ఒక ఖడ్గమంత పదునుగా, ఒక పుష్పమంత మృదువుగా సమాజాన్ని స్పృశించిన కారాగారి కథలు- రమాసుందరి బత్తుల

ఒక కాలంలో, ఒక ప్రాంతంలో పాతుకుని ఉన్న వ్యవస్థ లక్షణం అక్కడ జీవిస్తున్న వ్యక్తి అంతర్గత ప్రవృత్తి మీదా, బాహ్య చలనాల మీద ప్రభావం చూపుతుంది. సమాజ గమనంలో అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్దాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్థం చేయించగలిగితే అతడే జనం గుర్తు  పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు. రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి. ఆ సంక్షోభ సెగ తగిలించుకొన్న రచయితల ఆలోచనలను, ఆ సమర హోరులో నుండి పుట్టుకొచ్చిన రచనల పరిణాక్రమాన్ని అర్థం చేసుకోవటంలో ఉండే ఆనందం గొప్పగా ఉంటుంది. ఒక మంచి రచయిత రాసిన ఒక కథను చదివి ఆస్వాదించడం వేరు, ఆ రచయిత సమస్త సాహిత్య వ్యాసంగాన్ని ఒక్కసారిగా చదివితే ఉండే ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ రచయిత ప్రజల పక్షాన నిలబడ్డాడని కాలం రుజువు చేశాక ఆయనను ప్రభావితం చేసిన ఆనాటి రాజకీయ పరిణామాలు, దానితో లంకె వేసుకొని ఆయన చేసిన సాహిత్య ప్రయాణం అర్థం చేసుకోవటం చాలా ఆసక్తికరంగానూ, ఇష్టంగానూ ఉంటుంది.

 ‘కాళీపట్నం రామారావు రచనలు’ పుస్తకం ఇలాంటి సంతోషాన్ని కలిగిస్తుంది. పాతికేళ్ళ వయసు నిండకుండానే స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయన రాసిన ‘అదృశ్యం’ కథ సంబరం కలిగిస్తుంది. అయితే అంతకంటే ఎక్కువ ఆనందం అదే వయసులో ఆయన రాసిన ”అవివాహితగా ఉండి పోతాను కానీ”… చదివితే కలుగుతుంది. ”నవనీతం వంటి నా హృదయాన్ని – అసహ్యమూ కఠినమూ అయిన ఏ నల్లరాతి గుండెకో.. తలలో నాలుకలా సంఘం కోసం తయారు చేసిన నా స్వభావాన్ని – ఏ పులిజాతి స్వభావానికో ఎలా అప్పగించనూ?”- ఈ ప్రశ్న ఆ తరంలో కొంతమంది అవివాహిత యువతులనై ఖచ్చితంగా ఆలోచింపచేసి ఉంటుంది.

బీజం – మహావృక్షం

 ”మధ్యతరగతి మానసిక రుగ్మతులను ఎక్కువ చేసి చూపించిన” కథలుగా ఆయనే స్వయంగా చెప్పుకొన్న 48-55 మధ్య కథల్లో కూడా అంతర్లీనంగా ప్రాభవం కోల్పోతున్న బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబాల బంధాలను శాసిస్తున్న ఆర్థిక సంబంధాల విశ్లేషణ ఉంది. ఈ కాలంలో ఈయన రాసిన ”పెంచిన మమకారం”, ”అభిమానాలు” లాంటి కథల్లో ఆయన బీజ రూపంలో తడిమిన అంశాలు తరువాత కాలంలో ఆయన రాసిన కథల్లో వేయి ఊడల మహా వృక్షంలాగా విజృంభించాయి.

 ఉదాహరణకు ”పెంచిన మమకారం” కథల్లో పెద్దగా బాహ్య ప్రపంచం తెలియని తల్లి, పెంపుడు కూతురు మీద పెంచుకొనే వైషమ్యానికి కారణం చెప్పే ప్రయత్నం కొంచం బిడియంగా ఉంటుంది. ఆ స్పర్థలకు కారణం దంపతుల మధ్య అవసరమైన ఏకాంతానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వని అపరిపక్వ కుటుంబ ఆలోచనలు అని మాత్రమే ఈ కథ చెబుతుంది. ఆ దశ నుండి ఎదిగి ‘నో రూమ్‌’ కథలో భార్యాభర్తల మధ్య ఏకాంతం లోపించటానికి కారణాలు.. అందులో ప్రధాన భూమిక వహించే ఆర్థిక స్థితి గతులు ప్రతిభావంతంగా స్థాపించబడతాయి. ఏకాంతం కోసం వారు చేసే వెదుకులాటలో పొందే అవమానాలు పాఠకులను సూటిగా గుచ్చుకొంటాయి.

 ఇక ‘ఆర్తి’ కథ దగ్గరకు వచ్చేసరికి కారాగారు విశ్వరూపం ధరించి భార్యా భర్తలకు వివాహం ద్వారా సంక్రమించిన హక్కు అయిన ప్రైవసీ వారికి దొరకకపోవటానికి కారణాలను, దాని పర్యావసానాలను గడ్డి పరక గుచ్చుకొన్న నొప్పి కూడా తెలియకుండా సున్నితంగా కథలో నడిపించారు. ఈ శోధనలో ఈయన మూలాలు వెదుక్కొంటూ పోయే పరిశోధకుడిలాగా, నేల తవ్వుకొంటూ పోయి వేర్లు అతి జాగ్రత్తగా పట్టుకొన్న పరిశీలకుడిలాగా అనిపిస్తారు. ”పేదోడికి బగమంతుడు మిగిలించిన సుకవది” అన్న పైడయ్య మాటల్లో అది కూడా అందుకోలేని నైరాశ్యం వినిపిస్తుంది. తిండి, గుడ్డ లాగే కనీస అవసరం అయిన పేదోడి దాంపత్య సుఖానికి అడ్డుపడుతున్న శక్తులను గుర్తించి వాటి పట్ల ఆయన కనబర్చిన ద్వేషం ఉద్వేగభరితంగా ఉంటుంది. ఈ సమస్యకు, వ్యభిచారానికి ఉన్న సంబంధాన్ని కూడా ఒక సానుకూల చూపుతో తడిమారు ఈ కథలో. ఆర్థిక హేతువు కమ్మేసి దరిదాపుల్లో పరిష్కారం కనిపించని నిస్సహాయ పరిస్థితుల్లో, ఊరి పెత్తందారు కలగచేసుకొని కల్పించిన (మోచేతి నీళ్ళ) సామరస్యం మీద పైడయ్య  అయిష్టత ప్రకటనతో కథ ముగుస్తుంది. పల్లెల నుండి పట్టణాలకు పెరుగుతున్న వలసలు, అక్కడ అధ్వానపు నివాస పరిస్థితులు, మృగ్యమౌతున్న ఏకాంతం .. ఇవన్నీ నేరస్తులను తయారు చేస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్న వర్తమాన సమాజంలో ఈ మూడు కథలు స్రవించిన సంవేదన ఇప్పటి సందర్భానికి సారూప్యంగా ఉంది.

 రామారావుగారి కథల్లో ప్రతినాయక పాత్రలు గుర్తించటం కొద్దిగా కష్టం. సమాజపు విలువలు తల్లకిందులుగా వేలాడుతున్న యుగంలో దోపిడీ, దోచుకోవటం అత్యంత సహజ విషయాలుగా ఉంటాయి. అవి చేస్తున్న వాళ్ళను కూడా పెద్ద మనుషులుగా చెలామణి చేస్తున్న భావజాలం ఎంత సహజంగా మెదళ్ళపై ప్రభావం చూపుతుందంటే, ఈ ప్రతి నాయక పాత్రల నడక, నడతల ద్వారా వారి స్వభావాన్ని గుర్తించంటం అతం సులభంగా అనిపించదు. అత్యంత సౌమ్యంగా ప్రవర్తించే ఈ పాత్రలు ఆ కాలపు భూస్వామ్య స్వభావపు ప్రతినిధులు. కథలో ఎక్కడో ఒక శ్లేష వాక్యం ద్వారా మాత్రమే పాఠకులు ఆ పాత్రను అర్ధం చేసుకోగలరు. ‘యజ్ఞం’ కథలో శ్రీ రాములు నాయుడు, ‘ఆర్తి’ కథలో అసిర్నాయుడు, ‘చావు’ కథలో సుబ్బరాయుడు ఈ కోవలోకి వస్తారు. అలాగే కారాగారు సమాజంలో చెల్లుబడి అవుతున్న తప్పుడు విలువలను, సంభాషణలను వంగ్యాన్ని ఉపయోగించకుండా యధాతధంగా రాసి వదిలేస్తారు. రచయిత ఎక్కడో తళుక్కుమంటాడు. పాఠకులు కొద్దిగా సునిశిత దృష్టితో వెదుక్కోవాలి.

వ్యక్తి నుండి వ్యవస్థకు ప్రయాణం

 62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కథలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్య ప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కథల్లో గాఢత బాగా చిక్కబడింది.

 ఈ వరవడిలో రాసిన కథలలో మధ్య తరగతి పిరికి మనస్తత్వ ధోరణులను ఎండకట్టిన ‘భయం’ కథ ఒకటి. ఎక్కువ విస్తృతి గల కథలను పాఠకులు వాళ్ళ వాళ్ళ ప్రాపంచిక దృక్పధం ఆధారంగా వివిధ కోణాలతో అర్థం చేసుకొంటారు. దైనిందిన జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను బయటవారు వచ్చి పరిష్కరించాలని, ఆ ప్రమాదానికి తనవారు మాత్రం దూరంగా ఉండాలనే అంశాన్ని వస్తువుగా తీసుకొన్న కథ ఇది. పామును ప్రతీకగా తీసుకొని అద్భుతమైన ప్రయెగం చేశారు. ”నువ్వు-మీరంతా నాకైనట్లు లోకవంతా నీకౌద్దా?” అన్న భార్య అమాయకపు ప్రశ్నకు సత్తెయ్య ఇచ్చే సమాధానంలో ఆయన ఎవరో అర్థం అవుతుంది. సత్తెయ్య ప్రాణాలను లెక్క చేయక తనకంటే వెయ్యి రెట్లు బలమైన, క్రూరమైన వ్యవస్థపై తెగబడే విప్లవకారుడు. అతడు మాత్రమే ”సీవైనా, పావైనా,సావైనా నాకొక్కటే” అనగలడు. ఇంకా అతడొక్కడే ”పాము బయ్యం మనిషిని తినేస్తుంటది పురుగునాగ. ఎదురు తిరిగితే ఏటీ నేదు. నీ సెయ్యేపైని! అప్పుడు సావు, పావు కూడా సీవల్లా సిన్నవయి పోతాయి- నీ ముందు” అనగలడు.

 తన కొడుకు పామును చంపటానికి, ఎదుర్కోవటానికి ఇష్టపడని సుబ్బాయమ్మగారు మధ్య తరగతి పిరికి వర్గానికి ప్రతినిధి. పదమూడేళ్ళ సొమ్ముల గురవడి అంతర్మధనంలో, అప్పటిదాకా ఒకేలాగా గుంపుగా మాత్రమే కనిపించిన తన సొమ్ములు (పశువులు) విడివిడిగా, కొన్ని దొంగవిగాను, కొన్ని సాధువుల్లాగా, కొన్ని బేలగా, కొన్ని తెలివిగా, మరికొన్ని అతి తెలివిగా అగపిస్తాయి. ఏకశిలగా అప్పటిదాకా కనిపించిన సముహంలో భిన్నత్వాన్ని అర్థం చేసుకొన్న అతని వర్గస్పృహకు సంబంధించిన ఎరుక సూటిగా పాఠకులకు చేరి సంతోష పెడుతుంది. పైకి ఒకేలాంటి భాషా, భావజాలం ప్రదర్శిస్తున్న సమూహాలను తరచి ఒక్కరొక్కరుగా చూస్తేగాని మధ్య తరగతి జాడ్యాలు, భ్రాంతులు వదిలించుకోలేని వాళ్ళను గుర్తు పట్టలేమని రచయిత నర్మగర్భంగా చెప్పారు.

 ఎంతో సార్వత్రిక, సార్వజనీయత ఉన్న ఈ కథ సమకాలీనం కూడా. విప్లవ సముహలలో నిజంగా పోరాడుతున్న వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. విప్లవకారుడిగా మానసికంగా మరణించి, ఉధ్యమంలో కేవలం ఉనికి కోసం ఉంటున్న వాళ్ళూ ఉన్నారు. ఉద్యమ జీవుల్లోని ఈ బలాలు, బలహీనతల వ్యక్తీకరణ ఇప్పటి కాలానికి ఎంతో అవసరం. ఇదంతా ఒక అనుభవంగా సమాజంలో నిక్షిప్తం కావాల్సిన అవసరాన్ని ఈ కథ ఎప్పుడో తీర్చింది. ఇక మిగిలింది ఆత్మ పరిశీలనే.

 రామారావుగారి కథల్లో ఎక్కువ కథల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. కానీ ప్రతీకాత్మకంగా ముగింపు ఇచ్చిన కథ ‘హింస’. మేకపిల్లను చంపిన నక్కలను చేతి రాళ్ళతో వెంటాడి ”యియ్యేళ మిమ్మల్ని, ఒకళ్ళనో ఇద్దర్నో సంపిందాకా నానింటికిపోను” అని ఆవేశించిన సంగి ఆక్రోశం అర్ధం కావాలంటే ఆమె బతుకుతున్న ‘చుట్టూ యిలారం’ పాకలోకి వెళ్ళాలి. కూలాడక గంజి తాగి ఆర్చుకు పోయిన ఆమె పేగులు గమనించుకోవాలి. అంత పేదరికంలో కూడా ”అప్ప (అక్క) వెచ్చని రక్తం నాళ నాళానా వేడిమి నింపుతూ ఆమెను పొదువుకొన్న” ప్రేమ బంధం గుర్తించగలగాలి. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పు వచ్చిన బంధుగుణం అసహాయతను అసహ్యించుకోవటమో, అర్థం చేసుకోటమో చేయాలి. కూతుర్ని ఇక కాపాడుకోలేనని గ్రహించి గొంతు వెలుగు రాసేదాకా ఏడ్చిన తల్లి శోకాన్నం సంగిలో కలిగించిన మొయ్యలేని బాధతో సహానుభూతి చెందాలి. ఇవన్నీ చేయగలిగారు కాబట్టే కారాగారు ఈ కథను ఇంత సహజాతి సహజంగా, అద్భుతంగా రాయగలిగారు.

 పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. తన నేర్పరితనం అంతా ఉపయోగించి ఈప్రయోజనకరమైన పని ‘చావు’ కథలో చేశారు కారాగారు. అంతే కాకుండా ఈ కథకు పదునైన మొనగల ప్రత్యేక ముగింపు ఇచ్చారు. కౌటుంబిక సమస్యలకీ, ప్రకృతి బీభత్సానికి, జబ్బుల ఉపద్రవానికి, పురుషాధిక్య వర్గ సమాజపు కాలరాతకూ బతుంతా గురైన ఒక స్త్రీ మరణం చుట్టూ అల్లిన కథ ‘చావు’. పేద ముసలి దళిత స్త్రీ చనిపోయిన సమయము, ఆమెపై కప్పిన గుడ్డ, ఆమెను తగలెయ్యటానికి కావాల్సిన కట్టె..  ఆమె కుటుంబానికి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అతి ముఖ్యవిషయాలు. సమిష్టి జీవితం ఇంకా ఉనికిలో ఉన్న మాలపల్లె జనానికి కూడా ఇవి జీవన్మరణ సమస్యలే. అర్ధరాత్రి ఆ శవాన్ని తగలేయడానికి కట్టెలు అడుగుతూ అగ్రవర్ణాల ఇంటింటికీ తిరిగి మాలపల్లె పడే దైన్యత, అవమానాల చిత్రీకరణ గుండెలో గుచ్చుకొంటుంది. బహుశ ఈ అవమానాల పర్వం రూపం మార్చుకొన్నదేమో కానీ సారం మారలేదనే వాస్తవం ఎరుకలో ఉండటం వలన కావచ్చు. ”సివరికి మీరు సచ్చినప్పుడు కర్రలూ మావే సపిలీ సేయాల్రా?” అనే నాయిరాలి ప్రశ్నలో ఉన్న అహంకారం కంటే పదిమందిని దళితులను చంపేసిన అగ్రవర్ణ రైతలును విడుదల చేస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యానంలోని అహంకారం ఎక్కువా? తక్కువా? సుధీర్ఘ మౌనం 

 72 తరువాత ఆయన కథలు రాయటం మానేశారు. (92లో ఒక కథ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర ”వూరికే కథ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేకపోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కథలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కథలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన… ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సమాజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. రచయిత డిక్లాసిఫై అయి రాసి తీరాలన్న అప్పటి నిజాయితీ కలిగిన ఒక సాహితీ సంస్థ పిలుపును అందుకొని తనది కాని జీవితాన్ని సాహిత్యంలో సుసంపన్నంగా నిక్షిప్తం చేయగలిగిన ఒక రచయిత ఆగిపోయిన మలుపు భారతదేశ విప్లవ చరిత్రలో అత్యంత విషాదకరమైది. ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయాలతో ముడిపడి సాగిన కారాగారి సాహితీ గమనం ఈ పుస్తకం ద్వారా బహిర్గతం అయిన తరువాత ఈ స్తబ్ధతకు సమాధానం కూడా ఆ రాజకీయాల్లోనే వెదకటం హేతుబద్ధం. జవజీవాలు కువకువలాడిన కాలానికి కాసిన కాయ నిర్జీవమై, నిస్సారమైన కుక్క మూతి కాలంలో వట్టి పోతుందా?

కాలం కంటే ముందు నడిచిన కథలు 

 ‘శాంతి’, ‘కుట్ర’ ‘జీవధార’ కథలు చదువుతుంటే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కథలివి. పాత్ర నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరంలేదు.

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.