బి.ఎస్‌. రాములు కథల్లో స్త్రీలు ‘ఆకాశంలో సగం’ కన్నా ఎక్కువ – విహారి

బి.ఎస్‌. కథల మూలాలన్నీ తెలంగాణ పల్లెపట్టుల్లో ఉన్నాయి. ఈ కథల నిండా గ్రామీణ జనజీవనం తొణికిసలాడింది. అందునా కుల వృత్తుల వారు, ప్రత్యేకించి నేత పనివారు – తమ ఛిద్ర జీవితాల్ని చెప్పుకుంటారు. పట్టణ మధ్యతరగతివారు తగిలినా, వారి ‘కుదుళ్ళు’ గ్రామాల్లోవే. వారంతా పొట్ట చేతపట్టుకుని ఎక్కడికో చేరిన వారే. వారిలో కొందరు తమ జీవితాల్ని సాధించి గెలుచుకున్న ధైర్యస్థులు.

బి.ఎస్‌. కథల్లో మహిళల స్థానం

ఈ మానవ రాశిలో – ఒక ప్రత్యేకభాగం – స్త్రీజన సమూ హం. ఆ సమూహంలోని ప్రత్యేక వ్యక్తుల్ని బయటికి పిల్చి, పలకరించి, మాట్లాడి అక్కున చేర్చుకుని, కన్నీరు తుడిచి, ఆశలు నింపి – తన వాళ్లను చేసుకున్న ఘనుడు బి.ఎస్‌. తన మానవీయ విలువల ప్రేరణని వారిలోనూ ప్రోదిచేసి ధైర్యం గొలిపిన రచయిత ఆయన.
అందుకనే బి.ఎస్‌. స్త్రీ పాత్ర చిత్రణలో ఎక్కడా ఉద్వేగమూ, ఉద్రేకమూ కనిపించవు. ఉద్విగ్నత ఉంటుంది. ఉత్తేజమూ ఉంటుంది. అలాగే ఆయన సృజించిన ఎక్కువ మంది స్త్రీలు హడావిడి చేయరు. ఆడంబరాల్ని గలగలలాడించరు. ఒదిగి, అణుకువతో, పొందికగా వుంటారు. దీనికి కారణం కథకుడిగా బి.ఎస్‌. బాగా అందుకున్న సామాజిక తాత్త్వికత దృక్పథం. వాస్తవిక సమాజ జీవితం నుండి తానెన్నుకున్న జీవితవాస్తవికతని ప్రతిబింబించే స్త్రీలందరూ కూడా ఆయన లాగే బతుకు పట్ల ఒక తాత్త్విక దృష్టిని సముపార్జించుకున్న వారే. అలాగే వారందరి హృదయ స్పందనలూ రచయిత హృదయ స్పందనలతో తాదాత్మ్యం చెందినవే!

అందుకనే బి.ఎస్‌. కథల్లో స్త్రీ పాత్రలన్నీ సంస్కార భరితంగా కనిపిస్తాయి. ప్రత్యేక పాత్రలుగా కథల్లోనికి వచ్చి తిరిగి, మాట్లాడి, అనుభవాలు భరించి చదువరుల్ని రసానుభూతికి లోను చేసిన ఆ స్త్రీలంతా సమాజంలో మన చుట్టూ మెదులుతున్న  సాధారణ స్త్రీలకి ప్రతీకలు! వారంతా బి.ఎస్‌. పరిశీలనాశక్తికీ, అధ్యయన శక్తికీ కూడా ప్రతీకలు! వస్తు గ్రహణం చేసేటప్పుడే ఆయన పాత్ర స్వీకరణనీ – అర్ధయుక్తంగా ఎన్నుకుంటారు. అందుకనే ఆ స్త్రీ పాత్రల స్వభావం, ఆలోచన, ప్రవర్తన అంతా సహజత్వంతో నిండి వుంటాయి.

కాలం తెచ్చిన మార్పు, చికాగోలో నాన్నమ్మ, గెలుచుకున్న జీవితం కథా సంపుటాల్లో బి.ఎస్‌. రాములు తన స్త్రీ పాత్రలన్నింటినీ – ఏదో ఒక కోణంలో ఏదో ఒక పార్శ్వంలో, మూర్తీభవత్‌ చైతన్యమూర్తులుగా చేశారు. కాకుంటే, అక్కడక్కడా – సంఘంలోని మామూలు మనుషుల్లో కానవచ్చే మానవ బలహీనతల్ని కూడా సహజత్వం కూర్పుతో కొన్ని కథల్లోని స్త్రీ పాత్రల్లో నిలిపారు. ఇది కూడా వాస్తవిక దృక్పథం నుంచి వెలువడిన గుణవిశేషమే!

బి.ఎస్‌. కథానికల్లో ఒక వెలుగు వెల్లువ – వరలక్ష్మి

సాహిత్య ప్రపంచాన్నంతా ఒక కుదుపు కుదిపిన స్త్రీవాద సందర్భంలో – వరలక్ష్మి పాత్రని ఇంత ‘డొసైల్‌’గా, ఇంత సంప్రదాయక బాధా సహిష్ణువుగా ఎందుకు సృజించారు. అనే ప్రశ్న మన మేధలో మొలకెత్తుంది. నేను తీవ్రంగా, దీర్ఘంగా ఆలోచించాను. దీనికి ఒక కారణం ఈనాటి సామాజిక వాస్తవికత! సంఘంలో ఇప్పటికీ వున్న శత సహస్ర వరలక్ష్ములు !

రెండవ కారణం : ఈ కథ గురించి బి.ఎస్‌ – ” ప్రతి కుటుంబం ఒక తరం సోషలిస్టు సమాజాన్ని, సామాజిక న్యాయాన్ని ఆచరిస్తుంది. పెంచి పోషిస్తుంది. మలితరం దాన్ని వదిలివేయడం వల్ల అసమానతలు పెరిగే క్రమాన్ని చిత్రించడానికి ఈ కథా వస్తువుని తీసుకున్నాను. అని చెప్పారు.

ఈ వస్తు స్వీకరణ ఉద్దేశానికి అనుగుణంగా తన ఇతివృత్తాన్ని కేంద్రీకరించలేకపోయారు రచయిత. ఒక ఉద్వేగంతో కథాచిత్రణని చేసేటప్పుడు ప్రతి రచయితకీ ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఇక్కడ ఈ కథలో ఆ ప్రమాదం  ఒక విధంగా ‘మంచి’ కే జరిగింది. రచయిత ఫోకస్‌ అంతా వరలక్ష్మి మీదకి ప్రసరించింది. తెలుగు కథాసాహిత్యానికి ఒక నిక్కమైన నీలంగా అందింది.

‘వరలక్ష్మి’ కథ.

బి.ఎస్‌. కథల్లోని స్త్రీ పాత్రలన్నీ – ‘మనిషికి ఎన్ని వికారాలు, ఆశాపాశాలూ వున్నాయో, వాటన్నింటినీ ప్రదర్శిస్తూ వుంటాయి. ఆ పాత్రల్ని మలచటానికి వాస్తవికత పట్ల బి.ఎస్‌. కున్న నిబద్ధతే కారణం. మరో ముఖ్యమైన అంశం – స్త్రీ పురుష సంబంధాల్లో – ‘ఉన్నదీ, ఉంటున్నదీ, ఉండవలసినదీ ఏమిటీ’ అనే వాటిపై నిశ్చితాభిప్రాయం ఉంది బి.ఎస్‌.కి.స్త్రీ పాత్రల్ని చిత్రించటంలో ఆయన వాంఛితం వారిని చైతన్యవంతులుగా చూడాలని!

ఈ భావ భావనల ప్రతిఫలనాన్ని ఈ క్రింది కథల్లోని స్త్త్రీ పాత్రల చిత్రణలో దర్శించవచ్చు.

‘చుట్టరికం’లో భూదేవి

భూదేవి భర్త చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు పట్నంల చదువులకని పోయి అక్కడే పిల్లను చేసుకున్నాడు. ఆ పెళ్ళితో పల్లెల్తో తల్లి పేగుతో సంబంధం తెగిపోయింది. ఇప్పుడు నిర్మల పెళ్ళి చేయాలి. ఆ పిల్లకి చదువు మీద శ్రద్ధ. పదోతరగతిలో ఉంది. గంగత్త కొడుకు మేనబావ గంగాధర్‌తో పెళ్ళి ఖాయం అని వూరిమాట. అందరి మాట కూడా అదే. గంగవ్వ వచ్చి ఈ ప్రసక్తి తెచ్చి ”మేం చేసుకోకపోతే మళ్ళీ మీకు (కాలేజీ సదివిన) యింత మంచి పిల్లగాడు దొరకడు” అని వ్యవహారం చక్కదిద్దబోయింది. భూదేవి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందాన అయింది.

ఆర్థికంగా చితికిపోయి, ఏ అండదండలూ లేని భూదేవి, చదువుకోవాలనే కోరికతో వున్న ఆమె కూతురు నిర్మల, వీరికి సహాయం చేయాలనే మనసున్న గంగవ్వ – ఈ మూడు పాత్రల అంతఃకరణని ఈనాటి సామాజిక వాస్తవికతతో, అత్యంత క్లుప్తతతో, అసామాన్యమైన శిల్పంతో చిత్రించారు బి.ఎస్‌.

”ప్రతిభావంతుడైన రచయిత చేతిలో సాదాసీదా కథా వస్తువు కూడా అత్యద్భుత కళాఖండంగా రూపొందుతుంది. విస్తృతమైన లోకజ్ఞత, ఉన్నతమైన భావసంస్కారం, మంచిని మానవతను ప్రేమించే హృదయనైర్మల్యం, అనేవి రచయితను విశిష్ట కథకుణ్ణిగా తీర్చిదిద్దగలుగుతున్నాయి. కథా పఠనమనగా కథకుడి దృక్పథంలో నుంచీ కంటికి కనిపించే బాహ్యప్రపంచంతో బాటు, బుద్ధికి మాత్రమే అందే పాత్రల మనో ప్రపంచాన్ని గూడా తిలకించడమే! అనుభవాన్ని ఏ మేరకు ఒక మరువరాని మధురానుభవంగా తీర్చిదిద్దగలదో, ఆ మేరకు కథానిక – సాహిత్య ప్రపంచంలో కాంతులీనుతూ జీవించి ఉంటుంది” అంటారు మధురాంతకం రాజారాం, సింగమనేని నారాయణ జంటగా ఒకచోట. ‘చుట్టరికం’ ఆ లక్షణాల సమాహారం!

‘బందీ’ కథలో రేణుక

రేణుక పాత్ర పైకి ఒక పాత్రలా కనిపిస్తుంది. కానీ ఆంతర్యాన్ని  వింగడిస్తే ఆమెది అభిజాత్య నిస్సహాయత అని అర్థమవుతుంది. తనను ప్రేమించి, తానే కావాలనుకుంటున్న కథానాయకుడు, కిందకులం వాడు, ఆర్డీవో అయినా అతని కంటే  ఆమె ఎక్కువ కులంలో పుట్టింది. తనకు ఉద్యోగం, అంతస్థూ వున్నాయి. తల్లిందడ్రుల మనసుల్లో తన ప్రేమికుడి పట్ల గల చులకన అభిప్రాయాలూ తెలిసిన యువతే. అంతో ఇంతో సంస్కారమూ, సమాజంలో ఈనాటి ఆడపిల్లల తీరుతెన్నులూ ఎరిగిన యువతే. కానీ ప్రతిఘటన తత్వం లేదు. స్టేజీ మ్యారేజి చేసుకోమనీ పెళ్ళయ్యాక అన్నీ సజావుగా జరిగేట్టు చూసుకుంటామనీ అనే అమ్మానాన్నల మాటల్ని నిరసించదు. తన ప్రేమికుని ప్రతిపాదనలకి మద్దతు యివ్వదు. ఆ ధైర్యం లేదామెకు, అయితే, అతన్ని మరచిపోదు. మల్లికతో అతని పెళ్ళయినా అప్పుడప్పుడు వచ్చిపోతూ వుంటుంది కూడా. ‘ఇద్దరూ హాయిగా అక్కచెల్లెళ్ళుగా కల్సిపోయారు’ అంటాడు రచయిత. కానీ ఆమె అంతరాంతరాల్లో కులాధిపత్యం వున్నది. అందుకనే పరిస్థితులు వికటించాయి.

కథా పరిధిలోకి ఇతివృత్తాన్ని కేంద్రీకరించిన విధానంలో కథానాయకుడి పాత్రని ఉన్నతీకరించటానికి మాత్రమే రచయిత రేణుక పాత్రని ఆ విధంగా ఆవిష్కరించారనుకోవాల్సి వస్తుంది. సహజత్వానికి కొంత దూరంగా జరిగింది ఆ పాత్ర ప్రమేయం. ‘ఈ కథ ఇలాగే జరుగుతుంది’ అనే భావనని నొక్కి వక్కాణించటానికి ఉద్దేశ్య పూర్వకంగా రచయిత రేణుకకి నిష్క్రియత్వాన్ని ఆపాదించారనిపిస్తుంది. ఆమె పెళ్ళి చేసుకోకుండా నిలిచిందన్న సూచన ఆమె ప్రేమ – నిక్కమైనదనే భావాన్ని వెల్లడిస్తుంది. (మూడు సంబంధాల్ని తిరగ్గొట్టింది.)

రచయిత అంతరాంతరాల్లో ఆ విధంగా ఆమె పాత్రపట్ల వున్న రవ్వంత సానుభూతిని తెలియజేస్తుంది.

‘విడాకులయ్యాక’ కథలో మొదటి భార్య

‘నేను’ (మొదటిభార్య) పాత్ర – స్త్రీ సామరస్య ధోరణికి ప్రతీక. తన సవతికి ఆమె చెప్పే గాథ అంతా ఆమె కరుణాంతరంగాన్ని ఆవిష్కరించింది. ఆమె గతజలసేతుబంధనాన్ని చేయకుండా చేసింది. సమాజంలో మగవాడి ఆధిపత్య ధోరణిని చెప్పకయే చెప్పింది.

ఈ కథ చివరి పేరాలు, ఆమె స్వభావాన్నీ తత్త్వాన్నీ పారదర్శకం చేశాయి చూడండి.

”నేనిప్పుడు సుఖంగా ఉన్నాను… హాయిగా సంతోషంగా ఉన్నాను.. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాను… నా ఆలోచనలు నా భావాలు నావే.. నా మంచి చెడ్డలు.. కీర్తి ప్రతిష్టలు నావే.. నాపై అధికారం నాదే.. నాపై ఇప్పుడు ఎవరి నీడలూ లేవు… మునుపటిలా ప్రతి చిన్న దానికీ చలించిపోయేదాన్ని కాదు నేను…

విడాకులు నాకు తెగువనిచ్చాయి…. నా సొంత ఆలోచనలు వికసించాయి. నా స్వాతంత్య్రం విచ్చుకుంది… నిన్నటి ఉదయం మసక బారింది. నేటి ఉదయం నా కళ్లకు కొత్త వెలుగు నిచ్చింది….. విడాకులయ్యాక … అతని చెడ్డతనం గురించి చెప్పకుండా ఉండడం దేనికి…

అతనిలో నా పట్ల పశ్చాత్తాపం కలిగితే… జరిగిందానికి అందరిముందు తప్పు తనదేనని క్షమాపణ కోరడం…. సందర్భోచిత సందర్భం…. కలిసి జీవించకపోయినా,.. స్నేహితురాలిగా కలిసి నడవవచ్చు…. అప్పుడు రసోత్పత్తి విధానం మారుతుంది.

మీరైనా సుఖంగా ఉండండి… మాలాగా అనుభవ రాహిత్యంతో … అహంకారంతో .. ఇగోతో …. ఆధిపత్యంతో .. నాదే సాగాలనే.. అభిజాత్యంతో చేసుకున్న దూరాలు … అవిజ్ఞాపకాలు అని… నవ్వుతూ కలబోసుకోండి.. నాతో కూడా అలా కలబోసుకున్నప్పుడు చేసిన తప్పులు ఒప్పుకున్నపుడు … కలిసి స్నేహితులుగా … ఎవరి సంసారాలు వాళ్ళుగా మళ్ళీ జీవించవచ్చు…. అది ఇతరులకు ఆదర్శమవుతుంది. నా యవ్వనం …. నాజీవితం నాకు మళ్ళీ రాకపోయినా… నాలాంటి స్థితి మరొకరికి కలగకుండా… లోకం గుణపాఠం నేర్చుకుంటుంది…”

అంటే – కుటుంబ వ్యవస్థ మనుగడకి భార్యాభర్తల మధ్య సదవగాహనా, సర్దుబాటూ, పరస్పర వ్యక్తిత్వ గౌరవం ఆవశ్యకమనే సందేశాన్ని ఇవ్వదలచారు బి.ఎస్‌. స్త్రీ తన వ్యక్త్తిత్వాన్ని చంపుకుని, స్వాతంత్య్రాన్ని బలిపెట్టి అలాంటి మనుగడకి పూనుకోనఖ్ఖర్లేదనీ స్పష్టంగా చెప్పారు. ‘జానకి విముక్తి’ నవలలో రంగనాయకమ్మ అంటారు, ‘స్త్రీల సమస్యల మీద స్త్రీలకు సరైన జ్ఞానం కలగటం అంత అవసరమే’ అని. ఈ జ్ఞాన ప్రదానమే ఈ కథలోని ‘నేను’ ఉద్దేశ్యం!

‘చేయూత కథలో అరుణ, లలిత

ఈ కథలో అరుణ, లలిత – రెండు అద్భుతమైన, చైతన్యవంతమైన పాత్రలు. లలితది ఉత్సాహ, ప్రోత్సాహకరమైన పాత్ర. ఆమె ఆచరణాత్మక వేదాంతి. జీవితాన్ని గెలిచిన పాత్ర. అరుణనీ తనంతదాన్ని చేస్తుంది. అరుణని మానసికంగా ఆత్మన్యూనతా భావన నుంచీ, భౌతికంగా ఇక్కట్ల బతుకు నుంచీ బయటకి తేవడానికి అన్నివిధాలా చేయూతనిచ్చిన పరిపూర్ణ వ్యక్తిత్వం గల పాత్ర లలిత. అరుణ, లలిత – ఇద్దరి పాత్రల్నీ – స్త్రీ చైతన్యాకాంక్ష నిబద్ధతతో తీర్చిదిద్దారు. బి.ఎస్‌.

‘వాళ్ళు గెలుచుకున్న జీవితాలు’ లో  కరుణక్క, లక్ష్మి

ఈ రెండు పాత్రలు ఆత్మవిశ్వాస మూర్తులు. ఇద్దరూ రాజాకీయాల్లో స్త్రీల విజయానికి ప్రతీకలు. రాజకీయాల్నీ సామాజికాంశాల్నీ తడువుతూనే, కుటుంబ విషయాన్నీ, మానవ సంబంధాల్నీ ప్రస్తావించిన స్త్రీలు వీరు. నేటి పరిస్థితి గురించే కాక, రేపటి అభ్యుదయం వైపు కూడా చూపు పెట్టినవారు.

‘లక్ష్మమ్మ గెలుపు’, ‘పెన్షనర్‌’ కథల్లోని లక్ష్మమ్మ, మాధవి

లక్ష్మమ్మ, మాధవి ఇద్దరూ వయసు మళ్ళిన స్త్రీలుగా అనుభవశాలురు. సంసారంలో ఢక్కామొక్కీలు తిన్నవారు. అలాంటి వారు ఆర్జించుకున్న జ్ఞానం గడించుకున్న అనుభవం ముందు తరాలకి ఎంత ప్రయోజనకరంగా అందాలో నిరూపించారు.

‘విలువలు’ కథలోని సరోజ,స్వప్న, స్వరూప

ఈ మూడు పాత్రలు వర్తమాన సామాజిక సందర్భంలో గోచరిస్తున్న స్త్రీల పరిస్థితికి దర్పణం పడతారు.

‘అన్ని విలువలకు అతీతంగా ప్రేమించే క్షమించే మాతృమమత’ సరోజది. ఎందరి జీవితాల్నో తీర్చిదిద్దిన ఉన్నత వ్యక్తిత్వం ఆమెది.

”స్వరూపా! ఇండియాలో శీలం అని పిలిచే విలువలు ఎంత అర్థరహితమైనవో!.. ఇప్పుడిపుడే తెలుస్తున్నాయి. అమెరికా సమాజం ఎంత హాయిగా జీవిస్తుందో గమనిస్తే… ప్రపంచమంతా ఇంత స్వేచ్ఛా సమాజంగా మారితే ఎంత బాగుండేదో … ఎన్ని సమస్యలు పరిష్కరించబడేవో… కుటుంబం పేరిట పెళ్ళి పేరిట ఇండియాలో కొనసాగుతున్నది, స్త్రీల ఏకపక్ష బానిసత్వమే తప్ప మరొకటి కాదు. ఇండియాలో మగవారికి ఒక నీతి, ఆడవారికి ఒక నీతి. మగవాడు, నాకు పది మంది స్త్రీలతో సంబంధం వుంది అని చెప్పుకోవడం గొప్పగా ఫీలవుతాడు. ఇదే మాట ఆడవాళ్ళు చెప్తే తిరుగుబోతు అంటారు. ప్రతి మగవాడు తన భార్య పతివ్రత అంటాడు. అనుకుంటాడు. అందరి భార్యలూ పతివ్రతలైతే, మరి ఈ మగవాళ్ళు ఎవరితో తిరిగినట్లు? మగవాళ్ళు చెప్పుకుంటారు, ఆడవాళ్ళు చెప్పుకోరు… అని కుండ బద్దలు కొట్టినట్లు ఒక ప్రజాకవి ఎప్పుడో చెప్పాడు. ఈ ద్వంద్వ ప్రమాణాలు మగవాళ్ళకు గౌరవాన్ని పెంచి, ఆడవాళ్ళకు అవమానాన్ని మిగులుస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థ జైలు కన్నా హీనం. యూఎస్‌లో నీ స్వేచ్ఛను అపారంగా గౌరవిస్తారు. వారి స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. స్వేచ్ఛకు స్వాతంత్య్రానికి స్వయం నిర్ణయానికి అపారమైన విలువనిస్తారు.

మన సమాజంలో కుల మత ప్రాంత వైవాహిక, కుటుంబ వ్యవస్థల విలువలు, గౌరవాలు, సంస్క ృతికి అతీతంగా మనిషిని గుర్తించడం, గౌరవించడం జరిగినప్పుడే నిజంగా మనిషిని చూసే చూపు మనకబ్బుతుంది. అంతదాకా మన మీద         రుద్దబడిన విలువల చట్రంలో, ఊహల్లో బతుకుతుంటాము. ఎవరో నిర్ణయించిన విలువల్లో, చట్రాల్లో బందీలుగా జీవితాలు తరాల తరబడి లాగిస్తుంటారు. చివరకు మిగిలేదేమిటి? అంటే మనం ఈ వ్యవస్థకు, విలువలకు, సంస్క ృతికి యంత్రాలుగా మారి కట్టుబానిసలుగా, వెట్టిచాకిరీ వాళ్ళుగా, బతుకులీడుస్తున్నామా? మనకు స్వేచ్ఛ ఎక్కడ వుంది? ఇది స్వేచ్ఛ ఎలా అవుతుంది? స్వరూపా! నీకు విషయం అర్థమవుతుందా?” అని ప్రశ్నించే స్వభావం ఆమెది.

తన జీవిత గాథని వివరంగా చెప్పి, తానుగా వ్యవస్థను, పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నదీ విశదీకరిస్తుంది.

గతాన్ని తలచుకొని డిప్రెషన్‌లో పడిన యువతి స్వప్న. ఆమె భ్రమల్ని వీడి వాస్తవాల్ని గ్రహింటం అవసరం. అని ‘కౌన్సెలింగ్‌’ చేస్తున్న యువతి – సరోజనీ, స్వప్ననీ అర్థం చేసుకున్న స్వరూప.

‘విలువలు’ కథ గురించి తమ ముందుమాటలో;

”విలువలంటే ఏమిటి? మనిషి కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఎప్పటికప్పుడు గెలుచుకునే అవకాశం ఉండే సమాజం, దాని విలువలు గొప్పవా? లేక కాలు జారిందనో, పతనమైందనో జీవితమంతా భాధపడుతూ బతికే విలువలు గొప్పవా?” ఈ ప్రశ్నకు స్పష్టమైన జవాబు అవసరం. ఆదర్శాలు చెప్పి ఓడిపోయిన జీవితాన్ని తల్చుకుంటూ జీవితమంతా ఏడ్చుకుంటూ కూర్చోమని చెప్పే సంస్క ృతి జీవన విధానం నీచమైనది, క్రూరమైనది. అలా దుఃఖితుల పట్ల చూపే సానుభూతిలో నిజమైన సానుభూతి గనుక ఉంటే వారు తిరిగి జీవితాన్ని గెలుచుకునే సంస్క ృతి, జీవన విధానాన్ని ఆమోదిస్తారు. ప్రోత్సహిస్తారు.”

‘విలువలు’ కథ నేటి ఆధునిక జీవితంలోని సంఘర్షణలను, మలుపులను తెలుపుతుంది. ఈ కథలో నేను చెప్పిందానికన్నా చెప్పకుండా ఉండిపోయిందే ఎక్కువ. కావాలనే చాలా విషయాలు చెప్పలేదు. పాఠకుల ఊహకు అందేవిధంగా సూచనప్రాయంగా చిత్రించి వదిలేశాను. ఏ కాస్త వివరించినా అది నవలై కూర్చుంటుంది. కాగా కథావస్తువు, ప్రజెంటేషన్‌ తీరు ద్వారా దీన్ని కథగా మలచడం సాధ్యపడింది.” అంటూ వివరించారు. బి.ఎస్‌.

”ఇదంతా సరే సారూ. అసలూ స్వప్నకేం జరిగింది?” అని ఆలోచిస్తూనే వుంటాడు చదువరి!

‘చికాగోలో నాన్నమ్మ’లో భూదేవి, స్వప్న

భూదేవి పాత్ర స్వరూప స్వభావాల్ని ఇంతకుముందు చర్చించాను. తనదైన ఇండియా సంస్క ృతి గురించీ, తన గురించీ తెలుసుకుని మనవరాలు రాయడం భూదేవికి చాలా తృప్తినిచ్చింది. ఆ ‘ప్రాసెస’్‌లో అమెరికా గురించీ, ఆ సంస్క ృతి గురించీ తెలుసుకుని,కొత్త జ్ఞానాన్ని సముపార్జించుకున్నది. ‘పరాయీకరణ’ బాగోగుల్ని విన్నది. సర్దుబాటుకు ఒడబడింది. మారుతున్న ప్రపంచంలో తానూ మారాల్సిన ఆవశ్యకత అర్థమైంది. ఎంతో మంది నాన్నమ్మాలకి ప్రతీక భూదేవి. వారంతా మనసులో ఈ కొత్త పాతల భావ సంఘర్షణలో మునుగీతలు వేస్తున్న వారు.

ఇక స్వప్న! అవసరమైన మేరకు, తన మేధాసంపత్తితో, భౌతిక వాస్తవాల జ్ఞానంతో ‘ఎదిగిన’ యువతి. ఈమె ఎన్నారై యువతుల ప్రతీక! ప్రపంచీకరణంలో అవసరమైనంతమేరకు ‘మంచి’ని స్వీకరించటం వాంఛితమే అని కథాత్మ!

‘పాతచీర’లో రాజేశ్వరమ్మ, కళావతి

రాజేశ్వరమ్మ కొడుకు కోడళ్ళ నిరాదరణకి గురై తన ఘోషని మనసులో దాచుకున్న అత్త. సంసారభారంతో, ఆర్థిక ఇక్కట్లతో నలిగి భౌతిక వాస్తవాల పళ్ళచక్రంలో ఇరుక్కుపోయిన మధ్యతరగతి ఇల్లాలు కోడలు కళావతి. ఈమె మానవ సంబంధాల్ని అణగారుస్తున్న స్త్రీగా కనిపించినా, ఆమె స్వభావాన్ని ఆమె ‘ఉన్న’ స్థితి నుంచి పరిశీలిస్తే -సానుభూతి పొందే పాత్రే! సహజత్వాన్ని నింపుకున్న పాత్ర!

రాజేశ్వరమ్మ వంటి స్త్రీయే ‘తులసి’ కథలో తులసమ్మ. ‘వరుసలు’లో సరవ్వ, కథానాయకుని భార్య – పాత్రల వివరణ ముందే వచ్చింది. ‘వేదవతి’ అనేక రకాల ఆధిపత్య ధోరణులకి ప్రతీక. ‘వారసత్వం’లో కిరణ్మయి….దృఢమైన అభిప్రాయాలు కలిగిన ఈ తరం యువతి. ఈనాటి ఆర్థిక, సామాజిక పరిణామాల్ని గమనిస్తూ లోకం తీరుని అర్థం చేసుకుని, తనకేం కావాలో తాను తెలుసుకున్న యువతి. ఎక్కడ నిరసన గళాన్ని విప్పాలో అక్కడ విప్పే తెలివిగల స్త్రీ. విజయ్‌తో పెళ్ళి తన భావి జీవితానికి సుఖాన్నివ్వదని తెలుసుకుని దాన్ని తిరస్కరించిన ధైర్యశాలి.

‘మమతలు’ కథలో సరవ్వ,  పద్మ,చంద్రమ్మ..

అలాగే ‘ఇంటల్లుడు’ కథలో పద్మ. ‘ప్రశాంతం’ కథలో విమల, ‘బతుకుపయనం’ కథలో లచ్చుబాయి, దివ్య, ‘మైత్రివనం’లో హారిక. ‘వయస్సు పిలుపు’లో హారిక, సౌమ్య, ‘నాగశాల’లో ఇలూచి, నాగపుత్రి, ‘తల్లిపాలు’లో విమలక్క అరుణ, ‘వాళ్లు గెలుచుకున్న జీవితాలు’లో సర్పంచ్‌ లక్ష్మి, రుణక్క, శృతి, ‘కామన్‌వెల్త్‌’లో విజయలక్ష్మి, ‘లక్ష్మమ్మ గెలుపు’లో లక్ష్మమ్మ, సమీరజ, రీనా….. మొదలైన పాత్రలు స్త్రీల చిత్రణలో వైవిధ్యాన్నీ, స్త్రీల స్వభావాల పలు పార్శ్వాలనూ చిత్రించారు.

ఇలా బి.ఎస్‌. కథల్లో మొత్తం మీద స్త్రీలు ఎక్కువ మంది ఆలోచనాపరులు. చదువు విలువని గుర్తించినవారు. శ్రమజీవులు. సహనం కలిగినవారు. గుణవర్తన కలిగినవారు. మారుతున్న ఈనాటి సమాజాన్నీ, పరిస్థితుల్నీ, విలువల్నీ, అర్థం చేసుకోగలవారు. ఆర్థిక స్వాతంత్య్ర రాహిత్యం వలన ఇక్కట్లకు గురవుతున్నవారు. స్వావలంబనని ఆకాంక్షిస్తున్నవారు. సమస్యల్నే కాకుండా, పరిష్కారాల్నీ చూడగలవారు. నిగ్రహంగా ఉద్యమాల్ని గురించి అయినా, రాజకీయాల్ని గురించి అయినా చర్చించగలిగినవారు. మానవ సంబంధాల్లోని వైరుధ్యాల్నీ, వైచిత్రినీ, విస్తృతినీ కూడా అర్ధం చేసుకున్నవారు.

‘ఆధునిక మహిళలు’గా చరిత్రను తిరిగి రచించటంలో తమదైన పాత్రని నిర్వహిస్తున్నవారు! ఇలా స్త్రీల చైతన్యాన్ని అనేక స్త్రీ పాత్రల ద్వారా చిత్రించారు బి.ఎస్‌. ఇలా మొత్తం కథల్ని పరిశీలించినప్పుడు బి.ఎస్‌. కథల్లో స్త్రీలు ఆకాశంలో సగంకన్నా ఎక్కువ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో