ముళ్ళగోడ- శైలజామిత్ర

ఉదయం నుండి ఆకాశం మబ్బులు కమ్మింది. ఒక్కో ఉదయం మనసు మౌనంగా ఉన్నట్లుంటుంది. పగటిని కూడా శీతలంగా మార్చే మంత్రం మబ్బుల్లోనే ఉంటుంది. సంతోషాన్ని సైతం ఆవేదనగా మార్చే తత్వం మౌనంలో ఉంటుంది. ఇలా ముసురు పట్టిన రోజుల్లో వాన కురుస్తుందో లేదో కాని కురుస్తుందేమో అని అందరూ తమ తమ స్థానాల్ని వదిలి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వాన కురిస్తే మేఘం తలవంచినట్లే! మౌనం మాట్లాడితే మనిషి ఎదుటి వ్యక్తికి దొరికినట్లే!

”రవీ ! ఓకే రా! మేము బయలుదేరుతాం” అంటూ స్నేహితులందరూ పెళ్ళిలో భోజనాలు చేసి ఎవరి ఇండ్లకు వారు బయలుదేరారు. రవి, సంతోష్‌ మాత్రం మిగిలారు.

రవి, సంతోష్‌ ఇళ్ళు ఒకటే కాలనీలో అవ్వడంతో సంతోష్‌, రవి కోసం ఆగిపోయాడు. స్వతహాగా కంగారు పడే సంతోష్‌, ఊరుకోకుండా ఎవరితోనో మాట్లాడుతున్న రవిని పిలిచి ”ఒరేయ్‌ రవీ రా రా! వాన వచ్చేలా ఉంది. మళ్ళీ మనకు బస్సులు దొరకవు” అన్నాడు చిరాకుగా

సంతోష్‌ కేసి చూసి వన్‌ మినిట్‌ అని సైగ చేసి మాట్లాడుతున్న రవిని చూసి.. వీడు మారడు. ఎవరైనా పలకరిస్తే చాలు అతుక్కుపోతాడు. అనవసరంగా ఉండిపోయాను. వేణు వాళ్ళతో వెళ్లి ఉంటే కనీసం సగం దూరం అయినా లిఫ్ట్‌ దొరికేది.. అనుకునేంతలో వెనుకగా వచ్చిన రవి

”ఏంట్రా? తిట్టుకుంటున్నావ్‌? అవతల పెద్దమనిషి మాట్లాడుతుంటే సగంలో ఎలా ఆపేయమంటావు? పద” అని బాగ్‌ భుజంపై వేసుకోగానే వర్షం ప్రారంభం అయింది.

”చూడు ఇపుడేమయిందో? నేను అనుకుంటూనే ఉన్నాను.” అన్నాడు మరింత చిరాకుగా సంతోష్‌

”నీకు మీ అమ్మ నాన్నలు సంతోష్‌ అని ఎందుకు పేరు పెట్టారో అడగాలని ఉంది. కనీసం ఆ పేరు పెట్టినందుకైనా అప్పుడప్పుడు సంతోషంగా ఉండు. నువ్వు చెప్పినప్పుడే నేను బయలుదేరి ఉంటే ఈ పాటికి వర్షంలో ఇరుక్కుపోయేవారం. పోనీ నువ్వు ఆ వేణు గాడితో వెళ్ళి ఉంటే ఈ పాటికి తడిసి ముద్ద అయ్యేవాడివి. వాళ్ళకేమి కార్లు లేవుగా? అందరివి టూ వీలర్లే. ఇప్పుడు చెప్పు నీకు జరిగింది మంచే కదా?

ఈ రవిని నమ్ముకుంటే ఎవ్వరికీ నష్టం జరగదు రా ! అన్నాడు కాలర్‌ ఎగర వేసుకుంటూ

సంతోష్‌కు రవి మాటల్లో నిజం ఉందనిపించింది. ”సరే ! ఇప్పుడెలా మనం వెళ్ళడం ? పోనీ కాసేపు ఇక్కడే ఉందామంటే పెళ్లివారు కూడా ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. పోనీ వారిలో ఎవరినైనా లిఫ్ట్‌ అడుగుదామా” అన్నాడు సంతోష్‌

”వద్దురా మరీ చీప్‌గా ఉంటుంది. పెళ్లి కొడుకు తరపున వచ్చి వీళ్ళేదో బిక్షగాళ్ళకు మల్లే అడుక్కుంటున్నారు. అనుకుంటే మన శీనుగాడి పరువుపోతుంది” అన్నాడు రవి.

వెళదాం! ఒకవైపు సాయంత్రం అవుతోంది. ఎదో ఒక బస్సు ఎక్కితే ముందు ఇక్కడనుండి బయట పడతాం. అప్పటికి కాస్త వాన తగ్గుముఖం పడుతుంది. ఇక అక్కడి నుండి ఆటో ఏదైనా పట్టుకుని ఇల్లు చేరచ్చు. ఇక్కడి నుండే మనం ఆటోలో వెళ్లామనుకో చేతిలో ఉన్న నెల రోజుల డబ్బు అయిపోతుంది. అనుకునేంతలో రోడ్డు పక్కన ఏదో పెద్ద గొడవ మొదలైంది. అదేమిటో చూద్దామని బయటకు వచ్చి అక్కడికి చేరేంతలోనే ఒకరినొకరు కొట్టుకోవడం ఆవేశంగా ఒకడు మరొకడిని తోసేయడం, ఆ పడ్డవాడు కాస్త ఒక రాయికి తల తాకడంతో తల పగిలి అచేతనంగా పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. వెంటనే ఎవరు ఫోన్‌ చేసారో ఏమో దగ్గరే ఉన్న పోలీస్‌ స్టేషన్‌ నుండి పోలీసు సైరన్‌ వినబడటంతో పరుగులాంటి నడకతో ఎదురుగా వచ్చిన ఏదో బస్సును ఎక్కారు కంగారుగా ఇద్దరూ..

”హయ్యో! ఆ శీనుగాడు పెళ్లి మరీ షాద్‌నగర్‌లో అంటే ఇంటికొచ్చే సరికి ఆలస్యం అవుతుందని అనుకున్నాను కాని ఇలాంటిదేదో జరుగుతుందని మాత్రం ఊహించలేదు” అన్నాడు రవి తన జేబులోంచి కర్చీఫ్‌ తీసుకుని తల తుడుచుకుంటూ

”సర్‌! టికెట్‌!” అన్నాడు కండక్టర్‌ రవిని చూస్తూ

”బస్సు ఎక్కడిదాకా వెళుతుంది?” అడిగాడు రవి..

”అంటే ఈ బస్సు ఎక్కడికి వెళుతుందో కూడా తెలియకుండా ఎక్కారా?” అన్నాడు కండక్టర్‌.

”అంటే మా ఇల్లు ఆశోక్‌నగర్‌లో.. ఎక్కడదిగినా పరవాలేదని” నసిగాడు సంతోష్‌

”అలాగా సర్‌. తమరు మీ ఇల్లు ఎక్కడో చెబితే ఈ బస్సు మీ ఇంటి ముందే ఆపుతాం” అన్నాడు కండక్టర్‌ వ్యంగ్యంగా

”సర్లేవయ్యా! ఒకవైపు కుండపోత వర్షం. ఎక్కడైనా ఒక చోట దింపు. వెళ్ళిపోతాం. అందుకోసం నువ్వేమి నీ అతి తెలివి చూపక్కరలేదు.. వెళుతుందేమొ అనుకున్నాం. అన్నాడు. సంతోష్‌ సీరియస్‌గా”

”ఇగో మీరు సిటీకి కొత్తా? ఇది మీ రూట్‌లో వెళుతోందా? చెప్పండి ? ఏదైనా అన్నారంటే అన్నామంటారు కానీ..” నసిగాడు కండక్టర్‌

”ఏదోలెండి. హడావిడిలో ఎక్కాము. వెంటనే దిగుదామంటే వాన. పోనివ్వండి” అన్నాడు పర్సు తీసి..

”అలాగా? ఈ బస్సు అమంగల్‌ వెళుతుంది టికెట్స్‌ తీసుకోండి.. ”అన్నాడు కండక్టర్‌

”అమంగల్‌? అయ్యో అయ్యో ఆపండి దిగిపోతాం” అన్నాడు సంతోష్‌ కంగారుగా

”ఎక్కడపడితే అక్కడ ఆపడానికి ఇదేమి మీ సొంత బస్సు కాదు. మీకోసం కేశంపేట దగ్గర ఆపుతాం. దిగిపోండి లేదా అమంగల్‌లో దిగాల్సి ఉంటుంది.” అన్నాడు కండక్టర్‌ కోపంగా.. చేసేది ఏమి లేక కేశంపేటకు రెండు టికెట్సు తీసుకుని వారగా కూర్చున్నారు. రవి కేసి సంతోష్‌ మింగేసేలా చూసాడు.

కేశంపేటలో ఇద్దరు దిగారు. చుట్టూ ఒక్క హోటల్‌గాని, ఇల్లు గాని కనబడితే ఒట్టు. ఇద్దరికి ఏమి తోచడంలేదు. సమయం రాత్రి 8.30 అయింది.

”ఇప్పుడెలా రా?” అడిగాడు సంతోష్‌

”నువ్వు నోర్ముయ్యరా! నీ వల్లే ఇలా కనబడిన బస్సు ఎక్కాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడతావు. పద నడుద్దాం కాస్తదూరం. రోడ్డు ఏదైనా కనబడితే ఎలాగైనా బయటపడదాం. అసలు నీకంటే నాకే కంగారుగా ఉంది. తమ్ముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. అసలే ఎంతో బాధలో ఉన్నాడు. కొంపదీసి ఏ అఘాయిత్యం అయినా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది” కంగారుగా నడవటం ఆరంభించాడు రవి.

”మధ్యలో ఇదేమిటి? ఏమైంది మీ తమ్ముడికి ? బాధ ఏంటి? అఘాయిత్యం ఏంటి? చెప్పేదేదో కాస్త క్లియర్‌గా చెప్పచ్చుగా” అన్నాడు సంతోష్‌

”ముందు మనకో రోడ్డు కనబడనీ.. కాస్త స్థిమితంగా ఉంటుంది. అప్పుడు చెబుతాను” అన్నాడు నడుస్తూ రవి.. ఎంత నడిచినా రోడ్డు కనబడేలా లేకపోవడంతో ”ఒరేయ్‌! ఇలా ఎంత దూరం రా?” విసుగ్గా అడిగాడు సంతోష్‌

”నాకు మాత్రం ఏమి తెలుసురా? నడుద్దాం రోడ్డు కనిపించే దాకా” అన్నాడు రవి చిరాకుగా బురద అంటకుండా ఉండేందుకు ప్యాంటును పైకి మడుచుకుంటూ

”అనవసరంగా ఇలా వచ్చామేమో రా.. అటే వెళ్లి పోయి ఉంటె కనీసం ఏదో ఒక వెహికల్‌ అయినా దొరికేది”

అవునవును.. పోలీసు వెహికిల్‌ అయితే ఖచ్చితంగా దొరికేది” అన్నాడు వ్యంగ్యంగా రవి

”ఎందుకురా ఊరికే నన్ను పోలీస్‌ పోలీస్‌ అని భయపెడతావు” అన్నాడు. కంగారుగా సంతోష్‌

”లేకపోతే ఏంటి? మనమేమైనా దేశాన్ని ఉద్ధరించి వస్తున్నామా? ఇద్దరు కొట్టుకున్నది ప్రత్యక్షంగా చూసి వస్తున్నాము. అవతల వాడు చచ్చేడో, బతికేడో తెలియదు. అసలు వాడు పారిపోయాడు. మన కంగారు, తొట్రుపాటు చూస్తే ఆ హత్య ఏదో మనమే చేసామనుకుని సవాలక్ష ప్రశ్నలు వేసి ఆఖరికి ఆ హత్య మనమే చేసామని బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద లోపల తోస్తారు” అన్నాడు గబా గబా నడుస్తూ రవి

”అమ్మో ! అలా జరిగితే ఇంకేమైనా ఉందా? మా ఇంట్లో చంపేస్తారు” అన్నాడు భయంగా సంతోష్‌

” మా ఇంట్లో అయితే పూలమాల వేసి ఊరేగిస్తారు” అన్నాడు వ్యంగ్యంగా రవి

”ఎందుకు ? అయితే మీ ఇంట్లో ఏమి అనరన్నమాట” అన్నాడు ముఖంలోకి చూస్తూ

”అందుకే నిన్ను అందరు పిచ్చోడు అంటారు. చంపేయడం అన్నా పూలమాల వేసి ఊరేగించడం అన్నా ఒకటేరా. అయినా మా తమ్ముడు చేసిన పొరపాటు నేను అస్సలు చేయను.” అన్నాడు నవ్వుతూ రవి

అప్పటికి అర్థమైన సంతోష్‌ కాసేపు ఆగి.. ”మధ్యలో మీ తమ్ముడేం చేసాడురా” ఆశ్యర్యంగా అడిగాడు సంతోష్‌

తప్పు చేయకుండా పోలీసులకు దొరికిపోయాడు పాపం! ఎంత టార్చర్‌ పెట్టారో ఏమొ. చీమకు కూడా అపకారం చేయలేడు. అంత అమాయకుడు. ఎవరో చేసిన హత్యకు వీడ్ని బాధ పెడుతున్నారు. అన్నాడు రవి బాధగా

”అంటే ఇలా హత్యలు చూసి పారిపోవడం మీకు హెరిడిటరీ అన్న మాట” అన్నాడు సంతోష్‌ నవ్వుతు

”ఒరేయ్‌ నీకు ఏది జోక్‌గా తీసుకోవాలో తెలియదురా అందుకే నేను ఏమి చెప్పను” అన్నాడు సీరియస్‌గా రవి

”ఓకే ఒకే! ఏదో సరదాగా అన్నాలేరా సారి! ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామురా? కొంపదీసి కాకనూరు కాదు కదా ! అన్నాడు వణికిపోతూ సంతోష్‌.

”కొంపదీయకుండానే ఇది కాకనూర్‌” అన్నాడు రవి ధైర్యంగా

”అయ్యో ! నువ్వింత దైర్యంగా ఎలా ఉండగలగుతున్నావు రా? ఇక్కడ కాస్త చీకటి పడితే చాలు ఆత్మలు తిరుగుతాయని విష్ణు చెప్పేడు. ఈ మధ్య పేపర్‌లో కూడా వేసారు.. చాల భయంగా ఉందిరా” అన్నాడు సంతోష్‌, రవి చేతిని పట్టుకుంటూ

అందుకు చిన్నగా నవ్వి” బయట అందరు ఆత్మాభిమానం చంపుకుని బతుకుతున్నారు. కనీసం ఈ ఆత్మలనైనా మనం చూద్దాం!” అన్నాడు రవి వేగంగా నడుస్తూ

” అంటే నీకేమి భయం లేదా?” అడిగాడు పరుగులా నడుస్తూ సంతోష్‌

”నాకు భయం ఎందుకు లేదు ? మనుషులంటే భయం ఉంది. మనిషికి మించిన విషం ఎవ్వరికీ ఉండదు. ఆఖరికి విష సర్పాలైనా సరే తమ దారికి అడ్డం వస్తేనే కాటు వేస్తాయి. మనుషులు మన దారిలోకి వచ్చి మరీ కాటు వేస్తారు. మాటు వేసి అంతం చేస్తారు. అందుకే అలాంటి భయాలేవీ పెట్టుకోకు. నేను ఉన్నాగా నన్ను అనుసరించు” అన్నాడు ధైర్యంగా రవి

కాస్సేపు వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది

వర్షం ఆగటం లేదు సరి కదా పెరగడం మొదలైంది.. మళ్ళీ సంతోష్‌లో ఏదో అలజడి మొదలైంది. ”వర్షం పెద్దది అవుతోంది రా” అన్నాడు సంతోష్‌

”అయితే ఏమవుతుంది? పడనీ. పెద్దది అవ్వనీ ఇప్పుడేంటి?అన్నింటికీ భయం. సందేహం ఇలా అయితే ఎలా? కాస్త ఓపికగా నడువు” అన్నాడు విసుగ్గా.. రవి

”ఇంకా ఎంత దూరం?” సందేహంగా అడిగాడు సంతోష్‌

”ఎంతసేపైనా నడవాల్సిందే తప్పదు. ఆ పోలీస్‌కు కనిపించడం కంటే దెయ్యాలకి దొరకడమే బెటర్‌” అన్నాడు రవి స్పీడుగా నడుస్తూ”

”అమ్మో మళ్ళీ పోలీస్‌ అంటావ్‌. నన్ను భయపెట్టకురా! ఇప్పటికే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. దారిలో టీ దొరికే దారైనా ఉంటే బావుండేది. మరీ చెట్లు చేమలె.. ఆకలేస్తొంది. ”అన్నాడు మళ్ళీ..

”నీకే కాదు నాకు కూడా ఆకలి వేస్తోంది.. కాస్త ఓర్చుకో రా నేను కూడా ఏదైనా షెల్టర్‌ కనిపిస్తుందేమో అని చూస్తున్నాను.”

”షెల్టర్‌ కనిపిస్తే ఆకలి తీరుతుందా?” అన్నాడు సంతోష్‌ కడుపును చేత్తో తడుముకుంటూ

”కనిపిస్తే చెప్పు. నేను తీరుస్తాగా నీ ఆకలి..” అన్నాడు నవ్వుతూ రవి

”అదేంట్రా ! ఆకలి అని ఒక లాగ అంటున్నావు. కొంపదీసి నీకేమనైనా దెయ్యం పట్టలేదు కదా!” అనుమానంగా చూస్తూ అడిగాడు సంతోష్‌

”ఓరేయ్‌! నువ్వు నోటికి జిప్‌ వేసి నడువు” అన్నాడు త్వరగా నడుస్తూ రవి

”ఒరేయ్‌! నేను నడవలేను రా.. కళ్ళు తిరుగుతున్నాయి. కనీసం నీరైనా” అనేసరికి ఇక సంతోష్‌ ఓపిక పట్టలేడని తెలిసి దగ్గరలో ఉన్న ఒక సిమెంట్‌ బెంచ్‌పై కుర్చుని తాను తెచ్చుకున్న బిస్కెట్‌ పేకట్‌ తీసి సంతోష్‌కు రెండు ఇచ్చి, తనకో రెండు తీసుకున్నాడు. వాటిని చూడటం తోటి సంతోష్‌ ”ఎక్కడిది? ఎలా తెచ్చావు” అని అడిగే ఓపిక కూడా లేకుండా తినడం ఆరంభించాడు. అయ్యాక బ్యాగ్‌ నుంచి నీటిని అందించగానే గబా గబ తాగేసాడు. కాస్త ఓపిక తెచ్చుకుని ”థాంక్స్‌ రా! ఇంతకీ మనం ఇలా నడవాల్సి వస్తుందని తెలుసా ఏంటి? చాలా జాగ్రత్తలు తీసుకున్నావు” అన్నాడు ఆనందంతో ఏమి మాట్లాడాలో తెలియక…

”నేను ఎప్పుడు ఇలా జాగ్రత్తలు తీసుకుంటాను. మా తమ్ముడే అన్నింటికీ కారణం. నేను మాములుగా ఇంటినుండి బయటకు వెళ్ళినా సరే నీళ్ళ బాటిల్‌ తీసుకుని వెళతాను. మరో ఇంటికి వెళ్ళినా సరే నా టిఫెన్‌, నా నీళ్ళు వెంట తీసుకుని వెళతాను. అదీ కాక తలనొప్పికి టాబ్లెట్స్‌ కూడా తీసుకెళ్ళడం నాకు అలవాటు” అన్నాడు రవి మంచి నీళ్ళు తాగుతూ..

” అలాగా! అయితే నాకు ఒక క్రోసిన్‌ ఇవ్వురా! తలనొప్పిగా ఉంది”. అని సంతోష్‌ అనగానే రవి ఒక టాబ్లెట్‌ తీసి ఇచ్చాడు. ”ధాంక్స్‌ రా.. నీ కీ అలవాటు ఉండటం మంచికే అయ్యింది. ఇకపై నేను కూడా ఇలా చేస్తాను.”

”నీకు తెలియదు రా! అన్నింటికీ నా తమ్ముడే కారణం” అన్నాడు ఆకాశం కేసి చూస్తూ రవి

”అన్నింటికీ తమ్ముడే కారణమని అంటున్నావు. కాస్త మీ తమ్ముడు గురించి కాస్త వివరంగా చెప్పకూడదా?” అన్నాడు ఎంతో ఉత్సాహంగా సంతోష్‌

ౖ”చెబుతాను.. కాస్త దూరం నడిచాక” అన్నాడు రవి సీరియస్‌గా

రవి ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాడు. తమ్ముడు గురించి ఏమి చెబుతాడో, అసలేమి చెబుతాడో అని జాగ్రత్తగా రవి ముఖంలోకి చూస్తున్నాడు సంతోష్‌. అప్పుడనగా వర్షం మొదలైంది. అయిదు నిముషాల్లో కుండపోతగా మారింది. ఎప్పుడు ఆగుతుందో అంచనా లేని స్థితి. రోడ్డు పక్కగా ఒక చిన్న గోడకు అనుకుని నిలబడిపోయి మిత్రులిద్దరూ ఆలోచనలో పడిపోయారు. దగ్గరున్న గొడుగులు తలని తడవకుండా కాపాడుతున్నాయి కాని కాళ్ళని తడి పేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడా ఒకటో రెండో కుక్కలు కూడా వీరి పక్కన కూర్చున్నాయి.

”ఇప్పుడెలా రా? మనం ఇంటికి ఈ రాత్రి చేరగలమా?” దిగులుగా అడిగాడు సంతోష్‌

”తప్పకుండా చేరుతాము అయితే మన ఇంటికి కాదు. మాధవి ఫార్మ్‌ హౌస్‌కి” అన్నాడు రవి నమ్మకంగా

”మాధవి ఫార్మ్‌ హౌస్‌ కా ? ఇక్కడికి దగ్గరేనా?”

”దగ్గర కాబట్టే అంటున్నాను. ఫోన్‌ చేస్తే కారు అయినా పంపిస్తుంది లేదా రూట్‌ అయినా చెబుతుంది.” అన్నాడు నమ్మకంగా రవి

”వద్దురా నాయనా ! తానో క్వస్చెన్‌ బ్యాంకు. లక్ష ప్రశ్నలు వేస్తుంది. తను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కంటే ఇలా తడవడమే బెటర్‌” అంటూ తేల్చి పడేసాడు సంతోష్‌

”నువ్వు కాస్సేపు ఏమి మాట్లాడకు. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఇందాకటి నుండి నువ్వు చేస్తుంది అదేగా… నేను భరించడం లేదా? ఇడియట్‌ ఒక్క మంచి మాట మాట్లాడవు కదరా” అనివిసుక్కున్నాడు రవి

”సరే నీ ఇష్టం ..” మరి వేడిగా ఏదైనా అనేలోపే రవి చూసిన తీక్షణమైన చూపుకు భయపడి ఆపై పెంచలేకపోయాడు సంతోష్‌

”హలో.. మధూ..!

”హలో.. ఎవరూ?”

”నేను రవిని”

”రవి నువ్వా? ఎలా ఉన్నావు? ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు?” అంది హడావిడిగా

”నేను మీ ఫార్మ్‌ హౌస్‌ పక్కనే ఉన్న కాకనూరు నుండి మాట్లాడుతున్నాను. దగ్గర దారి అనుకుని నేను, సంతోష్‌ ఆ శీనుగాడి పెళ్ళికని బయలుదేరాము. తీర ఇక్కడకొచ్చాక వేరే దారి కనిపించడం లేదు.. దీనికి తోడు పెద్ద వాన .. నువ్వు ఇంట్లో ఉన్నావా?”

”అందేంటి? శీను పెళ్లి షాద్‌నగర్‌లో కదా? కాకనూరు ఎందుకొచ్చారు?” అడిగింది కంగారుగా మాధవి

అది విన్న సంతోష్‌ ”మొదలైంది తన ప్రశ్నల పర్వం” అన్నాడు మెల్లగా

ఆ మాటలు పట్టించుకోకుండా ”విషయం మళ్ళీ చెబుతాలే మధు. ఇప్పుడు ఇక్కడ కండిషన్‌ బాగోలేదు” అన్నాడు దీనంగా రవి

”అయ్యో ! రవి నేను చెప్పాను కదా మా అక్క పెళ్లి తిరుపతిలో జరుగుతుందని.. ఇప్పుడు అక్కడే ఉన్నాము. కార్లు ఒక్కటి కూడా లేవు. ఎలా మరి? ఆ నాకో ఆలోచన వచ్చింది. మీరు ఎలాగైనా సరే మా ఫార్మ్‌ హౌస్‌కి వెళ్ళండి. రాత్రి అక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఫార్మ్‌లోకి వెళ్ళగానే అక్కడ బయటే గార్డ్‌ ఉంటాడు. అతనికి నా పేరు చెప్పండి. ఒక వేళ నమ్మకపోతే ఫోన్‌ చేసి నాతో మాట్లాడించండి. త్వరగా నడవండి ఓకే” అని తన ఫార్మ్‌ హౌస్‌కి ఎలా వెళ్ళాలో గైడ్‌ చేసి, వెళ్ళమని తొందర చేసింది మాధవి

ఆ మాట వినగానే ఎంతో సంతోషం కలిగింది. ముందైతే ఒక దారి దొరికింది అనుకుని ”ఓకే ఓకే థంక్‌ యు మధు” అన్నాడు ఆనందంగా రవి

”ఇప్పుడవన్నీ ఎందుకు మీరు ముందు రిలాక్స్‌ అవ్వండి. ఇంట్లో తినడానికి బ్రెడ్‌, చీస్‌, సాస్‌ అన్నీ ఉన్నాయి. వేడి చేసుకుని తినండి. ఓకే..” అని ఫోన్‌ పెట్టేసింది మాధవి

”హమ్మయ్య ! ఎలాగైనా సరే తన హౌస్‌కి వెళ్ళాలి రా. లేకుంటే ఈ రాత్రి ఏమవుతుందో మనకే తెలియటం లేదు. చూస్తూనే ఫారెస్ట్‌లోకి వచ్చేసినట్లుగా ఉంది” అంటూ వాన పడుతున్నా సరే బయలుదేరారు..

”ఓరేయ్‌ అక్కడ చూడు ఎవరో..” అనే లోగానే

”ఎవరు రా? కొంపదీసి దెయ్యం…” అన్నాడు సంతోష్‌ వణికిపోతూ

”ఉష్‌! చప్పుడు చేయకు.” అని మెల్లగా ఆ ఆకారం ఉన్న వైపుకు నడిచాడు రవి. సంతోష్‌ మాత్రం రవికి చాల దూరంగా నడుస్తున్నాడు

దుప్పటి ముసుగు వేసుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి కాస్త ధైర్యం చేసి ఇదిగో ”బాబు.. ఇక్కడ కృష్ణ కాటేజ్‌ అనే ఫార్మ్‌ హౌస్‌ ఉండాలి. నీకేమైనా ఐడియా ఉందా? ఎక్కడ?” అడిగాడు

ఏమనుకున్నాడో ఏమో దారి చెప్పాడు. ఒక్క కిలోమీటర్‌ ఉంది. తల దాచుకోవడానికి ఇల్లు వస్తోందని ధీమాతో ఇద్దరు.. ఒక పదిహేను ఇరువై నిముషాలు గడిచాక ఒక ఇల్లు లాంటింది కనిపించింది

”ఇదేనేమో రా” సందేహం వెలిబుచ్చాడు సంతోష్‌

”ఏమో కాదురా ! అదే! వెళదాం పద..” అంటూ అనుకున్నట్లుగాలోనికి బయలుదేరారు

మాధవి చెప్పినట్లుగా గార్డ్‌ నమ్మడానికి కాస్త టైం పట్టింది..

చలి భరించలేక అక్కడున్న బట్టల్ని మార్చుకుని తడి బట్టల్ని ఆరేసారు. మాధవి చెప్పినట్లుగానే బ్రెడ్‌ వేడి చేసుకుని తిన్నారు. గాలికి కిటికీ తలుపులు చప్పుడవుతుంటే లేచి లాక్‌ చేసారు. అక్కడున్న సోఫాల్లో పడుకోగానే మేడపైన ఎవరో ఉన్నట్లుగా అలికిడి అయింది. ఇద్దరు ఉలిక్కి పడ్డారు.

ముందుగా సంతోష్‌ తేరుకుని ”ఒరేయ్‌ ఇదేదో దెయ్యాల ఇల్లు లా ఉంది రా రవి. చప్పుడవుతోంది” అనగానే రవి ఉలిక్కిపడి లేచి చుట్టూ కలియజూసాడు.

రవికి కూడా కాస్త అనుమానం వేసింది. అయినా బయట పడనీకుండా ఎంత వద్దన్నా వినకుండా పైకి వెళ్ళాడు. ఏమి లేదని తెలుసుకుని ”ఏమి లేదురా ! ఏ పిల్లో, ఎలకో అయి ఉంటుంది. నువ్వు పడుకో”

అన్నాడు రవి

కాస్సేపు అయ్యాక ”రవీ! నిద్ర రావటం లేదురా భయంతో. నువ్వు ఇందాక మీ తమ్ముడు గురించి చెబుతానన్నావు కదా! ఇప్పుడు చెప్పు రా ప్లీజ్‌” అడిగాడు సంతోష్‌

”చెప్తాను.. నాబాధను నీకు కాకుంటే ఎవరికి చెబుతాను?” అంటూ తనకు నిద్ర రాకపోవటంతో మొదలు పెట్టాడు రవి

మేము ఇద్దరమే పిల్లలం మా ఇంట్లో. నాన్నకు ఇద్దరినీ ఎంతో చదివించాలని ఉన్నా నాకు అంతగా చదువు అబ్బలేదు. అందుకే నేను ఇంటర్‌తో చదువు ఆపేసాను. వాడు మాత్రం డాక్టర్‌ అయ్యాడు. వాడు డాక్టర్‌ అయ్యాక నాన్న పడిన ఆనందం ఇంతా అంతా కాదు. మేము డాక్టర్‌ అంటేనే ఒక ఊహ లా ఉండే మేము ఇలా ఇంట్లోనే డాక్టర్‌ ఉండటాన్ని తట్టుకోలేక పండుగ చేసుకున్నాము. అందరికీ ఫోన్స్‌ చేసాము. అమ్మ తమ్ముడికి దిష్టి తీసింది. తమ్ముడు మంచి వ్యక్తిత్వం కలవాడు. అయితే కాస్తంత పిరికివాడు. పిరికి తనం మనుషుల్ని ముందుకు కదలనీయదని అమ్మ నిత్యం అంటుండేది. అన్నంత మాత్రాన మారిపోతామ ఏంటి అన్నట్లు తమ్ముడు వైఖరిలో మార్పు వచ్చేది కాదు. పరీక్షలు ఎన్ని పెట్టినా పాస్‌ అవుతాడు కాని చొరవ తీసుకుని ఒక చోటికి వెళ్ళమంటే మాత్రం నా ముఖం కేసి చూసేవాడు ఇలా కొంత కాలం గడిచింది.

ఒకరోజు తన స్నేహితుడికి పెళ్ళంటే వెళదామని నన్ను రమ్మన్నాడు. తన ఫ్రెండ్స్‌తో నాకేం ఆనందం ఉంటుంది? అదీ అందరు చదువుకున్న వాళ్ళు. నాకు వాళ్ళ భాష అంతా కొత్తే. అందుకే ”ఈ సారికి నువ్వే వెళ్ళు. ఆడపిల్లలా భయపడకు” అని నేను బలవంతంగా పంపాను. అదే నా తప్పుగా మారుతుందని, తమ్ముడి జీవితాన్ని అర్థం లేకుండా చేస్తుందని ఊహించలేకపోయాను.

తమ్ముడు వారితో పాటు పెళ్ళికని వెళ్లాడు. కాని అక్కడ స్నేహితులకని ఒక విడిది ఏర్పాటు చేసారు. అదీ వీరంతా యువకులని, పిచ్చి అలవాట్లు ఉంటాయని పెళ్లి మండపానికి కాస్త దూరంగానే ఇచ్చారు. అక్కడ తమ్ముడితో పాటు దాదాపు పదిహేను మంది దాకా చేరారు. తమ్ముడు వెళ్ళడం తోటి లోపలికి పిలిచి తలుపు వేసారట. అక్కడ మందు, సిగిరెట్లు అక్కడి స్థితిని గమనించిన తమ్ముడు ఆదుర్దా పడి వెనుతిరిగి పోయేంతలో స్నేహితులంతా ఆపి ”నీకిష్టం లేకపోతే వదిలేయి. నీ పాటికి నువ్వు ఉండు” అని వెళ్ళనీయకుండా చేసారట. మితి మీరి తాగరేమో ఎవరో అమ్మాయిని గురించిన చర్చలో ఒకరికొకరు తిట్టుకోవడం ఆఖరికి కొట్టుకోవడం దాకా పరిస్థితి చేరిందట. తమ్ముడు నాకు ఫోన్‌ చేయగానే అర్థమైంది తమ్ముడు ఉండకూడని చోటులో ఉన్నాడని. ఒక రకంగా ఇరుక్కుపొయాడని గ్రహించిన నేను వెంటనే బయలుదేరాను. నేను వెళ్ళే సరికి ఏకంగా గంటపైనే అయింది. అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. వారిలో ఏదో గొడవలు వచ్చి ఒకరినొకరు కొట్టుకోవడం అందరు కలిసి ఒకడిని కొట్టడంతో కడుపులో ఏదో అయ్యి ఒక స్నేహితుడు చనిపోవడం జరిగిపోయింది. దాంతో పోలీసులు రావటం, అందరినీ స్టేషన్‌లో ఉంచడం క్షణాల్లో నా కళ్ళ ముందే జరిగిపోయింది.

ఒక్కసారిగా తమ్ముడి ఆశయం, మా ఆశ అన్నీ నేలపాలయ్యాయి. అక్కడున్న పోలీస్‌ల కాళ్ళు పట్టుకున్నాను ”సర్‌, మా తమ్ముడు అలాంటి వాడు కాదు సర్‌” అంటూ.. కాని ఫలితం లేదు. దిగులుగా ఇంటికి వచ్చాను. విషయం విన్న మా నాన్న గుండె ఆగి అక్కడిక్కడే మరణించాడు. అమ్మ జీవచ్ఛవంలా మారింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న మా ఇట్ల ఒక్కసారిగా శ్మశానం లా మారిపోయింది” అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రవి

”ఊరుకోరా రవి.. బాధపడకు.. ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు?” అడిగాడు ఆసక్తిని ఆపుకోలేక సంతోష్‌

”ఇంట్లోనే. మరుసటి రోజు ఉదయం లేచి నా స్నేహితుడికి తెలిసిన లాయర్‌ ఒకరుంటే అతని సాయంతో బెయిల్‌ ఇప్పించి తీసుకు రాగలిగాను కానీ తప్పించలేక పోతున్నాను. తమ్ముడు ఆకలికి అస్సలు ఆగలేడు. నిద్రకు ఆగలేడు. అలాంటిది వాడిని చేయని పాపానికి నిద్ర, తిండి లేకుండా కొన్నాళ్ళు జైల్లో ఉండటం తట్టుకోలేక పోతున్నాను. అసలే పిరికి వాడు అలాంటి వాడికి ఇలా కూడా జరిగితే ఇక వాడు ఎప్పటికీ పిరికి తనంతోనే ఉండిపోతాడని భయంగా ఉంది” అంటూ ఆవేదన చెందాడు.

అంతా విన్న సంతోష్‌.. ”ఏమి బాధ పడకు రవీ! మీ తమ్ముడు నిజంగా ఏమి చేయకుంటే తప్పక బయట పడతాడు. అంతా పోస్ట్‌మార్టం ద్వారా బయటపడితే వదిలేస్తారు. అక్కడ అంతమంది ఉండేసరికి అందర్నీ లోపల వేసి ఉంటారు కానీ తీరా దోషి ఎవరో తెలిసాక వదిలేస్తారులే. పోలీసులు పిచ్చివాళ్ళు కారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలి కనుక మీ తమ్ముడిని కూడా లోపల వేసి ఉంటారు. కంగారు పడకు. అన్నింటికీ ఆ పైవాడు ఉన్నాడు. ఆయన తీర్పు ఎప్పుడో రాసిపెట్టే ఉంటుంది” అన్నాడు సంతోష్‌ ఓదార్చుతూ

”తమ్ముడు డాక్టర్‌ అయ్యాడనే సంతోషాన్ని పూర్తిగా చూడకుండానే నాన్న చనిపోయారు. ఇప్పుడు తమ్ముడు డాక్టర్‌గా ఎంత సాధించినా అర్థం చేసుకోలేని స్థితిలో అమ్మ ఉంది. అసలు మళ్ళీ మా తమ్ముడు ఇంటికి వచ్చి మాములుగా మాతో ఉంటాడా? అనే సందేహం కలుగుతోంది. ఎలాగైనా రావాలనే కోరిక ఉంది. ఎంతో సంతోషంగా పుస్తకాలు చదువుతూ ఉండే తమ్ముడే తలుపు చప్పుడైతే ఉలిక్కి పడే స్థితికి వచ్చాడంటే కన్నీరు ఆగటం లేదు సంతోష్‌ ” అంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు రవి.

ఇది జరిగి ఏడాది అయ్యింది. తెల్లవారితే కేసు ఫైనల్‌ హియరింగ్‌

రవి మొక్కని దేవుడు లేడు. తన తమ్ముడు డాక్టర్‌ కావాలని ఎంతగానో ఆశించాడు. నా తమ్ముడిపై ఎవరి కళ్ళు పడ్డాయో అనుకుంటూ దిష్టి కూడా తీసాడు. తెల్లవారేసరికి సంచలన వార్త తన తమ్ముడు శ్రీకాంత్‌ ప్రధాన నిందితుడు కనుక యావజ్జీవ కారాగార శిక్ష. అతనికి సహకరించిన వారందరికి ఒక్కొక్కరికి అయిదేళ్ళ కఠిన కారాగార శిక్ష అనితీర్పు వెల్లడైంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో