పాజిటివ్ జీవితాలు

-కల్పనా జైన్, అనువాదం: సీతారాం

(హెల్త్ జర్నలిజంలో దిట్టగా కల్పనా జైన్ అనేక వార్తా కథనాలను అందించారు. 1994 మహారాష్టల్రో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆమె అందించిన వార్తా కథనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. టైమ్ రిసెర్చి పౌండేషన్‌లో, సామాజిక జర్నలిజంలో డిప్లొమా పొందిన తరువాత 1986లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హెల్త్ ఫైల్’ శీర్షికలో మలేరియా,హెచ్ఐవి వ్యాప్తి, కాలుష్యం ఆరోగ్య ప్రభావం, శిశు మరణాలు ప్రజా ఆరోగ్య సంస్థలు నేల కూలడం తదితర విషయాల గురించి రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కరస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. భర్త ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో నివసిస్తున్నారు.)

అక్టోబర్ నెలలో ఓ ఆహ్లాదకరమైన రోజు అది. సముద్రం ప్రశాంతంగా ఉంది. గొప్పదైన ఐఎన్ఎస్ శక్తి నౌకకు చెందిన నావికులలో ఎక్కువమంది డెక్ మీద నిలబడి ఉన్నారు. వారి పాకెట్ ట్రాన్సిస్టర్‌లలోంచి సంగీతం వెల్లువెత్తుతూ ఉంది క్రికెట్ వ్యాఖ్యానంతో కలిసి. ఓ బౌన్సర్కి కపిల్దేవ్ సిక్స్ కొట్టాడనే ఆనందపు కేరింత వినిపించింది. ఎవరో జోక్ వేయడంతో డెక్ నిండా నవ్వులు పొంగి పొర్లాయి.

కేబిన్‌లో అశోక్ చెమటతో పడుకుని ఉన్నాడు అతని మనసులో ఒక సుడిగుండం. అతనికి ఈ కొత్త స్థితి గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఆ స్థితిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యేందుకు నిర్ధారించాల్సిన రక్తపరీక్షలు సందేహం లేకుండా ఆఖరి తీర్పునిచ్చాయి. సందిగ్ధం అతడిని ఆవరించింది.

ఏం జరుగుతూ ఉన్నదో అతను అంగీకరించలేకపోయాడు. ముఖ్యంగా తనకు హెచ్ఐవి ఉందన్న విషయాన్ని ఒప్పుకోలేక పోతున్నాడు.

తన జీవితం అర్ధాంతంగా ముగిసి పోనున్నదనే వాస్తవాన్ని అంగీకరించే స్థితిలో లేడిప్పుడు. అసలు తనకంటూ మంచి రోజులు ఇప్పడిప్పుడే మొదలయ్యాయి. ఎంతో ఆశావహమైన ఉద్యోగం, అతని సన్నిహితమిత్రులు, అతని కలలు, ఇదంతా ఎంతో వేగంగా ముగిసి పోనుందా?! కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.

అతని జీవిత గమనం ఏమైనా మారితే? గాఢమైన ఒంటరితనం చుట్టు ముట్టింది. మామూలుగా అయితే మిత్రుల్ని కలిసేందుకు పెద్దగా ఆగేవాడు కాదు. కానీ, ఈ రోజు సంతోషం లేదు. వాళ్ళను కలవాలంటే ఏదో తెలియని అసౌకర్యం.

ఈ క్షణమే అతడు ఆందోళన చెందుతున్నాడు. ఉద్దేశ పూర్వకంగానే నెమ్మదిగా చప్పుడు లేకుండా నడిచాడు. తన మంచం పైకి ఎక్కాడు. మీదకు దుప్పటిగుంజుకున్నాడు. ఎవరైనా స్నేహితులు తనని ఏమైనా అడుగుతారేమోనని, వాటిని దాటవేయడానికి. అతడికి బయటకు వెళ్ళడానికి, ఎప్పటిలాగా మిత్రుల్ని ఏ తేడా లేదనిపించే విధంగా కలవడానికి కొంత సమయం అవసరమైంది.

పూనా నుంచి బొంబాయి దాకా మధ్యలో అనేకసార్లు ఈ దృశ్యాన్ని ఊహించుకున్నాడు. రిహార్సల్సు చేశాడు. నేనెట్లా ఈ విషయం చెప్పాలి? తనలో తానే ప్రశ్నించుకుంటూ కూర్చున్నాడు. రద్దీగా ఉండే సబర్బన్ రైల్లో నిశ్శబ్దంగా కూర్చున్నది అతడొక్కడే కాదు. కానీ, ఈ ప్రయాణంలో రోజూ ప్రయాణించే వారితో ఆ రైలు ఎక్కువ రద్దీగానే ఉంటుంది. కిటికీ ప్రక్కనే సీటు దొరకడంతో తాను తనలాగే మిగిలేందుకు వీలు చిక్కింది. రైలు ముందుకు కదులుతున్న కొద్దీ వెనక్కి వెళుతున్న ప్రకృతి దృశ్యాల్లోనూ అశోక్ నిమగ్నుడు కాలేకపోయాడు.

అతని ఆలోచనల్లో తన జీవితంలోని గత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఒకవేళ తను నేవీలో చేరకపోయి ఉంటే.. చదువునే కొనసాగించగలిగి ఉంటే.. తనని తండ్రి ఏం చేయాలని ఆశించాడో అదే గనుక చేసి ఉంటే… పరి పరి విధాల ఆలోచనలు చుట్టు ముట్టాయి.

ఇంకా మంచమ్మీద పడుకొనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న నలుగురు అక్కాచెల్లెళ్ళ ముఖాలు గుర్తొచ్చాయి. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ళ గురించి ఆలోచించకుండా ఉందామని ప్రయత్నించే కొద్దీ, అవి మరింతగా చుట్టుముడుతున్నాయి. వాళ్ళ పట్ల తనకున్న బాధ్యత నిరంతరం అతడ్ని విసుగు చెందేట్లు చేస్తున్నది. అదే పనిగా ఆలోచన బాధిస్తూ ఉన్నది. ఏమౌతుంది వారికి? ఆ ఇంట్లో వయసు మీదపడుతున్న తండ్రి కాకుండా తానొక్కడే వారికి మగదిక్కు.

కొడుకు పుట్టాలని తల్లి ప్రార్థించేది. తమ ముసలితనంలో తనను చూసుకుంటాడని, కుటుంబం పేరు నిలుపుతాడని, తన కూతుర్లకు సోదరుడిగా బాధ్యతలు నెరవేరుస్తాడని, అక్కా చెల్లెళ్ళకు ఆధారమవుతాడని ఇట్లాంటివేవో ప్రార్థనలు చేసింది. ఈ ఒక్క ఆలోచనే అతడిని వణికింపజేసింది. తత్తరపడేట్లు చేసింది. కలవర పెట్టింది. కనీసం ఈ సందర్భంలోనైనా అదేపనిగా ఆలోచించటం మానేయాలి. అవసరమైనప్పుడల్లా వాళ్ళకి సహాయ పడతాడు.

ఆలోచనలు తన ఓడమీదకి మళ్ళాయి. తనలో తాను నవ్వుకుంటూ స్నేహితులను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం వారితోనే తన బాధ్యత. అతని కుటుంబం, ఉద్యోగం, కుదించబడిన అతని జీవితం అంతా ఒక్కసారిగా ఆ క్షణంలోకి తగ్గిపోయింది. ఇక్కడి జీవితం మిత్రుల చుట్టూ తిరిగింది. రెండేళ్ళ క్రితం నుండే వాళ్ళకు తాను తెలిసినా అది శాశ్వతమైనదిగా కనిపించింది.

అమిత్, నితిన్, కైలాస్ వీళ్ళ మధ్య రహస్యాలు లేవు. అతనికీ తెలుసు తాను ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పాలని అతను ఎట్లా దాయగలడు దీన్ని. అదీగాక, వాళ్ళంతా తనను అడుగుతారాయె.
‘పూనా వెళ్ళవా? పరీక్షలో ఏం తేలింది?’ ఈ ప్రశ్నలను ఎట్లా తప్పించుకోవాలి? లేక అబద్ధం చెప్పాలా? అతనికి వారిపట్ల ఎటువంటి సందేహమూ లేదు. వారంతా తనతో ఉంటారని తెలుసు. తనని నమ్ముతారని, విశ్వసిస్తారని తెలుసు. జీవితం యథాతథంగానే గడిచి పోతుందనీ తెలుసు. అయితే తాను విషయం చెప్పబోయే క్షణాల గురించే ఆందోళన పడుతున్నాడు.

వారేమైనా ఒకవేళ అడిగితే ఎలా జరిగిందని ప్రశ్నిస్తే చెప్పాలనే నిర్ణయించుకున్నాడు. అని విషయాల్లోగే ఇది కూడా. జరిగిందేదో జరిగింది. నాకు తెలియదు ఎట్లా జరిగిందో. నేను అమాయకుడ్ని. నేనేమీ చేయలేదు. అస్పష్టంగా ఉండాలని తనతో తాను చెప్పుకొన్నాడు.

హెచ్ఐవి అంటే ఏమిటో వారికి తెలిసే అవకాశం లేదని తనని తాను మభ్యపెట్టుకున్నాడు. బహుశా అప్పుడు చెబుతాడేమో తనకి హెచ్ఐవి ఉందని. కానీ, ఒకవేళ హెచ్ఐవి గురించే అడిగితే ఏముంది అది ఎయిడ్స్ కి దారి తీస్తుందని చెపుతాడు. ఆ తరువాత వాళ్ళేమీ తనని అడగరు. తనకి తానే దృఢంగా చెప్పుకున్నాడు. మరో బిగ్గర నవ్వు అతనికి వచ్చింది.

ఇప్పుడతను బయటకు వెళ్ళేందుకు ఇబ్బంది పడుతున్నాడు అతను తన స్నేహితులతో ఉండాలనుకున్నాడు. హాస్యంలో, చమత్కారిగా అతనికి మంచి పేరుంది. హాస్యదృష్టి ఎక్కువన్న ఖ్యాతీ ఉంది. తానున్నాడంటే చుట్టూ ఎంతో మంది ప్రతి ఒక్కరూ చుట్టూ చేరేవారు. సంతోషంగా లేని క్షణమంటూ ఒక్కటి కూడా లేదు. తన గది ముందున్న వరండాలో గొంతులు బలహీనమయ్యాయి.

గడియారం వైపు చూశాడు.

అది రాత్రి భోజన సమయం. క్రితం రోజు రాత్రినుంచి ఏమీ తినలేదతడు. వాళ్ళంతా భోజనాల గదిలో ఉన్నారు. మొఖం కొద్దిగా వెలుగుచూసింది. అక్కడ వారందరినీ కలుస్తాను.

అదే మంచిది అనుకున్నాడు.

ఒక్కసారిగా అతడిలో కొత్త శక్తి వచ్చింది. పక్కమీదనుంచి దూకి డైనింగ్ హాల్‌లోకి పోయేందుకు సిద్ధపడ్డాడు. తాను హెచ్ఐవి పాజిటివ్ అన్న వార్త విన్నాక మొదటిసారి అశోక్ తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నాడు. బాగా పెరిగిన మెత్తటి గోధుమరంగు జుట్టును దువ్వుకున్నాడు.

కళకళలాడే ముఖంలో ఎక్కడా కొవ్వు ఉన్నట్లు కనిపించలేదు (సూచనలేదు) లోపలికి ఉన్న కళ్ళ అందాన్ని బుగ్గలు మరింత పెంచాయి. అక్కడే ఉన్న కోల్డ్ క్రీమ్ డబ్బాలో వేలుపెట్టి కొద్దిగా పగిలిన పెదవులకు మెల్లగా రాసుకున్నాడు. మరోసారి తనని తాను అద్దంలో ఎక్కువసేపు చూసుకున్నాడు. నుదుటి మీద కూడా కాస్త క్రీం రాసుకున్నాడు. ఆలసట కనపడనీయకుండా చేసేందుకు. అలసటతో ముడతలు పడ్డ నుదురు ప్రకాశవంతంగా కనిపించాలని. తన అందాన్ని తాను ఆరాధించకుండా ఉండలేకపోయాడు. ఐదడుగుల ఎనిమిది అంగళాల ఎత్తు మామూలుగానే ఎంతో తెలివైనవాడిగా అంతే అందమైన వాడిగా కనిపిస్తాడు.

ఎప్పుడూ ఎంత ఉల్లాసంగా ఉంటాడో అదే ఉల్లాసం కనపడేందుకు ప్రయత్నిస్తూ నావల్ ఆఫీసర్స్ మెస్‌లోకి అడుగుపెట్టాడు. మెస్‌లో సాధారణంగా ఉండే సందడి చుట్టుముట్టింది. ప్లేట్లు, చెంచాలు, గ్లాసుల చప్పుడూ ఒకేసారి వినిపించడం మొదలైంది.

తన బూట్ల టక టక శబ్దం తనకే వినిపిస్తుండగా మెస్ బల్ల వైపు కదిలాడు. తాను నడుస్తున్నప్పుడొచ్చే బూట్ల చప్పుడు తనకి తెలుస్తూనే ఉంది. అంత నిశ్శబ్దంగా ఎందుకుందో అశోక్‌కి కొద్ది నిమిషాలపాటు అర్థం కాలేదు. అయోమయ పడ్డాడు. ఆ నిశ్శబ్దం అతనిలోనూ కలిగింది. బహుశా అక్కడున్న వారందరికీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడేమో తాను మునపటి మనిషేనని అభినయిస్తున్నాడు. కానీ తన చుట్టూ ఉండే మనుషుల్లో మార్పు. వాళ్ళు మారారు.

ఎప్పుడైతే తాను మెస్ గదిలోకి అడుగుపెట్టాడో తనని చూసిన స్నేహితులందరి ముఖాల్లోనూ ఈ భావం కనిపించింది. తన రహస్యం వాళ్ళకి తెలుసు. అతనేమీ చెప్పనవసరం లేదు. చాలా మంది తినడం ఆపి తనని తేరిపార చూడటం మొదలు పెట్టారు. వాళ్ళేదో భూతాన్ని చూస్తున్నట్లుగా చూస్తున్నారు. అశోక్ మొఖం పాలిపోయింది. తెల్లబోయాడు. నిస్ప్పుహ కలిగింది. వంట్లోని రక్తమంతా ఎవరో తోడేస్తున్న భావం కలిగింది. ఇట్లా జరుగుతుందని అతడనుకోలేదు. ఇక ఎంత మాత్రమూ వాళ్ళు ప్రేమించదగ్గ అశోక్ కాడు తాను.

మొత్తమ్మీద ఈ క్షణాన అయితే వాళ్ళంతా పరాయివాళ్ళే తనకు. తాను పరాయివాడే వాళ్ళకు. తనకు పరిచయమైన నవ్వు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చుట్టూ చూచాడు. మళ్ళీ చూశాడు. ఎవరికి వారు తలవంచి తినడంలో మునిగిపోయారు.

అక్కడినుంచి వెనుదిరిగి పోవా లనిపించింది. తక్షణమే పారి పోవాలనిపించింది. ఇక ఏమాత్రమూ సన్నిహితుల్ని అతడు ఇష్టపడటం లేదు. కానీ, ఈ కాస్త వ్యతిరేకతకు అతడు విస్తుపోయాడు. అలాగే అక్కడే నిలబడ్డాడు.

ఏం చేశాడతడు? మొదట వాళ్ళంతా తన మీద కోపంతో ఉన్నారనుకున్నాడు. వెనక్కి రాకపోవటంతో వారిలో ఆగ్రహం ఉందనే నిశ్చయించుకున్నాడు. మిగతా నావికుల విషయంలో పట్టింపు లేదు. కానీ, వీళ్ళకేమైంది? వీళ్ళు తన స్నేహితులు కదా! ఇదంతా తాను హెచ్ఐవి పాజిటివ్ కావడం వల్లనే జరుగుతున్నది కదూ! అందుకే వాళ్ళు ముఖం చాటేస్తున్నారు.

అట్లా అయ్యుండదని తనకి తాను సర్దిచెప్పుకుంటూ మెల్లిగా టేబిల్ దాకా నడిచాడు. ప్లేట్ తీసుకునే ఉద్దేశంతో జరగాల్సిందైతే వాళ్ళంతా తన చుట్టూ మూగి తనతో మాట్లాడాలి. రూమంతా కలయ జూశాడు. ఒక్కసారి అమిత్, నిఖిల్, కైలాస్లు కూర్చున్న మెస్ బల్ల దగ్గర అతడి చూపులు నిలిచిపోయాయి. ప్లేట్‌లో వడ్డించుకోవటంతో వారితో వెళ్ళి కలవాలనుకున్నాడు.

వారివైపు చూసి చిరునవ్వు నవ్వాడు. తన నవ్వు వారిని తాకలేదు. దాటి వెళ్ళి పోయింది. మొదట కైలాస్ లేచాడు. ప్లేట్‌లో ఏదో వొడ్డించుకునే అవసరం కలిగింది. తిరిగి వడ్డించుకోవడానికేనా? మరప్పటికే అది నిండి ఉందే! ఆ తరువాత అమిత్ అనుసరించాడు. ఆఖర్న నితిన్ కూడా నిష్క్రమించాడు.

ఇక ఎటువంటి సందేహమూ లేదు. ఇది అంతిమంగా తనకు ఎదురవుతున్న తిరస్కారమే. అశోక్ కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. ప్రతి నిరసన తనని పొడుస్తూ బాధిస్తున్నది. మెల్లగా తాను వడ్డించుకున్న చేపముక్కలు, అన్నం తినడం ముగించాడు. తన స్నేహితులు ముగ్గురూ తనని గమనిస్తూనే ఉన్నారని అర్థం చేసుకున్నాడు. తన ప్రతికదలికా, చర్యలన్నీ వారి పరీక్షకు గురయ్యాయి. అయితేనేం అతడ్ని అక్కడే ఉండమని మనసు చెప్పింది.

వీటిని లక్ష్యపెట్టనట్లుగా ప్రవర్తించమనీ చెప్పింది. అతడు జీవించాలి. అతడు ఆహారం తీసుకోవాలి. వాంతి అవుతున్నట్లనిపించినా తినక తప్పదు. కంచంలో పెట్టుకున్నదంతా ఏమీ మిగల్చకుండా తినేశాడు. గదిలోని గుసగుసలు ఇంకా తగ్గలేదు. అవి ఇంకా సజీవంగానే ఉన్నాయి. అతని చెవుల్లో మార్మోగుతున్నాయి. తనను అణగ ద్రొక్కుతున్నాయి. దీనికతను సంసిద్ధుడై లేడు.

క్రమంగా ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. మెస్ గది ఖాళీ అయ్యింది. తన కుర్చీలో చేరగిలబడ్డాడు అశోక్.
రాత్రికి రాత్రే అతని జీవితం మారి పోయింది. అంతా తారు మారైంది.

అశోక్‌కు మార్చ్ 1989 అంటే భయం కరమైన ఇన్ఫెక్షన్తో జీవించాల్సి రావడానికి ప్రారంభమే కాదు. ఎదుర్కోవటం, ఎదుర్కొని నిలబడటం, తట్టుకోవడం కూడా. ముఖ్యంగా ఒంటరి తనం, వివక్ష, అపహాస్యం, నిరాశా రోజూ మృత్యు భయంతో బ్రతకటానికీ ప్రారంభమే అది.

ప్రమాదభరితమైన వైరస్ కల్పించిన అడ్డంకులను తట్టుకుంటూ బ్రతకగలగటానికి మాత్రమే అది ప్రారంభం కాదు. తాను ఎవర్ని ఇంతకాలం తనవాళ్ళు అనుకున్నాడో వారందర్నీ తట్టుకుని మనగలగటానికి తాను చేసే పోరాటానిక్కూడా అది ప్రారంభం.

ఏదో ఎవరి కారుణ్యం, దయా దాక్షిణ్యాలవల్లో ఇవ్వబడ్డది. గౌరవమనేది ఎవరి దయా దాక్షిణ్యాల వల్లనో ఇవ్వబడి జీవితాన్ని కొనసాగించడానికీ అదే మొదలు.

అశోక్ ఒక vortex లో కూరుకు పోయాడు. అప్పటికే దేశంలో ఎంతోమంది ప్రాణాలు ఈ సుడిగుండంలో చిక్కుకున్నాయి. వారందరికీ కూడా మిగిలిన జీవితాన్ని కొనసాగించటమే భయానకం, ప్రమాదకరం, భీతావహమై కూర్చుంది.

వైరస్‌కి వ్యతిరేకంగా పోరాడ్తున్న ఇట్లాంటి వాళ్ళందరూ తరచూ ఒంటరితనానికి గురయ్యారు. సమాజం వైఖరి అంత సానుభూతితో ఉండేది కాదు. అనేకులు వివిధ రకాల వైఖరులతో బాధించే వారు. హెచ్ఐవి గురించి పూర్తిగా తెలియని అజ్ఞాన ఫలితంగానే అశోక్ లాంటి వాళ్ళకు ఇట్లాంటి విషమస్థితి తలెత్తింది.
ఈ కొత్త వైరస్ గురించిన చైతన్యం విస్తారంగా లేదు. పైగా దాని గురించి భయాందోళన తీవ్రంగా ఉన్నాయి. ఎవరన్నా హెచ్ఐవితో జీవిస్తున్నారంటే చాలు. వారితో మాట్లాడేందుకు జంకు. చెపితే ఏమవుతుందోనని ఆందోళన నిజానికి ఇట్లాంటి స్థితిలో కూడా హెచ్ఐవికి గురైన కొద్ది మందిలోనైనా బ్రతికేందుకూ ధైర్యంతో చుట్టూ ఉన్న సమాజాన్ని ఎదుర్కోగల సాహసమూ ఉన్నాయి.

రాము అట్లాంటి వాడు. రాములాగా కాకుండా జీవితం నుంచి తప్పుకున్న వైదొలగిన వారు ఎంతోమంది ఉన్నారు.

రాముడి కథ
పదేళ్ళ క్రిందట రామా పాండ్యన్ చెన్నైకి వచ్చినప్పుడు అతని భవిష్యత్తు ఆశావహంగా కనిపించింది. ఆ మాటకొస్తే ఎంతో ఆశావహ భవిష్యత్తును ఊహించి పదేళ్ళక్రితం చెన్నై వచ్చాడు రాము. ఫార్మసీలో డిప్లొమా, ల్యాబ్ టెక్నీషియన్‌గా శిక్షణ కోసం చెన్నై వచ్చాడు. మద్రాసు మెడికల్ మిషన్‌కి చెందిన ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో చక్కని ఉద్యోగం దొరక బుచ్చుకోవటంతో విజేతగా నిలిచాడు.

ఒక్క పలచటి మనిషి. మెత్తనైన నల్లని జుట్టు. తన వృత్తిలో ఎంతో నైపుణ్యం సంపాదించాడు. సమర్థుడు అనిపించు కున్నాడు. చురుకైన చేతివేళ్ళతో ఏ విధమైన లేబరేటరీ పరీక్షలనైనా నిర్వహించేవాడు. అతడు పరీక్షించాడంటే ఖచ్చితమైన రీడింగ్ రావాల్సిందే. కొంతకాలం తరువాత ఉత్తమ టెక్నీషియన్‌గా అవార్డును కూడా అందుకున్నాడు. అతను వేసుకున్న ప్రణాళిక ప్రకారంగానే జీవితం దరి చేరుతూ ఉన్నది. పెళ్ళికూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ప్రతి ఆరు మాసాలకి తమ ఉద్యోగులు రక్తదానం చేయాలన్న నిర్దేశాల ప్రకారం అతడు నడచుకునేవాడు. ఒక ఆసుపత్రి ఉద్యోగిగా రక్తం కొరత ఎంతుంటుందో అతనికి తెలుసు. ఎవరో, ఎక్కడనో ఉన్నవారికి ఈ విధంగానైనా సహాయ పడవచ్చునని అతని ఆశ. అదతనికి గొప్ప సంతృప్తినిచ్చేది. తన కోసం బ్రతకడమొక్కటే కాక ఏదో కొంత మేలు చేస్తున్నాననే తృప్తి అతనికి ఉండేది.

1992లో అతనోసారి రక్తదానం చేశాడు. ఆ తరువాత అతని జీవితం మారింది. ఆరోజు తాను లేబరేటరీలోకి వెళుతున్నప్పుడు, సహోద్యోగులు కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అతని చూడ్డంతోటే మాటలు ఆపేశారు. ఇదేదో పెద్దగా పట్టించుకోనక్కర్లేని సంఘటనగానే విస్మరించాడు. తరువాత ఆఫీస్ బాయ్ టీ కప్పులు తీసుకు పోవడానికి వచ్చి, రాము కప్పు మాత్రమే వదిలి వెళ్ళాడు. రాము లేచి ఆ కప్పును తానే కడిగి బహుశా చూడలేదేమో అనుకున్నాడు.

ఈ సంఘటనలు, ఇట్లాంటి చర్యలన్నీ అతడి జీవితంలో భాగం కావడం మొదలైంది. తనతోపాటు బ్లడ్ బ్యాంక్‌లో పనిచేసే సహోద్యోగి తన దగ్గరకు వచ్చి నీకు తెలుసా? నీ రక్తంలో హెచ్ఐవి ఉంది. అన్నాడు. నీకు తెలియజేద్దామనుకున్నాను అన్నాడు. రాముకి నోట మాట రాలేదు.’లేదు’ తాను హెచ్ఐవి పాజిటివ్ కాకూడదు. తనలో తాను చెప్పుకున్నాడు. కొన్నిసార్లు రక్త పరీక్షలు తప్పుడు ఫలితాలని చూపిస్తాయి. తన విషయంలో కూడా ఇట్లాంటిదేదో జరిగి ఉంటుందనుకున్నాడు.

లేబొరేటరీకి తిరిగొచ్చాక పనిమీద దృష్టి నిలిపేందుకు ప్రయత్నించాడు. తన బల్లమీద కాగితం మీద రాసి పెట్టిన కబురొకటి ఉంది.

‘హెచ్ఐవి నిర్ధారణ పరీక్షకు రేపు రావలసింది’ అని ఉంది. ఆ చీటిని మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. చదివిన ప్రతిసారీ ఆ కాగితం మీద అక్షరాలు మరింత మసక బారాయి. తన చుట్టూ ఉన్న వారి గత కొద్ది రోజుల ప్రవర్తనకు అర్థం ఇప్పుడు తెలియసాగింది. మిగతావారు కూడా ఈ స్లిప్‌ను చదివే ఉంటారనే నిశ్చయానికొచ్చాడు. వారి చురుకైన చూపులు దీన్ని మరింత తేట తెల్లం చేశాయి. ఆ వాలు చూపులలోని తీక్షణ ఆర్థాలు భరించరానివిగా ఉన్నాయి. పరీక్ష నాళిక తీసుకొని పనిలో నిమగ్నుడయ్యాడు.

మరుసటి రోజు మరో బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు ఆసుపత్రికి వెళ్ళాడు. ఈసారి హెచ్ఐవి నిర్ధారణ కోసం చేసే వెస్టర్న్ బ్లాట్‌కై రక్తం శాంపిల్ ఇచ్చాడు. బ్లడ్ బ్యాంక్ ప్రయోజనాలకైతే ప్రభుత్వ విధానాలను అనుసరించి ఎలిసా టెస్ట్ సరిపోతుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే.

ఏది ఏమైనా హెచ్ఐవి స్టేటస్‌ను నిర్ధారించుకునేందుకు మాత్రం వెస్టర్న్ బ్లాట్‌తో పరీక్ష తప్పనిసరి. ఇది కాస్త ఖరీదయిన పరీక్ష. కొన్ని ప్రత్యేక కేంద్రాలలో దేశం మొత్తం మీదనే కొద్ది కేంద్రాలోనే ఈ సౌకర్యం ఉంది.

ఆసుపత్రిలో తననెలా తక్కువచేసి చూసిందీ గుర్తుకు తెచ్చుకుని రాము ఇప్పటికీ చేదు అనుభవాన్ని చెపుతాడు.

‘వాళ్ళు నన్ను చాలా ఇబ్బందికి గురయ్యే ప్రశ్నలు వేశారు. నన్ను దిగజార్చేవిగా ఉన్నాయి ఆ ప్రశ్నలు’ అంటాడు.

అసలు లేబోరేటరీలోకి వెళ్ళేటప్పటికే అతను నీరస పడ్డాడు. తన పేరు ఇచ్చి, తాను అందుకున్న కబురు చీటీ చూపించాడు. పరీక్ష చేసే నిపుణుడు స్పందించనేలేదు. అలా… ఒక్కసారి చూశాడు. అతనో పరాయి మనిషి అన్నట్లుగా ఉందా చూపు. ఈ ప్రాణి దూరంగా ఉంచదగింది లేదా ఈ ప్రాణికి దూరంగా ఉండాలి అన్నట్లుందా చూపు.

తానొక బహిష్కృతుడు అతనిదృష్టిలో. అలాగే ప్రవర్తించాడు. ఓ మూలన ఉన్న స్టూల్‌మీద కూర్చోమని సైగ చేసి నిరీక్షించ మన్నాడు.

అప్పటికి రాము ఒక్కటొక్కటిగా అన్నిటికీ అలవాటుపడుతున్నాడు. పైకి చెప్పకపోయినప్పటికీ తన చుట్టూ ఆధిక్యతా భావమేదో వ్యాప్తి చెందుతూ ఉంది. ఆసుపత్రి వ్యవస్థ ఎట్లా ఉంటుందో తనకు తెలుసు. ప్రశ్నించబడిన అధికారాన్ని ఆసుపత్రి సిబ్బంది ఏ విధంగా అనుభవించారో ఎలా విశ్వసించారో తనకు తెలుసు. అసలు వార్డ్ బాయ్ నుంచి వైద్యుడి దాకా ఎటువంటి ఆధిక్యతా భావం ఉంటుందో అతడు ఎరిగి ఉన్నదే. ఆసుపత్రిలోను ఉద్యోగ స్వామ్యం ఉచ్చులో ఒక్కసారి చిక్కుకుపోతే రోగులు ఎంత నిస్సహాయులవుతారో కూడా తెలుసు. ఏది వారికి అందుతుందో, దేనిని వారు పొందగలరో – అది దొరికినంత వరకే వారి కృతజ్ఞతలు. వారు డబ్బు చెల్లించి నప్పటికీ.

రాము కూర్చుని తన వంతుకోసం నిరీక్షిస్తున్నాడు. తన దుస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాడు. అయినప్పటికీ అతను ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోవాలో అందుకు సంసిద్ధుడై లేడు.

‘అయితే ఎంతమంది స్త్రీలతో పడుకున్నావ్’ రక్తం శాంపిల్ తీసుకుంటూ గర్జించాడు. రాము ప్రతిస్పందించే లోపే మరో ప్రశ్న ‘నీ ముఖం ఎందుకు చిన్నగా ఉంది’ సాధారణంగా హెచ్ఐవి రోగులకు బరువు కోల్పోవడం వల్ల ముఖం సన్నబారి పోతుంది.

ఆ తరువాత మరో ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. నువ్వు ఇంజక్షన్‌లద్వారా మాదక ద్రవ్యాలు వాడతావా? వాళ్ళు తమ పని పూర్తి చేసే లోపు తనలో, అతను అతిక్రమింప బడ్డాడు. బాహాటంగా తన గౌరవం కోల్పోయేట్లు చేశారు. ఈ హెచ్ఐవి ముఖమేనా ప్రతిరోజూ ఎదుర్కోవలసింది. మిగిలిన సంవత్సరాలన్నీ ఈ ముఖంతోనేనా జీవించాలి?

ఆ తరువాతి నాలుగు రోజులు అతని జీవితాన్ని పూర్తిగా మార్చాయి.

బయోకెమిస్ట్రీ లేబరేటరీ ఇన్చార్జిగా ఉన్న ఓ వైద్యాధికారి తన దగ్గరకొచ్చి చావు దెబ్బలాంటి వార్త ఒకటి చెప్పాడు.

‘నువ్వు హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెళ్ళి డైరక్టర్‌ను కలువు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు’ తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు ఆ అధికారి.

షాక్ లాంటి ఈ వార్తను విని తట్టుకోవడానికి రాముకి కొద్ది సమయం పట్టింది. అతను తన మరణశిక్షతో వ్యవహరిస్తున్నాడు.

హెచ్ఐవి అంటే అర్థం అరువు తీసుకున్న కాలం మీద జీవించడం.

తన కుటుంబానికి ఏం జరగబోతోంది? తనని తాను ఎలా సముదాయించుకోవాలో? ఓదార్చుకోవాలో అర్థం కాలేదు. తాను పనిచేసే ఆసుపత్రిలో గానీ, పరీక్షా కేంద్రంలోగానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకిందన్న విషయాన్ని వెల్లడించే ముందు తప్పనిసరిగా జరపాల్సిన కౌన్సిలింగ్ ఊసే ఎత్తలేదు. పరీక్ష తరువాత పరిస్థితీ అంతే ఉంది. హెచ్ఐవి / ఎయిడ్స్ ఉందని చెప్పడానికి ముందు, చెప్పాక ఆ మనిషి ఎంతటి షాక్‌కు గురవుతాడో తెలిసినా చేయలేదు. కౌన్సిలింగ్ ఎంతో ఉపయోగకరం. హెచ్ఐవిలో ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్ని గడపవచ్చని, సార్థక జీవితం కొనసాగించ వచ్చని కౌన్సిలింగ్ దోహదపడుతుంది.
రాముకి ఆలోచించే సమయంలేదు. మొదట డైరక్టర్ గదికి పరిగెత్తాలి. ఆయనను తాను తనకోసం ఎదురు చూసేట్లు చేయకూడదు. తనకు కబురు పెట్టడంలో అసలు విషయం ఏమై ఉంటుందో, ఎందుకు పిలిపించారో ఆశ్చర్యపోతూ ముందుకు కదిలాడు.

గదిలో డైరెక్టర్ ఒక్కరే లేరు. బోర్డు మెంబర్లు మరో నలుగురు ఉన్నారు ఆయనతో. అన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానించబడే వారే వారు. చక్కగా, హుందాగా మంచి దుస్తులతో ఉన్న వైద్య నిపుణులు వారు. ఉన్నత వ్యక్తులుగా గౌరవం కలిగి ఉన్నవారు. సంస్థను ఎట్లా నడపాలో వారికి తెలుసు. తనను కూర్చోమని నిర్దేశించిన కుర్చీలో కూలబడ్డాడు.యిక ఆ ఐదుగురు మాటల దాడి మొదలు పెట్టారు. ‘సెక్స్ కోసం ఎక్కడికెళు తుంటావ్’ గద్దించినట్లు అడిగారు. ఒకాయన, ‘ఎన్నిసార్లు సెక్స్ అనుభవం కలిగి ఉన్నావ్?’ మరొకాయన నిలదీశాడు, ‘ఎటువంటి కుటుంబం నుంచి వచ్చావు?’ మూడో మనిషి ప్రశ్న, ‘నువ్వేం చేశావో నీకు ఏమైనా తెలుసా?’ ఆఖరి మాట డైరక్టరు నుంచి వచ్చింది. ‘దయచేసి ఈ ఆసుపత్రిని వదిలిపెట్టు. నువ్విక్కడ అవసరం లేదు మాకు’ అన్నాడు.

తనకు సంధించబడిన ప్రశ్నలు దూసుకొస్తుంటే అప్పటి దాకా రాము వాటికి సమాధానాల కోసం దేవులాడుతున్నాడు. తనను ఇలా అర్ధాంతరంగా వెళ్ళి పొమ్మంటారని అతను ఊహించలేదు. వారి నిర్ణయం అతడ్ని నిరుత్తరుడ్ని చేసింది. అతి కష్టం మీద ఆ సమయంలో అతడు ఆలోచించగలిగింది. వాళ్ళు చెప్పింది చేశాడు. అతని ఆలోచన వెనక్కి పరిగెత్తింది. ఉత్తమ ల్యాబ్ టెక్నిషియన్‌గా గత ఏడాది అవార్డు అందుకున్నాడు. సత్కారం పొందాడు.

రామును నిస్సత్తువ ఆవరించింది. నిరాశా, నిస్ప్పుహలో కూరుకుపోతున్నాడు. అతనికి ఎవరో ఒకరు తోడుంటే బావుండనిపించింది. తన గుండె బరువును కొంతయినా దించుకోవడానికీ, తన రహస్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎవరైనా ఒక్కరు ఉంటే బావుండనిపించింది. కానీ, ఒకేసారి తాను ఒంటరి అనే భావన కూడా కలిగింది. అంతా కలిసి తనను ఏకాకిని చేశారనుకున్నాడు. స్నేహితులు, కుటుంబం, కనీసం ఉద్యోగం కూడా లేకుండా, అన్నిటికీ అతడిని కాకుండా చేస్తున్నారనిపించింది.తన కుటుంబం సేలంలో ఉంటుంది. చెన్నై నుంచి ఎనిమిది గంటల ప్రయాణ దూరం. ఏ స్థితిలోనూ తన పరిస్థితి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. మరో ముగ్గురు మిత్రులతో కలిసి చెన్నైలో గది అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో వాళ్ళకు మాత్రం ఎట్లా చెప్పడం? ఏమని చెప్పడం? చెప్పాక ఎదురయ్యే వ్యతిరేకతను తట్టుకోలేడు. తానుండే గదికి పోవడం తప్ప మరో దారి అతనికి లేదు. మిగతా ప్రపంచంతో తనకున్న రోజువారీ సంబంధాలను తెంపుకుని తనలో తాను బంది అయ్యాడు.

పూణేలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మెడికల్ బులెటిన్ బోర్డులో ఓ సరికొత్త నోటీసుంది. అక్కడ అట్లాంటి నోటీసులు అంటించటం మామూలుగా జరిగేదే. ఎవరికో జలుబు చేసింది. మరెవరికో వంట్లో నలతగా ఉంది (జబ్బు). ఇంకొకరెవరో కాలు విరగ్గొట్టుకున్నారు. ఆ బులెటిన్‌లో ఉండే సమాచారం అంతా ఇట్లాంటి విషయాలతోనే నిండి ఉంటుంది.

హెడ్ క్వార్టర్స్ లోని వారు ఆ బోర్డువైపు ఒకసారి చూసి తమ రోజువారీ విధుల్లోకి పోవడం పరిపాటి.
కానీ ఈ రోజు అలాంటి స్థితిలేదు. అంతకు మించిన కార్యకలాపం అక్కడ జరుగుతోంది. బులెటిన్ బోర్డు చుట్టూ కోలాహలం. వారు నోటీసును చూడటం, ఒకరి కళ్ళతో ఒకరు మాట్లాడుకోవటం – అక్కడనుంచి కదిలి వెళుతూ లో గొంతుకలతో గుసగుసలాడుకుంటున్నారు.

అబ్రహాం కురియన్‌కు ఎయిడ్స్ వచ్చిందన్న కథ గంట సేపట్లో ఆ ఆవరణంతా వ్యాపించింది. బులెటిన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిడ్స్ నిర్ధారణ కొరకు జరిపే పరీక్షలో హెచ్ఐవి పాజిటివ్ అని. ఇక అబ్రహాం జీవితం గురించిన కథలు పచార్లు కొట్టడం మొదలైంది. వాటిల్లో కొన్ని ఊహాత్మక మైనవి. మరో కొత్త మనిషికి ఈ కథ అందింపబడుతున్న ప్రతిసారీ ఒక్కో వక్రీకరణ అధికాధికంగా జత కలిసింది. అందరూ ఒకరికొకరు ఈ ఊహాత్మక కథను చెప్పు కోవటం. అంతా ఆగిపోయాక వారు తేల్చిన విషయం మాత్రం ఒకటుంది. అదేమంటే అబ్రహాం… అతడు భోగలాలసుడు. వారందర్లోకీ నీచుడు. అతనికి జరగాల్సిన శాస్తి జరిగింది. అతను ఆశించిందే లభించిందని కసిదీరా అందరూ చెప్పు కున్నారు.
ఇక ఎవరూ అతనితో మాట్లాడాలను కోవటం గానీ, అతడ్ని తాకాలనుకోవటం గానీ, ఒకింత సానుభూతితో చూడాలను కోవటం గురించి గానీ చెప్పాల్సిన పనేలేదు. అసలు వీటి గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది.

మొత్తం మీద అబ్రహాంకు విధించాల్సిన శిక్ష అమలయ్యింది. వీలయిన అన్ని దారుల్లోనూ అతడిని దూరంగా ఉంచేశారు.

అధికారికంగా తన హెచ్ఐవి స్టేటస్ నోటీసు బోర్డు మీద ప్రకటించే నాటికి అబ్రహాం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆ సమయంలో పరీక్షల ఫలితాలు ఏమిటో కూడా అతనికి తెలియదు. అబ్రహాంకి చెప్పకముందే అబ్రహాం పనిచేసే యూనిట్ ఇన్చార్జీకి తెలియపరచటం founder duty అని ఆసుపత్రి భావించింది. కొంతకాలం వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ దాన్నుంచి కొద్దిగా కోలుకుంటూ ఉన్నాడు. ముందు జాగ్రత్తగా ఆర్మీ డాక్టర్ అనేక పరీక్షలు చేయించమని సలహా ఇచ్చాడు. అందులో హెచ్ఐవి పరీక్ష ఒకటి.

తానొక హెచ్ఐవి పాజిటివ్ అవుతానని అబ్రహాం తన పీడకలల్లో సైతం భావించలేదు. 1990లో సెక్స్ కోసం బయటకు పోయాడు. అదతనికి స్పష్టంగానే గుర్తుంది. గత రెండేళ్ళుగా ఇంటికి దూరంగా ఉండవలసి రావడం, అతను ఒంటరి వాడు కావటం అనివార్యంగా అతనికొక వెచ్చని మానవ స్పర్శ అవసరమైంది. ఎంతయినా అతడు యవ్వనంలో ఉన్నాడు. కుటుంబానికి ఎలాగూ తెలిసే అవకాశం లేదు.

కేరళలో జీవితం భిన్నంగా ఉంటుంది. నైతిక హద్దుల్ని దాటాలంటే – మధ్య తరగతి కుటుంబంలో పెరిగినవాడు కనుక – ఇంటికి తిరిగి వెళ్ళడమనే మాట ఆలోచించదగిందే కాదు. తన గ్రామం దాటి బయటకు రావాలంటే బాగా చదువుకోవాలి. అదే చేశాడతడు. చదువుకుంటే అవకాశాలు వస్తాయి. కాబట్టి చదివాడు పట్టణ జీవితం ఆకర్షణీయంగా ఉంది దానిని రాబట్టుకోవాలనుకున్నాడు.

ఊళ్ళో పాఠశాల చదువు పూర్తయ్యాక ఉన్నత పాఠశాల విద్యకోసం కొట్టాయం వెళ్ళాడు. ఇంకా చదువు కోవాలనుకున్న అబ్రహాంను తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 1988లో కాలికట్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్సులో ఇన్స్ట్రక్టర్‌గా పేరు నమోదు చేయించాడు. మొదటి పోస్టింగ్ ఉత్తర ఈశాన్యంలోని సిలగురి. ఓ ఏడాది తర్వాత తన యూనిట్‌తో సహా పూనా చేరాడు.

గతంలోకి చూస్తూ – తానెలా హెచ్ఐవి బారిన పడినాడో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. పూణే ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తూ తనకి తానే ‘నాకు హెచ్ఐవి ఉండదు. ఉండే అవకాశం లేదని’ ధైర్యం చెప్పుకున్నాడు. స్త్రీలతో ఎప్పుడూ లైంగిక కార్యకలాపాలలో పాల్గొన లేదు. సెక్స్ వర్కర్‌ల ఊసు కూడా లేదు. ఎందుకంటే వారు హెచ్ఐవిని వ్యాప్తి చేస్తారని అతనికి తెలుసు. అయినా అతనక్కడ ఉన్నాడు. ఎంతో కృంగిపోయి నెమ్మదిగా ఒంటరిగా బాధాకరమైన మృత్యువు తనని వెంటాడుతున్నట్లుగా ఆన్పించి మరింత ఒంటరయ్యాడు.

ఆ సమయానికి క్షయవ్యాధి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన అశోక్ ఒక్కడే అతడ్ని నవ్వించగలడు. అతడు స్థానిక విదూషకుడు. ప్రతి ఒక్కర్నీ సంతోష పెట్టగల, తన జోకుతో నవ్వించగల నైపుణ్యం అశోక్ ఒక్కడికే ఉంది. ప్రతి సందర్భానికీ తగ్గట్టు అశోక్ దగ్గర ఓ జోక్ సిద్ధంగా ఉండేది. సందర్భానికి తగినట్టుగా జోకులు వేసేవాడు.

తన పాజిటివ్ స్టేటస్ వార్త తన దాకా చేరినప్పుడు దాన్ని స్వీకరించేందుకు సిద్ధపడి లేడు. ఏడ్చేశాడు. ఇక ఏడవలేనంతగా ఏడ్చేశాడు. ఇంతటి చిన్న జీవితం. ఎంతో తొందరగా ముగిసిపోతున్నందుకు దుఃఖ పడ్డాడు. తనకలా జరగదు అనీ అనుకున్నాడు.

అక్టోబర్ 1993లో తిరిగి వచ్చాడు. మహా అయితే మరో రెండు మూడేళ్ళలో తాను అస్థిపంజరం అవుతాడు. ఒంటరిగా మిగులుతాడు. క్రమంగా బాధాపూర్వకంగా చనిపోతాడన్న విషయాన్ని అంగీకరించగల స్థితికి వచ్చేశాడు. తన యూనిట్‌లోని వాతావరణం అసలే దిగజారిపోతున్న అతడి ధైర్యాన్ని మరింత దిగజార్చింది. అయినా తన గురించిన కట్టుకథలు విహరిస్తూనే ఉన్నాయి. అదింకా తన చెవుల్లో మార్మోగుతూనే ఉంది ఎప్పుడూ. భయపెట్టే చూపులు, గుసగుసలాడే గొంతులు తనని చూడగానే నిశ్శబ్దంలోకి జారుకునేవి. ఎక్కడి వాళ్ళక్కడ తప్పుకు పోవడానికి, తన ఉనికి ఒక సంకేతం, ఒక కారణం అయ్యింది. సైన్యం తనకు ఎటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు.

కనీసం ఒక మానవ మాత్రుడెవడైనా తనని అంగీకరించేవాడు దొరుకుతాడని ఆశించి కొద్ది రోజుల పాటు లక్ష్య రహితంగా తిరిగాడు. అనుకోకుండా గాఢమైన / తీవ్రమైన షాక్‌కు గురై మళ్ళీ ఆసుపత్రిలో చేరాడు. డిప్రెషన్వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత క్షీణించింది. పైగా క్షయవ్యాధి పట్టుకుంది. అతడిని ఆసుపత్రినుంచి డిశ్చార్జీ చేయడానికి ఆర్మీకి ఒక సాకు దొరికింది. ప్రస్తుతం అతను పూర్తి ఒంటరివాడు. అందరూ వొదిలేశారు. దూరం చేశారు. తనకు ఆసరాగా ఉద్యోగం లేదు. అతను మృత్యువు అంచున ఒంటరి. కడు ఒంటరి.

వెన్నులోంచి వణుకు తెప్పించే గణాంకాల్లో గంటకు 67 చొప్పున్న హెచ్ఐవికి గురవుతున్న వారిలోకి అశోక్, రాము, అబ్రహాంలు అనే ఏ గుర్తింపులేని మరో ముగ్గురు అదనంగా చేరారు. లేదా రెండు వేల సంవత్సరాంతానికి హెచ్ఐవితో జీవించే 3.9 మిలియన్‌లకు మరో ముగ్గురు జతకూడారు. లేదా ప్రపంచం మొత్తంమీద 36.1 మిలియన్‌ల వైరస్ బాధితుల జాబితాలోకి ఎక్కారు. హెచ్ఐవి పాజిటివ్‌గా ఉండటమంటే ఏమిటో ఈ గణాంకాలు ఆ క్షోభను గానీ, ఆ వ్యధనుగాని వివరించలేవు.

స్టిగ్మా, డిస్క్రిమినేషన్, ఒంటరితనం, తిరస్కారం అపహాస్యం, పట్టింపు లేకపోవడం తదితరాల గురించి కూడా ఈ గణాంకాలు పెదవి విప్పవు. హెచ్ఐవి బారిన పడ్డ వ్యక్తికి ఏమౌతుందో ఈ గణాంకాలు నిర్వచించవు. పోనీ, వ్యాధి సోకిన కుటుంబాల గురించి కూడా. దానిని ఆ కుటుంబాలు ఎట్లా ఎదుర్కొంటాయో కూడా ఇక గణాంకాలు ఏమీ చెప్పవు.

ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా రోజుకు పదహారు వేల మందికి హెచ్ఐవి సోకుతూ ఉంటే – అసంఖ్యాకంగా దీనితో బాధ పడుతూ ఉంటారన్న విషయాన్ని, అంతకు రెండింతల మందిని ఈ వ్యాధి బాధిస్తున్నదని గానీ ఈ గణాంకాలు చెప్పవు.

ప్రతి క్రొత్త హెచ్ఐవి సోకిన వ్యక్తి వల్ల కనీసం ఒక కుటుంబంలోని నలుగురికి లేదా అంతకు మించి ఎక్కువ మంది దీని బారిన పడగలరన్న విషయాలను కూడా ఈ గణాంకాలు చెప్పవు.

హెచ్ఐవి చూపగల పూర్తి ప్రభావాలను చెప్పడంలో ఈ గణాంకాల భాష విఫలమవు తుంది. అంతేకాదు. వ్యాధి సోకిన వారి జీవితాల్లోని బాధను, పోరాటాన్ని కనీసంగానైనా ఈ అంకెలు పట్టుకోలేవు.

దక్షిణాఫ్రికాలో 4.1 మిలియన్‌ల మంది హెచ్ఐవి / ఎయిడ్స్ సోకిన వారున్నారని, భారతదేశం కూడా ఎంతో దూరంలో లేదన్న సంగతి నిజంగా మనకు పడుతుందా? మనకేమైనా చీమ కుట్టినట్లయినా ఉంటుందా? మన జీవితాలకు, వారి జీవితాలకున్న సంబంధ సామ్యాలను చూడడంలో మనం విఫలమవుతాం. అంతే కాదు మనం అతి పెద్ద ప్రమాదంలో ఉన్నామన్న సంగతీ పట్టించుకోవడం లేదు. దక్షిణాఫ్రికాను మరచిపోండి. మన దేశంలోనే తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మణిపూర్, నాగాలాండ్‌లో అధికంగా ప్రబలుతున్న వ్యాధి గురించీ, దానికీ, మనకీ ఉన్న సంబంధం గురించీ మనం ఏం పట్టించుకుంటున్నాం. అయినా మనం చాలా దృఢంగా మన జీవితాలకు ఇది సోకదులే అన్న ధీమాలోనే ఉన్నాం.

ఒక క్రమమంటూ లేకుండా వ్యాపిస్తున్న ఈ వ్యాధి అంత స్పష్టంగా మన దేశంలో మన కళ్ళకు కనిపించదు. స్థానికంగా మనం కొన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాం జాగ్రత్తగానే. ఈ మహావ్యాధి నిశ్శబ్దంగా ముంచుకు రావడాన్ని తక్కిన ప్రాంతాలలో మనం ఆపగలమా? కొన్ని చోట్లనే మనం జాగ్రత్తలు తీసుకున్నాం కనుక మిగిలినచోట్లకు ఇది వ్యాపించదు అని నిస్సందేహంగా చెప్పగలమా?
హెచ్ఐవి ప్రబలటం భౌగోళికంగా కొన్ని ప్రాంతాలలోనే అయితే కావచ్చు. అది తాత్కాలికంగా అక్కడికే పరిమితం అయినా ఆ తరువాత ఇతర చోట్లకు కూడా దేశంలో ప్రాకుతుంది. దాగి ఉన్న మహమ్మారి ఎట్లా వృద్ధి చెందుతుందో తక్కువ prevalence ఉన్న ప్రాంతాలను ఇది ప్రతిఫలింపజేయదు. ఉదాహరణకు ఇండోనేషియాలో సెక్స్ వర్కర్లు అజ్ఞాతంగానే పరీక్షింపబడతారు. అయినా పదేళ్ళదాకా మహమ్మారి అక్కడ బయటపడ లేదు (బయటపడింది కాదు)

మొదట్లో ఈ వైరస్ కేవలం సమాజం అంచుల్లో ఉన్న కమ్యూనిటికే వస్తుంది. పేదలకు వస్తుంది. ఇతరులకు వస్తుంది. మేం సురక్షితంగానే ఉన్నామని మధ్యతరగతి భావించేట్లు చేసింది. అశోక్, అబ్రహాం, రామా పాండ్యన్లు కూడా ఈ ‘మిత్’ను విశ్వసించారు. ఊహించనంత వేగంగా పరిస్థితులు మారాయి.

ఓ కొత్త ప్రాంతంలో ఈ వైరస్ ప్రవేశించి తొలిదశలో లైంగిక భాగస్వాములను అధికంగా కలిగి ఉన్న వారిలో కనిపిస్తుంది. హెచ్ఐవి పరిభాషలో వీరిని హైరిస్క్ గ్రూపులు అంటాం. వీరు సెక్స్ కోసం తమ శరీరాలను అమ్ముకుంటున్న స్త్రీలు కావచ్చు. లేదా పురుషులకు సెక్స్ ను అందిస్తున్న పురుషులు కావచ్చు. ఈ గ్రూపుకు అధికమైన రిస్కు ఉంది ఎందుకంటే ప్రతిదినం ఎక్కువమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారు కనుక. కాబట్టే ఈ వైరస్ ఎక్కడనుంచి వచ్చిందంటే చాలు. కమర్షియల్ సెక్స్ వ్యాపారం ఉరవళ్ళు పరవళ్ళు త్రొక్కుతున్న ప్రాంతాలనుంచి ఈ దేశంలో వైరస్ విస్తరించింది అంటాం. కానీ, రెండో దశలో ఇది వారి భాగస్వాములకు కూడా వ్యాప్తి చెందటం మొదలవుతుంది. ట్రక్ డ్రైవర్లు, కూటికోసం, జీవికకోసం పొట్ట చేతపట్టుకుని వలసవెళ్ళే కార్మికులు అధిక రిస్కు ఉన్న వారిగా, రాగల అవకాశం ఉన్న వారిగా పరిగణింపబడేవారు.

వాళ్ళ జీవితాలు వత్తిడితో గడుస్తాయి. సుదీర్ఘ కాలం వాళ్ళ కుటుంబాలను వదిలి దూరంగా గడపవలసి వస్తుంది. చాలా తరచుగానే వీరు కమర్షియల్ సెక్సులో క్రమం తప్పకుండా పాల్గొంటారు.

ఇక మూడవ ఆఖరి దశలో ఈ వైరస్ సాధారణ ప్రజానీకం మీదకు లేదా మధ్యకు వస్తుంది.

హైరిస్క్ గ్రూపులకు భార్యలు అయినందువల్ల ఈ వ్యాధి వారికి కూడా సోకడం మొదలవుతుంది. యాంటీ నాటల్ పరీక్షలకు వచ్చే మహిళలను పరీక్షించడం ద్వారా వీరికి కూడా ఈ వ్యాధి సంక్రమించబోతుందన్న విషయం అర్థం కావడం మొదలు పెడుతుంది. ఒక్కసారి వైరస్ సమాజంలో అంత దూరం చొచ్చుకు పోయిందీ అంటే ఇక ఎవరికీ రక్షణ లేనట్లే.

ఎవరికైనా, ఎక్కడైనా లైంగికంగా చురుకుగా ఉన్నారు అంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే.

లైంగికంగా చురుకుగా ఉండే యువ సమూహాలకు ఈ వ్యాధి సోకగల అవకాశాలు ఎక్కువ. ఇప్పటిదాకా ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో 50 శాతం 24 ఏళ్ళలోపు వారే ఉన్నారు.కాబట్టే యువతీ యువకులు, యుక్త వయస్కులు, యవ్వనవంతులు, ఉమ్మడి కుటుంబంలోని సంపాదనా పరులు, నవ వధువులు, గర్భిణీ స్త్రీలు హెచ్ఐవికి గురైన వారిలో ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి.. హెచ్ఐవి వర్గాన్ని చూడదు. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేదు. ఏ సమూహం అది సంప్రదాయబద్ధమైన దైనా, సంప్రదాయేతరమైనదైనా ఎవరినీ మిగల్చదు.

హెచ్ఐవి సంక్రమించటానికి లైంగిక కార్యకలాపమే ప్రమాదకర, నిర్దాక్షిణ్యమైన మార్గం లేదా సాధనం. అయితే తక్కిన దారులూ ఉన్నాయి. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి మంచి రక్తం హెచ్ఐవి పాజిటివ్ కాని రక్తం ఎక్కించకపోయినా, ఎక్కించిన రక్తం కలుషితమైనా, ఒకరు వాడిన నీడిల్ను ఇతరులు వాడినా హెచ్ఐవి సోకగలదు. ఉత్తర ఈశాన్యంలో ఈ వైరస్ అధికంగా విస్తరించడానికి ఇదే కారణం. ఇన్షెక్షన్ సోకిన తల్లి గర్భంలోని పిండానికి సైతం వైరస్ రావచ్చు. ఎందుకంటే ఆ తల్లి ఉమ్మనీరుని పిండం పంచుకుంటుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం తక్కువే. సెక్సు ద్వారా సంక్రమించేదే అధికం.

ప్రపంచ వ్యాప్తంగా తల్లినుంచి బిడ్డకు సంక్రమించటం అన్నది మూడవ వంతు మాత్రమే. ఇటీవల అందుబాటులోకి వచ్చిన మందుల వల్ల ఈ శాతం మరింత తగ్గించవచ్చు. ఈ తరహా వైరస్ సంక్రమణం పిండంగా ఉన్నప్పటికంటే ప్రసవ సమయంలోనూ, తల్లిపాల ద్వారా సంక్రమించటం ఎక్కువగా ఉంటుంది.

భారతదేశంలో 1986లో చెన్నైలో ఆరుగురు సెక్స్ వర్కర్‌లను హెచ్ఐవి సోకిన వారిగా గుర్తించారు. 1998 మధ్య కాలానికి ఈ వైరస్ ఇతర సాంక్రమిక వ్యాధుల కన్నా వేగంగా ప్రయాణించింది. అంటువ్యాధులు కాని వాటి కంటే వేగం ప్రయాణం చేసి దేశ వ్యాప్తంగా 3.5 మిలియన్‌లకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది 3.7 మిలియన్లు. 2000 నాటికి 3.7 మిలియన్లు చేరుకుంటుందని అంచనా. రెండు వేల నాటికల్లా 3.86 మిలియన్లు హెచ్ఐవి సోకిన వారున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

భారతదేశంలో ప్రధానమైన సంక్రమ మార్గం… సంబంధాల వల్ల 80.86 శాతం ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. పెరినాటల్ ట్రాన్స్‌మిషన్ 8 శాతం, మాదక ద్రవ్యాలు, సూదులు వాడకం ఆరు శాతం, రక్త మార్పిడి ద్వారా 4 శాతం ఉంది.

హెచ్ఐవి కేసులు పెరగడంతో రక్త మార్పిడి ద్వారా సంక్రమించే కేసులు కూడా పెరిగాయి. సురక్షిత రక్తాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయినా ఇన్ఫెక్షన్ ఉన్న వారి రక్తంలో కనీసం మూడు లేదా ఆరు నెలల తరువాత గానీ హెచ్ఐవి బయట పడదు.

వీరు రక్తదాతలయినప్పుడు ఈ కాల వ్యవధిలో హెచ్ఐవి వైరస్ బయట పడకపోతే, సురక్షిత రక్తం క్రిందే పరిగణన ఉంటుంది. ఈ విండో పిరియడ్‌లో రక్తంలో ఈ వైరస్‌కి సంబంధించి యాంటీ బాడీస్ కనిపించవు. అందువల్ల హెచ్ఐవిని కనిపెట్టటం కష్టం. ఈ కారణంగానే రక్త దానం వల్ల హెచ్ఐవి సంక్రమించే అవకాశాలు పెరిగాయి.

భారతదేశంలో హెచ్ఐవి ట్రాన్సిమిషన్ కొద్దిశాతం స్వలింగ సంపర్కం ద్వారా కూడా జరుగుతున్నది. తగినన్ని చైతన్య కార్యక్రమాలు తొలి దశలో లేనందున ‘గే’లు తమని తాము హైరిస్క్ ఉన్నవారిగా గుర్తించలేదు. ఈ దేశంలో వైరస్ ముట్టడించిన తొలినాళ్ళలో స్వలింగ సంపర్కులకి అధికంగా ఇన్ఫెక్షన్ వచ్చింది. గణాంకలు వీటిని నమోదు చేయలేదు.

నాకో (ఎన్ఎసిఓ) సీరో సర్వియలెన్స్ డేటా విడుదల చేసిన ఎంతో కాలానికి గానీ స్వలింగ సంపర్కం ద్వారానే కాదు, ద్విలింగ సంపర్కానికి సంబంధించిన కేసుల గురించి తెలిసి రాలేదు.

1991 నాటి దేశ ఎయిడ్స్ దృశ్యం
మొత్తం 6,319 కేసులు నమోదైతే మూడు వేల ఐదు కేసులు హెటరోసెక్స్ వల్ల సంక్రమించినవి. కేవలం తొమ్మిది మాత్రమే హోమోసెక్సువల్ ట్రాన్స్ మిషన్ అయినవి ఉన్నాయి.

అధిక స్థాయిలో హెచ్ఐవి ప్రివెలన్స్ ఉన్నప్పటికీ ఇప్పటి దాకా భావించబడిన అంశం ఏమంటే వైరస్ పట్టణ ప్రాంతాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తుందని ఈ రెండిటి మధ్య తేడాలను, నిర్వహించవచ్చని భావింపబడింది. హెచ్ఐవిని నిరోధించడంలో గానీ, అరికట్టడంలోగాని ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల ఈ పరిస్థితి త్వరితంగా మారుతున్నది.

ఎన్నో నగరాల్లో సాధారణ ప్రజానీకానికే కాక దేశ వ్యాప్తంగా గ్రామాల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పటిదాకా వివిధ జిల్లాలు, పట్టణాలు వాటి పరిశ్రమల వల్లగానీ, టూరిస్ట్ కేంద్రాలుగానీ లేదా మత సాంస్కృతిక కేంద్రాలుగా గానీ ప్రఖ్యాతి చెందినవి, గుర్తింప బడినవి కాస్తా – అనుకోకుండా హెచ్ఐవి అధికంగా ఉన్నవిగా ఆవిర్భవించడం మొదలైంది. ఈ వ్యాప్తి విచారించదగింది. చాలా సాధారణమైన కారణంలో విచారించాలి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో తక్కువ చైతన్యం లేదా తగిన మౌలిక వసతుల కల్పన లేమి ఉంటుంది.

ఆరోగ్య సామాజిక సమస్యలకు ఇవి కారణమవుతున్నాయి.

12 ఏళ్ళ క్రిందట అశోక్ లాంటి ఇతరులు మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్నప్పటికీ వైరస్ గురించి ఏమీ ఎరగని వాళ్ళే అయినట్లుగా ప్రస్తుతం ఒక మోస్తరు పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ అదే జరుతుతోంది. ఇక్కడ వైరస్ క్రమంగా ముందుకు కదులుతూ ఉంది.

నేను ఎక్కడెక్కడకు ప్రయాణించినో ఆయా చోట్ల అంతా విధ్వంస సంకేతాలు కనిపిస్తున్నాయి.

బొంబాయికి 260 కిలో మీటర్లు, 7 గంటల ప్రయాణంలో ఉన్న పంచాగ్ని ఓ ఆహ్లాదకరమైన హిల్ రెసార్ట్. ఈ ప్రశాంత టౌన్షిప్లో మనిషి, ప్రకృతీ సామరస్యంతో సహ జీవనం చేస్తున్నట్లుంటుంది. అక్కడి స్వచ్ఛమైన గాలిని గుండెలనిండా పీల్చుకుని నా గమ్యమైన బెల్ ఎయిర్ ఆసుపత్రి వైపు కదిలాను. అనేక ఎకరాలలో పచ్చదనం విస్తరించిన అక్కడక్కడ భవనాలు నేను సందర్శించిన అన్ని ఆసుపత్రులకంటే భిన్నంగా అనిపించింది.

పచ్చటి ముదురాకుల చెట్లమధ్యా, బోగన్విలియా పొదల మధ్య కాటేజ్లు ఉన్నాయి. ఒక్కో కాటేజ్ ఒక్కో వార్డు. సున్నం వేసి ఉన్న తెల్లని కాటేజ్ అది. ఇటుకలతో పై కప్పు ఏటవాలుగా ఉండి వలస పాలన యుగాన్ని గుర్తుకు తెస్తుంది. అవి బాగా ఉన్నరోజుల్లో పెంకుల మంచి కాంతివంతమైన ఎరుపు రంగులో ఉండి ఉంటాయి. ఆ ప్రాంతం బావుంది అని చెప్పడానికి ఇప్పుడు ఆ పూల మీద భారం పడి ఉంటుంది. అయినప్పటికీ మొత్తం మీద ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ చోటు. ఇంత అందంగా ఉన్న ప్రాంతమే అయినా ఈ అందం మధ్య ఎంతో అనారోగ్యం, మరెంత మృత్యువు దాగి ఉందో ఆ తరువాత గానీ నేను గ్రహించలేక పోయాను.

ఇంతకుముందు ఇదే ఆసుపత్రిని టి.బి. శానిటోరియంగా ఉపయోగించారు. ఏమైనప్పటికీ రోగనిరోధక వ్యవస్థ క్షీణించి హెచ్ఐవితో ఉన్న వారికి క్షయకు ఆతిధేయులుగా ఉంటుంది కాబట్టి సమీప గ్రామాలనుంచి హెచ్ఐవి రోగులు ఆసుపత్రికి రావడం మొదలైంది. ఎయిడ్స్ సంబంధిత మరణాల సంఖ్య ఈ ఆసుపత్రిని ఒక్క కుదుపు కుదిపింది.

జూన్ 199లో ఈ కేంద్రానికి 8 మంది మాత్రమే వచ్చేవారు. 1996 నాటి ఆసుపత్రి రికార్డులు ఇట్లాంటి కేసుల సంఖ్య 52కి పెరిగిందని చూపుతున్నాయి.

మరుసటి సంవత్సరంలో కొంత తగ్గుదల. అయినప్పటికీ ఇట్లాంటి చిన్న ప్రాంతంలో అన్ని కేసులు ఉండటం ఎక్కువే. 46 మందిని ఆసుపత్రిలో చేర్చుకున్నారు. 1998లో ఇది 63కు చేరుకుంది. ఒక ఏడాది తర్వాత సంఖ్య రెండింతలయ్యింది 111. 2000 నాటికి 149 మంది ఈ ఆసుపత్రిలో చేరితే వారిలో 43 మంది చేరిన 8 మాసాలలోపే మరణించారు.

నా సందర్శన సమయానికి 63 మంది ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు హెచ్ఐవికి సంబంధించిన వివిధ దశలలో బాధపడుతూ ఉన్నారక్కడ.

నీళ్ళలో తేలియాడే మంచుముక్కనే చూస్తున్నాం మనం. ఆ నోటా, ఈ నోటా ఈ ఆసుపత్రి గురించి విన్న.. తెలిసిన వారే ఇక్కడికి చేరగలుగు తున్నారు. పరిసర గ్రామాల్లోని అనేక మందికి ఇక్కడ ఇట్లాంటి ఆసుపత్రి ఒకటిఉందన్న విషయమే తెలియదు. సంవత్సరాల తరబడి ఎక్కడో చికిత్స చేయించుకుని ఇక్కడకు వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి చేరుకున్న రోగుల సంఖ్య సమస్య విస్తృతికి ఓ చిన్న బలహీన సూచన మాత్రమే.

ప్రజలలో చైతన్యంలేకపోవటమనే దారిద్య్రం ఒకటైతే, మరొకటి గ్రామాలలో వైద్యసేవలు చేస్తున్న డాక్టర్లు హెచ్ఐవిని నిర్ధారించలేరు.

మహారాష్ట్ర సతారా జిల్లాలోని అనేక గ్రామాల్లోకి నేను వెళ్ళిప్పుడు తెలిసిన విషయం ఏమంటే వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఇటీవల మరణాలుండటం. పిల్లలు అనాధలయ్యారు. తాతయ్యలు, తాతమ్మలు వాళ్ళ వయసు శక్తి సామర్థ్యాలలో పని లేకుండా, కఠిన పరిశ్రమ చేసే అవకాశం లేకపోయినా తిరిగి పని చేయాల్సిన స్థితికి వచ్చారు. తమకూ, ఆ పిల్లలకి ఏదో ఒకటి సమకూర్చుకునేందుకు ఏదో ఒక పని ఆ వృద్ధులకు చేయక తప్పడం లేదు.

మహారాష్టల్రోని ఒక ప్రాంత పరిస్థితి ఇట్లాంటిదైనప్పుడు మిగతా రాష్ట్రాల స్థితి ఏమీ ఇంతకన్నా మెరుగ్గా లేదు. కోస్తా ఆంధ్రాలో సామర్లకోట హెచ్ఐవి కేసులు అధికంగా ఉన్న ఓ మోస్తరు పట్టణం. ప్రతి మూడు, నాలుగిండ్లకు ఒకటి చొప్పున హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనంతరస్థితిని ఎదుర్కోవలసిన కుటుంబాలు ఇక్కడ ఎక్కువ. తమిళనాడులో సేలం, నమ్మకల్ జిల్లాల చుట్టుపట్ల పరిసరాలు ఉక్కు, రవాణా వ్యాసారానికి పెట్టింది పేరు. ఎయిడ్స్ బలితీసుకున్న జీవితాల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉంది.

ఒక్క నమ్మకల్ లోనే చిన్న వయసులోనే విధవలై హెచ్ఐవితో జీవిస్తున్న వారిని అనేక మందిని ఇక్కడ ఎవరైనా చూడవచ్చు. కర్నాటకలో బెంగుళూరు, మంగుళూరు తదితర పట్టణాలలో ఉన్న ఆసుపత్రులకు ఇతర జిల్లాల నుంచి ఇన్ఫెక్షన్తోనూ, ఇతర హెచ్ఐవి సంబంధిత జబ్బులకు చికిత్స కోసమూ వస్తున్నారు.

మణిపూర్‌లో నేను పలకరించిన ప్రతి వ్యక్తీ హెచ్ఐవి సోకిన బంధువులో, మిత్రులనో కలిగి ఉన్న వారే. లేదా ఎయిడ్స్ తో చనిపోయిన బంధువునో మిత్రుడినో కలిగి ఉన్నారు.

మణిపూర్‌లో 11,580 హెచ్ఐవి నిర్ధారణలు జరిగితే ఏప్రిల్ 2001 నాటికి హెచ్ఐవి వైరస్‌ను వేగంగా వ్యాపింప జేస్తున్న రాష్ట్రాలలో ఇదీ ఒకటి. ఇన్ఫెక్షన్ కలిగి ఉండి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి ద్వారా ఈ వ్యాప్తి జరుగుతూ ఉన్నది.

ఇప్పటిదాకా హైరిస్క్ గ్రూపులుగా గుర్తింపబడిన వారే కాక ఆసుపత్రులకు మామూలు ప్రజలు రావటం కూడా అధికమైంది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కలిగి ఉంది. ఇందులోకి ఎంపిక చేసిన…. వస్తారు. ఆసుపత్రి… కార్డు కోసం నలభై రూపాయలు తీసుకుంటుంది. అయినప్పటికీ ఇక్కడ ప్రతినెలా 1500ల స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయి.

ఎక్కువ మంది రోగులు రిస్క్ తక్కువ ఉన్న గ్రూపుల కోవకు చెందిన మధ్య వయస్కులు, మధ్యతరగతికి చెందిన వారు. కొందరికి కుటుంబాలున్నాయి. మరికొందరు పెళ్ళి కాని వారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు. తరచుగా ఇక్కడికి వచ్చే రోగుల్లో మొదటి ప్రైవేటు వైద్యుల దగ్గరకు వెళ్ళి అధికంగా ఖర్చుపెట్టి వచ్చిన వాళ్ళే అయ్యుంటారు. పైగా వారికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వకుండా హెచ్ఐవి సోకిన జీవితాన్ని ఎట్లా కొనసాగించాలో చెప్పకుండా విడిచివేయబడిన వారే ఇక్కడి వస్తుంటారు.

ఒక దారిలో కాకపోతే, మరో విధంగా నైనా ఈ ఆ ఆధునిక మహా వ్యాధి బారిన పడని ప్రాంతమంటూ దేశంలో ఏదీలేదు. బీహార్ ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈ సంఖ్య తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ, ఈ రాష్ట్రాలలో నిపుణులకు కూడా హెచ్ఐవి ఉన్న వారితో ఎట్లా ప్రవర్తించాలో తెలియదు. కొన్ని ఆసుపత్రులు చికిత్స ఇచ్చేందుకు సముఖంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఎంతమంది హెచ్ఐవి బారిన పడి ఉంటారో ఎప్పటికీ తెలీదు. అంతమాత్రాన వైరస్ ఉనికిని విస్మరించకూడదు.

వాస్తవానికి, ఎయిడ్స్ బాధను మిగిల్చి ముందుకు పోతోంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో