ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్‌) చట్టాన్ని రద్దుచేయలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి

ప్రజలారా!

ప్రత్యేక ఆర్థిక మండలులు (సెజ్‌లు) ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సెజ్‌కు భూములు అప్పగించం అని ఎదురు తిరిగిన ప్రజలను ప్రభుత్వాలు కాల్పులు, లాఠీ దెబ్బలు, అరెస్టులతో అణగదొక్కడం చూస్తున్నాం.

నందిగ్రాం కాల్పులు దేశమంతటి దృష్టినీ ఆకర్షించగా మన రాష్ట్రంలో కాకినాడ సమీపంలో జరిగిన అరెస్టులు రేపు ఇంకేం జరగబోతుందో అన్న ఆందోళన కలిగించాయి.
ఎగుమతులను ప్రోత్సహించడం కోసం కంపెనీలకు సకల సదుపాయాల, అనేక రాయితీల కల్పించే ఆలోచన సెజ్‌లకు మూలం. దీనికోసం పార్లమెంటు 2005లో సెజ్‌ చట్టం చేసింది. ఆ తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టానికి అనుబంధంగా నియమాలు ప్రకటించాయి. అయితే ఈ విధంగా చెప్పుకుంటే సెజ్‌ వ్యవస్థలోని దుర్మార్గం అర్థంకాదు. ఎంత ఆర్థిక క్రమశిక్షణ పాటించినా దేశానికి విదేశీ మారకద్రవ్యం అవసరమే కాబట్టి, ఎగుమతులు చేయగల సంస్థలకు రాయితీలిస్తే తప్పేముంది అనగలరు. అందుకే సెజ్‌ వ్యవస్థ గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి.
ఎగుమతులు బాగా చేయగల సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం సెజ్‌ వ్యవస్థ ప్రకటించుకున్న లక్ష్యమైనప్పటికీ, మొదట రంగంలోకి దిగేది అటువంటి సంస్థలు కాదు. కొన్ని వేల ఎకరాలు (12,500 ఎకరాల దాకా ఉండవచ్చు) చేతబట్టుకుని, ఎగుమతులు చేయగల సంస్థలను పిలుచుకొచ్చి ‘సెజ్‌’ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చే డెవలపర్‌ మొదట రంగంలోకి దిగుతాడు. ఇతను వ్యక్తి కావచ్చు, కంపెనీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, లేక రాష్ట్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వ సంస్థో తొలుత చట్టం కళ్ళు కప్పడానికి డెవలపర్‌గా ముందుకొచ్చి ఆ తరువాత అస్మదీయుడైన వ్యాపారవేత్తను కో-డెవలపర్‌గా సరసన చేర్చుకోవచ్చు.
సీలింగు చట్టాలు వచ్చిన తరువాత అంత భూమి ఎవరి దగ్గరా ఉండదు కదా! మరి డెవలపర్‌ దగ్గర అంత భూమి ఎక్కడి నుండి వస్తుంది? ఇదొక మాయ. సెజ్‌ చట్టం ఈ ప్రశ్న వేసుకోదు, జవాబు చెప్పదు. సెజ్‌ల కోసం భూములెక్కడి నుండి వస్తాయన్న ప్రస్తావన ఆ చట్టంలో ఎక్కడా లేదు. తెరతీసేసరికే వేల ఎకరాలు చంకకింద పెట్టుకున్న డెవలపర్‌ స్టేజి మీద ఉంటాడు. ఈ మాయ గురించి మరికొన్ని మాయమాటలు మీడియలో వింటున్నాం. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారు, జైరాం రమేశ్‌ వంటి కాంగ్రెస్‌  ప్రముఖుల సెజ్‌ల కోసం ప్రభుత్వాలు భూసేకరణ చేయకూడదని, కంపెనీలు లేదా డెవలపర్‌ స్వయంగా రైతుల నుండి కొనుక్కోవాలని అనడం వింటున్నాం. రైతులేమైనా పిచ్చివాళ్ళా అడిగిన వాడికి భూములమ్మేయడానికి? ఆ సలహాయే పాటిస్తే దేశంలో ఇప్పటికే అనుమతి పొందిన వందలాది సెజ్‌లు సాధ్యమయ్యేవా?
చెప్పేదొకటి, చేసేదొకటి.

డెవలపర్‌గారే రైతుల దగ్గర కొనుక్కోవడం అంటే ఎట్లాగుంటుందో తెలుసుకోవాలంటే కాకినాడకు పోవాలి. కాకినాడ పోర్ట్‌ ఆధారిత సెజ్‌ పేరిట ఏర్పడుతున్న 10 వేల ఎకరాల మండలిని చూడాలి. మొదట కొంతమంది దగ్గర కొన్ని ఎకరాలు డెవలపర్‌ కె.వి.రావు స్వచ్ఛందంగానే కొన్నాడు. భములమ్ముకొని బయటపడదామని ఎదురుచూసే వారు ఏ ఊరిలోనైనా కొంతమంది ఉంటారు. పట్టణాలలో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉండి వ్యవసాయ భూమిని కౌలుకిచ్చి కౌలుదార్లతో వేగలేక ఎప్పుడు అమ్ముకొని పోదామా అని ఎదురుచూసే వారుంటారు. వారి నుండి కె.వి.రావు ఎకరానికి 3 లక్షలిచ్చి మొదట కొంత భూమి కొన్నాడు. ఆ తరువాత పక్క భూమి యాజమానిని కె.వి.రావు మనుషులు, రెవిన్యూ సిబ్బంది కలిసి బెదిరించడం మొదలుపెట్టారు. కె.వి.రావుకే అమ్మేస్తే ఈ 3 లక్షలొస్తాయి – లేకపోతే ప్రభుత్వం లక్ష చిల్లరకు బలవంతంగా స్వాధీనం చేసుకొని కోర్టుల చుట్టూ తిప్పుతుంది అన్నారు. అబద్ధాలు చెప్పారు. ‘అరే! నీ పొలం చుట్టూ ఉన్న భూమి అంతా అమ్మేశారే. నువ్వొక్కడివే ఉండిపోయావు. నీ పొలం చుట్టూ సెజ్‌ వచ్చాక నువ్వేం వ్యవసాయం చేస్తావు?’ అని బుకాయించారు. అది అబద్ధం అని ఆ రైతు గ్రహించే లోపల అమ్మకం జరిగిపోయి ఉంటుంది.
అయితే అన్ని చోట్లా డెవలపరే కొనుక్కోవాలి అన్న నియమాన్ని పాటించడం లేదు. డెవలపర్‌ కోసం ప్రభుత్వం బలవంతంగా సేకరణ చేస్తే అది చట్టం కళ్ళలో చెల్లుబాటు కాకపోవచ్చు కాబట్టి మధ్యేమార్గంగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక వసతుల కార్పొరేషన్‌ (ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ – ఎ.పి.ఐ.ఐ.సి)ని రంగంలోకి దింపుతున్నారు. ఈ సంస్థ పరిశ్రమలను అభివృద్ధి చేయడంకోసం ఏర్పడింది కాబట్టి దాని చేతిలో భూమి పెట్టడానికి బలవంతపు భూసేకరణ చేపడితే అది చట్టం కళ్ళలో చెల్లుబాటవుతుందని ప్రభుత్వం భావన. విశాఖపట్నం దగ్గర రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో చేపట్టిన సెజ్‌ విషయంలో ఈ మార్గమే అనుసరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా చేజిక్కించుకున్న భూమిలో ఎ.పి.ఐ.ఐ.స.ి తానే డెవలపర్‌ అవతారం ఎత్తవచ్చు లేదా మరొక వ్యక్తినో కంపెనీనో కో-డెవలపర్‌గా పక్కన తెచ్చుకొని కూర్చోబెట్టుకోవచ్చు.
ఈ విధంగా మోసం చేసో, భయపెట్టో, భ్రమలు పెట్టో వేల ఎకరాల భూమి చేజిక్కించుకున్న డెవలపర్‌ సెజ్‌ నాటకం తెరతీసేసరికి రంగం మీద ఉంటాడని చెప్పాము కదా. ఇతనిది నిష్కామకర్మ కాదు. అంటే చేజిక్కించుకున్న వేల ఎకరాలన్నీ ఎగుమతులు చేసే కంపెనీలకు అప్పగించి ఖర్చుమీద అయిదు శాతమో, పది శాతమో వారినుండి తీసుకొని ఇల్లు చేరుకునే పాత్రకాదు (ప్రస్తుత రాజకీయార్థిక వాతావరణంలో దీనిని నిష్కామకర్మ అనవచ్చు.

ఆంగ్లంలో ఫెసిలిటేటర్‌ అన్నమాట వాడుతున్నారు). సెజ్‌ భూభాగంలో 25 నుండి 35 శాతం మాత్రమే వస్తువులు లేక సేవలు ఉత్పత్తిచేసే ఆర్థిక సంస్థలుంటాయి. తక్కిన 65 నుండి 75 శాతం భూభాగంలో దానికి అనుబంధ వసతుల అభివృద్ధిని డెవలపర్‌ చేపడతాడు. వసతులు అంటే రోడ్లు, కరెంటు తీగలు, నీళ్ళ పైప్‌లైన్లు మాత్రమే అనుకునేరు. అదేంకాదు. సకల ‘పారిశ్రామిక, వ్యాపార, సామాజిక వసతుల’ అభివృద్ధీ దానిలో భాగమేనని సెజ్‌ చట్టం సెక్షన్‌ 2(ఎస్‌)లో అంటుంది. వైద్య సదుపాయలు, విద్యాసంస్థలు, కాలక్షేప వ్యవస్థ, నివాసాలు, వ్యాపార కేంద్రాలు అన్నీ అందులో భాగమేనంటుంది. అంటే డెవలపర్‌ చేసేది ప్రధానంగా ఎగుమతి సంస్థలకు దారి సుగమం చేయడం కాదు. అది అతనికి సంబంధించినంతవరకు అనుబంధ కార్యక్రమం మాత్రమే. అతను ప్రధానంగా చేసేది వసతుల అభివృద్ధి పేరు మీద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. అదికూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాలి. అంటే ఒక్కొక్క సెజ్‌ ఒక చిన్నపాటి అమెరికా పట్టణంలాగ ఉంటుంది. చుట్టూ (ఇంకా మిగిలి) ఉన్న పల్లెలకు రోజుకు ఆరు గంటలు కూడా కరెంటు దక్కకపోవచ్చు. ఇక్కడ ఇరవై నాలుగు గంటల ఉంటుంది. చుట్టూ (ఇంకా మిగిలి) ఉన్న పల్లెలకు రక్ష్షిత మంచినీళ్ళు ఉండకపోవచ్చు. ఇక్కడ నల్లాలలో నాలుగుసార్లు కాచి చల్లార్చిన నీళ్ళు నిరంతరాయంగా ప్రవహిస్తాయి. చుట్టూ (ఇంకా మిగిలి) ఉన్న పల్లెలలో కాలిబాటలు, బండ్లబాటలు  మాత్రమే ఉండవచ్చు. ఇక్కడ టాటా వారి చిన్నకారు పల్టీలు కొట్టేంతటి నున్నటి రోడ్లుంటాయి.

ఇదంతా ఎగుమతులను ప్రోత్సహించే పేరుమీద జరుగుతుంది. దేశంలో ఇప్పటికే వందల సంఖ్యలో సెజ్‌లు ఆమోదం పొందాయంటే కారణం ఎగుమతి సంస్థల ఉత్సాహమా లేక డెవలపర్‌ల రియల్‌ ఎస్టేట్‌ దాహమా? ఈ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి సెజ్‌లో 25 లేక 35 శాతం భూభాగంలో ఉండే ఉత్పత్తి లేక సేవారంగ సంస్థకు అనుబంధంగా జరుగుతుందని పైన అన్నాము. కానీ అన్ని విషయాలు స్పష్టంగా వివరించే సెజ్‌ చట్టం ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారం (లేక వ్యాపార, సామాజిక వసతుల అభివృద్ధి) ఆ ఆర్థిక సంస్థ సిబ్బంది, అధికారుల అవసరాలకు మాత్రమే పరిమితం కావాలని చెప్పలేదు. అది దానంటదే ఒక లాంకోహిల్స్‌, ఒక సింగపూర్‌ సిటీలాంటి విలాసవంతమైన టౌన్‌షిప్‌ కాగలదు. డెవలపర్‌ అక్కడి భూములను ఎవరికీ అమ్ముకోవడానికి వీలులేదుగానీ లీజుకిచ్చుకోవచ్చు. నిర్మాణాలు చేపట్టి కిరాయికిచ్చుకోవచ్చు, ఎంత మందినైనా కో-డెవలపర్లుగా చేర్చుకుని వ్యాపారంలో భాగం చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తామని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరాకు, నీటి సరఫరాకు హామీ ఇవ్వాలి. భూసేకరణకు సహకరించాలి. అప్పుడే సెజ్‌కు ఆమోదం లభిస్తుంది. రంగం మీదికొచ్చిన డెవలపర్‌ ఒక చేతిలో వేల ఎకరాల యాజమాన్య పత్రాలు, మరొక చేత రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి పత్రం పట్టుకొని ఉంటాడు. అప్పుడే అతని ప్రతిపాదనను ఓకే చేస్తుంది.
కోట్ల ధనం పెట్టుబడులు పెట్టి మరిన్ని కోట్లు సంపాదించుకోవడానికి ధనవంతులకు మహదవకాశమైన ఈ ప్రక్రియ కోసం జనం ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ సందర్భంగా మరికొన్ని మాయమాటలు కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖుల నుండి వింటున్నాం. సెజ్‌ల కోసం సారవంతమైన భూములు సేకరించడం జరగదనీ సారహీనమైన భూములు, బంజరు భూములు మాత్రమే సేకరించడం జరుగుతుందని చెప్పగా వింటున్నాం. భూమి సారవంతమైనదైనా సారహీనమైనదైనా దానిమీద ఆధారపడిన వారికి అదే జీవనం. యజమానికైనా అదే, ఆ భూమిలో కూలి చేసుకుని బతికే వారికైనా అదే. సారవంతమైన భూమి సేకరిస్తే కనీసం నష్టపరిహారం ఎక్కువ రాగలదు. సారహీనమైన భూమికి అదికూడా రాదు. బంజరు భూమి అంటే వ్యవసాయానికి పనికి రాదేమోగానీ దేనికీ పనికిరాదని కాదు. పశువుల కాపర్లకు, కల్లుగీత కార్మికులకు, వాగులలో కుంటలలో చేపలు పట్టుకునే మత్స్యకారులకు, రాళ్ళుకొట్టి అమ్ముకునే వడ్డెరలకు బంజర్లే జీవనాధారం. పేదలకు పొయ్యిలో కట్టెకు, గుడిసె వాసాలకు, స్తంభాలకు బంజర్లే ఆధారం.
కాగా, ఏరి ఏరి సారహీనమైన భూమిని మాత్రమే సెజ్‌లకు ఇవ్వడం సాధ్యంకాదు. సెజ్‌కోసం డెవలపర్‌ ప్రతిపాదించే భూమి అవిచ్ఛిన్నమైనదిగా ఉండాలని ఆ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నియమాలలోని నియమం 5(2)(ఎ) అంటుంది. అంతేగాక ఒక్కొక్క చోట ఉండి ఒక్కొక్క దానికోసం విడివిడిగా వసతులు అభివృద్ధి చేయడం కంటే అన్నీ గుంపుగా ఒకేచోట ఉండి అన్నిటికోసం ఉమ్మడిగా ఎగుమతులు అభివృద్ధి చేయడం పొదుపరితనం అన్న వాదన సెజ్‌లకు మద్దతుగా చేస్తున్న ప్రధానమైన వాదనలలో ఒకటి. కాబట్టి సారవంతమైన భూములను సెజ్‌ల నుండి మినహాయించాలన్నది ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్‌ పెద్దలు చేస్తున్న ఓదార్పు ప్రవచనమే తప్ప సెజ్‌ల భావనకు అతికే అభిప్రాయం కాదు. ఆచరణీయం అసలేకాదు. కాబట్టి సెజ్‌లకోసం ఊర్లకు ఊర్లు ఖాళీ కావలసిందే.
మరైతే ప్రజలకు ఆగ్రహం కలగడం సహజం కాదా? సెజ్‌ల ఉద్దేశం మంచిదే అని కొంచెం సేపు అనుకున్నా, దానికోసం తమకు జీవనం ఇస్తున్న  భూములు అప్పగించి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ బతకాలి? ఏం చేసుకొని బతకాలి? స్వంత భూములకు, ఇళ్ళకు 1894 నాటి భూసేకరణ చట్టం కింద కొంత నష్టపరిహారం ఇస్తారు. అది వలసకాలంనాటి చట్టం అని గుర్తించి దానినే ఇంకా వినియోగించడాన్ని ఇప్పుడందరూ విమర్శిస్తున్నారు. అయితే ఆ వలసకాలం నాటి చట్టం సెజ్‌ల కోసం, అంతర్జాతీయ విమానాశ్రయల కోసం, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులకోసం భూసేకరణ చేయడానికి ఉద్దేశించినది కాదు. అప్పట్లో వలస పాలకులకు భారీప్రాజెక్టు కట్టే ప్రణాళిక లేదు. ఊరుమ్మడి అవసరాల కోసం ఒక రోడ్డు వేయడానికి, ఒక స్కూలో ఆస్పత్రో కట్టడానికి, ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నిర్మించడానికి భూమి అవసరమైనప్పుడు ఆ ఊరిలో అనువైనచోట ప్రభుత్వ భూమి లేనట్టయితే, రైతులెవ్వర స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఇష్టపడకపోతే, కొంత నష్టపరిహారం ఇచ్చి బలవంతంగా భూమి సేకరించడం కోసం 1894 నాటి భూసేకరణ చట్టం ఉద్దేశించబడింది. స్వతంత్ర భారతదేశంలోనే దానిని భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం చేసే భూసేకరణకోసం వినియోగించడం మొదలయింది. ప్రజావసరాల కోసమేకాక కంపెనీల కోసం కూడా భూసేకరణ ఆ చట్టం కింద చేయవచ్చునని 1984లో పార్లమెంటు సవరణ తీసుకొచ్చింది.
ఇప్పుడు మొత్తంగానే భూసేకరణ ప్రక్రియను తిరగరాసి మానవీయమైన పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నారని వింటున్నాం. ఒక కొత్త బిల్లు పార్లమెంటు ముందు ఉంది. దానిని పార్లమెంటు చర్చించి అనుమతిస్తుందో, లేక రాజకీయ వివాదాల నడుమ సమయం లేక చర్చించకుండానే అనుమతిస్తుందో తెలీదు. పార్లమెంటు చర్చించినా చర్చించకున్నా సమాజానికి ఆ బిల్లు చట్టం కాకముందే దానిలో ఏముందో తెలియలి. దానిని చర్చించే అవకాశం ఉండాలి. కాగా, ఇప్పటిదాకా నష్టపరిహారం స్థిరాస్తుల మీద యాజమాన్య హక్కు ఉన్న వారికే పరిమితం అయింది. యాజమాన్య హక్కులేకుండా ప్రకృతి వనరుల పైన ఆధారపడి బతికేవారికి అటువంటిదేం లేదు. వివిధ రాష్ట్రాలు అడపా దడపా ఈ మార్గాలకు కూడా కొంత నష్టపరిహారం, ఒక పునరావాస కాలనీ కట్టిచ్చే విధానాలను రూపొందిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 2005లో జి.వో నెం. 68 రూపంలో అటువంటి విధాన ప్రకటన చేసింది. అయితే నిర్వాసితులకు పునరావాస హక్కు కల్పించే చట్టమొకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నదని చాలా కాలంగా వింటున్నాం. ఇది కూడా ఇప్పుడు బిల్లు రూపంలో పార్లమెంటు ముందు ఉంది. దీనిని కూడా సమగ్రంగా చర్చించే అవకాశం, సవరణలు సచించే అవకాశం సమాజానికి ఉండాలి.
నష్టపరిహారం, పునరావాసాల విషయంలో చట్టాలు అసమగ్రంగా, అసంతృప్తికరంగా ఉన్న విషయం గుర్తించామని చెప్తున్న వారు కొత్త విధానాల, చట్టాల ఇంకా రూపొందే దశలో ఉండగానే లక్షలాది ఎకరాలు సెజ్‌ల పేరిట, ఇతర ‘అభివృద్ధి’ కార్యకలాపాల పేరిట కోటీశ్వరులకు ధారాదత్తం చేసి ప్రజలను ఆ భూముల నుండి బలవంతంగా నెట్టివేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
ఇది చాలక ఉద్యోగావకాశాల గురించి ఆడుతున్న అబద్ధాలొకటి. మన ముఖ్యమంత్రి గారైతే లక్షల సంఖ్యకు తగ్గడు. తాను చేపడుతున్న ‘అభివృద్ధి’ కార్యకలాపాలవల్ల 25 లక్షల ఉద్యోగాలొస్తాయని పదే పదే ప్రకటిస్తున్నాడు. ఏ సెజ్‌లోకి ఏ కంపెనీ రాబోయేదీ, ఏం తయారుచేయబోయేదీ, ఎన్ని పనులు కల్పించబోయేదీ తెలియనప్పుడు ఎంతమందికి ఉద్యోగాలొస్తాయె ఎట్లా చెప్పగలడు? ఉద్యోగాలు అనేదాంట్లో అన్ని రకాల ఉపాధి అవకాశాలనూ – సెజ్‌ గేటు బయట పాన్‌ డబ్బా పెట్టుకునే అవకాశంతో సహా – లెక్కిస్తున్నాడనే ఉదారంగా భావిద్దాం. అయినప్పటికీ ఎంతమందికి పని దొరికేదీ ఆయనకెట్లా తెలుసు? అయినా ఎగుమతులకోసం ప్రధానంగా ఉద్దేశించిన సెజ్‌లలో ఆటోమేటిక్‌ ప్రక్రియలననుసరించే అత్యాధునిక సాంకేతిక పద్ధతులకే తప్ప వందల మందికి పనులు కల్పించే పాతకాలపు ఉత్పత్తి విధానాలకు చోటులేదు. నెల్లూరు జిల్లా మా౦బట్టులో మామూలు పరిశ్రమగా మొదలై సెజ్‌గా రూపాంతరం చెందిన అపాచీ పాదరక్షల కంపెనీ 35వేల ఉద్యోగాలు కల్పిస్తుందన్న హామీతో మొదలై ఇప్పుడు 5,000 మందికి కల్పిస్తున్నది. అందులో నిర్వాసితులు 200 మంది కూడా లేరు.
ఒక వేళ పనులంటూ దొరికినా సెజ్‌లలోని పని పరిస్థితులేమిటి? సెజ్‌లోని కంపెనీలకు ఏ చట్టం నుండైనా పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ఒక నోటిఫికేషన్‌ (ఆదేశం) ద్వారా ప్రభుత్వం మినహాయించవచ్చునని సెజ్‌ చట్టంలోని సెక్షన్‌ 49(1) అంటుంది. దాని తరువాత వచ్చే 49(2) విచిత్రమైనది. కార్మిక చట్టాల నుండి సెక్షన్‌ 49 (1) కింద ఏదైనా సెజ్‌లోని సంస్థలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఆదేశం జారీ చేసినట్టయితే దానిని మరొక ఆదేశం ద్వారా వెనక్కి తీసుకోవడానికి వీలులేదని సెక్షన్‌ 49(2) అంటుంది. దానిని వెనక్కి తీసుకోవాలంటే చట్ట సవరణ అవసరం అవుతుందని దీని భావం.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కార్మికచట్టాల నుండి మినహాయింపులు, సవరణలు జారీచేశాయి. మన రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌లలో పని గంటలపైన పరిమితిని తొలగించింది. ఓవర్‌టైం వేతనం చెల్లించేటట్టయితే ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు.

(చికాగో అమరవీరులు తమ సమాధుల నుండి లేచి వస్తున్నట్టు అనిపిస్తున్నదా?) కనీస వేతనాలు చెల్లించవలసిందే గానీ వేతనం ఎంత చెల్లిస్తున్నదీ, సంస్థలో ఎంతమంది పని చేస్తున్నదీ తెలియజేసే వేతనం రిజిస్టర్లు, రికార్డులు, యాజమాన్యం నిర్వహించనక్కర లేదు. (అంటే కనీస వేతనం ఇస్తున్నదీ లేనిదీ నిరూపించే ఆధారమేమీ ఉండదు). పని గంటలు  కూలిరేటు ప్రకటించనక్కర లేదు. అంటే కార్మికులు కోర్టుకు పోయి న్యాయం పొందడానికి ఏ లిఖిత ఆధారమూ ఉండదు.
కార్మికుల ఆరోగ్యానికీ భద్రతకూ తదనుగుణ్యమైన సదుపాయాలకూ సంబంధించిన శాసనం ఫ్యాక్టరీ చట్టం. దానినుండి ఏ ఫ్యాక్టరీకి మినహాయింపు ఇచ్చే అవకాశం ఇప్పటివరకు లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌లలో నెలకొల్పే ఫ్యాక్టరీలను భద్రత, ఆరోగ్య నియామాల నుండి మినహాయించే అధికారం ఒక నోటిఫికేషన్‌ ద్వారా తనకు తాను ఇచ్చుకుంది. ఇప్పటిదాకా కాంట్రాక్ట్‌ కార్మిక చట్టం నుండి కేవలం అత్యవసర సందర్భాలలో మాత్రమే మినహాయింపు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. కాని సెజ్‌లలో ఎప్పుడైనా ఏ సంస్థకైనా ఏ మినహాయింపు అయినా ఇచ్చే అధికారం మన రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను కల్పించుకుంది.

 కార్మిక సంఘాలు సమర్థంగా పనిచేఘాలంటే అనుభవజ్ఞులైన బయటి వాళ్ళ పాత్ర అవసరం అని గుర్తించిన కార్మిక సంఘాల చట్టం, కార్మిక సంఘం బాధ్యులలో సగానికి మించకుండా బయటివాళ్ళు ఉండవచ్చుననింది. మన రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌లలోని సంస్థల కార్మిక సంఘాలలో బయటివాళ్ళు ఒక్కర ఉండడానికి వీలులేదని ఆదేశం జారీ చేసింది. పైగా సంస్థలోని కార్మికులలో 30 శాతం సభ్యులుగా ఉన్న సంఘానికే ‘గుర్తింపు’ ఉంటుందని ఆ దేశం జారీచేసింది. అసలు కార్మిక సంఘానికి ‘గుర్తింపు’ అనేది చట్టంలో ఉన్న భావన కాదు. మొండి యాజమాన్యాలు చట్టబాహ్యంగా తెచ్చిపెట్టిన భావన. గతంలో ఏడుగురు సభ్యులుంటే కార్మిక సంఘం రిజిస్టర్‌ చేసుకోవచ్చని మార్చారు. 2001 తరువాత సంస్థలోని కార్మికులలో 10 శాతం సభ్యులుంటే కార్మిక సంఘం రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రిజిస్టర్‌ అయిన కార్మిక సంఘాలన్నిటినీ యాజమాన్యం గుర్తించవలసిందే, అన్నిటితోనూ వ్యవహరించవలసిందే. ఇప్పుడు సెజ్‌లలోని సంస్థలలో 30 శాతం కార్మికులు సభ్యులుగా ఉన్న సంఘానికి మాత్రమే కార్మిక సంఘంగా వ్యవహరించే హక్కు ఉంటుంది. ఇతర సంఘాలతో యాజమాన్యం మాట్లాడనక్కర లేదు. ఇది కార్మిక సంఘాల ఉనికినే దాదాపు అసాధ్యం చేస్తుంది.
అసలు కార్మికశాఖ స్వతంత్రతనే సెజ్‌ చట్టం దెబ్బతీసింది.

కార్మిక శాఖలో అవినీతి ఆద్యంతం ఉందిగానీ సూత్రప్రాయంగా అది కార్మిక సంక్షేమం తప్ప వేరే లక్ష్యమేదీ లేని ప్రభుత్వశాఖ. సెజ్‌ చట్టం సెజ్‌లలోని పారిశ్రామిక సంస్థలకు సంబంధించినంత వరకు దీనిని తొలగించేసింది. ఎగుమతుల వృద్ధిని లక్ష్యంగా గల సెజ్‌ ఆ లక్ష్యాన్ని అందుకునేటట్టూ చూసే బాధ్యత గల డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అనే కేంద్ర ప్రభుత్వ అధికారి ప్రతీ సెజ్‌కూ ఒకరు నియమితులై ఉంటారు. సెజ్‌లు ఫలవంతంగా ఉత్పత్తి చేసేటట్టూ చూడడం అతని కర్తవ్యం. సెజ్‌ చట్టం అతనికే కార్మికశాఖ అధికార బాధ్యతలు అప్పగించింది. సెజ్‌ల ఎగుమతి వ్యాపారం దక్షత బలహీనపడకుండా ఉన్న మేరకే కార్మికులకు హక్కులుంటాయని దీనిభావం. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం ముందుకు పోయి కార్మికుల ఉద్యోగ భద్రత విషయంలో తనపైన ఉన్న ఒక ముఖ్యమైన బాధ్యతను కూడా అదే అధికారికి అప్పగించింది. ఇది కార్మికులను తొలగించడానికీ, లేఆఫ్‌ చేయడానికీ పారిశ్రామిక సంస్థలకు పారిశ్రామిక వివాదాల చట్టంలోని 5-బి అధ్యాయం కింద అనుమతి ఇచ్చే అధికారం. అంటే కార్మికులకు ఉండే ఇతర హక్కులే కాదు, ఉద్యోగ భద్రత కూడా సెజ్‌ల ఎగుమతి సామర్థ్యం దెబ్బతినకుండా ఉన్న మేరకే లభ్యం అవుతాయి.

సెజ్‌లు వస్తే ఉద్యోగాలు వస్తాయి, వస్తాయి అంటున్నారు. వాళ్ళు చెప్పే దానిలో 5 శాతం కూడా రావన్న సంగతి అటుంచి, వచ్చిన ఉద్యోగాలు ఇంత భద్రంగా ఉంటాయి! సౌదీ అరేబియా వంటి దేశాలలో పనికోసం పోయిన మన వారి కథలు పత్రికలలో చదువుతున్నారు కదా! ఇంక మీదట ఆ కథల కోసం అంత దూరం పోనక్కర లేదు. మీ దగ్గరున్న సెజ్‌లో చూడవచ్చు.
ప్రజలకిచ్చేది ఇదైతే సెజ్‌లో సంస్థలు నెలకొల్పే వారికి అరచేతిలో సకల వసతులతో బాటు అనేక రకాల పన్ను రాయితీలు లభిస్తాయి. ఎగుమతి – దిగుమతి సుంకాలు, ఎగుమతి – దిగుమతి నియామాల విషయంలో సెజ్‌ విదేశీ భూభాగం వంటిదని సెజ్‌ చట్టంలోని సెక్షన్‌ 53 అంటుంది.

 అయితే ఎగుమతి దిగుమతి సుంకాలేకాదు, వారికి అన్ని రకాల పన్నుల నుండి ఎంతో కొంత మినహాయింపు లభిస్తుంది. చివరికి సెజ్‌లోని కంపెనీల డైరెక్టర్లకు వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. నిజానికి వారికి లభించే రాయితీల జాబితా రాసుకుంటూ పోతే మళ్ళీ ఇంత కరపత్రం అవుతుంది. ధనవంతులు తమ వ్యాపారాలతో దేశానికి సేవచేస్తారని చెప్పుకుంటారు గానీ వారు ఇచ్చేదేమైనా ఉంటే అది పన్నుల రూపంలోనే. దానికి మినహాయింపు ఇచ్చేసి సకల వనరులనూ అభివృద్ధిచేసి వారికి అప్పగించే వ్యవస్థ సెజ్‌ వ్యవస్థ. ఈ దాస్యాన్ని దేశమెందుకు సహించాలి? ఆర్థిక అభివృద్ధికి వేరే ఏ రకంగానూ రాదా? ప్రజల చేతిలో ఉన్న వనరులను వారి వద్దనే ఉంచి వాటినీ వారినీ అభివృద్ధి చేసే ఆర్థిక వ్యూహం రచించలేమా?

మానవ హక్కుల వేదిక
ఆంధ్ర ప్రదేశ్

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

One Response to ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్‌) చట్టాన్ని రద్దుచేయలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి

  1. saiprakash says:

    శ్రుజనాత్మకమైన రచనలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు
    సాయి ప్రకాశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో