స్త్రీల వాస్తవిక జీవితాన్ని చిత్రించిన కథకుడు ‘చాసో’ – బొద్దూరు విజయేశ్వర రావు

అనాదిగా సమాజంలో పురుషుల నిరంకుశత్వానికి గురవుతున్న స్త్రీలను గురించి తెలుగు సాహిత్యంలో చాలా కథలు వచ్చాయి. స్త్రీవాదం ఒక ప్రత్యేక ఉద్యమంగా రాకమునుపు నుండి స్త్రీల వెతలు కతలుగా రావడం మొదలైంది. అయితే సమాజంలోని స్త్రీ అస్థిత్వాన్ని గురించి వాస్తవికంగా నిర్భయంగా చిత్రించిన కథకులు మాత్రం తెలుగు సాహిత్యంలో వేళ్ళలో లెక్కపెట్ట దగినవారు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో ఒకరు చాసో. స్త్రీల జీవన సరళిని ఆర్థిక స్థితిగతులు ప్రభావితం చేసే విధం ఆయన కథలలో కన్పించే ప్రధానాంశం. రాసినవి నాలుగు పదులైనా, నాలుగు కాలాల పాటు నిలిచిపోయే కథలు రాసారు చాసో.

”తెలుగు కథకు తూర్పు దిక్కు”గా పేరొందిన చాసో మార్క్సిస్టు దృక్పథంతో రచనలు గావించిన అభ్యుదయ కథకుడు. సమాజంలో మనిషిగా బ్రతకడానికి స్త్రీ ఎదుర్కొనే పరిస్థితులను చాసో తన కథలలో సమర్థవంతంగా చిత్రించారు. చాసో కథల్లో స్త్రీలు కల్పించబడిన వారు కాదు. కళ్ళముందు కదలాడుతున్నవారు. నిత్యం సమాజంలో సంఘర్షణకు గురవుతున్నవారు. స్వేచ్ఛ కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం ఆరాటపడుతున్న వారు. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ కథను చెప్పే తీరును గమనిస్తే సమాజాన్ని చదివిన గొప్ప లోకజ్ఞుడిగా చాసో కనబడతాడు.

వివాహం తర్వాత స్త్రీలు వ్యక్తి స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ‘వాయులీనం’, ‘చొక్కా-బొచ్చుతువ్వాలు’ కథలలో కన్పిస్తుంది. ”వాయులీనం” కథలో రాజ్యానికి సంగీతమంటే ఇష్టం. భర్త వెంకటప్పయ్యకి అది అయిష్టం. అందుకే సంగీతాన్ని వింటున్న పిల్లలను చూచి ”సరిగమల సాంబారు మీకు వచ్చినట్టుందే” అంటూ సంగీతం పట్ల తన అనాసక్తిని వ్యంగ్య ధరణిలో వ్యక్తం చేస్తాడు. రాజ్యానికి పెళ్ళయిన తర్వాత మొగుడు ఒక్కనాడు పాడమనలేదు. తాను పాడనూ లేదు. చివరికి తను ప్రాణప్రదంగా దాచుకున్న ఫిడేలును’ ఆర్థిక అవసరాల కోసం భర్త అమ్మేసినప్పుడు కూడా తను ఎదురు చెప్పలేక ”నా నోరు ఏనాడో నొక్కకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది” అని సర్దుకుపోయింది. ఈ కథలో భర్త వెంకటప్పయ్య భార్యను శారీరకంగా బ్రతికించటం కోసం, ఆమెను మానసికంగా చంపేశాడు. ఆమె సంగీతేచ్ఛను శాశ్వతంగా పాతాళానికి తొక్కేశాడు. భర్త ఇష్టాయిష్టాలకు లోబడి బతకవలసిన భార్యల పరిస్థితి ఈ కథలో మనకు కన్పిస్తుంది.

”చొక్కా-బొచ్చుతువ్వాలు” కథలో ముత్యాలమ్మ కూడా కొడుకు దగ్గర తనకు స్వాతంత్య్రం ఉందనుకొంటుంది. కొడుకు తన మాట కాదనడనుకొంది. కానీ ఊరి పెద్దల మధ్య తన కొడుకు ”ఇంటికి నాను యజమాన్ని” అనేసరికి నిర్ఘాంతపోయింది. ఆఖరికి ”నా మొగుడు నాడు మొగుడు మాట కాదన్ననా? కొడుకు నాడు కొడుకు మాట కాదంటానా?” అంటూ పరాధీనత ప్రదర్శిస్తూ, కన్నీళ్ళతో సమాధాన పర్చుకొంది. ఈ విధంగా స్త్రీ బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మగవాడి చెప్పుచేతలలోనే జీవిస్తున్న వైనం చాసో కథలలో బహిర్గతమవుతుంది.

వరుని ఎంపిక విషయంలో కూడా స్త్రీల మానసిక స్థితిని చాసో ‘ఎంపు’, ‘ఫారిన్‌ అబ్బాయి’ కథలలో దేశ, కాల మార్పులకనుగుణంగా తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం రాయబడిన ”ఎంపు” కథలో ముష్టిదానికి తనకి నచ్చినవాడిని పెళ్ళిచేసుకొనే పరిస్థితి లేదు. తనకు కుంటాడు ఇష్టమున్నా, తన తండ్రి అధికారానికి బదులు చెప్పలేక, తిరుగుబాటు చేయడానికి సత్తువ లేక మనసు చంపుకొని గుడ్డోడిని పెళ్ళాడింది. మనసారా ఇష్టంలేని పెళ్ళి కూడా వద్దనటానికి అవకాశం లేని యవ్వన స్త్రీల పరిస్థితిని చాసో ఈ కథలో తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత రాయబడిన ”ఫారిన్‌ అబ్బాయి” కథలో పెళ్ళి కూతురు జానకి ”ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది” అన్న గురజాడ అభ్యుదయభావానికి ప్రతీక. తనకేం కావాలో నిర్ణయించుకునే శక్తి కలది. పెళ్ళి చూపులలో తనకి నచ్చని ఫారిన్‌ అబ్బాయిని ప్రశ్నల బాణాల సంధించి ”అయితే ఇంక మీరు వెళ్ళవచ్చు” అంటూ ధైర్యంగా తిరస్కరించిన నవయుగ వనిత. విదేశీ వ్యామోహం లేని విద్యావంతురాలు కనుకనే విచక్షణా జ్ఞానంతో తన జీవితాన్ని చక్కదిద్దుకుంది. దేశంలో వస్తున్న సామాజిక మార్పులకను గుణంగా స్త్రీ చైతన్యాన్ని చాసో ఈ కథలో చూపించారు.

ఆటపాటలలో అలరించాల్సిన బాల్యం ఇంటి బాధ్యతలతో కనుమరుగైపోతున్న పేదింటి ఆడపిల్లల గురించి ”కుంకుడాకు” కథలో గవిరి పాత్ర ద్వారా తెలియజేశారు. బాలకార్మిక వ్యవస్థకు ప్రతినిధి గవిరి. చదువుకోవాల్సిన వయసులో కొండంత సంసార భారాన్ని మోస్తున్న ఎనిమిదేళ్ళ బాలిక గవిరి. భాషలో, వేషధారణలో, జీవన విధానంలో వున్నవాళ్ళకీ, లేనివాళ్ళకీ మధ్యగల వ్యత్యాసాన్ని చూపించే ఈ కథ మార్క్సిస్టు దృక్పథంతో రాసినట్లుగా కనిపిస్తుంది. గవిరిలాంటి పేద బాలికలలో చదువుకోవాలన్న తపన వ్యక్తమ వుతుంది.

చాసో కథల్లో జీవితపు చివరిదశలో పొట్టకూటికోసం అవస్థలు పడుతున్న వయసు మళ్ళిన స్త్రీలు కూడా ఉన్నారు. లంచం మరిగిన అవినీతి రైల్వే అధికారులు బియ్యం మూటతో ప్రయాణం చేస్తున్న ఒక ముసలమ్మను ఇబ్బంది పెట్టే కథే ”కుక్కుటేశ్వరం”. రైలు పెట్టెలో తనకి ముష్టి సలహాలు ఇస్తున్న తోటి ప్రయాణీకులతో ”మీరంతా మనుషులేనా?” అని భీకరంగా ప్రశ్నించింది ఈ ముదుసలి.  ”రైలు రెండు నిమిషాలు కూత పెట్టింది. దాని పరుగులో మార్పు వచ్చింది. తిరగబడేటట్టు అటు ఇటు వూగుతూ పట్టాలు మారుతున్నది”. అలాగే ముసలమ్మ కూడా ముందు అధికారులను రెండు నిమిషాలు బతిమాలింది. తర్వాత దాని మాటల్లో మార్పు వచ్చింది. పౌరుషంలో నుండి వచ్చిన ఆవేశముతో తిరగబడేటట్లు గట్టిగా ప్రశ్నించింది. ముసలమ్మ ప్రవర్తనా వైఖరిని వ్యక్తం చేయడంలో చాసో ఇక్కడ చక్కని శిల్పాన్ని ప్రదర్శించారు. చాసో కథల్లో మనకి వ్యభిచరించిన స్త్రీలు ఎక్కువగా కన్పిస్తారు. వీరిలో ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం అక్రమ సంబంధాలు కలిగిన వారు కొందరైతే, భర్త నిర్లక్ష్యానికి గురై, శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసం పెడత్రోవ పట్టినవారు మరికొందరు. ఇంకొందరు బతుకు బండి సాగడానికి వ్యభిచారాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నవారు. ఆ మార్గం పట్టిన వాళ్లు సర్వసాధారణంగా పామునోట్లో పడి పాతాళానికి పడిపోతారని తెలిసినా, గత్యంతరం లేక పరిస్థితులకి లోబడినవారు.

”లేడీ కరుణాకరం” కథలో శారద ఆర్థిక అశక్తత కలిగిన భర్త ఉన్నత చదువుకోసం, ఉంపుడుగత్తెగా మారుతుంది. విషయం తెలిసి నిందిస్తున్న భర్తతో ”నేనేం ద్రోహం నీకు చేశాను. వాణ్ణి దోచి నీకు పెడుతున్నాను. పుస్తెముడి వేసిన మొగుడివి కదా అని. నాకే ద్రోహబుద్ధి ఉంటే వాడితో లేచిపోనూ?” అంటూ భర్త మీద గల తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. శారద మాటలలో స్వచ్ఛత, ఆర్థిక నిస్సయతా స్పష్టంగా కన్పిస్తుంది. శారద పతిత అని భావించే వారికి ”కుంతీ పతివ్రతైతే శారద పతివ్రతే” అంటూ, చాసో సమకాలీన సభ్యసమాజానికి ఆదర్శం కాని, ఆచరణీయం కాని ఇతిహాస కథలను చాసో తనదైన శైలిలో ఎత్తి చూపాడు. పాండవులు పాండునందనులైతే, శారద కనిపెట్టిన పిల్లలు కూడా కరుణాకర సంతానమే అవుతారంటూ చాసో హేతువాద దృక్పథాన్ని కనబరిచాడు.

ఒక యువతి ఒక యువకుడికి రాసిన ఉత్తరాల రూపంలో సాగే ”బదిలీ” కథలో యువతి మొగుడికి అక్కర్లేని ఆడది. సానిదానికలవాటుపడ్డ భర్తతో బతకలేక, స్వేచ్ఛకోసం స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించే ఆమెకు ఒక యువకుని పరిచయం కొత్త ఆశలు చిగురింపజేసింది. కానీ ఆ యువకుడు ఆమె శరీరాన్నే ప్రేమించాడు కానీ, మనసుని ప్రేమించలేదు. అతడిపై వెర్రి వ్యామోహం పెంచుకున్న ఆ యువతి చివరికి అతనింట్లో పనిమనిషిగా ఉండడానికి కూడా సిద్ధమౌతుంది. ఆమెకు కావల్సిందొక్కటే. తనను మనసారా ప్రేమించే ఒక మనిషి తోడు కావాలి. ఆడవాళ్ళ నిస్సహాయతను ఆసరాగా తీసుకొని, వాళ్ళను లోబరుచుకొనే పురుషుల నికృష్టపు చేష్టలను చాసో ఈ కథలో కళ్ళకి కట్టినట్లు చూపారు. అయితే చాసో అంతటితో ఆగిపోలేదు. పరపురుషుని చేతిలో మోసపోయినా, ఆత్మస్థైర్యంతో తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకుందో తెలియజేసారు. పైగా ”నా మొగుడు చెడితేనే గదా నేను చెడ్డాను! నేను బుద్ధి తెచ్చుకొని బాగుపడ్డాను. మా ఆయన బుద్ధి మార్చి నేనే బాగుచేసాను”. అంటూ గర్వంగా చెప్పుకుంటుంది. అంతేగాకుండా తనని మోసం చేసిన యువకుడితో ”పెళ్ళాన్ని మాత్రం నెత్తిమీద దేవతలా చూసుకోవాలి” అంటూ సలహాలిస్తుంది.

తన భర్త ఆస్తిని కాపాడుకోవడం కోసం పక్కతోవ పట్టిన పడతి కథే ”ఏలూరెళ్ళాలి”. అరవై యేళ్లు వయసున్న ధనవంతుడికి రెండో భార్యగా వెళ్ళిన మాణిక్యమ్మ, శారీరక సుఖమివ్వని తన భర్తతో గుట్టుగా సంసారం సాగిస్తున్నా, భవిష్యత్తుకి సంబంధించి భయం ఆమెలో కొత్త ఆలోచనను కలిగించింది. ఆస్తి రక్షణ కోసం గత్యంతరం లేక పక్కింటి కాలేజీ కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. వైధవ్యం పొందిన తర్వాత తన మరదలు తనని ముండని చేసి మూలన కూచోపెడతారని ముందుగానే గ్రహించింది. వితంతు వివాహానికి అంగీకరించని కుటుంబ వ్యవస్థలో ఆమెకు ఇంతకన్నా వేరే మార్గం కనబడలేదు. తన చేస్తున్నది తప్పని తెలిసినా తప్పకచేసింది.

”చెప్పకు చెప్పకు” కథలో సత్యం తల్లి మొగుడు చనిపో యిన తర్వాత పిల్లలతో బతకడానికి వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుం ది. పిల్లల్ని పెంచడానికి, వాళ్ళని ప్రయోజకవంతులుగా చేయడానికి, విధిలేక వేశ్యగా మారింది. ఎదుగుతున్న పిల్లలకి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక సతమతమౌతుంది. తల్లిబాటలోనే కూతురు కూడా వెళుతుంది. ఇవేవీ నచ్చని పెద్దకొడుకు సత్యం వాళ్ళను మార్చాలని ప్రయత్నిస్తాడు. మార్చలేక చివరికి ”వ్యక్తులు వ్యక్తుల వల్ల మారరు. వ్యవస్థ మార్చాలి” అంటూ సంఘబాధ్యతను గుర్తు చేస్తాడు. అప్పుడే ఉదయిస్తున్న ఆదర్శభావ యువ సమాజానికి ప్రతీక సత్యం. కానీ వ్యక్తిగా సంఘాన్ని సంస్కరించలేని అసహాయుడు. ఆర్థిక అవసరాలు ఈ స్త్రీలలో ఆత్మగౌరవం కోల్పోయే విధంగా ప్రేరేపిస్తున్నా యనడానికి నిదర్శనం చాసో కథలు. ఆడదాని ఆదాయంతో వంట మనిషి నుండి ప్రెసిడెంటు దాకా ఎదిగిన ఒక వ్యక్తి కథ ”ప్రెసిడెంట్‌ లక్ష్మీకాంతం”. ఈ కథలో స్త్రీ పాత్ర, గమళ్ళ గంగమ్మ సారా దుకాణంలో సానిగా ఉంటూ, బోలెడంత సంపాదించడమే కాకుండా, ఒక మగవాడి ఉన్నతికి తాను పెట్టుబడి అయ్యింది. స్వేచ్ఛాజీవులైన ధనవంతుల ఇళ్ళల్లో జరిగే అక్రమ సంబంధాల గురించి, ”కవలలు”, ”బుగ్గి బూడిదమ్మ” కథలలో చాసో తెలియజేసారు. ”కవలలు” కథలో తల్లిదండ్రుల అక్రమ సంబంధం వల్ల వరుసకు అన్నాచెల్లెళ్ళు అవుతారని తెలియని పిల్లలు ఒకరినొకరు పెళ్ళిచేసుకోవడం సమాజంలో పతనమవుతున్న నైతిక విలువలను తెలియజేస్తుంది. ధర్మం ముసుగులో అధర్మంగా జీవిస్తున్న స్త్రీ కథే ”బుగ్గి బూడిదమ్మ”. దానధర్మాలు చేస్తూ, పేరు కోసం ప్రాకులాడుతుంది. దానధర్మాలతో బుగ్గిబూడిదమ్మ తెచ్చుకుంటున్న పేరు, అప్పారావుతో ఆమెకు గల అక్రమ సంబంధం ఏనాడో తలతన్నేసిందంటాడు రచయిత. చెప్పేదొకటి, చేసేదొకటి అంటే చాసోకి ఇష్టం ఉండదు.

తాను జీవిస్తున్న కాలంనాటి సామాజిక, ఆర్థిక అంశాలలో స్త్రీల స్థితిగతులను సంపూర్ణంగా అవగాహన చేసుకొని, పాఠకుడ్ని ఆలోచింపజేసే విధంగా కథలు రాయడంలో చాసో గొప్ప నేర్పరి. చాసో ఏ కథ రాసినా, ఆ కథలలో సంక్షిప్తత, ఏకాగ్రత, సమగ్రత, నిర్భరత అను నాలుగు లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. కథా శిల్పంలో అందెవేసిన చెయ్యి చాసో. తెలుగు కథకు పుట్టినిల్లైన విజయనగరంలో కేంద్ర సాహిత్య అకాడమీవారు ఇటీవల చాసో శతజయంత్యుత్సవాలు నిర్వహించి, చాసో సాహిత్యపరిమళాలను, కథాభిమానులకు అందించడం చాసోకే కాదు, తెలుగు కథకే తగిన గౌరవం లభించినట్లుగా మనం భావించాలి.

(చాసో శత జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంగా….)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో