మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయని విద్మహే

నూతన సహస్రాబ్దిలో స్త్రీలపై వేధింపులు ఆత్మ హత్యల వైపు నెట్టే అనివార్యతను కల్పించే స్థాయికి చేరాయి. 2000 జూన్‌ 14న సంగీతాశర్మ ఆత్మహత్య ఆ కోవలోదే భర్తనుండి విడాకులు తీసుకొని కొడుకుతో వుంటూ లాయరుగా ప్రాక్టీసు చేసుకొంటూ సీనియర్‌ న్యావాదిపెట్టే లైంగిక వేధింపులకు, ఒత్తిడికి తట్టుకోలేక మీర్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకుపోయినా ఫలితంలేక తన వేదనంతా వ్రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొన్నదామె. ఆ తరువాత కూడా ఆమె శీలం మంచిది కాదన్న వ్యాఖ్యలతో ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంలో మహిళా సంఘాలు సంగీతాశర్మ న్యాయ పోరాట కమిటీగా ఏర్పడి సంగీత మరణానికి కారకులైనవారిని శిక్షించాలని, కోర్టులలో, సీనియర్‌ న్యాయవాదులు లైంగిక వేధింపులకు గురవుతున్న సంగీత వంటి అనేక మందికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పనిచేసాయి. పనిచేసేచోట లైంగిక వేధింపుల నుండి రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశాయి.

2004లో (జూన్‌ 21) విజయవాడ లోని శారదా కళాశాలలో ఎంసిఎ విద్యార్ధిని శ్రీలక్ష్మి తన ప్రేమను నిరాకరిం చిందని యేల్పూరి మనోహర్‌ కాలేజికి వచ్చి కత్తితో పొడిచి చంపిన ఘటనతో ప్రారంభమై ఈ దశకంలో జరిగిన ప్రేమదాడులు, హత్యలు అనేకం. తెనాలి (2004 ఫిబ్రవరి 22) హైదరాబాద్‌ (2005 మార్చి 13) కరీంనగర్‌ (2005 ఆగస్టు 10) లలో మైనర్‌ బాలికలను కూడా ప్రేమ పేరుతో వెంటాడి చంపిన ఉదంతాలు ఉన్నాయి. నిజామాబాద్‌లో గంగాభవాని అనే టీచరు ప్రేమ దాడికి గురయింది. విజయవాడ శివార్లలో హాస్టల్‌లో బిఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మిరా, అత్యాచారానికి, హత్యకు గురయింది. వాజయవాడకు చెందిన ఆ మీనాకుమార్ని విశాఖలో వరలక్ష్మి కర్నూలు జిల్లాకు చెందిన రోజా, ఖమ్మం జిల్లాకు చెందిన అరుణ ప్రేమోన్మాద దాడులకు బలి అయినవాళ్ళే (మహిళా మార్గం, మే – జూన్‌ 2008, పు: 30) రాజమండ్రిలో అనూష …. దాడికి గురయి 2009 సెప్టుంబరు 17న గొంతు నరాలు తెగి తల్లిదండ్రులను కోల్పోయింది.   ప్రేమించమని ఒత్తిడి చేయటం, ప్రేమించ లేదన్న మాటను భరించలేకపోవటం కసిని పెంచుకొని యాసిడ్‌ దాడుల ద్వారా ప్రతీకారం తీర్చుకొనటం కూడా ఇందులో భాగమే. శ్రీకాకుళంలో కళాశాల విద్యార్ధిని తన ప్రేమను అంగీకరించలేదని అధ్యాపకుడే యాసిడ్‌ దాడికి దిగాడు. సహ విద్యార్ధుల యాసిడ్‌ దాడికి (2008 డిసెంబరు 13) గురయిన వరంగల్లు ఇంజనీరింగ్‌ కాలేజీ విదార్ధులలో స్వప్నిక మరణించింది. ప్రణీత ఎన్నో ఆపరేషన్లతో తన పూర్వ రూపాన్ని కోల్పోయి కూడా గుండె నిబ్బరంతో బ్రతికి బయటపడింది. ప్రేమ వ్యవహారాలలో వంచనకు హత్యలకు గురయిన మీడియా ఉద్యోగి లక్ష్మీ సుజాత, సినీనటి ప్రత్యూష వంటివారు కూడా వున్నారు. నగరంలో విద్యాలయాలలో మాత్రమే కాక గ్రామాల లోనూ పెళ్ళి పేరుమీద వేధింపులు, దాడులు సాగాయి. దాదాపు అన్ని ఘటనలకు ఎక్కడికక్కడ మహిళాసంఘాలు నిరసనలు ప్రకటించి నేరస్తులకు శిక్షను డిమాండ్‌ చేస్తూ ఉద్యమించాయి. శ్రీలక్ష్మి, ఆయేషా, స్వప్నిక ప్రణీతలపై జరిగిన దాడుల సందర్భంగాసాగిన ఉద్యమాలు, వ్యక్తమైన ప్రజాభిప్రాయాలు, ప్రభుత్వ వైఖరి ఏమైనా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇచ్ఛ, అంగీకారాలతో ముడిపడి వున్న ప్రేమ విషయంలో పురుషుడి ప్రతిపాదన ఒక్కటే సరిపోతుందనీ, స్త్రీ దానిని ఆమోదించి తీరాలనీ భావించటం పురుష దురహంకా రాన్ని సూచించే అప్రజాస్వామిక ధోరణి అనీ, స్త్రీలను అభిప్రాయాలు వ్యక్తీకరించి నందుకే చంపెయ్యటం ఆత్మగౌరవంతో జీవించే హక్కు స్త్రీలకు నిరాకరించటమేనని నిర్ద్వందంగా ప్రకటించింది.

ఈ రకమైన సంఘటనలకు సమస్యలకు నేరస్థుడిని కఠినంగా శిక్షించటం, ఉరి తియ్యటమే పరిష్కారమన్న తక్షణ ప్రతి స్పందన కూడా ఈ క్రమంలో చర్చనీయాంశ మైంది. శిక్ష్మాస్మృతి వ్యక్తులలో మార్పుకు అవకాశమిచ్చేదిగా వుండాలి కానీ వ్యక్తులనే అంతం చేసేదిగా వుండకూడదని నేరస్థులు చట్టానికి దొరకకుండా తప్పించుకొనే అవకాశాలు, దొరికినా వారిని కూడా తప్పించే ఆర్ధిక ఆధికారిక అవకాశాలు అనేకం వున్న వ్యవస్థలో బలహీనులైన వ్యక్తులు మాత్రమే శిక్షింపబడతారని, నేరస్థులు శిక్ష్మాస్మృతికి అవతల యధేచ్ఛా విహారం చేస్తుంటారని, అది సమాజానికి మంచిది కాదని ఈ విధమైన నేరవ్యవస్థను పెంచి పోషిస్తున్న మూలాన్ని సంబోధించి పనిచేయటం, స్త్రీపట్ల వున్న పితృస్వామిక సామాజిక దృక్పధాన్ని ప్రజాస్వామీకరించే భావ సంఘర్షణకు అవకాశం కల్పించటం దీర్ఘకాలిక ప్రయోజనం సాధించే మార్గమని ఈ చర్చలు స్పష్టంచేశాయి. స్వప్నిక ప్రణీత కేసుల నేరస్తుల ఎన్‌కౌంటర్‌ అందువల్లనే వివాదాస్పదమైంది. ఇలాంటి పరిష్కారాలు అసలు సమస్యను విస్మృతి పాలుచేయటమే కాక రాజ్యహింసకు న్యాయ సంబద్ధతను చేకూరుస్తాయన్న ఆందోళన కూడా వ్యక్తమైంది.

ప్రేమ, హింస పూర్తి విరుద్ధాంశాలు. ఈ విరుద్ధాంశాల కలయిక సృష్టించే విధ్వం సానికి, సామాజిక భీభత్సానికి మూల కారణంగా సామ్రజ్యవాద సంస్కృతిని, దానిని ప్రచారం చేసే సినిమా టీవి మాధ్యమాలను గుర్తించి ప్రచారం చేసింది మహిళా ఉద్యమం. వ్యక్తి కేంద్రమైన స్వసుఖాపేక్ష, వస్తు వ్యామోహం, తక్షణమే వాటిని పొందాలన్న తొందర, మనిషిని మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని నిరూపించింది. స్త్రీని విలాస వస్తువుగా, పురుషుని సౌఖ్యం కోసం సిద్ధంగా వున్న సాధనంగా చూపిస్తూ వేధింపులతో వెక్కిరింతలతో ప్రేమించటానికి హింసించ టానికి తేడా లేదనట్లుగా ప్రేమ ఘట్టాలను చిత్రించటం ద్వారానూ టివీ సీరియల్స్‌, సినిమాలు యువత ఆలోచనలను తప్పు దోవ పట్టిస్తున్నాయని, హింసకు మానవ జీవిత సంబంధాలలో ఒక సంబద్ధతను సమకూర్చే ఇలాంటి పోకడలు, అంతిమంగా సామాజిక విధ్వంసానికి దారితీస్తాయని ఈ కాలపు మహిళా ఉద్యమం హెచ్చరించింది.

ఈ క్రమంలో మహిళా ఉద్యమం రెండు మూడేళ్ళ పిల్లల నుండి యాభై ఏళ్ళు పైబడ్డ స్త్రీల వరకూ ఎంతో మంది ఎదుర్కొంటున్న అత్యాచార సమస్యను సంబోధించి పనిచేయ వలసి వచ్చింది. 1978లో రమేజాబీ కేసు దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమం లో అత్యాచారానికి వ్యతిరేకపోరాటం ఒక భాగమే అయినా ఈ దశకంలో ఆ అవసరం మరింత పెరగటం విచారకరమైన విషయం. నేషనల్‌ క్రైమ్‌ రికార్ట్స్‌ బ్యూరో  2012 లెక్కల ప్రకారం 2011లో అత్యాచార బాధితులు ఆంధ్రప్రదేశ్‌లో 1,341 మంది పిల్లలు కూడా అత్యాచారానికి గురయ్యారు. బాలికలు 613మంది మొత్తం మీద స్త్రీలపై లైంగిక అత్యాచారాలు ప్రమాదకర ధోరణిలో పెరుగుతున్నాయన్నది వాస్తవం. చాలా సందర్భాలలో కుటుంబ బంధువులు, స్నేహితులు తెలిసిన వారే అత్యాచార నేరస్థులు. ఇక అపరిచితులు, ఆచారకులు, తాగుబోతులు, తిరుగుబోతులు చేసే నేరాల గురించి చెప్పనే అక్కరలేదు. స్కూలుకి పిల్లలను తీసుకొని వెళ్ళే ఆటో డ్రైవర్ల నుండి బళ్ళల్లో పాఠాలు బోధించే పంతుళ్ళ వరకు ఎవరైనా వీళ్ళ కోవలో వాళ్ళే చాలా మంది. ఈ విధమైన సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎక్కడికక్కడ మహిళాసంఘాలు స్త్రీలకు కరువు అవుతున్న రక్షణ గురించి, పోలీసు శాఖ వైఫల్యం గురించి ఆందోళనలు చేపడుతూనే వున్నాయి.

ఆక్రమంలోనే జ్యోతిసింగ్‌పాండేపై ఢిల్లీలో (2012 డిసెంబరు 16) జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు వ్యతి రేకంగా దేశమంతా వెల్లువెత్తిన ప్రజాఉద్య మంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళలు కూడా భాగమయ్యారు. రేప్‌ కేస్‌ పై విచారణకు నేరస్థులను శిక్షించటానికి ఒత్తిడి తెచ్చారు. జస్టిస్‌ వర్మ కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ లోని అనేక మహిళా సంఘాలు తమ అభిప్రాయాలను తెలియపరిచాయి. ఈ సందర్భంలో మధ్య తరగతి చదువుకున్న మహిళలపైన జరిగిన అత్యాచారాలపై కనిపించినంత ప్రతి స్పందన దళితమైనారిటీ ఆదివాసీ మహిళలు భూస్వామ్య పెత్తందారు మతరాజకీయ ముఠాల అత్యాచారాలకు గురవుతుంటే పట్టించుకొనటంలేదన్న ఆరోపణ మహిళా ఉద్యమం మీద వచ్చింది. తప్పును దిద్దుకొని మహిళా ఉద్యమం విస్తరించాల్సి వుంది.

ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమం అత్యాచార నేరాలపైన కారణాలపైన పరిణామాలపైన శిక్ష్మాస్మృతి పట్ల సమా జంలో జరుగుతున్న చర్చలలో తాను భాగమవుతూ స్పష్టమైన శాస్త్రీయమైన వైఖరిని ప్రదర్శిస్తూ వుండటం గమనించవచ్చు. అత్యాచారాల రేటు పెరగడానికి కారణం ఆడపిల్లలు ధరించే ఫ్యాషన్‌ దుస్తులు కురచ దుస్తులేనని తద్వారా ఆకర్షణీయంగా కనబడి రెచ్చగొట్టటం వల్లనే అని సాక్ష్యాత్తు రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్‌ అన్నప్పుడు మహిళలు దానిని తిప్పికొట్టారు. పసిపిల్లలపైన వయసు మీరిన వాళ్లఫైన బడికి వెళ్ళే వాళ్లపైన, బహిర్భుమికి వెళ్ళి వచ్చే వాళ్ళపైన, పేద శ్రామిక మహిళల పైన జరుగుతున్న అనేకానేక అత్యాచార ఘటనలలో వస్త్రధారణ ప్రమేయమే లేదని, పెద్ద పెద్ద నగరాలలో, ధనిక వర్గం మాత్రమే ధరించటానికి వీలున్న ఫ్యాషన్‌బుల్‌ దుస్తుల విషయం, కురచ దుస్తుల విషయం అత్యధిక సంఖ్యాకులైన పట్టణ మధ్యతరగతి, గ్రామీణ దిగువ తరగతి వర్గాలకు వర్తించదని నొక్కి చెప్పారు. ఒకవైపు స్త్రీలను అంగాంగాలుగా విడగొట్టి ఫోకస్‌ చేసి చూపించే సినిమా సన్నివేశాలు, టివి ప్రసారాలు యధేచ్ఛగా ప్రదర్శించుకొనటాన్ని అనుమతిస్తూ, మరొక వైపు మద్యం యధేచ్ఛగా వినిమయం చేయటానికి సరఫరా చేస్తూ కాలేజీ విద్యార్థుల నుండి అందరినీ తాగుడుకు అలవాటు చేసి మత్తులోకి దింపి – నేరాలకు వాళ్ళను రెచ్చగొడుతున్నది ప్రభుత్వమేనని మహిళా ఉద్యమం ఒక స్పష్టమైన అవగాహనను కనబరిచింది. ఇంటర్నెట్‌ ద్వారా విపరీత మైన, విశృంఖలమైన వికృత లైంగిక విషయాలు, దృశ్యాలు అందుబాటులో వుండుట పబ్‌ సంస్కృతిని పెంచిపోషిం చటం, ఇవన్నీ అనుభవించు ఆనందించు అన్న తాత్కాలిక సుఖాపేక్షల వైపు యువతను మొగ్గేలా చేసి నైతిక పతనానికి కారణమవు తున్నదన్న అబిప్రాయం కూడా ఈ సందర్భం లో బలంగా వ్యక్తమైంది.

స్త్రీలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటూ బయటకు రావటం రాత్రుళ్ళు కూడా బయట తిరగటం స్త్రీలపై అత్యాచారాలకు కారణమ వుతున్నదన్న వాదనను కూడా మహిళా ఉద్యమం తిప్పికొట్టింది.

ఈ అత్యాచార ధోరణి స్త్రీలను భోగ వస్తువుగా అనుభవించి వదిలేసే వస్తువుగా చూడటం దగ్గర ఆగక వ్యాపార సరుకుగా చేసి అక్రమ రవాణాకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. ప్రేమ పేరుతో దాడులు చేసిన నేరస్థుల విషయంలో లాగానే అత్యాచార నేరస్థుల విషయంలో కూడా ఉరిశిక్షను మహిళా ఉద్యమం వ్యతిరేకిం చింది. నేరస్థులను ఒక సమూహంగా సృష్టించే పెట్టుబడివైపు దృష్టి సారించి స్త్రీల పట్ల సామాజిక దృక్పథం మారేందుకు జరగవలసిన కృషిని నొక్కి చెప్పింది. వ్యక్తులుగా వారిని శిక్షించే పద్ధతి వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. లైంగిక ఆసక్తులలో అరాచకత్వాన్ని ప్రోత్స హించే అన్ని రకాల అసభ్య అశ్లీల సాహిత్యా న్ని, సినిమాలను, ప్రసార మాధ్యమాలను నియంత్రించి ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాల గురించిన చైతన్యం విస్తరించ టానికి చర్యలు చేపట్టాలని సూచించింది. అందులో భాగం గానే 1986 నాటి మహిళల అసభ్య చిత్రీకరణ చట్టం 1970 నాటి ఆంధ్రప్రదేశ్‌ సినిమా నిబంధనల చట్టం 1995 కేబుల్‌ నెట్‌ వర్క్‌ చట్టం, వంటి వాటిని పటిష్టంగా అమలు చెయ్యాలని కోరింది. దీని ఫలితంగానే ప్రతి జిల్లాలోనూ కేబిల్‌నెట్‌ వర్క్‌ కార్యక్రమాల నియంత్రణకై ఉన్న రంగాలలో పనిచేస్తు విద్యావంతులతో సామాజిక కార్యకర్తలతో మహిళలతో సామాజిక బాధ్యత వహించగల కమిటీలను ఏర్పరచారు కానీ అవి మొదటే సమావేశం లోనే ఆగిపోయాయన్నది వేరే సంగతి. ఏమైనా వున్న చట్టాల అమలు విషయంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి అనేకసార్లు సందేహా స్పదం అయింది.

బాలికల మీద అత్యాచారాలు మరొక ప్రమాదకరమైన ధోరణి. అవి కూడా ఏ గుండాలో, అరాచకులో, తాగుబోతులో కాదు. పాఠశాల అధ్యాపకులు చేయటం. పాఠశాలలో పాఠాలు చెప్ప వలసిన తండ్రి వంటి వాళ్ళుగా వుండవలసిన గురువులు ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం అత్యాచారాలు చేయటం, గర్భాలకు, గర్భస్రావాలకు కారకులు కావటం ఈ దశంలో ఎక్కువైంది. వర్మ కమిటీ నివేదిక అత్యాచారాల నిరోధానికి అవసరమైన సంస్కారాన్ని సామాజిక దృక్పధాన్ని ఇయ్యగలిగినదిగా ఏవిద్యా వ్యవస్థను గురించి అయితే  ప్రస్తావించిందో పాఠశాల కేంద్రంగా లింగవివక్షకు తావులేని నూతన సమాజ నిర్మాణాన్ని ఆశించిందో ఆ పాఠశాల లో ఆడపిల్లలమీద అత్యాచారాలు జరుగుతు న్నాయంటే అంతకంటే విరోధాభాస మరొ కటి లేదు. పాఠశాల విద్యార్ధినులు భరించలేని స్థితిలో తల్లిదండ్రులకు చెప్పటం వల్లనో, గర్భాలు, గర్భస్రావాల కారణంగా బయటకు రావటమో జరిగినప్పుడు తల్లిదండ్రులకు మద్దతుగా మహిళా సంఘాలు ఆ సంఘటన లను ఖండించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సమస్యమీద పెద్ద శ్రద్ధ పెట్టి ఉద్యమించిన దాఖలాలులేవు. అయితే పాఠశాల విద్యలో అర్ధాంతరంగా చదువులు మానేసి వెళ్ళే వాళ్ళలో మగ పిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్యే ఎక్కువ దీనికి కారణమైన పితృస్వామిక సామాజిక కట్టుబాట్లు, బాల్య వివాహాల వంటి సంప్రదాయాలు ఎన్ని వున్నా వాటికి అదనం గా అధ్యాపకుల నుండి అత్యాచార భయం కూడా ఒక కారణమవుతున్నది. విద్యలేని స్త్రీలు సాధికారత సాధించలేరు. కనుక మహిళా ఉద్యమం ఈ సమస్యను సీరియస్‌గా పట్టించుకొని పనిచేయాల్సి వుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.