ఇలాంటి ”మద్దెల చెరువులు ” ఇంకెన్ని ఉన్నాయో??? – కొండవీటి సత్యవతి

మద్దెలచెరువు, పిట్లం మండలం నిజామాబాద్‌ జిల్లాలో ఒక చిన్న గ్రామం. అలాంటి చిన్న గ్రామంలో గత ఆరునెలల కాలంలో పదకొండు మంది పసిపిల్లలు చనిపోయారు. అంటే ఆరు నెలలుగా ఆ ఊళ్ళో పసివాళ్ళ ఏడుపు సవ్వడి వినబడలేదు. వినబడినా నెల లేక రెండు నెలలు అంతకు మించి అంటే రెండు నెలలలోపే ఆ పసివాళ్ళు ఈ లోకంనించి మాయమైపోయారు. మద్దెలచెరువు గ్రామంలో ఐ.ఎం.ఆర్‌. ఇంత దారుణంగా వుంటే ఈ విషయం ఏ మీడియాను ఆకర్షించలేదు. కనీసం స్థానిక విలేఖరులకు కూడా ఈ వార్త చేరలేదు. అంత పకడ్బందీగా పసివాళ్ళ మరణ వార్తల్ని దాచిపెట్టారు. గ్రామంలో ఇంత దారుణం జరిగినా సంబధిత శాఖల అధికార్లెవ్వరూ గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించలేదు.

వారం రోజుల క్రితం మహిళా సమత సొసైటి ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రశాంతి ఫోన్‌ చేసి ఈ విషయం గురించి చెప్పేవరకూ నాకూ తెలియదు. మహిళా సమత మద్దెలచెరువు గ్రామంలో పనిచేస్తోంది కాబట్టి వాళ్ళ కార్యకర్తల ద్వారా ఈ విషయం ప్రశాంతికి రిపోర్టు అవ్వడం, తన ద్వారా నాకు తెలియడం జరిగింది. మహిళా సమత కార్యకర్తలు నెలరోజులుగా ఈ అంశం మీద గ్రామంలో స్త్రీలతో మాట్లాడుతున్నారు. బిడ్డల్ని కోల్పోయిన తల్లులు తమ దుఃఖాన్ని పంచుకోవడానికి గానీ, జరిగిన విషయాల గురించి మాట్లాడటానికి గానీ ఇష్టపడకపోవడంతో కార్యకర్తలు చాలా సార్లు గ్రామానికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిజానికి బాధిత స్త్రీలు బయటకొచ్చి మాట్లాడటానికి మహిళా సమత కార్యకర్తలు చాలా కృషి చేసారు. చాలాసార్లు గ్రామానికి వెళ్ళారు. వీరి కృషి ఫలితంగానే మొట్టమొదటిసారి బాధిత స్త్రీలందరు మాతో మాట్లాడగలిగారు. అప్పటికే వాళ్ళ జిల్లా టీమ్‌ల మధ్య ఈ అంశమై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రశాంతి చెప్పిన వెంటనే నాకు వాళ్ళతో కలిసి ఆ గ్రామానికి వెళ్ళాలనిపించింది. ఆ గ్రామంలో మహిళా సమత ఉనికి లేకపోయుంటే నేను మద్దెలచెరువు వెళ్ళగలిగేదాన్ని కాదు ఈ రిపోర్టు రాసేదాన్ని కాదు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆరునెలల కాలంలో ఒకే గ్రామంలో అంతమంది పసివాళ్ళు మృత్యువాత పడడం నన్ను కలిచివేసింది. నిజానికి ఈ అంశం జాతీయ స్థాయి మీడియాలో ప్రముఖంగా రావాల్సింది. కానీ ఇంతవరకు రాష్ట్రస్థాయిలో కాదు కదా జిల్లా స్థాయి మీడియాలో కూడా ఈ అంశమై వార్తలు రాలేదు. గ్రామంలో మీడియాను కూడా పిలిచి ఒక మీటింగ్‌ని నిర్వహించాలని జిల్లా కమిటీ సభ్యులు నిర్ణయించుకుని రాష్ట్ర ఆఫీసుకు ఈ విషయం చెప్పారు. ఆ విధంగా వారితో కలిసి నేను కూడా 18.12.14వ తేదీన మద్దెలచెరువు గ్రామానికి వెళ్ళడం జరిగింది. మహిళా సమతా నుండి ఉమ, ఉషలతో కలిసి మేము ఏడున్నరకి నిజామాబాద్‌ వేపు బయలుదేరాం. కామారెడ్డి, బాన్సువాడ మీదుగా అడవుల్లోంచి ప్రయాణించి 10.30కి మద్దెలచెరువు గ్రామం చేరాం.

స్త్రీలంతా బయటనే ఎండలో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. బాత్‌రూమ్‌ కోసమని ఒకరింటికి వెళ్ళినపుడు ఆమె ‘టీ తాగండక్కా’ అని ఆప్యాయంగా పిలిచింది. ఆమె చీరకుచ్చిళ్ళు పట్టుకుని వేలాడుతున్న ఐదారేళ్ళ కుర్రాడు ”ఏందమ్మా! ఖాలీ టీ ఇచ్చి పంపుతవా? అన్నం పెట్టవా” అని అడిగాడట. వాళ్ళమ్మ మురుసుకుంటూ మాకు చెప్పింది. వాడి ఆతిథ్యం అబ్బురమన్పించింది. టీ తాగి మీటింగ్‌ జరిగే కాడికి వచ్చాం. స్త్రీలంతా అక్కడ చేరారు. ఎదురుగా అంగన్‌వాడి సెంటర్‌, స్కూల్‌ వున్నాయి. నీడకూడా వుందక్కడ. కానీ స్త్రీలు ఎండలో రోడ్డుపక్క కూర్చోడానికే ఇష్టపడ్డారు. ఎండ చుర్రుమంటోంది. ”ఏందమ్మా! ఎండలోనే కూర్చుంటారా? అంటే ఒకామె…. పేరు గంగవ్వ ” మేం రోజంతా ఎండలోనే పనిచేస్తాం. ఎండలో కూర్చోవడానికి కష్టమేమి లేదు. భలే చలిగా కూడా వుంది” అంది చురుగ్గా. నా నోరు ఠక్కున మూతపడింది.

క్రమంగా గుంపు పెద్దదైంది స్త్రీలు, పురుషులు మా చుట్టూ చేరారు. ఎవరైతే బిడ్డల్ని పోగొట్టుకున్నారో మెల్లగా వారు రాసాగారు. ఓ అరగంటలో నిజామాబాద్‌ నుండి మీడియా మిత్రులు వచ్చారు. మేం మాట్లాడటం మొదలు పెట్టకుండానే ఒకామె తానే ముందు మాట్లాడుతూ….” మా గ్రామంలో మళ్ళిట్లా జరక్కూడదు. ఏం చేయాలో సోంచాయించాలి. మేం మీటింగ్‌ పెట్టుకుని మాట్లాడుకున్నం” అంది ”ఏం జరిగింది? ఎందుకని మీ గ్రామంలో ఇంతమంది పసిగుడ్లు చనిపోయారు. ఇది చాలా సీరియస్‌ విషయం మీరు ఏమనుకుంటున్నారు” అని అడిగాం. ముందు మనం పరిచయాలు చేసుకుందం” అంది ఉమ. అందరూ పేర్లు చెప్పి ”వెన్నల సంఘం” అని చెప్పారు. కొంతమంది వేరే సంఘం పేరు చెప్పారు. కానీ ఎక్కువ మంది మహిళా సమత సొసైటీకి చెందిన వెన్నల సంఘంలోనే సభ్యులుగా వున్నట్టు పరిచయాల తర్వాత అర్థమైంది. ఒక్కొక్కరూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ లోపు మద్దిలచెర్వు ఏ.ఎన్‌.ఎమ్‌ ఆరోగ్య మేరి వచ్చారు. ఆమె వచ్చేసరికి ఒకామె మాట్లాడుతోంది. ఆమె చెప్పేది వినకుండా ”వీళ్ళకి మూఢ నమ్మకాలెక్కువ. నేను చెప్పిన మాట వినరు.” అంది చాలా పరుషంగా. ” మూఢ నమ్మకాలేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? దయచేసి అలాస్టేట్‌మెంట్లు ఇవ్వకండి” అని గట్టిగా అన్నాను నేను. ”లేదు మేడం! వీళ్ళు అంగన్‌వాడి సెంటర్‌లోకి రారు. తినరు. అన్నీ మూఢ నమ్మకాలే” అంది మళ్ళీ! ”ఏంటమ్మా! ఆమె అలా అంటోంది. ఎందుకెళ్ళరు? అంగన్‌వాడిలో ఎందుకు తినరు? ఏమైంది? అంటే…”ఈడనే కాముని పున్నమి కాల్తుంది. ఆడలోపల ఆంజనేయుడి గుడివుంది. లోపల దెయ్యమో భూతమో ఉందమ్మా! ఆడ తిన్న వాళ్ళందరికీ ఇదో ఇలా బిడ్డలు సచ్చిండ్రు. ”పదకొండు గంటలకి అన్నం పెట్టమంటే వాళ్ళు పెట్టరు. మిట్ట మధ్యాహ్నం ఆ చెట్లమీద భూతాలుంటాయి. అందుకే మేం పోము.” అంది ఒకామె. మాకేమీ అర్థం కాలేదు. క్రమంగా అర్థం కాసాగింది. గ్రామంలో గర్భం దాల్చిన మహిళలు మొదట్లో అంగన్‌వాడి సెంటర్‌లో ఇచ్చినవి తినేవాళ్ళు. ఎలా ప్రబలిందో వాళ్ళకే తెలియదు కానీ ఆ సెంటర్‌ ఆవరణలో దెయ్యమో…భూతమో వుందని, అక్కడికెళ్ళి తిన్నందుకే పిల్లలు చనిపోతున్నారనే ప్రచారం జరిగింది. దానిని ఈ మహిళలు నమ్మారు. అక్కడిచ్చే ఆరకొర పోషకాహారం కూడా తీసుకోవడం మానేసారు. ”తినాలి కదమ్మా! తినకపోతే కడుపులోపలి బిడ్డకి బలమెట్లా వస్తుంది ” అంటే” ఇంట్లో తింటున్నాం కదా ! ఆ సెంటర్‌ కయితే మేం పోం” అని గట్టిగా చెప్పారు. దీని మీద చాలాసేపు మాట్లాడాం.

ఇంకొక ముఖ్యమైన అంశం మా దృష్టికొచ్చింది. అదేమంటే ఆ గ్రామంలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. బిడ్డల్ని కోల్పోయిన తల్లులతో మాట్లాడుతున్నప్పుడు… వాళ్ళు అందరూ బాల్యవివాహాలు జరిగిన వాళ్ళే. మాకు ఇరవై ఏళ్ళు వున్నాయి. అంటున్నారు గానీ అది నిజం కాదని వాళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఇంకా బాలికలుగా కన్పిస్తున్న శోభ,, ఖైరున్నీసా.. చాలా నీరసంగా, రక్తహీనతలో ఉన్నారు. వాళ్ళ శరీరాలు పేలవంగా, పాలిపోయి వున్నాయి. వాళ్ళ మానసిక స్థితి గురించి… వాళ్ళ మానసిక వేదన గురించి మాట్లాడే వాళ్ళేలేరు. ఇంత జరిగాకా… మళ్ళీ వెంటనే గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవ్వరికీ తెలియదు. గర్భనిరోధానికి ఎలాంటి పద్ధతులున్నాయో వాళ్ళకి అవగాహన లేదు. ఫలితం… నాలుగు నెలల క్రితం బిడ్డను కోల్పోయి, చాలా బలహీనంగా వున్న ఒకామె ప్రస్తుతం రెండు నెలల గర్భంతో వుండడం. ”మీకు భయమన్పిస్తుందా? మీరు కొంత వ్యవధి ఇవ్వాల్సింది కదా” అంటే బలహీనంగా నవ్వడం తప్ప సమాధానం లేదు. ఆమెకి అవగాహనా రాహిత్యంతో పాటు ఎలాంటి ఛాయిస్‌ లేదని అర్థమైంది.

బిడ్డని కోల్పోయిన ఓ తల్లి నిర్వికారంగా కూర్చుని వుంటే అత్త మాట్లాడిన మాటలు మమ్మల్ని దిగ్భ్రమకి లోనుచేసాయి. ”నేను నా కోడలిని దవాఖానాకి తీసుకుపోయినా మంచి తిండి పెట్టినా. బోలెడు డబ్బు ఖర్చుపెట్టి కాన్పు చేయించాను. 3.50 కిలోల బరువున్న పిల్లడు పుట్టిండు. కొన్ని దినాలు మంచిగానే వుండే. ఏం కారణం లేకుండానే సచ్చిపోయిండు” అంది. ఆమె పక్కనే తలకి మఫ్లర్‌ కట్టుకుని, శుష్కించిన శరీరంతో, పుల్లల్లా వెళ్ళాడుతున్న చేతులతో ఆమె కోడలు కూర్చుని వుంది. ఆమె ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. ఒక నిర్లిప్తత… నిరాశక్తత.. నేను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే.. మళ్ళీ ఆమె అత్తే… ”నా కోడలు కన్న కొడుకు సచ్చిండు… డాక్టర్‌ ఆమె గర్భసంచిని కూడా తీసేసింది. మాకు సెప్పకుండానే” ”అదేంటి? గర్భసంచి ఎందుకు తీసేసారు? చెప్పలేదా మీకు?” షాక్‌ తిన్నాం మేము.” ముందు చెప్పలేదు. మేం వచ్చేస్తుంటే నా కొడుకును తీసుకపోయి సంతకం పెట్టించుకుంది. ఇంత లావున్న గర్భసంచిని ప్లేటులోపెట్టి ఇదే… మీ కోడలి గర్భసంచి అని చూపించింది. అది మా కోడలిది కానేకాదు. ”అంది అత్త గట్టిగా. కోడలి వేపు చుడ్డానికి నాకు భయమేసింది. ఎంతఘోరం ఎంత అమానవీయం… నా కళ్ళల్లోకి నీళ్ళొచ్చి కలతచెందుతుంటే ”ఆమె వయస్సు 35 ఏళ్ళు… ఆమెకి అలాకాక ఇంకెలా అవుతుంది?” అన్న ఆరోగ్యమేరిని ఈడ్చి కొట్టాలన్నంత కోపమొచ్చింది. ”ప్లీజ్‌ ! మీరు మాట్లాడొద్దు. మీకు కనీస సంస్కారం కూడా లేనట్టుంది. స్టేట్‌మెంట్లు ఇవ్వడం… పుస్తకాల్లోంచి అంకెలు చూపించడం తప్ప మీకు ఇంకేమీ చేతకాదా?” అని గట్టిగా అరిచాన్నేను. కొడుకుని పొగొట్టుకోవడమే కాక మళ్ళీ తల్లయ్యే అవకాశం లేకుండా గర్భసంచిని.. అదీ ఆమెకి చెప్పకుండా కత్తిరించిపారేసిన డాక్టర్‌ ధన వ్యామోహం… ఆమె నిర్వకారంగా, యోగినిలా కూర్చున్నది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ముఖంలో విషాదం గూడుకట్టుకుని వుంది. కానీ… ఆ దు:ఖాన్ని వ్యక్తీకరించే దారేది ఆమెకు లేదు. ఆమె మనసులో ఏమి కల్లోలం జరుగుతున్నదో…. దాన్ని కొలచగల సాధనం అక్కడ ఎవ్వరి దగ్గరా వుండదని అర్థమై నాకు చాలా దు:ఖమనిపించింది.

వొకరి తర్వాత ఒకరుగా బిడ్డల్ని కోల్పోయిన తల్లులు తమ అనుభవాలను చెప్పుుకున్నారు. వొక్కరి కళ్ళలోంచి కూడా కన్నీళ్ళు రాలలేదు. ఇంకిపోయాయా? ఎండిపోయాయా? ఇద్దరు తల్లులు చాలా బలహీనంగా, ఇంటర్‌ చదువుతున్న పిల్లల్లా వున్నారు. ఖచ్చితంగా వాళ్ళవి బాల్యవివాహాలే. ఆ గ్రామంలో బాల్య వివాహాలు చాలానే జరుగుతున్నట్టున్నాయ్‌. ఈ తల్లులకి తమకి పురిటి నొప్పులొచ్చాయో, కడుపులో నొప్పి వచ్చిందో కూడా అవగాహన లేదు.

”వాళ్ళకి నొప్పులొచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళరు మేడం. పనులు చేస్తూ వుంటారు. వాళ్ళ కిచ్చిన కార్డులో 108 నంబరు రాసి ఇస్తాను అయినా ఫోన్‌ చెయ్యరు. వాళ్ళకి పురుటి నొప్పులంటే తెలియదు” ఆరోగ్య మేరీ నోరు విప్పితే వాళ్ళమీద కంప్లయింట్స్‌ తప్ప… వాళ్ళకి లేని, తనకి వున్న అవగాహనని వాళ్ళకి ఎలా కల్పించాలో తెలియదు. పురుటి నొప్పుల్ని ఎలా గుర్తించాలో వాళ్ళకి చెప్పాలనే ఇంగితం ఏఎన్‌ఎమ్‌కి లేదు. బిడ్డని పొగొట్టుకోవడంలో తప్పంతా వాళ్ళదే అని చెప్పడానికి ఆవిడ శతవిధాల ప్రయత్నం చెయ్యడం మ్కానిపించింది.

”మా కోడలు బాగా పని చేస్తుంది. ఎనిమిదో నెలలో నాట్లేసింది” అని ఓ అత్త చెప్పినప్పుడు ”ఎనమిదో నెల వచ్చాకా నాట్లా” విలవిల్లాడుతూ అడిగింది ఉష. ఎనమిది నెలల గర్భంతో ఆమె ఎన్ని సార్లు వొంగి, లేచి నాట్లేసిందో నేను విజువలైజ్‌ చేసుకుని అదిరిపోయాను. ”ఎనమిది నెలలొచ్చాకా కూడా పొలం పనులు చేయిస్తారా? కష్టం కదమ్మా చెయ్యడం ”అని అడిగితే…” లే… నాట్లేయలేదు. ఊకే పొలం చూడనీకి పోయిందంతే” అత్త మాట మార్చింది. కోడలు తలవొంచుకుని కూర్చుంది. పితృస్వామ్యం పడగనీడ కనబడింది నాకు.

”మా కోడలికి మంచిగా మందులిప్పించినా… అంగన్‌వాడిలో ఇచ్చిన గోలీలు వేసినా… అయితే గోలీలు మధ్యలోనే ఆపేసినా… మందులెక్కువేస్తే బిడ్డ బాగా పెరిగిపోతందట.. కాన్పు కష్టమైతదట. అందుకే మందులాపేసినా”. ఒక అత్త స్టేట్‌మెంట్‌. ఏం మాట్లాడాలి? గర్భిణీకి ఏమందులెప్పుడు ఎన్ని వేయాలో నిర్ణయించేది డాక్టరు కాదు. అత్త నిర్ణయిస్తుంది. కరక్టు డోసులు పడ్డాయో లేదో తెలియదు. ఏం మందు వేసారో… ఏం వెయ్యలేదో తెలియదు. దీని మీద పక్కా అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య కార్యకర్త ” వీళ్ళ మందులు సరిగా వేసుకోరు” అని స్టేట్‌మెంట్‌ ఇచ్చేస్తుంది. అంతే. ఎందుకు వేసుకోలేదో అడిగి మందులు వెయ్యదు.

మేం మాట్లాడుకుంటున్న సమయంలో ఆ ఊరి సర్పంచి వచ్చాడు. వస్తూనే ఆరోగ్య మేరీ మీద విరుచుకుపడ్డాడు. ఆయనకి రెండు రోజుల క్రితమే విషయం తెలిసిందట. నాకు ముందెందుకు చెప్పలేదు అని ఆమెని అడుగుతున్నాడు. ”నువ్వసలు గ్రామంలో ఎందుకుండడంలేదని” నిలదీస్తున్నాడు.”గ్రామంలో ఏం జరిగినా నువ్వు మాకు చెప్పాలి కదా నువ్వు చెప్పలేదు. మహిళా సమత వాళ్ళొచ్చి చెప్పే వరకు మాకు తెలియదు. వాళ్ళకున్న బాధ్యత నీకు వుండక్కరలేదా?” అంటూ నిలదీసాడు సర్పంచి. ఆయన అడుగుతున్నపుడే గ్రామస్తులు ముక్త కంఠంతో ”ఈమె గ్రామంలో వుండాలి. ఏ రాత్రి ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఆరోగ్య కార్యకర్త అందుబాటులో వుండాలి ”అంటూ అరిచారు,” ఇల్లు చూపించండి నేనిక్కడే వుంటాను. ఇద్దరి పని నేనే చేస్తున్నాను. ఇంకొక కార్యకర్తని పిట్లం పంపించేసారు.” అంటుంది మేరి. ఆరోగ్య మేరీకి తన సమస్యలు తప్ప ఆ ఊరిలో వున్న ఆడవాళ్ళ సమస్యలు అస్సలు కనబడవు.

మేం ఊరిలో తిరుగుతున్నపుడు. చాలా చానెల్స్‌ వాళ్ళు గ్రామంలోని స్త్రీలతో మాట్లాడారు. బాధిత మహిళలు కెమెరాల ముందు కూర్చుని మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. తమ దు:ఖాన్ని వివరించడం వాళ్ళకి చాలా కష్ఠమైంది. మేము అన్ని ఛానల్స్‌తోను ఆ గ్రామంలో వున్న సమస్యల గురించి వివరంగా చెప్పాం. ఒకే గ్రామంలో అంతమంది పసివాళ్ళు చనిపోవడం చాలా సీరియస్‌ విషయమని, ఈ వార్త రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయస్థాయి మీడియాలో రావాల్సిన అవసరం వుందని, సంబంధిత శాఖల అధికారులు ఈ గ్రామంలో పర్యటించి, ఒక క్యాంప్‌ను నిర్వహించి సమస్యల మీద అధ్యయనం చెయ్యాలని మేము చెప్పాము.

ఆ తర్వాత మేము అంగన్‌వాడి సెంటర్‌ ఉన్న ఆవరణలోకి వెళ్ళాము. ఏ అంగన్‌వాడి సెంటర్‌లోకి మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వెళ్ళమని చెబుతున్నారో ఆ సెంటర్‌కి పక్కనే బడి, గుడి వున్నాయి. సెంటర్‌లో పదిమంది చిన్నపిల్లలు కూర్చుని వున్నారు. అంగన్‌వాడి వర్కర్‌ లేరు. ఒకమ్మాయివుంది. మీరెవరిని అడిగితే లింక్‌ వర్కర్‌నని చెప్పింది. సూపర్‌వైజర్‌ వచ్చి వెళ్ళారా అంటే ఇంకా రాలేదు అని చెప్పింది. అక్కడ ఓ పెద్ద గిన్నెనిండా కోడిగుడ్లు వున్నాయి. ఈ ఊరికి ఇన్ని గుడ్లు కావాలా? అని అడిగితే ”పదిరోజుల కోసం” అని చెప్పింది లింక్‌ వర్కర్‌. ”ఇవి ఎప్పుడు వచ్చాయి” అంటే… ”మూడు రోజులైంది.” ”పదిరోజులు అలా బయటపెడితే పాడయిపోతాయి కదా” ”అవును. పాడయిపోతే పారేస్తాం ఇవ్వము.” అవి ఖచ్చితంగా పాడవుతాయి.. మనుష్యుల పొట్టల్లోకి వెళ్ళాల్సిన గుడ్లు పెంటకుప్పల్లోకి పోతున్నాయన్నమాట. కోడి గుడ్లు సరఫరా చేసే ఏజన్సీకి ఇచ్చిన నియమాలేంటో తెలియదు. బహుశా రెండు రోజుల కొకసారి సరఫరా చెయ్యాలి. అక్కడ ఫ్రిజ్‌ వుండదు కాబట్టి గుడ్లన్నీ బయటే వుండాలి కాబట్టి కనీసం రెండురోజుల కొకసారి సరఫరా చెయ్యాలి. కానీ పది రోజుల కొకసారి సరఫరా చెయ్యడం దారుణం. అందరూ గుడ్లు తింటున్నట్టు ప్రభుత్వ లెక్కల్లో వుంటుంది కానీ… ఆ గుడ్లు పాడైపోయి చెత్త బుట్టల్లోకి పోతున్నాయి. అలాంటివి తినడం కూడా ప్రమాదకరం. గుడ్లు పగలగొడితే పాడైందని తెలుస్తుంది ఉడకబెట్టిన గుడ్లు వొలిస్తే తప్ప తెలియదు. అది నల్లగా వుంటేనే పాడైంది అనుకుంటారు. అలాంటివి తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ఇది అంగన్‌వాడిలో పరిస్థితి.

సర్పంచితో మేం గమనించిన అన్ని విషయాలు చర్చించాం. అంగన్‌వాడీ సెంటర్‌ నడుస్తున్న స్థలానికి సంబంధించి మహిళల్లో వున్న భయాల గురించి అవగాహన కల్పించాలని, తాత్కాలికంగా వేరే ఏదైనా ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చెయ్యమని, గ్రామంలో జరిగిన శిశు మరణాల గురించి సీరియస్‌గా పట్టించుకుని, ఆ వివరాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళాలని కోరాం. ముఖ్యంగా పదేపదే బాధిత మహిళలు ప్రస్తావించిన డా||మాలతి, డా||సుధలతో పేషంట్లని తమ ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌లకి తరలించుకుని వేలకొద్దీ రూపాయాలు గుంజుతున్న వైనంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయమని చెప్పాం. అలాగే ఒక మహిళ అనుమతి తీసుకోకుండా, ఏమి సమస్య వల్ల గర్భసంచి తీసేయాల్సి వచ్చిందో చెప్పకుండా గర్భసంచి తీసేసి, ఆ తర్వాత భర్తతో సంతకం పెట్టించుకోవడం నేరమని, ఆమె మీద పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వాలని కోరాం. మేం చెప్పిన అన్నింటినీ ఆయన వొప్పుకుని తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాడు. ”మేం అవగాహన కార్యక్రమాలు చేస్తాము దాని కోసం ఏర్పాట్లు చేస్తాము. మహిళా సమత నుండి మీరు తప్పకుండా రావాలి” అని ఆయన కోరారు.

సమయం రెండున్నర. మేము తిరుగు ప్రయాణమయ్యాం. మద్దెలచెరువు గ్రామంలో మేము గమనించిన అంశాలు.

  •  బాల్యవివాహాలు
  •  మహిళల్లో రక్తహీనత
  •  నెలలు నిండాకా కూడా బరువైన పనులు చేయడం
  •  ఆరోగ్య కార్యకర్త నిర్లక్ష్యవైఖరి
  •  అంగన్‌వాడి సెంటర్‌ వున్న స్థలం పట్ల ఉన్న భయాలు, అపోహలు
  •  ఏ మందులు ఎన్ని ఎప్పుడు వేసుకోవాలో అవగాహన లేకపోవడం
  •  పురుటి నెప్పుల గురించి అవగాహన లేక, ఆసుపత్రికి వెళ్ళడంలో ఆలస్యం చెయ్యడం
  •  ఆరోగ్య కార్యకర్తమీద నమ్మకం లేక బయట ఆసుపత్రులకు వెళ్ళడం, ప్రభుత్వ డాక్టర్ల ధనవ్యామోహం, అవసరం వున్న లేకున్నా ఆపరేషన్లు చెయడం, ప్రభుత్వ ఆసుపత్రి నుండి తమ ఆసుపత్రులకు తరలించడం, వేల కొద్దీరూపాయలు వసూలు చెయ్యడం
  •  ఐరన్‌ లాంటి మందులు ఎక్కువ తింటే కడుపులో బిడ్డ బరువు పెరిగి, కాన్పు కష్టమై, పెద్దాపరేషన్‌ చేయించాలి, దానికి బోలెడు ఖర్చవుతుందని ఆలోచించి, ఐరన్‌ గోలీలను మధ్యలోనే మానేయడంతో వీళ్ళల్లో విపరీతమైన రక్తహీనత.
  •  కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల అవగాహన లేదు. బిడ్డకి, బిడ్డకి ఎడం ఎందుకుండాలనే చైతన్యం లేదు. భర్తలు నిరోధ్‌ వాడొచ్చని, స్త్రీలకి వేరేపద్ధతులున్నాయనే అవగాహనలేదు. ఫలితం వెంటవెంటనే గర్భధారణ.
  •  పిల్లలను, గర్భిణీ స్త్రీలను కంటికి రెప్పలా కాపాడాల్సిన అంగన్‌వాడి సెంటర్లు… వీటి మీద స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. ఒక గ్రామంలో ఐ.ఎం.ఆర్‌ ఇంత ఘోరంగా వుంటే దానికి బాధ్యత వహించాల్సింది ఆశాఖే.
  •  వైధ్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆరోగ్య కార్యకర్తలకి సరైన శిక్షణనివ్వాలి. ఆశిక్షణ మానవీయ కోణంలో వుండాలి.
  •  తమ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ ఊరి సర్పంచ్‌కి వుంది. ఆరు నెలలుగా తమ గ్రామంలో వరుస శిశు మరణాలు జరుగుతున్నా, ‘ రెండు రోజుల క్రితమే నాకు తెలిసింది’ అని ఆయన చెప్పడం విడ్డూరంగావుంది.

చివరగా మద్దెల చెరువు గ్రామంలో జరిగిన అవాంఛనీయ శిశుమరణాల విషయంలో అక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా సమత సోసైటి బాధ్యత గురించి చూద్దాం. మహిళా సమత గ్రామీణ మహిళలతో అట్టడుగు స్థాయిలో వున్న అన్ని వర్గాల మహిళలతో అనేక అంశాల మీద పనిచేస్తుంది. పాటల ద్వారా, సమావేశాల ద్వారా, పోస్టర్లద్వారా, పుస్తకాల ద్వారా ఎన్నో అవగాహనా కార్యమ్రాలు చేస్తుంది. గ్రామీణ స్త్రీలు గ్రామంలోని సమస్యలను సమావేశాల వేదిక మీదకి తెచ్చి చర్చించేలా ఫెసిలిటీట్‌ చేస్తుంది. అవగాహనను, చైతన్యాన్ని కల్పించడంతో పాటు సమాచారాన్ని అందించడంలో మహిళా సమత ముందుంటుంది. పిట్లం మండలానికి అంచున వున్న ఈ గ్రామంలో పనిచేసే కార్యకర్తలు కొంతకాలం అందుబాటులో లేకపోవడం, ఆ క్లస్టర్‌లో పనిచేసే ఒక కార్యకర్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహిళా సమత ఆమెని అక్కడ బాధ్యతల్నుంచి తొలగించింది. కూడా…. ఎంతో నిబద్ధతతో పనిచేసే మహిళా సమత సొసైటీలో జరిగిన ఇలాంటి పరిణామాల వల్ల కూడా మద్దెలచెరువు గ్రామంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలకు వాళ్ళు కొంత బాధ్యత వహించాల్సి వచ్చింది.

అలాగే అన్ని జిల్లాలలోను సామాజిక అంశాలపై పనిచేస్తున్న ఇందిరాక్రాంతి పథం సంఘాలున్నాయి. మద్దెలచెరువులో మహిళా సమితే కాక ఐకెపి కూడా పనిచేస్తోంది. సోషల్‌ ఏక్షన్‌ కమిటీలు ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. అప్పులివ్వడం, కట్టుకోవడం – అప్పుల మాయాజాలంలో సామాజిక అంశాలు కొట్టుకుపోయాయనుకోవాల్సి వస్తుంది. ఎంత రుణం తీసుకోవాలి? ఎవరెంత రుణమిస్తారు? వడ్డీ ఎంత? ఎన్ని కిస్తులు కట్టాలి ? లాంటి వాటిమీద అవగాహనున్న స్త్రీలకు రక్తహీనత మీద, కుటుంబ నియంత్రణ పద్ధతుల మీద, ఐరన్‌ గోలీల మీద, పురుటి నొప్పులెప్పుడొస్తాయో, ఎలా గుర్తుపట్టాలో లాంటి అంశాల మీద శాస్త్రీయ పద్ధతిలో అవగాహన లేదు. స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మూఢ నమ్మకాల మీద ఎలాంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టలేదు.

ఇక మీడియా… ఏదో చెట్టుకి బొప్పాయికాయ వినాయకుడిలా వుంది? ఫలానా వారింట్లో ఇంత పొడుగు పొట్లకాయ కాసింది. ఫలానా విఐపి ఏ గుళ్ళో ప్రదిక్షిణలు చేసాడు? ఏ గుడికి ఏ విఐపి వెళ్ళాడు? షారూక్‌ఖాన్‌ చెడ్డీ వేసుకున్నాడు, ధోనీ గుండు చేయించుకున్నాడు లాంటి చెత్త వార్తలతో పేజీలు నింపుతారు కానీ గ్రామీణ ప్రాంతాల సమస్యలు, గ్రామీణ స్త్రీల స్థితిగతుల గురించిన వార్తలు వెయ్యరు. ఇంత ప్రమాదకరస్థాయిలో శిశు మరణాలు జరిగినా ఏ వొక్క విలేఖరిగానీ, ఛానల్‌ గానీ వెళ్ళి ఆ వార్తల్ని ప్రపంచానికి తెలియచెయ్యాలని అనుకోలేదు. ఈ రోజుకి కూడా ఈ వార్త జిల్లా స్థాయిలో రాలేదు. రాష్ట్రస్థాయిలో వస్తుందన్న ఆశలేదు.

ఇదీ పరిస్థితి…. మద్దెలచెరువులో జరిగిన శిశు మరణాల గురించి కనీసం మహిళా సమత సొసైటి ద్వారా అయినా ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి మద్దెలచెరువులు ఎన్నున్నాయో అనే భయం నా నరనరాన జరజరాపాకుతోంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ఇలాంటి ”మద్దెల చెరువులు ” ఇంకెన్ని ఉన్నాయో??? – కొండవీటి సత్యవతి

  1. Manjari Lakshmi says:

    బాగుందండి వ్యాసము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.