బిల్వపత్రంమూలం : గీతాంజలి శ్రీ తెలుగు అనువాదం: దారా మనోరమ

కూరగాయల మార్కెట్‌ దగ్గర తడి తడిగా ఉన్నదేదో ఫాతిమా కాలికి తగిలింది. ఛీ … ఛీ … అనుకుంటూ కాలు వెంటనే లాక్కుంది.

”అదేం కాదు. ఆవు పేడేలే.” కాళ్ళవైపు చూసి చెప్పాడు ఓంకార్‌.

” చూడు! ఆవు పేడ నీకు చాలా పవిత్రమై ఉండొచ్చు. నాకు మాత్రం గుర్రం పేడ ఎంత అసహ్యమైందో యిదీ అంతే” చిరాకు పడింది ఫాతిమా.

”ఫాతిమా! నువ్వు మరీ వింతగా ప్రవర్తిస్తున్నావ్‌. ఇదే రకంగా ఆలోచిస్తే ప్రతి చేష్టలోను నీకు హిందూ, ముస్లిం అన్న తేడాలే కనిపిస్తాయ్‌” చలించిపోతూ అన్నాడు ఓంకార్‌.

”చూడూ! ఇప్పుడిప్పుడే నీలో పెరుగుతున్న ఈ ఆలోచనా ధోరణి మార్చుకోకపోతే ముందు ముందు ఎటూ కదల్లేని ఊబిలో కూరుకుపోతావ్‌”… అంటూ బుజ్జగించాడు.

స్కూటర్‌ మీద యింటికి చేరుకున్నారు. శాంతమ్మ పిన్ని యింట్లోనే ఉంది. ”అబ్బాయ్‌! షిర్డీ నుండి సాయిబాబా ప్రసాదం తెచ్చాను తీసుకోండి. కోడలా! ఈ నూలు దారం చేతికి కట్టుకో” అంటూ అందించింది.

మారు మాట్లాడకుండా ఫాతిమా దాన్ని చేతికి కట్టుకుంది. ఆమె కళ్ళల్లో ఏదో భావం కదలాడింది. ఆ సాయంత్రం ఫాతిమా నమాజు చేసుకోడానికి తన తల్లి యిచ్చిన గులాబి, పచ్చరంగులు కలగలిసిన మెత్త పరిచి నమాజు పూర్తి చేసింది.

రాత్రి పడక చేరాక ఓంకార్‌ దగ్గరకు తీసుకోబోతే ఫాతిమా విసుగ్గ మొహం పక్కకు తిప్పుకుంది.

”ఫాతిమా! నువ్వు చేస్తున్నదేమిటి?” అంటూ యింకా దగ్గర చేరాడు.

దెబ్బతిన్న పక్షిలా పక్కకి జరిగింది. ఆమె ”నేనేమీ చెయ్యడం లేదు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు… ”గట్టిగ అరిచింది.

ఫాతిమా కేదో అవుతూ ఉంది. హిస్టీరియా లాంటిదేదో.. హిస్టీరియానే. ఏవో పల్చని పొరల కింద పొంచి ఉన్నట్టుంది. అంతా బావున్నపుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఏ కాస్త అలికిడైనా ఆ పొర తొలిగి లోపలి బాధ, క్రోధం తన్నుకొస్తున్నాయ్‌.

ఓంకార్‌ ఫాతిమా చేతిని చిన్నగనొక్కుతూ, ”చూడు, నేనేం చేసేది? నువ్వు ప్రతి దానిలోనూ గూఢార్థం వెదుకుతున్నావ్‌,. అన్నింటికి తొందర పడిపోతున్నావ్‌. అదే ఇది వరకైతే ప్రతి దాన్ని సరదాగా తీసుకునే వాళ్లం” అంటుంటే ఫాతిమా కళ్ళల్లో

నీళ్ళు చిప్పిల్లినయ్‌.

”ఆ రోజుల సంగతి మాట్లాడకు. అప్పటిమనం వేరే” మొహాన్ని తలగడలో దూర్చింది. ఇంకా దగ్గరగ వస్తున్న అతనిని ‘వొదులు వొదులు’ అంటూ విడిపించుకోడానికి పెసుగులాడింది. ‘ఫాతిమా నిన్నెలా వొదలగలను నన్ను అర్థం చేసుకోవేం.’

వాస్తవానికి జరుగుతున్న దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో అతనూ లేడు. మెదడు మొద్దుబారి పోయింది. నడి సముద్రంలోకి తోసేసినట్టు, చిమ్మచీకట్లో తడుముకుంటున్నట్టూ ఉంది. ఎందుకిలా జరుగుతోంది? అసలేం జరుగుతోంది? జీర్ణం చేసుకోలేక పోతున్నాడు.

ఎక్కిళ్ళు పడుతున్న ఫాతిమాని గుండెకి అదుముకున్నాడు. చుట్టూ వెన్నెల పల్చగ పరుచుకుంది. మంచం పక్క టేబుల్‌ మీద ఫాతిమా కాలేజి రోజుల నాటి ఫోటో ఒకటి మసగ్గ కనిపిస్తూ ఉంది. జీన్‌ ప్యాంటు, పైజామాలో సన్నగ ఉంది. పొడవాటి జడ, నవ్వు ముఖం, అల్లరికళ్ళు. ఆ రోజుల్లో ఫాతిమా ఎంత ధైర్యంగ తిరుగుబాటు తనంతో ఉండేది. హాస్టల్‌లో తనని చూడటాని కొచ్చిన తండ్రితో ”సంఘం, మతం పేర్లు చెప్పి మీరు నన్ను బెదిరించలేరు. ప్రపంచమంతా ఒప్పుకున్నంత మాత్రాన చెడు ఎప్పటికీ మంచి కాలేదు.” అంటూ వాదించింది.

ఓంకార్‌, ఫాతిమా యిద్దరూ కలిసి లోకాన్నెదిరించారు. తమ ప్రాణాలకి నష్టం తలపెడుతూ వచ్చిన ఆకాశరామన్న ఉత్తరాలన్నీ కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నారు, చించి పోగులేశారు.. దెబ్బమీద దెబ్బ అన్నట్టు, వ్యాసాలు టైపు చేసుకోడానికి ఆఫీసు కాగితాలు వాడుతూ అధికార దుర్వినియోగం చేస్తున్నాడన్న నెపం మీద ఓంకార్‌ని ఉద్యోగం నుండి తీసేశారు. ఈ విషయాలన్నీ ఊళ్ళో గుప్పుమన్నాయ్‌ తక్షణం ఫాతిమా తండ్రి ఆమెని గదిలో బంధించాడు. అయినా ఆమె కిటికీలో నుండి దూకి పారిపోయింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఓంకార్‌ నిట్టూర్చాడు. పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు, ఓ భయంకరమైన కథ అంతమైనట్టు అనిపిస్తుంది, కానీ అనుకోని విధంగ అంతమైందనుకున్న ఆకథ కొత్త పుంతలు తొక్కింది.

ఉదయం నిద్రనుండి లేచేసరికి నమాజు చేస్తున్న ఫాతిమా అతని కళ్ళబడింది.

అగ్గిరాముడిలా ‘ఏంటి యిదంతా?’ అంటూ నమాజు మెత్తని విసిరి కొట్టి ఫాతిమాని పట్టుకు గుంజాడు ‘ఏం చేస్తున్నావ్‌ నువ్వు ?’ పళ్ళు పట పట లాడిస్తూ ‘యిదే ఆఖరుసారి కావాలి?’

వొణుకుతున్న కంఠంతో ‘నన్నొదులు’ అంటున్న ఫాతిమా కళ్ళలోని నిశ్చలత్వానికి ఖంగుతిన్నాడు. ఫాతిమా ప్రార్థన కొనసాగించింది.

నిశ్శబ్ధంగ టిఫిన్‌ ముగించారు. ఖాళీ ప్లేట్లు తీసుకుపోబోతున్న ఆమెని, ‘కాసేపు వుండు’ అన్నాడు. ఆగడమైతే ఆగింది కానీ తలెత్తి చూడకపోయేసరికి ‘వెళ్ళిపో, నేను చెప్పదల్చుకుంది వినకముందే వినకూడదు అని నిర్ణయించుకున్నాక నీకు చెప్పేదేముంది’ హుంకరించాడు.

చీర పరపరలాడిస్తూ విసురుగ వంటింట్లోకి నడిచింది, నిజానికి ఏదీ వినడానికి ఆమె సిద్ధంగా లేదు. తన ఉనికిని తను గుర్తించుకునే పనిలో ఆమె పూర్తిగ నిమగ్నమై ఉంది. ఇక్కడ తననెవరూ గుర్తించరు, గుర్తించినట్టు కనబడరు. తనంటే ఎవరికీ ఖాతరు లేదు. తనిక్కడ ఎన్నో అవమానాల పాలౌతూ ఉంది. తనంటే ఏమిటో తనే తెలియజెయ్యాలి. ఆలోచనల్లో కొట్టుకు పోతుండగ, ‘ఫాతిమా’ అంటూ సున్నితంగ భుజాల మీద చేతులేశాడు ఓంకార్‌. ఆమార్ధవాన్ని ఆమె భరించలేక పోతోంది. ఈ అస్త్రంతోనే ఆమెని ఆకట్టుకుంటున్నాడు, దీన్నుపయోగించే అతను ఏది తలుచుకుంటే అది తనతో ఒప్పిస్తున్నాడు. ఈ మెత్తదనం తనకొద్దు. తనని గట్టిగ అరవాలి … తిట్టాలి .. కానీ

”ఫాతిమా, కాస్త ఆలోచించు. నవ్వెందుకింత అనాలోచితంగ ప్రవర్తిస్తున్నావ్‌? మనల్ని చూసి లోకమంతా వెక్కిరిస్తుంది. ఆ, మాకు యిదంతా ముందే తెలుసులే, నీళ్ళు, నూనె ఎక్కడన్నా కలుస్తాయా అంటుంది లోకం. కాస్త తెలివి తెచ్చుకో. మతాల్ని కాదని మనం ఒకరినొకరం కోరుకున్నాం. లోకం సృష్టించిన ఊబిలో మనం చిక్కుకు పోయేలా ఎందుకు చేస్తున్నావ్‌? మనల్ని హిందువుగ, ముస్లింగ విడగొట్టి చూసే అవకాశం నువ్వే కల్పిస్తున్నావ్‌ విషాన్ని మందుగ భ్రమపడుతున్నావ్‌. గోతిలో నుంచి అతికష్టమ్మీద బయటపడి మళ్ళీ అందులోనే పడాలని? ఎందుకు చూస్తావ్‌.. కట్టుబాట్ల నెదిరించే ఎందరికో మనం ఆదర్శ ప్రాయమైన సంకేతాలం”

ఫాతిమా ఎదురు వాదించింది ”అవును మనం సంకేతాలమే. నిర్జీవమైన సంకేతాలం. మూడు రంగుల జెండా మీద ఉన్న నల్లటి రాట్నం లాంటి సంకేతాలం, ఓంకార్‌, నేనూ మనిషినే, దేవతని కాదు. నన్ను అర్థం చేసుకో. నాకు నా ప్రపంచం కావాలి, మనుషులుండే ప్రపంచం. దగ్గర, దూరపు చుట్టరికాలన్నీ ఉన్న ప్రపంచం. గుప్పెడు మంది స్నేహం నాకు చాలదు. నువ్వు నిజంగ పూల్‌ వి. దగ్గర స్నేహితులు ఒకిరికొకరు సన్నిహితంగ ఉంటూ అన్ని విషయాల్లోకి జొరబడటం వీటితో నాకు ఊపిరాడకుండ ఉంది. వీటితోనే బతుకు సాగించలేం. గుండెల్నిండా ఊపిరి పీల్చుకోవాలంటే కాస్త ఎడం ఉండాలి.. నాక్కావలిసింది యిదే.

‘అంతా అని దేన్నంటున్నావ్‌? అంతా అన్నదాన్ని పొందే పద్ధతి యిదేనా?? అ ఆరాటంలో నిన్ను నువ్వు పోగొట్టుకుంటావ్‌. అంతా, అందరూ అని నువ్వు అనుకునేవన్నీ నిర్జీవమైన విషయాలు. నువ్వు దేనికో భయపడుతున్నావ్‌…’

నిజంగానే ఆమె ఎందుకో భయపడుతుంది. ఏవో అర్థంకాని విషయాలు ఆమెని బాధిస్తున్నాయి., కుళాయి నుండి చుక్క చుక్క జారిపడే నీళ్ళు, గాలికి మెల్లగా కదిలే కిటికీ, దూరాన లారీలు చేసే చప్పుడు ఆమెకు నిద్రాభంగం చేస్తాయి. ఏంటీ చప్పుడు, ఎవరు వీళ్ళంతా అని కలవరపడుతుంది. పీడకలలొస్తున్నాయ్‌. బయటి కెళ్ళేపని మీద ఉన్న అమ్మ దగ్గరికి చప్పున పరిగెడుతుంది. ప్రశాంతంగ ఉన్న అమ్మ మొహంలోకి చూస్తూ ఏవేవో మాట్లాడాలి, ఆమె చెప్పేది వినాలి అనుకుంటుంది గానీ అమ్మకి మాట్లాడే తీరికుండదు. నిరాశ నిస్పృహలతో పిచ్చి పట్టి నట్టౌతుంది ఫాతిమాకి. ఉలిక్కి పడిలేస్తుంది. అందంగ, సున్నితంగ ఉన్న ఆమె ముఖం భయాందోళనలతో వికారంగ తయారౌతుంది.. మొద్దుబారి పోయి కుర్చీలో చతికిలబడింది ఆమె.

ఆమె ధైర్యమంతా చెల్లాచెదురై పోయింది. తను చేసిన దానికి ఫలితం తెలుసుకోవాలన్న కోరిక ఆమెలో లేదు. ఆదర్శాలంటూ చేసిన పోరాటం చాలు. ఆఖరికి యిప్పుడు తలెత్తి నిటారుగ చూసే ధైర్యం కూడా తనలో లేనట్టు తోస్తుంది ఆమెకి. మొక్క పెరగడానికి నేల, నీరు, గాలి కావాలి. తనేమో వాడిపోయిన స్థితిలో ఉంది. తనంత బేలగ ఉండకూడదంటాడు ఓంకార్‌. సమాజాన్నెదిరించిన వాళ్ళకి దొరికేది బీడుపడ్డ భూమే. దానిలోనే నిలదొక్కుకో గలగాలి. లేదంటే ఏమానుకో, గోడకో వేలాడే తీగలవడానికి సిద్ధంగ ఉండాలంటాడు.

ఉత్తుత్తి మాటలు యికచాలు. ఆలోచనలు కందిరీగ పుట్టలా రొద చేస్తున్నాయ్‌. ఈ బలహీనత యిక భరించలేదు. ప్రస్తుతం తనకి కావల్సింది తనకంటూ ఒక ప్రత్యేక స్థలం, తన ఆస్థిత్వానికో గుర్తింపు ఆమె తన మనుషుల కోసం అలమటించిపోతూ ఉంది.

ఎవరో బెల్‌ కొట్టారు. తలెత్తి చూస్తే ఎదురుగ శాంతమ్మ పిన్ని. ప్రతి సోమవారం అమ్మపేరు మీద పూజ చేయడాని కొస్తుందామె.

అమ్మ వీళ్ళనుంచి రెండేళ్ళు మాత్రం దూరంగా ఉండ గలిగింది. ఏ తల్లి తన కొడుకుని శాశ్వతంగా ఒదులుకుంటుంది. మెల్లగ అమ్మ, ఆమెతో పాటు శాంతమ్మ పిన్ని వీళ్ళయింటికి రావడం మొదలు పెట్టారు. ఫాతిమా అంటే అమ్మ చాలా యిష్టపడ సాగింది.

అపుడపుడు శాంతమ్మ పిన్ని అమ్మతో, ”నీ కోడలికి మంచి కంఠం ఉంది. నేనసలు గొంతుని బట్టి హిందువుకి ముస్లింకి తేడా యిట్టే పట్టేయగలను” అంటుంది.

” నా కోడలు ఏ రకంగానూ ముస్లింకాదు” ఫాతిమా బుగ్గలు నిమురుతూ జవాబిస్తుంది అమ్మ.

”గొంతులో ఏం విచిత్రం ఉంది”? ఫాతిమా ఆశ్చర్యపోయింది.

”ముస్లిం ఆడవాళ్ళవన్నీ బొంగురు గొంతులు మగవాళ్ళలాగ. ఆతోట మనిషి గొంతు విననేలేదా?” చేతులు తిప్పుతూ అంది పిన్ని.

”కంఠం సంగతి వొదిలేయ్‌. హిందూ మగవాళ్ళు అచ్చు ఆడవాళ్ళలా సన్నగ, బలహీనంగ ఉంటారు కదూ”

విసురుగ సమాధాన మిచ్చింది ఫాతిమా.

ఇలాంటి విషయాలన్ని చెప్పుకుని ఓంకార్‌, ఫాతిమా ఫ్రెండ్స్‌తో కలిసి ఆనందించేవాళ్ళు. లోకం పోకడ చూసి వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు. ఓంకార్‌ తండ్రి ఉద్దేశంలో ఎవరికైనా ఒక పాము, ఒక ముస్లిం ఒకేసారి ఎదురుపడితే ముందా ముస్లింని చంపి, ఆ తర్వాత పాముని మట్టు బెట్టాలి. కాబూలీ వాలా గుండెల మీదెక్కి తొక్కుతూ కూడా, ఎక్కడ వొదిలితే అతను తనని చంపేస్తాడేమో అని గగ్గోలు పెట్టే కోమట్నే సమర్థిస్తాడు ఓంకార్‌ కూడా.

”ఏయ్‌, తురక పిల్లా యిటురా నీ దగ్గర ఎలాంటి వాసనేస్తుందో చూద్దాం. నీళ్ళు మీకు బద్ధ శత్రువు గదా” అంటూ ఆడపాదడపా ఓంకార్‌ ఏడిపిస్తుంటాడు. ఫాతిమా కూడా తగినట్టే జవాబిస్తుంది. ‘ఛాల్లేపో! రెండు చుక్కలు నీళ్ళు చిలకరించుకునే, నువ్వు శుచి, శుభ్రం గురించి పాటపాడుతున్నావ్‌. మోసపు భక్తి!.

” పోనీలే వొదినా ఈ ఎండకి నీలాంటి వాళ్ళూ స్నానం చెయ్యక తప్పదుగానీ క్రూర మృగాల దగ్గర వచ్చే కంపు సంగతేంటి” అంటూ శృతి కలుపుతారు మిత్రబృందం.

నవ్వుకుంటూనే, మన ఆవు దగ్గర ఎప్పుడైనా చెడ్డ వాసనొస్తుందా? ఊహు. కానీ పులుల దగ్గర, ముస్లింల దగ్గర మాత్రం వస్తుంది. వాదం కొనసాగిస్తారు.

‘మరి గుర్రాలో? చప్పట్లు చరుస్తూ నవ్వుతుంది ఫాతిమా.

వాళ్ళంతా ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. మనుషుల పోకడ చూసి నవ్వుకుంటూ ఒకోసారి ఆశ్చర్య పోయి వింతగ చూస్తూ ఉంటారు. జనం ఎలాంటి గాలి వార్తల్ని మోసుకు పోతుంటారో గదా…..

శాంతమ్మ పిన్ని తేనె పూసిన కత్తిలా మాట్లాడుతుంది. ఆమెనెలా ఐనా సరిదిద్దాలి. అమ్మ అలా ఎప్పుడూ మాట్లాడేది కాదు. తనెప్పుడైతే ఆయింటి కోడలైందో అప్పటినుంచీ ప్రేమగ చూసేది.

అకస్మాత్తుగ అమ్మ చనిపోయింది. దాంతో ఓంకార్‌ అల్లాడి పోయాడు. ఆమెని తలుచుకుని చంటి పిల్లాడిలా ఏడ్చేవాడు.. ఫాతిమా కూడా చాలా బాధపడింది. ఆమెకి తన తల్లిదండ్రులు గుర్తొస్తుంటారు. వాళ్ళంతా ఎట్లా ఉన్నారో ఏమో. అడపాదడపా బంధువుల్లో ఎవరికో పెళ్ళైందని, వేరే ఏ చుట్టానికో కంటి ఆపరేషను అయ్యిందని వార్తలందుతూ ఉండేవి. ఫాతిమా తనవాళ్ళ నుంచి పూర్తిగ దూరమై పోయింది.

ఓంకార్‌ వాళ్ళమ్మ ఫోటో ఒకటి ఫ్రేమ్‌ కట్టించి పెట్డాడు. శాంతమ్మ పిన్ని దానికిందే అమ్మ ఆరాధ్య దేవుడైన శివుడి బొమ్మ ఉంచి ఆపక్కకి రాగానే చేతులు జోడించేది. అది క్రమంగా పూజగదైపోయింది. శివుడి ఫోటోతో పాటే పార్వతి, వినాయకుడు శివలింగం కూడా వెలిశాయక్కడ.

ఈ పూజ అమ్మ జ్ఞాపకాలతో, ముడిపడి ఉంటంతో ఓంకార్‌ ఎప్పుడూ అభ్యంతర పెట్టక పోగా ఫాతిమాతో కలిసి హారతి అందుకునే వాడు. ఆగదిలో కొచ్చేపుడు కాళ్ళకి చెప్పులుంచు కోరెవరూ.

పిన్ని ఎక్కువ రోజులు కనబడపోతే ఓంకార్‌కి బావుండదు.

”పిన్ని రాలేదు, పూజపూలు నేను మార్చనా? అందొకసారి ఫాతిమా.

ఓంకార్‌ కాసేపాలో చించి, ”సరే, అమ్మకి నచ్చుతుందిలే కానియ్‌” అన్నాడు.

ఫాతిమా వెంటనే స్నానం చేసి, పిన్నిలాగే తలమీద ముసుగేసుకుని మల్లెలు, గులాబీలు ఆకుమీద పెట్టి కడిగింది. కాసిన్ని బిల్వపత్రాలు శివుడికోసం సిద్ధం చేసింది. శివలింగాన్ని పాలతో అభిషేకించి, దీపమెలిగించి అమ్మని, తన తల్లి దండ్రుల్ని గుర్తు చేసుకుంది.

పిన్ని వచ్చి ఫాతిమా పూజ చేస్తున్నట్టు తెలుసుకుని ప్రతి సోమవారం మర్చి పోకుండ రాసాగింది.

‘కోడలా! చేతికి దారం ఉంచుకున్నావ్‌ గదా తీసెయ్యకు నీకు మంచి బిడ్డ పుడుతుంది’ పిన్ని అందో రోజు.

”పిన్ని! పిల్లలు మనం కావాలనుకుంటే పుడతారు గానీ ఆ దారం ఉన్నందువల్ల కాదు’

”ఔనౌను! అంతేలే” పిన్ని సమాధానం.

బ్యాంక్‌కి బయలుదేరింది ఫాతిమా. రోడ్ల మీద ఒకటే జనం. ఒకరి కాళ్ళల్లోకి ఒకళ్ళు దూరిపోతున్నంత హడావుడి. ఆ జనాన్ని చూస్తే ఫాతిమాకి తత్తరపాటు, కంగారు. తెలిసిన వాళ్ళు కనబడినా ఒకోసారి గుర్తు పట్టదు, గుర్తుపట్టినా ఏదో కంగారుగ పలకరిస్తుంది.. ఇది చూసి ఓంకార్‌ విసుక్కుంటాడు ”జనంతో మాట్లాడక పోతే, రాచకుటుంబంలో పుట్టి నందుకు నీకు గర్వమనుకుంటారు” అంటాడు.

”అలా ఐతే నన్నెక్కడికీ తీసుకెళ్ళకు”

సాధారణంగా ఓంకార్‌ ఒక్కడే బయటికెళ్తుంటాడు. ఒకసారి బాలయ్య అన్న మాటలు ఒంకార్‌కి చేరాయి. ”మనబ్బాయి పుట్టిన రోజుకి పిలిస్తే ఆమహారాణి రానేలేదు. పుట్టిన రోజు వంకతో దుర్గపూజకి పిల్చామనుకుంది. బాషావాళ్ళు ఆవుల్ని చంపుతారని తెల్సినా వాళ్ళింటికి మనమెన్ని సార్లు వెళ్ళలేదు. ఎంతైనా ముస్లింలు ముస్లింలే”.

లోకమెట్లా మాట్లాడుతుందో ఫాతిమాకి, ఓంకార్‌కి బాగా తెలుసు వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకో బోతున్నట్లు తెలియగానే జనమంతా దేవుళ్ళ రాయబారుల్లా మారిపోయారు.

”అంతమంచి కుర్రాడు నాశనమై పోతుంటే చేతులు ముడుచుకు ఎట్లా కూచుంటాం?”

”ఆ రాక్షసి నిఖాకి తప్ప లొంగిరాదు”

”మన పిల్లని ఎత్తుకు పోడానికి వాడికెన్ని గుండెలు? వాడి అంతుచూద్దాం”

అమ్మ చావుకూడా కారుకూతలకి ఒక సందర్భమైంది.

”వాళ్ళు నిఖాచేసుకున్నారు. ఆ అబ్బాయి మతం ఒదులుకున్నాడు. దాంతో పెద్దావిడ ఏడ్చి, ఏడ్చి చావు తెచ్చుకుంది”

బ్యాంకు పని ముగించుకుని యిల్లు చేరింది ఫాతిమా. ఆ సాయంత్రం యింటికి త్వరగ వచ్చి పార్క్‌ కెళ్దామన్నాడు ఓంకార్‌. పార్క్‌లో చెట్టునానుకుని కూచున్నారిద్దరూ. గడ్డిపోచ పట్టుకుని ఆడుతున్న ఫాతిమా ఉన్న పాటున దాన్ని విదిలించి ఉలిక్కిపడి, ఓంకార్‌ పలకరించగానే పెద్ద పెట్టున నవ్వి అంతలోనే ఏడుపు మొదలెట్టింది.

‘ఓంకార్‌! నాకెందుకో ఏమీ బావుండలేదు. అసలేమి బాగుండటం లేదు ఎందుకో’

‘ఏం జరిగింది. నువ్వు సంతోషంగ ఉండు. అంతా బాగానే ఉంది. ఈ మధ్య మీ అమ్మ వాళ్ళని కూడా చూసోస్తున్నావుగదా”

తండ్రికి బావుండలేదని, హాస్పిటల్లో చేర్చారని టెలిగ్రాం రాగానే ఆఘమేఘాల మీద ఊరెళ్ళింది. పెళ్ళైన తర్వాత మొదటి సారిగ. తండ్రి బాగానే కోలుకున్నాడు. తిరిగి వెళ్ళేలోపు మొహరం రోజులు మొదలైనయ్‌. అయ్యేవరకు ఉండాలి. మధ్యలో వెళ్తే బావుండదు. ఆ విషయమే ఓంకార్‌కి ఉత్తరం రాసింది.

తిరిగి యింటి కెళ్ళాక ఓంకార్‌తో పెద్దగొడవే అయ్యింది. అతను మండిపడుతున్నాడు. ”మతం కోరల్లో చిక్కుకో కూడదని మనం గట్టిగ అనుకున్నాం గదా మతాన్ని పాటించ గూడదనుకున్నాం గదా. నువ్వు మన అగ్రిమెంట్‌ మీరుతున్నావ్‌.”

ఫాతిమా ఆశ్చర్యపోయింది ”ఓంకార్‌ అలా ఎలా మాట్లాడ గలుగుతున్నావ్‌? నాన్నకి బాగలేదు, అమ్మకి తోడుగా నాలుగు రోజులున్నాను. ఆమెతో కలిసి ప్రార్థనలు చేసినందువల్ల ఆమె కాస్త ఊరట పొందింది. అంతే తప్ప నేను ఏ అగ్రిమెంటూ అతిక్రమించ లేదు.

”శబాష్‌! నువ్వు ఉపవాసాలు చేస్తావ్‌. మతంలో కలిసి పోతావ్‌. మళ్ళీ ఏమీ ఎరుగనట్టు అమాయకంగ నేనేం చేశానంటున్నావ్‌. మనం నిఖాకూడా చేసుకున్నట్టైతె మీ అమ్మ యింకా సంతోషించి ఉండేదిగా”, కోపంతో ఎర్రబారిపోతూ అన్నాడు.

నిశ్చలంగా ఆలోచించి కాసేపాగి అంది ‘నిజమే అందులో తప్పేమీ లేదు. నిఖా చేసుకుంటే మనకేమీ ఒరగకపోయినా అమ్మా నాన్నాకి పరుపు దక్కేది. మనతో రాక పోకలు సాగించి ఉండేవాళ్ళు. నేను వాళ్ళకి దూరమై ఉండే దాన్ని కాదు. మీ హిందుత్వం వల్లే నేను నా తమ్ముడి పెళ్ళికి కూడా వెళ్ళలేక పోయాను”

ఓంకార్‌ దిమ్మ దిరిగి పోయాడు ”రెండు రోజులు ఆ వాతావరణంలో ఉన్నావో లేదో నీ మతి చెడిపోయింది. నిఖా ఒక్కటేనా నేను వద్దంది. గుళ్ళో, చర్చిలో, మసీదులో చేసే అన్ని సాంప్రదాయాలని నేను వొద్దన లేదా?”

”చాలా గొప్పగా చెప్పావ్‌ లే. మనిద్దరి విషయంలో గుళ్ళూ గోపురాల కొచ్చిన నష్టమేముంది? మన సొసైటీలో ఆడపిల్లే అన్ని అవమానాలకి గురయ్యేది. నష్టాల పాలయ్యేది. నీ హిందూమతం లాగే మగవాడు కూడా అన్నీ తనలోకి లాక్కుని దూర దూరాలకి విస్తరించి పోతాడు. తన నీడలో అందర్నీ సేదదీరుస్తుంటాడు. లేదంటే సర్వనాశనం చేస్తాడు. కానీ విచిత్రమేమంటే అట్లా వ్యాపించి పోతున్న విషయం నీకే తెలియదు. ఆ నీడ నుంచి ఎవరన్నా కాస్త ఎడంగ ఉండదలుచుకుంటే చాలు, నీకు పిచ్చికోపమొస్తుంది. దానిలోనూ వాటా కోసం బయలు దేరతావ్‌. నన్ను పిచ్చదానిగ జమ కట్టకు. నువ్వేమి మారిపోయావ్‌, ఏమి నష్టపోయావ్‌?”

ఓంకార్‌ కొట్టడానికి విసురుగ చెయ్యెత్తాడు. ”ఇలాంటి వాదనలు మొదలు పెట్టావా? నిన్ను ఎత్తుకొచ్చానని నా మీద నెపమేస్తున్నావా? మనం చేసుకున్న ఒప్పందంలో నీ ప్రమేయాన్ని ఓప్పుకోడానికి నువ్వు భయపడుతున్నావ్‌”

”ఒప్పందమా? అసలు నువ్వు నాకు ఏదన్నా అవకాశమిచ్చావా? వస్తేరా లేకపోతే పో. పోపో ఏదన్నా చావు. వదిలి పెట్టడం అంత తేలికా”? ఏడుస్తూ అంది.

”ఫాతిమా మన గతాన్ని అట్లా వక్రీకరించకు. మన గతంలో విపరీతార్థాలు వెతక్కు. మన ప్రేమని కలుషితం చెయ్యకు.”

పార్క్‌లో కూచుని గతం గురించిన నిజా నిజాల్లో చిక్కుకు పోయారిద్దరూ.

”ఇప్పుడేం మునిగిపోయింది? ఇక నుంచి ప్రతిసారి మీ వాళ్ళతో మొహరం జరుపుకోడానికి ప్రార్థన చెయ్యడానికి వెళ్తావుగ” ఒళ్ళోకి లాక్కుంటూ అన్నాడు ఓంకార్‌.

”వెళ్ళడం మాత్రమేగా. వాళ్ళతో నా సంబంధాలు నిలబెట్టుకోగలిగానా? నా వాళ్ళకి నేనేదన్నా యివ్వగలిగానా? ఓంకార్‌, నే నీ సంఘంతో పోరాడాను. అది నన్ను వెలివేయవచ్చు, బహిష్కరించవచ్చు. దాన్ని నేను భరిస్తాను కానీ నా తల్లి దండ్రుల నుంచి దూరం కావడం … కన్నీళ్ళతో అంది ఫాతిమా

ఓంకార్‌ ఆలోచనలో పడ్డాడు అమ్మా నాన్నలు లేని సమాజమేదన్నా ఉందా? అది ఎలాంటిది?

”ఫాతిమా మన మెవర్నీ నిందించలేం. జగదీష్‌ మామయ్య చెప్పింది ఒకసారి గుర్తు చేసుకో” స్థిరంగ పలికాడు.

జగదీష్‌ మామయ్య ఫాతిమాకి ఇంగ్లీష్‌ నేర్పించేవాడు. వీళ్ళ పెళ్ళికి హాజరైన ఒకే ఒక పెద్దాయన. ఆయన, పెళ్ళికి ముందే వీళ్ళతో అన్నీ వివరంగా చెప్పాడు. చూడండి మీరు మన సంఘానికున్న బలాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. అది మీ మీద ఉమ్మేసి నిందించినా ఆశ్చర్య పోనక్కర లేదు. ఎదురు నిలబడే ధైర్యం లేకపోతే మీ నిర్ణయం మార్చుకోండి బయటికి దాచుకున్నా లోలోపల ఈ ఒత్తిళ్ళు మిమ్మల్ని బాధిస్తాయి. తట్టుకోగలిగే ధైర్యముంటే ముందడుగెయ్యండి. మేమంతా మీతో ఉన్నాం. కృత్రిమమైన వ్యత్యాసాలు కేవలం మీలాంటి పిల్లలే తుడిచేయగలరు. కానీ ఒక్క విషయం, మీరు తల పెట్టిన పనిలో ఎన్నో నష్టపోవాల్సి ఉంటుంది, పేరు, అయిన వాళ్ళు, వంశం యింకా అన్నీ. దాన్ని తలుచుకుని బాధపడకూడదు.

”ఫాతిమా! నువ్వు సంఘాన్నెదిరించి యిప్పుడెందుకు బాధపడుతున్నావు? చేతుల్లోకి లాక్కుంటూ అన్నాడు.

”దీనివల్ల నీకొచ్చిన కష్టమేముంది. మీ అమ్మ, చుట్టాలు, నీ వాళ్ళంతా నీతోనే ఉన్నారు. నువ్వు నువ్వుగానే మిగిలావ్‌” చేతులు తొలిగించుకుంటూ అంది.

”మీ అమ్మ నువ్వు ఆలా చెయ్యాలని కోరుకున్నా నిన్ను అంగీకరించలేక పోయింది. అది ఆమె బలహీనత. మధ్యలో మా అమ్మనెందుకు ఆడిపోసుకుంటావ్‌” చిరాకుపడ్డాడు.

”అది నీకర్ధం కాదులే నువ్వో మగాడివి హిందువువి నీకు భయపడవలసిన అవసరమేముంది” నిస్పృహగ అంది.

”ఒహ్‌! సరే కానీ, అట్లానే మాట్లాడు. సంఘం తయారు చేసిన పనికి మాలిన చట్టాలు, నియమాలు ఉల్లంఘించి మళ్ళీ వాటితోనే మనల్ని మనం ఎందుకు కొలుచుకోవాలి? ఆడ మగ, హిందూ ముస్లిం, అని ఎందుకు మాట్లాడతావ్‌”

”అట్లా చెప్పడం చాలా తేలికే. నువ్వు అన్నిట్నీ దాటి పోయావ్‌. అతీతంగ మారి పోయావ్‌. అట్లా చెయ్యగలిగే అవకాశం నీకెప్పుడూ ఉంది. ప్రతి అడుగులో సంఘం వేస్తున్న బాణాలకి గురౌతుంది నేనే. నువ్వంటే నోరుమూసుకుండే పనిమనిషి క్కూడా నేను లోకువే. చాకలి కూడా చెప్పేపని కావాలని నిర్లక్ష్యం చేస్తాడు. నీ ఫ్రెండు వాళ్ళావిడ నీతో మాత్రం ఎప్పట్లానే మాట్లాడుతుంది. నన్ను కనీసం పలకరించదు. ఆమెనెవరూ నిలదియ్యరే, మనం చేసిన పని ఒకవేళ ఆమెకి నచ్చకపోతే అది నా పట్ల మాత్రమే ప్రదర్శించాలా? చూస్తుంటే యిదంతా నావల్లే జరిగినట్టు, నువ్వు చాలా అమాయకుడివి పవిత్రమైన వాడివిలా ఉంది” వెక్కిళ్ళు పడసాగింది ఫాతిమా. ”దాన్ని మర్చిపో ఫాతిమా. మనం యితరుల నుంచి ఎప్పుడూ ఏదీ ఆశించలేదు. వాళ్ళ క్రూరత్వం. సంకుచితత్వం మనం ప్రతిసారీ తెలుసుకుంటూనే ఉన్నాం. అవన్నీ మర్చిపో. ఈ చిల్లర తగువులతో నిన్ను నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటావ్‌”? కేకలేశాడు.

”కానీ నాకిప్పుడే అర్థమౌతూంది. ఈ చిన్న చిన్న తగువులే అసలైనవి. ఎక్కువ బాధించేవి. పెద్ద పెద్ద గొడవలు పడటం తేలికే. గర్వంతో పోరాడుతాం. వాటి నెదిరిస్తూ చావడానిక్కూడా సిద్ధపడతాం. తెల్ల చీమలు ఒకదాన్నొకటి మింగేసి డొల్ల చేసినట్టు చిన్న చిన్న తగువులూ అశాంతిని సృష్టిస్తాయి. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పెద్ద పెద్ద పోరాటాలతో ఈ చిల్లర తగువులకి సంబంధమే ఉన్నట్టు తోచదు. పెద్ద సంఘర్షణనీది. దాన్ని నీవు పోరాడుతావు. ఆ పెద్ద పోరాటం తర్వాత పొందే పెద్ద గెలుపుని నువ్వు ఆనందించగలవు. పెద్ద సంఘర్షణల్లో ఓటమికూడా గర్వించదగిందే. కానీ నేను… ఈ చిన్న చిన్న తగువులు … పెద్దవాటి జోలికి పోయే సమయాన్ని నాకివ్వవు”

”ఇది మన ఓటమే ఫాతిమా, మనం ఓడిపోడానికి తగ్గ కారణమే కనబడదు నువ్వు… నువ్వు” .. . తడబడ్డాడు.

”ఇంక నాకేమీ తెలుసుకోవాలని లేదు ఇక్కడితో ఆపెయ్‌”

ఓంకార్‌ గుండె ఘోషించింది. ”ఫాతిమా నువ్వు మునిగిపోతున్నావ్‌ మనిద్దరం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతాం. మన బలహీనతలతో అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. నిర్దయులు మనల్ని చూసి చాలా ఆనందిస్తారు. వాళ్ళ సిద్ధాంతాల నెదిరిస్తే ఏమౌతుందో ఉదాహరణగ మనల్ని చూపిస్తారు.”

ఏదో రకంగా దీన్ని తప్పుకోవాలంటే – జగదీష్‌ మామయ్య . . ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి? సిటీ నుంచి పారిపోవాలా? కొనాళ్ళు ఎక్కడన్నా విశ్రాంతి తీసుకుందామా? ఊటీ కెళ్తే? రెండో హనీమూన్‌ లాగ..?

వాళ్ళు యింతకు ముందు ఊటీ ప్రయాణమై పోయినపుడు ముల్లాని చూసి భయపడిపోతున్న లావాటావిడిని చూశారు. రైల్వే వాళ్ళు లేడిస్‌ కంపార్ట్‌మెంట్‌ని జనరల్‌ కంపార్ట్‌మెంట్‌గా మార్చారు. దానిలోనే ఓంకార్‌, ఫాతిమా ప్రయాణం చేసేది. ఓంకార్‌ యింకా ఫ్లాట్‌ ఫారమ్‌ మీదే ఉన్నాడు. ఫాతిమా సామాన్లు పెట్టుకుని లోపల కూచుంది. ఆమె ముందు నిండుగ నగలలంకరించుకున్న లావుపాటి ఆవిడ, ముల్లా ఆయన శిష్యులు కంపార్ట్‌మెంట్‌లోకి రావటం చూస్తూ, ”స్త్రీలారా స్త్రీలారా” అని గట్టిగ అరిచింది. ఫాతిమా పరిస్థితి వివరించే సరికి ఆమె మొహం ముడుచుకుంది. ముల్లా వాళ్ళు సామాను పెట్టి బయటికి పోగానే, అమ్మాయీ, యిది చాలా ప్రమాదకరమైన వ్యవహారం” గుసగుసలాడిందావిడ.

”అదేమీకాదు ఇక్కడ ఎంతో మంది మనుషులున్నారు దేనికి భయపడుతారు?” ఫాతిమా ధైర్యం చెప్పింది.

”అది కాదమ్మా! వీళ్ళంతా ముస్లింలు” చుట్టూ భయంగ చూస్తూ, మధ్య మధ్యలో ఊపిరి తీసుకుంటూ వాళ్లచేసే క్రూరమైన పనులు చెప్పడం మొదలేసింది. దానికెక్కడా అంతులేదు.

”నాకూ తెలుసు నేను ముస్లింనే” ఇది విని లావాటావిడ కొయ్యబారి పోయుండాలి. తెల్లారి చలికి ముడుచుకు పడుకున్న ఫాతిమాని చూసి పై బెర్త్‌ మీద పడుకున్న 14ఏళ్ళ ముల్లా కొడుకు కిందికి దిగి ”అక్కా! ఈ శాలువ కప్పుకో నాకు రెండు ఉన్నాయ్‌లే” అన్నాడు. లావాటావిడ నిలువు గుడ్లేసుకు చూసింది.

ఆలోచనల్లోంచి బయటపడి, రాయింటికి పోదాం’ ఫాతిమా చెయ్య పట్టుకుంటూ అన్నాడు ఓంకార్‌ ఆమె కళ్ళలోని దిగులు పసిగట్టాడతను.

”ఫాతిమా, నేను కొన్నాళ్ళు సెలవ్‌ పెడతాను మనమెక్కడి కన్న పోదాం. ఊటీ కెళ్దాం. ఫాతిమా నువ్వు మళ్ళీ సంతోషంగా, పచ్చగ కళకళ్ళాతుండగ చూడాలని ఉంది. …”

ఓంకార్‌ మేనకోడలు పెళ్ళిలో ఫాతిమా ఆకుపచ్చ చీర కట్టుకుంది ”ఈ తురక రంగు ఎక్కడ దొరికింది నీకు” చాలా అనాలోచితంగ అనేశాడు.

”ఓంకార్‌ కాస్త ఆపుతావా” అవమానంతో ఫాతిమా పెదాలు ఒణుకుతున్నాయ్‌. తనన్న దానిలో వెటకారం ఏమీ లేదని చెప్పాలనుకున్నాడు. ఈ చేష్టలు, మాటలు అతనికి తెలియకుండానే అతనిలో చోటు చేసుకున్నయ్‌. చాలా సహజంగా అతని నోట్లోంచి వస్తుంటయ్‌ ‘తురక పచ్చ’తో ఓంకార్‌ గాయపడ్డ ఫాతిమా హృదయాన్ని పచ్చగ చెయ్యాలనుకున్నాడు.

”కాస్త చిన్న నవ్వు నవ్వు”

ఫాతిమా కళ్ళు ముడుచుకుపోయాయి. ఆ ముళ్ళు విప్పాలని చూసినా, పోనీ అని వొదిలేసినా ఫలిత మొకటే – అవి తెగిపోవడమేనని గుర్తించాడు అతను.

నమాజు వేళ్తెంది. ఫాతిమా లోనికెళ్ళింది. ఓంకార్‌ తన్ను తాను సంభాళించు కోలేక పోయాడు. ముందుకురికి ఆమెని పట్టుకుగుంజాడు.

”నువ్వు మళ్ళీ మతమనే రొంపిలో దిగినా నన్ను నోరుమూసుకు చూస్తుండమంటావా చెప్పు”

ఫాతిమా సిద్ధంగా ఉంది ”మరినీ మాటేంటి? దీపారాధన చేస్తూ ఉంటావా?”

”నేనా? నేను వెలిగించానా? నిజాన్ని అబద్దాన్ని గ్రహించే శక్తి పోయిందా నీకు? అంటే, దేవుళ్ళ పేరు ఎత్తొద్దని యింటికొచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తూ కూచోవాలా? ”చెప్పొద్దు. ఎవరికీ అలాంటి మాట చెప్పొద్దు. నాక్కూడా చెప్పడం మానెయ్‌” చేష్టలుడిగి చూస్తున్నాడు ఓంకార్‌.

నమాజు మెత్త మడిచి పెట్టి ఫాతిమా బయటికెళ్ళింది. పరిగెడుతున్నంత స్పీడుగ నడుస్తుంది కానీ ఆ పరుగు ఏదో తొందర పని చెయ్యడానికో, ట్రైను టైమైపోతే అందుకోడానికో, ఎవరినుంచన్నా పారిపోడానికో మాత్రం కాదు. భయపడి .. . భీతిల్లి … తనలో చెలరేగుతున్న తుఫాను ఎవరికీ తెలియకూడదన్నంతగా మొహం బిగించింది. తాడుతో గట్టిగ బిగించి కట్టిన వస్తువులా యింకా యింకా బిగుసుకుపోతూ ఆమె మొహం ఆకారాన్ని కోల్పోయింది.

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.