గ్రహణం తర్వాత ….మూలరచన : గోవింద్‌ ఉపాధ్యాయ అనువాదం : అనూరాధ నిప్పాణి

ఇప్పుడే నిక్కూ ఫోన్‌ చేసాడు : ”అమ్మా, ఎప్పుడొస్తున్నావు? నువ్వు సండే వస్తానని ప్రామిస్‌ చేసావుగా?” అంటూ…
మోనిక వాడిని బుజ్జగించింది. ”నిక్కూ, నువ్విప్పుడు చిన్నపిల్లాడివి కావు. మమ్మీ ప్రాబ్లెమ్స్‌ అర్థం చేసుకోవాలి. నాకు శెలవు దొరగ్గానే వస్తానుగా”! మోనిక వాడినైతే బుజ్జగించింది కానీ – ఇప్పుడే ఏడిచేటట్లుంది ఆమె పరిస్థితి. ఈ భావుకతనే అలుసుగా తీసుకుంటూ ఉంటాడు హరీష్‌. నిక్కూ ఇంకా చిన్నపిల్లాడే. నిండా పదేళ్ళు కూడా లేవు. ఐదో క్లాసు చదువుతున్నాడు. ఆమెకిక మరేదారీ లేక బోర్డింగ్‌ స్కూల్లో వేసింది. ఉద్యోగంతో పాటుగా పిల్లవాడిని చూసుకోవడం చేతకావడం లేదు.

ఆమె పెళ్ళికి ముందే తల్లితో మాట్లాడింది : ”అమ్మా, ప్లీజ్‌, నువ్వు నాన్నకి నచ్చజెప్పు. ఆయన నిర్ణయం తప్పు. నేను హరీష్‌తో మాట్లాడాను. అతనొక విఫలమైన వ్యక్తి. అటువంటి డ్రిపెస్డ్‌ మనిషితో ముందు ముందు ఎన్నో సమస్యలు ఎదురవవచ్చును. పెళ్ళి అంత అవసరమా? కొంత కాలం ఆగుదాం. అలా కాకపోతే పోనీ…”

ఆమె మాటలు విన్న తల్లికి కోపం వచ్చింది : ”మోనీ, నువ్వు ముందే అలా అనుకుంటావెందుకు? ఈ రకంగా ఆలోచించడం వల్లనే నీకు ముప్ఫైనాలుగేళ్ళు దాటిపోయాయి. ఆ అబ్బాయిలో ఏం లోటు కనిపించింది నీకు? అందంగా ఉన్నాడు. యుఎఇలో సెటిల్‌ అయ్యాడు, సంప్రదాయం బాగుంది. నీ ప్రొఫెషన్‌కి తగిన ఆఫర్స్‌ నీకక్కడ చాలానే వస్తాయి. మాకన్నీ బాగున్నట్లే అన్పిస్తోంది..”.

ఆమె తల్లికేసే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. అంటే – ఇంక తనకేమీ ఛాయిస్‌ లేదా? … హరీష్‌ ఆమెకంటే మూడేళ్ళు చిన్నవాడు కూడా ….. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా పెళ్ళికి సరేననలేక పోతోంది.

అతను దుబాయ్‌లో ఏదో పని చేస్తున్నాడు. అతనికి తన వంశం అంటే తగని గర్వం. అతను చెప్పిన ప్రకారం – అతని పూర్వీకులు రాజవంశీకులు. రాచరికాలు వెలగబెట్టారు. ఏదో ప్రదేశంలో రాజులుగా కూడా చలామణీ అయ్యారుట. అతనికిప్పుడు ఉద్యోగం చెయ్యాల్సిన ”ఖర్మ” పట్టిందిట. అతనంత ఆడంబరంగా మాట్లాడడం మోనికకి అస్సలు నచ్చడం లేదు. ఈ రాజవంశస్థుడికి తనకంటే మూడేళ్ళు పెద్దదయిన ఆడదాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందో ఆమెకి అర్థం కావడం లేదు. తనేమంత పెద్ద అందగత్తె కూడా కాదు, చూడగానే ఎవరైనా ఒప్పేసుకోవడానికి …. అయితే తల్లిదండ్రుల బలవంతానికి లొంగిపోయింది. పెళ్ళి అయిపోయింది.

తొందర్లోనే ఆమెకన్నీ స్పష్టంగా అర్థం అయ్యాయి. హరీష్‌ తిరిగి దుబాయ్‌కి వెళ్ళనేలేదు. ముందు ఇదంతా తన మీద ప్రేమ అనుకుంది. తర్వాత అడగడం మొదలుపెట్టింది. ”ఇంక మీరు దుబాయ్‌ వెళ్ళరా?” అని. హరీష్‌ ఆశ్చర్యపోయి, అలిగినట్లు ఏక్టింగ్‌ చేసేవాడు. ”ఏం నేనిక్కడుండడం నీకిష్టం లేదా? నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా? నా నుండీ దూరంగా ఉందామనుకుం టున్నావా?” అని ప్రశ్నలేసే వాడు.

అందరు భార్యల్లాగే మోనిక కూడా తన భర్త ఉద్యోగం చెయ్యాలని కోరుకుంది. అతను చెయ్యకపోవడం పట్ల సిగ్గుపడేది. మళ్ళీ ఎలాగోలాగా తనని తాను సంభాళించుకునేది. బలవంతంగా పెదవులమీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ, ”మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు” అనేది….

”ఏం నీ జీతమేమన్నా తక్కువా? … అయినా నా చేతుల్లో ఏమీ లేదు. వీసా వస్తేనే కదా నేను వెళ్ళగలిగేది…”

మోనిక ఈ జవాబు ఆశించలేదు. మెల్లిమెల్లిగా అతను కప్పుకున్న మంచితనం ముసుగు తొలగిపోసాగింది. ఈ మనిషి ముందు ముందు ఉద్యోగం చెయ్యనక్కర లేకుండా, హాయిగా తిని కూర్చోవడానికి తనని కట్టుకున్నాడని ఆమెకి అర్థం అయిపోయింది. ఆమె తనకి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పటినుండీ ఉద్యోగం చేస్తోంది. ముందైతే తలిదండ్రులకి తాను భారంగా లేనందుకు, తన కాళ్ళ మీద తాను నిలబడినందుకు సంతోషంగా ఉండేది. అయితే త్వరలోనే ఆమె ఆనందం ఆవిరయిపోయింది. ఆమె తండ్రి నడుపుతున్న చిన్న స్టేషనరీ షాపు మీద వచ్చే ఆదాయంతో ఎలాగోలాగ బండి నెట్టుకొచ్చేవారు. ఆమెకి ఉద్యోగం రాగానే కుటుంబంలోని వారందరూ ఆమె సంపాదన మీదే ఆశ పెట్టుకున్నారు. తన ఇద్దరు తమ్ముళ్ళనూ ఆమె బాంకు నుండి లోను తీసుకుని చదివించింది. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఐతే ఈ బాధ్యతల్లో పడి ఆమె పెళ్ళి వయసు మాత్రం దాటిపోతూ వచ్చింది.

హరీష్‌ గాల్లో మేడలు కడుతూ ఉంటాడు. అతని మాటలు ఇలా ఉంటాయి. ”చూడు మోనీ, ఒక ఫ్లాట్‌ ఇరవై ఐదు లక్షల్లో వస్తోంది. ముందర నాలుగు లక్షలు కడితే చాలు. మిగతాది సులభమైన వాయిదా పద్ధతిలో కట్టుకోవచ్చును. ఐదేళ్ళల్లో ఈ ఫ్లాట్‌ ధర రెట్టింపవుతుంది” అంటాడు. లేదా టాక్సీ సర్వీసు నడపడం గురించి ప్లాన్స్‌ వేస్తూ ఉంటాడు. ”ముందుగా రెండు టాక్సీలు వేస్తే చాలు. తర్వాత మెల్లి మెల్లిగా పెంచుతూ పోవచ్చును…….” అంటాడు.

మోనిక అతని మాటల్ని పట్టించు కోదు. ఏమన్నా అంటే ఎగిరెగిరి పడతాడు. ”ఇన్నేళ్ళ బట్టీ ఉద్యోగం చేస్తున్నావు. ఈ డబ్బులన్నీ ఏం చేసావు? నీ తమ్ముళ్ళ మొహాన పోసావు కదా! వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు చక్కగా.. నీకేమో అవసరాలు తీరడమే కష్టంగా ఉంటోంది…”

అతని మాటలు భరించలేని స్థితిలో ఆమె అక్కడినుండి లేస్తుంది. హరీష్‌ వెనక నుండి అరుస్తూ ఉంటాడు : ”నాకంతా తెలుసు మోనికా! నువ్వు ఇప్పటికీ నీ సంపాదనంతా వాళ్ళకే దోచి పెడుతున్నావు… నీ దృష్టిలో నేనో నౌకరు వెధవని…”

ఈ డ్రామా ఎప్పుడు, ఎక్కడ పూర్తవుతుందో మోనికకి తెలుసు. అతను కోపంగా ఇంట్లోంచి బయటకి వెళతాడు. కొన్ని గంటల తర్వాత తిరిగి వస్తాడు. అప్పటికి చాలా మటుకు నార్మల్‌ అయిపోతాడు. ఆమెకి ”సారీ” చెబుతాడు. అయినా ఆమెని తప్పుబట్టడం – ఆమె మౌనం తనని రెచ్చగొడుతుందనీ, అసలు తాను ఆమెనేమీ ఇబ్బంది పెట్టదలుచు కోలేదనీ అంటాడు. తర్వాత ఆమెని డబ్బు అడుగుతాడు.

హరీష్‌ ”సారీ” చెప్పగానే మోనిక మెత్తబడడం ప్రారంభిస్తుంది. ఇదేం బలహీనత?! రోజంతా ఆసుపత్రి వార్డులో రోగులతోనూ, వాళ్ళ బంధువులతోనూ వేగి, అలిసిపోయి ఇంటికొస్తే – ఇక్కడా సుఖం లేదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి.

అలాగే ఒక కొడుకు నిక్కూ కూడా పుట్టాడు. వాడికో ఏడాది వయసు వచ్చింది. హరీష్‌ కారణంగానే కొడుకుని దూరం చేసుకోవలసి వచ్చింది. తల్లి తనకి నచ్చ జెప్పింది : ”అమ్మా, పరిస్థితి చూస్తుంటే నువ్వు ఉద్యోగం చెయ్యక తప్పదని తెలుస్తోంది. నీ కొడుకుని నేను పెంచుతాను. నా దగ్గరుంచు” అంది. తండ్రి ఇంకా ఆ స్టేషనరీ షాపు నడుపుతూనే ఉన్నాడు. ఈ పని మానేసి తమ దగ్గరకొచ్చి విశ్రాంతిగా ఉండమని కొడుకులు ఎన్నోసార్లు అన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన పక్కనుండి ఆలోచిస్తే ఆయనా రైటే. ఈ వయసులో కూడా ఆయన చాలా పని చేస్తాడు. మంచి విషయమిది. నిక్కూ బాధ్యత అమ్మా, నాన్నా తీసుకున్నారు. లేకపోతే తనకి ఉద్యోగం చెయ్యడం కష్టమైపోయేది. హరీష్‌ తన జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే ఎంత హాయిగా ఉండేదో కదా! అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఆమెకి బ్లడ్‌ ప్రెషర్‌ వచ్చింది. కళ్ళచుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ ఏర్పడ్డాయి. ఆమెకి ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలు పెట్టింది. ఆమె నిస్సహాయురాలిలాగా ఫీల్‌ అవసాగింది. ఏదో తెలియని ఆందోళన ఆమెని ఎప్పుడూ చుట్టుముట్టే ఉండేది. ఆమె అసహనం ఎక్కువవుతూ ఉంది. ఆమె తన ఆసుపత్రిలోని అతిచెడ్డ నర్సుగా పేరు తెచ్చుకుంది. హరీష్‌ విడాకులిస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఆమె కుటుంబాన్ని తూర్పారబడుతూ ఉంటాడు. వకీలుతో మాట్లాడతానని అంటూ ఉంటాడు. మొదట్లో ఆమె అతని బెదిరింపులకి భయపడేది. వదిలేసిన ఆడదాని పరిస్థితి సమాజంలో ఎలా ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. ఒంటరిగా జీవించడం అంటే మాటలు కాదు. అందుకనే ఆమె హరీష్‌ని భరిస్తూ వచ్చింది. అయితే అతని డిమాండ్స్‌ అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఎక్కడినిండి తీసుకొస్తుందామె అంత డబ్బు?

హరీష్‌ ఈ మధ్య అప్పుడప్పుడూ తన పుట్టింటికి కూడా వెళ్తున్నాడు. అక్కడ అతని తమ్ముడు తన కుటుంబంతో ఉంటున్నాడు. మోనిక పెళ్ళైన తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉంది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు, రాత్రీ పగలూ అని లేకుండా మత్తుగా జోగుతూ ఉండే అతని తమ్ముడు – కొంత పొలం ఉంది కానీ దాంట్లో పని చెయ్యడానికెవరూ లేరు. హరీష్‌ తండ్రి పోయి చాలా కాలమైంది. అతని తల్లి రెండవ పెళ్ళి చేసుకుంది. హరీష్‌కొక సవితి చెల్లెలుంది. ఆమె చదువుకుంటోంది. ఆమె చదువుకున్నదీ, తెలివైనదీను. హరీష్‌ ఆమెని కూడా ఎన్నోసార్లు డబ్బు అడిగాడు. ఈ డబ్బంతా ఏం చేస్తాడో మోనికకి అర్థం కాలేదు. తర్వాత ఈ రహస్యం కూడా బయటపడింది – అతను సత్తా, జూదం ఆడడానికీ డబ్బు వాడతాడని తెలిసింది. మోనికకిది చాలా పెద్ద షాక్‌ అయింది.

ఇతను తన జీవితానికి పట్టిన పెద్దగ్రహణం అని అర్థమైంది. ఇతన్ని ఎంత తొందరగా ఒదుల్చుకుంటే అంత మంచిదని అనిపించిందామెకి..

అది మధ్యాహ్న సమయం. పొద్దున్నించీ సన్నగా వర్షం పడుతోంది. మనసు సంతోషంగా ఉంటే ఇది ఆహ్లాదక రమైన వాతావరణమని చెప్పవచ్చును. ఆమె రెండు రోజులు శెలవు తీసుకుంది. హరీష్‌ డిమాండ్స్‌ పూర్తి చెయ్యడం కోసం ఆమె అప్పు కూడా చెయ్యవలసి వచ్చింది. ఆమె తల్లి దగ్గరకెళ్దామని బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. ఆమె తల్లికిప్పుడు నిక్కూని చూసుకోవడం కష్టంగా ఉంటోంది. ఆమె ఇప్పుడు కొడుకుల దగ్గర ఉండాలని అనుకుంటోంది. హరీష్‌ కనక లేకపోతే ఆమె తన తలిదండ్రులను తన దగ్గర ఉంచుకు నేది. ఇప్పుడీ వాతావరణంలో వాళ్ళని తన దగ్గరుంచుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆమెకిష్టం లేకపోయింది.

ఒకసారి హరీష్‌కి కోపం వచ్చిం ది. ఎందుకంటే మోనిక డబ్బులివ్వడానికి నిరాకరించింది. హరీష్‌ అరుపులు మొదలెట్టాడు. ”నీతో నేనిక ఉండలేను. నేనిప్పుడే నిన్నొదిలేస్తే నీ గతేమిటో ఆలోచించుకో”…

”ప్లీజ్‌, నువ్వు నన్ను ఇప్పుడే వదిలెయ్యి. నేను నీ నుండి ముక్తి పొందాల నుకుంటున్నాను. నాకు విడాకులిచ్చెయ్యి. నీ బట్టలు సద్దుకో. నా ఇంట్లోంచీ వెళ్ళిపో… చాలానే భరించాను. కొంత టైమిస్తే మారతావనుకున్నాను. కాని నేనలా అనుకోవడం తప్పని నిరూపించావు. నువ్వు జలగలాగా నా రక్తాన్ని పీల్చేస్తున్నావు. ఇంక చాలు! నిన్నింక ఒక్క క్షణం కూడా భరించలేదు…” మోనికకి ఎక్కడినుండి పొంగుకొచ్చిందో ఆ ఆక్రోశం… ఆమె ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. హరీష్‌ ఆమె ఈ రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. అతనామెను – మౌనంగా అన్నీ భరించే శాంతమూర్తిగానే చూసాడు. మోనిక పెద్దగొంతు విని అతను అవాక్కయ్యాడు. అక్కణ్ణించీ రెండో గదిలోకి వెళ్ళబోతూంటే ఆమె వెనకనించీ గర్జించింది. ”మిస్టర్‌, తొందరగా కానీ. నేను నా బిడ్డ దగ్గరకెళ్ళాలి. అంతకంటే ముందు నువ్వీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి.”

హరీష్‌ ఓడిపోయినట్టుగా చూసా డు. అతను మెల్లిమెల్లిగా సామాన్లు సర్దుకోవడం మొదలెట్టాడు. మోనిక చల్లబడు తుందేమో. తనకి సారీ చెబుతుందేమోనని అతనికి అనిపించింది. సామాను పాక్‌ చేసుకుంటూ, అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ”నేను వెళ్ళిపోతున్నానులే! నీకు చాలా పొగరుగా ఉంది కదూ! ఉండు నువ్వొక్కదానివే! నేనింక వాపసు రానే రాను. నువ్వు కాళ్ళు పట్టుకుని బతిమాలినా సరే – రాను…”

వర్షం పడడం ఆగిపోయింది. మోనిక సోఫాలో కూచుని ఉంది. హరీష్‌ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కానీ మోనిక ఎక్కడికీ వెళ్ళలేకపోయింది. హరీష్‌ ఇంట్లోంచీ వెళ్ళిపోగానే మొదలు నరికిన మానులా పక్కమీద కూలిపోయింది. లోపలున్న లావా కన్నీళ్ళ రూపంలో పొంగి ప్రవహించసాగింది. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె రెండు రోజులపాటు ఇంట్లోంచి కదల్లేదు. తల్లి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఏ సమయంలోనైనా హరీష్‌ వస్తాడేమోనని ఎదురు చూసింది. కానీ అలా జరగలేదు. ఆమె తన నిర్ణయం సరైనదేనా? అన్న సందిగ్ధతతో కొట్టుమిట్టాడింది. ఇలా చేద్దామని ఆమె అనుకోలేదు. క్షణికమైన ఆవేశంలో, ఆ ఉద్వేగంలో అలా జరిగిపో యింది. ఏళ్ళ తరబడిగా అనుభవిస్తున్న యాతన ఇప్పుడు చెలియలికట్ట దాటింది. కోపం రూపంలో బయట పడింది. అయితే ఆమె ఇప్పుడు జరిగినదానికి పశ్చాత్తా పపడడం లేదు.

అక్కడ హరీష్‌ ”మోనిక మెత్తని హృదయం గలది. కోపం తగ్గగానే క్షమంచమని అడుగుతుంది. ఇంటికి రమ్మంటుంది” అని అనుకున్నాడు. అయితే అలాంటిదేమీ జరగలేదు.

మోనిక మెల్లమెల్లగా శాంత పడింది. ఎన్నో ఏళ్ళుగా మోస్తున్న భారం తల మీది నుండి దించినట్లైంది. ఆమెకెంతో తేలిగ్గా అన్పించింది. తర్వాత శెలవుల్లో నిక్కూని ఇంటికి తీసుకొచ్చింది. ఒక వారం రోజులపాటు తల్లీబిడ్డలిద్దరూ కలిసి సమయం గడిపారు.

కొన్ని రోజుల తర్వాత అతని సవతి చెల్లెలు మోనికకి ఫోన్‌ చేసింది. ”వదినా, కోపం వొదిలెయ్యి. భార్యాభర్తలన్నాకా చిన్నా చితకా ఏవేవో ఉంటూనే ఉంటాయి. హరీష్‌ అన్నయ్య కూడా తన తప్పు తెలుసుకున్నాడు. అతను దిగులుగా ఉన్నాడు. నువ్వు ఫోన్‌ చేసి అన్నయ్యతో మాట్లాడు” అని అందామె.

మోనిక తన ఆడబడుచు మాటలను శ్రద్ధగా వింది. ఎన్నో ఏళ్ళుగా అతని వల్ల తనకైన గాయాలు ఆమెకి చూపిద్దామని అనుకుంది. కానీ ఫోన్లో మటుకు, ”హరీష్‌ అనబడే వ్యక్తితో నేను ఎటువంటి సంబంధమూ పెట్టుకోదల్చు కోలేదు. నేనిప్పుడు కేవలం నా బిడ్డ కోసమే జీవించాలని అనుకుంటున్నాను. నేను నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగిన మాట నిజమే కానీ, ఇప్పుడీ నిర్ణయాన్ని మార్చుకోను. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చును. కానీ హరీష్‌ పేరు మటుకు నా దగ్గర ఎప్పుడూ ఎత్తకు” అని చెప్పి, ఫోన్‌ పెట్టేసింది.

మోనిక నిర్ణయం తీసుకుంది. నిక్కూని బోర్డింగ్‌ స్కూల్లో వేసింది. కష్టమే కానీ – ఆమె ఇక తన ముసలి తల్లిదం డ్రులను ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. జీవితంలో ఒక నిశ్చింత లాంటిది వచ్చిందని పించింది. గ్రహణం విడిచిన తర్వాత చంద్రు డు వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా అనిపించిందామెకి…

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో