాలేర్లుగా పెట్టుకున్నపుడు నీళ్ళు కూడా తెప్పించుకుంటారు. దాసీలుగా ఉంచుకున్నపుడు ఇంట్లో దాదాపు అన్ని పనులూ చేయించుకుంటారు. ఈ మార్పు అంటరానితం నేరం దాన్ని పాటించకూడదనే అవగాహన నుంచికాక వాళ్ళ అవసరాల నుంచి వచ్చింది. దానిని వాళ్ళు దాచుకోవాలని కూడా అనుకోరు.

కళ్ళు కనిపించని పొన్నమ్మ గారనే వృద్ధురాలు తన కర్ర పట్టుకుని ఇంటి దాకా చేర్చే పని మాల పిల్లల్ని చేయనిస్తుంది. కళ్ళు కనపడవు కాబట్టి తప్పదు – ”కనపడితే మిమ్మల్ని నా కర్ర పట్టుకోనిచ్చేదాన్నంటరా? దగ్గరకొస్తే కర్ర తిరగేసేదాన్ని గానీ, రామ రామ” అని ఆ పిల్లలతో చెప్పగలిగే ధైర్యం ఆమెకి ఆమె కులం ఇచ్చింది.

సొరాజ్జెం, బోడి, సంకురాత్తిరీ ముగ్గురు పిల్లలూ, పరిగ ఏరుకున్నారు. అరబస్తా దాకా ఒడ్లు పోగేశారు. అవి అమ్ముకుని తమ చిన్న చిన్న కోరికలు తీర్చుకుందామని వారి ఆశ. కానీ వాళ్ళ కుటుంబాల పేదరికం ఎలాంటిదంటే పిల్లలు ఏరి తెచ్చిన పరిగను కూడా పెద్దవాళ్ళు కోమటింట్లో అమ్ముకుని అప్పు తీర్చుకోవాల్సిన పరిస్థితి. దాదాపు నెలరోజులు బురద బురదగా ఉన్న చేలల్లో, ఎండిన చేలల్లో పడి పగలంతా ఏరిన పరిగ తమ ఆశల్ని తీర్చలేదని ఆ పిల్లలు ఏడ్చిన ఏడుపు హృదయవిదారకంగా ఉంటుంది. ఒకవైపు సాంఘిక బానిసత్వం, మరోవైపు అతి పేదరికం. ఈ కుల వ్యవస్థ రెండు రకాలుగా వారిని అణిచివేస్తుంది. జోనే మంచెర్‌ అన్నట్లు ”ఈ వ్యవస్థని బానిసత్వం అని పిలవొచ్చో లేదో గాని కుల అంతరువుల సంఘంలో అట్టడుగున ఉన్నవారు అతి పేదరికంతో బాధపడేవారు ఒకరే” అది సొరాజ్జెం నవలలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. సొరాజ్జెం ఆ ఊళ్ళో గడిపిన పదహారు సంవత్సరాల జీవితమంతా ఆ అమ్మాయి కటిక బీదరికంతో చేసిన పోరాటమే. ఆ బీదరికంలో తల్లీ కూతుళ్ళ మధ్య నిలబడిన సంబంధం అతి మానవీయం. అర్ధవంతం.

ఈ నగరంలో అతి భీభత్సమైన దృశ్యం జోజి హత్య. ఒట్టి హత్య కాదు. చిత్రహింస పెట్టి చంపుతారు కమ్మదొరలు. జోజి దొంగతనం చేశాడని యజమాని నల్లచంటబ్బాయి ఆరోపణ. అతను ఆ మాట అన్నాడో లేదో మిగిలిన కమ్మ దొరలు కోపం తెచ్చుకుని జోజిని ఎలా చిత్రహింసలు పెట్టాలో ఒక్కోళ్ళు ఒక్కో పద్ధతి చెప్తారు. ఒక్కరు కూడా ఏం దొంగతనం చేశాడు? ఎప్పుడు చేశాడు అనే కనీసపు ప్రశ్నలు వేయరు. కమ్మ యజమాని మాల జీతగాడిమీద నేరం ఆరోపించడాంటే అది నిజమని అందరూ నమ్మాల్సిందే. నమ్మారు. ముందు జోజిని చెట్టుకి కట్టేశారు. సోఁవిగారు ”చెప్పుచ్చుక్కొట్టమని” వెళ్ళిపోయాడు.

మొహనరావు ”చేతులిరిచెయ్య”మన్నాడు.

మల్లేశ్వర్రావు కొత్త పద్ధతి చెప్పాడు. ”కాళ్ళూ చేతులు కట్టి కింద పడేసి ఒంటి మీద పంచదార పోసి రెండు బొట్లు నీళ్ళు చల్లాలి. దాంతో జన్మజన్మలకీ బుద్ధొస్తుంది.” ఒకాయన కత్తవలు పెట్టి కుళ్ళపొడవమన్నాడు. చెంపలు పగల గొట్టాడు. ఇంకొకాయన ”వదలమాకండి. కాళ్ళూ చేతులూ నజ్జు నజ్జు చేసి వదలండి. గాడిద కొడుకెవడితో చెప్పుకుంటాడో” అని వెళ్ళిఫోయాడు. అసలు యజమాని కోదండం వేయించాడు. అంతలో మాలపల్లి నుంచి జోజిని రక్షించటానికి యవకులొస్తున్నారని విని యజమాని కిసరనాయిలు పోసి జోజిని తగలబెట్టేశాడు. ఈ ఘోరం గురించి చర్చేలేదు. కాకపోతే మాలపల్లె యువకులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. కోర్టుకి వెళ్ళారు. పోలీసులకి, ప్లీడర్లకి ఒక యకరం పొలం అమ్మి ఖర్చుపెట్టి. యజమాని తప్పించుకున్నాడు. ఖర్చుపెట్టలేని మాలపల్లె యువకులు తమే నేరస్తులయ్యారు. జైలుకి వెళ్ళారు. ఎందుకంటే పొలం గట్టున కొట్లాటలో వాళ్ళే జోజిని చంపారని న్యాయవాదులు న్యాయస్థానంలో నిరూపించగలిగారు.

జోజి హత్య జరిగింది. అది ఒక గ్రామంలో విడిగా జరిగిన అమానుష చర్యగా మాత్రమే చూస్తే మనలో వ్యక్తిగతంగా వివిధ స్థాయిలలో ఉండే మానవత్వం వివిధ రకాలుగా మేల్కొనవచ్చు. స్పందించవచ్చు. దానివలన పాఠకుల వ్యక్తిగత సంస్కారస్థాయిగానీ స్పందనస్థాయి గానీ పెరగవచ్చు. అది పరిమిత ప్రయోజనం. ఐతే ఇక్కడ జరిగింది ఒక హత్య మాత్రమే కాదు. అనేక హత్యలను అనుమతించే కులవివక్షతా ఆవిష్కరణ. రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 16, 21 ల ఉల్లంఘన. ముఖ్యంగా ఆర్టికల్‌ 15 ఆర్టికల్‌ 21 ఇక్కడ కుప్ప కూలిపోయాయి. కులవివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఇచ్చిన హామీ గాలికి ఎగిరిపోయింది. ఇక్కడ మనం వివక్షకు జీవించే హక్కుతో, వ్యక్తిగత స్వేచ్ఛతో పడిన ముడిని విప్పిచూసే అవకాశం దొరుకుతుంది. వివక్షకున్న న్యాయపరమైన ఎన్నో అర్ధాలు మన కళ్ళకు కట్టినట్లు కనపడతాయి. చట్టంలో వివక్షపేరుకు పోయిన విధం అతి స్పష్టంగా తెలిసిపోతుంది. వివక్షకు స్వేచ్ఛ లేకపోవటానికి ఉన్న సంబంధం స్పష్టంగా తెలుస్తుంది. జోజికి తన వైపు నుంచి ఒక్క మాట మాట్లాడే స్వేచ్ఛలేదు. వాళ్ళ వాళ్ళకూ లేదు. అగ్రకులం వాళ్ళు పదే పదే కులంపేరుతో అతను దొంగ అని, శిక్షపడాలని తీర్పునిస్తూపోతారు. జోజిహత్యను ఈ విధమైన విశ్లేషణతో చూస్తే భారతదేశంలో దళితులకు వ్యతిరేకంగా వారి మీద జరిగే హింస ఎంత తేలికగా, ఎంత రాక్షసంగా పెరిగిపోతుందో పెరిగిపోగలదో అర్ధమవుతుంది. దానిని ఆపటానికి కావలసిన చట్టపరమైన స్పష్టమైన ప్రత్యేకమైన రక్షణలు న్యాయ వ్యవస్థ పునాదుల్లో లేవనే విషయం అర్ధమవుతుంది…. ఒక వేళ అలాంటి రక్షణలు ఉన్నా, వాటిలో వ్యాఖ్యానించే పద్ధతులు మళ్ళీ వివక్షను తెచ్చిపెడుతున్నపుడు ఆ చట్టం ఇచ్చిన రక్షణలు ఎలా పనికి రాకుండాపోతాయో తెలుస్తుంది. ఈ విషయం అర్ధమైనపుడు వ్యక్తిగత మానవీయ సంస్కార చైతన్యాలను దాటి సమాజంలో వివక్షత పోవటానికి, రాజ్యాంగ నైతికత పెరగటానికి చేయవలసిన పనుల గురించి పాఠకులు ఆలోచించగలుగుతారు. అలాంటి ‘మేలు కొలుపే” అసలైన సాహిత్య ప్రయోజనం. అందువల్ల ఒక వాచకాన్ని పాఠకులు ఎలా చదువుతున్నారనేది కూడ ముఖ్యమే. ఎలా చదవాలనే దారులు వేయటం సాహిత్య విమర్శకున్న ఒక ప్రయోజనం.

జోజిగాడి హత్య తర్వాత మాలపల్లిలో కాస్త తిరుగుబాటు ధోరణి వచ్చింది. సహదేవుడుని యజమాని ఎర్రసత్తెం కొట్టినప్పుడు తిరపతి మాలపల్లె నుంచి పదిమందిని పోగేసి ఆ రాత్రి ఎర్ర సత్తెం ఇంటికి వెళ్ళాడు. కమ్మదొరలంటే వాళ్లకున్న భయం విశ్వాసం ఎలా పనిచేస్తాయో వాళ్ళు మాలపల్లి నుంచి ఎర్రసత్తెం ఇంటి కొచ్చేసరికి వాళ్ళకు కోపంతగ్గి భయ సందేహాలు ఎలా కమ్ముకుంటాయో రచయిత చాలా వాస్తవికంగా రాశాడు. చివరకు ఆ తగాదాను బ్రహ్మంగారు సర్దుతాడు. బ్రహ్మం ఒకరకంగా ప్రభుత్వ ప్రతినిధి. గాంధీయిజంకు తన ఇష్టం వచ్చిన వాఖ్యానం చేస్తూ ప్రచారం చేసే కాంగ్రెస్‌ మనిషి. అతను రాజ్యంపేరు చెప్పి వాళ్ళను భయపెట్టిన తీరు మొత్తం రాజ్యాంగాన్నే అవమానించేదిగా ఉంది.

”మీరింత మంది ఒక్కసారిగా ఇట్టారావడం అనేది, అదెంత గోరమైన తప్పో మీకు తెలవదురా. తెలిస్తే మీరిట్టా వొచ్చేవాళ్ళే కాదు. యిప్పుడు, ఈ నిమిషాన మిమ్ముల్నందర్నీ బొక్కలోకి తొయ్యొచ్చురా, మీరిట్టా చేశారని, యిట్టా పలానా వూళ్ళో, పలానా మా వాళ్ళంతా మూకుమ్మడిగా వొచ్చి వూరుమీద పడ్డారు అని తెలిస్తే ఢిల్లీ నుంచి గవర్నమెంటు సైన్యాలొచ్చి మిమ్ములందర్ని చంపిమరీ కవాతు కొట్టుకెళ్తాయిరా పిచ్చి సన్నాసుల్లారా.

తిరపతిని పనిలోంచి తీసేశాడు యజమాని నాగభూషణం. పాలేరు పని నుంచి వ్యవసాయ కూలీ అయ్యాడు తిరపతి. అతనిలో తిరుగుబాటు భావాలు ఊళ్ళో అన్నాయాలు చూసి పెరుగుతున్నాయి. మాలపల్లెలో నాయకుడిగా ఎదుగుతున్నాడు. కూలిరేట్లు పెంచాలని సమ్మె చేయించటంలో ముందున్నాడు. పక్క ఊళ్ళ నుంచి కూలీలను తెద్దామని భూస్వాములు ప్రయత్నిస్తుంటే తిరపతి పక్క ఊళ్ళో వెళ్ళి ఆ కూలీల మద్దతు సంపాదించి వాళ్ళు రాకుండా చేస్తున్నాడు. అలాంటి తిరపతిని భూస్వాములు సమించే ప్రశ్నే లేదు. తిరపతి తలపగలగొట్టి శవాన్ని కాలువలో తోసేశారు. మాలపల్లె నుంచి నందిని కూడా చంపేశారు. మాట్లాడేవాడు బతకకూడదు. అది భూస్వాములు గట్టిగా తీసుకున్న నిర్ణయం. సొరాజ్జెం నవలా సమయంలోనే (1960) కాదు – మాలపల్లి నవలలో కూడా ఇదే జరిగింది. సంగదాసుని హత్య చేశారు. అక్కడ కూడా కారణం ఇదే. కూలీల కూలిరేట్లు పెంచమని అడిగిన కూలీలకు నాయకుడు సంగదాసు. యజమాని కోపం పట్టలేక గడ్డపారతో పొడిచి చంపేస్తాడు. అప్పుడు పోలీసులు కేసులు లేకుండా రాజీ చేసుకుంటారు. సంగదాసు శవాన్ని ఇచ్చేటట్లు, అతను చనిపోయిన చోటనే అతని సమాధి కట్టటానికి స్థలం తక్కువ ధరకి ఇచ్చేటట్టు.

సొరాజ్జెం నవలలో పోలీసులూ, కోర్టులూ తమ పాత్ర పోషించాయి. సమ్మె సమయంలో మాలవాళ్ళు వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుని తిరపతిని, పోలిని, చంద్రిని చంపేశారని ఎంకన్న, రత్తయ్య అనే మాలవాళ్ళని జెయిల్లో వేశారు. అందరికీ తెలిసిన నిజం కూడా చచ్చిపోయింది. ఎందుకంటే

”పోలీసులు పురుషోత్తమ రావు చేతిలో ఉన్నారు.

కోర్టులు పురుషోత్తమ రావు చావిట్లోనే ఉన్నాయి.

న్యాయం, ధర్మం పురుషోత్తమ రావు గుబురు మీసాల చిరునవ్వుల్లో చిక్కుకుపోయినాయి. రాజ్యాంగం రాసిన పదిహేనేళ్ళ నాటి పరిస్థితి ఇది. అంబేద్కర్‌ చెప్పినట్లు పేడకుప్ప మీద కట్టిన రాజభవనం” అది అని తేలిపోయింది.

ఆ తర్వాత సాహిత్యంలో కాకుండా యదార్ధంగా జరిగిన ఎన్నో సంఘటనలున్నాయి. కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగాయి. భూస్వాములు మాల, మాదిగ కులాల వాళ్ళు తలెత్తితే, నోరెత్తితే ఎంతటి ఘాతుకాలకు తలపడతారో 1984, 1991 సంవత్సరాల్లో రాజ్యాంగం’ రాసుకున్న నలభై ఏళ్ళకు కూడా పాత సత్యాలే మళ్ళీ మళ్ళీ రుజువయ్యాయి. కారంచేడు కేసులో, చుండూరు కేసులో కోర్టులు న్యాయం చెయ్యలేవా? పత్రికలు, టి.వి.లు చూపిన ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా కోర్టులకు కనపడలేదు. సంగదాసు సమాధిలానే చుండూరులో అమరవీరుల సమాధులు ఊరినడి బొడ్డులో వచ్చాయి. ఐనా ఎవరికీ భయం లేదు. కులపరమైన వివక్షధారాళంగా పెరిగిపోవటానికి, రాజ్యాంగ ఉల్లంఘనలు నిర్భయంగా చేయటానికి న్యాయ యంత్రాంగం సహకరించింది.  ఐతే దళితులు సంఘటిత పడటానికీ, వారి అస్తిత్వం గురించి ఆలోచించటానికి ఈ సంఘటనలు దోహదం చేశాయి. ఒక్క అడుగు ముందుకు వెయ్యటానికి ఎన్ని కాళ్ళు తెగనరకబడాలో.

మాలవాళ్ళను భూస్వాములు ఇంత అన్యాయంగా చంపుతున్నారని, స్వతంత్రం వచ్చాక, రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులు వాగ్దానం చేయబడిన తర్వాత కూడా భారతదేశ గ్రామాలలో దళితుల పరిస్థితి ఇంత భయంకరంగా ఉందని చెప్పిన స్వాతంత్రా నంతరపు తొలి తెలుగు నవల సొరాజ్జెం. ఈ హత్యాకాండ కల్పన కాదు. వాస్తవం. వాస్తవాన్ని నవలారూపంలో చెప్పటమే కుటుంబరావు సాహితీ వ్యూహం.

వ్యవసాయ కూలీల్లో అధికభాగం మాల, మాదిగ కులాలకు చెందినవారే. ”వ్యవసాయ కూలీలుగా వాళ్ళు తగినంత కూలీ డిమాండ్‌ చెయ్యకూడదు. వాళ్ళు తమ హిందూ యజమానులు ఎంత జీతం ఇవ్వాలనుకుంటారో అంత జీతానికే పని చెయ్యాలి. ఆ కూలీ చాలా తక్కువగా ఉండేలా హిందూ రైతులంతా కలిసికట్టుగా ఉంటారు. అది వాళ్ళకు లాభం ఇంకోవైపు అంటరానివాళ్ళకు అధికారం లేదు. వాళ్ళు కూలీ సంపాదించాలి. లేదా పస్తుండాలి. వాళ్ళకు బేరమాడగలిగే అధికారం లేదు. వాళ్ళు నిర్ణయింపబడ్డ కూలీకి పనిచెయ్యాలి లేదా హింసను అనుభవించాలి… వ్యవసాయపు పనులు అయిపోతే వారికి ఏ ఉపాధి ఉండదు. తిండి సంపాదించుకునే మార్గం ఉండదు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో అంటరానివారికి బతకటానికి ఒకేఒక ఆధారం కాస్త భద్రమైనది ఉంది. ఆ గ్రామంలో హిందూ రైతులను అన్నం అడుక్కునే హక్కు…. ప్రస్తుత భారతదేశంలో స్పృశ్యుల నుంచి ఆహారం అడుక్కునే ఈ హక్కే 60 మిలియన్ల అస్పృశ్యులకు ఫ్రధాన జీవనాధారంగా ఉంది. (అంబేద్కర్‌ 202 న : 328-29)

‘సొరాజ్జెం’ నవలలో ఈ వ్యవసాయ కూలీల వేతనాల సమస్య ఎన్ని ఘోరాలకు దారి తీసిందో చూశాం. దానివల్ల పద్దాలు ఇంట్లో పస్తులు పడుకుంటోంది. సొరాజ్జెం పనిచేసే ఇంటి యజమానురాలు మహలక్ష్మమ్మ యధాలాపంగా అంటుంది. ”మీ అమ్మ ఏం తింటందే? ఎప్పుడు చూసిన సగం సచ్చిన మణిసిలాగే ఉంటుంది.

”ఏం తింటదుండే. దాని మొకం. అదేం తినదుండే”

”ఏం తినకపోతే ఎట్టా బతుకుతారే”

”అదేనేటండే? మాలపల్లిలో మా అమ్మలాంటోళ్ళు శానామందుండారుండీ. రెండు మూడు పూటలకోసారి గుక్కెడు గంజినీళ్ళు తాగుతార్లెండి. అదీనుండీ కూర కూరా, అంతా పూట పూటా తినే రాతుంటే మాలపుటకెందుకు పుడతార్లెగండే”

”ఓసీ నీ దుంపతెగ, నీకీ మాటలెవరు చెప్పారే? మాల పుటక పుడితే తిండి తినొద్దేంటే”

”ఎట్లా తింటారుండే, పుటకే మాలపుటకైతే, మాలాళ్ళకి తిండేంటి, సుకవేంటి లెగండి” 14 ఏళ్ళ సొరాజ్జానికి అప్పటికే మాలపుటక పుడితే జీవనం ఎలా ఉంటుందో అర్థమైంది. ఆ పిల్ల తన భాషలో  తన తీరులో అంబేద్కర్‌ చెప్పిందే చెప్పింది. ఇద్దరివీ జీవితానుభవాలే. ఒకటి సామాజిక విశ్లేషణ. ఒకటి సాహిత్యరూంపలోని జీవిత వాస్తవికత.

సొరాజ్జెం నవలలో రైతుల ఇళ్ళల్లో పనిపిల్లగా సొరాజ్జెం అనుభవాలు ఆ అమ్మాయి జీవితం, శ్రమ, దానికి విలువ ఇవి ప్రధానంగా పాఠకులను ఆలోచింపచేస్తాయి. అనసూయమ్మ, మహలక్ష్మమ్మ, భానుమతి ఈ ముగ్గురి ఇళ్ళల్లో  బాలకార్మికురాలైన సొరాజ్జెం వెట్టి చాకిరి చేస్తుంది. మరీ తిండికి జరక్క పద్దాలు కూతుర్ని అనసూయమ్మ దగ్గర పనికి పెడుతుంది. పనికి జీతం మాట్లాడుకోవాలిగదా. పద్దాలు మాల కులం కాబట్టి జీతం బేరమాడే అధికారం లేదు. ఐనా పద్దాలు కాసిని ఒడ్లు ఇవ్వమని అడుగుతుంది.

”రొండు జతల గుడ్డముక్క లిత్తాగానీ…. అయ్యి కూడా నీ యిష్టమైనయి – తర్వాత నువ్వు మంచియ్యీ, పిచ్చియ్యీ, కొత్తయ్యీ, పాతయ్యీ అనొద్దు… మళ్ళీ మాట్లాడక పంపు దాన్ని” రోజూ ఇంత తిండి పెట్టి, సంవత్సరానికి రెండు జతల పాతబట్టలకి సొరాజ్జెం చేసిన చాకిరి అంతులేనిది. పదకొండేళ్ళ పిల్ల చట్టరీత్యా చేయగూడనివి. తెల్లవారుఝామునుంచీ రాత్రి దాకా ఒక్క క్షణం కూర్చోకుండా పనిచేసే సొరాజ్జెం తినే తిండి గురించి తప్పక తెలుసుకోవాలి. కోళ్ళు కంచం మీద కెగబడుతుంటే నాలుగు ముద్దలు నోట్లోకి పోవటం గగనమవుతుంది.

మహాలక్ష్మమ్మ ఇంట్లో చాకిరి ఇంకా ఎక్కువే గానీ అన్నం కడుపునిండా దొరికేది. సంవత్సరానికి మూడు బస్తాల ఒడ్లు కూడా ఇచ్చేది. మహలక్ష్మమ్మ మంచినీళ్ళు కూడా సొరాజ్జెం చేత తెప్పించుకునేది. అవసరం సంప్రదాయాన్ని కళ్ళు మూసుకో మంటుంది. మహాలక్ష్మమ్మ అలా చేస్తుందని కొందరికి కోపం. ఒకసారి వరలక్ష్మి ఇంటికి మజ్జిగ కోసం సొరాజ్జాన్ని పంపింది మహలక్ష్మమ్మ. ”సొరాజ్జెం చేతిలో కోపా చూసి వర్లక్షమ్మ మొహం వికారంగా పెట్టి”  నీ దుంపతెగ చల్లకూడా నువ్వే ముట్టుకుంటావంటే? మీ దొరసానమ్మకి మరీ మతి లేకుండా పోతాందిలే అంది. సొరాజ్జెం ఊరుకోకుండా

”ఏంటుండే, మేం మడుసులం గావేంటండే” అంటే

”ఆఁ మడిసివి” అని ఛీత్కరిస్తుంది.

సొరాజ్జానికి వాళ్ళింట్లో చామంతి పూలు ఇష్టం వెళ్ళినపుడు అడిగి తెచ్చుకుంటుంది. కానీ ఈసారి వర్లక్షమ్మ ఛీత్కారానికి ఆ పిల్లకు అవమానం కోపం కలిగి పువ్వు అడక్కుండా వెల్తుంటే వర్లక్షమ్మ ”ఒసే మాల్దానా ఒక పువ్వు కోసుకోవే” అంటుంది.

ఆ పిలుపు ఆమె కులాహంకారానికి గుర్తు క్షణం క్షణం మీరు తక్కువవాళ్ళని చెప్పే అగ్రవర్ణ ఆధిపత్యం. దానిమీద చిన్న తిరుగుబాటు చేసింది చిన్ని సొరాజ్జెం ”వొద్దులెగండే” అని కోపంగా వెళ్ళిపోయింది.

తన కిష్టమైనదైనా మంచిగా మర్యాదగా ఇవ్వకపోతే తిరస్కరించవచ్చని చిన్ని సొరాజ్జెం తెలుసుకుని ఆచరించింది.

మహాలక్ష్మమ్మ గారింట్లో మూడేళ్ళు చేసినాక జీతం పెంచమంటే పెంచలేదని పద్దాలు ఎక్కడో ఏదో మాట అన్నదని పద్దాలుని పడతిట్టింది మహాలక్ష్మమ్మ. తల్లిని తిట్టినందుకు నిరసనగా సొరాజ్జెం కాస్త అనుకూలంగా ఉన్నా ఆ ఇంట్లో పని మానేసింది.

మూడో ఇంట్లో యజమానురాలు భానుమతి మంచిదే గానీ యజమానికి ఆడవాళ్ళ పిచ్చి. సొరాజ్జాన్ని ఒంటరిగా ఉన్నపుడు చెయ్యిపట్టుకు లాగాడు. సొరాజ్జం ఇదిలించుకొని వెళ్ళి ఆ ఇంట్లో పనిమానేసింది.

ఇక కమ్మ దొరల ఇళ్ళల్లో శ్రమ దోపిడీనేగాక లైంగిక దోపిడి కూడా ఉంటుందని గ్రహించి వ్యవసాయ కూలీగా మారిపోయింది. ఇక రోజూ తిండి దొరికే అవకాశం లేదు. ఐనా తన శ్రమనేగాక శరీరాన్నీ వాడుకోవటాన్ని సొరాజ్జెం భరించలేకపోయింది. కానీ ఆ పరిస్థితినీ భరించక తప్పని పరిస్థితిలో చాలామంది ఉన్నారని త్వరలోనే సొరాజ్జానికి అర్ధమైంది.

సాయిత్రక్క అసలు విషయం చెప్పింది. ”ఆ ముదనష్టపా యిన వారం రోజున్నించీ మాటేసి మాటేసి ఇనకుండా లాక్కుపో యాడే. మాలముండ కనపడితే నిలవనిత్తా రేంటి పెద్దోళ్ళు” ఆడవాళ్ళను లైంగిక దోపిడీ చేసేటపుడు మగాళ్ళెవరికీ అంటరాని తనం గుర్తురాదు. వాళ్ళు తమ ఆస్తులు. గ్రామాలలో ప్రతిరైతుకీ తన పొలం ఉన్నట్లే తనదైన మాల కుటుంబం ఉంటుంది. ”మా మాలోడు” ”మా మాలది” ”మా మాదిగాడు” అంటూ చెప్పుకుంటారు. వాళ్ళువీళ్ళ ఆస్తులు, బానిసలు. మిగిలిన వాళ్ళను ఒదుల్తారని కాదు. వీళ్ళది ప్రత్యేక హోదా అన్నమాట. జీవితాన్ని గడిపేసే ఆడవాళ్ళు గ్రామాలలో ఎందరో – దానిని మచ్చుకి పొన్నమ్మ పాత్రలో చూపించాడు రచయిత. వాళ్ళంతా పిత్రుస్వామ్యంలో నిండా మునిగిన వాళ్ళు. ఆ విలువల్నే నమ్ముకుని బతికే వాళ్ళు. ఆ బతుకుల్ని మార్చుకుందామనే కనీసపు కోర్కె లేనివాళ్ళు. మాలపల్లి లోని స్త్రీలు వనరులు లేక కుల వివకక్షూ, హింసకూ లోబడితే, వనరులు ఉన్నా పిత్రుస్వామ్యపు బురదలో కూరుకుపోయిన వారు ఆ ఊరి అగ్రవర్ణ స్త్రీలు. దళిత స్త్రీల మీద పెత్తనం చేసే అధికారం తప్ప తమ వనరుల మీద ఎలాంటి హక్కు వాళ్ళకు లేదు.

”సొరాజ్జెం” నవలా ప్రారంభంలోనే చౌటపల్లి పొలిమేరల్లోని మూల్లంకలో ఎంకడు, ఎంకటేసి ”గాడు” మనకు పరిచయమ వుతారు. ఎంకటేసి ”గాడు” పదం దగ్గరే మనస్సు చివుక్కుమని ఆగిపోదాని. సహృదయ పాఠకులు. ఎంకటేసు గురించి, అతని వ్యక్తిత్వం గురించి ఏమీ తెలియక ముందే ”గాడు” అనే అగౌరవపదం అతని పేరు చివర తగిలించుకుని పరిచయమయ్యాడు నవల రెండో పేజీలోనే. నవల లోపలికి పోతున్న కొద్దీ మాలపల్లెలోని ప్రతి మనిషికీ ఎక్కడో ఒకచోట గాడు అనేది పేరు వెనక వచ్చి చేరుతుంది. జోజిగాడు, తిరపతిగాడు, సాదేవుడు గాడు – ఇలా వాళ్ళు నిత్యం అవమానించబడుతూంటారు.

మనుషులను ఇలా అవమానించటం 1949కి ముందే గుర్తించి దానిని గురించి ప్రశ్నించిన సందర్భాలు జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉన్నాయి.  ”మాలపల్లి” నవలలో సంగదాసు బెజవాడలోని సభకు వెళ్ళి అక్క డచేసిన తీర్మానాలలో మొట్టమొదటి తీర్మానమే ఇలాంటి పేర్ల గురించి, అమర్యాదగా పిలవటం గురించి ”మన సంఘంవారు నీచమైన పేర్లు పెట్టుకోగూడదని, తమ పేర్లకు అన్నా, అప్పా, అయ్యా, అమ్మా, అక్కా మొదలైన మర్యాద వాచకాలు చేర్చుకోవలసిందనీ, ఒకరి నొకరు మర్యాదగా పిలుచుకోవలసిందనీ, అట్లు చేయక పోవటం మన ఆత్మగౌరవానికి భంగమని ఈ సభవారు తీర్మానిస్తున్నారు” మాలపల్లి నవల 1920లో రాయబడింది. సొరాజ్జెం నవలలోని కాలం 1947 ఈ 27 సంవత్సరాల కాలంలో ఆ పిలుపులలో ఏ మాత్రం మార్పురాలేదు. రాజ్యాంగం చాలా విశాలపరిధిలో వివక్ష గురించి చెబుతుంది గానీ, పేరులోనే ఇంత అమర్యాద వివక్ష చూపటం గురించి చెప్పదు. రాజ్యాంగస్ఫూర్తిని అర్ధం చేసుకున్నవారు తమను తాము సంస్కరించుకుని తెచ్చుకోవలసిన మార్పులివి. అంటరానితనం నేరం అన్నప్పటికీ పేరు చివర గాడు తగలించటం అంటరానితనమని నిరూపించలేము. వివక్ష అని నిరూపించవచ్చుగానీ దానివలన ఒరిగేదేమి ఉండదు. దళితుల పేరులోనే అగ్రవర్ణాల చేత చేర్చబడి, ఆ పేరులో భాగమని వారిచేత నమ్మించిన ‘గాడు’ అనే ఈ అవమానకరమైన పదాన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికార యంత్రాంగం యధాతథంగా ప్రభుత్వ రికార్డులలోకి ఎక్కిస్తూనే వచ్చింది. స్వతంత్రం వచ్చి రాజ్యాంగం రాసుకున్న 27 సంవత్సరాల వరకూ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన ఏ అధికారికీ దళితుల పేరు చివర గాడు చేర్చడటం అభ్యంతరకరంగా తోచలేదు. జనన రికార్డుల్లో, ఇతర ప్రభుత్వ రికార్డుల్లో ”గాడు” అనే పదాన్ని చేర్చిన పేరుని ఏ సంకోచమూ లేకుండా చదువుకున్న అధికారులు రాసేస్తున్నారంటే దళితుల ఆత్మగౌరవ సమస్య అనేది కనీసం పాలనా విభాగపు ఎజండాలోకి కూడ రాలేదన్నమాట. రాజ్యాంగనైతిక స్పృహ చదువుకున్న అధికారులకు లేదన్నమాట.

”గాడు” అనే పదాన్ని జనన, మరణ రిజిష్టర్లలో కూడా చేర్చటం వల్ల అది ఆ వ్యక్తిపేరులో భాగమవుతున్నది. దీనికేం చెయ్యాలి? ఇలాంటి వివక్షను నిర్మూలించడానికి అధికార యంత్రాంగానికి రాజ్యాంగ నైతికత గురించిన అవగాహన ఉండాలి. అట్లాంటి అధికారులు ఎంతమంది ఉంటారూ. అదృష్టవశాత్తు తక్కువగానైనా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ, సాంఘిక సంక్షేమ శాఖలో అధికారిగా ఉన్న ఎస్‌.ఆర్‌ శంకరన్‌ గారు రాజ్యాంగ వాది గనుక దళితుల ఆత్మగౌరవాన్ని రక్షించే అనేక ప్రభుత్వ ఉత్తర్వులకు కారకుడయ్యారు. 1974లో ఆయనొక మెమోరాండంని విడుదల చేయించారు. దాని ప్రకారం ”ఊనీలి స్త్రళిఖీలిజీదీళీలిదీశి ఖిరిజీలిబీశిరీ శినీబిశి రీతిబీనీ రీతితీతీరిని రీనీళితిజిఖి లీలి రీబీజీతిచీతిజిళితిరీజిగి ళిళీరిశిలిఖి రిదీ బిజిజి వీళిఖీలిజీళీలిదీశి జీలిబీళిజీఖిరీ రిదీబీజితిఖిరిదీవీ లీరిజీశినీ జీలివీరిరీశిలిజీ నీలిజీలి బితీశిలిజీ.” అప్పటి నుంచి గరవ్నమెంటు రిజిష్టర్లలోంచి గాడు అన్నపదం పోయింది. 1949 రాజ్యాంగ వివక్షను తీవ్రంగా పరిగణించినా 1974లో ఒకమానవీయమైన, రాజ్యాంగపరమైన స్పృహ కలిగిన అధికారి చొరవతో గాని అది అమలులోకి రాలేదు. ఇది రికార్డులలో మాత్రమే దొరికే మర్యాద. గ్రామాల్లో 90వ దశాబ్దం వరకూ ఇలాంటి పిలుపులు వినపడుతూనే ఉన్నాయి. కొన్ని చీకటి ప్రాంతాల్లో ఇంకా వినపడుతూ ఉండి ఉండవచ్చు. మాలపల్లి నవల లోని తీర్మానపు మొదటి అంశాన్ని, 1974 సం||లో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ గారి వల్ల వచ్చిన మెమొరాండంని గుర్తు తెస్తూ ప్రారంభమైంది సొరాజ్జెం నవల.

సొరాజ్జెం నవలంతా రాజ్యాంగ ఉల్లంఘనలే. ఆ సంఘటనల ద్వారా పాఠకులలో రాజ్యాంగ నైతికత పెరగాలనే రచయిత ఆశయం ఒక్కరోజుతో నెరవేరేది కాదు. కానీ ఆ దిశగా 1984 నుంచీ దళిత ఉద్యమంలో గుణాత్మకమైన మార్పులు రావటం, అందరం హర్షించదగిన విషయం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో