ఆడదాన్ని నేను…. ఆదిశక్తినీ నేనే- – దొమ్మాటి జ్యోతి

మనదేశం హిందూమత సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇలాంటి సంస్కృతిలో జీవిస్తున్న మనం లక్ష్మీ, సరస్వతి, పార్వతి, సమ్మక్క, సారక్క… మొదలగు స్త్రీ దేవతామూర్తులను పూజిస్తున్నాం. స్త్రీ దేవతా మూర్తులను నిత్యం   పూజిస్తున్న నేటి సభ్య సమాజంలో స్త్రీ వివక్షకు గురౌతూనే ఉంది. స్త్రీని వివక్ష భావనల్తో చూస్తున్న సమాజ విధానం మారాలి. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలపైన వివక్ష ఎందుకు అని పరిశీలిస్తే ముఖ్యంగా కరువు ఉండే ప్రాంతాలలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉండవు. పనులు చేసి సంపాయించు కుందామన్నా చేసే పనులు ఉండవు. చాలీచాలని కుటుంబ విధానం, కలిమీ లేములతో సాగుతున్న కుటుంబంలో ఆడబిడ్డ జన్మిస్తే తలకు మించిన  భారంగా తల్లిదం డ్రులు భావిస్తారు. ఎందుచేతంటే వారి వివాహానికి సంబంధించిన వరకట్నాన్ని సంపాదించాలి. బయట పరిస్థితి చూస్తే మింగ మెతుకు, నిలబడడానికి చోటు లేని మగాడు సైతం లక్షల్లో వరకట్నం అడుగు తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండిగింజలే సంపాదించలేని స్థితిలో అదనపు సొమ్మును కూడబెట్టలేమనే బాధతో ”ఛీ ఆడపిల్ల పుట్టిందని” ఛీత్కారాలు వెలిబుచ్చుతున్నారు. ఇక ఒక్క కుటుంబంలోనే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆడపిల్లలు పుడితే ఇంకేముంది, పురిట్లోనే గొంతు నులిమి లేదా నోట్లో వడ్ల గింజలు పోసి ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. ప్రతీ కానుపులో ఆడపిల్లల్ని కంటున్న తల్లుల బాధలు వర్ణనాతీతం. ఇలాంటి తల్లులు రెండు రకాలుగా బాధలు పడుతున్నారు. ఒకటి ఆడపిల్ల పుట్టిందని, రెండవది ఆడపిల్లను కన్నందుకు అత్తా,మామ, భర్త మిగతా కుటుంబీకులు పెట్టే మానసిక హింసను కూడా భరించాల్సి వస్తున్నది. మగాడి వీర్యకణాల్లోని ఎక్స్‌-క్రోమోజోమ్‌ ఆధిపత్యం వల్ల ఆడపిల్ల పుట్టిందని, అలా పుడుతుందని ఎందరికి తెలుసు, తప్పంతా ఆడదానిమీదనే వేస్తున్న సమాజ దృష్టికోణం మారాలి. ఆడదాని ఆవశ్యకతని గుర్తిస్తూ అభివృద్ది వైపుకు ముందడుగులు వేయాలి. ఆడది అనే పదానికి అందమైన నిర్వచనం చెప్తూ ఆరుద్ర

 ”ఎపుడో పరిణయమైన…..

 ఆడ దనబడే చాన”

అని ‘కూనలమ్మ పదాల్లో’ ఆడపిల్లకు వివాహం అయిన తర్వాత తల్లిగారింటిని వదిలి అత్తగారింట్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆడది అని ప్రస్తావించారు. ”ఆడది అంటే తెలంగాణలో ఇక్కడిది కాదు అనే ఒక అర్ధం ఉన్నది. ఆడపిల్ల అంటే అక్కడున్న పిల్ల” (ఓపెన్‌ హార్టు విత్‌ -ఆర్‌.కె-సుద్దాల ఆశోక్‌తేజ) అంటూ అశోక్‌ తేజ అభిప్రాయాన్ని తెలిపారు.

”ఆడది ఆడదై ఒకరింట కోడలై

ఓర్పుగా నేర్పుగా పతి సేవ చేయగా

పిల్లగా పుట్టి కన్నెగ పెరిగది

తల్లిగా మారే ఒకరింటి దీపమై”

అని తెలుపుతూ గురజాడ అప్పారావు ఆడదాని ప్రాముఖ్యతని అభివ్యక్తం చేశారు. పూర్వ కవుల ప్రభావాన్ని కనబరుస్తూ సుద్దాల ఆశోక్‌ తేజ

 ”ఆడి దాన్నిరో ! నేను…..

 యాడి దాన్నిరో! నేను”

అంటూ సమాజంలో ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్న విధానాన్ని ఎత్తి చూపారు. స్త్రీ వాద కవయిత్రి డా|| వాసా ప్రభావతి ఆడపిల్లల గొప్పతనం, విలువను వర్ణిస్తూ ఆడపిల్లలు పుడితే బాధపడే పరిస్థితులకు భిన్నంగా

 ”అసలు ఆడపిల్ల అంటే ఎవరని?

 ……..

 మీదపడి ఏడ్చేది ఆడపిల్ల”

అని అంటూ ఆడపిల్లల్ని తక్కువగా చూసే సమాజానికి కనువిప్పు కలిగేలా ప్రయత్నించారు. మరొక స్త్రీవాద కవయిత్రి అబ్బురి ఛాయాదేవి రాసిన ‘విన్నావా’? కవితలో ఆడపిల్లని తక్కువగా చూస్తున్న తండ్రిని, తల్లిని, స్నేహితుల్ని, సమాజాన్ని కవిత్వీకరించారు. తల్లి కూతుర్ని భారంగా భావిస్తున్న విధానం, కూతురి మాటల్లోనే

 ”అమ్మ అంటుంది…..

 గుండెలో గుబులువి”

అంటూ తెలిపారు. ఈ గుండెలో గుబులు ఆడపిల్లల్ని కన్నతల్లికి బిడ్డ పుట్టిన వెంటనే కలుగుతుంది. పురుడు పోసిన మంత్రసాని సైతం పురుటి కట్నం ఎక్కువియ్యరని చీదరించుకునే వాస్తవ చిత్రణల్ని

 ”పాడుగాను మల్లాయిపుడు….

 తిట్టిందట మంత్రసాని”

అంటూ సుద్దాల అశోక్‌తేజ రచన గావించారు. ఆడపిల్లలకు ఏదైనా రోగం వస్తే దవఖానాకు తీసుకపోకుండా అది సత్తేంది, బతుకుంతేది అని నీచంగా దూషించిన సంఘటనలు లేక పోలేదు. ఆడపిల్లలకు వచ్చిన రోగం దానికై అది తగ్గితే సరేసరి లేకుంటే ప్రాణాలు పోయినా బాధపడేవారు, చెమ్మగిల్లే కళ్ళున్న వారు లేరంటే ఆడపిల్లల పైనున్న వివక్షతను గ్రహించవచ్చు. ఈ విషయాన్ని గూర్చి అశోక్‌ తేజ వర్ణిస్తూ

 ”ఆటలవ్వ జెరంతోని

 …….

 వద్దన్నడు మా నాయిన”

ఇలా ఎల్లప్పుడు ఆడవారిగా ముసలితనం పొంది మరణించే వరకు వివక్షాయుతమైన జీవితానుభూతులు పొందుతూనే ఉన్నారు. అదే మగ పిల్లడు పుడితే వరకట్నం తల్లిదండ్రులకే వస్తుంది, పిల్లాడు వారితోనే ఉంటాడు. కాబట్టి ఆప్యాయంగా పెంచు తారు. అశోక్‌తేజ ఇలాంటి సందర్భాన్ని చిత్రణ గావిస్తూ తల్లి దండ్రుల అంతర్ముఖాన్ని ప్రత్యక్షం చేసారు.

 ”తమ్ములకే సిలుకులంగి

 తమ్మునికే సదుల బడి

 ఏందే ఈ ఒరపాటు

 ఏందని అవ్వను అడిగితే

 తమ్ముడేడ? నువ్వేడ

 తగదు ఆడపిల్ల కన్నది”

అంటూ సమాజంలో ఆడపిల్లల స్థానాన్ని తెలిపారు. ఆడపిల్లలకి పెళ్ళి చేయాల్సి వస్తే కట్నం తక్కువగా తీసుకునే చెడిపోయిన తాగుబోతు, స్త్రీ వ్యామోహం ఉన్న వ్యభిచారు లకు పనికి మాలిన వారికి కట్టబెట్టడం చూస్తే వారిపై నున్న వివక్షస్థాయి అర్ధమవుతున్నది. స్త్రీ యొక్క దైనందిన జీవితంలో అడుగడుగునా తక్కువగా చూడబడుతున్న విధానాలను రచయిత్రి రజియాబేగం

”బ్యాలంలో

చిన్న పిల్లవి నీకేం తెల్సు కూర్చో అన్నారు.

యవ్వనంలో

‘ఉడుకు రక్తం మంచీచెడు తెలీదు కూర్చో’ అన్నారు

వృద్ధాప్యంలో

‘ముసల్దానివి ఇంకెేం చేస్తావ్‌ కూర్చో’ అన్నారు”

అంటూ వాస్తవ పరిస్థితులను చిత్రణ చేశారు. ఈ రచన స్త్రీకి సమాజం ఇస్తున్న విలువకి నిదర్శనము. ఇన్ని రకాలుగా తక్కువగా చూడబడుతున్న స్త్రీల పరిస్థితి ఇప్పుడు మార్పు గమనంలో ఉందంటూ శీలా సుభద్రాదేవి…

 ”మా గుండెలే మూగవే

 ……

 ఆవులించి జూలు విదిల్చింది”

అంటూ మాకు ఒక వ్యక్తిత్వం ఉందని, మనస్సు ఉందని, పితృస్వామ్య వ్యవస్థ నాటి స్త్రీలము కాదని, ఈ నాటి మమ్ములను తక్కువగా చూడడానికి వీలు లేదని తెలిపింది. ఈనాటి స్త్రీలలో ఇంత మంట పుట్టడానికి ఎన్నిరకాల హింసలకు లోనై ఉన్నారో ఇట్లే అర్థమవుతున్నది. ”తరతరాల నుంచి పురుషుడు స్త్రీకి చేస్తున్నది అన్యాయమే! ఆమె ఆత్మ గౌరవాన్ని చంపాడు. స్త్రీ దాన్ని మళ్ళా సంపాదించుకోవాలి తన ఇష్టం వచ్చినట్లు, తనకు తోచిన మార్గాన ఆమె తిరిగి తన గౌరవాన్ని పొందాలి. అందుకు ముఖ్యసాధనం ఎదిరింపు. అన్నింటికి, గృహానికి, భర్తకి, పెద్దలకి, పురాతన ధర్మాలకి, బూజు పట్టిన నీతులకే, తన జీవితం అర్పిస్తేనే గాని పోయిన తన ఆత్మని తను తిరిగి పొందలేదు. ఈ భయంలో, సిగ్గులో, బద్దకంలో, బానిసత్వంలోంచి మేల్కొని, తన నిజమైన హక్కులని, స్వతంత్య్రాన్ని ధిక్కరించి లాక్కోవాలి. అప్పుడే తన ఆత్మని ధన్యం చేసుకుంటుంది. తక్కిన ప్రపంచాన్ని ఉద్దరిస్తుంది”  అంటూ చలం పలికారు.

చలం మాటల్లోని మంటను గ్రహించిన సుద్దాల ఆశోక్‌ తేజ స్త్రీని ఉన్నత శిఖరాల్లోకి తీసుకురావడానికి వివిధ సందర్భాల్లో ఆత్మస్థైర్యాన్ని అందిస్తూనే ఉన్నారు. అనే ఆలోచనల్తో

 ”ఆడదాని గుండెలలో

 ఆదిశక్తి వున్నదని

 ఆడ బతుకు కాదని మీ

 రీడ బతుక నేర్చుకోండి”

అంటూ స్త్రీ ఔన్నత్యాన్ని ఆదిశక్తితో పోల్చుతూ కీర్తించారు. స్త్రీని తక్కువగా చూస్తున్న సమాజానికి ఆమె యొక్క ఆవశ్యకతను తెలిపారు. స్త్రీని శృంగార సాధనంగా చూస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తూ లైంగిక దాడులకు పాల్పడి స్త్రీ అస్తిత్వానికి భంగం కలిగిస్తున్న పురుషాధిక్య సమాజ విధానం మారకపోతే మానవజాతి మనుగడకే ప్రమాదం వాటిల్లి అంతరించే ప్రమాదం పొంచి ఉంది. రామాయణంలో సీతను ఎత్తుకెళ్ళిన రావణుడు అంతమొందిం చబడ్డాడు. ద్రౌపదీ వస్త్రాపహరణంతో నిండు సభలో అపహాస్యం చేసిన కౌరవులకు వంశం నాశనమయ్యింది. దుర్గాదేవిని పరాభవించిన నరకాసురుని రాజ్యం కూలిపోయింది. ఆడదాన్ని ముట్టుకుంటే ఆహుతై పోయి ఆ తర్వాత ఏడు తరాల వరకు ఆ పాపం చుట్టుకుని ఉంటుందని పురుషలోకం గ్రహించాలి. అందుకే ఆదిశక్తి స్వరూపులైన మాతృమూర్తుల గౌరవాన్ని పెంపొందిం చేటట్లు చేస్తూ కన్నీళ్ళు లేని స్త్రీ లోకాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ముందడుగు వేద్దాం.ఆడపిల్లలకు ఆత్మస్థైర్యా న్నిస్తూ అభివృద్దిలోకి నడిపిద్దాం….

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.