నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు – హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

నాబాల్యంలో స్వతంత్ర సంగ్రామం సమయంలోని కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో విలువ ఉండేది. నా మనస్సులో ఈ పార్టీ చెరగని ముద్రగా నిలిచిపోయింది. నేను కాంగ్రెస్‌ సభ్యురాలను కాకపోయినా నన్ను నేను కాంగ్రెస్‌ కార్యకర్తని అని అనుకునేదాన్ని. అసలు నా ఉద్దేశ్యంలో కాంగ్రెస్‌ అంటేనే దేశభక్తి, దేశభక్తి అంటేనే కాంగ్రెస్‌ రెండింటిలో ఏ మాత్రం బేధం లేదు. అసలు ప్రతీ భారతీయుడు కాంగ్రెస్‌ వాడే అన్న అభిప్రాయం నాలో ఉండేది. మా సోదరుడు కమ్యూనిస్టు. బీహార్‌ వచ్చాకే మొట్టమొదటి సారిగా కాంగ్రెస్‌కి కూడా విరోధులు ఉన్నారు అన్న సంగతి తెలుసుకున్నాను. దేశభక్తికి పర్యాకవాచకం కాంగ్రెస్‌ అని అనుకున్న నాకు అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది.

 1967లో బీహార్‌లో ఏర్పాటయిన ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత నేను కాంగ్రెస్‌ పార్టీని వదిలివేసి సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరిపోయాను. బిహార్‌లో సంయుక్త సోషలిస్టు పార్టీ అధికారం నుండి తొలిగిపోయాకే నేను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించకున్నాను. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు నేనంటే మండి పడేవాళ్ళు కారణం నేను వాళ్ళని లెక్క చేయకపోవడమే. అసలు అక్కడ స్త్రీ కార్యకర్తలంటే ఎంతో చులకన భావం ఉండేది. పురుషులు ఆడవాళ్ళను ఒక వస్తువుగా, ఒక పదార్థంగా మాత్రమే చూసేవాళ్ళు. తమకు ఆకలి వేసినప్పుడు ఆడవాళ్ళని వాడుకోవడం తమ జన్మ హక్కుగా భావించేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో రాజకీయాలలో పురుషుడు అనే వ్యక్తి సహాయం లేకుండా లతలైన ఆడవాళ్ళు ఎదగలేరు. నేను రెజిగ్నేషన్‌ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడైన యక్షపాల్‌ కద్దర్‌కి ఈ విధంగా రాసాను.- నేను కాంగ్రెస్‌ పార్టీ నుండి తొలిగిపోతున్నాను. నా దారిని స్వయంగా తయారు చేసుకోగల శక్తి నాలో ఉంది. అందువలన నాదారి నేను వెతుక్కుంటాను. లేకపోతే ఆ దారే నన్ను వెతుక్కుంటూ వస్తుంది.

 నేను ఈ నిర్ణయాన్ని ఎంతో ఆలోచించే తీసుకున్నాను. ఆ సమయంలో కె.బి. సహామ్‌ సత్యేంద్ర నారాయణ్‌, మహేష్‌బాబు వలన గవర్నమెంట్‌ నడిచింది. కాని బాబు సత్యేంద్రి నారాయణ్‌ సింహ్‌ని సమర్థించే వాళ్ళందరు నన్ను చూడంగానే ఎందుకు మండిపడేవాళ్ళో నాకు అర్థంకాలేదు. వాళ్ళల్లో ఒక నాయకుడు నా పర్సనల్‌ విషయంలో కల్పించుకున్నాడు. నేను గట్టిగా ఆయనికి బుద్ధి చెప్పాను. అప్పటి నుండే బీహార్‌లో క్షత్రియులకు నాకు మధ్య గొడవలు మొదలయ్యాయి.  

 ఒకసారి వాళ్ళలో ఒక నాయకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు చెంప దెబ్బకొట్టాను. క్షత్రియులలో దీనిపై చాలా చర్చ జరిగింది. వాళ్ళల్లో ఉన్న క్షత్రియ అహంకారం నా మీద కారాలు మిరియాలు నూరేది. కాని వాళ్ళలో కొంతమంది సమాజవాద సిద్ధాంతాలకి కట్టుబడిన సహృదయత నాయకులు ఉన్నారు. కాని వాళ్ళ సంఖ్య తక్కువ వాళ్ళు నా పట్ల ఎంతో గౌరవం అభిమానం చూపెట్టేవాళ్ళు.

7.నా కఛ్‌ యాత్ర

 కఛ్‌ యాత్ర మొదలు పెట్టాక తెలిసింది నాకు నా జీవన యాత్ర లక్ష్యం ఏమిటో పాట్నా నుండి కఛ్‌ వరకు చేసిన యాత్రలో నేను, నాతో పాటు దాదాపు పదకొండు మంది ఎన్నో కష్టాలకు గురయ్యాము. ఈ సంఘర్షణలో కష్టాలు పడ్డా మాకు ఆనందమూ కలిగింది. అప్పుడప్పుడు పడవలో మేం ప్రయాణం చేసేవాళ్ళం. ఒక్కొక్క సారి రాజకీయ నాయకులను ఎదిరించాల్సి వచ్చేది. అప్పుడప్పుడు ప్రజల సమర్ధన కూడా లభించేది. రాజకీయాలలోకి వచ్చాక ఇది నా మొదటి యాత్ర. ఈ సమయంలో ఎందరో నాయకులను కలిసాను. ప్రేమతో, భావుకతతో కూడిన సంఘటనలు ఎన్నో జరిగాయి.

 1960లో మా కుటుంబం అంతా ధన్‌బాద్‌కి వచ్చింది. ప్రకాశ్‌ ఎసిస్టెంట్‌ కాబర్‌ కమీషనర్‌గా అపాయింట్‌ అయ్యారు. ఇక్కడ నేను నృత్యం నేర్చుకోవడం మానేసాను. కాని చిన్నప్పటి నుండి నాలో రాజకీయాల పట్ల ఉన్న ఆకర్షణని మాత్రం ఎంతమాత్రం చంపుకోలేదు. మొట్టమొదట్లో కవి సమ్మేళనాలలో, నృత్య కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. వాటితో పాటు సమాజ్‌ కళ్యాణ్‌్‌కి సంబంధించిన ఎన్నో ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేసేదాన్ని. చీన్‌ పాకిస్తాన్‌ సమయంలో  నేను చేసిన సేవని ధన్‌బాద్‌ వాస్తవ్యులు ఎంతో మెచ్చుకునేవారు. సాహిత్య సామాజిక, ప్రభుత్వ, రాజకీయ రంగాలలో కూడా నాపేరు బీహారంతా వ్యాపించింది. ముఖ్యంగా సివిల్‌, డిఫెన్స్‌ ట్రైనింగ్‌ తీసుకోవడం అందులో డిస్టింక్షన్‌ తెచ్చుకోవడం రైఫిల్‌ని ఉపయోగించడం చారిటీ షో చేయడం, కవి సమ్మేళనాలలో పాల్గొనడం, నృత్య కార్యక్రమాలు చేసి సైనికుల కోసం చందా వసూలు చేయడం మొదలైన వాటిని నేను ఎంతో ధైర్యంగా మన:స్ఫూర్తిగా చేసేదాన్ని. అందువలన నాకు కొంత మంచి పేరు వచ్చింది. నా కవిత – ”రంగ్‌ బి రంగీ తోడ్‌ చూడియాం హాద్‌ంమే తలవార్‌ గహుంగీ, మైభీ తుమ్హారే సంగ్‌ చలూంగీ, మైభీ తుమ్హారే సాథ్‌ చలూంగీ”…. (రంగు రంగుల గాజులను విరగగొట్టి నా చేత్తో కత్తిని పడతాను, నేను నీతో పాటు వస్తాను, నేను నీతో నడుస్తాను.) ఎంతో ప్రసిద్ధి చెందింది.

 కవి సమ్మేళనాలను నిర్వహించేదాన్ని. బాల్‌వాడీని నడిపేదాన్ని హైస్కూల్‌, కుట్టుశిక్షణా సంస్థలను, మహిళా కోపరేటివ్‌ బ్యాంకులను, పల్లెటూళ్ళలో గ్రామీణ కళ్యాణ కేంద్రాలను తెరిచాను. 1967లో భయంకరమైన కరువు కాటకాలు వచ్చాయి. అప్పుడు కరువు బాధితులకు ఈ సంస్థలన్నీ నీడనిచ్చాయి. ఈ సమయంలో జరిగిన సంఘటను గురించి తరువాత రాస్తాను. ఆ సమయంలో ఒక పెద్ద కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేసాను. ముఖ్యమంత్రి కె.బి. సహాయ్‌ సిఫారిష్‌ మీద పండిత్‌ రాజామిత్రా ద్వారా బి.పి.సి.పి (బీహార్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ) లో సభ్యురాలిగా నియామకం జరిగింది. 1967లో సోషలిస్టు పార్టీలోకి రమ్మనమని నన్ను ఆహ్వానించారు. 1962 నుండి 1967 దాకా కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో అనుభవాలు అయ్యాయి. నేను యష్‌పాల్‌కి రాసిన ఉత్తరంలో వీళ్ళ బండారాన్ని బయటపెట్టాను. – ‘కాంగ్రెస్‌ పార్టీలో కేవలం లత/మాత్రమే పైదాకా పాకగలుగుతాయి. స్వయంగా వృక్షంగా కాగల శక్తి ఏ మహిళలోనైనా ఉంటే చెట్టుని కొట్టేయాలన్న ఆలోచనే చాలా మందికి ఉంటుంది. కేవలం ఒక లతలాగా అవతలి వాళ్ళని ఆశ్రయించి బతకడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నిర్ణయం తీసుకోగల శక్తి నాలో ఉంది. భర్త, తండ్రి, సోదరుడు, కొడుకు, ప్రేమికుడు వీళ్ళ ఆసరా తీసుకుని ముందుకు నడపడం నాకు అలవాటు లేదు. అందువలన పార్టీ నుండి నేను తొలిగిపోతున్నాను. రెజిగ్నెషన్‌ పంపిస్తున్నాను. నేను నా మార్గాన్ని వెతుక్కోగలుగుతాను. లేకపోతే మార్గమే నన్ను వెతుక్కుంటూ వస్తుంది.

 సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరినప్పుడు యువనేతలు కర్పూరీ ఠాకుర్‌ ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. కాని ఇక్కడ కూడా కాంగ్రెస్‌ పార్టీలోలాగా ఆడదాన్ని కేవలం ఒక ఆడదానిగా మాత్రమే చూసే కొందరు నేతలు (కార్యకర్తలు కాదు) ఉన్నారు. కాకపోతే వీళ్ళ సంఖ్య తక్కువ. ఈ పార్టీలో కొందరు స్త్రీల పక్షం తీసుకునే వారు ఉన్నారు. ఈ పార్టీలో ఒకళ్ళిద్దరు  తప్పితే తక్కువ నేతలందరు కాంగ్రెస్‌ వాళ్ళలాగా స్త్రీని తమ సొత్తు అనుకుని అమర్యాదగా ప్రవర్తించే వాళ్ళు కాదు. కాని ఈ సోషలిస్టులలో ముఖ్యంగా యువవర్గంలో సెక్స్‌పట్ల తక్కిన వాళ్ళకు భిన్నంగా అభిప్రాయలు ఉండేవి. వాళ్ళు ఫ్రీ సెక్స్‌ సమర్థులు కాని బలవంతంగా ఆడదాన్ని అనుభవించాలి అన్న ఆలోచన వాళ్ళలో లేదు. దీని వలన వీళ్ళల్లో వీళ్ళకి ఈర్ష్యాద్వేషాలు కలిగేవి.   అది సహజం. కొందరు వృద్ధనేతలు దాష్టీకంగా ప్రవర్తించేవారు. నేను దేవయాని అన్నకులం పేరున ‘బిసాల్‌’ అన్న కథలో అ విషయాన్ని చర్చించాను. లోహియాకి సెక్స్‌ బంధాల పట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వారి దృష్టిలో ఈ సంబంధాలు వ్యక్తిగతమైనవి. కాని కొందరు వారి అభిప్రాయాలను విపరీత ధోరణిలో ప్రచారం చేసారు. లోహియా గారు స్త్రీ అనుమతి లేనిది సెక్స్‌ సంబంధం పెట్టుకోకూడదు. అని చెప్పేవారు. భార్య అయినా సరే ఆమె అనుమతి లేకుండా సెక్స్‌ కోరుకోకూడదు. ఈ పార్టీలోని వారైనా సరే కంపైంట్‌ చేస్తే వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు.

 ఈ సమయంలోనే నేను కఛ్చ్‌ యాత్రకి వెళ్ళానుకున్నాను. బీహార్‌లో సోషలిస్టు పార్టీ పడిపోయాకే అందులో నేను చేరాను. ఎందుకంటే రూలింగ్‌ పార్టీలో చేరడానికే నేను కాంగ్రెస్‌ని వదిలివేసాను అని ఎవరు నా మీద అభాండం వేయకూడదు.

 భారత ప్రభుత్వం ‘కంజర్‌కోట్‌’, ఛాడ్‌వెట్‌ ప్రదేశాలని పాకిస్తాన్‌కి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సంయుక్త సోషల్‌పార్టీ, జనసంఘ్‌ పార్టీ దీనిని వ్యతిరేకించాయి. అప్పటికే లోహియా గారి కాంగ్రెస్‌ విరోధం అంతటా పాకిపోయింది. బీహార్‌లో మొట్టమొదట సంవిద్‌ సర్‌కార్‌ పడిపోయింది. కచ్ఛ్‌ ఉద్యమం మొదలయింది. ఈ సందర్భంలో కర్పురీ ఠాకూర్‌, మధులిమియే, జార్జ్‌ఫర్‌నాండిస్‌, రాజ్‌ నారాయణ్‌ బీహార్‌ యాత్ర చేసారు. ప్రతి జిల్లా నుండి కొన్ని దళాలు వెళ్ళసాగాయి. యువజన్‌ సభవైపు నుండి 55 మంది గుంపు హిచ్చ-హాయిక నుండి వెళ్ళాలని నిర్ణయం జరిగింది. ఎందుకంటే మార్గంలో ఈ దళం ప్రచారం కూడా చేయగలదు. నేను అప్పుడు యువజన సభలో సభ్యురాలిగా ఉండేదాన్ని. కిషన్‌ పట్‌నాయక్‌ దీనికి నాయకుడు. రాంచీలోని ఒక ధర్మశాలలో మీటింగ్‌ పెట్టారు. అందులో నేను పాల్గొన్నాను. మొట్టమొదట 55 మంది దాకా పేర్లు ఇచ్చారు. కాని మెల్లి మెల్లిగా 11మంది ప్రయాణం అయ్యారు. ఈ దళానికి నేతగా షఫీస్‌ ఆలమ్‌ ఎన్నుకోబడ్డారు. నేను సహాయనేతగా ఎన్నిక అయ్యాను. ఆలమ్‌ బొకారో, పచహరీబాన్‌ల కార్మికుల యువనేత అతడిని అందరు దాదా అని పిలిచేవాళ్ళు కఛ్‌ యాత్రకి దాదాపు 22మంది పేర్లు ఇచ్చారు. కాని చివరలో అతడే రాలేదు. పైగా వేరేవాళ్ళని కూడా వెళ్ళవద్దని ఆపాడు. అయినా మేము వెళ్ళాలన్న పట్టుదలతో ఉన్నాము.

 మేము ఒక దళాన్ని కఛ్‌కి పంపాలనుకున్నామంటే తేనెతుట్టెలో చేయి పెట్టడమే. నేతలందరు హిచ్ఛ-హైక్‌ వే నుండి వెళ్ళాలన్న మా నిర్ణయాన్ని మార్చుకోమని వాళ్ళ ఆధ్వర్యంలో అందరు రావాలని బలవంతం చేయసాగారు. హిచ్‌-హైక్‌ వే మార్గం నుండి కాలనడకన వెళ్తూ ప్రచారం చేయాలని, ఆ ఊళ్ళలో చందాలు పోగుచేసి వాటితో మా తిండి తిప్పలు చూడాలన్న నిర్ణయం జరిగింది. అసలైతే లేబర్‌ లీడర్‌ దాదాతో సహా ఎంతోమంది నేతలు చందాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాని సమయానికి ఒకళ్ళు కూడా ఒక్కపైసా చందా ఇవ్వలేదు. నేను, షరీఫ్‌, ధన్‌బాద్‌ రాంచి వెళ్ళేవాళ్ళను తీసుకుని పాట్నా వెళ్ళాము. కర్పూరీ ఠాకుర్‌ ఇంట్లో బస చేసాము. చాలా మంది మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. మేం వెళ్ళడానికి వాళ్ళకు అభ్యంతరం లేదు కాని కాలినడకన మమ్మల్ని ఆపడానికి ఎక్కువగా మంత్రుల కొడుకులు ప్రయత్నించారు. మేం కాలినడకన అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే మా ప్రభావం ప్రజల మీద పడుతుందని, వాళ్ళ ప్రభావం తగ్గుతుందని వాళ్ళ అభిప్రాయం. ఇట్లా వెళ్లడం చాలా కష్టం అపాయకరం కూడా మేం ఎటువంటి కష్టనష్టాలనైనా భరించాలని అని అనుకున్నాం కాని వాళ్ళకు ధెర్యం చాలలేదు. రామానంద తివారి గారు మమ్మల్ని ఏ విధంగానైనా ఆపాలని కంకణం కట్టుకున్నాడు. మేం ఏ మాత్రం తొణకలేదు. ఇకవారి కొడుకు శివానంద్‌ తివారి మమ్మల్ని ఏ విధంగానైనా ఆపాలని కంకణం కట్టుకున్నాడు. మేం పట్టుదల వదలలేదు. ఆయన ఎంతగా దిగజారాడంటే బందిపోటు గోపాల్‌సింహ్‌ని నాపైకి ఉసికొల్పాడు. అతడు నన్ను బెదిరించాడు. గోపాల సింహ్‌పై రేప్‌కేస్‌ కూడా నడిచింది. తరువాత ఈయన మాండూ నుండి ఎమ్‌.ఎల్‌.సి. అయ్యాడు. నేను ఆడదాన్ని కాబట్టి భయపడుతానని అనుకున్నాడు. ఇక ఏం చేయలేక రామానంద తివారిగారు నన్ను ఏ విధంగానైనా ఆపమని కర్పూరీ ఠాకూర్‌ గారికి చెప్పారు. ఒక వేళ నేను ఒక్కతిని సిద్ధం కాకపోతే తక్కినవాళ్ళెవరు ముందుకు రారు. అందరూ పెద్ద పెద్ద నాయకుల దళంతో కలిసి వెళ్తారు. మేం అప్పటికే ఏభై నుండి పదకొండు దాకా తగ్గాము. కొందరు రావడానికి సిద్ధపడ్డారు.

 ఒకరోజు కర్పూరీ ఠాకుర్‌ నా దగ్గరికి వచ్చారు. స్నేహభావంతో నచ్చచెప్పాలని చూసారు. ”రమణికగారు! మార్గంలో మీకు గుండాలు తారసపడతారు. మీరు ఇంతమంది మొగవాళ్ళతో ఒక్కరే వెళ్తున్నారు. మీరు వెళ్ళకండి. కాలినడకన మీరు అక్కడ సమయానికి చేరలేరు. మీరు పిచ్చిగా ప్రవర్తించకండి”

 ‘ఠాకూర్‌ గారు! పిచ్చివాళ్ళుఎవరో సమయమే తేలుస్తుంది. ఇక ఎవరు ముందు ఎవరు వెనక అన్న ప్రశ్న వస్తే ముందు వెళ్ళిన వాళ్ళు తరువాత వచ్చిన వాళ్ళకు స్వాగతం పలుకుతారు. నేను మహిళానేతగా కాదు ఒక కార్యకర్తగా మాత్రమే వెళ్తున్నాను. మీరు నన్ను ఒక స్త్రీగా మాత్రమే చూస్తూ మహిళలను శక్తిహీనులుగా చేసే ప్రయత్నం చేయకండి. దారిలో ఏం జరిగినా అది అందరిపట్ల జరుగుతుంది. ఇంకో విషయం నేను మీతో వచ్చినా మీ పరిభాషలో నేను కేవలం స్త్రీనే కదా! మీరు ఇంకా స్త్రీ- పురుషుల మధ్య భేద భావాన్ని చూపిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది. సరే ఇక షరతు మాటకి వస్తే ఠాకూర్‌ గారు నేను మా దళంతో మీకన్నా అక్కడికి ముందు చేరుతాను. మా తరువాత వచ్చే మీ అందరికి స్వాగతం పలుకుతాను’ నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్నాను.

 కర్పూరీ ఠాకుర్‌గారు మందహాసం చేసారు. నాకు తెలుసు ఆయనపై ఒత్తిడి వలన వారు నాతో అట్లా మాట్లాడారు. కర్పూరీ లాంటి వారు ఒకరిద్దరు తప్పితే తక్కిన వాళ్ళందరిలో మాపేరు ప్రతిష్ఠలు ఇంకా పెరుగుతాయన్న భయం గ్రామాల్లో ప్రచారం అయితే దళానికే లాభం అన్న సంగతి వాళ్ళకు పట్టలేదు. మాకు ఎక్కడ పబ్లిసిటీ వస్తుందోనన్న కుళ్ళు తప్పితే వాళ్ళు మరీ దేన్ని గురించి ఆలోచించలేదు. నిజానికి రాజకీయ పార్టీల మధ్య పబ్లిసిటీ పొందాలన్న కాంప్‌టీషన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. దళాలలోని కార్యకర్తల మధ్య కూడా ఈర్ష్యే.

 మేం బయలుదేరేముందు మాకు వీడ్కోలు చెప్పడానికి ఎవరు రాలేదు. సంధ్యాకాలంలో అమరవీరులకు శ్రద్ధాంజలి సమర్పిస్తూ మేము పదకొండు మంది వీరచంద్‌ మార్గంలో ఉన్న కర్పూర్‌ గారి ఇంటి నుండి బయలుదేరాను. దారిలో కుడి ఎడమల వైపు పార్టీ వాళ్ళ – పూర్వ మంత్రుల ఇళ్ళు ఉన్నాయి. మమ్మల్ని అందరు కిటికీలల్లోంచి, ద్వారాల దగ్గర నిల్చుని చూస్తున్నారని అనిపించింది. అందరి దళాల నమ్మకాన్ని వమ్ముచేస్తూ మా దళం దృఢ సంకల్పంతో నేతల దళానికి ముందే చేరింది. మేం కఛ్‌కి చేరాక కర్పూరీగారు నాషరతు, నా పట్టుదల గురించి చర్చిస్తూ, మా ఉత్సాహాన్ని చూసి ఆనందిస్తూ మా దళానికి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు నేతలు మా ఈ యాత్రను చూసి కుళ్ళుకోవడం మొదలుపెట్టారు. మా దళం గురించి పత్రికలలో పడుతుందని మాకు పేరు వస్తుందని అందులోనూ ఒక మహిళకు దీని వలన లాభం కలుగుతుందని వాళ్ళకి బాధ. ఒక స్త్రీకి పేరు ప్రతిష్ఠలు లభిస్తే వాళ్ళెట్లా సహిస్తారు? రాజ నేతల దగ్గరి చెంచాలకు పత్రికలలో వాళ్ళ పేర్లు కూడా పడాలన్న కోరిక అతి తీవ్రంగా ఉంటుంది. అసలు ఈ పేరుప్రతిష్ఠల ఆకలి వాళ్ళతో పాటు ఉండే స్నేహితులను సైతం   దూరం చేస్తుంది. మా మధ్య శతృత్వం కూడా పబ్లిసిటీ కోసం వాళ్ళు వెంపర్లాడడమే. ప్రచారం కానీండి, కానీకపోనీండి మాయాత్ర వలన కఛ్‌ వివాదం గురించి అందరికి తెలిసింది. కొంతవరకు మాపేరు మారు మ్రోగింది. తండ్రుల పేరు ప్రతిష్ఠలను ఉపయోగించుకుంటూ పైకి రావాలన్న ఆలోచన కల నేతల పుత్రులు మా యాత్రను వ్యక్తిగత ప్రచారం అంటూ చిన్న చూపు చూసారు. రాజకీయాలలో పాతుకుపోయిన నేతలు తాము నేతలుగా ఎదగాలన్న కోరికగల కొత్తతరం కార్యకర్తలను పైకి రాకుండా వాళ్ళపై వ్యక్తిగతంగా ఏవేవో ఆరోపణలు చేస్తూ వాళ్ళ వ్యక్తిగత ప్రచారం ఎక్కువ చేస్తారు. అంటూ వాళ్ళని అణగదొక్కడానికి  ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. నేను వీళ్ళని ఎప్పుడు లెఖ్ఖ చేయలేదు. యువతరంలో కొంతమంది అసలు ఏ పని చేయకుండా తాము పేరు ప్రతిష్ఠలు పొందాలన్న కోరిక వలన పబ్లిసిటికీ అలవాటు పడిపోతారు. అందువలన వాళ్ళల్లోనూ మన:స్ఫూర్తిగా పనిచేసే వాళ్ళ పట్ల ద్వేషం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు ముందడుగు ఎక్కడ వేస్తారో అని వాళ్ళకి భయం. కాలి బాటన నడిచి వెళ్తూ మధ్య – మధ్యలో వచ్చే పట్టణాలలోని, గ్రామాలలోని ప్రజలకు కఛ్‌ సమస్య గురించి తెలియచేస్తూ వాళ్ళల్లో జాగృతి తేవాలన్న ఉద్దేశ్యంతోనే మేం కఛ్‌ యాత్రను చేసాము. చందాలు వసూలు చేసి సత్యాగ్రహం చేసేవాళ్ళు అవసరాలు తీర్చాలని కూడా తీర్మానించుకున్నాము. మధ్యమధ్యలో ప్రజలు మాకు స్వాగతం పలికేవారు. ఖర్చుల కోసం చందాలు ఇచ్చేవాళ్ళు. పాత్రికేయులు మా యాత్ర గురించి రాసేవారు. మేం ప్రజలకి సత్యాగ్రహంలో పాల్గొనమని ప్రోత్సాహం ఇస్తూ ముందుకు సాగేవాళ్ళం.

 అమరవీరులకు శ్రద్ధాంజలి సమర్పిస్తూ సాయంత్రం ఐదు గం||ల ప్రాంతాల్లో బేలి రోడ్డు నుండి దానాపూర్‌ వైపుకి వెళ్ళాము. మా టీములో షఫీక్‌ ఆలమ్‌, లేఖానంద్‌ (రాంచి) యువనేత అవధేష్‌ సింహ్‌(వీరే తరువాత లోక్‌సభలో సభ్యులయ్యారు) మొదలైన వారు ఉన్నారు. ధన్‌బాద్‌లో ఇద్దరు స్టూడెంట్లు అందులో ఒకతను పదహారేళ్ళవాడు, ఇంకా మరో ఐదుగురు మా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. చల్లటి గాలి వీస్తోంది. అందరి చేతుల్లో జండాలు ఉన్నాయి. ‘ కఛ్‌ చలో’ అంటూ నినాదం చేస్తూ ముందుకు నడిచేవాళ్ళం. ప్రతి మలుపులోను, చౌక్‌లోనూ ఆగేవాళ్ళం, దానాపూర్‌కి పెహరీ -ఆన్‌-సోన్‌కి ఎట్లా వెళ్ళాలా అని మేం పదకొండు మందిమే ఆలోచించాం. ఆ రోజుల్లో టాక్సీ వాళ్ళు పాసెంజర్లని హెపరీ ఆన్‌-సోన్‌కి తీసుకువెళ్ళేవాళ్ళు. రాత్రి సమయంలో సామాన్లు తీసుకు వెళ్ళే ట్రక్‌ల వాళ్ళు కూడా అక్కడికి తీసుకువెళ్ళే వారు. అక్కడి నుండి కూడా ట్రక్కులు వస్తూ ఉండేవి. హెవరీ ఆన్‌-సోన్‌లో సిమెంట్‌ కార్‌ఖానా ఉంది. ఆ రోజుల్లో స్వర్గీయ బసావన్‌ సింహ్‌, వారి భార్య కమలా సిన్హా నేతృత్వంలో యూనియన్‌ నడిచేది. ట్రక్‌వాళ్ళకి కూడా వాళ్ళ పేర్లు తెలుసు, బసావన్‌ సింహ్‌ ఒక విప్లవవాదిగా చాలామందికి తెలుసు.  

 మేం కొందరు టాక్సీ వాళ్ళని పైసలు తీసుకోకుండా మమ్మల్ని తీసుకు వెళ్ళమని అడిగాం. టాక్సీ వాళ్ళు టాక్సీ వెనుక డిక్కీలలో కూర్చోపెట్టి తీసుకువెళ్తాం అని అన్నారు. కాని అందరు ఒకసారిగా ఇట్లా వెళ్ళలేరు. కొంతమంది టాంగా వాళ్ళు కొంతదూరం మాత్రమే తీసుకు వెళ్ళగలుగుతామని అన్నారు. మేం ట్రక్‌ వాళ్ళని అడిగాము. ఒక ట్రక్‌ అతను దానాపూర్‌లో సిమెంట్‌ సంచులు ఇచ్చి ఖాళీగా వస్తున్నాడు. నేను షరీఫ్‌ డ్రైవర్‌ పక్కన కూర్చున్నాను. తక్కిన వాళ్ళు వెనుక ఎక్కారు. కాని అవధేష్‌ గారికి కోపం వచ్చింది. రమణికగారు ముందెందుకు కూర్చోవాలి? ఏం నేను కూర్చోకూడదా అని అడిగారు.

 ‘నేను వెనక కూర్చుంటాను. మీరే ముందు కూర్చోండి’. నేను ఆయనని శాంతపరుస్తూ అన్నాను.

 ఆ ఖాళీ ట్రక్‌లో కూర్చున్న మా అందరి ఒళ్ళు హూనం అయింది. ఆరోగ్య వంతులు కూడా జబ్బు పడుతారు. సిమెంట్‌ బస్తాల నుండి రాలిన సిమెంట్‌ వలన కూడా మా అందరికి ఎంతో కష్టం కలిగింది. పాట్నా నుండి దానాపూర్‌కి కాలినడకన వెళ్ళడం వలన మేం అందరం ఎంతగానో అలసిపోయాం. దానాపూర్‌ నుండి వేల మీటర్ల దూరంలో బురదతో నిండిన భూమిపై మెరుస్తున్న ఇసుకను గురించిన ఊహ కర్పూరీ ఠాకుర్‌, రామానంద తివారీల కన్నా ముందుగా చేరిపోవాలన్న పట్టుదల దుమ్మూ- ధూళి సర్‌సర్‌మని వీస్తున్న ఈదురు గాలులను ఏమాత్రం లెక్క చేయలేదు. ఈ ధక్కా  మొక్కీలతో అప్పుడప్పుడు వీచే చల్లటి గాలిని సైతం అనందంగా ఎన్‌జాయ్‌ చేయలేక పోయాం. అక్కడికి చేరాలన్నదే మాధ్యేయం దారిలో లేఖానంద్‌ మాతో పాటు ట్రక్‌ వెనక భాగంలో కూర్చున్నారు. మరొకరిని  డ్రైవర్‌కి వెనక ఉండే సీటులోకి పంపించాము. ఈ విధంగా స్థలాలని మార్చుకుంటూ ‘చలోకఛ్‌’ అని అరుస్తూ ప్రయాణం చేసాము. ఈ ప్రయాణంలో మాకు ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియదు. ప్రొద్దున్న దాదాపు ఏడు గం||ల సమయంలో ట్రక్‌ అతను సిమెంట్‌ అతను ఆ సిమెంట్‌ ఫాక్టరీ దగ్గర ఆపాడు. మమ్మల్ని లేపాడు. మేం కళ్ళు నులుముకుంటూ లేచాక ఒకరి ముఖాలను ఒకరు చూస్తూ నవ్వుకున్నాం. అందరి ముఖాలు , తలలు, దుస్తులు సిమెంట్‌ మయం అయ్యాయి. ముఖాలు కడుక్కోకపోతే భూతాల్లా కనిపిస్తామని నీళ్ళతో ముఖాలు కడుక్కోవాలనుకున్నాం. ఇక నీళ్ళ వేట మొదలు పెట్టాం. ఇంతలో ఎవరో హెచ్చరిక చేసారు. ‘నీళ్ళతో కడుక్కోకండి ముందు  సిమెంట్‌ దులుపుకోండి. లేకపోతే ముఖం ప్లాస్టర్‌ అవుతుంది’.

 సరే… మొత్తానికి మా ముఖాలను శుభ్రం చేసుకున్నాం. సోషలిస్టు పార్టీ కార్యాలయాన్ని వెతుక్కుంటూ ఆక్కడికి చేరాము. ప్రజలకు మేం వస్తున్నాం అని తెలుసు కాని ఫలానా టైమ్‌కి వస్తామని ఖచ్ఛితంగా తెలియదు. సోషలిస్టు పార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీ (సం.సో.పా) రెండు పార్టీలు కఛ్‌ ఉద్యమంలో పాల్గొన్నాయి. కాని పనిచేసే తీరులో ఇద్దరి మధ్య ఆకాశ పాతాళాల బేధం ఉంది. వాళ్ళలో వాళ్ళకు అభిప్రాయ బేధాలు ఉన్నాయి. అయినా వాళ్ళు మాకు టిఫిన్‌ పెట్టారు. మోహనియం నుండి వెళ్ళమని చెప్పారు. డెహరీ-ఆన్‌-సోన్‌లో మేము కొన్ని మీటింగ్‌లు పెట్టాము. చందా పోగు చేసాము. వీటితో సబ్బులు ఇంకా తదితర అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చునని మేం అనుకున్నాము. దాదాపు ఒకరిద్దరి దగ్గర తప్పితే అందరి దగ్గర రెండు జతల బట్టలు ఉన్నాయి. రెండు దుప్పట్లు ప్రతీ వాళ్ళు తెచ్చుకున్నా ఒక చోట నేల, మరోచోట ట్రక్‌పైన ఉన్న కప్పు, ట్రక్‌ వెనక ఉన్న భాగం, మరో చోట టాంగా పట్టా మొ||నవే మా దుప్పట్లు. ఎండాకాలం కాబట్టి ఆకాశమే మాకు దుప్పటిగా ఉపయోగపడ్డది.

 డెహరీ-ఆన్‌-సోన్‌లో ఒక స్నేహితుడు తన ఇంటికి తీసుకువెళ్ళారు. ఆయన భార్య కుసుమ్‌ మాకు ఎంతో ప్రేమగా భోజనం పెట్టింది. కఛ్‌యాత్ర గురించి అడిగినప్పుడు విషయం వివరించి, స్త్రీలు కూడా పాల్గొంటే ఈ ఉద్యమానికి ఇంకా విలువ పెరుగుతుందని చెప్పాను. కుసుమని కూడా రమ్మన్నాను. ఆశ్చర్యం ఆమె వెంటనే మూటముల్లెతో బయలుదేరింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. కుసుమ్‌ ఆమె భర్త దళిత వర్గానికి చెందిన వాళ్ళు. కానీ కార్‌ఖానాలో పనిచేయడం వలన నిమ్న – మధ్య వర్గం దాకా ఎదిగారు. ”సరే నీవు వెళ్ళు. నేను అమ్మ, పిల్లలని చూసుకుంటాం” అని ఆయన నవ్వుతూ అన్నారు.

(ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో