చిన్ని చిన్ని సంతోషాలు – రమాసుందరి బత్తుల

స్థిర విపరీతమైన ఉక్కతీత. వర్షం సరిగ్గా కురవకుండా ఆగిపోయినట్లుంది. వళ్ళంతా బంక బంకగా తగులుతుంది. బుర్ర నిండా నల్ల తుమ్మల్లాగా అరాచకంగా పెనవేసుకొంటున్న పొంతనలేని ఆలోచనలు.

నన్ను ఇంత అల్లకల్లోలం చేసిన ఆ పిల్లాడి పేరు లక్కీ. నిండా ఆరేళ్ళులేని బుడతడు.

నాకీ రోజు అందరిలాగా తెల్లారింది. ఫిల్టర్‌ కాఫీ ఘుమఘుమలు, దినపత్రిక మడతల్లో నుండి కమ్మిన సాహిత్య పేజీ వాసనల ఆస్వాదన మామూలుగానే జరిగింది.

వాడు ఎప్పటి లాగే వాళ్ళ అమ్మ వెనకాలే వడ్డిపాలెం నుండి నడుచుకొని వచ్చి, బయటే చెప్పులు విప్పి నా దగ్గరకు పరిగెట్టుకొచ్చి ”అంటీ.. మరే.. మరే .. మా అమ్మ ఈ రోజు ఆలస్యంగా లేచింది. మరే.. మరే.. నేనే ముందు లేచా..” అంటూ అప్రస్తుత ప్రసంగం చేసినపుడు కూడా కోపం రాలేదు. వాళ్ళమ్మ కొడుకు మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ నేరుగా వంట గదిలోకి వెళ్ళి నాకు దోశలు వేసుకొని వచ్చింది. ఆ పిల్ల గొడుగు తీసుకొని బయలుదేరటం చూసి అప్పుడు నాకు కోపం మొదలయ్యింది.

”ఎక్కడకు ఈ వర్షంలో?”

‘లక్కి బయటకు వెళ్ళాడు. వర్షం రాగానే బయటకు పరుగెత్తాడు. పోయిన వారమే కదా వర్షంలో తడిచి జ్వరం వచ్చింది’.

పోయిన వారమంత వాళ్ళమ్మ రాత్రిళ్ళు నిద్ర లేకుండా కూర్చుంది. లంబాడీ డొంకలో పిల్లల డాక్టర్‌ దగ్గరకు ఆటోలో తీసుకెళ్ళి గంటలు గంటలు పడిగాపులు పడి మందులు రాయించి తెచ్చుకొన్నది. నాలుగు రోజుల తరువాత రక్త పరీక్ష చేయించమంటే గవర్మెంట్‌ ఆసుపత్రికి వెళ్ళి క్యూలో నిల్చోని డెంగ్యూ పరీక్ష చేయించుకొచ్చింది. వాడికి తగ్గి అన్నం తినే వేళకు ఈమెకు కళ్ళు గుంటలు పడి, ముఖం వాడి పోయి వేలాడి పడి పోయింది. అదంతా గుర్తుకు వచ్చి కదూ నాకంత కోపం వచ్చింది. ఎంత కోపం వస్తే మాత్రం ఎలా కొట్ట గలిగాను? ఆ దృశ్యం చేదుగా యాదికొచ్చింది.

”ఇట్రారా” వర్షంలో తడిచి, వాళ్ళ అమ్మ కంటే ముందు ఇంట్లోకి గెంతుకొంటూ వస్తున్న వాడిని పిలిచాను. ఎంత సంతోషంగా వచ్చాడు నా దగ్గరకు. నేనెప్పుడు పిలవనుగా వాడిని. ఏదైనా చాక్లెట్‌ తెస్తే వాళ్ళమ్మకే ఇచ్చి ”వాడు అన్నం తిన్న తరువాత ఇవ్వు.” అని చెబుతాను. వాడు ఏదైనా చెప్పాలని వస్తే ”ఊ,ఊ. . .” అంటూ ఊకొడతానే కానీ ఎక్కవ స్పందించను. వాడి చదువులో వాళ్ళమ్మకు అర్థం కాని విషయం కోసం నా దగ్గరికి పంపిస్తే అంత వరకు చెప్పి ఊరుకుంటాను కాని వాడి చదువు గురించి పట్టించుకోను.

అంత సంతోషంగా వచ్చిన పిల్లాడ్ని చెవ్వు పట్టుకోగానే బిక్క చచ్చిపోయాడు. చెంప మీద కొట్టగానే .. . గట్టిగా కొట్టానా? లేదే? చిన్నగానే కదా కొట్టాను. కానీ ఎలా చుశాడు వాడు? బిత్తరపోయి… నోటి మాట రాక .. చిగురాకులాగా వణికిపోయి… చేతులు ఊడిగి పోయి.. ఆ కళ్ళు ఎంత భయంతో ఇంకా చెప్పాలంటే నిరుత్సాహంతో చూశాయి నా వంక!

కొట్టి నా గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఏది ఏడుపు వినబడదే? వాళ్ళమ్మ స్కేల్‌ పట్టుకోగానే వినబడే శోకాలు, అరుపులు ఏవి? పోనీ, వాళ్ళమ్మ చదవలేదని వీరబాదుడు బాదుతుంటే వాడు నవ్వే కిలకిలలు ఏవి? నేను కొట్టగానే ఖిన్నురాలైన వాళ్ళమ్మ మారు మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఎందుకు? పెట్టిన చెయ్యి కొట్టదా? వాడి కోసం ఎన్ని బొమ్మలు, డ్రెస్సులు తేలేదూ నేను? మరయితే నాకు ఆమె ముఖంలోకి చూడాలంటే అంత బెరుకు ఎందుకు కలిగిందో?

ఆమె మొహం నేనపుడు చూడగలిగితే ఎలాంటి భావాలు కనబడేవో? మొహం చెక్కలా పెట్టుకొని ఎప్పడూ పరధ్యానంగా ఉండే ఆమెలో అతిశయ భావాలు ఎప్పుడెప్పుడు చూశాను?

ప్రేమించి, చాటు పెళ్ళి చేసుకొని, గర్భిణిని చేసి మొహం చాటేసిన వైట్‌ కాలర్‌ ఉద్యోగి గురించి మొదట నాకు చెప్పినప్పుడు ఆమె మొహంలో నిసృహ, నిస్సహాయత. పోలీస్టేషన్‌ ఆవరణలో భార్య చాటున దాక్కొని ‘నాన్న’ అని పరిగెత్తుకొని వెళ్ళిన పిల్లాడ్ని ‘ఎవర్రా నీకు నాన్న?’ అని వాడు తోసేసినప్పుడు.. ఆ మోహం కసి, కోపంతో ఎరుపెక్కినట్లు గుర్తు. కేసు వాపసు తీసుకొంటే లక్ష రూపాయలు ఇస్తామని వాడు కబురు చేసినపుడు ‘ఎందుకక్కా నాకు లక్ష, నా కొడుకే కాదు అన్న తరువాత. నా బిడ్డను నా రెక్కలతో నేను పెంచుకోలేనా? డి.ఎన్‌.ఏ.టెస్ట్‌ లోనే తెలుస్తుందిలే వాడి కొడుకో కాదో. కేసుకే నిలబడదాము’ అన్నప్పుడు గొప్ప దృఢత్వం ఆమె కళ్ళలో.

ఏమిటి ఇంట్లో ఈ నిశ్శబ్ధం? నాకు కాఫీ ఇచ్చే టైమ్‌ దాటి పోయింది. ఎంత బేపరువు ఈ పిల్లకు? అనుకొంటూ వంట ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ. . .

ఆ పిల్ల కొడుకు కోసం బుడగ ఊదుతుంది. వాడు నోరు తెరుచుకుని .. చొంగ కారుస్తూ ఆత్రంగా బుడగ వంకా, వాళ్ళమ్మ వంకా మార్చి మార్చి చూస్తున్నాడు. చటుక్కున వెనక్కి వచ్చేశాను.

వరండాలో ఉయ్యాల కుర్చీలో వెనక్కి వాలాను. బుజ్జి నల్లటి పిట్ట ఒకటి నున్నటి ఒంటితో వరండా తాడు మీద వాలింది. ఎరుపు, పసుపు కలిసిన ఆ చిన్ని కాళ్ళు తాడును స్థిరంగా బంధించాయి. చూసిన సుందర దృశ్యాలను పలవరిస్తూ కళ్ళు మూసుకొన్నాను.

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో