బాపూగారూ! ఇంక సెలవండీ!- ఇంద్రగంటి జానకీబాల

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత దర్శకులు, సుప్రసిద్ధులైన స్వర్గీయ బాపూగారి చిత్రాలలోని కొన్ని పాటల్ని, వాటి రూపకల్పననీ తలుచుకుంటూ, ప్రస్తావించుకుంటూ ఆయనకి ఒక సంగీతపరమైన నివాళినర్పించాలని ఈ వ్యాసం వుద్దేశమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.

సినిమా అనగానే ప్రతీవాళ్ళు తమకీ ఎంతోకొంత తెలుసనుకొని పొంగిపోతూ, ఉత్సాహపడే కాలమిది. నిజానికి ఎవరికెంత తెలుసో ఎవరికీ తెలీదు.

సినిమా అంటే ఎన్నోకళల సమ్మేళనం. సంగీతం, సాహిత్యం, నృత్యం, నటన, చిత్రలేఖనం, ఇంకా ఎన్నో సూక్ష్మంగా పరిశీలించవలసిన అంశాలుగల ఒకే ఒక అద్భుత ప్రక్రియ సినిమా.

సినిమా నిర్మాతకి కావలసింది బోలెడంత డబ్బు, అన్నికళలయందూ కాస్త కాస్త పరిజ్ఞానం, సినిమా తియ్యాలనే విపరీత ఉత్సాహం వుంటే చాలు. కానీ ఒక సినిమాని బాధ్యతగా భావించి, దర్శకత్వం వహించి, జనరంజకంగా తయారు చెయ్యా లంటే దర్శకునికి మాత్రం పైన చెప్పుకున్న కళలన్నింటిలోనూ మంచి అవగాహన వుండాలి. వాటిని సినిమాలోకి అవసరాన్నిబట్టి అనువదించగల నేర్పుండాలి. ముఖ్యంగా సంగీతం, సాహిత్యాలలో లోతుగా ఆలోచించగల శక్తి వుండాలి- ముఖ్యంగా సంగీతం బాగా తెలిసిన దర్శకులు మనకి చాలా తక్కువ మంది వున్నారు. వారిలో ‘బాపు’ మొదటివారు. నిలువెత్తు సాహిత్య రూపం రమణ గారు ఆయన పక్కనుండేవారు. సంగీతంలో ఆయనకి గొప్ప హృదయం, సంస్కారం వున్నాయి. మంచి పాటని రూపొందించటానికీ, తన సినిమా సన్నివేశంలో దానిని పొందుపరచటానికీ ఆయనకి శక్తి వుంది. తనకెలాంటి బాణీ కావాలో చెప్పగల స్పష్టత వుంది.

‘బాపు’ చిత్రకారులుగా ప్రపంచఖ్యాతి గడించుకున్నారు. అంతకంతా ఆయనకి సినిమా దర్శకులుగా కీర్తి ప్రతిష్టలు వున్నాయి. సినిమా తీయడంలో ఒక ప్రత్యేకశైలి వుంది. ప్రత్యేకమైన ఒక దృక్పథం వుంది. సినిమాలోని కథ ఏదైనా అది కళాత్మకంగా వుండాలనే కోరిక వుంది. ఆయన ఫ్రేమ్‌ పెట్టడంలోనే ఒక ప్రత్యేకత వుందని అందరూ అంటూంటారు. ఆ ప్రత్యేకతను ఆంధ్రులు గ్రహించారు ఆయన్ని ఆరాధించారు. ఆరాధిస్తున్నారు.

‘బాపు’ సినిమాలో పాటకి ఒక సుందరమైన రూపం వుంది. అందులో సాహిత్యం, బాణీ (సంగీతం) సన్నివేశం, పాత్రలు, అభినయం, దృశ్యం అన్నీకూడా ఉదాత్తంగా వుండేలా చూసేవారా యన. సూటిగా అవన్నీ ప్రేక్షకుడి మనసులో ముద్ర వేసుకునేవి.

1967లో బాపు-రమణ కలిసి ‘సాక్షి’ సినిమా తీసి, సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు పెట్టారు. అంటే తెలుగు సినిమా చరిత్రలోనన్నమాట. ఏ కాలంలోనైనా కొత్తదనంకోసం ప్రయత్నించే వారికి మార్గం కష్టతరంగానే వుంటుంది. అంతా తయారుచేసి ముందుపెడితే ఆహా! ఓహో! అంటారుగానీ ముందుగా కొత్తతరహా విషయాన్ని ప్రతిపాదిస్తే, సినిమాగా తీస్తామంటే డబ్బుపెట్టేవా రుండరు. వున్నా వారి అభిరుచులు, అభిలాష అందులో చొప్పించమని కోరుతారు. ఉన్నది అనుకున్నదీ చెయ్యనీయరు.

ముళ్ళపూడి వెంకటరమణ ‘సాక్షి’ సినిమాకి స్క్రిప్ట్‌ తయారుచేస్తే దర్శకత్వం బాపు స్వీకరించారు. వారికి సంగీతదర్శకులు కె.వి.మహదేవన్‌, పాటలు ఆరుద్ర వ్రాశారు. ఈ చిత్రంలో సరికొత్త ముఖం కృష్ణని ప్రధాన పాత్రకి ఎంపిక చేసుకున్నారు. నిజానికి విజయనిర్మల కూడా పైకి వస్తున్న నటీమణి మాత్రమే – అప్పుడొస్తున్న ఊకదంపుడు కథలలో సాక్షి సరికొత్త ప్రయోగం.

ఎవరికి ఎవరూ ఈ లోకం

రారు ఎవ్వరూ నీకోసం అనే పాటను నూతన గాయకుడు కె.వి.పి. మోహన్‌రాజు చేత పాడించారు.

ఇది ఎంతో అర్థవంతమైన పాట. అప్పట్లోనే అందరి మెప్పు పొందింది. ‘నిజం ధైర్యంగా చెప్పు’ అని ప్రోత్సహించిన అందరూ-, తీరా అతను నిజం చెప్పి చిక్కుల్లోపడి, భయంతో దిక్కుతోచని స్థితిలో వుంటే ఎవ్వరూ అతన్ని ఆదుకోరు. అతనికి ఆసరాగా నిలబడరు. ఇది లోకం తీరు అని చెప్పే పాట. ఇది సినిమా సారమంతా వున్న పాట. చివరికి ఆ అమాయకుడు, నిజాయితీగలవాడు ప్రతి నాయకుడి చెల్లెలు దగ్గర తలదాచుకుంటాడు. ఆమె అతనిలోని నిజాయితీని, అమాయకత్వాన్ని ప్రేమిస్తుంది.

అమ్మకడుపు చల్లగా – అత్త కడుపు చల్లగా

బతకరా బతకరా పచ్చగా – అనే పాట ఆమెలోని ఉదాత్తతని తెలియజేస్తుంది. మహదేవన్‌ సంగీతం, సుశీల కంఠం కలిసి స్వచ్ఛంగా మెరిసే మంచి ముత్యాన్ని తలపింపచేస్తుందా పాట. సన్నివేశం ఆర్ద్రంగా, ఉత్కంఠగా వుంటుంది. ఇది బాపు దర్శకత్వంలో మొదటి చిత్రమైనా, సంపూర్ణమైన స్ఫూర్తి ఈ సినిమాలో ప్రేక్షకులకి అందింది. ఆయనకి ఎంతో పేరు వచ్చింది.

‘సాక్షి’ లోని పాటలు దర్శకుని అభిరుచిని చాటిచెప్పాయి. అప్పట్నించి బాపు-రమణ కలిసి రూపొందించిన సినిమా అంటే ఓహో- దీనికో స్థాయీ, సంస్కారం వున్నాయని ప్రేక్షకులు భావించటం మొదలుపెట్టారు.

బుద్ధిమంతుడు సినిమా కథ మరీ కొత్తది కాకపోయినా రమణ వ్రాసిన విధానం, ‘బాపు’ తీసిన నేర్పు అందరికీ నచ్చింది. ఇందులో- రెండు విభిన్నమైన మనస్తత్వాలుగల పాత్రలకి పాటలు చక్కగా అమర్చారు.

‘భూమ్మీద సుఖపడితే తప్పులేదురా-

బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా- తప్పులేదురా-

అని ఒక పాత్రలో విచ్చలవిడితనం కనిపిస్తుంది. పక్కనే ”ననుపాలింప నడచి వచ్చితివా” అంటూ భక్తి పారవశ్యంతో అంతా దేవుడిమీద భారం వేసే మరో పాత్ర కనిపిస్తుంది.

మళ్ళీ – ‘టాటా- వీడుకోలు! అనీ
గుట్టమీదా గువ్వ కులికిందీ నా

గుండెలో తొలివలపు పండిందీ  ఓ అంటూ యుగళగీతం, సంగీతపరంగా, సాహిత్యపరంగానూ కొత్తగా వినిపిస్తుంది-.

‘బుద్ధిమంతుడు’ చిత్రం కథగా బాగుండి, సంగీతం, పాటలు అంతటిస్థాయిలోనూ అమరడం గొప్ప విషయం. ఏ సినిమాలోనైనా మంచి విలువలుగల పాటలు వచ్చాయీ అంటే అది కేవలం దర్శకుని సంస్కారంగానే భావించవలసి వుంటుంది. చక్కని పాటలనెప్పుడూ ఆంధ్రులు అభిమానిస్తూ వస్తున్నారు. ‘ముత్యాల ముగ్గు’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో, ఆ సినిమాలోని సంగీతం, పాటలూ అంతగానూ జనాదరణ పొందాయి. మంచి సాహిత్యం, ఇంపైన సంగీతం శ్రోతల్ని ఎంతగానో అలరించాయి.

ముత్యమంతా పసుపు
ముఖమంత ఛాయా – అందరి పెదవులమీదా తారట్లాడింది. అయితే
నిదురించే తోటలోకి-

పాట ఒకటి వచ్చింది అనే గుంటూరు శేషేంద్రశర్మ రచన గుండెలలో గుబులు రేపి, కంట తడిపెట్టిస్తుంది. సుశీల పాడటం, అమరిన వాద్యాలు, రికార్డు చేసిన సాంకేతిక నైపుణ్యం ఈ పాటను ఉన్నత స్థానంలో వుంచాయి. ప్రకృతి అందాలను ఇనుమడింపచేసిన పాట, జానపద రీతిలో సాగింది ‘గోగులు పూసే-గోగులు పూసే ఓ లచ్చా గుమ్మాడీ’- అనే పాట -

ఆ రోజుల్లోనే ఒక అయిటమ్‌ సాంగ్‌ని అత్యంత రమణీయంగా చిత్రించిన ఖ్యాతి ‘బాపు’ కే చెందుతుంది.

‘ఎంతటి రసికుడవో తెలిసెరా-,

ఈ పాట బాణీ, రచన, హలం చేత చేయించిన నృత్యం ఎంతో ఉత్సాహవంతంగా సాగాయి. ఇలాంటి ఒక సన్నివేశం, అందులో పాట పెట్టాలంటే అందులో అశ్లీలత అవసరం లేదని చెప్పిన పాట ఇది. కె.వి. మహదేవన్‌ తెలుగువారు కాకపోయినా, ఆయన తెలుగుభాషా స్వరూపాన్ని అర్థం చేసుకున్న విధానం అమోఘం. ఆయన కంపోజ్‌ చేసిన తెలుగుపాట – అచ్చ తెలుగుపాట.

ఇక్కడ వరుసగా వారి సినిమాల్లోని పాటలన్నింటినీ ప్రస్తావించాలని ఈ వ్యాస రచయిత్రి వుద్దేశం కాదని మనవి చేస్తూ ‘బాపు’ సినిమాల్లోని కొన్ని పాటల్ని తల్చుకుంటే అదే ఆయనకి నివాళిగా భావిస్తోంది.

‘సంపూర్ణ రామాయణం’ ఒక క్లాసిక్‌గా నిలిచింది. బాపు-రమణలకి ‘రామాయణం’ అంటే ఎనలేని ఇష్టం, ఆ కథ పట్ల ఎంతో ఆరాధన వున్నాయి. ఏ కథలోంచైనా రామాయణం స్ఫూర్తిని తీసుకొచ్చేసే వ్యామోహం వారిద్దరికీ దానియందు వుంది-,

అందుకే ఎంతో ప్రాణం పెట్టి తీసిన సినిమా ‘సంపూర్ణ రామాయణం’- అప్పటికే రాముడంటే ఎన్‌.టి.ఆర్‌. అని అందరూ భావిస్తున్న సమయంలో శోభన్‌బాబుని రాముడ్ని చేసి శభాష్‌ అనిపించారు.

సౌందర్యంతో మిడిసిపడే జమున కైకేయిగా, సౌమ్యానికి మారుపేరైన చంద్రకళ సీతగా చక్కగా కుదిరిన చిత్రం-

ఇందులో శబరి పాడిన పాట-
ఊరికే కొలను నీరు

ఉలికి ఉలికి పడుతోంది – కమనీయంగా సాగిన కథలా వుంటుంది. ఈ పాట రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి- సంగీతం కె.వి. మహదేవన్‌- సుశీల లాలిత్యానికి, మృదుత్వానికి మారుపేరన్నట్టు పాడిన పాట-, ఈ దృశ్యం – రామలక్ష్మణుల రాక, శబరి ఎదురు చూడటం-, గొప్పగా కుదిరాయి.

‘రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ’ అనే గుహుడు పాడిన కొసరాజు రచన చమత్కారంగా, హాయిగా, అందంగా అలరిస్తుంది. ఘంటసాల పాడిన విలక్షణమైన పాటల్లో ఇదొకటి.

‘గోరంతదీపం’ సినిమా ఆర్థికపరంగా దెబ్బతిన్నదని చెప్పుకున్నాగానీ- అందులో ఆరుద్ర వ్రాసిన పాట
రాయినైనా కాకపోతిని
రామపాదము సోకగా- ఎంతో బాగా కుదిరింది-,

ఆ సన్నివేశానికా పాట ఎంతగానో రాణించింది.- మన తెలుగువారు సంప్రదాయ సిద్ధమైన పోలికల్నీ, పురాణకథలోని ప్రస్తావననీ బాగా ఇష్టపడతారు. ఆ విధంగా ఈ పాట అందరికీ ఎంతో నచ్చింది,- నలుగురు కూర్చున్నప్పుడు పాట పాడాలంటే ఈ పాట ప్రస్తావన వచ్చి తీరుతుంది.

‘రాయినైనా కాకపోతిని
రామపాదము సోకగా-
బోయనైనా కాకపోతిని
పుణ్యచరితము పాడగా-,
అంటూ అందరూ ఆనందంగా పాడుకున్న సందర్భాలున్నాయి.

సాధారణంగా ‘బాపు’ సినిమాలకి కె.వి.మహదేవన్‌ సంగీతం సమకూర్చటం జరుగుతూంటుంది. అయితే భక్తకన్నప్ప చిత్రానికి ‘సత్యం’ సంగీతం కూర్చారు. ఆయన కూడా ఎంతో శ్రద్ధగా, భక్తిగా ఈ కన్నప్ప చిత్రానికి పాటలు చేశారు.

ఆకాశం దించాలా-

నెలవంక తుంచాలా- అంటూ సుశీల-రామకృష్ణ పాడిన యుగళగీతం అందరికీ నచ్చింది, ముఖ్యంగా ఈపాట చిత్రీకరణలో కాసిన వెన్నెల ప్రేక్షకుల్ని కూడా వెన్నెల విహారం చేయించింది.

‘శివ శివ శంకర – భక్తవ శంకర’ అనే పాట కూడా బాగా కుదిరిన పాట -, ఈ పాట వేటూరి సుందర రామ్మూర్తి వ్రాశారు. ఎక్కువ ప్రతిభావంతంగా పాడలేకపోయినా, రామకృష్ణ ఈ చిత్రంలో పాటలన్నీ పాడారు.

‘స్నేహం’ సినిమాలో ‘ఎగరేసిన గాలిపటాలు’- పాట ప్రతీ వారికి వారి బాల్యాన్ని గుర్తు చేసింది-, ఈ సినిమా ఒరిజినల్‌ హిందీ సినిమాకథ- అందులో పాటలు (లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌) దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. అంత చక్కటి గొప్ప పాటలకి – తెలుగులోనూ పాటలు అంత బాగా కంపోజ్‌ చేశారు మహదేవన్‌- ఆ శ్రద్ధ ‘బాపు’ దే అని చెప్పాలి.

చుట్టూ చెంగావి చీర
కట్టావే చిలకమ్మా!    (తూర్పు వెళ్ళే రైలు) – అని ఆరుద్ర చేత రాయించి పాడించినా,
చిన్నారి నవ్వు-
చిటి తామర పువ్వు
చెరువంత చీకటిని

చుక్కంత వెలుగు – అంటూ కవిత్వపు గుబాళింపు సినిమా పాటలో కవిచేత పలికింప చేసినా అది బాపు సాహిత్యాభిమానానికీ, సంస్కార వాసనకీ గుర్తులనే చెప్పుకోవాలి. అర్థంకాని మాటలతో గారడీ ఆయన కిష్టముండదు పాట వింటుంటేనే అది శ్రోతకి అర్థమయి ఆనందం కలగాలి. అదీ ఆయన తత్వం-

‘బాపు’ కి సంప్రదాయం పట్ల ఎనలేని భక్తి, ఇష్టం. ఎవరి మెప్పు కోసమూ సంప్రదాయానికి దూరంగా వెళ్ళరాయన. మన సంగీత సంప్రదాయంలో వున్న సంప్రదాయ కీర్తనల పల్లవులు తీసుకుని, మిగిలిన పాట రాయించి తన సినిమాల్లో పెట్టిన సందర్భాలెన్నో కనిపిస్తాయి-.
వెడలెను కోదండపాణి-,
ననుపాలింప నడచి వచ్చితివా        త్యాగరాజస్వామి వారి పల్లవులు
జగదానంద కారకా-
పలుకే బంగారమాయెనా-    రామదాసు
ముత్యమంతా పసుపు
గోగులు పూసె – గోగులు పూసె    జానపద సాహిత్యం-,
ఇలా ఇంకా ఎన్నో వున్నాయి, ఆయన మనసుకి నచ్చి, అద్భుతమనిపించింది అందంగా మలచి తన సినిమాలో పెట్టడం ఆయనకిష్టం. ఆ విధంగా ఆయన ఇష్టాన్ని ఆంధ్రులు ఎప్పుడూ ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ వచ్చారు. ‘బాపూ’ మన మధ్యలేరను కోవడంకన్నా, నిత్యం ఈ పాటల ద్వారా మనతోనే ఆత్మీయంగా మసులుతున్నారనుకోవడం ఆయనకీ, మనకీ తృప్తి. మరింక బాపు గారూ, సెలవండీ-

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>