సంపాదకీయం – ఎందుకిలా?

ఐదు సంవత్సరాల క్రితం ఓ సమావేశంలో పాల్గోవడం కోసం హైదరాబాదు వచ్చిన ఓ దళిత మహిళ హఠాత్తుగా సమావేశ ప్రదేశంలోనే చనిపోవడం అప్పట్లో నన్ను చాలా బాధించింది. ఆమె మామూలు కార్యకర్త కాదు. ఒక స్వచ్ఛంద సంస్థ బాధ్యురాలు. క్షేత్ర స్థాయిలో దళిత మహిళలతో పనిచేస్తున్న వ్యక్తి. ఆ రోజు ఆమె శవం చుట్టూ కూర్చుని విలపించిన తోటి మహిళా స్వచ్ఛంద సంస్థల నాయకురాళ్ళుమాట్లాడిన మాటలు నన్ను తీవ్ర గందర గోళపరిచాయి. వాళ్ళ బేలతనం కలవరపరిచింది. అందరూ భిన్న రంగాల్లో, భిన్న సమూహాలతో, భిన్నమైన సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళు. స్త్రీల సమస్యలు, దళిత, ఆదివాసీ సమస్యలు, పిల్లల అంశాల మీద పనిచేస్తున్న వాళ్ళు. ఆ రోజు తమ జీవితాల గురించి, తాము బతుకుతున్న విధానాల గురించి తలచుకుంటూ కన్నీరు మున్నీరై ఏడ్చిన వాళ్ళ ముఖాలు నా కిప్పటికీ గుర్తే…

ఏమిటిది? ఎందుకిలా? నాయకత్వ స్థాయిల్లో వుండి ఎందరికో దిశానిర్దేశం చేయగలిగిన స్థితిలో వున్న వీళ్ళందరూ తమ వ్యక్తిగత జీవితాల పట్ల ఇంత అసంతృప్తితో ఎందుకు వున్నారు? తమ జీవితాలు వొత్తిళ్ళ మయమైపోయాయని, ఆ వొత్తిళ్ళు తమ మనశ్శరీరాలను శిధిలం చేస్తున్నాయని ఎందుకంతలా బాధపడ్డారు? ఎన్నో కార్యక్రమాలను చేసేవాళ్ళు, వ్యక్తులుగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు సైతం వ్యక్తిగత జీవితాలను ఎందుకలా వదిలేసుకున్నారు?

ఒక సందర్భంలో ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూ, ఎంతోమంది స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పగలూ రాత్రి పని చేసే ఒక సంస్థ బాధ్యురాలు మాటల సందర్భంలో ‘జీవితం ఎలా వుంది?’ అన్న మాటకు చాలా నిర్వేదంగా ”బతికున్నాం… నడుస్తోంది ఇలా” అన్నప్పుడు నా గుండెల్లో శూలం గుచ్చినంత బాధ కలిగింది. పది రోజుల పాటు ఆ మాట నన్ను వెంటాడింది. అపార ప్రతిభా పాటవాలుండి, అహరహం చేస్తున్నపనికే అంకితమై ఎన్నెన్నో కొత్త దారులేసి, ఆ దారుల్లోకి మహిళల్ని సమీకరించి వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం కోసం కష్టపడుతున్న ఆమె నోటి వెంట ఆ నిర్వేదం నేను ఊహించలేకపోయాను. జీర్ణించుకో లేకపోయాను. కానీ ఇది వాస్తవం. వాళ్ళ జీవితాల్లో వొత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో పట్టిచ్చిన వాక్యం నన్ను చాలా ఆలోచనల్లో పడవేసింది. చాలా కాలం దీని గురించి ఆలోచించాను.

ఇటీవల కొంతమంది జీవితాలను అతి దగ్గరగా గమనించిన తరువాత, వాళ్ళ జీవితాలను వాళ్ళు తెరవెనక్కి నెట్టేసుకుంటున్న విషాదాన్ని చూసాక నా బాధ మళ్ళీ మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సామాజిక కార్యకర్తగా వుంటూ, సమాజంలో మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి క్రమంగా ఒక వొంటరితనంలోకి, మానసిక సంక్షోభంలోకి జారిపోవడం ఎంత విషాదమో ఆలోచించండి. ఇంకొక మితృరాలు చిన్న వయస్సులోనే అనేకానేక ఆరోగ్య సమస్యలకు, మానసిక కల్లోలానికి గురవడం చూస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు తమ జీవితాలను ఏం చేసుకున్నారు అన్పించక మానదు. పొద్దున లేస్తే బాధిత స్త్రీలకు గంటల తరబడి కౌన్సెలింగ్‌ లిచ్చే వాళ్ళు తమకెదురయ్యే సమస్యలను ఏ కార్పెట్‌ కిందికి నెట్టేసారో!!.

సగటు స్త్రీల స్థాయి నుంచి బయటకొచ్చి సమాజ సేవ చేస్తామంటూ విశాల ప్రపంచంలోకి, సమస్యల వలయాల్లోకి అడుగుపెట్టిన వీళ్ళు తమ జీవితంలో ఏర్పడుతున్న ఖాళీలను, వొత్తిళ్ళను ఎలా మానేజ్‌ చేసుకోవాలో అర్ధం చేసుకోకపోతే… ఆ వలయాలు తమ జీవితాలను చుట్టుముడతాయని అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా కాదు. అన్నీ తెలుసు… ఎక్కువే తెలుసు. అయినా సరే…

ఎస్‌… సమాజసేవ చేస్తామని బయటకొచ్చి, సంస్థలు పెట్టినప్పుడు తామనుకున్నది చేయాల్సిందే. అక్కడ రాజీపడాల్సిన అవసరం లేదు. కానీ బాధితులతో పని చేస్తున్నపుడు ఆ బాధాతరంగాలు మన జీవితాలను తాకకుండా వుండవు. అలా అని అందులో మునిగిపోకూడదు కదా! పని ప్రదేశాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కలగాపులగం చేసుకోవడం ఇంటిని, ఆఫీసుని వేరు వేరుగా చూడలేకపోవడం చాలాసార్లు రెండింటిని కలిపేసుకోవడంతో వొత్తిళ్ళు ఎక్కువయ్యే అవకాశమే ఎక్కువ. ఇంటికి, ఆఫీసుకి స్పష్టమైన గీత గీసుకోగలిగిన వాళ్ళకి వొత్తిళ్ళుంటాయని నేననుకోను.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే… బాధితులను ఆదుకోవడానికి ఎన్నో కొన్ని సపోర్ట్‌ సిస్టమ్స్‌ వున్నాయి. వాటిని బలోపేతం చెయ్యడానికి మన మెంతో కృషి కూడా చేస్తున్నాం. మరి మనం ఆనుకోవడానికి, ఆగి ఆయాసం తీర్చుకోవడానికి ఏమైనా వున్నాయా? మనలో మనం… మన కోసం మనం” ఏమైనా సపోర్ట్‌ సిస్టమ్స్‌ తయారు చేసుకున్నామా? మనలో మనం ఒక సిస్టర్‌హుడ్‌ని డెవలప్‌ చేసుకున్నామా? మనసు గాయపడినపుడు ఆ గాయానికి లేపనంలా పనిచేసే ఒక ఆత్మీయ స్పర్శని, ఆదరంగా గుండెకు హత్తుకునే ఆత్మీయ నేస్తాలను సంపాదించుకున్నామా? అంత సమయమెక్కడిది? ఫ్రెండ్స్‌తో కూర్చుని కబుర్లాడుకునేంత సీన్‌ వుందా? అంటారు చాలామంది. ఇది చాలా పొరపాటని నా అభిప్రాయం. టైమ్‌ అందరికీ 24 గంటలే వుంటుంది. మన ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడంలో వైఫల్యమే టైమ్‌ లేకపోవడం అవుతుంది.

ఈ రోజు ఎంతో మంది స్త్రీలు సంస్థలు పెట్టి సమాజంలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కలిసి ఒక రిలాక్సేషన్‌ పాయింట్‌ని ఏర్పరచుకుని, తమ లోపల రగులుతున్న, వేధిస్తున్న, వొంటరులను చేస్తున్న అంశాలను పంచుకునే ఒక ‘వేదిక’ను నిర్మించుకోవడం పెద్ద కష్టం కాదు. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే వీళ్ళంతా తమ కోసం ఒక వేదికను ఏర్పరచుకోవడం సమస్య కాదు. వచ్చిన సమస్యల్లా ఆ కోణంలో ఆలోచించకపోవడం… తమ కోసం తామే ఒక సపోర్ట్‌ సిస్టమ్‌ని, సిస్టర్‌హుడ్‌ని నిర్మించుకోవాలనే ఆలోచనకు ప్రాధాన్యత నివ్వకపోవడం వల్లనే ఈ రోజు ఎన్నో సంత్సరాలుగా చురుకుగా, నిబద్ధతతో పనిచేసి రాటుదేలిన వాళ్ళు కూడా వొంటరి తనాల్లోకి, మానసిక కల్లోలాల్లోకి జారిపోవడం. ఇది నన్ను చాలా చాలా వేదనకు గురిచేస్తున్న అంశమిపుడు.

-కొండవీటి సత్యవతి

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to సంపాదకీయం – ఎందుకిలా?

  1. Manjari Lakshmi says:

    బాగా రాసారు మేడమ్. బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.