ఇంటి పని – స్త్రీ వాద కథ- డా. యర్రదొడ్డి సుభాషిణ

పరిచయం : ఆధునిక కాలంలో స్త్రీ వాదమే నవ్యం. అందులో స్త్రీలు విప్పిన గొంతుక స్త్రీవాదంగా బలపడుతూ సమాజంలో నిలదొక్కుకుంది. స్త్రీవాదులు స్వేచ్ఛ, వివక్ష, అణచివేత, పితృస్వామిక అజమాయిషి, స్త్రీ అస్తిత్వం లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో ఒకటి ఇంటి పని. స్త్రీ కుటుంబంలో కూతురిగా, భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయినా గుర్తింపులేని పాత్రగానే ఉంది. అందులో కొందరు స్త్రీలు అన్ని బాధ్యతల మధ్య నలిగిపోతూ నోరు తెరవడానికి భయపడుతుంటే, మరికొందరు చైతన్యవంతులై నోరు తెరచి ఎదురు తిరుగుతున్నారు.

అణగిమణిగి వున్న స్త్రీ శక్తి, తరతరాలుగా భారతీయ సామాజిక వ్యవస్థలో అన్నివిధాలా రెండోస్థాయికి నెట్టివేయబడింది. దౌర్జన్యాన్ని అనుభవించింది. అలాంటి స్త్రీ జాతి ఇప్పుడు తన అస్తిత్వ నిరూపణలో పురోగమిస్తోంది. దానికి నిదర్శనమే నేను ఎంచుకున్న కథలన్నీ కూడా!

కథానికలు : రచయిత్రులు : ఈ పత్రాన్ని రాయడానికి నేను ఎంచుకున్న కథానికలు 13 మంది రచయిత్రులు రాసినవి. మొత్తం – 18. అవి : రంగనాయకమ్మ రాసిన ”అమ్మకి ఆదివారం లేదా?”, ”పెళ్ళానికి ప్రేమ లేఖ” కథలు; పి. శేషులత కథలు – ‘ఇందుగలదందు లేదని’, ‘పనికిరాని సగం’; జాజుల గౌరి – ‘నిట్టూర్పు’; పి. సత్యవతి – ‘ఇల్లలకగానే పండగౌనా?’; కొండేపూడి నిర్మల – ‘అతని భార్య’, ‘నరకంలో నాలుగు నిమిషాలు’; ఎస్‌. జయ – ‘లావణ్య’, ‘అమ్మ మనసు’; వి. ప్రతిమ – ‘మాక్కొంచెం నమ్మకమివ్వండి’, ‘ఇల్లాలి సుఖం’; తూములూరి కృష్ణవేణి – ‘ఆడ బ్రతుకు’; ఆచంట శారదాదేవి – ‘ఒక్కరోజు’; చల్లపల్లి స్వరూపరాణి – ‘మా చిన్నత్త’; వేదుల మీనాక్షీదేవి – ‘దినదిన గండం’; పంతం అమ్మాజీ – ‘స్వయం కృతాపరాధం’; ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి – ‘కాలు కదపని అదృష్టం’.

పత్ర ఉద్దేశ్యం : స్త్రీ తన గురించి తాను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఎంతో జ్ఞాన చైతన్యం కల్గింది. తరతరాలుగా వంట ఇంటికే అతుక్కుపోయి వండి వడ్డిస్తూ, ఏ మాత్రం సామాజిక ఉత్పత్తిలో భాగం పంచుకోలేని యాంత్రిక జీవనం పూర్వపు స్త్రీది. కాని నేటి స్త్రీ మారుతున్న కాలానికనుగుణంగా తను స్పందిస్తోంది. తన స్థానం కేవలం వంట ఇంట్లోనే కాదనీ, సామాజిక – చైతన్యపు వెలుగులోకే తను వెళ్ళాలనే చైతన్యం వచ్చింది. ఆ భావననే ఈ కథలలో రచయిత్రులు పేర్కొన్నారు. కనుకనే వీటిని ఎంచుకోవడం జరిగింది.

పార్శ్వాలు : ఈ కథానికల్లో ప్రధానంగా రెండు పార్శ్వాలున్నాయి. మొదటి పార్శ్వంలో సమస్యలను వివరించడం, వాటి నుండి సేద తీరడం, ఒక విధమైన నిరసన తెలియజేయడం, పితృస్వామిక భావజాలంలో భాగంగా వెలువడిన కథానికలు కావడంతో ఆ సమాజాన్ని జాలి, దయ, ఆప్యాయతలు కోరినట్లుగా కన్పిస్తాయి.

రెండవ పార్శ్వంలో మహిళలు సామాజిక రంగాల్లో బలపడటం, పరాభవాలను హింసను వ్యతిరేకించడం, తమ ఆశలకు, ఆశయాలకూ రూపాన్నివ్వడం, అభ్యుదయ దృక్పథంతో ఆలోచించడం, జీవన గమనంలో పోరాటం తథ్యమని భావించడం కన్పిస్తాయి.

ఇంటి పని : గత పదిహేను సంవత్సరాలుగా స్త్రీవాదం కొన్ని విషయాలను ముందుకు తెచ్చి చర్చకు పెట్టింది. అందులో ఇంటిపని గురించి కొత్త ఆలోచనలు రేపింది. ఆ ఆలోచనతో వచ్చిన కొన్ని కథలు ఇప్పుడు చూద్దాం!

తన ఇష్టాలకు, అభిరుచులకు అనుగుణంగా జీవించడానికి తనకిష్టమైన సంగీతాన్ని అభ్యాసం చేయడానికో, సాహిత్య సభకు వెళ్ళడానికో అవరోధమవుతున్న భార్యత్వాన్ని స్త్రీలదిగా ప్రత్యేకించబడిన ఇంటిచాకిరీ స్వభావాన్ని విమర్శిస్తూ… కొండేపూడి నిర్మల ‘అతని భార్య’, ‘నరకంలో నాలుగు నిమిషాలు’ అనే రెండు కథలు రాశారు. ఈ కథల్లో స్త్రీకి స్వంత ఉనికి లేకుండా పోవటం, సంసారమే ఒక నరకంగా మారడం సూచించారు. ఇదే విషయం 1913 ప్రాంతంలో రాసిన రచనల్లో కన్పిస్తుంది. ఇందులో స్త్రీ భక్తినీ, రక్తినీ దాటి తన గురించి తాను ఆలోచించుకోవడం మొదలైనట్లుగా ఆధారాలూ ఉన్నాయి.

”ఇంటి పనులెల్ల దీరిచి యిటకు వచ్చు
సరికి కాంస్యమగుచుండె సదయ హృదయ
నా మనోభావమును, మరి నాకు గల్గు
చిక్కులను నీ వెరుంగుదు చిన్మయాత్మ”

స్త్రీలకు ఇంటి పనులు ఆనాడు కూడా భక్తి కూటమికి వెళ్ళడానికి అడ్డంకేనన్న విషయం ఆనాడే గుర్తించింది స్త్రీ. ఆనాటి నుండీ కవయిత్రులు రచనల్లో స్త్రీ దుస్థితి గురించి కొద్దోగొప్పో రాస్తూనే ఉన్నారనడానికి పై మాటలే నిదర్శనం.

సుఖానికి నోచుకోలేకపోవడం : వి. ప్రతిమ రాసిన మరో కథ ‘ఇల్లాలి సుఖం’. ఈ కథలో నాయిక బతికినంత కాలమూ అత్తింట్లో అత్తకు అణకువైన కోడలిగా, భర్తకు బదులు చెప్పని భార్యగా నడచుకొని భర్త నిష్కరుణతో, కోడలి నిరాదరణతో హిస్టీరిక్‌గా మారి మంచంలో మరణయాతన అనుభవించి చనిపోయింది.

”అన్ని విధాలుగానూ దోపిడీకి గురయిన ఆ ఇల్లాలికి ఈ మునిమాపువేళ జబ్బు చేస్తే డాక్టరు వద్దకు తీసుకెళ్ళడానికి డబ్బులేదా?” (పుట:34) అంటూ ఈ ఇంటికి ఎంత చాకిరీ చేసినా వీరిలో చలనం లేదని ప్రశ్నింపచేస్తుంది రచయిత్రి.

అత్తింటికీ, పుట్టింటికీ నడుమ అరవచాకిరీ చేస్తూ… కండలు కరిగించుకొని చివరికి తన గురించి తాను పట్టించుకోకుండా చనిపోయిన సుఖవేణమ్మను ఉద్దేశిస్తూ… రచయిత్రి ఇల్లాలి సుఖం చావులోనే ఉందంటూ (పుట:36) ముగిస్తుంది. స్త్రీ బతికుండగా సుఖపడలేదనే స్పృహను, జాలిని పాఠకులలో కల్గిస్తుంది రచయిత్రి. లెనిన్‌ స్త్రీలను ‘గృహబానిసలు’ గా పేర్కొన్నారు. ఎందుకంటే చిల్లర ఇంటిపని ఆమెను కుదిపేస్తుంది. నోటిలో మాట నొక్కేస్తుంది. నిస్సహాయురాలిని చేస్తుంది. హీనపరుస్తుంది, (వాణి రంగారావు) అన్నది ఎంత నిజమో సుఖవేణమ్మలో స్పష్టంగా బోధపడుతుంది.

దోపిడి : స్త్రీ ఆర్థికంగానే కాక సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దోపిడీ చెయ్యబడుతోంది. చదువులేని స్త్రీకి ఈ దోపిడీ రెట్టింపవుతోంది. చల్లపల్లి స్వరూపరాణి రాసిన ‘మా చిన్నత్త’ కథ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

కుటుంబం, సంఘం అనేవి స్త్రీకి ఒక నీతి అనే యినుపచట్రాన్ని తయారుచేసి ఆ చట్రంలో ఎంతో అందంగా బలవంతంగా ఇరికించి ఆమెకేదో కిరీటాన్ని తొడిగినట్లు భ్రమింపచేయడానికి ఆమె చుట్టూ పకడ్బందీగా పన్నిన కుట్రలో స్త్రీ ఎలా బలైపోయిందో ‘మా చిన్నత్త’ కథలో చూపించారు రచయిత్రి. ఇంటిపని, వీధిపని రెండూ తనమీద మోపి తాను మాత్రం సోమరిగా తిరుగుతూ ఇంటికే పరిమితం చేసిన సోదరుడి ప్రాణం నిలబెట్టాను. నాకు మిగిలింది నీతీ, పనీ మాత్రమేనంటూ తన మనసులో గూడు కట్టుకున్న బాధను వ్యక్తం చేస్తుంది. స్త్రీని ఇంటికే పరిమితం చేసి ఆమె మీద నీతి అనే యినుప చట్రాన్ని తగిలించారు. ”కేవలం జీవిత వాస్తవాలను చిత్రించడం వేరు. వాటి వెనుక గల శక్తులను అంటే జీవితంలోని ఘోరాలకు, అనర్థాలకు, సుఖాలకు, దుఃఖాలకు గల కారణభూతాలను విశ్లేషించి సాహితీరచన సాగించడం వేరు. రెండవరకం రచనలోనే సామాజిక దృక్పథం ఉంది అంటాం” (సొదుం రామ్మోహన్‌). అది ఎంత నిజమో, సామాజిక చైతన్యం స్త్రీకి ఎంత అవసరమో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.

విశ్రాంతి లేకపోవడం : వేదుల మీనాక్షీదేవి రచించిన ఇంకోకథ దినదినగండం. కుటుంబం – మహిళ రోజువారి చాకిరీ ఈ కథలో ప్రధానంగా ఉంది. ఇంటిలో పని ఎంత చేసిన తెమలకపోవడం, ఎటుచూసిన చిందరవందరగా ఉన్న సామాన్లు, బట్టలు ఒకవైపు సర్ది అమ్మయ్య! ఈ పూటకు ఫర్వాలేదు అనుకునేలోపు మరో వైపు పని ఎదురుచూడటం – దినదినగండమే స్త్రీ ఇంటిపని. ”ప్రతి మనిషి 24 గంటల్లో మూడు భాగాలు చేసి ఒక వంతు శ్రమించటానికి, ఒక వంతు అనుభవించటానికి, ఒక వంతు మరునాడు శ్రమకు సిద్ధపడటానికి వినియోగించుకోవటమన్న సూత్రం ఆధారంగా స్త్రీని చూస్తే ఆమె తన శ్రమఫలాన్ని పురుషుడిలా అనుభవించలేదని, విశ్రాంతి తీసుకోదని ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తూనే ఉంటుందని గుర్తిస్తే, స్త్రీ శ్రమ ఎంతగా దోపిడీకి గురవుతోందో తెలిసి వస్తుంది” (ఆచార్య కొలకలూరి ఇనాక్‌). ఈ మాటలు అక్షర సత్యాలని, స్త్రీకి విశ్రాంతి అనేది కరువైందనేది దినదినగండం కథ స్పష్టం చేస్తుంది.

కుటుంబ చాకిరి : పంతం అమ్మాజీ రాసిన ‘స్వయం కృతాపరాధము’ కథలో అత్తగారి ఆరళ్ళు, కుటుంబ చాకిరీతో స్త్రీ హింసకు గురికావడం, చివరకు శరీరంలో సత్తువపోయి ప్రాణం పోవడంతో కథ ముగుస్తుంది. డబ్బే ప్రధానంగా భావించి తన కూతురు ఇంట్లో సుఖపడుతుందో లేదోననే ఆలోచన చేయని తండ్రి లీలకు వివాహం చేస్తాడు. చిన్నప్పటినుండి గారాబంగా పెరిగిన ఆమె కాపురానికి వెళ్ళిన కొద్దిరోజుల్లోనే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అత్తగారికి చాకిరీ చేయడం – దానికి ఫలితం ఆమెకు సూటిపోటి మాటలు, సాధింపులే మిగిలాయి. తన బాధను స్నేహితురాలితో పంచుకొందన్న కోపంతో ఆమెను కొట్టి బయటికి గెంటేస్తాడు భర్త. స్త్రీకి తనకంటూ ప్రత్యేక జీవితం లేకుండా పోయింది. ”సంసార రధానికి రెండు చక్రాలుగా భార్యాభర్తలిద్దరిని పేర్కొన్నా, సంసార బరువు బాధ్యతలు గొడ్డు చాకిరి నిత్యం స్త్రీవే. కానీ పైపైన చేసే అజమాయిషీనే, రెండో భాగంగా భావించే భర్తలను చూసి స్త్రీ మాత్రం సంసారాన్ని ఈదడంలో సమానంగా భాగమవుతున్నామనే ‘భయాన్విత’ ఆలోచనలో ఉండి దుఃఖాన్ని దరిచేరినివ్వదు” (డా. కొలకలూరి మధుజ్యోతి) అదే చేసింది లీల.

దినదినగండం, స్వయంకృతాపరాధం రెండు కథల్లోనూ స్త్రీ సమస్యల పట్ల ఒక విధమైన సానుభూతి, జాలి, దయ, నిరసన, పోరాటపటిమ కన్పిస్తాయి.

పిల్లల పెంపకం : ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి రాసిన ‘కాలుకదపని అదృష్టం’ కథలో కథానాయిక తన కుటుంబంలో బండచాకిరీ చేసి అవిటిది కావడం ఇతివృత్తం. పిల్లల బట్టల దగ్గర్నుంచీ, ఎవరికి ఏమి కావాలన్నా అన్నీ తనే చేసి అవిటిది అయిపోతుంది జయమ్మ. ”చాకిరీ కోసమా పెళ్ళాం? నాలుగు రూపాయలు పారేస్తే, దాసీది చేసి పెడుతుంది కదా పన్లు అన్నీను? అన్న మాటకు సమాధానంగా కార్యేషు దాసీ అన్నాడు కదటోయ్‌ మరీ” (పుట:177) అంటూ భర్త ఇలా అడుగడుగునా స్త్రీని ఒక దాసిగానే చూస్తున్నాడు తప్ప ఆమెకు కొంత సాయం చేద్దామనే ఆలోచన పురుషుడిలో లేదు.

ఉద్యోగ బాధ్యత : అవిశ్రాంత జీవితంలో స్త్రీ నిర్వహించే పాత్రలు విభిన్నం. ఒకదానొకకటి పొంతనలేదు. కాలంతో పాటూ ఆలోచనలూ మారి, ఎంతో అభివృద్ధి చెందింది సమాజం. అయినా స్త్రీకి తిప్పలు తప్పడంలేదు. ఇంటిపని, ఆఫీసు పనులలో ఉక్కిరిబిక్కిరి అయ్యే కథలు మచ్చుకి మూడు తీసుకున్నాను. జాజుల గౌరి రాసిన ‘నిట్టూర్పు’, పి. శేషులత రాసిన ‘ఇందుగలదందు లేదని’, ‘పనికిరాని సగం’ కథలు మూడూ స్త్రీ అవిశ్రాంత పనిని తెలియజేస్తాయి.

సిటీలో ఉద్యోగం చేసే ఇల్లాలి అవస్థ భార్యగా, తల్లిగా, అందరికీ అన్నీ చేసి పెడుతున్న వనిత బ్రతుకు బాస్‌, భర్త, పిల్లల సానుభూతి కరువై, పనిలో సహాయం చేసే వారు లేక తనలో తానే కుమిలిపోయే మధ్యతరగతి స్త్రీ నిట్టూర్పులే జాజులగౌరి రాసిన ”నిట్టూర్పు” కథ.

అవిశ్రాంత పోరాటం : ఉద్యోగాలు చేస్తూ ఇంటిపని భారం కూడా ఒంటరిగా మోయాల్సి వస్తున్న స్త్రీ జీవితంలోని ఒత్తిడిని, కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ కూడా గుర్తింపుకు, కృతజ్ఞతకు నోచుకోని స్త్రీ జీవితపు అసంతృప్తులే ‘ఇందుగలదందులేదని’, ‘పనికిరాని సగం’ కథలకు ఇతివృత్తాలు.

వంటపని, ఇంటిపని, పిల్లల పని మాత్రమే చూసే గృహిణి బాధ్యతలకు తోడు ఉద్యోగం చేసే మహిళలకు మరో ప్రధానమైన ఉద్యోగ బాధ్యత తోడైంది. భర్తకు ఉద్యోగ బాధ్యత ఒక్కటే. కానీ స్త్రీకి అలా కాదు. బరువు బాధ్యతలు, పనిభారం రెండూ ఎక్కువయ్యాయి. గృహ నిర్వహణలో, బిడ్డల పోషణలో భర్త భాగస్వామ్యం లేకపోతే అన్నీ భార్యనే చేయాల్సి ఉంటుంది. ఆమె ఇల్లు – ఆఫీసుల మధ్య నలిగిపోతూ శారీరక, మానసిక ఆరోగ్యం కోల్పోయే స్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం పురుషాధిక్య భావంతో పనులలో పాలు పంచుకోకపోవడమే. ఇంటాబయటా స్త్రీ దాన్ని ఎదుర్కోవడంతో ఆమె పురోభివృద్ధికి ఆటంకాలు ఏర్పడే అవకాశముంది. ”స్త్రీ జీవితంలో ఇంటిలో చేస్తున్న చాకిరీ అంతా గుర్తింపు పొందటం లేదన్నది సత్యం. శ్రమశక్తిని గుర్తించే మార్క్సిజం కూడా దీన్ని పట్టించుకోలేదు” (డా. కొలకవారి మధుజ్యోతి). ‘నిట్టూర్పు’, ‘ఇందుగలదందు లేదని’, ‘పనికిరాని సగం’ కథలు మూడూ స్త్రీ అవిశ్రాంత జీవితం, కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వని పురుషనైజం నిరూపిస్తున్నాయి.

మొదటి పార్శంలో చెప్పుకున్న ఈ కథలన్నీ సమస్యలను వివరిస్తూ, వాటి నుండి సేద తీరడం ఉంది. పితృస్వామిక అజమాయిషీలో స్త్రీ పడిన వేదన స్పష్టంగా ఉంది.

”వేదనలు, కష్టాలు దుర్భరమై ఇలా ఎంతకాలం బ్రతకాలి అనే తిరుగుబాటు ధోరణి విప్లవం తెస్తుందంటారు” సొదుం రామ్మోహన్‌. ఉద్యమంగా ఉన్న స్త్రీ వాదం విప్లవకరమైన మార్పునే ఆకాంక్షిస్తుందనడానికి ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసిన ‘పెళ్ళానికి ప్రేమలేఖ’, ‘అమ్మకి ఆదివారం లేదా?’ ‘కథలు, పిసత్యవతి’ ఇల్లలక గానే పండగౌనా?’, ఆచంట శారదాదేవి : ‘ఒక్కరోజు’; ఎస్‌. జయ – ‘లావణ్య’, ‘అమ్మ మనసు’, వి. ప్రతిమ – ‘మాక్కొంచెం నమ్మకమివ్వండి’; తూములూరి కృష్ణవేణి – ‘ఆడబ్రతుకు’ కథలే నిదర్శనం.

తిరుగుబాటు ధోరణి : ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఎన్నో రచనలు చేసింది. ప్రసిద్ధ రచయిత్రి ఈమె. జీవితం పట్ల అచంచలమైన విశ్వాసముందని తన రచనలే చెప్తాయి. స్త్రీల జీవితంలో అణచివేతకు ఇంటిపనికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ… స్త్రీలకు విశ్రాంతిని, వికాసాన్ని ఇవ్వని ఇంటిపని భారాన్ని మగవాళ్ళు పంచుకొని వాళ్ళకు మంచి విషయాలు నేర్చుకోవడానికి సమయాన్నివ్వాలంటూ చాలా రచనలు చేశారు. అందులో రెండు కథలు : 1. పెళ్ళానికి ప్రేమలేఖ, 2. అమ్మకి ఆదివారం లేదా?

1971లోనే రంగనాయకమ్మ ‘పెళ్ళానికి ప్రేమలేఖ’ కథను ఉత్తరాల రూపంలో రాశారు. భార్యాభర్తలిరువురూ రాసుకొన్న ఏడు ఉత్తరాలు, ఒక ఎక్స్‌ప్రెస్‌ టెలిగ్రాములో ఈ కథ మొత్తం నడుస్తుంది.

వంటకూ, ఇంటిపనికీ ఇబ్బందిగా ఉందంటూ భర్త బుచ్చిబాబు పుట్టింటికి వెళ్ళిన విమలకు ఉత్తరం రాయడం, దానికి సమాధానంగా విమల ఇంటిపనికీ, వంటకూ అయితే నేను అవసరం లేదని, వాటికోసం తగిన సూచనలు, పరిష్కారాలు ఉత్తరాలలో ఇస్తే సరిపోతుందంటుంది. భార్యను పుట్టింటికి పంపించి తప్పు చేశానని బుచ్చిబాబు రాస్తే, పంపడానికి, మానడానికి నీకు ఎలాంటి హక్కులేదని విమల జవాబు చెప్పడమే కథ. ఇలా భర్త రాసే ధోరణికి మనస్సులో ఇంకెప్పటికీ అతని దగ్గరకి వెళ్ళకూడదనే విరక్తి పుట్టి, ఇలాంటి వ్యక్తికి నేను ఎప్పటికీ ఏమీ కాలేనని గ్రహిస్తుంది విమల. ఇంటికోసం, వంటకోసం భార్యలను కోరుకునే పురుషులకు చీరలు నగలతో వాళ్ళను ప్రలోభపెట్టి అదుపులో వుంచుకోవచ్చుననుకొనే నీలాంటి భర్తలకు విడాకులిచ్చినా తప్పులేదని, ఇక ఎప్పటికీ నన్ను రమ్మని ఉత్తరం రాయకని విమల జాబు రాస్తుంది. అది చదివిన స్త్రీలు ఇంటికీ, వంటకూ నిర్దేశించబడిన మనుషులం కాదన్న స్పృహను పొందుతూనే, స్నేహం, ప్రేమ, హక్కుగా సాధించుకోడానికి ప్రయత్నించడాన్ని చిత్రించారు రంగనాయకమ్మ. నేటి స్త్రీ సంతోషప్రదమైన వివాహంతో పాటు కుటుంబంలోనూ, సమాజంలోను తన వ్యక్తిత్వానికి ప్రతిభకు గుర్తింపు ఉండాలని, వ్యక్తిగా తనకు వికాసముండాలని కోరుకుంటూంది. ఆ కోరిక ఫలితమే ఆమె భర్తతో, కుటుంబంతో, సమాజంతో తనలో తాను సంఘర్షిస్తూంది. ఆ సంఘర్షణలో నుంచి అనేకానేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ”స్త్రీ సమస్య పూర్తిగా వ్యక్తిగత సమస్య కాదు, స్త్రీ చైతన్య వంతురాలయ్యే కొద్దీ ఒక మేరకు, పురుషుడు సంస్కారవంతుడయ్యే కొద్దీ మరొక మేరకు ఆ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు” అంటారు ఆచార్య కాత్యాయినీ విద్మహే.

అస్తిత్వ సంఘర్షణ : సామాజిక దృక్పథం ఉన్న రచయిత్రులు తమ రచనల్లో తరాలుగా ఈ వ్యవస్థలో స్త్రీలు ఇంటి చాకిరీతో ఎంతగా వారి అస్తిత్వాన్ని కోల్పోయారో చెప్పే కథలు కొన్ని అయితే, మరికొన్ని తన అస్తిత్వాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేసినవి ఉన్నాయి. స్త్రీ తనను తాను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా కల్గిన జ్ఞాన చైతన్యాలు ఇప్పటి కథలకు వస్తువులయ్యాయి. అందులో ఒకటి పి. సత్యవతి రాసిన ఇల్లలకగానే పండగౌనా?!

‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు’ అన్నది మన సమాజం. దాన్ని ఒంటబట్టించుకున్న ఒక యువతి చదువూ సంధ్య, తెలివీ, చాకచక్యం, సమయస్ఫూర్తీ ఉండి కూడా ఆమె వివాహమయ్యాక అత్తారింట భర్త అత్తల మెప్పుకోసం ఇల్లలకడమే ధ్యేయంగా తనను తాను మరచిపోయింది. తన పేరు గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించి పోరాడి సాధించడమే కథ. ఇంటిపనిలో పడిన ఇల్లాలు అందం, చదువు, తెలివి ఉండి కూడా తనని తాను అర్పించుకొన్న స్త్రీ అమ్మాయిగానో, అమ్మగానో, భార్యగానో మాత్రమే మిగిలిపోతుంది తప్ప ఆమెకంటూ ఒక గుర్తింపులేదన్నది ఈ కథలో స్పష్టమవుతుంది.

స్త్రీ తాత్విక ధోరణిలో తానెవరిననే ప్రశ్నతో తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. స్త్రీ అంటే గృహిణీ, భార్య, తల్లి, కూతురు ఈ పాత్రలు పోషించటం తప్ప మరొకటి కాదా? తన ఇష్టాలు, శక్తులు, ఉనికి వీటితో కూడిన ”తన” గురించి తెలుసుకోవడానికి ఆధునిక స్త్రీ పడుతున్న తపన ఇల్లలుకుతూ మరచిపోయిన ఇల్లాలు నిరూపిస్తుంది. ఒక్క స్త్రీ కాదు…. స్త్రీలోకమంతా తమ అస్తిత్వాన్ని మరచిపోయిందనేది స్పష్టం చేస్తుంది ఈ కథ.

తరతరాలుగా ఇంటిపనిలో పడి పోగొట్టుకున్న అస్తిత్వాన్ని స్త్రీ సంపాదించుకోవాలన్నదే పి. సత్యవతి అభిప్రాయంగా తోస్తోంది. అలా చేయనట్లైతే ఆమెకు పురోభివృద్ధి వుండదని వక్కాణిస్తుందీ కథ. ఈ విధంగా స్త్రీ బుచ్చిబాబులో చైతన్యం వస్తుంది. భార్య తన నుంచి ప్రేమను కోరుతోందని తెలుసుకొని తప్పు ఒప్పుకుంటాడు. మొదట పురుషాహంకారాన్ని ప్రదర్శించినా చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె జవాబుకు ఎదురు తిరగకుండా విమల మనసు విడాకుల ప్రస్తావన తెచ్చేంతగా కష్టపెట్టుకుందంటే తనలో లోపమేమిటా అని ఆలోచించాడు. ప్రేమను, సహజీవనాన్ని కోరే ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని, తనలోనే మార్పు కల్గి విమల కోసమే భార్యను కోరుకుని ఆహ్వానిస్తాడు బుచ్చిబాబు.

భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలని నిరూపిస్తుంది ఈ కథ. ప్రేమానురాగాలను బుచ్చిబాబు తనపట్ల కనబరుస్తూ ఉత్తరం రాస్తేకానీ విమల పుట్టింటి నుంచి కదలలేదు. ఏ స్త్రీ అయినా భర్త తనను తననుగా కోరుకోవాలని, అతని జీవితంలో సగభాగంగా గుర్తించాలని తపిస్తుంది. అది విమలలో స్పష్టంగా కనబడుతుంది.

1996లో గృహిణుల విశ్రాంతిని ప్రస్తావిస్తూ రాజ్యసభలో ప్రతిపాదించిన బిల్లులో లేవనెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు, ఆందోళనలకు అభిప్రాయాలకు సమాధానాన్ని ఇతివృత్తంగా ‘అమ్మకి ఆదివారం లేదా?’ అనే మరో కథ రాశారు రంగనాయకమ్మ.

ఇంటి పని, బయటిపని కలిసిందే జీవితం అనే అవగాహనను వేణు ద్వారా అందరిలో కల్గించడం, ఆడవాళ్ళు బయటి పనులు వెతుక్కోవడానికి, మగవాళ్ళు ఇంటిపనిలో పాలుపంచుకోవాలనే స్పృహను కల్గించడమే ఈ కథ సారాంశం. రాజ్యసభ ప్రతిపాదించిన ఇంటిపని నుండి ఆడవాళ్ళకు ఒకరోజు విశ్రాంతి బిల్లును హక్కుగా వినియోగించుకోవడానికి స్త్రీలు సిద్ధపడితే ఏమవుతుంది? స్త్రీలందరూ పనులు మానేసి, ఆడామగా సమానమే కనుక ఆదివారం సెలవును ఉపయోగించుకొంటామంటే ఏమవుతుంది? స్త్రీలు అన్ని పనులూ చేస్తుంటే సుఖంగా రోజులు గడుపుతూ విశ్రాంతిగా ఉండే వాళ్ళకి ఇది ఇబ్బందే! ఆదివారం మాకు విశ్రాంతి వద్దా? అంటారు. ఇలాగైతే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకు ఇంటిపని అదనపు బరువే కదా? అంటూ ఎన్నో ప్రశ్నలు ఈ కథలో ముందుకొచ్చాయి. స్త్రీలకు ఆదివారం విశ్రాంతి అనేది చట్టబద్ధమైన హక్కుగా వచ్చినా, పితృస్వామిక సమాజం, ఆ సమాజ ప్రయోజనాలను చేకూర్చడానికి రూపొందిన ప్రభుత్వం, కుటుంబం మొదలైనవన్నీ అది ఆచరణ వాస్తవం కావడానికి అవరోధమే అవుతుందని కూడా ఈ కథలో రచయిత్రి సూచించారు. హెచ్చరించారు కూడా! స్త్రీల ప్రయోజనాల కోసం చట్టాలు చేయటమూ ఒక సంస్కరణే. ”అసమ సంబంధాల వర్గ సమాజపు పునాదులు కదలకుండా, పితృస్వామిక సామాజిక సంస్కృతిని మార్చకుండా స్త్రీల కోసం ఎన్ని చట్టాలు చేసినా స్త్రీల జీవితంలో అభివృద్ధికి అవి ఇసుమంతయినా తోడ్పడవు” (కాత్యాయినీ విద్మహే) అన్నది స్పష్టం. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుందని నిరూపించింది. ‘మహిళా జనజీవితంలోని స్త్రీత్వాన్ని కేంద్రబిందువుగా చేసుకొని చేయటం ఫెమినిస్టు లక్షణం’ (కేతవరపు రామకోటిశాస్త్రి) అదే చేశారు పి. సత్యవతి.

తాత్విక చింతన : ‘ఆచంట శారదాదేవి’ రచించిన మరొక కథ ‘ఒక్కరోజు’ తాత్విక చింతనను చూపిస్తుంది. కథారచనలో ఒక తాత్విక ధోరణి ప్రదర్శించగల రచయిత్రి ఈమె.

‘రాత్రి అంతా వేకువకోసం, పగలంతా రాత్రి కోసం కనిపెట్టుకుని ఉండటమే జీవితం’ అంటూ నిరాశా అసంతృప్తులతో నిండిన నిత్యజీవితంలో జరిగే సంఘటనల గురించి రాస్తూ, ప్రతిరోజూ ఏదో మార్పు వస్తుందని ”వట్టిభ్రమ” అనే తాత్విక చింతనతో కథని ముగించారు రచయిత్రి. స్త్రీకి ఎప్పుడూ విశ్రాంతి ఉండదని ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే బ్రతకాలని, ఇదే స్త్రీ జీవితం కాబోలూ అని తనను తాను సమర్థించుకోవడం, స్త్రీకి ఈ జీవితంలో ఏదో మార్పు వస్తుందనేది భ్రమేనన్నది స్పష్టం చేసిన కథ ఇది.

ఇంటి చాకిరీకి గుర్తింపు కోరడం : నేటి కాలంలో సాహిత్యోద్యమంగా స్త్రీవాదం రూపు దాల్చింది. తరాలుగా పురుషాహంకారానికి గురవుతూ, సమాజంలో ఒక విధంగా వెలివేయబడుతూ, విద్యావిజ్ఞానాలకు దూరమై, తమ పురుషుల దయపై ఆధారపడి, ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా మానసిక కుటుంబ సమాజ హింసలకు నిరంతరం తనలో తాను కుంచించుకుపోయిన స్త్రీ జాతి, మేల్కొని చైతన్యవంతమై తిరగబడి తమ సమస్యల గురించి ఆలోచించి పరిష్కరించుకొనే స్థితి వరకు స్త్రీ జాతి ఎదుగుతూ వుంది. ‘లావణ్య’, ‘అమ్మ మనసు’, ‘మాక్కొంచెం నమ్మకమివ్వండి’, ‘ఆడ బ్రతుకు’ వంటి కథలు ఈ కోవలోకే వస్తాయి.

”లావణ్య” కథలో స్త్రీలకు గుర్తింపులేని ఇంటి చాకిరీకి గుర్తింపు కావాలని ప్రబోధించడం ఉంది. కట్నమిచ్చి రామారావును పెళ్ళి చేసుకున్న లావణ్య అత్తారింట్లో చేసే చాకిరీకి ”ఇల్లాలుగా నాకు విలువ లేనప్పుడు ఇన్నాళ్ళ శ్రమ కూలిపనే అవుతుంది. ఇంటిపని పని కాదా? అన్ని పనులకు ఖరీదున్నప్పుడు దీనికెందుకు ఉండదు” అని లావణ్య తన భర్తా అత్తమామలను నిలదీయడంతో కథ ముగుస్తుంది.

‘అమ్మ మనసు’ అనే మరోకథలో కోటీశ్వరమ్మ ఎప్పుడూ పిల్లలకూ, ఇంటికీ చాకిరీ చేయడంలోనే సంతృప్తి పొందేది. ఆమెను కేవలం తమ పిల్లలకు సేవలు చేసే యంత్రంగా కన్నబిడ్డలే భావిస్తారు. అది చూసి బాధపడి కోటీశ్వరమ్మ స్వంతంగా ‘బేబీ కేర్‌ సెంటర్‌’ నడపాలని నిర్ణయించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

వి. ప్రతిమ రాసిన ‘మాక్కొంచెం నమ్మకమివ్వండి’ కథలో భర్త అయ్యప్పమాల వేసుకున్నప్పుడు బయట చేరిందని, సేవలు చేయడానికి వీలుకాదని ఇంటి నుండి గెంటివేయగా, పుట్టింటికి చేరిన భారతి; ఆడపిల్లలను కన్నందుకు తన తప్పేమీ లేకపోయినా పుట్టింట్లోనే ఉండిపోవాల్సిన కస్తూరి జీవితాలను చూసి తల్లి భయపడటం, మెట్టినింటికి వెళ్ళమని ఆజ్ఞాపించడం – దానికి భారతి ‘మాక్కొంచెం నమ్మకమివ్వండి’ పిరికితనం నూరి పోయవద్దంటూ తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావడమే కథ.

తూములూరి కృష్ణవేణి రాసిన ‘ఆడ బ్రతుకు’ కథ నూతన ధోరణికి ఒక ప్రతీక. స్త్రీలు పురుషుల చేత బానిసలుగా చూడబడుతున్నారని, స్త్రీలు ఇంట్లో చేసే చాకిరీకి విలువనివ్వడం లేదని, తలచుకుంటే ఆ గృహిణులందరూ ఏకమై సమ్మె కూడా చేయగలరని కథానాయిక మాటల ద్వారా వ్యక్తం చేశారు రచయిత్రి. ఇదే మాటను డా. కొలకలూరి మధుజ్యోతి గారు ”స్త్రీవాదులు తమ తీవ్రతను, పురుషాధిక్యాన్ని, సమాజాధికారాన్ని, అసమానతను, లింగవివక్షతను, స్త్రీకి ఉన్న ద్వితీయస్థానాన్ని, వారిలో కల్పించిన అభద్రతను కుటుంబం పేరుతో సాగిస్తున్న అణచివేతను, శ్రమ జీవనంలో అసమానతను, వేదనలను, బాధలను పురుషుడు ఏ మాత్రం అంచనా వేయలేని తమ భావాలను ఖచ్చితంగా వ్యక్తం చేశారంటారు”. ‘ఆడబ్రతుకు’ కథలో అదే జరిగింది.

”పగలస్తమానం బండచాకిరీ చేస్తూ పైగా మీరు వచ్చేసరికి స్నానానికి నీళ్ళదగ్గర నుండి భోజనానంతరం కిళ్ళీ దాకా రెడీగా ఉండాలి… యింట్లో భార్యను ఒక దాసీ క్రింద కట్టేస్తున్నారు మీ మగవాళ్ళు” (పుట:101) అంటూ కుటుంబంలో స్త్రీ దాసిలాగా అన్నీ తనే చేయాల్సిన స్థితి ఉంది. కనుకనే కేవలం మార్క్సిజం కూడా స్త్రీ వాదుల సమస్యకు పోరాటానికి ఆలంబనం కాలేకపోయింది.

”పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేసే స్త్రీలు స్వతంత్రంగా స్వేచ్ఛగానుంటున్నారు. కానీ, మాబోటి గృహిణులకు చదువు సంధ్యలనే సమస్యలేకుండా, కూపస్తమండూకముల వలె తయారు చేశారు. స్త్రీ అంటే బయటి ప్రపంచం నుండి వంట యింట్లోకి విసిరి పారేసిన యంత్రమని మీ యుద్దేశ్యం కాబోలు” (పుట : 102) అంటూ ప్రశ్నించే చైతన్యం కథానాయికలో వచ్చింది. ‘ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరగరాస్తారు’ అన్న ఆశాభావం గురజాడది. ఆ భావం ఈ మాటల్లో వ్యక్తమవుతుంది. ”భార్యభర్తలు కుటుంబ నిర్వహణలో సమానులే. పూర్వపు ఆ యుద్దేశ్యాలు పోయి, ”పోషించేవాడు – పోషింపబడేది” అనే భావం మీలో పాతుకుపోయింది. కుటుంబ నిర్వహణ, పిల్లల పోషణ, గృహకృత్యాలూ, ఇవి బండచాకిరిగానూ, ఆఫీసుకెళ్ళి దర్జాగా కుర్చీల మీద కూర్చొని చేసేవి వుద్యోగాలు కాబోలు…” (పుట : 102) అనీ, ”…. పురుషులకున్నంత స్వాతంత్య్రం స్వేచ్ఛలు స్త్రీలకెందుకుండకూడదు? స్త్రీ స్వాతంత్య్రం కొరకు మా మహిళా సంఘములు కృషి చేయకతప్పదు” (పుట:103) అనీ ఈనాటి స్త్రీవాద భావాలను స్పష్టంగా ప్రకటించింది కథానాయిక. ఇంటి చాకిరీ గురించి స్త్రీల దృక్పథం నుండి ఎంతో సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయం సామాజిక పునాదిలో భాగమని సమాజం గుర్తించేంత వరకూ ఈ సాహిత్యం రావాలన్నది ఈ కథల ద్వారా స్పష్టమవుతోంది.

ముగింపు : ఋగ్వేద కాలం నుండి మహిళలను అబలలని చులకన చేస్తూనే క్రమంగా ఇంటికే పరిమితం చేశారు. పతియే ప్రత్యక్షదైవంగా, పిల్లలు ఆదైవాంశ సంభూతులుగా, గృహమే స్వర్గసీమగా బోధిస్తూ, స్త్రీలకు వ్రతాలు, నోములు, పూజలూ ఆపాదించారు. ఇవన్నీ భర్త పిల్లల ఆయురారోగ్యాలకే కానీ స్త్రీ సుఖసంతోషాల కోసం కాదు. ”స్త్రీ ఈ పూజలకూ, వ్రతాలకూ, ఇంటి పనులకూ పరిమితమైపోయి, తనలోని సృజనాత్మకశక్తిని, వ్యక్తిత్వాన్ని తానే గుర్తించలేక అణచివేసుకుంది” (డా. రావిప్రేమలత). స్త్రీలోని శక్తి సామర్థ్యాలు తనకే తెలియకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ”స్త్రీలను అణచివేయడం వల్ల మనదేశం ఎంతోమంది స్త్రీ కళాకారులను, విద్యావేత్తలనూ పోగొట్టుకుంది. స్త్రీ కుటుంబానికే కాకుండా సమాజానికి బానిస అయింది” (చలం). అది అక్షరాలా నిజమని కొన్ని కథలు నిరూపిస్తున్నాయి. మరికొన్ని కథలు స్త్రీలో జ్ఞాన చైతన్యం కలిగి తన ఉనికిని కాపాడుకుంటూ స్థిరత్వాన్ని ముద్రించుకుంటూ ముందుకు సాగుతోందని వక్కాణిస్తున్నాయి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.