మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

మా అక్క కొన్ని బాగా చెప్తది, ఏం సాధించాం మనం ఆస్తిహక్కు విషయంలో, మహిళా సంఘాల్లో తీరుగలేదు. ఆస్తిహక్కు గురించి, యింపార్టెన్స్‌ ఎందుకివ్వలేదు? మనం పేదవాళ్ళకోసం పన్జేస్తున్నం గదా, ఆస్తి ఎక్కడిది, మా సంఘంల రెండుమూడుసార్లు పెట్టిజూసినం. మా అక్కగారు ఆస్తిహక్కు లేకుండా మహిళా సంఘమేంటని చాలా తీవ్రంగా వాదించింది. వర్గపోరాటం అని, అప్పర్‌క్లాస్‌, మిడిల్‌క్లాస్‌ స్త్రీలని కల్పుకోకుండా మహిళా పోరాటమేమిటని వర్గ సంగమనుకోవాలని వాదించినప్పటికీ….. తను బూర్జువా…. అక్కడ, యింటి దగ్గర కూడా పోరాడాల్సివచ్చింది. అన్నగారే గదా మూవ్‌మెంట్‌లోకి తీసుకొచ్చింది. మొత్తంమీద తిరగొచ్చాంగదా! ఆస్తిని పంచిపెట్టాం. నూటా ఇరవైఅయిదు ఎకరాలు వున్నవాళ్ళవి వుంచొచ్చు. మిగతా వాళ్ళవి పంచాలని పార్టీ నిర్ణయించింది. దాని ప్రకారం మాకు రెండువందలయాభై పైనే వుంది. మా తమ్ముడు, చెల్లెలు, మేమేమో పెద్దవాళ్ళం భాగాలు పంచుకోవాలి గదా! సమస్య వచ్చింది. మా అన్నగారు ఆదర్శవివాహం చేసుకున్నాడు. విడో వివాహం రావి నారాయణరెడ్డి గారు వుండి చేశారా వివాహం- తీరా ఆమె ఈ ఆస్తి పంపకానికి ఒప్పుకోలేదు, వ్యతిరేకించింది. ఎవరు పంచట్లేదు గదా! అది చట్టమైందా, చట్టమైన్నాడు చూద్దాం- సరే ఎకనామిక్‌గా అందరివి పేద సంసారాలే. ముగ్గురం గూడా! కాని ఆమె సాగనివ్వలేదు. రాష్ట్ర కమిటీలో పెరిగాం కనుక చండ్ర రాజేశ్వరరావుకి నేను లెటర్‌ రాశానన్నమాట. వాళ్ళతో సమానం యివ్వకుండా ఒక భాగాన్ని మేం ముగ్గురం తీసుకున్నాం. అమ్మతోపాటు మేం ముగ్గురం. ఆయన పంచాలె అంటే కూడా ఒప్పుకోలేదు. అప్పుడసలు ఆస్తి హక్కు అనేది విన్పడనిరోజులు. అది జరగటానికే ఎంతో గొడవైంది. ఆస్తి హక్కు వుంటే స్వతంత్రంగదా అని సెలెక్ట్‌ కమిటీల్లో మా కమిటీల్లో పెట్టాం. ఆస్తిహక్కువస్తే మాత్రం చంపరా అని. ఆస్తి వుందిగదా అని నీ బ్రతుకు నీవు బ్రతుకు అని. ఆస్తంత వదిలిపెడ్తారనే అభిప్రాయం చెప్పారు. యువతుల్ని అడిగితే మాత్రం ఎవరి ఆస్తి వాళ్ళకుంటే మంచిది, అని ఎవర్ని అత్తగారింటికి పంపాలే, అని వస్తే ఆడపిల్ల అత్తగారింటికి పోయేకంటే, మగపిల్లలే వస్తే మంచిది, అది రాంగ, రాంగ వస్తదేమో ….. కుటుంబం ఎన్నడు డివైడ్‌ అయితే ఆస్తి అన్నడే పంచాలని పెట్టిన, భర్త సచ్చిపోతే భార్యకి ఆస్తిరావాలె గదామరి దానిమీద చర్చబెట్టినం. మహిళా సంఘాల్లల్ల గూడ ఆ బిల్లును గురించి ఎవరూ కన్విన్స్‌గాలే, సవరణలు బెడ్తాం, అని చర్చిస్తే చాలా తప్పన్నరు. నువ్వెవర్ని కన్విన్స్‌ చేయడాన్కి వీల్లేకుండ వాదిస్తున్నవని అన్నరు. కనీసం భార్య ఆస్తి భార్యకుంటే చాలు అని అన్నరు.

స్త్రీలని యెట్లా ఉపయోగించుకోవాలనే సమస్య వచ్చింది. పెండ్లిగాని వాళ్ళు పెండ్లిళ్ళు జేసుకోవటం. పెండ్లయిన వాళ్ళు సంసారాలకి యెల్లిపోవటం అని చెప్పారు. మొగవాళ్ళు ‘లా’ చేయటం, చదువుకోవటం అదీ జేశారు. మేం ఏం జేయటానికి వీలుగాలేదు. అప్పటిదాక ఈ యిండ్లు, కుటుంబాలు పట్టుకొనుండాలనే అయిడియా లేదు. పార్టీ కమాండర్‌గానో, ఏరియా ఆర్గనైజర్‌గానో వుండటానికి వీల్లేదని నిర్ణయించేశారు. కాబట్టి సెట్రయిట్‌ కాండి అని అంటే, అప్పుడు బాధపడ్డాం అందరం.

ఇది పోరాటమలుపులోనే పొరపాటు జరిగింది. సాయుధరూపం మారింది. లీగల్‌ వుద్యమాన్ని నడపడాన్కి వుండాల్సినంత క్యాడరని బెట్టుకొని, దానికి సంపూర్ణంగా తీర్పు యివ్వాలి, కాబట్టి ఒక లేడీస్‌నే పొమ్మనలేదు. మొగవాళ్ళకేమో వెనక్కి పోవటానికి అవకాశం వుంది. మరి మనంబోయేతందుకు వీలుకావట్లేదు. సమాజంలో వాళ్ళకి చదుకోవటానికి, యేదన్న జేయటానికి అవకాశాలున్నయి కానీ ఆడవాళ్ళకేమున్నయి. దాదాపుగ సమాజంలో వెలిబడ్డట్టుగ అయినం. ఆ స్టేజ్‌లో మేం. ఉద్యమంలో ఎందరు త్యాగాలు చేశారని చూడరు. ఉద్యమానికేం కావాలి అని మాత్రమే చూస్తారు. స్త్రీల గురించి ఎక్కువ అణిచేస్తారు. వాళ్ళ ఉపయోగం అంతే. అందుకే పోరాటం అయిన తర్వాత మీరు వెళ్ళి పెళ్ళి చేసుకోమన్నారు. అసలు పెళ్ళి జేసుకునే వాడెవడని, వీళ్ళను పెళ్ళి జేసుకోవటానికి ఎవరికున్నయి దమ్ములు. అది విషమసమస్య అప్పుడు. పార్టీలవున్నప్పుడు జేసుకుని యింటికి వోంగనే ఆమెని వదిలేసి, మళ్ళీ మామూలు గృహిణిని జేసుకున్నరు. అందరి జీవితాలుగూడ కొసకు ఏదో గొడవ జరగనే జరిగింది. వాళ్ళు మనల్ని గుర్తించరండీ అసలు, మనం వాళ్ళు గుర్తించాలని అడుగుడేంది? ఉద్యమానికి వాళ్ళే నాయకులు కర్తలు, మన లైఫ్‌ కంత కూడా వాళ్ళే కర్తలంటరేంటీ మీరు? దాన్ని నేనొప్పుకోను. అసలు ఈ పోరాటానికి కర్తలు ఎవరు. ప్రజలు, చరిత్ర, మనం స్త్రీలందర్నీ యెక్కడికి పంపకుండా సెట్రయిట్‌ చేసి పునరావాసం కల్పించే పరిస్థితి యెట్లా చేయగల్గుతారు చేయలేరు. పోరాటానికి అవసరమైనంత వుపయోగించుకుంటరు. సాంఘిక పరిస్థితులు బాగుపడ్తే ఆర్థిక సమస్యలు బాగుపడ్తే మన పరిస్థితి మారుతుందనేది, వాళ్ళు శ్రద్ధతీస్కోని డెవలప్‌ చేయడం లేదు. మన పోరాటహక్కుని గుర్తింపజేసే అవసరం మనకుంది. అయితే మరిప్పుడు భవిష్యత్తు గురించి చెప్పడాన్కి ఏం తీర్మానించుకుని వున్నం. అది ప్రశ్నే గదా? భవిష్యత్తులో వచ్చేవాళ్ళు, యేం చేయాలి, యెట్లా చేయాలనేది చెప్పగల్గాలి. దాన్ని యింకా రిసెర్చ్‌ చేయాల్సిందే. ఇంకా చర్చించవల్సిందే. సరైన నిర్ణయానికి రావాలె. ఏ ఒకరు జెప్పిందో, ఏ ఒక్క భావమో దాన్తో సరిపోదు. స్త్రీలు పోరాడాలంటే కష్టాల్ని యెదుర్కోవాలి అని భయపడ్తున్నారు, భయపడి తిరగబడటానికి దరించడం లేదు. కాబట్టి ఏదో ఒక పద్ధతిలోనే నడిచిపోతే సుఖం వుందీ అని అట్లానే ఫాలో కావటానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నరు. ఈ ప్రయత్నం సాంఘిక స్పృహని అంగీకరిస్తలేదు. అయితే దీనివల్ల పోరాడ్తలేరనేందుకు వీల్లేదు. ఆ చైతన్యం ఎక్కన్నో ప్రారంభమైతనేవున్నది. ఒక స్త్రీ కిరసనాయిల్‌ బోసుకుందీ అంటే, తగులబెట్టారూ అంటే ఆమె పోరాటం జేయబట్టే. స్ట్రగుల్‌ జేస్తుంది, జేస్తుంటేనే వాళ్ళు దౌర్జన్యాలకు తెగబడ్తున్నరు. భూస్వాములు గుండాయిజం యెప్పుడు జేసిన్రు, జీతగాండ్లు, కూలీలు తిరుగుబాటు జేసినప్పుడే. కన్క ఒక్కసారి సామాజిక సంబంధాలు విచ్ఛిన్నం కాకుండా, కలవరం చెందకుండా, పునాదుల్తోని కదలకుండా మార్పురాదు. ఆ వచ్చే మార్పు యెట్లవస్తది, ”కుక్క మూతి పిందెల్లాగ” ఈ మార్పు యేమిటికి పనికిరాదన్న మాట.

ఇప్పుడు ఈ సమాజపు సంబంధాన్ని దెబ్బగొట్టాలన్న, కొంత తీవ్రమైన నినాదాల్ని, ప్రచార నినాదాలుగా పెట్టాలె. అట్లనే ఆచరణ నినాదాల్ని కూడ కనుక్కోవాలి. ఆచరణలో ఇంప్లిమెంటేషన్‌ లేకపోతే మన నినాదాలు ఏమాత్రం గూడ అత్కవు జనం ఒప్పుకోరు. జనం తప్పుటడుగులు యేస్తరు. పోరాటానికి, సామాజిక సంబంధాలు, వాటియొక్క సూత్రాలు, పరిణామాన్ని నిర్ణయించేవారు శాస్త్రజ్ఞులు ఆ నిర్ణయాల్నిబట్టి యెత్తుగడలేసేది పార్టీ. సిద్ధాంతాన్ని తయారు జేసినవాడు మార్క్స్‌, దాని ఇంప్లిమెంటేషన్‌కి యెత్తుగడ వేసినవాళ్ళు, లెనిన్‌, స్టాలిన్‌. అట్లనే యెవరి దేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళెత్తుగడ దీస్కోవాలె. ఆ యెత్తుగడలు ఆ దేశపరిస్థితికి తగినట్టుగా యేసుకుంటేనే వుద్యమం డెవలప్‌ అవుతది. తర్వాత ప్రజలు దాన్ని పూర్తిగా పాత్ర దీస్కుంటరు. ఆ యెత్తుగడలేసినవాడే నాయకుడు. తతిమ్మాదంత జనం అందుకని యెవరి పాత్ర యెంత అని యెట్ల జెప్పగలం. పోరాటం అనేది ప్రజలే- ప్రజలే చరిత్ర సృష్టిస్తరని అంటున్ననంటె ఫీల్డ్‌లో పాల్గొని పోరాట కథని మొత్తం అణువణవు, అంగులం, అంగులం గజం, గజం చరిత్రంతా ప్రజలవైపే వుంటది. అయితే అది డ్రైవ్‌ జేసే వానిపాత్ర గూడా వుంటది. జనం అంత ఆ పోరాటంలో పాల్గొంటే దప్ప ఆ చరిత్ర సృష్టించబడదు. జనం పాల్గొనకుండా నీవు చరిత్ర రాసుకోవడాన్కి వీలులేదు. వ్యక్తుల చరిత్రలెన్నన్న రాసుకోవచ్చు. కాని సమాజం చరిత్ర కాదు గదా………..

ఇగ మనలో ఈ అనుభవాలున్నయని, అవి కావాలని కోరేవారెవరు- దాన్ని గుర్తించటానికి, రాజకీయ చైతన్యంగావాలె. ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో ఏమన్న పనిజేస్తుందేమోగని…… ఏదో ఆమె పనిజేసింది, యింతే సాలని సంతోషించే వాళ్ళు….. (నవ్వు)….. స్త్రీలని సమాజంలో గుర్తించలేదుగని ఎన్నో వ్యవహారాలు నడిపిస్తనేవున్నరు. ఏదో పెట్టి బూర్జువా మెంటాలిటీ వున్నోళ్ళు ఇది తప్పు, అది తప్పు, ఆమె పెత్తనమేంది అని కొట్లాడ్తున్నరు. కాని కార్మికవర్గంలో మొగవాళ్ళు అసమర్థులుంటే ఆడవాళ్ళు వ్యవహారం జేసుకుంటనేవున్నరు. ఉద్యోగంజేసే వాళ్ళకు యింట్లో, బైట బాధ్యతలు ఎక్కువైతున్నయి. కొంపకి జేరి అన్ని పనులు మళ్ళి జేసుకోవాలి, అదీ సావు- డబ్బొస్తుందేమోగని- ఇది గమనించరు.

వియత్నాంలో స్త్రీల పాత్ర, చైనాలో స్త్రీలను గురించీ, రష్యాలో స్త్రీలను గురించి, సోషలిస్టు సమాజంలో స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లా వుంటుంది అని సమాజిక పరిణామంలో స్త్రీ అని పుస్తకం వుంది. బాగనే వుండె- స్త్రీల పనులు ఎట్లా వుండే అని బావుందాపుస్తకం. కానీ అటువంటివి ఏం ఎడ్యుకేట్‌ జేయడం లేదు. ప్రధానంగా చూసుకుంటే సమీక్ష కనక జేసుకుంటే ఆయావర్గపోరాటాల్లో వర్గాలకు సంబంధించిన స్త్రీలను సమీకరించటమే ప్రధానమైన పనిగావుంది. క్లాసులివ్వటం అవన్నీ కూడా, పొలిటికల్‌గా క్లాసులివ్వటమే. వ్యవసాయ కూలీలెవ్వరంటే స్త్రీ. కాబట్టి సమీకరించటం, కూలీ పోరాటాలపైనే అట్లాగే కార్మికవర్గం. లేకపోతే ఫ్యాక్టరీల్లో ఎకనమిక్‌ కోర్కెల విషయంలో కొట్లాడటం- ఇవే ఎక్కువ జేస్తున్నంగనీ, ఆ స్త్రీలకి సంబంధించిన సమస్యలుగానీ, సూచనలుగానీ, వర్కపుట్‌ చేయటం ప్రధాన కార్యక్రమంగా లేదు. భార్యల్ని కొట్టటం, వాటిపై ఫోకస్‌ చేయడంలేదు.

మనం టోటల్‌గా చెప్పాలంటే, స్త్రీలము పూర్తిగా విముక్తి గావటమనేది, కమ్యూనిస్టు పార్టీలో కాదుగదా, యిప్పుడు యెక్కడా సాధ్యగాదు. మొత్తం సమాజం మారిన్నాడే మనం విముక్తి అవుతాం. అంతవరదాక విముక్తి లేదు. కాకపోతే కొంత మార్పు, కొంత ఛేంజ్‌పై మనం యిపుడు డబుల్‌ కష్టపడాలి. నేను బహిరంగ సభల్లో గూడా చెప్తుంటాను. పోరాటం యెట్లచేద్దాం, మన కష్టాలకి కారణం యెవరు. మొట్టమొదటి సమస్య పేదరికం, పేదరికానికి ప్రధాన కారణం దోపిడీ, మల్ల రెండోది ఈ భర్తల యొక్క పురుషాధిక్యత. సమాజంలో వున్నటువంటి పురుషుల పెత్తనం. దేనికి మొదలుజేద్దాం పోరాటం అని మొత్తం స్త్రీలను అడగండి. ఎకనమిక్‌ అనే అంటరు. సాంఘిక కోర్కెలు చెప్పరు మొదలు. కొంత ఎకనమిక్‌గా మనం స్టాండ్‌ అవుతామా అపుడు అంతర్గత పోరాటం స్టార్ట్‌ అవుతది. ఈ రెండు సమన్వయం కావాలె. ఈ పురుషాధిక్యతకి పోరాటం అనేది అప్పుడు మొదలవుతది- చైతన్యం కంటే ఆలోచన అనేది వుంటుంది. యెవరు చెప్పాల్సిన అవసరం లేదు. పురుషులకీ, స్త్రీలకీ మధ్య వైరుధ్యం వుంది. ‘వర్గ వైరుధ్యంలాంటిది ఒకటున్నది. ఈ అరాచకాలూ, మన్నూ, మశానం అన్నీ సరి సమానస్థాయికొచ్చే వరకి యిది- కొనసాగుతనే వుంటది…..ఎప్పుడన్న ఒకసారి మనం ఆధిక్యతను సాధించినమా, లేదు. ఇంత రాజకీయాలొచ్చినై, యిన్నొచ్చినై ఏమన్నా మార్పొచ్చిందా! పాతరోజులే బావుండేనేమో అన్పిస్తది ఒక్కొక్కసారి- పాతరోజుల్ల యెట్టి చాకిరీ చేయించుకున్నా, పెళ్ళాన్ని కొంత గౌరవించాలనీ, పోషించాలనే బాధ్యత ఒకటి వుండేది. ఆలికి బువ్వ పెట్టలేనోడు, యింకేం వుపకారం చేస్తడని ఒక సామెత వుండేది. యిప్పుడెవరన్న ఆలోచిస్తున్నరా! ఒక్కరన్న గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా, మా పెండ్లాలను మేమే సాకుతున్నమని జెప్పి. నిజానికి పెండ్లాలే సాత్తున్నరు. పైగా ఈయన సంపాదించిన జీతంలోకి సారాకి పోయేది గన్క తీసేస్తే, రెండువంతులు ఆమెది, ఒకవంతు సంపాదన ఈయనది. ఒక్కవంతు కుటుంబానికి అందేది కూడా కష్టమే.

సరే ఏమైనా మీకు ఒకటి మాత్రం చెప్పగల్ను – కమ్యూనిస్టు పార్టీలోనైనా ఆనాడు కుటుంబ గౌరవం కోసం స్త్రీలు త్యాగాలు చేయాలని చెప్పారు సనాతనులు. ఇవాళ సమాజం కొరకు స్త్రీలు త్యాగం చేయాలి. వాళ్ళున్న పొజిషన్‌, యివ్వాళున్న పరిస్థితిలో తను వెనుకబడ్డాసరే ప్రోత్సాహం యిచ్చి సమస్యలవైపు ఎదిగేట్టు చేయాలి- అది మాత్రం వాళ్ళకి లేదు. పార్టీల్లో నిర్ణయాలు కొన్నిసార్లు మంచిగానే వుంటై- కాని వ్యక్తులుగా తీసుకున్నపుడు పురుషుని సమర్థత కంటే స్త్రీ సమర్థత ఎక్కువుండొచ్చు. ఆమెకి ప్రోత్సాహం మాత్రం దొరకదు. ఆమెకి ప్రోత్సాహం దొరికిందీ అంటే మాత్రం ఆత్మవంచనే! మనమే ఆలోచించి ఆయన డెవలప్‌మెంట్‌ కోసం చూడాల్సిందే! ఆడవాళ్ళల్లో సమర్థత ఎక్కువున్న వాళ్ళు, మగవాళ్ళని కూడా ముందుకు తీసుకరావాలి. లేకపోతే మనం కూడా వెనుకబడిపోతాం, అనే బాధతోటి మనం కృషి చేయాలి! కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి తమకంటే స్త్రీలు మించిపోయే స్థితి వచ్చినపుడు, ఆయనకంటే, ఆమే ముందుంటుంది. ఏ పార్టీలోవున్నా ఈ పురుషాధిక్యత అనే ఫీలింగ్‌ జీర్ణించుకునే వుంది. దాన్ని క్రమక్రమంగా అవసరం కొద్ది ఎదిరిస్తూపోవాలి. కానీ ప్రధాన పోరాటం అదికాదు. పొలిటికల్‌ పోరాటమే ప్రధాన పోరాటం అందుకే నేను వుపన్యాసాల్లె చెప్తుంటాను. రెండు పోరాటాలు చేయాల్సి వుంటది. మగోళ్ళొక్కటే పోరాటం చేస్తున్నరు. పైపైనే, కండువా భుజానేసుకుని ఊరేగింపంటే వెళ్ళిపోతారు. జై అంటే జై అంటారు. కని మనం అట్లాకాదు. ఇంట్లో పోరాటం జేయాలె. మనం, వీలైతే ఊరేగింపుకెళ్లాలి, లేకపోతే లేదు పురుషుల్ని నొప్పియ్యకుండా ఏం జరుగదు. నొస్తేనొస్తది. స్త్రీలకి సౌకర్యాలు లేవనుకుంటే వాళ్ళే ఊర్కుంటారు గదా! పురుషులకెందుకు బాధ. మాశక్తి కొద్దీ పన్జేస్తాం, దానికి సరైన గుర్తింపు రావాలి, గౌరవమివ్వాలి. ఇవీ మన డిమాండ్స్‌ వాళ్ళంతట వాళ్ళివ్వాలి అనేది కూడా ఒక బలహీనతే. పొలిటికల్‌ రంగంలోవున్న స్త్రీ భరించలేని బాధ బైటచేయటం, ఇంట్లో చేయటం ఆయన్తోటి సక్రమంగా కొనసాగటానికి మానసిక సంఘర్షణ. కానీ ఆయినకేం బాధ లేదు. ఒకటే బాధున్నది. కుటుంబజీవితం చెడిపోతున్నదని దీనికి ఎట్లా పరిష్కారం ఆమెని వెనుకకి రమ్మంటే బావుండు చేతుల్లేకుండా అయిపోతాంది. ఆ బాధుంటుంది ఎప్పుడూ! ఇంట్లో ఒక అవతారం అవుతల వేసే అవతారం వేరే. దర్వాజలకె రాంగనే యింకో అవతారం వేయాల్సి వుంటుంది.
(అయిపోయింది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.