స్ఫూర్తి పాటలలో స్త్రీ ఔన్నత్యం – దొమ్మాటి జ్యోతి

సృష్టిలో ఏ వస్తువు తీసుకున్నా దాని విలువను గ్రహించి వారు సరిగా అర్థం చేసుకొనిఅవగాహన చేసుకునే వారు లేకుంటే ఆ వస్తువు నిరుపయోగ స్థితిలోనే ఉండిపోతుంది.అంతేగాని దాని విలువ ఎంత మాత్రం తగ్గిపోదు. వజ్రము మట్టిలో ఉన్నంత మాత్రాన దాని విలువ తగ్గుతుందా? తగ్గనే తగ్గదు. అది వజ్రము అని తెలుసుకొని సొమ్ము చేసుకునేవారికి ఆ విలువ తెలుస్తుంది. సృష్టిలో దొరికే వస్తువులలో కెల్ల అతి ధృడమైనది వజ్రమే.! అదే విధంగా ప్రపంచానికి ప్రేమను పంచి ఆదరించి, లాలించి పెంచి పెంపొందిస్తున్న స్త్రీకున్న స్థానం వజ్రం కన్నా ఎన్నోరెట్లు గొప్పది. ఏనాటి కాల పరిస్థితులు పరిశీలించినా స్త్రీలు సమాజ అభివృద్ధిలో పురుషుల కంటే ఎక్కువగా భాగస్వామ్యం వహిస్తున్నారు.ఒక దేశం ప్రగతి పథంలో నడుస్తుందంటే దానికి మార్గ నిర్ధేశకులు స్త్రీలే… ఎందుచేతంటే ఒక దేశానికి శాస్త్రజ్ఞున్ని, డాక్టర్‌ని, సైనికున్ని, ఇంజనీర్‌ని, కలెక్టర్‌ని. ఎవర్ని అందించాలన్నా తల్లి కృషి మరులేనిది. పిల్లలు పుట్టింది మొదలు తల్లులు ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యెదాకా క్రమశిక్షణాయుతమైన జీవిత విధానాన్ని నేర్పిస్తూ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. విత్తనం మొలకెత్తి ఒక మహావృక్షమై దాని ఫలాలు అందరికీ చేరేటట్లు తోటమాలి ఎంత కృషిచేస్తాడో.. పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో అంతంటే ఎక్కువగా తల్లి కృషి చేస్తుంది. సాధారణ, మధ్యతరగతి స్త్రీ తన ఇంటి వద్ద పిల్లలకు పాలు తాగించడం, బట్టలు ఉతకడం మల, మూత్రాలు పోతే కడిగి శుభ్రం చేయడం, వంట చేయడం, అంట్లుతోమడం, వాకిలూకడం, కళ్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, పిండికలపడం, రొట్టెలు చేయడం, తినుబండారాలు చేయడం, మసాలా దంచడం, పిల్లలకి తినిపించడం,పాడి గేదెల్ని శుభ్రం చేయడం, పాలు పితకడం, పాలు అమ్మడం, పాలగిన్నెల్ని కడగడం, కూరగాయలు అమ్మడం, నీళ్లు తోడటం, ఇళ్లు అలకడం, ఇంకా ఇవే కాకుండా వ్యవసాయ పనులు మోటకొట్టడం, పశువులకు మేత వేయడం, చేలల్లోకి నీళ్లు మళ్లించడం, పంట కోయడం, చెత్తలేకుండా శుభ్రంచేయడం, విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం, ధాన్యం దంచడం, వరికొయ్యడం, కళ్ళాల్లో వడ్లు తీయడం, తూర్పార బట్టడం, చెరగడం, కోడడం.. ఇలా ఒక్కటేమిటీ ఎదురొచ్చిన ఏ పనినైనా అవలీలగా చేస్తుంది స్త్రీ. కానీ పురుషుడు అలా కాదు ఎడ్లకు నాగలి కట్టి దున్నడం, సాయంత్రం కాగానే ఇంత తాగొచ్చి లొల్లి పెట్టడం. ఇన్ని పనులు చేస్తున్న స్త్రీకి ఈ నాడు గుర్తింపే లేదు. స్త్రీలు ఇంత కృషిచేస్తున్నా గాని వారిని గుర్తించకుండా, నీకేం తెల్సే ఆడదానివి అంటూ నిర్లక్ష్యంగా వివక్ష చూపుతారు. పితృస్వామ్య చట్రంలో ఇరుక్కుపోయిన పురుషస్వామ్య, సమాజ విధానం మారాలి. స్త్రీ ఆవశ్యకతను గుర్తించి సమస్యలు లేని స్త్రీలోకాన్ని నిర్మించాలి, ఇది అందరి బాధ్యత. స్ఫూర్తి రాసిన మహిళా పాటల్లో స్త్రీలపైన వివక్ష చూపుతున్న సమాజ విధానాన్ని తెలుపుతూ ఆ సమస్యల నుండి బయటపడటానికి మార్గం నిర్దేశం చేశారు. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలిపారు. ‘ఆకాసాన పండు వెన్నెల’ అనే పాటలో జన్మనిచ్చిన తల్లిని గుర్తు చేసుకున్నారు.

”కోటి వెలుగుల కాంతి రూపం

కడుపులోన దాచిపెట్టి

రక్తమంతా ధారపోసి

అమ్మప్రేమను రంగరించి

ఉగ్గుపాలే తాపెరా!!

అంటూ గర్భంలో పిండాన్ని కొటి వెలుగుల కాంతి రూపమన్నారు.పిండం ఒక బిడ్డగా రూపొందడానికి తల్లి తన రక్తాన్నంతా ధారపోసిందని ఇదంతా తల్లి ప్రేమతోనే చేసిందని అంతేకాకుండా చందమామను చూపించుకుంటూ గోరు ముద్దలతో కడుపు నింపిందని, ఊయల ఊపిందని,జోల పాడిందని తడబడి నడిచే రోజుల్లో నడకలెన్నో నేర్పిందని ఎదుగుతున్న సందర్భంలో సేవలెన్నో చేసిందని, బిడ్డ జీవిత గమనంలో ప్రతి అడుగులో తల్లి గొప్పతనం శ్రమ ఉంటుందని,బిడ్డ ఎంతటి స్థాయిలో ఉన్నాగానీ తల్లి మనసంతా బిడ్డ బాగోగులపైనే ఆశిస్తుందని ప్రజల సేవలో సాగుతున్న ఉద్యమాలకు తల్లి ఆలోచనలే మూలమని తెలిపారు.ఇంతటి ఔదార్యము, ఓర్పు, సహనంతో స్త్రీ తన పిల్లల్ని సాకుతుంది.ఆ బిడ్డ ఆడైనా,మగైనా వివక్ష చూపదు. ఇద్దరినీ ఒకే విధంగా పెంచుతుంది.కానీ ఈ సమాజంలో నాటుకుపోయి ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న సాంఘిక దురాచారమైన వరకట్నం స్త్రీ యొక్క స్థానాన్ని రోజురోజుకి దిగజార్చుతూనే ఉన్నది. పురుషునితో సమానంగా ఎన్నడూ చూడలేకపోతుంది.మగాడు గుడ్డోడైనా, గూనోడైనా మగాడే… అంటూ ఆడదాన్ని నీచంగా అబలా, ఆడి ముండా అని ఎందుకు కోరగాని దానిగా చూస్తున్నది ఈ పాడుబడ్డ సమాజం.స్త్రీలు పురాణాల నుండి అణచివేతలకు గురయ్యారని దాని ఫలితంగా ఈ రోజుల్లో స్త్రీ ఒంటరిగా బయటకు వచ్చి తిరుగలేని స్థితి దాపురించిందని,స్వాత్రంత్య్రంం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ దోపిడి వ్యవస్థ కింద స్థానం మారలేదని ఇంకా నలిగిపోతూనే ఉందని తెలిపిన ‘స్ఫూర్తి’ పాటల్లో బాల్యం నుండి ముసలితనం వరకూ స్త్రీని తక్కువగా చూస్తున్న విధానాన్ని ‘సిన్ని సిన్ని దానివే ఓ తల్లి’ అనే పాటలో……..

”ఆడపిల్ల అన్నారు ఓ తల్లి

సదువు ఆపేసిరి

మురికి బట్టల్లోన అంట్లు తోమేకాడ

బాల్యమంతా బందిరా”

అంటూ ఆడపిల్లల బాల్యం ఇంటి పనులతోటి బందీ అయిన క్రమాన్ని తెలిపారు. ఆడపిల్లలు ఇంటి చాకిరీ చేయకుండా పుట్టారని ఒకనికి ఇస్తేపోయెదాన్ని ఎందుకు చదివించాలని, మనకేం లాభం వస్తుందనే ఆలోచన ధోరణి నుండి ఈ మూర్ఖ సమాజం, మూఢ జనులు మారవలసింది ఎంతో ఉంది. ఆడపిల్లగా పుట్టిన వారిపైన వివక్ష చూపడం మూలాన భవిష్యత్తు తరలో ఆమెకు పుట్టె పిల్లలకు మార్గ నిర్ధేశం ఎలా చేస్తుంది.చిన్నతనంలో ఆడపిల్లల్ని ఆంక్షల వలయంలో పెంచితే వారికి బుద్ది వికాస దశకు చేరుకుంటుందా? మానసిక పరిపక్వత, మంచి చెడుల విచక్షణ ఎలా తెలుస్తుంది? మగ పిల్లల్ని ఎక్కువగా చూస్తూ ఆడపిల్లల్ని తక్కువగా చూస్తూ (ఎగుడు, దిగుడు) తారతమ్య స్వభావంతో పెంచి పోషిస్తున్న సమాజ గమనం సమతుల్యమవుతుందా? సమస్యల వలయంగా మారుతుందా? సమాజ గమనం అనే బండికి స్త్రీ పురుషుల బండి చక్రాల్లాంటి వారు. స్త్రీ ఆవశ్యకతను, నైపుణ్యాన్ని గొప్పతనాన్ని గుర్తించని సమాజం ముందుకు పోదు, కూలిపోతుంది.ఇలాంటి స్థితి మారాలంటే సమాజానికి ఎదురు తిరిగి, చదువుల్లో రాణిస్తూ దురాచారాల పట్ల పోరు చేయడమే. స్ఫూర్తి ఈ నేపథ్యంలో ఒక చెల్లెలికి మార్గ నిర్దేశం చేస్తూ…..

”వంట ఇంటిలో ఎంత కుమిలినా

లోక జ్ఞానం ఇంత పెరగదు

ఇల్లువాకిలి బతుకనుకుంటే

మన బతుకుల్లో మార్పులు రావు

పోరు జెండాను చేత బట్టి

సంఘ బలంతో సాగవే చెల్లి ”

అంటూ సమసమాజ స్థాపన కోసం లతలు లేని స్త్రీ లోకాన్ని కోరుకున్నారు. పోరాటం చేసి స్త్రీ ఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నాటి కాలంలో పోరాట దక్షత ప్రదర్శించి రాక్షస సంహారం చేసిన సత్యభామను పిల్లాడిని వెన్నుకు కట్టుకొని బ్రీటిష్‌ సైన్యాలతో యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వాన్ని, నిజాం పాలకులకు ఎదురొడ్డి నిల్చి వారిని తరిమి కొట్టిన చాకలి అయిలమ్మను, అత్యుత్తమ ధైర్య సాహసాలతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన బచేంద్రీపాల్‌ను,జైళ్ల స్వరూపాన్ని మార్చివేసిన కిరణ్‌బేడిని ,గ్రామాల్లో సారా,బ్రాండీ వ్యతిరేకోద్యమం నడిపిన స్త్రీలను గుర్తు చేసుకుంటూ వారి బాటల్లో నడవాలని పిలుపునిస్తూ పోరు చేయమని కోరుకున్నారు.ఏమి మిగిలింది,నాకేమి మిగిలింది పాటల్లో……..

”ముసలి తనము ముంచుకొచ్చెను

ఆశలన్ని ఆవిరాయెను

ఎదగనీయని ఈ పాడు పద్ధతి

మార్చకుంటే బతుకులేనిది

అనుభవాన్ని చెపుతున్నా

పోరు చేయమని కోరుతున్నా.”

అని చెపుతూ ఆ ముసలి స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరిం చారు. ఆడ పిల్లల్ని ఆటలాడనీయకుండా, చదువులు చదవనీయకుండా ఇరుగు పొరుగు వారితో మాట్లాడనీయకుండా నిరోధించిన తల్లిదండ్రులు భర్త విధానాలను తెలుపుతున్న ముసలితల్లి ఆలోచనలను, నిత్యం నిర్భంధాలలో ఎదుగుదల లేకుండా జీవించిన స్థితిగతులను తెలిపారు. ఇలా స్త్రీల స్థితిగతులను తెలుపుతూ వారి స్వేచ్ఛను కోరుకున్న ‘స్ఫూర్తి’ పాటలు సంఘ సంస్కరణ దృక్పథానికి నిదర్శనాలు. స్త్రీలను ఆటలాడనీయకుండా చదువుకోనియకుండా బందీ చేస్తూ అభివృద్ధి నిరోధకులుగా ఉంటున్న సమాజ దృష్టి కోణం మారాలి.పితృస్వామ్యం వదిలి స్వేచ్ఛా స్వామ్యంవైపు అడుగులేయ్యాలి. ఆడపిల్లల్ని ఆడనియ్యాలి, పాడనియ్యాలి, చదువుకోనియ్యాలి. ఉన్నతమైన ఉద్యోగాల్ని సంపాదించేందుకు చేయూతనివ్వాలి. స్త్రీలు ఆర్ధిక స్వాతంత్య్రాన్ని పొందితే వివిధ రకాలైన సమస్యల నుండి రక్షించబడుతారు. అందుకే ఆడపిల్లల అభివృద్దిని కాంక్షించిన రచయిత అడుగు జాడల్లో ముందుకు నడుద్డాం….స్త్రీ ఔన్నత్యాన్ని పెంపొందించుకుందాం….

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.