తెలుగు సాహిత్యంలో మానవ వాదం – శ్రీమతి మోసర్ల శ్రీ అంజని

మానవ వాదులు పరిపక్వత కలిగిన వ్యక్తులు. ప్రతి వ్యక్తి ఏకాంతతను కలిగి ఉండే హక్కును వారు గుర్తిస్తారు. వాళ్ల ఆకాంక్షలను తీర్చుకోవటానికి, లైంగిక వ్యాపారంలో ఇష్టమైన వాటిని పొందటానికి, సంతానం విషయంలో ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉండటానికి, సమగ్రమైన, జ్ఞానయుతమైన ఆరోగ్య రక్షణను ఆశించటానికి గల హక్కులను ఆదరిస్తారు మానవ వాదులు. సర్వసామానమైన సభ్యతా సూత్రాలను విశ్వసిస్తారు. హేతుత్వాన్ని, కరుణను పోషిస్తారు. శాస్త్రాలను, కళలను రెండింటినీ సమానంగా ఆదరిస్తారు. తమను విశ్వపౌరులుగా భావించుకొంటూ, విశ్వంలో ఇక ముందు జరగబోయే నూతనాంశాల విషయమై ఉత్కంఠను ప్రదర్శిస్తారు. నవ్య భావాలను స్వీకరిస్తారు. కొత్త కొత్త ఆలోచనా రీతులను ఆహ్వానిస్తారు.

నిరాశానిస్పృహలపై ఆధారపడిన మత శాస్త్రాలను దౌర్జన్యం హింసల సిద్ధాంతాలను కాదని వాస్తవమైన ప్రత్యామ్నా యంగా మానవ వాదాన్ని ప్రతి పాదిస్తారు మానవ వాదులు. ఇతరులకు సేవ చేయటం వల్ల వచ్చే వ్యక్తిగత ప్రాముఖ్యానికి నిఖార్సయిన తృప్తికి మూలంకందమైనది హ్యూమనిజం. మానవులుగా సాధ్యమైనంత మంచితనాన్ని, ఉదాత్తతను సంపూర్ణంగా రూపొందించటం మేలయినదని మానవ వాదులు విశ్వసిస్తారు. ఈ సూత్రాలను అమెరికాలోని ప్రముఖ మానవ వాదులు సిద్ధాంతీక రించారు. ప్రముఖ మ్యూమనిస్టు ‘పాల్‌కుర్టు’ బలపరిచాడు. ఈ సూత్రాలు ఆచరణయోగ్యమై నిలిచాయి.

మానవవాదం, వ్యక్తివాదం, హేతువాదం ముప్పేటలుగా కలిసి ఉండేదే హ్యూమనిజం. హేతువాదాన్ని మానవ వాదానికి జోడించడం దాని విశిష్టత. మానవ వాదం ఆధ్యాత్మిక వాదానికి చుక్కెదురు. ఒక గొప్ప వ్యక్తి తయారు చేసిన తత్వం సర్వకాల సర్వావస్థల్లోను అమలవుతుందని నమ్మదు ఈ రకపువైఖరి.

ఎంత మేధావి అయినా కాలపు పోకడను గమనించకుండా, సార్వకాలికం కాదు. మానవాళి భావాలపరంగా, సాంకేతికపరంగా, సంస్క ృతీపరంగా ఎదుగుతుంది, పెరుగుతుంది. వేదాలు, ఖురాను, బైబిలు లాగా జ్ఞాన భాండాగారం శతాబ్దాల తరువాత ఇట్లాగే ఉండదు. నూతన సత్యాలు మానవ మేధస్సులో పుడతాయి. పెరుగుతాయి. మానవ వ్యక్తి నిరంతరం జిజ్ఞాసా పరుడు. తనకు అంతా తెలుసునని విర్ర వీగడు. నిన్న తెలియని అంశాన్ని ఈనాడు కనుక్కో గలుగుతున్నాడు. ఈనాడు అతని బుద్ధికి అందని విషయాలు సుదూర భవిష్యత్తులో అతనికి తెలుస్తాయి. సామాజిక మానవుని కీలక స్థానంలో ఉంటుంది హ్యూమనిజం. కాబట్టి వ్యక్తి వికాసానికి, సామాజిక పునర్నిర్మాణ ఆవశ్యకతను కూడా గుర్తించింది హ్యూమనిజం.

మానవుడు వ్యక్తి స్వేచ్ఛను ఆశిస్తాడు. తన వ్యక్తిత్వ వికాసానికి అడ్డు ఆటంకాలుగా ఉన్నవాటిని తొలగించుకోవటం అతని స్వేచ్ఛాపిపాసకు నిదర్శనం. ఆ సందర్భంగా అతడు సత్యాన్వేషణ చేస్తాడు. జ్ఞాన విషయమే సత్యం.జగత్తులోని లయ మానవ ప్రపంచంలో హేతుత్వంగా భాసిల్లుతుంది. మానవుడు వస్తుత: హేతువాది. మానవుడు హేతుత్వంలో నడయాడుతూ నీతిమంతుడు కాగలడు. అతనికి పురుష ప్రయత్నంలో నమ్మకం ఉంటుంది. స్వావలంబనం అతని ప్రవృత్తి. తన ప్రయత్నంలో వ్యష్టిని సమిష్టిని సమన్వయం చేసుకోగలడు. మానవ వాద సూత్రాలను వక్రీకరణ లేకుండా, అమలు పరిచే వారి ప్రయత్నాలు, ఆచరించే వారి నడత, బోధించేవారి చర్యలు ఇవన్నీ అక్షర బద్ధం చేస్తే సారస్వతం అవుతుంది. వాటిలో సాహిత్య విలువ ఉంటే సాహిత్యమవుతుంది. అట్లాంటి సాహిత్యాన్ని మానవ వాద సాహిత్య ఛాయలు కలదానివిగా పేర్కొంటాం. మానవ వాదాన్ని పోషించేవారు కొందరయితే, ప్రచారం సాగించేవారు మరికొందరు. కాని సాహిత్యం (కథలు, నవలలు) ద్వారా ప్రజాదరణ పొందగలిగిన మేధావులు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయిత కుటుంబరావుగారి కథలలో మానవాదం గమనిద్దాం.

కొండవటిగంటి కుటుంబరావుగారి ‘స్వేచ్ఛ’ అనే కథను చూద్దాం. ఆ కథలో వదిన పాత్ర మరిది ఉత్తరాన్ని చూసి మురిసిపోతుంది. పాతివ్రత్యపు సంకెళ్ళలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎరుగనిది వదిన. నాకోసం ఆ కుర్రవాడు దేవత్వం పొందాడని ఆమె భావిస్తుంది. ఆ కుర్రవాడి పట్ల – శేషాచలం అని పేరు – ఆమె కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శిస్తుంది. తన దివ్య పురుషునికి తన శరీరాన్ని నివేదించానన్న తృప్తి ఆమెకు కలిగింది. ‘నేను ప్రేమకోసం తహతహలాడలేదు; స్వేచ్ఛకోసం తహతహలాడాను” అని చెప్తుంది. అతని ఒక్కడి శాసనాన్నే తను పాలించానని గర్వంతో ప్రకటించింది. ఆమెలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో వ్యక్తిత్వవికాసం కోసం తహతహలాడటం కనిపిస్తుంది. ఈ పాత్ర చిత్రణలో కుటుంబరావు గారికి మానవ వాదం పట్ల ఉన్న అభిమానం వ్యక్తమవుతుంది.

కుటుంబరావు గారి మరో కథ ”ప్రాణాధికం” పతివ్రత తన ప్రాణాలుసైతం అర్పిస్తుంది. కానీ తాను జబ్బు పడ్డప్పుడైనా మగ డాక్టరును తనను తాకనివ్వదు. భర్త తనకే జబ్బొచ్చినట్టు నాటకమాడి చివరకు ఆమెతో మందులు తీసుకునేట్టు చేయడం కథా వస్తువు. పాతివ్రత్యపు వలలో మానసికంగా చిక్కుకుపోయిన స్త్రీని ఆదర్శపు భర్త బయటకు లాగడం అన్న కథలో కుటుంబరావు గారిలో సంస్కరణవాదం ఛాయలు కనిపిస్తాయి. మానవ విలువలు కోరే మగ వారు స్త్రీలను గౌరవించటం కథావస్తువుగా ఇందులో దర్శనమిస్తుంది. మానవ ప్రవృత్తి మార్పువల్ల మాత్రమే ఏ సంస్కరణ అయినా ఫలిస్తుంది అని ‘నీకేం కావాలి’ అనే కథలో ఒక భోగంపిల్ల అయిన కస్తూరి తన వ్యక్తిత్వం తాను నిల్పుకుని తనను ఆమోదించి, గౌరవించేవాడితోనే తన పెళ్ళికి ఒప్పుకుంటుంది. అట్లాగే కులం లేని మనిషి నవలలో ఒక అభ్యుదయవాది అయిన విశ్వం కూడా ఆమె భోగంపిల్ల అని తెలియగానే నేను పైకి కనబరుస్తున్న సంస్కారమంతా నిలిచేదికాదు. సంస్కరణలన్నీ సిద్ధాంతరీత్యా ఆమోదించటం వేరు. సిద్ధాంతం, ఆచరణ రెండింటినీ సమన్వయ పరచటం వేరు, అనే భావంతో తరతరాలుగా సమాజంలో జీర్ణించుకు పోయిన భావజాలం ఎట్లా పనిచేస్తుందో విశ్వం ద్వారా చెబుతూ సంస్కర్తల సంస్కరణల ఉపన్యాసాల్ని ఆమోదించిన జనం ఆచరణను ఎంత చిన్న చూపు చూస్తారో కథలో చిత్రించారు. సంస్కర్తల బోధనల ద్వారా కాక నిజమైన సంస్కరణ అనేది వ్యక్తుల ఆలోచనా ధోరణిలో మార్పు సంభవించినప్పుడు మాత్రమే సాధ్యమయ్యే విషయాల చీకటి వెలుగుల్ని దీనిలో తెలియజేశారు కుటుంబరావు గారు.

సీతాదేవి, సుబ్బమ్మ బైరాగి లాంటి వారి సాహిత్యంలో మానవ వాదాన్ని చూద్దాం. మల్లాది సుబ్బమ్మ గారి నవలల్లో మానవ వాదం ఎలా ప్రతిధ్వనిస్తుందో పరిశీలిద్దాం. స్త్రీ వస్తువు కాదు; ఒకరి సొత్తు కాదు. ఆమె ఒక మనిషి. ఆమెకు ఆలోచనలు,ఊహలు ఉంటాయి. అనుకూలమయిన భర్త కావాలని కోరుకుంటుంది కాని ఎదురుదెబ్బ తగిలినపుడు భర్త దౌర్జన్యం ఉన్నత స్థాయికి చేరి ఆ ఖలుడు మోసంచేసి దౌర్జన్యంతో జుట్టుపట్టుకుని పడుపు వృత్తిలోకి దించుతుంటే ఆమె ఎదురుతిరిగి కత్తిపీటనెత్తి ఆడిస్తుంది ‘వెలిగిన జ్యోతి’ అనే నవలలో వ్యక్తిత్వం పైన మానవత్వం పైన దెబ్బ తగిలి నప్పుడామె ఎదురుతిరగడంలోని భావమే మానవవాద స్వరూపం.

వంశాంకురం: సుబ్బమ్మగారి కళా సాహిత్యంలో మానవ వాదాన్ని చూద్దాం. పిల్లలను కనడం, కనకపోవడం స్త్రీ జన్మ హక్కు. ఎవరూ ఈ విషయంలో ఆమెను శాసించరాదు. ఆ మాటకు వస్తే భర్తకు కూడా ఆ హక్కులేదు. ఆమె దేహం ఆమెది. దానిపై దురాక్రమణ చేయడానికి ఎవరికీ అధికారం ఉండరాదు. స్త్రీ పురుషుల సమ్మతిమీద వారి శారీరక సమ్మేళనం సంభవించటం న్యాయం. ధర్మం కూడాను. ఈ శాశ్వత సత్యాలను ‘వంశాంకురం’ నవల ద్వారా వెలికి తీస్తుంది సుబ్బమ్మగారు.

మాతృత్వానికి మరో ముడి (కథల సంపుటి): మగవాడి మోసానికి గురి అయి పెళ్ళి కాకుండానే గర్భవతులయిన ఇద్దరు స్నేహితురాల్ళు పంకజం, మందారం. పంకజం సమాజానికి భయపడి పిరికితనంగా జీవిస్తుంటే, మందారం ధైర్యంగా నిలబడి బిడ్డని కని పెంచటమే కాక పెద్ద ఆఫీసరయి మార్గదర్శకురాలయి నిలిచింది. ఆ స్నేహితురాళ్ళ కథ ‘కంటి వెలుగు’. భర్త తాగి వచ్చి భార్యను కొట్టడం హింసించడం చేస్తే ఇంతకు ముందులా ఇక పడి ఉండరని, అలా చేస్తే మహిళలంతా కలిసి సంఘటితంగా బుద్ధి చెపుతామని స్త్రీలను ఐక్యం చేసి నిరూపించిన సంఘ సేవకురాలు లక్ష్మి కథ ‘కనువిప్పు’ పిల్లన్ని కనే విషయంలో స్త్రీకి హక్కు ఉండాలని ఆలస్యంగానైనా గ్రహించి తన కుటుంబ భారాన్ని తగ్గించి భర్తను ఎదిరించి తనలాంటి సమస్యతో బాధపడే ఇతర స్త్రీలకు ‘వేగుచుక్క’గా నిలిచిన అమూల్య కథ. ధన దాహంలో మునిగిపోయి  మానవత్వాన్ని మంట కలిపి తన ప్రియురాలినే పోగొట్టుకున్న ఒక డాక్టర్‌ కథే ‘మంటకలిపిన మానవత్వం’. భర్తని పోగొట్టుకున్న స్త్రీ వైధవ్యాన్ని భరిస్తూ జీవితాంతం ఇతరులకు దాస్యం చేస్తూ బతకడం కన్నా తన స్వశక్తితో స్వతంత్రంగా జీవించాలని తెలిపే కథే ‘పడగవిప్పిన పదోరోజు’. భార్య ఉండగానే మరో స్త్రీతో సంబంధం పెట్టుకొని బిడ్డను కూడా కని పైగా భార్యని కూడా అనుమానించే మగవాడి మనస్తత్వం తెలియజేసే కథ ‘దేవుడిచ్చిన పిల్లలు’. మనిషిలో చూడవలసింది బాహ్య సౌందర్యాన్ని కాదు మానసిక సౌందర్యం అంటే మానవత్వం అని తెలిపే కథే ‘పనికి మాలిన ముత్యం’. కట్టుకున్న భార్య కన్నా, ఆస్తికి ఎక్కువ విలువ ఇచ్చి రామయ్య ఆమె పోయాక ‘చివరికి మిగిలిందేమిటి’ అని బాధతో నేలకొరిగిన కథ. నిజాయితీ, నిక్కచ్చి, న్యాయం, ధర్మం, మానవత్వంగల వ్యక్తి సూరి గొప్పింటి స్త్రీ కామ దాహాన్ని తీర్చని కారణంగా ప్రాణాలనే కోల్పోయిన కథ ‘వైకుంఠపాళి’. ఇందులో మానవత్వం తొణికిసలాడుతుంది. స్త్రీ శ్రామికులంతా ఐక్యంగా ఉండి పోరాడిన ఫలితంగా సమానమైన పనికి సమానమైన వేతనం పొందగలిగిన కథే ‘అందరూ సమానులే’. సంతానం కలగకపోతే లోపమంతా భార్యలోనే ఉందనిమూర్ఖంగా తలచి ఆమెను చంపి మళ్ళీ పెళ్ళి చేసుకున్న రాజు చివరికి తన లోపంవల్లనే పిల్లలు కలగలేదని తెలియజేసే కథే ‘మాతృత్వానికి మరోముడి’. ఆడదాని అందాన్ని అడుగడుగునా తోడేళ్ళలా పొంచి కాటువేసే మగవాళ్ళని, చివరికి కూతురిని కూడా కామించే మగవాడి మనస్తత్వాన్ని తెలియజేసే కథే ‘చెలియలికట్ట’. ఇందులో మానవత్వం నశించిన మగవాణ్ణి హతమార్చటం తప్పుకాదనే నీతి ఉంది. భర్త ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చుగాని భార్య పొరపాటున కన్యగా ఉన్నప్పుడు ఒక మగవాడితో మోసపోయినా సహించలేక ఆమెని శాడిస్టుగా నానా హింసలు పెట్టే భర్తకి తగిన విధంగా గుణపాఠం చెప్పిన రాణికథ ‘బొమ్మపలికింది’. పెద్ద ఆస్తికి, అంతస్తుకి వారసుణ్ణి చేయాలనే అత్యాశతో తల్లి అంగీకారం లేకుండా తండ్రి మగబిడ్డను దత్తు ఇచ్చిన సందర్భంలో తల్లీ, బిడ్డల ప్రేమని ధనంతో తూచలేమని చెప్పే కథ ‘పూసల పల్లకి’. తన కాముకతకు ఎందరో స్త్రీల శీలాలను హరించిన నీచుడిని చంపి, తగిన ప్రతీకారం తీర్చుకున్న చంపాలత కథ ‘ప్రతీకార వాంఛ’. ఈ కథ కూడా మానవ విలువల్ని బోధిస్తుంది, పోషిస్తుంది, బలపరుస్తుంది.

సీతాదేవి రచనలలో మానవవాదం, ‘ఉరితాడు’ నవలలో కరుణ కరుణామయి, సహనశీలి, స్వార్థత్యాగి, భర్త శాడిస్టు, పరమ మూర్ఖుడు. భార్య శరీరం మీద వాతలు పెట్టుట, సిగరెట్టుతో కాల్చుట అతని హాబి. అయినా సహించింది. బంగారంకోసం సూత్రం తెంచుతాడు. ఓర్చుకుంది. చిత్రహింసలకు నిగ్రహంతో నిలిచింది. కడకు ఒక విటుణ్ణి తెచ్చి భార్యను వ్యభిచరించమని ఆజ్ఞాపించాడు. కరుణలో విప్లవాగ్ని బద్దలైంది. ఎదురు తిరిగింది. తాళికట్టిన వాడికి లేని గౌరవం నాకెందుకంటూ పసుపుతాడు రూపంలో ఉన్న ఆ ఉరితాడుని తెంచి అతని ముఖం మీద విసిరి కొట్టింది. తన శరీరాన్ని అమ్మి అతన్ని పోషించే బదులు అవసరమొస్తే అమ్ముకుని తనని తానే పోషించుకుంటానని వెళ్ళిపోయింది. కరుణ పాత్ర ద్వారా వ్యక్తిత్వాన్ని కోరే మానవ వాదానికి విలువనిచ్చింది.

‘సమత’ నవలలో మధ్య తరగతి కుటుంబంలో కోడలుగా గృహిణిగా జీవితాన్ని గడుపుతున్న అరుంధతి ప్రజా సేవకుడు, విప్లవకారుడు, త్యాగమూర్తిగా కనిపించిన రాజారావు వ్యక్తిత్వంపై గౌరవం పెంచుకుని అతనితో పాటు ప్రజాసేవ చెయ్యాలని అతని వద్దకు వెళ్ళింది. ఏ వ్యక్తి కోసమైతే తన కాపురాన్ని తుత్తునియలు చేసుకుంటే ఆ వ్యక్తే ఆశావాదిగా మారి తనను ఉంపుడుగత్తెలా చూస్తుంటే సహించలేకపోయింది. అతన్ని మరోవిధంగా వాడుకుని తన కసి తీర్చుకుంది. ఏ సమాజం కోసం రాజారావు మీద మమకా రం పెంచుకుందో ఆ సమాజం చూడకుండానే మరణిస్తుంది. ఒక రకంగా చూస్తే మానవత్వంకోసం వ్యక్తి ఎంతగా త్యాగాలు చెయ్యాల్సి ఉంటుందో అరుంధతి పాత్ర ద్వారా రచయిత్రి నొక్కి చెప్పారు.

మట్టి మనిషి: మణిపూస లాంటి నవల. భూస్వాముల కుటుంబంలో పుట్టిన వరూధిని అమాయకుడైన భర్తని, మట్టినే నమ్ముకున్న మామను మోసం చేసి బస్తీ జీవితం మీద వ్యామోహంతో బస్తీలోని చెడునే ఆధునికంగా భ్రమిసి జీవితం నాశనం చేసుకుం టుంది. ఇదొక రకంగా ఈనాటి గ్రామీణ జీవితంలోని భూస్వామ్య ధనిక కుటుంబాల స్త్రీలకు బస్తీలపై ఉన్న వ్యామోహాన్ని చిత్రించిన నవలారాజం. రాబందులు-రామ చిలుకలు లోని సునంద పాత్ర విశిష్టమైంది. సర్వలక్షణ సమన్విత తోటి వారి మేలుకోసం అపనిందల్ని భరిస్తుంది. మహిళా సంఘాల పేరుతో ధనికులు, పెత్తందార్లు చేస్తున్న అవినీతిని, అక్రమాలను బట్టబయలు చేస్తుంది.ఎన్ని కష్టాలొచ్చినా మనోదౌర్భాగ్యానికి లోనుకాని మానవత్వమున్న మహిళ సునంద. ఇలా మానవ విలువలకు ప్రాధాన్యమిచ్చే సాహిత్యాన్ని సృష్టించింది సీతాదేవి.

భైరాగి సాహిత్యం: ఇక ప్రముఖ కవి బైరాగి సాహిత్యంలో మానవ వాదాన్ని చూద్దాం. అతని నవల ‘పాప పోయింది’లో రామారావు, సుశీల సంపన్న గృహస్థులు. వారి అల్లారి ముద్దు పాప – ఆ పాపకు అలవికాని గుండె జబ్బు. ప్రతి అదృష్టం కొనలలో నిరాశనీ, దుఃఖాన్నీ, చీకటినీ చూసి, ఈ లోకమెప్పటికీ ఇంతే. ఆనందమనుకున్న దేదీ చివరి దాకా ఆనందం కాదు. సుఖమనేది సుఖంగా నిలవదు. కాలమూషికం ఈ ఆశాపాశాలను, మోహపా శాలను అన్నిటినీ పుటుక్కున కొరికి కత్తిరిస్తూ ఉంటుంది. దీన్ని నిరాశా వాదమనండి, పరాజయంతో కూడిన పొగలాంటి నైరాశ్యం అనండి. బైరాగి దర్శించిన విషాదానుభూతుల గీతానికి పల్లవి పాప. అంతా మానవ హృదయవేదన. పాప మీద రామారావు ప్రేమ లోకాతీతం. పాప జబ్బు ఏ కర్మఫలమో? తాను కాని, భార్యకాని వెనకటి జన్మలోని పాప ఫలమా? ఈ జన్మలో చేసిన అపరాధాలేమీ కనిపిచడంలేదు. పోనీ తమ ఉభయుల వెనకటి జన్మల కర్మఫలమే అనుకుంటే పాపనెందుకు శిక్షించాలి. పోనీ పాప పూర్వజన్మ దుష్కృత ఫలితమైతే తామెందుకు హింసపడాలి. ఒకరి అపరాధానికి మరొకరిని శిక్షించటం అన్యాయం కాదా! అలా ప్రశ్నించి తర్కించి చివరికి లోకరీతిలో సమాధానమిస్తాడు బైరాగి ఆ నవలలో.

నూతిలో గొంతుకలు: చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను చర్చిస్తుంది. అది మానవుని సహజ వేదన. సమాజంలోని కుళ్లును జీవితంలోని కాఠిన్యాన్ని ప్రపంచంలోని నగ్న సత్యాన్ని చూసి కదిలించినవారే నిజమైన ద్రష్టలు. ఆ బాధే వాళ్ళకు చైతన్యాన్ని కలిగిస్తుంది; కొందరినైనా కార్యశూరులుగా తీర్చిదిద్దుతుంది. అట్లాంటి ఆప్త హృదయంతో రచించిందే బైరాగి సాహిత్యం.

దుఃఖం, ఆవేదన మనిషిని కుంగదీయరాదు. అవి తాత్కాలి కం కావాలి. దాని నుంచి బయటపడి జాగృతి పొందాలి అంటాడు బైరాగి తన కవితలో ఒక వైపు సమాజం నుంచి విసరివేసిన పీడిత, తాడిత నిరంతరాందోళిత మానవ జీవితాల మనఃస్థితిని యథాతథంగా, హృదయ విదారకంగా చిత్రించాడు.

మానవుడు సృష్టిలో సర్వశ్రేష్ఠుడు. సృష్టికి సైతం ప్రతి సృష్టి చేయగల సమర్థుడు. శక్తి సంపన్నుడు అయినా పశు పక్ష్యాదులు బతికినట్లుగా స్వేచ్ఛగా సుఖంగా బతక లేక పోతున్నాడు. మానవునికి తోటి మానవుని పట్ల విశ్వాసం నశించింది. విశ్వాసమే ఉంటే మానవునికి ఎదురే లేదంటాడు బైరాగి. ఇట్లా తాను నమ్మిన ఈ విశ్వాసం కోసమే నిరంతర కవితా సాధన చేసి ప్రపంచానుభూతిని మేళవించి ఆధునిక తెలుగు వచన కవితలో బంగారు పంటలు పండించిన మహాకవి బైరాగి. ఆయన కవిత్వాన్ని జీవితాన్ని సమీక్షిస్తే బైరాగి అన్న పేరును సార్థకం చేస్తుకున్నాడా అనిపిస్తుంది. మానవ హృదయ పిపాసకు చావు లేదు. జీవితంలో నిరాశకు తావు లేదు, అనే బైరాగి కవిత్వం మానవతకు మకుటమైనదని పేర్కొనవచ్చు.

ఇవి సాహిత్యంలోని మానవ వాదానికి కొన్ని మచ్చు తునకలు. ‘సర్వానికి మానవుడే కొలబద్ధ’ అని ప్రోటోగరస్‌ అన్నట్లు మానవ వాదాన్ని నమ్మేవారు, ఆచరించేవారు, ప్రచారంలోకి తెచ్చినవారు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. త్రిపురనేని గోపీచంద్‌, అబ్బూరి రామకృష్ణారావు, ఆరుద్ర, అమరేంద్ర లాంటి మహామహులెందరో. ముఖ్యంగా ఎం.ఎస్‌.రాయ్‌ మానవ వాదం ద్వారా ఉత్తేజితులై సాహిత్యంలో మానవ విలువలను జొప్పించి ప్రజల మనః ఫలకాలమీద ముద్రలు వేసిన వారున్నారని పేర్కొనడం సత్యదూరం కాదు. ఏదయినా మానవత్వం మిళితం చేసిన రచనలు అమరం, అద్వితీయం అనక తప్పదు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.