రగులుతుండే అగ్ని గోళం – మందరపు హైమవతి కవిత్వం – ఇంటర్వ్యూ : వి. శాంతి ప్రబోద

బాధ మనసును జ్వలింప చేసినప్పుడు
సమస్య హృదయాన్ని తొలచివేసినప్పుడు
నా కలం పలుకుతుంది నిజం
ఆ నిజాలే నీలి కవితలైతే
నీలి కవితలే రాస్తాము మేము
నిజాలే మా కవితా వస్తువులు

అంటూ ‘నీలి కవితలే రాస్తాము’ కవితలో నిక్కచ్చిగా చెప్పారు కవయిత్రి మందరపు హైమవతి. 1992 నవంబరులో వెలువడ్డ నీలి మేఘాలు కవితా సంకలనంలో. అతి సామాన్యంగా కనిపించే ఆమె భావాలు అసామాన్యంగా ఉంటాయి. సౌమ్యంగా కనిపించే ఆమె అక్షరాలు మాత్రం ఫైర్‌ బ్రాండ్‌ లా తూటాలు పేలుస్తుంటాయి. ఆమె విసిరే శక్తివంతమైన అక్షరాల బుల్లెట్లు పాఠకుల్ని కదలిస్తాయి. రగిలిస్తాయి.
‘ఇద్దరూ కలసి విషం తీసుకున్నప్పుడు
ఒక్క అమ్మాయి మాత్రమే
ఎందుకు మరణిస్తుందో
ఎప్పటికీ అర్థంకాని ప్రశ్నార్థకం

సి.బి.ఐ. కూడా ఛేదించలేని రహస్యం’ అంటూ మాటల కొరడా ఝళిపిస్తారు. పక్షపాత వ్యవస్థని నిలదీస్తారు.

స్త్రీ అంటే శరీరమేనా….? ఆమెలోని అంతర్గత వేదనల్ని అర్థంకావా? అంటూ ఆవేదన చెందే మందరపు హైమవతి అక్షర వ్యవసాయం మొదలు పెట్టింది పద్యంతో. పద్యం నుండి వచన కవిత్వానికి, ఆ తర్వాత స్త్రీవాద కవయిత్రిగా తన సాహితీ ప్రస్థానం ఎలా కొనసాగించారో చూద్దాం.

అక్షర వ్యవసాయం ఎలా మొదలు పెట్టారంటే…. తండ్రి మందరపు కాసులు, తల్లి దుర్గాంబల ఐదుగురు సంతానంలో తొలి సంతానం మందరపు హైమవతి. సాహితీ ప్రియుడైన తండ్రి తనతోపాటే చేయిపుచ్చుకుని సాహితీ సభలకు తీసుకువెళ్ళడం వల్లే తనకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి ఉండొచ్చు అంటారు ఆమె. దగ్గర కూర్చోపెట్టుకుని దిన వార పత్రికలు, పుస్తకాలు చదివించేవారు ఆమె తండ్రి. అందువల్లేనేమో ఏ పేపర్‌ ముక్క కనిపించినా, పొట్లం కట్టిన పేపర్‌ అయినా వదలకుండా చదవడం అలవాటయిపోయింది ఆమెకు. చదవడమే కాదు చదివిన ఏ విషయాన్నయినా దానిపై అభిప్రాయం చెప్పమన్నారు తండ్రి కాసులు గారు. ప్రతిదీ విమర్శనా దృష్టితో చూసే ఆయన వల్లే ఆలోచన, పరిశీలన అలవడింది అంటారు మందరపు హైమవతి.

అదే విధంగా గుణదలలోని బిషప్‌ హజ్జరయ్య పాఠశాలలో చదివేటప్పుడు తెలుగు మాస్టారు దేవరకొండ చిన్ని కృష్ణ శర్మగారు చెప్పే పాఠాలు తెలుగు భాష మీద ఆసక్తిని పెంచాయి. ఆయన తాను రాసిన పద్యాలు వినిపించేవారు. అవి ఆమెకు చాలా ఇష్టంగా ఉండేవి. అలా తనకు తెలియకుండానే ఆ పద్యాల పట్ల మక్కువ ఏర్పడింది. తనకీ రాయాలనిపించేది. పద్యాలు రాయడం మొదలు పెట్టింది.

ఆమె తండ్రి కూడా రచయితేనని చెప్పొచ్చు. ఆయన వివిధ విషయాలపై వార్తాపత్రికలకి లేఖలు రాసేవారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్థాన కవులు, ఆస్థాన గాయకులను గౌరవించేది. ఆస్థాన శిల్పిని కూడా పెట్టి వారిని గౌరవించాలని ఆయన ప్రభుత్వా నికి, పత్రికలకు అనేక ఉత్తరాలు రాసారు. అలా రాయడం తన సామాజిక బాధ్యతగా భావించేవారు. ఆయనకి విజయవాడలోని అనేక సాహితీ సంస్థలు, సాంస్కృతిక సంస్థలతో సంబంధాలుండేవి. వాటిలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన వెళ్ళడమే కాకుండా తనతో హైమవతిని కూడా తీసుకెళ్ళేవారు. అక్కడ కూతురు రాసిన పద్యాలు, కవితలు మా అమ్మాయి రాసిందంటు అందరి ముందు చదవమని ప్రోత్సహించేవారు. నాన్నకి చదవడం రాయడం రెండు కళ్ళలాంటివి. అమ్మ ఏదైనా పని చెప్తే నన్ను డిస్ట్రబ్‌ చేయొద్దని చెప్పేవారు తండ్రిపై ప్రేమానురాగాలు కళ్ళలో తొణికిస లాడుతుండగా అంటారు మందరపు హైమవతి.

ఆమె మొదట్లో పద్యాలు రాసేది. తేటగీతి, ఆటవెలది, సీసం, కంద పద్యాలు రాసేది. స్వాముల వారు వచ్చినప్పుడు, బంధువుల పెళ్లిళ్ళప్పుడు పద్యాలు రాసి అందరికీ చదివి వినిపించేది.

వరంగల్లు లోని ఓరియంటల్‌ కాలేజిలో చేరేవరకూ పద్యాలే రాసేది. ఆ తర్వాత ఎక్కువగా ఆధునిక కవిత్వం, వచన కవిత్వం చదివింది. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, బాలగంగాధరతిలక్‌ రాసిన అమృతం కురిసిన రాత్రి, వంటివెక్కువగా చదివింది. శ్రీశ్రీ కవిత్వం అంటే పిచ్చి అభిమానం. మామూలుగా అయితే మనసులోనే చదువుకునే మందరపు హైమవతికి మహాప్రస్థానం మాత్రం పైకి చదువుతుంటే ఏదో తెలియని ఉత్సాహం, ఉద్వేగం కలుగుతాయి. అలాగే మహాప్రస్థానంలోని ప్రతి కవితను కంఠతా చెప్తూ మైమరచిపోతుంది.

వరంగల్‌లో చదివేటప్పుడు అక్కడ జరిగే సాహితీ సభలలో పాల్గొనేది. అప్పుడు వచన కవిత్వం చదివేదాన్ని. నేను వరంగల్‌ లోని ఓరియంటల్‌ కాలేజిలో చదివేటప్పుడు ఓ గురువు శుద్ధ సంప్రదాయవాది. ఆడవాళ్లంటే ఆయనకి చాలా చులకన భావం. ఒక రోజు ప్రహ్లాద చరిత్ర చెబుతూ ప్రహ్లాదుడు మగవాడు కాబట్టి లీలావతి ఆడది కాబట్టి మరచిపోయింది. ఆడవాళ్ళకి రాయడం రాదని మాట్లాడారు. క్లాసులో నిశ్శబ్దంగా మాస్టారు చెప్పింది వినే హైమవతి, ఎదురు ప్రశ్నించని హైమవతి ఆగలేకపోయింది. ఆడవాళ్ళు కవయిత్రులుగా ఉన్నారుగా మాస్టారు అంటూ మొల్ల, గార్గి, పేర్లు చెప్పసాగింది. అప్పుడు ఆయన ఆ ముగ్గురేగా అంటూ ఆడవాళ్ళని తీసిపారేస్తూ చాలా తేలిక చేసి మాట్లాడారు. అది మందరపు హైమవతికి చాలా బాధ అనిపించింది తీవ్ర ఆలోచనలు రేకెత్తించింది.

అప్పుడు ఆ సంఘటనని తీసుకుని రాసిన కవితే ”నిరుపహతిస్థలం”. ఇది రాయడానికి కారణం అప్పుడు ఆయన అన్న మాటలే అంటారు హైమవతి. మగవాళ్ళు రాయాలంటే వారికి ఎన్నో వసతులు, సౌకర్యాలు కానీ అటువంటివి ఏమీలేక పోయినా ఆడవాళ్ళు తాము ఎక్కువకాలం గడిపే వంట గదిలోనే రాస్తారు.

కామంతో నైతేనేమి
మోహంతోనైతేనేమి
ఇరువురి తనువులొకటైనాక
అద్వైత సిద్ధి పొందినాక
ఈ లోకాన్నే మరచిపోయిన
అమృత ఘడియలలో
అక్షర తూణీరం నుంచి
ఒకప్రశ్నల బాణం సంధిస్తావు
”జీతమెప్పుడిస్తారు”
……
వేయి రాక్షస బల్లులు
మీదపాకినట్టు

అంటూ భార్యాభర్తల సంబంధంలో ఉన్న సంక్లిష్టతను, వైరుధ్యాల్ని ఎత్తి చూపుతారు. పురుషుని ఆధిపత్యం, స్త్రీ నిస్సహాయత ఆమెలో కలిగే అంతరంగ వేదనని వెలిబుచ్చుతూ రాసిన కవిత సర్పపరిష్వంగం. అప్పుడతన్ని చూస్తే కలిగే జుగుప్ప, కంపరం, అతన్ని వదిలించుకోలేక పడే యాతన పైకి చెప్పుకోలేని మహిళల పక్షాన కలం ఝుళిపించింది మందరపు హైమవతి …. ఈనాటికీ మన పితృస్వామిక వ్యవస్థలో భర్తే దేవుడు. అతను ఎలా ఉన్నా, ఏమి చేసినా సర్దుకుపోవాలనేగా చెబుతారు పెద్దలు. అలాంటిది సంప్రదాయానికి విరుద్ధంగా సర్పపరిష్వంగంగా పోల్చడం, భావించడం ఒక రకంగా సాహసమే. అందుకే ”వస్త్యంశాల పేర్పులో నేర్పు వుంది. విభేదకాంశాలు వ్యక్తీకరించే పదాలను ఎన్నుకోవడంలో మెలకువ ఉంది. ఫలితాన్ని పొదుపుగా పొదగడం వల్ల శక్తివంతమైంది అని కితాబునిచ్చారు చేరా తన చేరాతలులో. అప్పటి నుండే స్త్రీవాద కవయిత్రిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. నిజానికి అప్పటికి స్త్రీవాద కవిత్వంతో ఆమెకు పరిచయం లేదు. తాను రాసింది స్త్రీ వాద కవిత్వం అనుకోనూ లేదు. ఏ సాహితీ సంస్థలోను సభ్యురాలు కాని ఆమె తనదైన శైలిలో రాసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. విమర్శకులు ఆమెకు స్త్రీవాద కవయిత్రిగా గుర్తింపునిచ్చారు.

తనకు తాను స్త్రీవాద కవయిత్రిగా ఎప్పుడు అనుకోలేదనే మందరపు హైమవతి సాంప్రదాయ కవిత్వానికి బీటలు వారుస్తూ నాలుగ్గోడల మధ్య ఉండే మహిళల గళాన్ని నాలుగ్గోడల మధ్య కూర్చొని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. మహిళల మనస్సులో బద్దలయ్యే అగ్నిగోళాన్ని అక్షర తూటాలతో పేర్చి వీలయినప్పుడు పత్రికలకి పంపడం, ఎక్కడ సాహితీ సమావేశాలు వుంటే అక్కడ వాలిపోవడం, వాటిని ఆనందించడం మందరపు హైమవతికి అలవాటు. చదువుకునే రోజుల్లో బహుమతిగా పొందిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం లెక్కలేనన్ని సార్లు చదివింది. ‘అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా కాదేది కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలు ఆమెలో జీర్ణించుకుపోయి ప్రతిదాన్ని కవిత్వంగా మలచడం అలవాటు చేసుకుంది.

ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ఆడపిల్లల పుట్టుకను నిరోధిస్తూ ఉండడం, పుట్టిన పిల్లల్ని పురిటిలోనే అంతం చేయడం మనకు కనిపిస్తూనే ఉంది. ఆ అంశాన్ని తీసుకుని రాసిన కవిత నిషిద్ధాక్షరి. అందులో

పక్షైనా, పశువైనా
తమ పిల్లలకి తామే మరణశిక్ష వేయవు
మరెందుకమ్మా! నా రాకకు భయపడతావు
……….. ఇసుక పర్రాల్లో ఇంకిపోయే నితిలా

మానవత్వం మంట గలసినప్పుడు
దానవత్వం చేతిలో కీలుబొమ్మలై
ఆత్మలు అమ్ముడుపోతున్నప్పుడు
కన్నతల్లులే వృద్ధాశ్రమాల
వలసపక్షులౌతారు

ఆడపిల్లలే నిషిద్ధాక్షరాలౌతారు’ తన ఆవేదనని, నిరసనని, సామాజిక సమస్యని తెలియజేస్తారీకవితలో.

రకరకాల సమస్యలతో బాధపడేవాళ్ళు, తమ సమస్యలని కలబోసుకోవడం, జరుగుతుంది లేడీస్‌ స్టాఫ్‌ రూంలో. ఒకరి గాయాలకు ఒకరు లేపనాలు పూసుకుంటారు. జాతీయ రాజకీయాలో మరోటో వారి చర్చలోకి రావు. ఇంటినుండి బయటికొచ్చినా వెంటాడే కుటుంబం గురించి వరద గోదారిలా మాట్లాడతారు.
‘ఇంటినుండి బయటికి వచ్చినా
ఇల్లు వెంటాడుతూనే ఉంటుంది
మళ్లీ ఇక్కడ కుటుంబం
పునః ప్రతిష్టిత మవుతుంది’ అంటారు ‘లేడిస్‌ స్టాఫ్‌రూం’ కవితలో.
‘నాజూకు నడుముకు
మార్కులు కొన్ని
ఎత్తైన రొమ్ములకి కొన్ని
………
దేశాల సరిహద్దుల రేఖలు గీసినట్లు
దేహాల్ని ఇలా అవయవస్ఫూర్తిగా
విభజించిందెవరు?
ఇంటి స్థలమా
పంట పొలమా
ఓ చెక్క ముక్కా
ఓ గుడ్డ ముక్కా
ఈ కొలతలేమిటి
………
ఇక అందాల పోటీల అధ్యాయాలు చెరిపేసి
ఆత్మగౌరవ సంతకాలు చేద్దాం రండి!

‘సంతకాలు చేద్దాం రండి’ కవిత ఫ్యాషన్‌ షోలను దృష్టిలో పెట్టుకుని వాటిని నిషేధించాలంటూ రాసిన కవిత. ప్లవర్‌ షో, డాగ్‌ షో ల్లాగే స్త్రీలను కొలతలతో షోలో నిలబెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మన శరీరాల మీద మన అవయవాల మీద గుత్తాధిపతు లెవరు? అని ప్రశ్నిస్తూనే కొండల్ని రాళ్ళుగా మార్చే శ్రమజీవి మేనిపై మెరిసే చెమట చుక్కల సాటి ఏమి వస్తుంది అంటూ శ్రామిక మహిళల పక్షపాతిగా కనిపిస్తారు. శ్రమ జీవన సౌందర్యాన్ని దర్శింపచేస్తారు. ఈ కవిత రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో చదివారు మందరపు హైమవతి. ఈ కవితకు హిందీ అనువాదం కోట డైరెక్టర్‌ చేశారు. అక్కడ మంచి స్పందన లభించింది. అన్ని భారతీయ భాషలలోకి అనువదించారు.

‘అసూర్యంపశ్యల యుగం నుండి
ఆధునిక కాలం వరకూ పయనించినా
అంతఃపురం నుంచి విశాల ప్రపంచంలోకి ప్రవేశించినా
నేటి చదువుకొన్న స్త్రీకి తప్పడం లేదు
ద్విపాత్రాభినయం’

ఇంటాబయటా ప్రతిరోజూ సంగ్రామం చేస్తూ ఆమె చేసే పనులు, ఒంటి మీద పాకే మగ పురుషుల చూపుల పురుగుల్ని దాటుకుంటూ ఇంటికి చేరితే ఆలస్యం అయిన్దేమని భర్త అనుమానపు చూపులూ … ……. ద్విపాత్రాభినయం కవిత. స్త్రీల అనుభవాలకి, ఆలోచనలకి తన కవిత్వంలో చోటు కల్పించింది హైమవతి.

‘సర్దుకుపో’ ఆ నాలుగక్షరాలే
స్త్రీ జీవితాన్ని బలికోరే శాపాలు!
సర్దుకుపో ఈ నాలుగక్షరాలే
స్త్రీని అగ్నికి ఆహుతి చేసే సాధనాలు’ యుగయుగాలుగా నేను మాత్రమే ఎందుకు సర్దుకుపోవాలి అంటూ మహిళల అంతరంగిక గళాన్ని అంతర్మధనాన్ని, ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది తన కలం ద్వారా.

‘వాయిదా’ విడాకులకోసం వెళ్ళిన మహిళను మళ్లీ మళ్లీ తిప్పడం, వేరుగా ఉన్న అక్కడి వాతావరణం చిత్రిస్తూ రాసిన కవిత. మాలతీ చందూర్‌ నిర్వహించిన ప్రశ్నలు జవాబులు లో ఒక ప్రశ్నకు జవాబుగా ఇండియన్‌ లిటరేచర్‌ పుస్తకంలో వచ్చిన ఈ కవితను ఉటంకించడం విశేషం.

ఇప్పుడప్పుడే అనిపిస్తోంది మాకు
ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు
మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు
అందరం కలసి ఈ జీవితం సిలబస్‌ మార్చ లేమా అని’ అంటూ పురుషాధిక్య సమాజాన్ని నిలదీస్తారు ‘సిలబస్‌ మార్చలేమా’ కవితలో.
అగ్నిప్రవేశం నాటి అయోనిజలా
అవమానంతో భూమిలో
కుంగిపోయిన చూపులకు
భాష్యం చెప్పడానికి
ఇప్పుడు నాకో కొత్త భాష కావాలి
తనపై దాడి చేసే శత్రువులపై తిరగబడే

అపుడే ఈనిన ఆడపులిలాంటి అక్షరాలు కావాలి’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో .. ఆమె కవితల్లోని బలీయమైన వ్యక్తీకరణ తనదైన ముద్రతో పాఠకుల్ని కట్టిపడేస్తుంది.

ఆమె రాసిన దాదాపు 100 కవితలలో ఆమెకు బాగా ఇష్టమైన కవితలు సర్ప పరిష్వంగం, నిషిద్ధాక్షరి. బాగా పేరు తెచ్చిన, స్త్రీవాద కవయిత్రిగా నిలబెట్టిన కవిత సర్పపరిష్వంగం. నిషిద్ధాక్షరి కవిత దక్షిణ భారత దేశ భాషలన్నిటిలోకి అనువాదమైంది. ప్రాచుర్యం పొందింది. 43 కవితలతో ఉన్న నిషిద్ధాక్షరి కవితా సంకలనాన్ని గురుమూర్తి కన్నడంలోకి అనువదించి అందంగా ముద్రించారు.

ఆధునిక కవిత్వంతో పాటు ప్రాచీన కవిత్వమూ ఇష్టపడే హైమవతి ఆ పద్యాలు చదువుతూ పరవశిస్తారు. ఖాళీ సమయాల్లో ఆ పద్యాలు పాడుకుంటూ ఉంటారు. ఆవిడ కవితల్ని చదివినప్పుడు ఆవిడ భాషా పరిజ్ఞానం మనకు అర్థమవుతుంది. ఆమెకున్న ప్రాచీన సాహిత్య పరిచయం ప్రభావం ఆమె కవితల్లోకి అవసరమైనప్పుడు సందర్భానుసారంగా తొంగి చూస్తుంది. పురాణ ప్రతీకలని తన కవిత్వంలో వాడుకుంటారు.

ఉదాహరణకి ‘నిరుపతిహస్థలం’ ‘నిషిద్ధాక్షరి’, వటువు బుల్లిపాదాలు, వామన పాదాలైనట్లు.

మొదట్లో పద్యాలు రాయడంతోనే తన సాహితీ వ్యవసాయం మొదలుపెట్టినా ఆ తర్వాత ఆమె కలం వచన కవిత్వం వైపు మొగ్గింది. సామాజికాంశాలను స్పృశిస్తూ కవిత్వం వెల్లువెత్తింది. పద్యం రాయడం కంటే కవిత్వం రాయడం సులువు. యతిప్రాసలు, ఛందస్సు అవసరం లేదు కదా .. అయితే, సుళువు తెలిస్తే పద్యం రాయడమూ కష్టం ఏమీ కాదంటారు మందరపు హైమవతి.

మందరపు హైమవతి వెలువరిం చింది ఒక కవితా సంపుటే. కాని అది కవిత్వప్రియుల మనసు కొల్లగొట్టింది. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సంపుటి తన అమ్ముల పొదిలో నిషిద్ధాక్షరికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం, డా. సినారె పురస్కారం లభించాయి. శ్రీశ్రీ కవితా పురస్కారం వేసుకుంది.

‘సంతకాలు చేద్దాంరండి’ కవిత అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయింది. 15 కవితల్ని వేగుంట మోహన ప్రసాద్‌ ఆంగ్లీకరించారు. అవి ఇండియన్‌ లిటరేచర్‌లో వచ్చాయి. రంగయ్యగారు, విజయరాఘవ రెడ్డి, శాంతసుందరి కొన్ని కవితలని హిందీలోకి తర్జుమా చేశారు. కవిగారి భార్య కవితని తిలకవిటి తమిళంలోకి, నిషిద్ధాక్షరిని త్‌ప్ఱాజన్‌ మలయాళంలోకి అనువదించారు. నిషిద్ధాక్షరి సంకలనాన్ని కన్నడంలోకి గురుమూర్తి పెండకూరు అనువదించారు.

2000లో తంచన్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే అవకాశం రావడం ఆ కవి సమ్మేళనంలో ఎంతోమంది పాల్గొనడం, చివరికంటా ఉండి అనేక ప్రశ్నలు వేయడం, చాలా మంది ఆటోగ్రాఫ్‌ అడగడం వారి సాహిత్యాభిలాష ఆనందానుభూతి మిగిల్చింది. అది నేను ఊహించని సంఘటన అంటారు మందరపు హైమవతి.

2001లో ఢిల్లీలో జరిగిన జురీళీరిశినీబి బిదీ లిఖీలిదీరిదీవీ ళితీ చీళిలిశిజీగి అనే కవయిత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో దక్షిణాది నుండి కన్నడ కవయిత్రి క.ఖ. కనక, తమిళ కవయిత్రి కనిమొళితో పాటు పాల్గొనడం అపురూపమైన అనుభవం.

2002లో సాహిత్య అకాడమి వారు గౌహాతిలో నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొనడానికి ఆకాశమార్గాన టికెట్‌ ఇవ్వడం గొప్ప అనుభూతి అంటారావిడ.

నిత్యం రగులుతుండే అగ్నిగోళం లాంటి హైమవతి కలం నుండి మరో 50 పైగా పదునైన కవితలు మన ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో