దేవకి- ఒడియా మూలం : ప్రతిభా రాయ్‌ అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ్‌

సంత ముగించుకుని అడివి బాటలో నడుస్తూంది ఝముటి గొహరా. దుఃఖాల దొంతరలతో చేసిన మెట్లపై పాదాలు మోపుతూ జీవితపు ఒడిదుడుకులపై నడుస్తున్నట్టుందామె. ఏదో అమూల్యమైన వస్తువన్నట్లు అతి జాగ్రత్తగా మూటను గుండెలకు హత్తుకుని నడుస్తూంది, లేత పసికందు ఆమె స్తనాల్లోని పాలు కుడుపుతూందా అన్నట్లు!

మూడు కాలువలూ ఇంకా ఒక నదీ దాటి అడవిలో పదిహేను మైళ్ళు నడిస్తేగాని ఆమె ఊరు చేరుకోలేదు. రెండు రోజుల క్రితం ఆమె కాలినడకన ఖడియాళి ఊర్లోని సంతకు వెళ్ళింది. అప్పుడు కూడా ఇలాగే ఓ అమూల్యమైన మూటను, తన అయిదు నెలల కొడుకుని గుండెలకు హత్తుకుని నడిచింది. సంతలో అమ్మకా ల తర్వాత ఇప్పుడు ఇంటి ముఖం పట్టింది. సంతలో యేం అమ్మిందో యేం కొన్నదో అన్న విషయం గురించి ఝూముటి ఆలోచించడం లేదిప్పుడు. ఎప్పుడెప్పుడు స్వంత ఊరు చేరుతానా అని ఆలోచి స్తూంది. ఇంటికి వెళ్ళి, ఆకలితో అలమటిస్తూ ఊరు వదిలి వెళ్ళిపోవా లనుకుంటున్న మొగుడికి అన్నం పెట్టాలి. అతన్ని బతికించుకోవాలి. తాను కూడా ఓ గుక్కెడు గంజి తాగి ప్రాణాల్ని కాపాడుకోవాలి.

ఘనా గొహరా ఎప్పట్నుంచో అంటున్నాడు – ”పద, ఈ ఊరొదిలి వెళ్ళిపోదాం. ఇక్కడ పని దొరకదు, తిండి దొరకదు, వరుణ దేవుడి కనికరం లేదు, పంటల్లేవు. కరువు, కాటకం, రోగాలు, చావులు ఈ ఊరు నొదలవు.

ఝుముటి ఒప్పుకోలేదు. ఆమె ఒళ్ళో పసికందు ఉంది. కడుపులో యింకొకటి పెరుగుతుంది. ఊరు విడిచి యెక్కడికెళ్ళాలి? ఈ ఊర్లో యింకేమి ఉన్నా లేకపోయినా తలపై ఓ చూరుంది, పూర్వు లు విడిచి వెళ్ళిన పాత గుడిసుంది. వర్షాకాలం వస్తుంది. ఎలాగో ఓపిగ్గా నాలుగు రోజులుంటే తిరిగి పని దొరకక పోదు, తిండి దొరుకుతుంది, ప్రాణాలు నిలబడ్తాయి. ఝుముటి మాట విని ఘనా గొహరా ఓపికతో స్వంతూరులోనే ఉండిపోయాడు. అతనిలానే ఎంతో మంది ఆకలితో మట్టి కరుచుకుని కాచుకుని ఉన్నారు. ఎంత కరువు కాటకమైనా స్వంత ఊరు వదిలి యెవరైనా వెళ్ళిపోతారా, యేం?

ఈ కుగ్రామంలో ఉన్న కుమ్మరి, యాదవ, జాలరి వాళ్ళు అందరూ ఇళ్ళు వదలక ప్రతి యేడూ జీవన్మరణాల మధ్య, రోగాలు, రొష్టులు, ఆకలి, కరువు కాటకాల మధ్య అష్టాచమ్మ లాడుతూ గడిపేస్తున్నారు. ఊళ్ళో బావిగాని, చదువుగాని లేవు. స్కూలు, హాస్పిటలు, దుకాణాలు లేవు. దూరంగా ఉన్న కాలువ నుండి బురద నీళ్ళు తెస్తేగాని కాస్త గంజి ఉడకదు, పశువులకు నోరు తడవదు, దప్పి తీరదు. ప్రతి యేటా కరువుకి మనుష్యులు కనబడక, చనిపోయి మిగిలిన వారితో ఊరు చింపిన విస్తరిలా తయారైంది. ఓ వందా యాభైమంది ఆకలితో, రోగాలతో బక్కచిక్కిన వారితో ఘనా గొహర, ఝుముటి గొహర లాంటి వాళ్ళు పొలాల్లో పనిచేసి మట్టికుండలు బదులుగా పొందుతారు. ఆ కుండల్ని అమ్మి వచ్చిందాంతో ఓ పూట తిని మరో పూట పస్తుండి యిప్పటి దాకా యెలాగో ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నారు. ఘనాగొహరా యింటికి ఝుముటి వచ్చి అప్పుడే పదిహేడేళ్ళయింది. ఎనిమిది మంది పిల్లల్ని కూడా కనింది. కానీ యెవరూ ఆమెకు దక్కలేదు. చెట్టుకొకరూ పుట్టకొకరూ అయిపోయారు. పెద్దకొడుకు ఉండి ఉంటే పదిహేనేళ్ళ వాడయుండేవాడు. రెండేళ్ళ క్రితం కరువొచ్చింది. ఊళ్ళోంచి చాలామంది పొట్టచేత్తో పట్టుకుని మధ్యప్రదేశూ, పంజాబూ వెళ్ళిపోయారు, ప్రాణాలు కాపాడుకొనేందుకు, బ్రతకాలన్న ఆశతో. అప్పుడే పెద్దవాడు మోతీ కూడా ఎవరితోనో వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. ఏమయ్యాడో కబురు కూడా లేదు. ఊరు వదిలి వెళ్ళిన వారెవరూ యిక తిరిగి రాలేదు. ప్రతి యేడూ మంచు మామిడి పూలను మాడ్చినట్లు కరువు మనుషుల్ని మాడ్చి ఊరిని యెడారి చేసేసింది. మోతీ మంచి పనిచేశాడు, తిరిగి రాలేదు. బతికి ఉన్నాడో లేదో ఝుముటికి తెలియదు. అయినా ‘బతికి ఉన్నాడు’ అన్న తలంపు ఆమెను అంత దుఃఖంలోనూ సంతోషించేట్లు చేస్తుంది. ఆమె తల్లి మనస్సుకి ఊరట కలిగిస్తుంది. ‘ఎక్కడున్నా చల్లగా ఉండనీ, అడవిలో ఉన్నా ఏనుగు రాజు సొత్తే.’ ఇటువంటి ఆలోచనకన్నా నిస్సహాయమైన తల్లి హృదయానికి ఊరట కలిగించేది యింకేముంటుంది?’

మోతి తర్వాత ఆమె కడుపు చాలాసార్లే పండింది కాని ఏదీ దక్కలేదు. ఏ బిడ్డా యేడాదిబాటు కూడా బతకలేదు. ఆరేసిమంది తోబుట్టువులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే చిన్నారి మోతి గుండెలవిసిపోయాయి, భయం ఆవహించింది. అయితే ఘనాగొహరాకి ఇదేమీ పట్టలేదు. తన చేతుల్తోనే పసికందుల్ని గుడ్డల్లో చుట్టి శ్మశానంలో పూడ్చి వస్తుండేవాడు – కాలవల్లో ఓసారి మునిగి లేచివచ్చి అన్నం తిని పనికి వెళ్ళిపోయేవాడు. పెద్ద కొడుకు మోతి వీపు చరిచి ధైర్యం చెప్పేవాడు. ”చావంటే యింత భయమెందుకు? అదేమైనా ఆశ్చర్యకరమైన విషయమా? అందరూ ఎల్లప్పుడు జీవించి ఉండరురా, చెట్టుకి కాసిన ప్రతి కసువు కాయా పండుతుందను కుంటున్నావా? మనిషి జీవితం కూడా అలానే.” ఝుముటి కూడా ఓ రెండు రోజులు విచారంగా ఉంటుంది. ఘనా తన మగతనాన్ని చూపిస్తూ అనేవాడు – ”గోరంత కొండంత చేస్తున్నావెందుకు? ఈ ఊళ్లో ఎవరింట్లోనైనా అయిదారుగురు పసివాళ్ళు కూడా చావకుండా ఉన్నారా? ఏదో నీ పిల్లలు మాత్రమే పోయినట్లు అంత ఏడ్చి రాద్ధాంతం చేస్తావేం? వెళ్ళు, వెళ్ళి పనిచూడు. వాళ్ళు నీకు ప్రాప్తం లేదనుకో. మనస్సు దిటవు చేసుకో”

ఝుముటి మనస్సు గట్టి చేసుకుంది. ఘనా చెప్పింది నిజమే. ఏ శాపగ్రస్తులైన దేవతలో తన కడుపులో పడ్డారు, శాపముక్తులై వెళ్ళిపోయారు స్వర్గానికి. ఈ కుగ్రామంలో ఆకలి రోగాలు దేవతలెందుకు అనుభవిస్తారు? వెళ్ళిపోయినవారు దేవతలు. వారికి ఆకలి దుఃఖాలు తెలియవు. బతికినవారు మనుష్యులు. కారణం వారు ఆకలి, శోకాలను అనుభవిస్తారు. దుఃఖమనే పర్వతాన్ని అధిగమించడానికి ఎంత సులువైన, అందమైన మార్గం!

ప్రతీసారి కడుపులో బిడ్డ ఏర్పడ్డప్పుడు ఝుముటి అనుకుంటుంది – ఈసారి దేవుడు చల్లగా చూస్తాడని, ఇంట్లో ‘అమ్మ, అమ్మ’ అన్న పదం వినిపిస్తుందని. కాని ఏ బిడ్డా ‘అమ్మ’ అని పిలిచే టంత వరకు ఆగలేదు. చుట్టూ కంసుడిలాంటి కరువు కాచుకుని ఉంది. పిల్లల్ని ఎత్తుకుపోయి తల్లి ఒడిని ఖాళీ చేస్తుంది. ఆకలి చావుల్ని విచ్చల విడిగా విడిచిపెట్టి పసికందుల గొంతులు నొక్కుతుంది కంస కరువు.

ఈ యేడాది కరువు ఉత్త పిల్లల్ని మాత్రమే కాదు, పెద్దవాళ్ళనీ, ముసలివాళ్ళనీ, పశువుల్నీ కూడా పొట్టన బెట్టుకుంది. ఊరు శ్మశానంలా తయారైంది. కొందరు బానిసలుగా మారగా మరికొందరు కూలీలుగా దేశంపట్టి పోయారు. ఊళ్ళో కాస్తో కూస్తో ఉన్నవాళ్ళ యింట్లో కూడా పూట గడవడం కష్టంగా ఉంది. నిలువ ఉంచిన ధాన్యమంతా ఖర్చయిపోయింది. ఇళ్ళు, పొలాలు, గొడ్డూ గోదామూ, గిన్నెలూ సామాన్లు అన్నిటినీ అమ్మేసి నిరాధారులైన వారున్నారు. తినటానికి గిన్నెలు కూడా లేవు కొందరిండ్లలో. అడవిలో దొరికే కందగడ్డలూ, ఆకులూ అలములూ తిని యెంతకాలం బతకగలరు? విషమయమైన కందలు కూడా ఉడికించి నీళ్ళు పారబోసి తినేసే వాళ్ళున్నారు. అవి కూడా దొరకకుండా పోయేయి. ఇప్పుడు కందలూ మూలాలూ మాత్రమే ప్రాణాల్ని యెలాగో కాపాడుతున్నాయి. ఝుముటి గొహరా, ఘనా గొహరా దగ్గర నలుగురేసి పనివాళ్ళు ఉండేవారు. పొలాలు బీటలు వారేయి, పనిలేదు. రెక్కాడక పోతే డొక్కాడదు. డొక్కాడక పోతే పనిచేయడానికి శక్తిలేని పరిస్థితి.

ఊళ్ళో మిగిలిన వారిని చూస్తే యెవరు యువకులో యెవరు ముసలివారో తెలియడం లేదు. అందరూ ఒక్కలా కనిపిస్తున్నారు. పొడవు, పొట్టి అని మాత్రమే పోల్చుకోగలం, పిల్లలా పెద్దవాళ్ళా అని కాదు. అందరూ లోతుకు పోయిన బుగ్గలతో, గుంతల్లాంటి కళ్ళతో, అస్థిపంజరాల్లా ఉన్నారు. పోషణలేక పిల్లల జుట్టు ముసలివారిలా రంగు విహీనమైంది. పశువులు, మనుష్యులు, నదులు, పొలాలు, బావులు అన్నిటా వార్థక్యం రాజ్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

మంచు తాకిడికి రాలిన మామిడి పిందెల్లా పసిపాపలు తల్లుల ఒళ్ళోంచి రాలిపోతున్నారు. తన కడుపుకే తిండిలేక మాడుతున్న తల్లి స్తనంలో బిడ్డకు పాలెలా పడ్తాయి? తాను, ఘనాగొహరా ఎలానో ఆకులు, అలములు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటారు, కాని పసివాడో? పసివాడ్ని గుండెలకు అదుముకుని సంతకు బయల్దేరుతూండగా ఘనాగొహరా అడిగేడు – ”సంతలో యేం అమ్ముదామని బయల్దేరావు? పెరట్లో యేమీ మిగల్లేదు – మేకలు, కోళ్ళు, గుడ్లు, కూరగాయలు, గిన్నెలూ యేంలేవు, ఇక సంతకు వెళ్ళడమెందుకు? చిక్కి శల్యమైన నువ్వు, ఆకలితో కాలువ దాటి పదిహేను మైళ్ళు కాలినడకన వెళ్ళాలంటే తట్టుకోగలవా? ఇంతచేసి ఖడియార్‌ సంత చేరుకున్నా నీ మొహం చూసి యెవరైనా నీకు డబ్బుగాని, ధాన్యం గాని యిచ్చేస్తారా?”

ఝుముటి ఉదాసీనంగా అంది, ”నేను బతకడం, చావడం అటుంచు. పసివాడిని యెలా బతికించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఈ ఊళ్ళో కంసుడిలా రువు కాచుకుని ఉంది. నా ఒళ్ళోంచి పసివాడిని యెప్పుడెప్పుడు లాక్కెళ్ళదామా అని. సంతకు యెంతోమంది వస్తారు. ఏదైనా దారి దొరుకుతుందా అని చూస్తాను.” ఈ మాటలంటూండగా ఝుముటి గొంతు దుఃఖంతో పూడుకు పోయింది. ఆమె చిరుగుల చీర చూసి ఘనాగొహరా అన్నాడు, ”కడుపు కాలుతూ ఉండడమే కాక సిగ్గు కూడా విడిచేసావా? ఒళ్ళు కూడా సరిగా కప్పుకోకుండా సంతకి వెళ్తావా?” ఝుముటి కోపం, దుఃఖం, నిరాశతో నిండిన గొంతుతో అంది, ”సిగ్గూ శరమూ అటుంచు. ఆకలి బాధకు తట్టుకోలేక యేదో ఒక రోజు నా దేహాన్ని కోసి ఆ మాంసాన్ని తినేస్తాను, అంతే. నా యెముకల గూడుని ఎవరు చూస్తారు ఆ సంతలో? చూడు, ఓ చీరముక్క దొరికితే చాలు …..”

పసివాడ్ని గుండెల కదుముకుని ఝుముటి సంతకు బయల్దేరింది. ఘనా అన్నాడు ”వెళ్తే వెళ్ళు. ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేనిక యీ ఊళ్ళో ఉండను. కొద్దిగా బలం పుంజుకున్నానంటే నీమాట వినను, రాయ్‌పూర్‌ వెళ్ళిపోతాను. అక్కడ రిక్షా తొక్కినా, కూలీపని చేసినా ఓ ముద్ద తినేందుకు దొరుకుతుంది.” ఝుముటి అతని చేయి పసివాడి నెత్తిమీద పెట్టి అంది, ”పిల్లవాడి మీద ఒట్టు, ఊరు వదిలే మాటెత్తకు. సంతనుండి యేమైనా తెస్తాను. రిక్షా తొక్కడానికి నీకు శక్తి ఉందా?”

వెంటనే కొడుకు నెత్తిమీద నుండి చేయి తీసేసి ఘనా అన్నాడు, ”అరె, పసివాడి మీద యెందుకు ఒట్టేయిస్తావు? కరువు అందర్నీ మింగేసింది. వీడైనా సంతకెళ్ళేంత వరకూ ఉంటాడా చూడు.”

”నోట్లో శని ఉన్నట్లు ఎప్పుడు చూసినా అనరాని మాటలు అంటావు గదా. ఊరొదలి వెళ్ళిపోతానని ఎప్పుడూ బెదిరిస్తావు ఏదో నాకూ నా పిల్లలికీ తిండి పెడ్తూన్నట్లు -” అంటూనే ఝుముటి ఏడవసాగింది.

ఘనా పసివాడి లోతుకుపోయిన బుగ్గల్ని నిమురుతూ అనునయంగా అన్నాడు, ”సరే వెళ్ళు. పసివాడు జాగ్రత్త. అసలే దారి బాగా లేదు నువ్వు కూడా ఒట్టి మనిషివి కావు.”

అడవి దారిలో పసివాడ్ని గుండెల కదుముకుని అడుగులో అడుగులేస్తూ నడుస్తూంది ఝుముటి. కాలువలూ నదీ దాటింది. నడుస్తున్న కొద్దీ ఆమె నిశ్చయం అంతకంతకూ దృఢమౌతూ వచ్చింది. తను జీవించాలి, ఘనా జీవించాలి, పసివాడు కూడా ప్రాణాలతో ఉండాలి. బతికి ఉండాలనే కదా మనిషి జన్మ ఎత్తేది. ఆ రోజు అందుకే కదా వసుదేవుడు దేవకి కడుపులో పడ్డ బిడ్డను తీసుకుని నదిదాటి అడవులగుండా గోపపురం వైపు కాలినడకన వెళ్ళాడు. మనస్సులో ”నా కొడుకు కంసుడి బారిన పడకూడదు” అని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు గుండె రాయి చేసుకుని దేవకి తన కొడుకును వసుదేవుడి చేతిలో పెట్టింది. ”ఎక్కడున్నా ప్రాణాలతో ఉండనీ” అనుకుంది. అదే ఆమెకు కావల్సింది. ఝుముటిక్కూడా అదే కావాలి. దేవకిది తల్లి హృదయం. ఝుముటిది కూడా తల్లి హృదయమే! ఏమీ తక్కువ కాదు! ఝుముటి ఒడిలోంచి కూడా ఆరుగురు పసివాళ్ళను కరువు కంసుడు లాక్కెళ్ళాడు. ఒళ్ళోంచి పసి వాడిని లాక్కునేందుకు తరుముతూ వస్తున్నాడీ కరువు కంసుడు!

తన చిరుగుల చీర కొంగులో చుట్టి పసివాడిని జాగ్రత్తగా గుండెలకదుముకుని ఉంది ఝుముటి. పసివాడు నోటిని ఆమె యెండిన రొమ్ములకు కరుచుకుని నిస్త్రాణంగా ఉన్నాడు. బలహీనంగా ఉండడంతో రొమ్మును చీకలేక పోతున్నాడు- చీకినా ఆమె రొమ్ములో బొట్టు పాలైనా ఉంటేకదా! ఎండ తాకిడినీ గాలి జోరునూ లెక్క చేయకుండా ఝుముటి ముందుకు సాగుతూంది. ఆమె కాళ్ళకు అంత బలమెక్కడినుండి వచ్చిందో మరి!

ఖడియాల్‌ సంతలో ఇదివరకు కుండలు అమ్మింది ఝుముటి అప్పుడప్పుడూ కూరగాయలు, గుడ్లు, కోళ్ళు కూడా అమ్మింది. అయితే ఈరోజు ఆమె అమ్మదల్చుకున్నది ఇంక యేడు జన్మలైనా ఆమెకు దాన్ని అమ్మే పరిస్థితి రాకూడదు!

లోకులకు తెలిస్తే ఏమంటారు, ‘ఆమె తల్లా? రాక్షసా’ అని. అయితే ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకునే వాళ్ళెవరు? ఆమె ఊళ్ళో ఉన్నవారెందరో సంతలో అమ్ముడు పోయారు. వయసులో ఉన్న భార్యను భర్త అమ్మేడు, పెళ్ళికెదిగిన కూతుర్ని తండ్రి అమ్మేడు, కూతుళ్ళు, కొడుకులు, భార్యను వదలి పారిపోయిన వారున్నారు. వారి ఊళ్ళోని రమ సంసారం చేయక ఎక్కడికో వెళ్ళిపోయింది. రమ ఇంట్లో వయసుకొచ్చిన ఆడపిల్ల, ఒడిలో పసికందు, అప్పుడే నడక నేర్చిన బిడ్డ ఉన్నారు. ఎక్కువ డబ్బులొస్తాయని వయసొచ్చిన ఆడపిల్లని అమ్మేసింది. చిన్నదాన్ని అమ్మితే అన్ని డబ్బులు రావు. ఇద్దరు పిల్లలూ, తనూ ఇంకొన్నాళ్ళు వెళ్ళదీయవచ్చు. ఇంకొకామె ఆడబడుచుని వంద రూపాయలకమ్మేసింది. ఝుముటికి కూడా ఆడపిల్ల ఉంటే ఆమెను అమ్మేసి కొడుకుని కాపాడుకునేది. కాని ఇప్పుడు వేరే గత్యంతరం లేదు. ఆమె బతకాలి, కొడుకు కూడా బతకాలి. ఆ ఉద్దేశంతోనే ఆమె ముందుకు సాగింది. దేవకి కొడుకుని గోపపురానికి పంపినప్పుడు ఆమె మనస్సులో కూడా తన కొడుకు ప్రాణాలను కాపాడుకోవాలన్న కోరిక ఉండలేదా? ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని సాక లేకనే తల్లులు గర్బస్రావం చేసుకుంటు న్నారు. దాంట్లో జీవహత్య లేదంట, దేశ కళ్యాణం అవుతుందంట. అయితే ఆమె జీవహత్య చేయడం లేదు, జీవాన్ని కాపాడుకోవాలనే ఈ దారి యెంచుకుంది.

దారి పొడుగునా ఝుముటి తనకు తాను నచ్చచెప్పుకుం టూంది. తాను చేయబోయే పనిని సమర్థించుకుంటోంది. తాను చేయబోయే పనిని సమర్థించు కుంటోంది. పసివాడి మృత శరీరాన్ని పొదలమాటున పూడ్చిపెట్టే బదులు వాడ్ని యశోదమ్మ చేతిలో పెట్టడమే సబబని పదే పదే మనస్సుకి నచ్చజెప్పుకుంటూంది.

ఖడియాల్‌ సంత దగ్గర ఎవరో పెద్దమనిషి మగపిల్లవాడు దొరుకుతాడా అని ఆతృతగా యెదురు చూస్తున్నాడు. దేవుడు అతనికి పిల్లల్ని ప్రసాదించలేదు. అనాథ పిల్లడ్ని దత్తత చేసుకుందామని అనుకుంటున్నాడు అని సంతనుంచి తిరిగి వస్తున్నవారి దగ్గర వినింది ఝుముటి. పెద్దమనిషి ఖడియాల్‌ మిషనరి ఆస్పత్రికి వచ్చి అనాధ పిల్లలు దొరుకుతారేమో వాకబు చేసేడంట. ఇప్పటి వరకు అతని ఆశలు అడియాశలయ్యాయి. ఆయనకు కొడుకు కావాలి, ఝుముటికి ప్రాణాలు కాపాడుకోవాలని ఉంది. ఆ ఆశతోనే ఖడియాల్‌ సంతకు వచ్చిందామె. ఇంకొన్ని నెలల్లో తిరిగి తల్లి అవడం ఆమెకేమీ గొప్ప కాదు. కాని ‘అమ్మా’ అని పిలిపించుకొనే వరకూ పసివారు ప్రాణాలతో ఉండడమే గొప్ప. ఆ విషయాన్నే పదే పదే ఆలోచిస్తూంది ఆమె.

తృటిలో పని జరిగిపోయింది. పసివాడ్ని దొరసాని చేతిలో పెట్టినప్పుడు ఝుముటికి పేగులు నులిమినట్లు అనిపించింది. కడుపులో పసికూన అంటూన్నట్లుంది ‘నన్ను కూడా ఇలానే పరాయి బిడ్డగా చేసేస్తావా, అమ్మా?’

దొరసాని కాతర స్వరంతో అంది ”బాధపడకు. నీ కొడుకు బాగుంటాడు. ఈ రోజునుండి వాడు నా కొడుకు.” పిల్లవాడ్ని ముద్దులు చేస్తూ ఆమె చటుక్కున ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఝుముటి పాపిష్టి కళ్ళు వాడిమీద పడకూడదన్నట్లు!

దొరగారు ఓ గట్టికోక, ఎనభై రూకలు ఝుముటి చేతిలో పెట్టారు. ఆమె యెప్పుడూ ఇంత డబ్బు చూసి ఉండలేదు. అప్పుడు కూడా ఆమె అనుకుంది, ఆడ కూతుర్ని చూసి పెద్ద మనిషి మోసగించాడని. గొడ్లు, మేకలు, గొర్రెలు అమ్మితే యెంత డబ్బులొస్తాయి! కాని మనిషి కూన, అందులో మగ పిల్లవాడు, వాడి ఖరీదు ఓ చీరా, ఎనభై రూపాయలేనా? కాని పసి వాడిని పెట్టుకుని బేరమాడ్డానికి ఆమెకు మనసొప్పలేదు. పెద్దమనిషి పిల్లవాడ్ని తీసుకుపొమ్మంటే! అప్పుడు తిరిగివెళ్తూ వాడ్ని ఏ పొదలమాటునో గొయ్యితవ్వి పూడ్చాల్సి వస్తుంది.

పెద్దమనిషి ఝుముటిని తేరిపార జూసి అన్నాడు, ”పసివాడు చాలా బలహీనంగా ఉన్నాడు. మందులకు చాలా ఖర్చవుతుంది. నా దగ్గర యింక డబ్బు లేదు, పిల్లవాడి చికిత్సకోసం కొంత పెట్టుకోవాలి కదా?”

పసివాడి చికిత్స గురించి వినగానే ఝుముటి అంది, ”వద్దులే బాబు గారు, నాకింత డబ్బు చాలు. నా తండ్రికి చికిత్స చేయించండి, కడుపునిండా తిండి పెట్టండి, ఆ మాట చెప్తేచాలు తృప్తిగా తిరిగి వెళ్ళిపోతాను.”

లోపల్నుంచి దొరసాని కేకలేసింది ”నా కొడుకు గురించిన ఆలోచన్లు నీకు వద్దు. వాడ్ని నేను అశ్రద్ధ చేస్తానని అనుకుంటున్నావా? వెళ్ళు, వెళ్ళు. తిరిగి అంతదూరం కష్టపడి వెళ్ళాలి నువ్వు. కొడుకు గురించిన చింత వదిలేయి. వాడికి మంచిది కాదు. ఇంకా విను. ఇక నువ్వు ఈ వైపుకి రాకూడదు.”

ఝుముటి తిరుగుముఖం పట్టింది. పసివాడ్ని ఇంకొక్క మాటు చూడాలని అనిపించినా అడగడానికి ధైర్యం చాలలేదు. పరాయి పిల్లవాడి మీద తనకిక యేమధికారం ఉందని? దొరసాని ఆమెను సాగనంపాలన్న తొందర్లో ఉందని గ్రహించడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. పాపం! పసివాడ్ని తిరిగి ఇచ్చేయమని ఝుముటి అడుగుతుందని భయమో యేమో! వెనక్కు వచ్చేస్తుంటే లోపల్నుంచి పసివాడు మెల్లగా ఏడుస్తున్నట్లు అనిపించింది. ఝుముటి గుండెల్లో బాణం దిగినట్లయింది. అడుగు వెనక్కు వేస్తూనే అది తన భ్రమ అని తెలుసుకుంది. పసివాడికి తనింక తల్లి కాదు, తల్లి కన్నా వాడిని యెక్కువగా ప్రేమిస్తే అది రాక్షసత్వం.

దారి పొడుగునా పసివాడి యేడుపు వినిపిస్తున్నట్లే ఉంది ఝుముటి చెవులకు, తప్పకుండా వాడు తనకోసం తన చేతులకోసం, పెదాలకోసం, తల్లికోసం వాపోతున్నాడని అనుకుంది. లేకపోతే ఎందుకేడుస్తాడు? కన్నీళ్ళని ఆపుకోలేక పోయింది. తన ఒడిలోనే ప్రాణాలు పోతే బాగుణ్ణేమో? తల్లీ కొడుకులిద్దరూ ఒకేసారి దీర్ఘ నిద్రలోకెళ్ళిపోతే బాగుండేది. ఎందుకిలా చేసింది తాను? బతికి ఉన్నంత కాలం పశ్చాత్తాపపడేట్లు, గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లు చేసిన పని అది. కాని, పసివాడిని ఆకలితో మాడ్చి చంపడం సబబేనా? ఇంకెవరి దగ్గరైనా సుఖంగా ఉంటే చాలదా? తన కాళ్ళమీద నిలబడతాడు. శ్రీకృష్ణుడు కంసుడి బారినుండి బయటపడి విరాజిల్లినట్లు తన కొడుకు కూడా బాగుపడడని ఎందుకు అనుకోవాలి?

దూరం ఎంతకీ తగ్గట్లేదో, ఝుముటి కాలివేగం తగ్గిందో తెలియట్లేదు. కడుపులో యేదో కెలికినట్లు అనిపిస్తూంది. ఏదో తెలియని వేదన, కోపం. తనపైనో పరిస్థితులపైనో తెలియలేదు. దొరసాని మీద మనస్సు ఈర్ష్యతో నిండిపోయింది దొరగారి యింట్లో ధాన్యం ఉందని. ప్రసవవేదన అనుభవించకనే ఈరోజు ఆమె పిల్లవాడికి తల్లి అనిపించుకుంది. కాని ఏడుగురికి రక్తమాంసాలు పంచి ప్రసవవేదన సహించి కనినా ఈ రోజు ఆమె ఒడి శూన్యం.

మరుక్షణం ఝుముటి మనస్సు స్త్రీ సహజమైన అభిమానంతో నిండింది. కడుపులో అష్టమ సంతానం పెరుగుతూంది. ఇంకొన్ని నెలల్లో తిరిగి తల్లి కాబోతూంది. అష్టమ సంతానం తప్పక దైవాంశతో కూడినదవుతుంది. అనాహారం, దారిద్య్రాల కంసుడ్ని వధిస్తుంది. అది పుట్టిన తర్వాత యిక ఊళ్ళో కరువు కాటకాలుండవు. ఎవ్వరూ ఆకలికి తట్టుకోలేక పిల్లా జెల్లల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదు. కడుపులో కాయకాసిన దగ్గర్నుండి ఆమెకు అనిపిస్తూంది, ఇక ఊరికి మంచి రోజులు వస్తాయని ఇక తిండీ గుడ్డలకు లోటుండదని, ఎనిమిదవ సంతానాన్ని ఎలా పెంచి పెద్ద చేయాలన్న ఆలోచనలతో ఝుముటి పసిపిల్లవాడ్ని అమ్ముకున్న దుఃఖాన్ని మరచిపోయింది. పదే పదే అనుకుంది ఆకలి బాధతో చచ్చిపోయినా సరే, యిక యీ ఎనిమిదవ పసికందుని అమ్ముకోకూడదని. ఏదో తెలియని అనుభూతితో ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది. ఏదో బాధ క్రమేపీ శరీరమంతా వ్యాపించింది. కాళ్ళలో వణుకు మొదలైంది. క్షణంలో తెలివి  తప్పి పడిపోయేట్లయింది. పొత్తి కడుపులోనూ నడుములోనూ ఏదో విచిత్రమైన బాధ లోపల్నుంచి విద్రోహచర్య జరుగుతున్నట్లుంది. ఆ విద్రోహ చర్యేంటో ఝుముటికి తెలియక కాదు. స్త్రీ జీవితంలో అనుభవించే అతి తీవ్రమైన నొప్పితో ఆఖరికి ఆమె కింద పడిపోయింది కళ్ళు బైర్లు కమ్మాయి, తనలో తానే అనుకున్నట్లు అంది, ”లేదు. ఇలా జరగకూడదు. అష్టమ సంతానం యిలా శూన్యంలోకి వెళ్ళి పోకూడదు. దేవ శిశువు బయటికి వచ్చే సమయం ఇంకా రాలేదు. అర్థం చేసుకోరా తండ్రీ. ఊళ్ళో యింకా కరువు కంసుడు తాండవం చేస్తున్నాడు- నువ్వు రావడానికి యింకా సమయముంది…” నొప్పి, బాధతో కాదు గాని యేదో వేదనతో ఆమె కంపిస్తూంది. కళ్ళు రెండూ విప్పారాయి లోపల జరుగుతున్న అలజడి, భారం ఒక్క సారిగా ఆగిపోయింది. అలసటతో ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ఒక్కసారిగా ఆమె శరీరం శాంతించినట్లు అనిపించింది. ఎప్పట్లాగానే ఓ సన్నని శిశువు యేడుపు వినిపిస్తుందని అనుకుంది. తిరిగి తల్లి అయిన గౌరవంతో హృదయం నిండి పోతుందని అనుకుంది.

కాని అదేం జరగలేదు. నవ జీవిత శిశువు ఏడుపు అడవి బాటలో వినిపించలేదు. కాని ఎదలో తన్నుకొస్తున్న దుఃఖంతో ఝుముటి అలసట మరిచిపోయి లేచి కూర్చుంది. ఆమె కాళ్ళకింద రక్తస్రావం. రక్తం మధ్య నిర్జీవ మాంస పిండం ఆమె కలలన్నిటినీ విచ్ఛిన్నం చేస్తూ కనిపించింది. హరించి పోయిన మాతృత్వాన్ని చూసి వికట్టాసం చేస్తూంది. ఆ అష్టమ సంతానం, దేవ శిశువు మాతృ గర్భం చీల్చుకుని బయటపడి ముక్తి చెందింది. ఆ నిర్జీవ మాంస పిండంలోంచి ఆకాశవాణి వినిపించింది – ”మానవ శిశువు జన్మ తల్లి ఒడిలో లాలన పొందడానికి. ఓ చీరముక్క, ఎనభై రూకలకు అమ్ముడు పోవడానికి కాదు. కూరగాయలు, మేకలు, గొర్రెలు, గొడ్డు, కోళ్ళు కన్నా మనిషి కూనకు ఇంత తక్కువ వెల ఉన్న ప్రపంచం నాకొద్దు-”

దేవ శిశువు వాక్కు ఝుముటికి అర్థం కాలేదు. ఆవేదనతో ఆ మాంస పిండాన్ని ఓమారు చూసి రక్తసిక్తమైన పాదాలను వెనక్కు తీసుకుంది. చీరనూ, కొంగులోని రూకల కట్టనూ గట్టిగా గుండెలకదుముకుని మెల్లగా లేచింది. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. శరీరం తేలిగ్గా అనిపించింది. గర్భంలోని అష్టమ సంతానం లాగానే ఈ ప్రపంచం మిథ్య అని అనిపించింది. సత్యం కేవలం తిండి, గుడ్డ, ప్రాణాలు కాపాడుకోవడం మాత్రమే.

చీరనూ, డబ్బు కట్టనూ జాగ్రత్తగా పసికందులా పొదివి పట్టుకుని నడక వేగాన్ని హెచ్చించింది ఝుముటి. సంతానాన్ని కోల్పోయి ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. ఆమెకు తెలుసు సంవత్సరం పొడవునా తిండి దొరకకపోయినా సంవత్సరానికి ఒకసారి తల్లికావడం సులభమని.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.