దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

వేములపల్లి సత్యవతి

20 వ శతాబ్ధం తెలుగు మహిళా లోకానికి అపూర్వమైన, అమూల్యమైన యిరువురు నారీశిరోమణులను ప్రసాదించింది.

  ఒకరు డాక్టరు దుర్గాబాయి గారు  మరొకరు కొమఱ్ఱాజు అచ్చమా౦బ గారు.

  వారు ఏపదవిని అలంకరించినా, ఏవృత్తి చేపట్టినా మహిళాభ్యుదయాన్ని మరచిపోలేదు.  తుది శ్వాస విడిచేవరకు మహిళల అభివృద్ధికి తపించి, శ్రమించి విజయాలు సాధించారు.  ఆ మాననీయ మహిళా మణులిరువురు తెలుగువారి ఆడపడుచులైనందుకు తెలుగువారంతా గర్వపడాలి.  1908 జులై నెల నుంచి దుర్గాబాయి గారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది.  ఆ సందర్భంగా ఆమె కర్పించే నివాళులే ఈ వ్యాసం.
జననం – బాల్యము
 రాజమండ్రిలో వమాతామహుల యింటిలో 1909 జులై 15న జన్మించారు.  తల్లి కృష్ణవేణమ్మ – తండ్రి రామారావుగారు కాకినాడ వాస్తవ్యులు.  చిన్నతనం నుండే సుడిగాలిలా చుట్టివచ్చే స్వభావం దుర్గాబాయి గారిది.  ప్రతి పనిమీద పట్టుదల, శ్రద్ధ చూపేది.  పిఠాపురంలో పెదనాన్నగారి యింటిలోవున్నప్పుడు హిందీ బాగా నేర్చుకున్నారు.  కాకినాడ వచ్చిన తర్వాత తమ యింటిలోనే బడి పెట్టి బాలికలకు హిందీ, తెలుగు, ముగ్గులు, ఆట-పాటలు నేర్పసాగారు.  అప్పుడు ఆమె వయసు 11 సంవత్సరాలు.  నెమ్మదిగా మహిళలకు కూడా నేర్పసాగారు.  సంఘసంస్కర్త వీరేశలింగం గారు, ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావుగారు తమ భార్యలకు చదువు చెప్పటంతో స్త్రీ విద్యకు శ్రీకారం చుట్టారు.  దుర్గాబాయిగారు తల్లికి చదువు చెప్పటంతో పాటు ఇతర మహిళలకు కూడ చదువు చెప్పటం మొదలెట్టారు.  తనయ తల్లికి చదువు చెప్పి కృష్ణవేణమ్మగారిని హిందీ భాషా ప్రవీణ సర్టిఫికెట్‌ పొందేలాగా చేసారు.  1919-20 లలో గాంధీజీ రాజమండ్రి వచ్చారు.  ఆ సమయంలో తల్లిదండ్రులతో పాటు దుర్గాబాయి గారు కూడ రాజమండ్రి లో వున్నారు.  బహిరంగ సభకు వెళ్ళారు.  సభలో వాలంటీర్లు హుండీలు పట్టుకొని ప్రజలలో విరాళాలు వసూలు చేయటం చూశారు.  ఏదోవిధంగా ఒక గాంధీటోపి సంపాదించి తాను కూడ విరాళాలు వసూలు చేశారు.  సమయస్పూర్తి ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.  అది నిండగానే నానా తంటాలు పడి వేదిక మీదకెక్కి గాంధీజీ ముందు ఆ చిల్లర డబ్బులు గుమ్మరించారు.  గాంధీజీ చూపు ఆమె చేతులకున్న బంగారు గాజులపైన పడింది.  వాటిని చూపిస్త ఇవేమి చేసుకుంటావన్నారు.  వెంటనే గాజులు తీసి యిచ్చింది.  తల్లి-తండ్రి ఏమైనా అంటారన్న భయం ఆమెలో లేశమాత్రం కూడ కలుగలేదు.  కాకినాడ వచ్చిన తర్వాత విదేశీ వస్త్రాలను రోడ్డుమీదవేసి నిప్పంటించారు.  ఆమె మనోఫలకం మీద గాంధీజీ ప్రభావం పడింది.  ఆరోజు నుండి తల్లి-కూతుళ్ళు ఖద్దరు కట్టటం మొదలు పెట్టారు.  కృష్ణవేణి గార్కి వీణ వాయించటం వచ్చు కాని ఆమె వేరే గురువుగారి దగ్గర వీణ, హార్మోనియం వాయించటం నేర్చుకున్నారు.  1920లో బడి పెట్టినప్పుడు నలుగురు విద్యార్థినులు మాత్రమే వుండేవారు.  1923లో కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సభకు తమ పాఠశాల నుండి 600 మంది వాలంటీర్లను తయారుచేశారు.  అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు.  సభతోపాటు ఖాదీ ప్రదర్శనను ఏర్పాటు చేసి రెండణాల టికెట్‌ కూడ పెట్టారు.  ప్రధాన ద్వారం దగ్గర కొండా వెంకటప్పయ్య గారు దుర్గాబాయి గారిని నిలబెట్టి టికెట్‌ లేనివారిని లోనికి వెళ్ళనీయవద్దని చెప్పారు.  టికెట్‌ సంగతి తెలియకనేమో నెహ్రూజీ లోనికి వెళ్లబోయారు.  దుర్గాబాయిగారు చేయి అడ్డం పెట్టి టికెట్‌ అడిగారు.  ఆయన దగ్గర జేబులో రెండు అణాలు కూడ అప్పుడు లేవు.  నెహ్రూజీ వెనుదిరిగారు.  ఇది చూచి వెంకటప్పయ్యగారు దుర్గాబాయి గారి చెవి మెలిపెట్టి ఆయనెవరో తెలుసా? నెహ్రూజీ అన్నారు.  తెలుసు.  మీరేగా టికెట్‌ లేనివారిని లోనికి వెళ్ళనివ్వవద్దని చెప్పిందని నిర్భయంగా జవాబిచ్చారు.  వెంకటప్పయ్య గారు పరుగు పరుగున వెళ్లి నెహ్రూని రావలసిందిగా కోరారు.  మీ దగ్గర రెండణాలుంటే టికెట్‌ తేండని తర్వాత లోనికి వెళ్లారు.  దుర్గాబాయిగారి క్రమశిక్షణను ప్రశంసించారు.
స్త్రీల సభ
 1926-27లో గాంధీజీ కోటి రూపాయల విరాళాల కొఱకు దేశమంతా పర్యటించారు.  కాకినాడకు వస్తారన్న సంగతి ము౦దే తెలుసుకున్న దుర్గాబాయి గారు స్త్రీల సభ ఏర్పాటు చేసి అయిదు నిమిషాలు గాంధీజీని రప్పించాలనుకున్నారు.  ఆ సంగతే వెంకటప్పయ్యగారికి, బులుసు సాంబమూర్తి గారికి తెలుపగా, వెంకటప్పయ్య గారు నీవు స్త్రీల సభ ఏర్పాటుచేస్తే దానికి గాంధీ గారిని తీసుకురావాలా?  ఏదో చిన్నపిల్ల! పోనీలే! అని వూరుకొన్నకొలది ఆగడాలు ఎక్కువవుతున్నవని, నీపనేదో చూసుకొమ్మని మందలించారు.  సాంబమూర్తి గారేమో ఐదువేల రూపాయల పర్సు యిస్తే అయిదు నిమిషాలుతీసుకొస్తామని పరిహాసాని కన్నారు. దుర్గాబాయి  సరే అని వెనుదిరి గారు.  సమాజంలో నలుగురి మధ్యకు రాలేక నికృష్ట జీవితం గడుపుతున్న దేవదాసీలను, పరదామాటున మగ్గుతున్న ముస్లిం మహిళలను ఒక చోట చేర్చి దానికి గాంధీజీని రప్పించాలనుకుంది.  వారి ఎడల ఆమె ఎదలో ఎనలేని సానుభూతి వుంది.  మొదట వారి దగ్గరకు వెళ్లి బహిరంగ సభకు రావలసిందిగా నచ్చచెప్పింది.  మత కట్టుబాట్లను ఉల్లంఘించి రాలేమని ముస్లిం మహిళలు, సమాజంలో తమకున్న స్థానాన్ని బట్టి బహిరంగంగా రాలేమని దేవదాసీలు చెప్పారు.  మాకు గాంధీజీని చూడాలని వుంది.  ప్రత్యేకంగా స్త్రీల సభ ఏర్పాటు చేస్తే వస్తామని ముస్లిం మహిళలు, దేవదాసీలు తెలిపారు.  ఆమె వారికి ఐదువేల రూపాయల సంగతి తెలిపింది.   దానికి ఏర్పాట్లు కూడ చేశారు.  రోజు రాత్రి పూట ఒక దేవదాసీ యింటిలో నాటకాలు, బుర్రకథలు, హరికథలు, గాంధీగారు చేసేపనులను తెలిపేలాగ చేసి ఎవరింటిలో జరిగినా దానికి దేవదాసీలంతా వచ్చేలాగ చేశారు.  వచ్చినవారి దగ్గర వారికి తోచినంత విరాళాలు వసూలు చేశారు.  ఐదువేలు పూర్తయినవి.  పర్సు పట్టుకొని నాయకుల దగ్గరకు వెళ్లి ఇగోండి ఐదువేల రపాయలు,  గాంధీగారిని అయిదు నిమిషాలు స్త్రీల సభకు వచ్చేలాగ చేయండని అడిగారు.  వారు అవాక్కయ్యారు.  చేసేదేమీలేక అన్న ప్రకారం అయిదు నిమిషాలేకదా!  మొదలే గాంధీజీని అక్కడకు తీసుకపోదామని తీసుకొచ్చారు.  దుర్గాబాయి గారు హిందీలో గాంధీజీకి స్వాగతోపన్యాసం క్లుప్తంగా చెప్పారు.  గాంధీజీ యింతకు పూర్వము ఎన్నడూ ఇలాంటి సభలో ఉపన్యసించలేదు.  రెండు గంటలు వుపన్యసించారు.  ఉపన్యాసం ముగిసిన తర్వాత నాయకులు ఐదు నిమిషాలని అయిదు గంటలు చేశావని ఆగ్రహం వెలిబుచ్చారు.  మీకిచ్చిన సమయం అయిదు నిమిషాలే.  నాకు యిచ్చిన సమయం కూడ అయిదు నిమిషాలే.  కావున ఉపన్యాసం ముగించండని గాంధీజీకి ఎలా చెప్పగలను?  అందుకు నేనేమి చేయగలను?  అని సమాధాన మిచ్చారు.  ఆమె ఉపన్యాస వాగ్ధాటి గాంధీజీని చకితుడ్ని చేసింది.  వీడ్కోలు చెప్పి ఆమె లోపలకు వచ్చారు.  కారులో కూర్చున్న గాంధీజీ ఏది? ఆ అమ్మాయి, పిలవండని తన కారులో ఎక్కించుకొని వెళ్ళారు.  వెంకటప్పయ్య గారి స్థానం దుర్గాబాయికి దక్కింది.  టౌను హాలులో జరిగిన సభలో గాంధీజీ ఉపన్యాసాన్ని ఆమెనే అనువాదం చేయమన్నారు.  అంతకు పూర్వం వెంకటప్పయ్యగారు అనువాదకులుగా వుండేవారు.  అప్పటినుండి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో గాంధీజీకి ఆమె అనువాదకురాలయింది.  అప్పటికే ఆమె భారతి, గృహలక్ష్మి, శారద పత్రికలలో కథలు రాసేవారు.
మద్రాసు పయనం
భర్త సుబ్బారావుగారి వైద్యం కొఱకు మద్రాసు వెళ్ళి కాశీనాథ నాగేశ్వరరావుగారి యింటి వెనుక భాగంలో అద్దె లేకుండా వుండేవారు.  వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏమంత బాగుండలేదు.  తండ్రి గతించారు.  భర్తకు వైద్యం చేయించుతూ ఖాళీ సమయంలో మహిళలను పోగుచేసి తెలుగు, హిందీ నేర్పేవారు.  సాయంవేళ వీణ వాయించేవారు.  మృదుమధుర వీణానాదం విన్నవారు పరవశించి పోయేవారు.  కాంగ్రెస్‌ సభలలో చిన్ననాటినుండి  జంకు గొంకు లేకుండ కొల్లాయి గట్టితేనేమీ మా గాంధీ’ అనే పాటతో పాటు పలురకాల జాతీయ గీతాలు పాడేవారు.  1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టారు.  అందులో మహిళలు పాల్గొనకూడదని నిషేధించారు.  ఇది దుర్గాబాయి గారికి నచ్చలేదు.  గాంధీజీ వద్దకు వెళ్ళుతున్న నాగేశ్వరరావుగారి ద్వారా గాంధీజీకి ఉత్తరం రాసి పంపింది.  దానిలో ”బాపూ! స్త్రీలు ఏమి పాపం చేశారు?  వారు పాల్గొనకూడ దని ఎందుకు నిషేధించారు.  స్త్రీ అబల కాదని మీరేగా చెప్పింది”  అని రాసింది.  దానికి గాంధీజీ అనుమతిస్తూ జవాబు రాసి నాగేశ్వరరావుతోనే పంపారు.  ఉప్పు సత్యాగ్రహం చేయటానికి నాగేశ్వరరావు పంతులుగారు, ప్రకాశం గారు చీరాల వెళ్ళే ప్రయత్నాలలో వున్నారు.  ఇది దుర్గాబాయి గారికి నచ్చలేదు.  దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలకు రాజధానియైన మద్రాసును వదలి వేరేచోట చేయటం ఎంతవరకు సబబు?  ఇక్కడ చేసే ధైర్యం, దమ్ములు లేక దూరంగా పల్లెలకు వెళ్లారని బ్రిటిష్‌ పాలకులు భావించరా?  వారి దృష్టిలో తేలికయి, చులకనైపోమా?  అని వారికి నచ్చచెప్పి చీరాల ప్రయాణం మాన్పించి మద్రాసులోనే సత్యాగ్రహం ప్రారంభించేలాగ చేశారు.  మద్రాసు బీచ్‌లో నాగేశ్వరరావుగారు ఉప్పు తయారు చేయటానికి వెళ్ళారు.  పోలీసులు అరెస్టు చేశారు.  తెల్లవారి ప్రకాశంగారు వెళ్ళాలి.  కాని ప్రకాశంగారు తనను ఆ రాత్రే అరెస్టు చేస్తారని వూహించి, తర్వాత దుర్గాబాయమ్మగారిని ఆ పనికి నియమించారు.  అనుకున్నట్లుగానే ఆ రాత్రి ప్రకాశంగారు అరెస్టు అయ్యారు.  దుర్గాబాయిగారు ఆ పని చేపట్టారు.  ఉదయ వనం కేంద్రంగా చేసుకొని సత్యాగ్రహ కార్యక్రమాలు చేపట్టారు.  రోజూ కొంతమంది వాలంటీర్లను తయారుచేసి రోజుకొక చోటుకు పంపుతూ౦డేవారు.  ఒకరోజు అడయారులో చేస్తే రెండవరోజు బీచ్‌లో, మూడవ రోజు మరోచోట చేయటానికి పంపేవారు.  ఈ ప్లానంతా దుర్గాబాయి గారిదేనని, ఆమెను అరెస్టు చేస్తే తప్ప యిది చల్లారేలాగ లేదని సర్కారువారు భావించి అరెస్టు చేసి రాయవేలూరు జైలుకు పంపారు.  జైలులో రుక్మిణి లక్ష్మిపతి, దిగుమర్తి జానకీదేవి, సంగం లక్ష్మీబాయమ్మ గార్లతో పరిచయమయింది.  రుక్మిణి లక్ష్మిపతి దగ్గర ఇంగ్లీషు నేర్చుకోవడం మొదలెట్టారు దుర్గాబాయమ్మ గారు.
గాంధీ – ఇర్విన్‌ ఒడంబడిక
ఈ ఒడంబడిక ప్రకారం 1931లో జైలులో ఉన్న కాంగ్రెస్‌ వారంతా విడుదలయ్యారు.  1931లో కరాచీలో జాతీయ కాంగ్రెస్‌ మహాసభ జరిగింది.  22 సంవత్సరాల యువతిగా ఆ సభలో పాల్గొన్నారు.  ఖాదీ అమ్మకం నెపం మీద 1931లో దుర్గాబాయి గారిని, కృష్ణవేణమ్మ గారిని అరెస్టు చేశారు.  దుర్గాబాయిగారిని రాయవేలూరు జైలుకు పంపారు.  కేసు విచారించి ఆరు మాసాలు శిక్ష వేసి ‘ఎ’ క్లాసు ఖైదీగా వేశారు.  కాని ఆమె ‘సి’ క్లాసు ఖైదీగానే వుంటానన్నారు. ఒకే హాలులో 80 మంది మహిళా ఖైదీలను వుంచారు.  వాళ్లను చూస్తే వాళ్లను కుక్కి పడేసినట్లనిపించింది.  హిట్లరు నాజీ పాలనను తలదన్నేలాగ యింతమందిని ఒకే చోట కుక్కి పడవేశారేమో?  రూల్సు, రెగ్యులేషన్స్‌ ఎలాగున్నా కనీసం మానవతా దృష్టితోనైనా ఆలోచించవద్దా?  అని అధికారులను ప్రశ్నించారు.  అంతే.  ఇంకేముంది.  మరునాడు ఆమెను మధుర జైలుకు పంపారు.  గాలి-వెలుతురు లేని చిన్నగదిలో ఒక్క దానినే ఉంచారు.  అక్కడ వున్న ఆడ ఖైదీలంతా నేడో-రేపో మరణ దండనకు గురవబోతున్నవారే.  వారి ఏడ్పులతో, పెడ బొబ్బలతో జైలు మారుమోగి పోయేది.  దుర్గాబాయిగారి గది తలుపులు ఎప్పుడూ మూసి ఉండేవి.  ఇనుప మూకుడులో అన్నం పెట్టేవారు.  నేల మీదనే పడక.  ఆమె ప్రక్క గదిలోనుంచి ఎవరో గొంతు నులిమి చంపుతున్నట్లుగా పసిపిల్ల ఏడ్పు వినిపించింది.  గోడ సగభాగంపైన తడిక వున్నది.  వెంటనే దుర్గాబాయిగారు గోడ ఎక్కి తడిక తొలగించుకొని అవతల గదిలోనికి దుమికారు.  ఇద్దరు మహిళలు ఆ శిశువును చంపటానికి పోటీ పడుతున్నారు.  అందులో ఒకరు ఆ శిశువు తల్లి కావటం విశేషం.  వారి నుండి అతి కష్టం మీద శిశువును లాగుకొని గుండెకు హత్తుకున్నారు.  ఆ యిద్దరు ఖైదీలు ఏకమై దుర్గాబాయి గారిని చితకబాది నేలమీద పడవేసి కాళ్ళతో తొక్కసాగారు.  అయినా ఆమె శిశువును వదల్లేదు.  ”రక్షించండి – రక్షించండి” పెద్దగా కేకలేయటం మెదలెట్టారు.  అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న జైలు సూపరింటెండెంట్‌ చెవులపడి ఆయన వచ్చి గది తలుపులు తీసి క్రిందబడ్డ దుర్గాబాయి గారిని, ఆ శిశువును రక్షించారు.  మీరు ఎలా రాగలిగారని దుర్గాబాయి గారిని ఆయన అడిగారు.  గోడతడిక తొలగించి దూకానని చెప్పారు.  ఆమె సాహసానికి, మానవతా దృక్పథానికి సూపరింటెండెంట్‌ సంతసించి దుర్గాబాయిగారిని మీరు కోరుకున్న దేదైనా చేస్తాను.  ఏమి కావాలో చెప్పండని అడిగారు.  ఆమె ఒక వీణ కొని పెట్టమని అడగటం, కొని యివ్వటం జరిగింది.  ఆ మహిళా ఖైదీలను చూసిన తర్వాత దుర్గాబాయి గారికి లా చదవాలన్న ఆలోచన కలిగింది.  ప్రాణంలో ప్రాణమైన బిడ్డను కన్నతల్లే చంపదలచిందంటే ఆమె ఎంతటి మానసిక రుగ్మతలకు లోనయినది?  దానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే లా చదవాలిసిందే అనుకున్నారు.  అంతేగాక కాంగ్రెస్‌ మహాసభలో కొంతమంది ఆమె గాంధీజీకి ఎంత ఆత్మీయురాలైనా, పెద్ద నాయకురాలైనా ఎ,బి,సి,డి లు కూడ రావనుకున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి.  1933లో జైలునుంచి విడుదలయింది.  ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది.
దుర్గాబాయి భర్త ఆమెవలన దాంపత్య సుఖానికి దూరమైనందున మరల వివాహం చేసుకోవాలనుకున్నారు.  కాని దుర్గాబాయి మీద పిల్లనివ్వడానికి తల్లి-తండ్రులు జంకుతున్నారు.  ఈ సంగతి తెలిసి దుర్గాబాయిగారు భర్తకు పిల్ల తల్లి-తండ్రులను తనవద్దకు పంపమని, వివాహానంతరం మీ జీవితంలోనికి ప్రవేశించనని, మీ ఆస్థిమీద ఆశలేదని, నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, భార్యగా తన విధులను సక్రమంగా నిర్వర్తించలేక పోయానని ఉత్తరం రాశారు.  అయినా మనసు కలత చెందింది.  8వ యేట ఆమె ప్రమేయం లేకుండ జరిగిన పెండ్లి ఆమె ప్రమేయం లేకుండానే ముగిసింది.  వీటన్నిటిని మరచి మరొక వ్యక్తిగా రూపు దిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు.  24వ యేట చదువు మొదలు పెట్టింది.  మధుర జైలు నుండి వచ్చిన తర్వాత ఆమె మీద పోలీస్‌ నిఘా ఎక్కువయింది.  ఆమెకు చదువు చెప్పటానికి భయపడినవారు కూడ లేకపోలేదు.  ఆమెలో పట్టుదల, ఆత్మ విశ్వాసం పుష్కలంగా వున్నవి.  నాస్తికునిగా పేరుపొంది, కాలేజీ లెక్చరర్‌గా తొలగింపబడి, సంఘ బహిష్కారానికి గురయిన గోరా గారి వద్ద చదువు ఆరంభించింది.  ‘క్రిటిక్‌’ అనే లిఖిత మాస పత్రిక పి.ఆర్‌. కాలేజీలో చదువుతున్న దుర్గాబాయిగారి తమ్ముడు నారాయణరావు గారు నడుపుతుండేవాడు.  ఆ కాలేజీలోనే లెక్చరర్‌గా పనిచేస్తున్న గోరాగారు దైవభావం మానవ కల్పితమనే వ్యాసం రాయటం దానిని ‘క్రిటిక్‌’ లో నారాయణరావు గారు ప్రచురించటం జరిగింది.  ఫలితంగా గోరాగారు ఉద్యోగం నుండి తొలగింప బడటం, నారాయణరావు గార్ని డీబార్‌ చేయటం జరిగింది.  గోరాగారు కాకినాడలో ట్యుటోరియల్‌ కాలేజి స్థాపించారు.  దుర్గాబాయిగారు అందులో చేరి బెనారస్‌ మెట్రిక్‌ పరీక్ష రాసి ద్వితీయ శ్రేణిలో ఎక్కువ మార్కులతో పాసయింది.  కృష్ణవేణమ్మగారు కాకినాడలోని స్వంత యింటిని అమ్మి అప్పులు తీర్చి పిల్లలతో రాజమండ్రికి చేరారు.  కృష్ణవేణమ్మగారు ఒక ప్రయివేటు పాఠశాలలో హిందీ టీచరుగా చేరింది.
బెనారస్‌ మెట్రిక్‌ పూర్తిచేసిన దుర్గాబాయిగారు సాంబమూర్తిగారి వెంట బెనారస్‌ వెళ్లింది.  పండిత మదన మాల వ్యాజీని కలిసి తన స్థితిగతులను వివరించి చదువు కొనసాగించటానికి సహాయపడ వలసినదిగా కోరింది.  అంతకు ముందే దుర్గాబాయిగారిని గురించి వినివున్న మాలవ్యాజీ ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేశారు.  ఇంటర్‌మీడియెట్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలయింది.  అదే కాలేజీలో రాజకీయశాస్త్రం తీసుకొని ఆనర్సు చదవాలని ఆమె కోరిక.  ఆ సబ్జక్ట్‌ పురుషుల కాలేజీలో తప్ప మహిళల కళాశాలలో లేదు.  పురుషుల కాలేజీలో చేరి చదువుకొనటానికి అనుమతి వ్వవలసిందిగా మాలవ్యాజీని ప్రాధేయ పడింది.  ససేమిరా మాలవ్యాజీ ఒప్పు కోలేదు.  పెట్టె చేత పట్టుకొని సరాసరి విశాఖపట్నం వచ్చేసారు.  ఆంధ్రయూని వర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డిగారు అప్పుడు వైస్‌ ఛాన్స్‌లర్‌.  సాంబమూర్తి గారిని వెంట బెట్టుకొని సి.ఆర్‌. రెడ్డి గారిని కలిశారు.  ఆమె కోరుకున్న దానిలో సీటు యివ్వటానికి ఉచితంగా అన్ని ఏర్పాట్లు కలిగించటానికి ఒప్పుకున్నారు.  కాని మహిళలకు యూనివర్సిటీలో వసతి గృహం లేనందున వుండే ఏర్పాటు దుర్గాబాయి గారినే చూసుకోమన్నారు. మహిళలకు వసతిగృహం ఎందుకు పెట్టలేదని ఆమె అడిగారు.  ఎవరూ రాలేదు పెట్టలేదని రెడ్డిగారు సమాధాన మిచ్చారు.  ముందు మీరు పెట్టండి వస్తారని ఆమె అన్నారు.  వచ్చిన తర్వాతనే పెడతాం ముందుగా పెట్టమని రెడ్డిగారు ఖరాఖండిగా చెప్పేశారు.  సరే, అని ఆమె వచ్చేశారు.  సమయస్పూర్తి ఆమెకు వెన్నతో అబ్బిన విద్య.  తెన్నేటి విశ్వనాథం గారి సలహా ప్రకారం స్థానిక పత్రికలో యూనివర్సిటీలో చదివే మహిళలు వసతిగృహంలో చేరదలచుకుంటే ఈక్రింది అడ్రసుకు సంప్రదించవచ్చని ప్రకటన ప్రకటించారు.  పన్నెండుమంది మహిళలు ముందుకొచ్చారు.  వారితో వసతి గృహం ఏర్పాటయింది.  అనతికాలంలోనే విపరీతంగా సంఖ్య పెరిగింది.   అది చూచి యూనివర్సిటీ వారు మేమే వసతి గృహం ఏర్పాటు చేస్తున్నాం.  మీరు దానిని మూసి వేయండని అడగవలసి వచ్చింది.  1935లో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్టు ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి.  దుర్గాబాయి గారిని నిలబెట్టాలని ప్రకాశం పంతులుగారు, సాంబమూర్తి గారు విశ్వప్రయత్నం చేశారు.  కాని ఆమె ధ్యేయం లా పూర్తిచేయటం.  సున్నితంగా వారి ప్రతిపాదనను తిరస్కరించారు.  ఆనర్సు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలై యూనివర్సిటీ నుండి అడుగు బయట పెట్టారు.
ఆంధ్రమహాసభ అవతరణ
 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ నాయకులు విజయం సాధించారు.  బులుసు సాంబమూర్తి గారు మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ స్పీకరుగా ఎన్నికైనారు.  నారాయణరావుగారిని తన పి.ఏ.గా నియమించుకున్నారు.  దానితో దుర్గాబాయి గారి కుటుంబం మద్రాసు చేరింది.  కృష్ణవేణమ్మగారు ‘సేవాసదనం’ లో హిందీ టీచరుగా, ఆమె కోడలు తిమ్మబాయిగారు మెథడిస్ట్‌ చర్చి స్కూలులో తెలుగు పండిట్‌గా చేరారు.  వారు అద్దెకున్న ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలముండేది.  సాయం కాలం బడినుంచి వచ్చిన బాలబాలికలు అక్కడ ఆడుకోవడానికి చేరేవారు.  కృష్ణవేణమ్మ గారు వారిని చేరదీసి కథలు చెప్పటం, క్రొత్త ఆటలు నేర్పటం, ముగ్గులు నేర్పటం మొదలెట్టారు.  పిల్లల క్లబ్‌ ఏర్పాటు చేసి ‘లిటిల్‌ లేడీస్‌ బృందావన్‌’ అని పేరు పెట్టారు.  తమ పిల్లలు నేర్చుకుంటున్న వాటిని చూడటానికి వచ్చే తల్లులకు తెలుగు, హిందీ నేర్చుకొమ్మని ప్రోత్సహించి చదువు చెప్పటం మొదలెట్టారు.  వారి సంఖ్య 30 దాకా పెరిగింది.  విశాఖపట్నం నుంచి సెలవులకు వస్తూ పోతూ ఉన్న దుర్గాబాయి గారు ఆ 30 మందితో 1938లో ఆంధ్ర మహిళాసభకు అంకురార్పణ చేశారు.  అందులోని వారిని హిందీ పరీక్షలకు, బెనారస్‌ మెట్రిక్‌ పరీక్షలకు తయారు చేశారు.  1938లో రుక్మిణి అరండేల్‌ అధ్యక్షతన ప్రథమ వార్షికోత్సవం జరిగింది.  1939లో దుర్గాబాయిగారు మద్రాసులోని లా కాలేజీలో చేరారు.  సాంబమూర్తిగారి సహకారంతో తమ సభను చెన్నపురి ఆంధ్రమహాసభకు అనుబంధంగా చేర్చి చెన్నపురి ఆంధ్రమహాసభ స్త్రీల శాఖగా పేరు మార్పించి ఆర్థికవనరులు సమకూరేలాగ చేసారు.  సభను వేరే చోటకు మార్చారు.  బ్యాడ్మింటన్‌, టెన్నీస్‌ ఆటలకు అవకాశం కల్పించారు.  చేతి పరిశ్రమలు మొదలయ్యాయి.  బట్టలు కుట్టడం, బట్టలు నేయడం, రంగు దారాల అల్లికలు, బుట్టలు అల్లటం, చాపలు అల్లటం, నవారు నేయటం మొదలైనాయి.  వాటిలో శిక్షణ యిచ్చే ఏర్పాట్లు కూడ చేయబడ్డాయి.  ఒక ప్రక్క లా చదువుతూనే సంస్థ అభివృద్ధికి కృషి చేయసాగారు.  దుర్గాబాయి గారి కృషి చూచి రాజా విక్రమదేవవర్మగారు 5000/- రూపాయలు విరాళం యిచ్చారు.  ఆ డబ్బుతో మగ్గాలు, చర్ఖాలు కొన్నారు.  కాగితం తయారి, ప్రింటింగు, బైండింగు మొదలెట్టారు.  1940లో రాజా విక్రమదేవవర్మగారి అధ్యక్షతన మూడవ వార్షికోత్సవ సభ జరిగింది.  1941లో చెన్నపురి ఆంధ్రమహా సభ స్త్రీల శాఖగా వున్నదానిని ‘ఆంధ్ర మహిళా సభ’ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తిగల సేవాసంస్థగా సాంబమూర్తిగారి సాయంతో మార్పు చేశారు.  సరోజినీనాయుడు నాల్గవ సభకు అధ్యక్షత వహించారు.  ‘ఆంధ్ర మహిళా మాసపత్రిక’ కు మద్రాసు ప్రభుత్వం లైసెన్స్‌ మంజూరుచేసింది.  1942 నుండి పత్రిక ప్రారంభమయింది.  అదే సంవత్సరం లా డిగ్రీ పూర్తిచేసి గంట రాఘవరావు గారి దగ్గర ఎంప్రటిస్‌గా చేరారు.  1942లో రెండవ ప్రపంచ యుద్ధం భయానక రూపం దాల్చింది.  దేశమంతటా సంచలనం కలిగించింది.  కలకత్తా, ఢిల్లీ, ముంబయి, మద్రాసు మొదలైన పట్టణాల మీద బాంబులు పడతాయన్న వదంతులు తీవ్రంగా వ్యాప్తి చెందాయి.  ప్రజలు భయభ్రాంతులై మద్రాసు వదలి స్వగ్రామాలకు వెళ్ళిపోయారు.  మద్రాసు మహానగరం ఖాళీ అయింది.  అదే సంవత్సరం ఆంధ్రమహిళాసభలో బెనారస్‌ మెట్రిక్‌కు చదివిన మొదటి బ్యాచ్‌ బెనారస్‌ వెళ్ళి పరీక్షలు రాయవలసి వుంది.  కాని వారు సిద్ధంగా లేరు.  దుర్గాబాయిగారు వారిని తీసుకొని వెళ్లి పరీక్షలు రాయించి క్షేమంగా తీసుకొచ్చారు.  పరీక్షలు రాసిన వారంతా పాసయ్యారు.  ఎవరి యిండ్లలోనన్నా బాలవితంతువులున్నారని తెలిస్తే వారియిండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు నచ్చ చెప్పి వారిని తమ సంస్థలో దేనిలోనైనా చేర్పించేవారు.  ఆమె నాటిన మర్రి గింజంత సంస్థ మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది.  మీర్జాపురం రాణీ గారు ఏడు గ్రౌండ్ల స్థలాన్ని సంస్థకిచ్చారు.   బొబ్బిలి రాణీ గారు మల్లమ్మదేవి పేరున వసతి గృహం కట్టించి యిచ్చారు.  మీర్జాపురం రాజాగారు రాణీ గారి మరణానంతరం భవనాల నిర్మాణాల కోసం లక్షా యభైవేల రూపాయలు విరాళమిచ్చారు.  1945లో భవనాలు పూర్తయినవి.  1946లో సుచేలా కృపలాని వాటికి ప్రారంభోత్సవం చేశారు.  భవనాల దగ్గరలో ఎండిపోయిన చెఱువు వుండేది.  రాజగోపాలచారిగారు పురపాలక సంఘం వారిని ఒప్పించి, దానిని పూడ్పించి సుందరమైన పార్కు కట్టించారు.  1944లో కస్తూరిబా మరణించారు.  గాంధీజీ ఆమె పేరున ”కస్తూరిబా మెమోరియల్‌ ఫండ్‌” ఏర్పాటు చేశారు.  మద్రాసు ప్రాంతానికి సాంబమూర్తిగారు ప్రెసిడెంటుగా, దుర్గాబాయిగారు సెక్రటరీగా, నారాయణ రావు గారు ట్రెజరర్‌గా నియమింప బడ్డారు.  ఒకవైపు లా ప్రాక్టీస్‌, మరో వైపు సభ నిర్వహణ పనులు, కస్తూరిబా ఫండ్‌కు విరాళాలు వసూలు చేయటం, బేసిక్‌ విద్యావిధాన వ్యాప్తికి ప్రచారం, వూపిరాడకుండ, విసుగులేకుండ శ్రమించేవారు.  తూ-తూ మాయగా కాకుండా ప్రతిపనిని శ్రద్ధగా, సక్రమంగా, సంపూర్ణంగా చేసేవారు.  ఆ రోజుల్లో విజయవాడలో మేము మహిళా సంఘ ప్రచారానికి వెళ్లినపుడు (43-48) సనాతన భావాలు గల ఛాందసులు మమ్ములను ప్రశ్నించేవారు.  మీరు ఎందుకు వచ్చారు?  ఏమి చెప్పటానికి వచ్చారు?  దుర్గాబాయమ్మలాగ మొగుడిని వదలిపెట్టి జెండాలు పట్టుకొని వూరేగమనా? జైలు కెళ్ళమనా? అవేమీ మా పెండ్లాలకు చెప్పనవసరం లేదు.  ఏదో యింత మాకు మా పిల్లలకు కూడు వండి పెడుతున్నారు.  మీ మాటలు వింటే మా ఆడవాళ్ళు కూడా కూడు వండటం మానివేస్తారు.  అవేమీ చెప్పనవసరం లేదు కాని పొండిపొండని తరిమినంత పని చేసేవారు.
1953లో కేంద్ర సాంఘిక సంక్షేమశాఖ అధ్యక్షురాలుగా నియమింప బడ్డారు.  ఆంధ్రమహిళా సభ నిర్వహణ భారాన్ని చన్న ఘంటమ్మ గారు చేపట్టారు.  ఢిల్లీలో కూడ దుర్గాబాయి గారు ఆంధ్రమహిళాసభను స్థాపించారు.  1946 నుండి రాజ్యాంగ నిర్మాణ కమిటీకి చైర్మన్‌గా 1950 వరకు వున్నారు.  1948 లో ఢిల్లీలోని ఫెడరల్‌ కోర్టులో తనపేరు నమోదు చేసుకున్నారు.  1950లో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొదటసారి జనరల్‌ ఎలక్షన్స్‌ జరిగాయి.  ఆమె రాజమండ్రి నియోజక వర్గం నుండి పోటీ చేశారు.  రాజాజీ, పటేల్‌ లాంటి వారికి ఆమె ఎన్నికలలో పాల్గొనటం యిష్టం లేదు.  కులమత రాజకీయాలతో పాటు పురుషాధిక్యత కూడా పనిచేసి వుండవచ్చు.  ఆమె ఓడిపోయారు.  ఆమె ఓటమి మాట విన్న నెహ్రూజీ ‘ఛీ’ అని చీత్కరించుకున్నారు.  అప్పటివరకు ఆమె ఏ పనిలోను ఓటమెరుగరు.  పట్టిందల్లా బంగార మయింది.  ఎవరినో దుర్గాబాయి గారిని గురించి చెప్పుమంటే ”ఆమె నవ్వగా నేను చూడలేదు.  అలాగే ఆమె పట్టిన పని అపజయం అవటం కూడ చూడలేదు”. అన్నారట.  ఆమె మద్రాసు వచ్చి ప్రాక్టీసు పెట్టి ఆంధ్రమహిళా సభ పనులను చూడాలనుకున్నారు.  ఆమె దీక్షా-దక్షతలను, అకుంఠిత సేవా పరాయణతను గుర్తించిన నెహ్రూకు ఆమెను ఢిల్లీనుండి పంపటం యిష్టం లేదు.  25 వేల రూపాయల చెక్కు యిచ్చి రాయలసీమ కరువు ప్రాంతానికి వెళ్లమని చెప్పారు.  రాయలసీమ వచ్చి కరువు నివారణ పనులను సక్రమంగా చేసి నయాపైసలతో సహా జమా-ఖర్చులుతయారుచేసి ఢిల్లీ వెళ్లి నెహ్రూజీకి అప్పచెప్పి యిక నేను మద్రాసు వెళతానన్నారు.  నెహ్రూజీ ”విజయలక్ష్మీ పండిట్‌ చైనా వెళుతున్నది.  ఆ బృందంతోపాటు చైనా వెళ్ళి రా.  వచ్చిన తర్వాత ఏమిచేయలో చెపుతా”నని ఆమెకి చెప్పారు.  సంతోషంగా వారితో పాటు చైనా వెళ్లారు.  ఆ బృందం వారు తాము చేయవలసినవి చేసిన తర్వాత నగరాన్ని చూడటానికని, షాపింగులకని వెళ్ళేవారు.  కాని దుర్గాబాయి గారు తన గదిలో కూర్చుని నివేదిక తయారు చేసేవారు.  తిరిగి వచ్చిన తర్వాత చైనా పర్యటన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించారు.  ఆ నివేదిక అందరి ప్రశంసలు అందుకుంది
ప్లానింగు  కమీషన్‌ – దేశముఖ్‌తో వివాహం
చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్లానింగు కమీషన్‌లో సోషల్‌ సర్వీసెస్‌ విభాగానికి అధికారిగా నియమింపబడ్డారు.  1952లో ప్లానింగు కమీషన్‌ మెంబరయ్యారు.  మన దేశంలో దుఃఖితులు, దీనులు, అనాధలు, అంగవికలాంగులు, వ్యాధిగ్రస్తులు లెక్కలేనంతమంది వున్నారు.  1845వ సంవత్సరం నుండి సాంఘిక సేవా సంస్థలు ధనవంతులను, ఉదారులను ప్రాధేయపడి విరాళాలు వసూలు చేసి వారికి చేతనైన సేవలు చేస్తున్నాయి.  ఇప్పుడు యివన్నీ చేయటం సాంఘిక సంక్షేమ లక్ష్యం.  పదవిలో చేరిన మూడు-నాల్గు రోజులకు ఫైళ్ళు చంకన బెట్టుకొని నెహ్రూ వద్దకు వెళ్లారు.  నెహ్రూజీతో ఆమె కావలసినంత ప్లాను ముందు వుంది.  దానిని అమలు చేయటానికి తగిన యంత్రాంగం లేదు.  ఆర్థిక బలం అసలే లేదు.  సాంఘిక సంక్షేమమంటే సాంఘిక శ్రేయస్సుతో పాటు ఆర్థిక, నైతిక, ఆరోగ్య, వైద్య, విద్య, కళల అభివృద్ధి సమస్తమూ దీనిలోనికి వస్తవి.  అదే  నిజమైన సాంఘిక సంక్షేమమని చక్కగా వివరించింది.  ఆమెలోని శక్తి-సామర్థ్యాలు, కార్యదీక్ష, సేవానిరతి నెహ్రూను అబ్బుర పరచాయి.  ఆర్థికమంత్రి చింతామణి దేశ్‌ముఖ్‌ను కలవమన్నారు.  దేశ్‌ముఖ్‌ని కలిసి నెహ్రూజీకి వివరించినట్లుగానే వివరించింది.  అంతా విని ఆయన ”ఆలస్యంగా వచ్చారు.  ప్లానంతా తయారై పోయింది.  ఇప్పుడు నిధులు కెటాయించడం ఎట్లా సాధ్యమన్నారు?”  తిరిగి వెళ్లి ఒక నివేదికను తయారుచేసింది.  నేను జన్మతః సంఘసేవికను.  30 సంవత్సరాలనుండి సంఘసేవకుల మధ్య బ్రతుకుతున్నాను.  స్వచ్ఛంద సంస్థలు, వేలాదిమంది స్త్రీ-పురుషులు పూనుకుని నిస్వార్థంగా సేవలు చేస్తున్నారు.  స్వతంత్రమొచ్చి యింత కాలమైంది.  సంక్షేమ పథకాలంటూ ఏర్పాటు చేస్తున్నారు.  వాటికి చేయూత నివ్వక పోవటం ఏమి న్యాయమని నదిలో మునిగిపోయే మనిషికి సత్వరమే సహాయం చేసి రక్షించాలి గాని రేపో ఎల్లుండో చేస్తామంటే ఎలా?  అని నివేదిక తయారు చేసి పట్టుకెళ్లారు.  దానిని చదివి మనసులోనే ఆమెను మెచ్చుకొని ఎంత కావాలని అడిగారు.  పదికోట్లు అన్నారామె.  అంత లేదని నాలుగు కోట్లు మంజూరు చేశారు.  1953లో  ప్లానింగు కమీషన్‌ మెంబరుకు నెహ్రూజీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజీనామా చేశారు.  తాను రూపుదిద్దిన కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘానికి చైర్మన్‌ అయి పది సంవత్సరాలు సాంఘిక సంక్షేమ పథకాలను దేశమంతటా స్థాపించి విజయవంతంగా వాటిని అమలు పరిచారు.
దేశ్‌ముఖ్‌ 1951లో ఆంధ్ర మహిళాసభ నర్సింగుహోమ్‌ ప్రారంభోత్స వానికి మద్రాసు వచ్చారు.  ఆమె స్థాపించిన సంస్థల పనితీరును చూచి ముగ్దులయ్యారు.  ఆయన మదిపొరలలో భార్యా వియోగం దాగి వుండి బాధిస్తూ వుంది.  దానికి తోడు కూతురు ఎడబాటుతో ఒంటరి అయ్యారు.  ప్లానింగు కమీషన్‌లో మెంబరయినప్పటి నుండి ఆమెను ఆరాధించసాగారు.  తనకు తగిన విజ్ఞతగల స్త్రీ దొరికిందనుకున్నారు.  ఒక రోజు దుర్గాబాయి గారి ముందు మనసులోని మాటను వెల్లడించారు.  ఆమె మూడు-నాలుగు రోజులు గడువడిగి అలోచించుకొని తన సమ్మతని తెలియజేశారు.  ఇరువురు నెహ్రూజీకి తెలపటం తమ విద్యుక్త ధర్మమనుకున్నారు.  వెళ్ళేముందు ఆమె రాజీనామా పత్రము రాసి పట్టుకెళ్లారు.  ఆ విషయం విని నెహ్రూ అమితానంద భరితులయ్యారు.  తర్వాత రాజీనామా పత్రం అందజేశారు.  ఎందుకు రాజీనామా అని నెహ్రూ అడిగారు.  వివాహానంతరం సంక్షేమశాఖకు నిధులు మంజూరు చేస్తే భర్త ఆర్థికమంత్రి అవటం వలన జరిగినవనుకుంటారు.  అందుకని ముందుగానే రాజీనామా చేయదలచు కున్నానన్నారు.  నిన్ను నియమించింది నేను గాని దేశముఖ్‌ కాదుగా!  రాజీనామా పత్రం వెనక్కు తీసుకోమన్నారు.  1953 జనవరి 23న వారి వివాహం జరిగింది.  మొదటి సాక్షి సంతకం నెహ్రూ చేశారు.  తర్వాత సుచేత కృపలాని, నారాయణరావు గారు చేశారు.  మొదట దుర్గాబాయి కుటుంబం వారికి ఈ వివాహం యిష్టం లేదు.  1947లో మద్రాసులో ఒక చిన్న షెడ్డులో శిశు సంక్షేమ కేంద్రం ఏర్పడింది.  1949లో దానిని నర్సింగుహోమ్‌ చేయాలనుకున్నారు.  మద్రాసు ప్రభుత్వం అడయర్‌ బ్రిడ్జి ప్రక్కన స్థలం ఉచితంగా యిచ్చింది.  1968 నాటికి 75 పడకలతో అన్ని హంగులతో ఆసుపత్రి తయారయింది.  నర్సింగు హోమ్‌, నర్సుల వసతి గృహాలు కట్టబడినవి.  శస్త్ర చికిత్సాలయానికి మద్రాసు ప్రభుత్వం లక్ష రపాయాలు బహుమానంగా యిచ్చింది.  వెనిగళ్ల హనుమంతరావు దంపతులు తమ కొడుకు జ్ఞాపకార్థంగా ఆర్థోపెడిక్‌ సెంటరు భవనాన్ని నిర్మించి యిచ్చారు. 
హైద్రాబాద్‌లో ఆంధ్రమహిళాసభ
నీలం సంజీవరెడ్డిగారు దుర్గాబాయి గారితో ఆంధ్రలోకూడ మద్రాసులో వలె ఆంధ్రమహిళాసభ వంటి సంస్థను ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రభుత్వం మీకు సంపూర్ణ సహకారం అందజేస్తుందని చెప్పారు.  ఆంధ్రప్రభుత్వం యూనివర్సిటీ రోడ్డు వైపు (విద్యానగర్‌) నాలుగెకరాలు యిచ్చింది.  అందులో బాలికల ఉన్నత పాఠశాల, మహిళా కళాశాల, మహిళలకు సాయంకాలం కళాశాల, టీచర్స్‌ ట్రైనింగు స్కూలు, బి.యిడి,  అందులో చదువుకొనేవారికి వసతి గృహాలు నిర్మించబడ్డాయి.  చేతి పనుల శిక్షణా సంస్థలు, వాటి భవనాలు కట్టబడ్డాయి.   ఇవేగాక నర్సింగు హోమ్‌, నర్సుల ట్రైనింగు స్కూలు, వాటికి భవనాలు, వసతి గృహాలు ఏర్పడ్డవి.  ఫ్యామిలి ప్లానింగు బ్లాకులు, అంగవికలురన బాలబాలికలకు వైద్య సౌకర్యం, పునరావాస సౌకర్య స్కూలు సమకూర్చే సంస్థ స్థాపించబడినది.  శిశువిహార్‌ బేసిక్‌ ట్రైనింగు స్కూలు, హిందీ తరగతులు మొదలయినవి.  తదనంతరం అత్యంత ఆధునిక పరికరాలతో, వసతులతో నగరంలో చెప్పుకోదగినవాటిలో ఒకటిగా ఆసుపత్రి నిర్మాణం జరిగింది.  దుర్గాబాయి గారేమో ఢిల్లీలో చిక్కుపడిపోయారు.  మరి హైదరాబాద్‌లోని సంస్థల స్థాపన, నిర్వహణ, భవన నిర్మాణాల కార్యక్రమం కె. సుగుణమణిగారు తమ భుజస్కందాలపై కెత్తుకున్నారు.  నిస్వార్థ సేవా దృష్టితో అహో రాత్రులు శ్రమించి వాటిని సక్రమంగా నడిచేలాగ నిలబెట్టిన ఘనత సుగుణమణిగారిదే.  1959 లో జాతీయ స్త్రీ విద్యామండలి ఏర్పడి దుర్గాబాయి గారు అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.  ఆమె చేస్తున్న కృషికి సంతసించి, ప్రోత్సహించి, సహాయ సహకారాలను అందజేస్త ఆమె పనిలో ఆమెకు సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రా లను యిచ్చిన మౌలానా అస్తమించారు.  తర్వాత వచ్చినవారితో ఆమెకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి.  పనికోసమేగాని పదవులకోసం ప్రాకులాడని దుర్గాబాయిగారు ఆ పదవికి రాజీనామా చేశారు 1962లో.  సుప్రీంకోర్టులో 1962 నుంచి న్యాయవాద వృత్తిని చేపట్టారు.
విదేశీ పర్యటన – అంతర్జాతీయ సమావేశాలు
1961లో రెండవ కామన్‌వెల్త్‌ ఎడ్యుకేషన్‌ సమావేశానికి భారతదేశ ప్రతినిధులలో ఒకరుగా వెళ్ళారు.  1965లో యునెస్కో ఆధ్వర్యంలో బాంకాంక్‌లో ‘ఏషియన్‌ మోడల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఏషియా’ సభలో పాల్గొన్నారు.  దంపతులిరువురు 1963లో ప్రపంచ ఆహారసంస్థ సమావేశానికి వాషింగుటన్‌ వెళ్ళారు.  1970లో ఢిల్లీలో సాంఘికాభివృద్ధి సమాఖ్యను స్థాపించి దాని శాఖను హైద్రాబాద్‌లో కూడ నెలకొల్పారు.
ఢిల్లీలోని ఆంధ్రుల కొఱకు మరువలేని చేసిన సేవలు
ఢిల్లీలో నివసించే తెలుగు వారికి ‘ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ’ ప్రారంభించారు.  పురపాలక సంఘం వారి నుండి ఉచితంగా స్థలము సంపాదించారు.  ప్రభుత్వం నుండి, ప్రజల నుండి విరాళాలు సేకరించారు.  ఆంధ్ర స్కూలుతో పాటు భవనం ఏర్పరిచారు.  కాలేజీని కూడ స్థాపింపదలచి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారినుండి 5 లక్షల నిధిని సమకూర్చారు.  దీనికి యూనివర్సిటీ వారిచ్చిన గ్రాంటును కలిపి కేంద్ర ప్రభుత్వం వారు యిచ్చిన 15 ఎకరాలలో శ్రీ వెంకటేశ్వర కళాశాల భవనం నిర్మించారు.  దానిలో ఆంధ్రేతరులకు కూడ స్థానం కల్పించారు.  ఢిల్లీలో అనసూయ బస్రూకర్‌ అనే ఆమె డాక్టర్‌.  ఆ దంపతులు అంధ విద్యార్థుల కోసం ఒక పాఠశాలను నడిపారు.  వారిరువురి మరణానంతరం ఆ పాఠశాల దిక్కులేనిదయింది.  బస్రూకర్‌ దంపతుల మిత్రులు దుర్గాబాయిగారిని దాని నిర్వహణ చేపట్టమని కోరటం, ఆమె అంగీకరించటం జరిగింది.  ఆమె కృషివలన దేశంలోనే కాక అమెరికాలోని అనేక సంస్థల ద్వారా విరాళాలు వచ్చి పడినాయి.  1969లో నాల్గవ అంతర్జాతీయ అంధ సంక్షేమ సవఖ్య సమావేశం భారతదేశంలో జరిగింది.  ఆ సమావేశంతో పాటు బి.ఆర్‌.ఎ. సంస్థ వారి రజతోత్సవాలను కూడ ఘనంగా జరిపించారు.  1972లో అనారోగ్య కారణాల వలన ఆ పనుల నుండి వైదొలగారు.
బిరుదులు – అవార్డులు
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1963లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసి గౌరవించింది.  1971లో నెహ్రూ లిటరసీ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది.  1975 జనవరి 26న దంపతులిరువురకు పద్మ విభూషణ బిరుదునొసగి ఘనంగా సన్మా నించింది.  ఆమె నిస్వార్థ సేవాప రాయత ముందు అవన్నీ చంద్రునికి నూలు పోగు సమర్పించుకున్నట్లే అనటంలో అతిశయోక్తి లేదనుకుంటాను.  ఆ బహు ముఖ ప్రజ్ఞాశాలి తెలుగువారి ఆడపడుచై మహారాష్ట్రులకు కోడలయింది.  చింతామణి దేశ్‌ముఖ్‌ బంధువులంతా ఆమెను ఎంతో గౌరవించి, ప్రేమించారు.  దేశ్‌ముఖ్‌ మొదటి భార్యకు జన్మించిన కూతురు, అభిప్రాయ భేదాల వలన తండ్రికి దూరమయింది.  వయా మయి అయిన దుర్గాబాయి గారు తండ్రి కూతుళ్లను కలిసేలాగ జేశారు.  ఆమె మాజీ భర్త సుబ్బారావుగారు మరణించిన తరువాత సవతి తిమ్మాయమ్మను తన దగ్గరకు పిలిపించుకుంది.  ఆ ఔదార్యమూర్తికి ఎన్ని నివాళులర్పించినా సరిపోవు కదా!
(దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జీవితచరిత్ర ఆధారంగా)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

  1. Pingback: ‘ఆడసింహం’ దుర్గాబాయి దేశ్‌ముఖ్ | తెలుగుబిడ్డ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.