‘ప్రపంచీకరణ’పై దృష్టిని మళ్ళించేందుకు దట్టిస్తున్న మతోన్మాద మందుపాతర – పి.ప్రసాదు

సర్దార్‌ వల్లభాయి పటేల్‌కీ నెహ్రూకీ మధ్య (పటేల్‌కీ, గాంధీకీ మధ్య కూడా కొన్ని విబేధాలున్నాయి) గల అనాటి విభేదాలు నేడు తమకి దోహదపడతాయన్నది హిందూత్వ శక్తుల ఆశ. వారి ఆశ మోడీ ఆరాటంలో ప్రతిఫలిస్తున్నది. పటేల్‌ వారసునిగా రానున్న ఎన్నికలలో దేశ ప్రజల ఎదుటకు వెళ్ళాలన్న తపన మోడీలో స్పష్టంగానే వ్యక్తమౌతున్నది. పటేల్‌ 138వ జయంతి రోజున (31.10.2013) రెండున్నర వేల కోట్ల రూ||ల ఖర్చుతో పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో మోడీ సర్కారు ప్రకటించింది. ప్రపంచంలోనే అపూర్వ స్థాయిలో విగ్రహ నిర్మాణం చేపడుతున్నట్లు కూడా ప్రకటించింది. దేశంలో ఇదో సంచలన రాజకీయ వార్త అయ్యింది.

రేపటి ఎన్నికలలో పటేల్‌ను మోడీ తన ‘గాడ్‌ ఫాదర్‌’గా మార్చుకోజూస్తున్నారు. దాని వల్ల మోడీ ఏ మేరకు రాజకీయ లబ్ది పొందగలడనేది కాలానికే వదిలేద్దాం. కానీ, నిన్నటి వరకూ బీజేపీ పార్టీ శ్రేణులకి ‘గాడ్‌ ఫాదర్‌’గా వర్థిల్లిన అద్వానీని మాత్రం యిది యిరుకున పెట్టింది. నిన్న పార్టీలో, మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన అద్వానీని కూడా నేడు మోడీ తలపెట్టిన పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రప్పించింది. రేపు ఎన్నికలలో పటేల్‌ చేకూర్చే లబ్ధి ఏ పాటిదో తెలీదు. కానీ నేడు మొత్తం పార్టీ యంత్రాంగాన్ని మోడీ వెనక్కి సమీకరించడంలో మాత్రం పటేల్‌ విగ్రహావిష్కరణ, శక్తివంతంగానే వుపయోగపడింది. ఇది యిప్పటికే మోడీ సాధించిన ప్రాథమిక విజయం!

పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఓ యాధృచ్చిక చిట్కాగానో, జిమ్మిక్కుగానో తేలిగ్గా కొట్టి వేసేది కాదు. అది మతోన్మాద పాలకుల కుట్రగా యాంత్రింకంగా వ్యాఖ్యానిస్తే సరిపోదు. భారత దేశ ప్రజల లౌకిక జాతీయవాదాన్ని కూడా ‘హిందూ జాతీయ వాదం’గా చిత్రించే ప్రమాదకర విధానంలో భాగమిది. జర్మనీ చరిత్రలో మార్టిన్‌ లూధర్‌, గోథే వంటి ప్రగతిశీలురను కూడా హిట్లర్‌ తన నాజీయిజం బలపడటానికి వుపయోగించుకున్నాడు. ఇటలీ జాతిపితలైన గారిబాల్డీ, మాజ్జినీలను ముస్సోలినీ కూడా తన ఫాసిస్టు వాదానికి వుపయోగించుకున్నాడు. ఆయా దేశాల జాతీయ వారసత్వ రాజకీయ, సాంస్కృతిక సంపదను అనేక దేశాల నియంతలు తాము తలపెట్టిన పునరుద్దరణోద్యమాలకు వినియోగించుకున్నారు. కేవలం కర్ర, కత్తి, తూటాల బలాలతోనే నాజీయిజం, ఫాసిజాలు బలపడలేదు. తమ ఉన్మాద పూరిత జాతీయ వాదాల ద్వారా మొదట హిట్లర్‌, ముస్సోలినీలు బలపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అదే పంథాలో బలపడజూస్తున్నది. నిజానికి భారత స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర ఆర్‌ఎస్‌ఎస్‌కి లేదు. అయినా స్వాతంత్య్రోద్యమకారులను తమ ‘హిందూ జాతీయ వాద పునరుద్దరణోద్యమాని’కి వినియోగించుకోజూస్తున్నారు. సాయుధ విప్లవకారుడు, సోషలిస్టు, భౌతికవాది అయిన భగత్సింగ్‌ను సైతం ఒక దశలో ఆర్‌ఎస్‌ఎస్‌ స్వంతం చేసుకోవాలని పన్నాగం పన్నింది. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. రాజకీయ కొరతలున్నా, ఎంతటి మితవాద రాజకీయ పంథాను చేపట్టినా, భారత జాతీయ కాంగ్రెసు ఆ కాలంలో ప్రాథమికంగా బూర్జువా లౌకికవాద పంథాను అనుసరించింది. పచ్చి హిందుత్వ వాదాన్ని భుజాన వేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని అనుబంధ సంస్థలకి, ఆనాటి కాంగ్రెసు నేతలను స్వంతం చేసుకునే నైతిక హక్కు లేదు. గాంధీ, నెహ్రూలతో పోల్చితే ఆ బూర్జువా లౌకికవాదంలో కూడా పటేల్‌ వెనకబడే వుంటాడనుటలో సందేహంలేదు. ఆ పటేల్‌ను సైతం వుపయోగించుకునే హక్కులేదు. అసలు సమస్య పటేల్‌ది కాదు. హిందూ జాతీయవాదం పేరిట మన పౌర సమాజాన్ని కాషాయీకరణ ప్రక్రియకి గురిచేస్తున్న పరిణామమే అత్యంత ప్రమాదకరమైనది. అందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేపడుతున్న ‘పునరుద్ధరణోద్యమం’ నేడు లౌకిక ప్రజాతంత్ర భారతీయ సమాజానికి ఎదురౌతున్న ఓ పెద్ద సవాల్‌! అది ‘అయోధ్య’, గోద్రా’లలో విధ్వంస రాజకీయ పంథాను అనుసరించింది. చివరకు విఫలమై అది వెనక్కి తగ్గింది. తిరిగి నేడు మరోసారి తలెత్తుకుంటున్న ఈ ‘పునరుద్దరణోద్యమ’ చరిత్రను అవలోకించు కోవడం నేడు అవసరమైనది.

భౌతికంగా మరణించిన నాయకులు, రాజకీయంగా జీవించడం కొత్తకాదు. ఇది ప్రపంచ వ్యాపితంగా వున్నదే! చరిత్రలో ఒక కాలంలో మరుగున పడ్డ పాత్రలు మరో కాలంలో పునరుజ్జీవిస్తుంటాయి. వర్తమాన చరిత్రలో సాగే సామాజిక కదలికలకి, అవసరమైనపుడు పాత సమాధుల నుంచి గత పాత్రలు లేచి వస్తాయి. నేడు రకరకాల అస్తిత్వ వుద్యమ సంస్థలు, శక్తులు గత చరిత్ర గర్భాన్ని త్రవ్వుతున్న విషయం తెల్సిందే! నేడు తమకి రాజకీయ ఉత్తేజాన్నిచ్చి ముందుకు దూకించడానికి అవసరమైన పాత్రలను వెలికి తీస్తున్నాయి. వాటిని వర్తమాన వుద్యమాలకు పదును పెట్టే సానరాళ్ళుగా మలుచుకుంటున్నాయి. వీటినే పునరుద్ధరణోద్యమాలని కూడా పిలుస్తుంటారు. ఇవి చరిత్రలో కోకొల్లలు జరిగాయి. అలాంటి కోవలోకే మోడీ ప్రతిపాదిత పటేల్‌ విగ్రహావిష్కరణ కూడా వస్తుంది.

అన్ని రాజకీయ కదలికలూ చరిత్రలో వాటంతట అవే ప్రగతిశీలమైనవి కావు. అలాగే అన్ని పునరుద్దరణోద్యమాలు కూడా ప్రగతిశీలం కాజాలవు. పునరుద్దరణోద్యమాలను కూడా ప్రగతిశీల, ప్రగతి వ్యతిరేక కోవలకింద వర్గీకరించాల్సి వుంది. అవి వినియోగించుకోజూస్తున్న గత చరిత్రకి చెందిన పాత్రలు ఆయా కాలాల్లో పోషించిన పాత్రలను బట్టి వాటిని విశ్లేషించకూడదు. వర్తమాన సమాజంలో సాగు సామాజిక, రాజకీయ వుద్యమ శక్తులు పోషించే పాత్రను బట్టి వాటిని అంచనా వేయాల్సి వుంటుంది. గత కాలంలో ఓ ప్రగతిశీల వుద్యమ చరిత్ర గల పాత్రలను వర్తమాన సమాజంలో ప్రగతి వ్యతిరేక శక్తులు కూడా వుపయోగించుకోవచ్చు. అందుకు బానిస సమాజంలో, బానిసల విప్లవాత్మక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏసుక్రీస్తును ఉదహరించుకోవచ్చును. తదనంతరం దోపిడీ శక్తులు, తమ దోపిడీ సామాజిక వ్యవస్థ పరిరక్షణకై క్రీస్తును వజ్రాయుధంగా వినియోగించకున్నాయి. క్రీస్తు విప్లవకారుడైనంత మాత్రాన ఆయన అమరత్వాన్ని పునరుజ్జీవింప జేసిన రోమన్‌ రాజవంశీయులైన పునరుద్ధరణ వాదులు ప్రగతిశీలురు కాజాలరు. పైగా పచ్చి అభివృద్ధి నిరోధకులుగానే చరిత్రలో నిలిచిపోయారు. అందుకే వర్తమాన సమాజంలో కొనసాగే వివిధ రకాల పునరుద్ధరణోద్యమాలు, వస్తుగతంగా పోషించే పాత్రలను బట్టి, వాటి లక్ష్యాల మంచి చెడులను నిర్ణయించాలి. అంతే తప్ప, అవి పునరుజ్జీవింపజేసే గత పాత్రలు తమ కాలంలో పోషించిన పాత్రలను బట్టి నిర్ణయించరాదు.

చరిత్ర పోషించిన, పోషిస్తున్న పాత్రలను పరిశీలిస్తే ఓ వాస్తవం బోధపడుతుంది. గత చరిత్రలోని ప్రగతిశీల పాత్రలను వర్తమాన చరిత్రలో ప్రగతి వ్యతిరేక శక్తులూ, ప్రగతిశీల శక్తులూ వినియోగించుకోజూస్తాయి. కానీ గత చరిత్రలోని ప్రగతి వ్యతిరేక పాత్రలను మాత్రం, వర్తమానంలో ప్రగతి వ్యతిరేక శక్తులే సాధారణంగా వినియోగించుకుంటాయి. ప్రగతిశీల సామాజిక, రాజకీయ వుద్యమ శక్తులకి పురోగామి ఆలోచనా దృక్పధం వుంటుంది. అందుకే పాత అభివృద్ధి నిరోధక పాత్రలను నూతన ప్రగతిశీల వుద్యమావసరాలకి సాధారణంగా వినియోగించుకోజూడవు. ఇకవేళ మినహాయింపుగా ఎక్కడైనా, ఏదేని ప్రగతిశీల వుద్యమశక్తులు అలాంటి పాత్రలను వుపయోగించుకున్నాయంటే, వాటికి పురోగామి రాజకీయ, సామాజిక అవగాహన కొరవడిందని చెప్పవచ్చును. అవగాహనలో అలాంటి కొరతలు గల వర్తమాన వుద్యమాలు భౌతికంగానే ప్రగతిశీలమైనవి. తాత్వికంగా తద్భిన్నమైనవి. దాని వల్ల అట్టి వుద్యమాలు భౌతికంగా కొన్నిసార్లు అరుదైన విజయాలను సాధిస్తే సాధించవచ్చు. కానీ విజయానంతరం నూతన పరిస్థితుల కనుగుణ్యంగా మలుచుకోలేక రాజకీయంగా ఓడిపోవచ్చు.

యూరప్‌లో ఏసుక్రీస్తు, సోక్రటీసు వంటి ప్రాచీన విప్లవాత్మలు మధ్యయుగ రాచరిక పాలకులకి వుపయోగపడ్డాయి. వాటిని తమ ఆటవిక పాలన సుస్థిర పరుచుకునేందుకు అవి వినియోగించుకున్నారు. కానీ భారత ఉప ఖండంలో యీ ప్రక్రియ తద్భిన్నంగా జరిగింది. గత చరిత్రలో విప్లవాత్మలైన చార్వాకులను, నేటికీ విలన్‌లుగానే చిత్రించే పరిస్థితి వుంది. తమ ఆత్మరక్షణకై ఆర్యుల అటవిక దాడుల నెదిరించి. యుద్ధంలో బలైన గత ప్రగతిశీల చారిత్రక పాత్రలను నేటికీ రాక్షసులు, కిరాతకులు, అప్రాచ్యులుగానే ఆధునిక పౌర సమాజం పరిగణిస్తున్నది. యూరప్‌లో శిలువ వేసిన హంతకులే క్రీస్తును దేవుణ్ణి చేశారు. సోక్రటీసుకు విషం యిచ్చి తాగించిన అనాగరిక పాలకులే ఆ తర్వాత ఆయన్ని తత్వవేత్తను చేశారు. అయితే యిక్కడ అలా జరగలేదు. అక్కడ ఏసుక్రీస్తు, సోక్రటీస్‌ల వలె యిక్కడ అసిత కేశకంబళ్‌, మక్కలి ఘోషాల్‌, ఏకలవ్యుడు, శంభుకుడు, వాలి, నరకులను తమ పునరుద్దరణోద్యమానికి ఇక్కడ ప్రగతి వ్యతిరేక పునరుద్దరణ శక్తులు వినియోగించుకోలేదు. అయినంత మాత్రాన యూరప్‌లో ఏసుక్రీస్తు, సోక్రటీసులూ, భారత ఉపఖండంలో ఏకలవ్యులూ, శంభుకులూ, అసిత కేశకంబళ్‌లూ ఒకే కోవకి చెందకుండా పోరు.

ఏకలవ్యులూ, శంభుకులూ, కంబళ్‌ల వంటి ప్రగతిశీలరులను వుపయోగించుకోనంత మాత్రన ఇక్కడి చరిత్రలో ప్రగతి వ్యతిరేక పునరుద్దరణోద్యమాలే జరగలేదని కాదు. క్రీస్తు శకారంభంలోనే దానికి బీజాలు పడ్డాయి. మౌర్యుల పాలన ఏర్పడటంతో వైదిక యుగం అంతరించింది. తిరిగి వైదిక పునరుద్దరణ జరగాలంటూ ప్రగతి వ్యతిరేక వుద్యమం కొనసాగింది. బౌద్ధానికి ముందున్న పరిస్థితిని పున స్థాపించే వుద్యమంగా అది క్రమంగా బలపడి మౌర్య పాలనను కూలద్రోసింది. గుప్త రాజ్య సంస్థాపనకి దారి తీసింది. అది మనువాద సవర్ణ హిందూ రాజ్యమే తప్ప సువర్ణ రాజ్యం కాదని ఆధునిక చరిత్ర కారులందరూ ఆధారాలతో నిరూపించారు. క్రీస్తును రోమన్‌ రాజరిక పాలకులు దేవ దూతలుగా, తత్వవేత్తలుగా ప్రశంసించిన కాలంలోనే యిక్కడ గుప్త పాలకులు యాజ్ఞవల్క్యుణ్ణి అలా ప్రశంసించడం గమనార్హం! అంతేతప్ప భారత ఉప ఖండంలో కూడా ఏసుక్రీస్తు, సోక్రటీసుల వంటి చారిత్రక పాత్రలు పోషించిన గౌతమ బుద్ధుడు, మహావీరులను గానీ, అంతకు ముందున్న చార్వాకులను గానీ ప్రశంసించలేదు. పైగా బౌద్ధారామాలనూ, జైన మందిరాలనూ, చార్వాకుల ఆనవాళ్ళనూ గుప్తుల కాలంలో విధ్వంసం చేశారు. అందుకే హిందుత్వం మొదటి నుంచీ యిక్కడ బల ప్రయోగం మీదే బలపడుతూ వచ్చింది.

ఈ నేల మీద హింసాత్మకంగా బలపడ్డ మనువాద చాతుర్వర్ణ వ్యవస్థే 7వ శతాబ్దం నుంచి జరిగిన మత మార్పిళ్ళకు కారణమైనది. ఈ దేశంలో నేటి 15కోట్ల మంది ముస్లిమ్స్‌లో 95 శాతం మంది ఈ దేశ మూలవాసులే! ఉర్దూ భాష యిక్కడ పుట్టి పెరిగిందే! అరబిక్‌, తుర్కిష్‌, పార్శీ భాషీయులు మాత్రమే 7 నుంచి 15వ శతాబ్దం మధ్య ఇండియాకి వచ్చారు. వారు కూడా తదనంతర కాలంలో ఈ దేశస్తులుగా మారిపోయారు. మధ్యయుగాలలో సవర్ణ మనువాద దురాగతాలే ఇక్కడ మత మార్పిళ్ళకి కారణమయ్యాయి. దానికి ఎవరినో నిందించడం తగదు. ఆధునిక యుగంలో మతం రాజకీయ సాధనం కారాదు. 1980వ దశాబ్దంలో మీనాక్షిపురం మత మార్పిళ్ళ సంఘటనలను చిలువలు, పలవలు చేసిన తీరు రాజకీయ ప్రేరేపితమైనది. 1992 బాబ్రీ మసీదు విధ్వంస సంఘటన హిందూ మతోన్మాద రాజకీయ ప్రేరేపితమైనది. 2002లో గోద్రా మారణకాండ అందుకు పరాకాష్ఠ! అయోధ్యలో కూలిన బాబ్రీ మసీదు ప్రాణంలేని ఓ చారిత్రక కట్టడం! గోద్రాలో రాలిన వందలాది మంది ప్రాణం వున్న మనుషలు! ‘చర్యకి ప్రతి చర్య’ వుంటుందన్న అంచనా బాబ్రీ, గోద్రా విధ్వంసంకులకి స్పష్టంగా తెలుసు! అందులో ‘ప్రతీకార చర్యలు’ కోరుకోవడం కూడా వుంది. దాన్ని వారు చాలా వరకు సాధించుకోగలిగారు.

బాబ్రీ, గోద్రాల విధ్వంసానికి ప్రతీకారం పేరిట తలెత్తిన హింసాత్మక ఛాయలు వర్తమాన భారతీయ సమాజాన్ని వెంటాడుతున్నాయి. విద్వేషపూరిత విభజన మతపరంగా జరగాలన్న హిందుత్వ శక్తుల లక్ష్యానికి యిది వుపయోగపడేదే! దారి తప్పిన పిడికెడు మంది యువకులు చేపట్టిన ప్రతీకార హింసను బూచిగా చూపించడంలో లక్ష్యం వుంది. కోట్లాది మంది సామాన్య ముస్లిమ్‌ ప్రజలపై విద్వేషాన్ని పెంచడం ద్వారా మరుగుపరచాలనుకున్న ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యలున్నాయి. ప్రపంచీకరణ విధానాల దుష్ఫలితాలపై సమస్త పీడిత, తాడిత, బాధిత ప్రజలు ఉమ్మడిగా సాగించాల్సిన పోరాటాలను బలహీనపరిచే రహస్య ఎజెండా వుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభాన్ని చూపించి భారతదేశంలో ఐదారు లక్షల కోట్ల రూ||ల ప్రజాధనాన్ని పన్ను రాయితీలు పొందిన విదేశీ, స్వదేశీ బడా కార్పోరేటు కంపెనీల నిర్వాకం తెల్సిందే! కేవలం 60వేల కోట్ల రూ||ల విలువ చేసే రైతుల అప్పుల మాఫీని అతిగొప్ప సంక్షేమ కార్యంగా ప్రచారం జరిగింది. కానీ అంతకంటే పదిరెట్ల విలువైన ప్రజాధనాన్ని పిడికెడు మంది కార్పోరేటు కుటుంబాలకు ఒక్క కలం పోటుతో ధారపోయడం మరుగు పరిచారు. ప్రజా ధనాన్ని ప్రజల అప్పుల మాఫీకి వెచ్చించడం నేరం కాదు. కానీ ప్రజాధనాన్ని కార్పోరేటు కంపెనీలకి అప్పగించడం నేరం. అది దేశ ప్రజల గొంతులను తడిగుడ్డతో కోసే ‘శీతల కుట్ర’ కూడా! అంతకంటే అనేక రెట్లు ప్రమాదకరమైన మరో ‘అతి శీతల కుట్ర’ యిక్కడ నేడు పురుడు పోసుకుంటున్నది. ‘గోద్రా’ పురుషునికి హస్తినాపురం పాదుకా పట్టాభిషేక సన్నాహక మహోత్సవం అందులో భాగమే!

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో సెప్టెంబరులో తలెత్తిన మతకల్లోలాలు యాదృచ్ఛికమైనవి కాదు. అవి రాజకీయ ప్రేరేపితమైనవి. దాదాపు యాభై వేల మంది ప్రజలు తమ కొంపాగోడు వదిలేసి దూరప్రాంతాలకు తరలిపోయారు. దేశ విభజన కాలం నాటి విషాద అనుభవాలు పునరావృతమయ్యాయి. మొదటిసారి గ్రామీణ ప్రాంతాలకు మత కల్లోలాలు విస్తరించాయి. లౌకిక రాజ్యాంగ చట్టం మీద ప్రమాణం చేసి గెలుపొందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు సైతం బాహాటంగా మత కలహాలను రెచ్చగొట్టారు. బిజెపి యిందులో ముందున్నది. మెజార్టీ మతస్తుల ఓట్ల కోసం నేడు ఇతర కుహనా సెక్యులర్‌ పార్టీలు కూడా బిజెపితో పోటీపడే కొత్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ప్రాథమిక వసతులు లేవు. వెయ్యి మంది ప్రజలున్న చోట ఐదారు పాయకానా దొడ్లు వుంటే పరిస్థితి ఏమిటో వూహించుకోవచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మలవిసర్జన కోసం మరుగుదొడ్డి గేటు ముందు నీటి సీసాతో నిలబడ్డ పరిస్థితి అమాననీయతకు అద్దం పడుతుంది. స్త్రీలు, వృద్ధులు, రోగులు, పసి పిల్లల దుస్థితిని వూహించుకోవచ్చును. చాలీ చాలని నాసిరకం ఆహార పొట్లాల కోసం మండు టెండలో దీర్ఘ ‘క్యూ’లల్లో గంటల తరబడి కాందీశీకులుగా ఎదురు చూడటం అత్యంత విషాద భరితమైనది. ఇదీ ముజఫర్‌ నగర మతకల్లోలాల బాధితుల దీన పరిస్థితి! ఇది ఎవరి పాప ఫలితం? కుహనా ప్రజాతంత్ర, లౌకిక రాజ్య నిజ రూపాన్ని బహిర్గత పరిచే పరిణామమిది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ కన్నీటి గాథలు పెరిగే పరిస్థితిని సూచిస్తున్నది.

నేడు ఆర్థిక సంక్షోభం ట్రాన్స్‌ అట్లాంటిక్‌ దేశాల తీరాలను అలలతో ఢీకొంటున్నది. భారత్‌లో 1498లో తొలి అడుగుబెట్టిన యూరప్‌ వలస వాద రాజ్యమైన పోర్చుగల్‌ అందులో చిక్కుకున్నది. లాటినమెరికా ఖండాన్ని పాలించిన తొలి అగ్ర వలస రాజ్యమైన స్పెయిన్‌కు కూడా అదే గతి పట్టింది. మొత్తం యూరప్‌ను ఒకనాడు ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చి పాలించిన రోమన్‌ సామ్రాజ్యమైన ఇటలీ కూడా సంక్షోభ వూబిలో దిగబడింది. యూరప్‌లోనే తొలి నాగరిక రాజ్యమైన గ్రీకు సైతం నేటి సంక్షోభ తుఫాను తాకిడికి అతలాకుతలమవుతున్నది. ఈ సంక్షోభం వాటికే పరిమితం కాలేదు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాడు, ఫ్రాన్స్‌లను సైతం భయపెడుతున్నది. నాడు వాస్కోడిగామా, మాజిలాన్‌, అముడ్సన్‌లు పాశ్చాత్య సరుకును ముంచెత్తినట్లే, నేడు వాళ్ళ ఆర్థిక సంక్షోభాలు కూడా మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. త్వరలోనే హిందూ మహాసముద్రానికి అట్లాంటిక్‌ సంక్షోభ తుఫాను విస్తరించక తప్పదు. అప్పుటికల్లా మనదేశ ప్రజల దృష్టిని ‘ప్రక్కదారి’ పట్టించాల్సిన బాధ్యత ప్రపంచీకరణ శక్తుల మీద వుంది. అందులో భాగమే తాజా హిందుత్వ పునరుద్దరణోద్యమం’! దానికి ముందస్తు డ్రెస్‌ రిహార్సల్‌ వంటిదే ముజఫర్‌ నగర్‌ మత కల్లోలం!

తాజా ముజఫర్‌ నగర్‌ మానవ మారణ హోమానికీ, రానున్న ఆర్థిక సంక్షోభానికీ మధ్య అప్రకటిత అవినాభావ సంబంధం వుంది. హిందూమత పునరుద్దరణోద్యమానికీ, ప్రపంచీకరణ విధానాలకూ మధ్య లోతైన అనుబంధం వుంది. పటేల్‌ పునరుజ్జీవనం వెనక హిందుత్వ పునరుద్దరణ లక్ష్యాలున్నాయి. యూదుల బూచితో జర్మన్‌ జాతి ఉన్మాదాన్ని ప్రేరేపించిన హిట్లర్‌ చరిత్ర తెలియనిది కాదు. ముస్లిముల బూచితో హిందువులను రెచ్చగొట్టడంలో ప్రమాదం దాగి వుంది. బౌద్ధం, జైనం, చార్వాక సామాజిక వుద్యమాలు వర్థిల్లిన భారత ఉపఖండ చరిత్ర ఉజ్వలమైనది. అలాంటి నేలను మరోసారి రక్తసిక్తం చేసే పన్నాగాల పట్ల దేశ ప్రజలు అప్రమత్తం కావాలి. రానున్న ఆర్థిక సంక్షోభ దుష్ఫలితాలపైకి దేశ ప్రజల అసంతృప్తిని సమీకృతం కానివ్వని ఓ కుట్ర జరుగుతున్నది. విదేశీ సామ్రాజ్యవాదంపై మందుపాతరగా మారాల్సిన పౌర సమాజాన్ని అంతకంటే ముందే మతోన్మాద మందుపాతరను జేకూర్చే పన్నాగం జరుగుతున్నది. అట్టి కుట్రల పట్ల అప్రమత్తంగా వుండాలి. దాన్ని నియంత్రించడమనేది భౌతిక రాజకీయ కార్యాచరణ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచీకరణ దుష్ఫలితాలపై, అవినీతి, దురన్యాయాలపై, దోపిడీ, అణచివేతలపై ప్రజలను సమీకరించడం ద్వారా తప్ప మరో సులువైన మార్గం లేదు. హిందుత్వ ప్రమాదాన్ని నియంత్రించడానికి వేరే మంత్రదండం లేదు. అందుకై లౌకిక, ప్రజాతంత్ర, విప్లవశక్తులు వుద్యమించుతాయని ఆశించుదాం!

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో