వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన హిమజా,

ఏం చేస్తున్నావ్‌? ఆ మధ్య కలిసిన ప్పుడు ‘కాలు’ సహాయ నిరాకరణోద్యమం చేస్తుందన్నావ్‌? ఇప్పుడెలా వుంది? మనసు నిండిన శరీరమే మనదనుకుంటాం గానీ, అప్పుడప్పుడు ఆకాశమల్లెల్ని ఇలా నేలమీదికి లాక్కొచ్చి, నేనున్నాను చూడండంటూ శరీరం గుర్తు చేస్తూ వుంటుంది.    కొత్తగా ఏం రాశావ్‌? గుర్తొచ్చింది. మొన్న ‘బతుకమ్మ’ మీద రాశానన్నావ్‌ కదూ! సమ్మక్క సారక్కల మీద గతంలో నువ్వు రాసిన కవిత కూడా చాలా బాగుంది.

‘మెట్టుకు పై మెట్టు’ – శంకర పిళ్ళై రాసిన దానికి తెలుగు అనువాద మొచ్చింది. చదవమన్నాను కదా! పుస్తకం దొరికిందా? మనుషులు కీర్తికోసం, పదవికోసం, డబ్బుకోసం ఎలా మెట్ల సాయంతో ముందుకు పోతారో? ఎక్కిన మెట్లని ఉపయోగించుకున్నాక ఎలా నేలమట్టం చేస్తారో చాలా అద్భుతంగా వివరించిన నవల అది. మానవ స్వభావాలన్నింటినీ బట్టబయలు చేసింది. మూడు ప్రధాన పాత్రలచుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. అతడు, ఆమె, ఇంకొకామెల జీవన నేపథ్యమది. జాతీయోద్యమకాలంలో నాటి స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, రాజకీయ సంక్షోభాలు అన్నింటినీ చిత్రించిన నవల అది. చదువుతావ్‌ కదూ!

హిమజా! నిన్నటి పేపర్లో న్యూస్‌ చదివావా? చాలా బాధగా అన్పించింది. కట్నం కోసం వేధిస్తూ ఆమె పచ్చి బాలింతరాలుగా ఉన్నప్పటినుంచీ, బాత్‌రూమ్‌లో బంధించి ఉంచారట. పిల్లవాడికి పాలు కూడా పట్టనివ్వకుండా, మూడేళ్ళపాటు ఆ చీకటి గదిలో ఉందామె. వాళ్ళు తినగా మిగిలిన అన్నం ఏదో ఒకసారి పెడ్తూ ఉండేవారట. గోళ్ళు పెరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, ఎండలేక, తడిగా ఉన్న ఆ ప్రదేశంలో ఎలా బతికిందో పాపం! వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లయింట్‌తో పోలీసులు బయటికి తీసుకొచ్చారట. చూసావా! ఎంతహింసో, ‘ఏడు తరాలు’ నవల గుర్తొచ్చింది. జైళ్లల్లో మగ్గిన వారి బతుకులకి ఈమె జీవితానికీ తేడా ఏముందనిపించింది. హిమజా ఇంత దుర్మార్గంగా మనుషులెందుకుంటున్నారు? అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? కళ్ళముందు ఆమె కదుల్తూ ప్రశ్నిస్తున్నట్లే ఉంది. కళ్ళు మూసుకున్నా వేలాదిమంది స్త్రీల ఆర్తనాదాలే విన్పిస్తున్నాయి. మన చేతులకున్న శక్తి సరిపోవడంలేదు. ఇంకా అనేకమందిమి జమై వాళ్ళందర్నీ ఈ ఆకాశంకింద నేలమీద స్వేచ్ఛగా జీవించగలిగేట్లు చేయగల రోజుకోసమే ఎదురుచూస్తున్నా. హిమజా మనసంతా వికలంగా ఉంది. మానవత్వం చచ్చిపోయి, మనిషి సృష్టించిన డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చి, స్త్రీని ఒక మనిషిగా, ప్రాణిగా కూడా గుర్తించని ఇలాంటి మనుషులను ఏం చేసినా తప్పులేదనిపిస్తుంది. వాళ్ళల్లో మానసిక పరివర్తన వస్తుందంటావా? ఇంకెన్నాళ్ళీ మౌనహింసలు, లైంగికదాడులు, వివక్షలూ?

నిన్న ఓ మీటింగ్‌కి వెళ్తే శారద కల్సింది. చాలా సంతోషంగా వుంది. చాలాసేపు హాయిగా మాట్లాడుకున్నాం కూడా! తన మాటలు వాళ్ళ మనవరాలిగురించే ఎక్కువున్నాయి. నాలుగేళ్ళట ఆ పాపకి. స్కూల్లో ‘కావ్యా’ మీ ఇంటిపేరు ఏమిటి? అని అడిగారట. బి. అని చెప్పిందట. మీ నాన్న ఇంటిపేరు కె. కదా! అని శారద అడిగిందట. కానీ అమ్మమ్మా, నేను మా అమ్మ పొట్టలోంచే వచ్చాను కదా! అందుకే అమ్మ పేరు ముందున్న ‘బి’ నే నా ఇంటిపేరు అందిట. ఇక చూస్కో శారద ఎంత సంతోషంగా చెబ్తుందో ఆ విషయం. నాలుగేళ్ళ దానికి తెల్సిన వివరం ఇంతమందికి ఇన్నాళ్ళు తెలియకుండా పోయిందని. పెద్దయ్యాక ఇంకా చాలా తెలివితేటలు దానికి వచ్చేస్తాయని సంబరం.

ఈ నెల 19వ తారీఖున ‘తెలుగు యూనివర్సిటీ’ లో ప్రముఖ కథారచయిత్రి పి. సత్యవతి గార్కి ‘ఉత్తమ రచయిత్రి’ అవార్డు ఇస్తున్నారట. ఆరోజు తప్పకుండా కలుద్దాం. ‘ఇల్లలకగానే’ కథల పుస్తకం గుర్తొస్తుంది కదా! ఆ మధ్య జ్యోతిలో ‘పిల్లాడొచ్చాడా?’ అనే కథను రాశారు. చాలా బాగుందది. ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో రోజూ జరుగుతున్న విషయమే. హఠాత్తుగా రాత్రంతా ఇంటికిరాని కొడుకుకోసం- ఆ తల్లి, కుటుంబ సభ్యుల ఆదుర్దా ఉందందులో. చివర్లో కాలింగ్‌ బెల్‌ మోగడంతో కథయిపోతుంది. ఆ వచ్చింది పిల్లాడా? పాలవాడా తెలీదు. సత్యవతి గారికైతే వందలకొద్దీ ఫోన్లట. ఆ పిల్లాడొచ్చాడా లేదా అని. హిమజా ఇక్కడ కూడా ఎవరో కాలింగ్‌ బెల్‌ కొడ్తున్నారు. చూడాలి. ఉండనా మరి.

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో