అయిదు మాటలు

డా. విద్యాసాగర్‌ అంగళకుర్తి

ఆ కల ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయింది.  ఎక్కడో తిరిగి రాని దూరతీరాలక్కాదు.

 యిక్కడే వుంది.  కనిపిస్తోంది.  తాకలేమంతే.

  ఆలోచనకు కలలొస్తే అంతా అర్థమయ్యీ కానట్టు ఉంటుందేమో!  కలలకు ఆలోచనలుంటే అంతా అనుకున్నట్టే జరుగుతుందేమో!  కలలకు ఆలోచన లెలా ఉంటాయె?  ఆలోచనలకు కలలెలా వస్తాయో? రెండ తెలీదు.  తెలిసినా రెండూ వొకదాన్తో ఒకటి కలిసి ఉంటాయా?  ఉండవని చెప్పడానికి ఆ కల ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయిందేమో! ఏమో!

వెళ్లబోయే ముందో లేక కొంచెం వెనకా ముందో జీవితాంతం నేను గుర్తు పెట్టుకోవాలనుకుందో ఏమో!  జీవితాన్నీ, లోకాన్నీ, తన కలల్నీ, విశ్వానికీ తనకూ ఉన్న బంధాన్నీ, మనుషుల పట్ల తనకున్న ప్రేమన కాచి వడబోసినట్టు, రసగుళికలుగా తయరుచేసి నా చేతుల్లో పెడుతున్నట్లు నాలుగే నాలుగు ముక్కల్లో ఎంత బాగా చెప్పింది!  ”నేనెప్పట్నుంచో వున్నానట. తనే మజ్జెలో వచ్చిందటూ”.  అలా అంటూ అంటూ తన చిన్నతనంలోకి వెళ్ళి పోయిందోసారి….
”ఎక్కడ పుట్టాను? ఎలా పెరిగాను? తలచుకుంటే మన ఆలోచన్లకూ మన చుట్టుపక్కల పరిసరాలకూ తెలీని బంధమేదో ఉందనిపిస్తుంది.  మనకు తెలీకపోడం కాదుగానీ అంత తీరిగ్గా ఆలోచించం.  ఊరి చుట్ట చించెట్లు, వాటికింద గుబుర్లాంటి నీడలో కనిపించీ కనిపించకుండా ఉండే చింతకాయ పిందెల – వాట్ని ఏరుకోవడంలో వుండే ఆనందం గొప్పగా ఉండేది, తినబోడం కన్నా. అయినా ఒకటి సరిగ్గా కొరికితే చాలు, నరాలు జివ్వున లాగడానికి.  మిగిలినవన్నీ నేనేరుకొచ్చానని యింట్లోనో, పక్కనోళ్లకో చూపించడానికే.  అవి మొత్తం తినగలిగేది లేదు.  అట్లని యింట్లో వాళ్లు వాటితో చేయగలిగేదీ యింకేం లేదు.  అసలు నేనింకేదైనా చెయ్యనిస్తే గదా!”
”ఆ గుబురు నీడల్లోంచి అట్లా తలెత్తి చూస్తే పూసిన గురుగాకు చెట్లు చేలనిండా కనిపించేవి.  మళ్లీ యింకో పరుగు.  ఎక్కడికే మళ్లీ అని పిలిచే అవ్వనో, అమ్మనో పట్టించుకొనేంత వోపికేది?  పరిగెత్తి పరిగెత్తి చేలంబడి, గట్లంబడి, గురుగుపూలు దసుకుంట ఎంత దరం అలా పరిగెత్తేదాన్నో… నేనొదిలొచ్చిన పచ్చని చింతచెట్లు, వాటికింద నల్లటి నీడల, యిక్కడ ఈ చేలల్లో పచ్చటి గురుగాకు పొదలకు తెల్లటి కుంకుల్లాంటి పూల – ఈ పచ్చకీ నలుపుకీ, పచ్చకీ తెలుపుకీ – అన్నట్టు అప్పుడప్పుడు చించెట్ల మీదకి కిలకిలమంట రామచిలకలొచ్చేవి.  అవి కూడా వొళ్లంతా పచ్చగా, ముక్కు మాత్రం ఎర్రగా –
ఈ పచ్చదనం, దానికి అమిరిపోయి నలుపూ, తెలుపూ, ఎరుపూ చూస్తే పచ్చదనం నాలో ఉందనిపిస్తుంది.  ఆ పచ్చదనానికి కలగలుపు రంగు కోసం జీవితమంతా నేను వెదుకుత ఉన్నానేమో!  అది తెలుపా, ఎరుపా, నలుపా?  ఏమో నిన్ను చూసినప్పుడు నాకలా అనిపించింది.  నువ్వెప్పట్నుంచో ఉన్నావు.  నేను మజ్జలో వచ్చాను.  మజ్జెలోనే వెళ్తాను.  అయినా నువ్వుంటావు.  అందుకనే నేనెప్పటికీ ఉంటాననే నమ్మకం మజ్జెలో వెళ్ళిపోతాననే ఆలోచనే రానివ్వలేదు”.
”మొదటున్నది ఆకుపచ్చా?  తరవాతొచ్చింది నలుపా, తెలుపా, ఎరుపా?  లేక నలుపూ, తెలుపూ, ఎరుపూ ఉండి ఆకుపచ్చ వాటన్నింటితో కలిసిపోవడాని కొచ్చిందా?  ఏవె, ఏమైనా ఆ ముదు ర్రంగుల మధ్య నేస్తం మాత్రం మనిద్దరం దగ్గర దగ్గరగా కూచుని ఎక్కడ్నో చూస్తున్నట్టుంటుంది.  నేను మాట్టాడుతనే ఉంటే, నువ్వు నిరంతరంగా ఊకొడుతున్నట్టే ఉంటుంది.  దిగంతంలో శబ్దం అలా వస్తనే ఉంటుందట కదా.  లోకం ఏవేవో శబ్దాలు చేస్త దాని దారిన అది పోత ఉంటే, దిగంతం మాత్రం ఆ శబ్దాల మధ్య భేదాన్ని పట్టి చూపించడానికన్నట్టు వొకే శ్రుతిలో ఉంటుందట.  ఈ శ్రుతుల, జతుల మనకు తెలీవు గానీ, నువు అలా ఊకొడుత వుంటే మజ్జలో విషయం మార్చేసి నిన్నాట పట్టించాలనుంటుంది.  ఆటలో కూడా మళ్లీ ఉఊలే.  ఎందుకింత యిది నాకు ఉఊలంటే…. కొమ్మల మీద పరిగెత్తే ఉడతలాగా నీ మౌనం ఉఊల మీద నేను ఉయ్యల లగినంతసేపు ఊగి మళ్లీ ఎక్కడికో వెళిపోతానేమో!”
”అయినా ఎందుకు నాకేదో తెలీని దిగులు?  నువ్వుంటావు నేను వెళిపోతాననే ఆలోచనొస్తే మనసంతా ఎంత దిగులు కమ్ముకుంటుంది.  అయినా అంతలోనే – నేనెక్కడెక్కడో తిరిగి వచ్చినా, నేనొచ్చే వేళకు నువ్వింకా ఊఊ అని అంటనే వుంటావు గాబట్టి నేనెక్కడి కెళ్లానని నువ్వు నన్ను ప్రశ్నించవని ధైర్యం.  అయినా నన్ను దేన్ని గురించైనా నువ్వెప్పుడైనా అడిగావా?  అడుగుతావేవెనని ఆశగా చసి, ఉండబట్టలేక అడిగితే మళ్లీ ఊఊ… ఎన్నాళ్లీ ఊఊ… అందుకే కొన్నాళ్లెక్కడికైనా వెళ్లొద్దామని.  నాకోసం ఎదురుచూస్తావా?  నేసలు లేనని నీకెప్పుడైనా అనిపిస్తుందా? అనిపించినా అంతలోనే నేనొచ్చేస్తానని నీ నమ్మకం.  అందుకేనేమో నేను మళ్లీ మళ్లీ వస్తాను.  కద.  నిజం?”

ఎక్కడికో వెళ్లి వస్తుండగా అనుకోకుండా దారిలో కలిసింది.  అంతే అకస్మాత్తుగా రూపమంటే ఏంటని మొదలుపెట్టింది.  రూపానికీ, లోకానికీ ఉండే పిచ్చి భ్రమల గురించి మాట్లాడుతనే ఉంది.
”రూపమనేది కలలా ఉండాలను కుంటారు గానీ, కలకు రూపమొస్తే భరించగలరా యీ మనుషులు?  నేను వీళ్లెవరికీ నచ్చేలా ఉండను.  నారూపం సరే!  ఎంతమందికి నచ్చుతుంది?  అయినా ఆ నచ్చడం, నచ్చకపోవడాన్ని గురించి ఆలోచించేవాళ్లూ, పట్టించుకునే వాళ్లెవరూ నాకు నచ్చలేదు.”
”ఆపెసుల, ప్రాణాయమం, ప్రేమా లేకపోతే ఈపాటికి చచ్చిపోయి ఉండేదాన్నని చెప్పను గానీ చచ్చిపోవడంలో కూడా ఉండే మాధుర్యం నాకర్థమయ్యుండేది కాదు.  ఈ ప్రపంచాన్ని అలా చూస్త దానికి నా భాష్యం నేను చెప్పుకుంటూ బతికినట్టే, చచ్చిపోవడమంటే మరో గదికి వెళ్లినట్టుగా ఎందుకుండదు?  మన సొంతింట్లోకెళ్లి తలుపేసుకున్నట్టే చచ్చిపోవడమంటే.  అసలు చచ్చిపోవడం మీద భయన్ని మగవాళ్లు కలిగించుకున్నారు.
చెట్టుకు భయమేసి ముళ్లు మొలిపించుకున్నట్టు వీళ్లకు భయమేసి దానికేవో రూపాలు కల్పించుకున్నారు.  ఆ రూపాలన్నింటిలో పెద్దది చావేనను కుంటాను.  పన్చేయడం తప్ప పనిలో ఉండే ఆనందాన్ని వీళ్లు పోగొట్టుకుంటున్నారు కద?  దీన్నంతా ప్రగతనుకుంటున్నారు.  ప్రసవ వేదన తర్వాత కలిగే ఆనందం ప్రసవ వేదన పడగలిగిన వాళ్లకు తెలుస్తుంది.  ప్రసవం తరవాత జీవితం మరోసారి పుట్టడమే.  వేదన భరించలేమని బిడ్డలొద్దను కోదు ఆడది.  అయినా ఆ బిడ్డలమీద పెత్తనం కంచెలకొచ్చాక ఎక్కువ మందిని కనడంలో ఏ ఆనందం లేకుండా పోయిందనుకుంటాను ఆడవాళ్లకు.  అదీ స్వేచ్ఛే అనుకుంటారు గానీ ఆడవాళ్లు, అది వీళ్లు పోగొట్టుకున్న స్వేచ్ఛ తప్ప అనుభవించగలిగే, అనుభతించ గలిగే స్వేచ్ఛ కాదు”.
”అసలు పాపం మగవాళ్లను చూస్తే జాలేస్తుంది.  సంచులు వెసుకుని తిరిగే వాళ్లను సెంట్రీ డ్యూటీలో పెడితే ఎంత కష్టం?!  శక్తిమంతులమనే పేరుతో సంస్కృతి సంచులు వెసుకుంట తిరిగేవాళ్లకు సంసారమనే సెంట్రీ డ్యూటీ వేస్తే పాపం ఎంత కష్టం?  సెంట్రీ డ్యూటీలో వుండే క్షణికానందానికి సంసారమనే పెద్ద శిక్ష వేస్తే, ఏంచేయలో తోచక బయట పడేందుకు ఏవేవో సాకులు వెదుకుతున్నారు.  పోగొట్టుకొన్న చోట వెదకమంటారు గానీ, అదే తెలిస్తే యింక పోగొట్టుకున్న దేవిటి?  మనం వెదికే చోట్లలో తొందరగా, సులభంగా గుర్తుండేదదొక్కటే గావొచ్చేవె! కొంత వెసులుబాటు.”
 ”వెదుక్కునే ఆత్రంలో, వాడెవడో అలలు లెక్కబెట్టడానికి సముద్ర తీరానికొచ్చే వాళ్లందర్నీ ఆపేసినట్లు (దాంతో జనం వాడికి డబ్బులు యివ్వక తప్పలేదట.  అది వేరే సంగతి)  ప్రపంచాన్ని ఎదక్కుండా చేసి మగవాడు పాపం తనకర్థంకాని ప్రతీదీ అర్థంలేనిదనుకున్నాడు.  అందుకనే ఎన్ని కంచెలేసుకున్నాడు పాపం?  ఆడవాళ్లనే కంచె, రంగు తక్కువనే కంచె, కులం తక్కువ వాళ్లనే కంచె, ఆలోచన తక్కువ వాళ్లనే కంచె, మన ప్రాంతం వాళ్లు కాదనే కంచె.  యిన్ని కంచెల్నీ ఆ తక్కువవాళ్లనేవాళ్లు దాటు కుంటనే వస్తున్నారు గాబట్టే ప్రపంచం బాగుపడుత వస్తోంది.  అసలు ప్రపంచం అంటేనే అది కదా.  పంచమంలోనే సంయ మనమంతా.  యీ ముక్క అర్థం కాక్కాద మగవాళ్లకు.  ఎవడో దోచి యిచ్చిన ఆస్తిని కూచొని తినడానికి అలవాటు పడ్డవాడికి నాలుగు దిక్కుల తిరగడంలో ఉండే సుఖమేం తెలుస్తుంది?  అందుకే అటు వాళ్లకు అందుబాట్లో లేనిది దేన్ని చూసినా ఆందోళనే, భయమే.”!
”సొంతంగా ఆలోచించలేని సోమ రులీ మనుషులు.  సోమరితనంతోబాటే పిరికితనం కూడా వొస్తుందేమో!  పిరికి తనంతోబాటే లోభమొస్తుందను కుంటాను.  యింకేం?  యిన్నొచ్చింతర్వాత మనకన్నీ తెలిసేశాయనుకుని పాపం ప్రపంచాన్ని వీళ్లు వ్యాఖ్యానించి దానికి తమ అరకొర ఆలోచన్లే పరమ ప్రమాణమనుకునే అర్భకులు.  అందుకే నాకు ఈ మగవాళ్లను చూస్తే భయమెయ్యదు.  జాలెయ్యదు.  కోపం రాదు.  దిగులేస్తుంది.
దిగులు పొగమంచులాంటిది.  పొగ మంచు వల్లే మారుకాపుకు పండే శక్తొస్తుంది.  అదెట అలాగే ఉండదు గాబట్టి ఎండ సౌఖ్యమేంటో పంటకు తెలిసొస్తుంది.  అందుకే మలి కాపులో పంటలు ఎండకాగి తమ సత్తా చపుకునే సజ్జా, జొన్నా, కందీ, మినుముల్లా వుంటాయి.  పొగమంచు లాంటి దిగులు రోజువారీ ప్రపంచాన్ని చూస్తుండడంలో కరిగిపోయక వీళ్లూ ఖచ్చితంగా వొక రోజుకి ప్రపంచానికి నిజమైన వారసులవుతారనే ఆశ కలుగుతుంది.  అందుకే వీళ్లను శక్తిమంతుల్ని చెయ్యలంటే వాళ్లక్కాస్త ప్రేమ కావాలి.  యిప్పటి దాకా వీళ్లకు ప్రేమంటే పిల్లవాడు జీర్ణం చేసుకోలేకపోయిన మంచి పరమాన్నంలాగా వుంది.  ప్రేమంటే పాపం వీళ్లకు పక్కింటివాళ్ల చెట్టు నుంచి దొంగతనంగా కోసుకొచ్చి మనింట్లో మాగేసుకోవాలనుకునే మామిడికాయలా వుంది.”

”అలా గోదావరి దాకా వెళ్లొద్దామా?  ఆ యిసకలో నడుస్తుంటే మా గురువుగారు గుర్తొస్తారు.  ఆయనా మగవాడే.  అయినా అట్లాని నువ్వేం ఉడుక్కోనక్కరలేదు.  నువ్వు ఉడుక్కోవని తెలుసు.  గోదావరి గురించి నగేష్‌ బాబు ఏదో రాస్తే మాత్రం గోదావరి ఎంతైనా ప్రవాహం కదా.  మజ్జెలో ఈ మగవాళ్లంతా కలిసి దాన్ని ప్రగతి పేరుతో దోచుకుంటే గోదావరేం చేయగల్దు?  ఆకాశానికే దిక్కు లేదు.  అలా చూస్తనే వుండు గోదావరి వొడ్డును.  నాకు వొడ్డె య్యలనుకున్న నా మొగుణ్ణి గురించి చెప్తాను.  మంచివాడే.  అయినా యీ పెళ్లనే దాన్లో యిరుక్కుంటే కొంచెం కొంచెం మంచివాళ్లు కూడా మగవాళ్లుగా మారిపోతా రేమో!  పెళ్లి గురించి నాకే సదభిప్రాయం లేదు సరే అందులో వున్నవాళ్ల గురించి నాకే దురభిప్రాయం కూడా లేదనుకో!”
”ఎందుకో పెళ్లి గురించి చిన్నప్పుడే ఆలోచించాల్సి వచ్చింది నేను.  ఎందుకో ఏవిటి?  మా అవ్మ నాన్నా వాళ్లనే గాక పక్కింటివాళ్లను చూసినప్పుడు కూడా ఈ పెళ్లనే దాంట్లో యిరుక్కుపోయి ఎంతమంది మంచివాళ్లు పాపం మగాళ్లుగా మారి పోయరో కదా అనిపిస్తుంది.  అంటే చిన్నప్పుడే మగాళ్ల గురించి నాకిదంతా తెలుసని కాదు.  మా నాయన్ని చూసినప్పుడు అనిపించేది.  ఈయన ఎక్కడా ఎప్పుడూ ఏ పనీ చేసినట్లనిపించదే!  అయినా వేడి వేడి అన్నం, నెయ్యి, పప్పుచారు ఈయనకోసం ఎప్పుడొచ్చినా సిద్ధం చేసి పెడతారే!  అందుకే నేనాయన వచ్చేదాకా అలాగే కాచుక్కూచునే దాన్ని.  ఈ మధ్యలో కొట్లాడినా మా అమ్మా, అవ్వా పడనిచ్చే వాళ్లు కాదుగదా.  యిక చేసేదేముంది?  మా నాయనొచ్చే దాకా వుండి అప్పుడు తినడమే.”
”వోసారి ఏమైందంటే గౌను వేసుకుంటనే బజార్లోకి బైల్దేరాను.  యింట్లో నుంచి మా అమ్మవొకటే అరుపులు.  వొసే నీకు సిగ్గులేదేమే, అట్లా బజార్లోకి బట్టల్లేకుండా వెళతావేమే.  పరువు తీసేస్తున్నావే, పిచ్చిదాని మానుకుంటారే అని వొకటే వో…అని కేకలు.  యంతజేసి నా వయసెంత?  ఐదేళ్లుంటాయేమో!  ఐదేళ్లకే నన్ను సిగ్గులేనిదాన్నీ, పిచ్చిదాన్నీ చేసేసింది మా యమ్మ.  అయినా ఆయమ్మననుకుంటే ఏంలాభం?  ఆమెనట్టా తయరుచేసింది వూరేగదా.  అయినా సిగ్గు పడే వయసేనా నాది, పిచ్చిబట్టే వయసేనా నాది?  ఆడపిల్ల యితే చాలు, అన్నీ పుట్టినప్పటినుంచే నేర్పించేయలనీ, నేర్చుకోవాల్సిందేనని వొకటే నస.  నేర్చుకుంటే తప్ప ఆడపిల్లలకేం తెలియవని వాళ్ల ఆలోచన.  అంటే మగవాడు ఎక్కడ తిరిగినా, ఎట్లా తిరిగినా ఫరవాలేదా?”

”అసలు నాకు బట్టలు వేసుకుంట బజార్లోకి వెళ్లాలనే కోరికెందుకొచ్చిందో చెప్పలేదు గద, మా నాయన చొక్కా వేసుకొని గుండీలు పెట్టుకుంట బజార్లోకి వెళ్లేవాడు.  ఆయన చేస్తే ఏమనని అమ్మ, నేను మాత్రం అదే చేస్తే ఒకటే రచ్చ.  అప్పట్నుంచే తెలిసింది  ఏందబ్బా తేడా?  వోహో, నాయనలంతా మగవాళ్లన్న మాట.  వాళ్లేదయినా చెయ్యొచ్చన్నమాట.  అట్లని మగపిల్లవాడిగా పుట్టింటే బాగుండేదని నాకెప్పుడ అనిపించలేదు.”

”అన్నట్టు నా మొగుడిగురించి చెప్పబోయి మగవాళ్లను ఈ ఆడవాళ్లు ఎంత యిదిగా చస్తారో చెప్పడంతోనే సరి పోయింది గదా.  నా మొగుడు మామూలుగా అయితే మంచివాడే.  కానీ, నేను నేనుగా వుంటేనే పాపం అతనికి యిబ్బంది.  అంటే నేను తింటేనో, మంచి బట్టలు కట్టుకుంటేనో యిబ్బందిగా చూసేవాడు కాదుగానీ తను చెప్పిన మాట వినకపోతే, వినకపోవడం ఆడలక్షణం కాదనేవాడు.  తనకి మాత్రం అభిప్రాయలుండొచ్చు.  నాకుంటే మాత్రం అవన్నీ తలతిక్క అభిప్రాయలనేవాడు.  నేను చెప్పిన మాటల్లో తన వరకు కావలసినవి ఏరుకునేవాడు.  తను చెప్పిన వాటినే నేను ఎప్పుడైనా తిరిగి చెప్తే నువ్వూ నేను వొకటేనా అనేవాడు.  అంటే ఏవిటి, నీకూ నాకూ తేడా?  యిద్దరం కలిస్తేనే పెళ్లీ, పిల్లల, యిల్ల, సంసారం.  మరి నువ్వు నువ్వుగా వున్నప్పుడు నేను నేనుగా ఎందుకుండగడదు?  అప్పుడప్పుడు మౌనంగా వుండాలని నాకనిపిస్తుంది.  నాకు తెలిసిన మగవాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది.  నువ్వు మాట్లాడ్డంలే అమ్మాయిల్తో.  నేనేమైనా అన్నానా?  యిదంతా నామీద పెత్తనమో, కుళ్లో, ప్రేమో, యింకేదో అర్థమయ్యేది కాదు.  క్రమేణా తెలిసింది నేను కావాల్సినప్పుడు ప్రేమని.  అది తీరింతరవాత పెత్తనమనీ, తీరకపోతే పెత్తనమూ, కుళ్లూ కలిసిన వెధవ తనమని.”
”అసలు పెళ్లంటే నా ఉద్దేశంలో మనికిష్టం ఉన్నవాళ్లతో కలిసి వుండడమని.  ఆ ఉండడంలో ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లుంటనే పక్క వాళ్లిష్టాన్ని వీలయితే గౌరవించడం, లేకపోతే నావల్ల కాదని చెప్పేయడం.  మనుషులైనా, ఆ మాటకొస్తే ఏ జాతయినా ముందుకు పోవడానికి జత అయితే కావాలి గదా.  ఆ జత కట్టడమే ప్రకృతీ పురుషుల కలయిక.  అయినా ఈ మగవాళ్లు పురుషులంటే మేమే ననుకున్నారు తప్ప పురుషుల్లో ఆడవాళ్లు కూడా కలిసి వున్నారు.  వాళ్లు ప్రకృతితో కలిసి ప్రకృతి కనుగుణంగా వుండాలని అర్థం చేసుకోలేని అర్థ సన్నాసులుగా మారిపోయరు.”

 ”మగవాళ్లలో ఆడవాళ్లలో వున్న సున్నితమైన ఆలోచనా తీరు, ఆడవాళ్లలో మగవాళ్లలో వుండే ఆవేశం రెండ కలిసి వుంటే అదీ మనిషంటే!  అట్లాంటి యిద్దరు మనుషులు కలిసి వుండడమే పెళ్లంటే నా ఉద్దేశంలో.  కానీ యిదే నా మొగుడితో అంటే నన్నొక పిచ్చిదానిలాగా చూసేవాడు.  అప్పట్నుంచి అనిపించింది ఎప్పటికైనా నేన ప్రకృతీ వొక్కటిగా మిగిలిపోవాలని.  అదీ ప్రకృతికి నా మీదున్న ఆశా, నాకు ప్రకృతి మీద వున్న ఆశ.  రెండింటికి వారధిగా ఎవరన్నా వుంటే బాగుణ్ణు.  అదెప్పటికో….”
”యీ సంసారంలో వుండే వెదుకులాడ్డం సాధ్యవ?  అయినా ఈ బిడ్డనేం చేయలి?  ఏంచేసేదేముంది?  నాకు నిజంగా పెళ్లయిన రోజున మాతోనే వుంటుంది.  అప్పట్నుంచీ సంసారం మీద నాకు విసుగు.  అట్లా అని యింటిని నిర్లక్ష్యం చేసిందీ లేదు.  మొగుణ్ణి కాదన్నదీ లేదు.  కానీ తను చేసింది నేను మౌనంగా వొప్పుకోవడం తప్ప నేను చెప్పింది తను వినకపోయినా దాన్ని గురించి పట్టించుకోవడం మానేశాను.  యిదేదో మందులాగా పనిచేసిందో ఏవె, మళ్లీ నువ్వెందుకు మాట్లాడవని నాతో కొట్లాడ్డం.  ఈ మగవాళ్లైన వాళ్లకు మాటకూ అర్థం తెలియక, మౌనానికీ అర్థం తెలియక రెండింటి మధ్య వుండే అయెమయన్ని అవగాహననో, చింతకాయనో, కుటుంబ జీవనమనో యింకోటో యింకోటో అను కుంట పెళ్లనే దానిమీద నాకు ఏ అభి ప్రాయం లేకుండా చేసేశారు.  నిన్ను చూసిం తర్వాత నేననుకున్న పెళ్లి ఎవరి మానాన వాళ్లుంటనేవొకదారిన వెళ్లడమనిపిస్తోంది.”
”నిజానికి జీవితానికి సారాన్నిచ్చేది ఏడవగలిగిన మనసు.  మనిషి జీవించి ఉన్నాడనడానికి వొకేవొక్క నిదర్శనం ఏడుపు.  ఏడుపు బలహీనత కాదు.  నవ్వడం నిజంగా సంతోషమూ కాదు.  నవ్వగలిగిన మనసు తాత్కాలికంగా సుఖపడుతుంది.  ఏడుపు మనిషిని బలపరుస్తుంది.  శుభ్రం చేస్తుంది.  మనిషిని మనిషిగా వుంచుతుంది.  ఈ మగవాళ్లు ఏడుపును బలహీనతనుకుని ఏడ్చేవాళ్లను ఆడవాళ్లనే ముద్ర వేసేశారు.”
”ఏడవగలిగిన మనిషే నిజంగా ఆలోచించగలడు.  నిజంగా ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలడు.  ఏడుపు ఊరికే రాదు.  అదొచ్చినప్పుడు ఆపుకోవాలనుకోవడం నిజంగా మనిషి తనను తాను కోల్పోవడమే.  యిలా క్రమేణా మనిషి వొక మరగా మారిపోతాడు.  ఆ క్రమంలోనే ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేకపోవడమో, లేదా తీసెయ్యడమో లేదా తప్పించుకోవడమో చేస్తాడు.  ఏడుపుకు మూలం అర్థం చేసుకోగలిగిన మనిషి ఎదుటి మనిషిని గౌరవిస్తాడు.  ఆ గౌరవంలో ప్రేమ వుంది.  సాటి మనిషి పట్ల సహానుభూతి వుంది.  సహానుభూతి చచ్చిపోతే కృత్రిమమైన సానుభూతి వస్తుంది.  ఈ సానుభతికి అలవాటు పడిపోయిన మనుషులు తాము ఎదుటివాళ్లకి ఏదో మేలు చేస్తున్నామన్న భ్రమలో బ్రతుకుతారు.”
 ”లెక్చరెక్కువైపోయింది గానీ, అసలు విషయనికొస్తే పెళ్లంటే కలిసి వుండడం.  కలిసి ఉండడం అంటే యిద్దర కలిసి మనసు తీరా ఏడ్వగలగడం.  ఏడ్చిన తర్వాత యిద్దర కలిసి వొక నిర్ణయనికి రావడం.  పోనీ ఎదుటి మనిషిని ఏడవ నివ్వడం.  ఏడ్చిన తర్వాతొచ్చే ప్రశాంతత కోసం ఎదురుచడ్డం.  ఏదో చెప్పాలని ఎదురుచడకుండా ఏడుపులోకి తొంగి చూడకుండా వేచివుండడం.  ఎదుటి మనిషికోసం వేచి వుండడంలోనే కలయికకు సార్థకత వుంది.  అదే నేను పెళ్లిలో కోరుకునేది.”
”నువ్వెంత సేపైనా వింటావు.  వుంటావు.  ఎందుకేడుస్తున్నావని అడగవు.  అట్లా అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోవు.  యిబ్బంది పడుతున్నట్లనిపించవు.  వో స్వాంతన కోసం ఎదురుచూస్తావు.  నా ఏడుపునుంచి నేను బైట పడింతరవాత నీమౌనం పువ్వుకు తావి అబ్బినట్టుగా వుంటుంది.  యిద్దరం కలిసి తేలికపడ్డ మనసులతో మాట్లాడుకుంటాం.  దానికి మాటల్లేవు.  అయినా భాష వుంది.  భావం వుంది.  భావాలకు అతీతంగా వొకరికి వొకరు ధైర్యాన్నివ్వడం వుంది.  ఆ ధైర్యమే కలయిక వల్ల రావలసింది.  ఎన్ని మాటలు చెప్పినా రాని ధైర్యం, ఏడ్చేటప్పుడు తోడున్న మనిషివల్ల వస్తుంది.  ఇదెప్పటికి అర్థమౌతుంది ఈ మనుషులకు – మగవాళ్లకు.  ఏడ్పంటే ఏదో సాధించు కోవడానికి ఎత్తుగడ కాదు.  అది పిరికివాళ్ల పని.  ఆత్మవంచన చేసుకునేవాళ్ల పని.  ఆత్మవంచనకు కలయిక అర్థం కాదు.  అందుకే పెళ్లిని కేవలం యిద్దరు మనుషులను వొకటిగా కట్టిపడేయడానికి సమానం చేశారు.  దాంతో బాధ్యత తీరిపోయిందనుకుంటారు పెద్దలు, తల్లిదండ్రులు.  యిద్దర్నీ విపరీతమైన వొత్తిడికి లోను చేశామని అనుకోరు.  తెలీక కాదు.  మనుషులకు సులభమైన పరిష్కారాలు కావాలి.  స్వచ్ఛమైన స్వేచ్ఛ సులభ పరిష్కారాలతో రాదు.  యిదంతా నీకు తెలుసు.”

ఏదో రాసుకుంటుండగా ఫోనొ చ్చింది.  రాసుకోడం అయిపోయిం తరవాత చడొచ్చనుకున్నాను.  చేసిందెవరో తెలిసే అవకాశం ఉందిగా…అయినా తీస్తే పోలా…మళ్లీ చేస్తానని చెప్పొచ్చుగా అనుకుంటూనే తీసుకొన్నాను.  రాసు కుంటూనే ఆలోచిస్తున్నా నేనామెను గురించి.  తన ఆలోచనలకూ, నారాతకూ ఎంతో కొంత బంధం కుదుర్తుంది.  యింకెవరో ఫోన్చేస్తే రెండ చెడతాయి.  వానొచ్చి నప్పుడు చల్లగాలీ, దుమ్ము వాసనా కలిసొచ్చినట్టు, రెండింటినీ కలిపి చడ్డం సాధ్యం కానట్టు.  దుమ్మువాసన నాకు వెంటనే గిట్టదు.  తుమ్ములొస్తాయి.  తుమ్ములు సర్దుకున్న తర్వాత చల్లగాలీ, దుమ్ము వాసనా రెండ కలిసి ఎక్కడికో తీసుకుపోతాయి.  యీ మజ్జెలో మంచి టీ వుంటే బాగుండు ననిపించదు.  అది కూడా అంతరాయమే అనిపిస్తుంది.  ఎక్కడ్నుంచి చేస్తున్నారో తెలియని నంబరు.  తీశానో లేదో ఆ పక్కనుంచి
”దొరా ఏం చేస్తున్నట్టు?  యిక్కడ నేను చచ్చీ చెడీ యీ మిల్లు నడిపిస్తున్నాను.  వొకడొస్తే వొకడు రాడు.  వీళ్లందరికీ యీ వూళ్లో ఏదో కొంత పని కల్పించి నట్టుంటుదని మొదలుపెడితే ఆడమనిషే మిటి, యీ పన్లు చేయడమే మిటని మిడిగుడ్లేసుకుని చూడకపోయినా మౌనంగానే ఒక నిర్లిప్తత.  కొన్నిసార్లు నిరసన.  అయితే దాన్ని నేరుగా చూపించేంతదాకా నేను పోనివ్వనో, లేదా కాసేపు నేను మాట్లాడింతరవాత యిక లాభం లేదనుకుంటారో గానీ నేను చెప్పిన పని చెయ్యడం మొదలుపెడతారు.  అదీ ఎంతసేపు?  నేను చూస్తున్నంత సేపు.  కొంచెం అటు మసికితే ఎవరికాళ్లు పని వదిలేసి పారిపోరుగానీ కాస్త తీరిగ్గా పనిచేస్తారు.  బుద్ధి పుట్టినట్టు చేస్తారు.”
”సరే యిదెప్పుడ వుండే గోలేగానీ, ఎట్లా వున్నావు దొరా?  మాట్లాడి కొన్ని రోజులైంది.  ఎవరిపాటికి వాళ్లు వుందామను కుంటాం గానీ యిదో ఈ మజ్జెలో మనుషుల సహాయ నిరాకరణ మౌనవ్రతముందే అది ఎదురొచ్చినప్పుడు దొరేమంటాడోనని తెలుసుకుందామని వో కుతహలం.  అంతే.  యిందులోకి దొరల్నసలు లాక్కూ డదు కదా.  యివన్నీ వబోటి వాళ్లకు.  అంటే రోజువారీ జీవితంలో డక్కామొక్కీలు తినాల్సిన వాళ్లకు.  తినకుంటే తిన్న తృప్తి లేనివాళ్లకు.  అయినా మీకివన్నీ తెలీవని కాదుగానీ, వివరాల్లోకి వెళ్లేంత తీరికా, వోపికా మీకుండవు కదా.  అందుకనే అప్పుడప్పుడ కాస్త శాంపుల్‌గా యీ పిచ్చాపాటీ వ్యవహారాలు తమరి దృష్టికి తీసుకురావడం.”
”అవును గానీ దొరా, మనం కలిసి ఎన్నాళ్లయింది?  ఆ…గుర్తొచ్చింది.  ఎన్నో రోజులుగాలే.  పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.  కానీ యింతలోనే కలిసి ఎన్నో రోజులైనట్టనిపించి, వొకసారి మాట్టాడ దామనుకుంటాను.  అయినా, తమరు రాసుకునేటప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడినా మీకు అంతరాయమేనని చెప్పినట్టు గుర్తొచ్చి మానుకుంటాను.  అయినా అలా ఎంత సేపుంటాను?  మహా అయితే వొక్కరోజుంటానేమో!  మళ్లీ, ఈ అంతరాయలు గింతరాయలు దొంగలు దోలనీ, టీవీ వాళ్లలాగా అంతరాయనికి చింతిస్తున్నామని అంటనే ఏవేవో అంత రాయలు అదేపనిగా, అదే ఆ ప్రకటనల పేరుతో చేస్తనే ఉంటారుగా.  అట్లా నేన అంతరాయం గలిగిస్తున్నానని అనుకుంటూ నీతో మాట్లాడకుండా ఉండడం కన్నా అంతరాయం కలిగించి నాకు నేను వొడ్డున పడ్డం మంచిది గదా.  లేకుంటే మళ్లీ కలిసినప్పుడో, మాట్లాడి నప్పుడో నా యక్షప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ అంతరాయమే మేలను కుంటావేమో!”
”ఇన్ని ఆలోచన్లు మనసులో ఉంటే మాట్లాడకుండా ఉండడమెట్లా?  అవునూ, అలలకు ఆలోచన్లుంటే తీరందాకా వచ్చేవా?  ఆలోచన్లు అలలు అలలుగా వస్తాయ?  కలలు గడా అలలు అలలుగా వస్తాయంట.  ఆలోచన్ల, కలల, అలలను కలిపి జీవితంలోకి తెచ్చుకోవాలనుకుంటాను.  అప్పటిదాకా నేనిలా నీతోనే ఉంటాను.”
”అసలు నీదగ్గరికి రావడమంటే తీరానికి రావడమనే తెలుసు.  తీరానికొచ్చిన అల ఎక్కడ పోయింది?  యిసకలో కలిసిపోయిదా?  వెనకున్న అలను పిలుచుకు రావడానికి మళ్లీ లోపలికెళ్లిందా?  ఎక్కడికెళ్లింది?  దానికున్నది తీర్మానమా?  ఆశా?  ఆలోచనతో కూడిన గమ్యం చేరడమా?  ఆశతో గడిన వెనక్కెళ్లిపోవ డమా?  నీ దగ్గరున్నప్పుడు అసలేం గుర్తురాదు.  ఏదేదో మాట్లాడదామను కుంటానా?  కానీ నిన్ను చూస్తే తీరానికొచ్చిన అల సముద్రంకేసి వొక్క క్షణం చూసి వొక్కక్షణం ఆలోచించి మళ్లీ వెనక్కెళ్లినట్టుగా వుంటుంది.  మళ్లీ నాలోకి నేనే వెళ్లిపోయినప్పుడు తీరం చేరిన అల యిసకలో కరిగిపోయినట్టుంటుంది.  ఎందుకారోజు నన్ను నువ్వెందుకలా ఆలోచిస్తావని అడిగావు గదా.  ఆలోచించాలని నాకెప్పుడూ ఉండదు.  ఏవీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా అలా నీళ్లనో, ఆకాశాన్నో, చెట్టునో, పిట్టనో, పురుగునో, పామునో చూస్తూ ఉండాలనిపిస్తుంది.”

”అన్నట్టు దొరా, మొన్న చెప్పాను గదా, మా మిల్లు పక్కమూలలో ఎప్పుడు పుట్టిందోగానీ వొక చిన్న కుక్కపిల్ల వుంది.  తెల్లగా వుండి మధ్యలో రెండో, మూడో ఎర్ర మచ్చలున్నాయి.  దాన్ని వస్త పోత చూస్తుంటాను.  దాన్ని తెచ్చుకుని పెంచుకుందామనిపిస్తుంది.  కానీ దగ్గర దగ్గరికి పోదామనుకునే లోపలే వెనకెక్కడో భౌభౌ మని భయంకరమైన అరుపులు.  ఈ అరుపులు వింటే నాకు ఈ లోకంలో రణగొణధ్వని గుర్తొస్తుంది.  దాని వెనక పనిపేరుతో ఎవళ్లని వాళ్లు పోగొట్టుకునే మనుషులు గుర్తొస్తారు.  ఇంకేముంది?  కుక్కపిల్లనలా చూస్త మిల్లుకొచ్చేస్తాను.  మిల్లులో మళ్లీ మామూలే.  పని చేస్తున్నట్టుగా ఉండి ఫలితం సంగతి పట్టని వాళ్లతో కుస్తీ.  ఫలితం సంగతి పట్టని వాళ్లంటే గుర్తొచ్చింది.  గీతలో కిష్టభగవాన్లు అదే చెప్పాడంట కదా.  వీళ్లు మరి గీత చదువుకున్నారా?  లేక వీధి వీధికీ వెలిసిన దేవాలయల్లో పొద్దున్నే వేసే గంటసాల రికార్డుల సారం నవరంధ్రాల గుండా వొంట్లోకి పాకిందో, ఏమోగానీ ఫలితం దాని నాణ్యత గురించిన ఆలోచనే లేకుండా పనిచేస్తున్నట్టుగా వుండే వాళ్లను చూస్తే, అసలు పని చెయ్యమన్నది నేనుగాబట్టి దాన్ని గురించిన ఆలోచన చేయల్సింది నేనే, వాళ్లు సరిగా చెయ్యకపోతే సరిగ్గా చేసేట్టు చూసుకోవలసిందీ నేనే, కర్తా నేనే, కర్మా నేనే, క్రియ నేనే – యిదేదో అహంభావమనుకునేవు దొరా – ఎటొచ్చీ ఎటుబోయి కిందా మీద బడి పని పూర్తి చేయించుకోవాల్సింది నేనే గదా అనే నా ఉద్దేశం”.

”ఈ మజ్జెన పనిచేసే వాళ్ల తీరు చూస్తుంటే సమాజం మీద తమవంతు కసి తీర్చుకునే అవకాశం వాళ్లకొచ్చిందేమో అనిపిస్తుంది.  వాళ్లకు పని చూపించకుండా చూపించినా పని తేలిగ్గా జేసే మార్గం చూపించకుండా, పని అయిపోయినా దానికి ప్రతిఫలం తొందరగా యివ్వకుండా, యిచ్చినా పూర్తిగా యివ్వకుండా యిన్ని రీతుల వాళ్లను సతాయిస్తే, అవమానిస్తే, అడ్డదిడ్డంగా వాళ్లను తిప్పుకుంటే మారుతున్న ప్రపంచంలో యిప్పుడు పనిచేసే వాళ్ల మనసులను వాళ్ల తల్లిదండ్రుల సామూహిక స్పృహ ఆవహిస్తుందో ఏవె!  రావడం పదకొండు గంటలకు, పోవడం నాలుగు గంటలనుంచి మొదలు.  మధ్యల్లో అన్నానికో గంట.  యింక పనిచెయ్యడానికి మిగిలిందెంత నాలుగ్గంటలు.  ఈ నాలుగ్గంటల్లో రేపు పని ఉందా లేదాని అడగడానికి తేల్చుకోవడానికీ అరగంటా!”
”ఎక్కడ్నుంచో యిలా ఫోన్లో మాట్లాడ్డం కాదుగానీ, యీసారి ఏకంగా కరీంనగరమొచ్చి ఎదురెదురుగా కూచొని మన ఆలోచన్లు కలబోసుకుందాం.  ఎంత కలబోసినా గాలీ, నీళ్లూ కలుస్తాయ?  నిజంగా కలవ్వా?  నీళ్లలో గాలి, గాలిలో నీళ్లూ రెండ ఒకదాన్లో వొకటి కలిసే ఉంటాయ్‌ గానీ, వొకదాన్నొకటి తరుముకుంటున్నట్టే ఉంటాయ్‌.  గాలొస్తే నీళ్లు చెదురుతాయ్‌.  నీళ్లున్న దగ్గర గాలి కనబడదు.  మనిద్దరం అంతేనా దొరా?”
”ఇద్దర్ని కలిపి చూడ్డానికే యింత తతంగం ఉందే యింక నాకు అందర్నీ కలిపి చూడాలనుండే!  అంటే అందర్నీ కలిపి వొక్కటిగా చూడాలనుంది.  యీ ప్రకృతిలో యిన్ని శాల్తీలున్నాయ?  అయినా అన్నీ కలిస్తేన వొక ప్రకృతే!  కాకుంటే పాముకూ, నెమిలికీ పడదనిపిస్తుంది.  ముంగిసకూ, పాముకూ పడదనిపిస్తుంది.  ఈ పడనివన్నీ కలిసి ఎక్కడో ఉండవే!  మళ్లీ అవే పరిసరాల్లో ఉంటాయి.  వొకదాని కంటబడకుండా వొకటి ఉంటాయి.  యిట్లా కంటబడకుండా ఉండటాన్నే శతృత్వం అనుకుంటారు గానీ ఈ మనుషులు, ఆకలి తీరింతరవాత ఏజంతువైనా తను ఆహారంగా తీసుకునేదే ఎదురైనా దాన్నేమైనా చేస్తుందా?  కానీ మనుషులెందుకు అలా ఉండరు?  అవసరం లేని వాట్నిగడా పోగేసుకుని ఏదో సంపాదించామనుకొంటారు.  అలా సంపాదించడాన్ని సామర్థ్యమనుకుంటారు.  ఈ సమర్థత ఉన్నవాళ్లే మనుషులను కుంటారు.  యిట్లా డొంకతిరుగుడు – కాదుకాదు బుర్ర తిరుగుడు ఆలోచన్లతో రోజంతా, ఏడాదంతా సతమతమై పోతుండే వీళ్లంతా వొకటిగా ఎలా వుంటారు?  కానీ అందర్నీ వొకటిగా చూడాలని నా ఆశ.  కానీ చూసేవాళ్లకెప్పుడ అందర వొకటిగా కనిపించరా!?  నేన, అందర కలిసి వొకేలా చూసే రోజు నీలాగే ఉంటుందేమో!  యిప్పటికిప్పుడు యిక్కడే ఉన్నట్టుంటావు.  కానీ ఎక్కడో చూస్తుంటావు.  అందుకే నువ్వంటే యిష్టం.  నాతో వుంటావు.  ఉండవు.  తన చుట్టుపక్కలనన్నింటినీ ప్రేమించే నదిలా నిరంతరంగా ఆలోచనలతో ప్రవహిస్తుంటావు.  నది మైదానాన్ని ప్రేమిస్తుంది.  కానీ మైదానంలో ప్రతి వొక్కటీ నది తననే ప్రేమిస్తోందనీ, ప్రేమించాలనీ భ్రమపడతాయి.  ఆశలు పెంచుకుంటాయి.  ఈ గోలలో వున్న మనుషులు నదినే పాడుచేస్తారు.  దానికి ప్రగతని పెద్దపేరు.”

”పోయినసారి    వచ్చినప్పుడు యిక్కడో అమ్మాయి పనికొస్తోందని చెప్పాను గుర్తుందా?  ఆమె ముఖంలో దిగుల్తో కూడిన అందముంది.  వాళ్ల అమ్మ నాయనలు తొందరపడి వో తాగుబోతోడికిచ్చి పెళ్లి చేసేసారు.  వాడికింతకు ముందే వో పెళ్లైందట.  ఎవడికో వొకడికిచ్చి కట్టబెట్టెయ్యలనే ఈ అమ్మ నాయన్లనే వాళ్లగోల.  తీరా పెళ్లయిన మూణ్ణెల్లకే వాడు ఎక్కడికో వెళ్లిపోయట్ట.  అప్పుడు ఏం చేయలో తోచక యింటికి తెచ్చేసుకున్నార్ట.  పొద్దుబోవడానికని ఏదో పనికి పోతుండేదట.  అలా పోతుండగా వోరోజు హార్టీకల్చర్‌ డిపార్టుమెంటు వాళ్లు పెంచుతున్న నర్సరీ చసి ఆగిపోయిందిట.  అక్కడ పనిచేస్తున్న వాళ్లతో మాటా మాటా కలిసింది.  నువ్విక్కడ పనికి రావొచ్చుగదా అని వాళ్లనడం, రానిస్తరో లేదో ననే సందేహంలో ఉండగానే నర్సరీ యింఛార్జీ ఈ అమ్మాయిని చూసి నువ్వుకూడా పనికి రావచ్చని చెప్పాట్ట.  అలా అలా పనికిపోవడం మొదలై యిప్పడెక్కడికొచ్చిందంటే అతను ఊళ్లు తిరగడానికి – అదే టరు పోయినప్పుడు ఈ అమ్మాయిని తోడు తీసుకుని పోతాడట.  మిగిలిన రోజుల్లో తన భార్యతో ఉంటాడట.  అంటే తన బాస్‌ ఉండే వూళ్లో భార్యా పిల్లల, యితనొక్కడే ఈ నర్సరీ దగ్గరుండడం.  నర్సరీతో బాటే పిల్లా దొరికిందని అతననుకుంటున్నాడేమో, యీ పిల్ల మాత్రం అతనెంత మంచివాడో చెప్పి మురిసిపోతుందట అమ్మ నాయన్లతో.”
”అమ్మా నాయన్లు చేసేదేంలేక ఈ అమ్మాయిని అతన్తో నేరుగా పంపించలేకా, ఉంటే – ఊరూ, పరుపూ, మర్యాద లాంటివన్నీ ఉన్నాయ్‌ గదా వీళ్లకు – నెలకో రెణ్ణెల్లకో ఈ అమ్మాయే యింటికొస్తుందట.  వచ్చేటప్పుడు యింటిక్కావలసిన సరుకులు తెస్తుందట.  ఆ సరుకుల కోసమే పూర్తిగా కాకపోవచ్చుగానీ కాగల కర్తవ్యం వాళ్లెవరో తీర్చినట్టు తాము యివ్వలేని సంతోషాన్ని ఆ అమ్మాయి అదాటుగా పొందడాన్ని వాళ్లు కాదన్లేరు.  అవునన్లేరు.  లోకం మ్మారి పోతోంది గురగార.  కాకుంటే పైకి కనిపించినంత  వేగంగా  కాదుగానీ లోపల్లోపల లోకం మ్మారుతనే ఉంది.  లేకుంటే చదువులేని ఈ పిల్లేంది, ఊరుగాని ఊళ్లవెంట, తన మతంగాని మతం వాడి వెంట నిర్భయంగా, సంతోషంగా తిరుగుతుంటే ఆ అమ్మా నాయన్లకదో ఊరట.  ఆ మతంగాని మతపోడు ఊళ్లోకి రాకపోతే ఊరోళ్లకి అదో ప్రతిష్ట.  యిట్లా నడుస్తుంటాయ్‌ మన కట్టుబాట్ల, వాటివెనక ఉండే జరుగుబాట్లు.  అన్నట్టు ఈ పిల్ల యిప్పుడు వో పదిరోజులబాటు వాళ్ల అమ్మా నాయన్ల దగ్గర ఉండడానికొచ్చింది.  ఊరికుండడమెందుకని పన్లో కొచ్చింది.  అందరు యిట్లా ఎందుకుండరని అనిపించి నీకు చెప్తున్నా దొరా!”
 ”అవున, యిలా క్రమేణా ఈ అమ్మాయిలంతా కాస్త బెదురుపోగొట్టుకుంటే ఆ మతం గాని మతపోళ్లలాంటి వాళ్లు దొరికితే అందరు కలిసి వొకటిగా ఆలోచి స్తారేమో!  ఏమో!  కాదూ!”
 ”మళ్లీ మాట్లాడతాను దొరా.  అక్కడెవరో పనివాళ్లు వొస్తున్నట్టున్నారు” అని ఫోను పెట్టేసింది.  మళ్లీ యింతవరకు తననుంచి ఫోను గానీ, తనే రావడం గానీ జరగలేదు.
 కలొచ్చిందా? లేక కలలా వొచ్చి అలా వెళ్లిపోయిందా?  మళ్లీ వొస్తుందేమో!  మజ్జెలో వచ్చి మజ్జెలో పోతానంది గానీ, ఎవరైనా అంతే గదా!  సృష్టి అలా సాగుతూ ఉంటుంది.  ఎవరైనా మజ్జెలో వచ్చి మజ్జెలో పోవడమేగదా!  ఆ కాస్తలోనే ఈ కొద్దిమంది పెత్తనాలు, ఎక్కువమందికి కన్నీళ్లు.
 కన్నీళ్లు ఎవరి గుండెను వాళ్లు శుభ్రం చేసుకోడానికి పనికొచ్చేదాకా ఈ పెత్తనాల మిధ్యావాదాలు భరించక తప్పదేమో!  పెత్తనాన్ని కొన్నాళ్లు భరించడానికి కావాల్సిన శక్తిని యీ కన్నీళ్లే యిస్తాయేమో!  లేకపోతే ప్రపంచం వొక్కసారిగా పేలిపోయి ఉండేది కాదూ!  దీన్ని క్రమేణా ఎదిగేట్టు చేస్తున్న వీ కలల, కన్నీళ్లే!  యీ రెంటిమధ్యా మళ్లీ ఎప్పుడో ఆమె వొస్తుందనుకుంటాను.

 

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.